మార్టిన్ ఎస్పాడా అనే ప్రముఖ అమెరికన్ కవి, ప్రస్తుతం పట్టి పీడిస్తున్న ట్రంప్ పాలనా యుగపు దుర్మార్గపు లక్షణాలను ప్రతిబింబిస్తూ ఒక కవితా సంకలనం తీసుకొచ్చారు.
ట్రంపు ఎన్నికైన తొలిరోజుల్లోనే ఈ కవితల్లో కొన్ని కోపాన్ని వ్యక్తం చేస్తే , కొన్ని దుఃఖాన్ని ప్రకటిస్తే, కొన్ని ట్రంపు వ్యతిరేక కార్యాచరణ ప్రకటించాయి.
సాధారణంగా చెప్పాలంటే ఈ సంకలనంలోని కవితలన్నీ ట్రంపు యుగం పట్ల తీవ్రమైన ఆగ్రహాన్ని, బాధితులపట్ల సహానుభూతినీ ప్రకటించేవే!. అతని ఎన్నికకు ముందూ తర్వాతి పరిస్థితిని అద్దం పడతాయి.
ట్రంపుకు లేని సహానుభూతిని తాము ప్రకటిస్తూ, అతని మాటలతో రెచ్చగొట్టే భయంకరమైన విద్వేషాలను కోప తాపాలకూ, ట్రంపుకు సంస్కృతికి విలువలకూ వ్యతిరేకంగా, మానవ విషాదాన్నీ, జీవిత పోరాటాన్నీ ప్రతిబింబిస్తూ అనేకానేక అమెరికన్ కవులు రాసిన కవితలివి.
ఇవాళ్ళ ట్రంపు పర్యాయపదమైన విధ్వంసక శక్తులను వ్యతిరేకిస్తూ తలపడిన కవితలివి. ఈ కవితలు ట్రంపు దుర్మార్గాలకు బలైన ప్రజా సమూహాల హృదయ స్పందనలను ప్రకటిస్తున్నాయి, ట్రంపు ఎంత వద్దనుకున్నా ఎంత నివారించినా ఆపలేని అమెరికా సమాజపు బహుళత్వాన్ని, బహుళత్వం లోని బలాన్ని, మనందరి మధ్యా అత్యంత బలంగా పెనవేసుకుపోయిన మానవతా బంధాల్ని ప్రకటిస్తున్నాయి.
వియత్నాం యుద్ధంలో పాల్గొన్న ఒక సైనిక యోధుడు బ్రూస్ వైగ్ల్ రాసిన ‘మనల్ని యేది రక్షిస్తుంది?’ అనే కవితా శీర్షికనే ఈ సంకలానికి శీర్షిక అయింది.
ఈ కవిత యుద్ధానికి పోతున్న ఒక పిల్లవాని పట్ల సహానుభూతిని ప్రకటించే కవిత. ట్రంప్ తన విపరీత రాజకీయ స్వప్నాల వాగాడంబరాల్లో వెలిగక్కే విషాన్ని వ్యతిరేకించే కవితలే కాకుండా, ట్రంప్ కు ఎన్నికల సమయంలో అత్యంత ‘ప్రీతిపాత్రమైన’ తెల్ల కార్మికలోకానికి చెందిన బొగ్గు గాని కార్మికుని ప్రతిఘటనా స్వరం కూడా వీటిలో ఉన్నాయి. ఇవి ట్రంప్ ఎన్నికల ముందూ తర్వాత జరుగుతున్న రాలీల్లో వినిపించే స్వరాలకు పూర్తి విరుద్ధమైనవీ, వ్యతిరేకమైనవీ.
ఈ కవితల్లో అనేకానేక భిన్న స్వరాలున్నాయి. ఇవి అసంఖ్యాక నిస్సహాయ వలసదారుల గురించి మాట్లాడుతాయి. గొంతు లేని వారికి, అన్యాయంగా బలిచేయబడ్డ వారికి, పీడించబడిన వారికీ గొంతు నిస్తాయి. నిజానికి వలసదారులే తమ కష్టాల గురించీ తమపై అమలవుతున్న అంతులేని పీడనగురించీ మాట్లాడుతారు. నల్ల వాళ్ళ మీద పోలీసుల అత్యాచారాలగురించీ, ఎడతెగని హింసగురించీ, అమలవుతున్న దమనకాండను వ్యతిరేకిస్తూ కవితలున్నాయి.
అన్యాయంగా కాల్చివేయబడ్డ అమాయక నల్ల పిల్లల గురించీ , వాళ్ళుబతికి ఉండడానికి చేసే ప్రయత్నాల గురించీ పద్యాలున్నాయి.
ప్రాథమిక పాఠశాలల మీద విచక్షణా రహిత తుపాకీ హింసలనూ, స్త్రీలపైనా, ట్రాన్స్ లపై జరుగుతున్న అనేక అత్యాచారాలనూ వ్యతికించే కవితలు, అత్యాచార సంస్కృతిని ధిక్కరించే కవితలూ ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. ఇంత అభివృద్ధి చెందిన దేశంలో కూడూ గుడ్డా గూడూ లేని అసంఖ్యాక ప్రజల ఆవేదనలను పట్టిచ్చే కవితలు, పెట్టుబడిదార్ల లాభాల కోసం మూసేసిన కార్ఖానాల్లో బతుకుదెరువును కోల్పోయిన లక్షలాది కార్మికుల వెతలను చెప్పే కవితలూ ఇందులో మీకు కనబడతాయి.
ట్రంప్ యుగం లో చలామణిలో ఉన్న అతిశయ శిశ్టోక్తి (hyper euphemism)ని, ట్రంపు భజన బృందం ‘ప్రత్యామ్నాయ నిజాలను’, ‘అబద్దపు వార్తలంటూ’ అసత్య ప్రచారం చేయబడుతున్న అనేకానేక నిజాలనూ, తీవ్ర మితవాద రాజకీయ ప్రచారకులైన ‘ఆల్ట్ రైట్’ ను తీవ్రంగా వ్యతిరేకించి ధిక్కరించే కవిత్వం ఇది.
ట్రంప్, అతని తీవ్ర మితవాద రాజకీయాలు గేసుకున్న ప్రజల భాషనూ, కార్మికుల భాషనూ ప్రజల నుడికారాన్నీ తిరిగి తీసుకోవడమే కాకుండా, వారి విష ప్రచారాన్ని తిప్పికొట్టడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ కవితలు ముందుకొచ్చినయి.
ఇక్కడ అనువదించిన కవిత గత కొన్నేళ్ళుగా అమెరికా స్కూళ్ళ లో పెచ్చరిల్లిపోతున్న విచక్షణా రహిత కాల్పుల గురించి రాసింది. అత్యంత హింసాత్మకమైన ఆ ఘటనలను చాలా సున్నితంగా, హృదయానికి తట్టేలా ఒక తండ్రి దృష్టి నుండి అందించిన కవిత ఇది.
ఉపాయం
– ఆడమ్ గ్రాబోస్కీ
నేను బులెట్ ప్రూఫ్, నాకు పోయేదేమీ లేదు
కాల్చేసేయ్, కాల్చిపారేయ్ – డేవిడ్ గెటా ‘టైటేనియమ్’ సియా తో కలిసి
‘నాకు బులెట్ ప్రూఫ్ కావాలనుంది’
కారు వెనుక సీట్లోంచి అంటుంది మా అమ్మాయి ఇంగ్రిడ్ ,
స్కూల్లో మూడో తరగతి చదువుతోంది.
‘బులెట్ ప్రూఫ్? నీకు బులెట్ ప్రూఫ్ కావాలా, యేదీ ఆ
పాటలో లాగానా? వెనుక అద్దం లో ఆమెను చూస్తూ అడిగాను.
‘కాదు. నాకు బులెట్ ప్రూఫ్ కావాలి స్కూల్ కోసం.
నాకు చావాలని లేదు.’
సలివాన్ ప్రాథమిక పాఠశాలకు పొద్దున యేడూ యాభైకి
పాపను తీసుకెళ్తున్న నాకు పాప్ సంగీతమిచ్చిన కానుక ఇది.
హీటింగ్ పైప్ ల నుండి బయటి గదుల్లోకి వినబడే
వాగ్వివాదాల్లా బెడ్రూం టీ వీ లోంచి బయటకు వినబడే
వార్తలు ఆమెకు నచ్చవు.
స్కూల్లోని ఆటలో కృత్రిమ క్రమబద్ధత నచ్చదు
తన టీచర్ గొంతు లో ధ్వనించే పట్టుదలా నచ్చదు.
దాడి జరిగినప్పుడు దాక్కోవడం ప్రాక్టీసు చేసే
ఆ చిన్న గదే ఆమెను నిలువెల్లా వొణికిస్తుంది.
యెప్పుడూ వెనక వైపుకే దాక్కోవడం వీలుకాదు కదా
అప్పుడప్పుడూ ముందుంటే పాదాలు బయటకు కనబడుతుంటాయి.
ముందున్నవాళ్లే కదా మొదట చనిపోయేది.
తనో ఉపాయం ఆలోచించింది
బాత్రూమ్ లోకెళ్ళి దాక్కుంటుంది.
పాదాలు కనబడకుండా టాయిలేట్ మీద
నిలబడుతుంది. నిశ్శబ్దంగా ఉండిపోతుంది
యే చప్పుడూ చేయకుండా అతికష్టంగా
బంగారు కదా….
పిల్లల్ని పెంచడమంటే మెల్ల మెల్లగా
అధికారం కోల్పోవడం అని చెప్పారు నాకు.
వాళ్ళ ప్రాపచాన్ని అదుపులో పెడుతూ
యెప్పుడూ వాళ్ళముందు నడవకూడదని చెప్పారు.
భవంతులు పెద్దవవుతాయి, మైదానాలు విశాలమవుతాయి
తనకిప్పుడు తొమ్మిదేళ్ళు. తనకో ఉపాయముంది.
ఆమెకు గుండెలు పగలడం గురించి చెప్పగలను
నాకు గుండెలు పగలడం గురించి బాగానే తెలుసు
నువ్వెక్కువ తాగేస్తే ఇంటికి మోసుకుపోతాననీ చెప్పగలను
నేను తాగినప్పుడు నన్నూ అట్లా ఇంటికి మోసుకెళ్లారు
కానీ గదిలో తుపాకి ఆకలిగొన్న పులిలా తచ్చాడుతున్నపుడు
తన బూట్లు కనబడకుండా ఎట్లా దాక్కోవాలో యేమి చెయ్యాలో
చెప్పలేను.
తనకో ఉపాయముంది. దానికి తోడుగా,
జిమ్ దగ్గరుంటే గనక పక్కనే ఉన్న తలుపునుండి
బయటకు వీలైనంత త్వరగా పరిగెత్తి పారిపొమ్మని
చెప్పాలనుకుంటాను.
కానీ పూర్తిగా పొరబడ్డాను
ఈ ప్రాంతాన్నో సారి చూడు
బయటకెక్కడికీ పోలేవింక, అసాధ్యం.
పిల్లలని పెంచడమంటే మెల్ల మెల్లగా అధికారం కోల్పోవడం.
ఇవాళ్ళ మొదటిసారిగా మా అమ్మాయికి
‘నువ్వేమి మాట్లాడుతున్నావో నీకే అసలు అర్థం కావడం లేదు ‘
అనే అవకాశమొచ్చింది.
మొట్టమొదటి సారిగా ‘నువ్వేమనుకుంటున్నావో నాకర్థమౌతుంది’ అని
తనకర్థమయ్యేలా చెప్పలేకపోతున్నా.
నా కళ్ళు కన్నీటి తో మెత్తబడుతున్నాయి
నేను మెల్లగా అధికారం కోల్పోతున్నాను.
సియా స్వేచ్ఛ గురించి పాడుతోంటే
మా అమ్మాయికి వినబడుతున్నది బతికుండగలగడం.
అన్నీ పాదాలనూ దాచగలిగే చోటు కావాలిప్పుడు
అతి తేలిగ్గా చిట్లిపోతున్న ప్రపంచంలో చిట్లిపోలేని
చర్మం కావాలిప్పుడు.
మరో ఐదు నిమిషాల్లో తన స్కూల్ వచ్చేస్తుంది.
ఇంకో ఐదు నిమిషాల తర్వాత తనంతట తానే
ఉండాల్సి వస్తుందిక.
నా పెద్దకొడుకుతో బ్రేక్ ఫాస్ట్ సంభాషణ
నా పెద్దకొడుకుతో బ్రేక్ ఫాస్ట్ సంభాషణ
– లువేట్ రెస్తో
అమ్మా
ఇవాళ మరొకతన్ని
కాల్చి చంపేశారు
నాకసలు లైసెన్సే వద్దమ్మా
నాకు లైసెన్సు కావాలని లేదమ్మా
బిడ్డా
డ్రైవింగ్ అసలు సమస్య కాదు
అసలు సమస్య
డ్రైవింగ్ కానే కాదు బిడ్డా
మంచి కవితలని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు స్వామీ!
పరిచయం బావుంది స్వామి