నిశ్శబ్ద నిశీధిలో ఏకాంతంలోకి
నడిచిపోయినపుడు
లోపలి తేనెపట్టు కదిలి
ఆలోచనలు ఈగల్లా ముసురుకుంటాయి
కొన్ని జ్ఞాపకాలు
ముళ్ళై పొడుస్తూ
రక్తాన్ని కళ్ళజూసి
కన్నీటి వెక్కిళ్ళై కలవరపెడతాయి
మరి కొన్ని
తీయని తలపులు
చల్లని చినుకులై పలకరించి
గిలిగింతలతో పెనవేస్తాయి
సుదూర తీరాలకు
ఎగిరిపోయిన ఆత్మీయులు
కలల తీరంలో కలిసి
ప్రేమగా పలకరిస్తారు
మరపు మలుపులలో
తప్పిపోయిన వారందరూ
ఒకమారు కనుల ముందు
కవాతు చేస్తారు
జవాబు లేని ప్రశ్నలకు
అనూహ్యంగా సమాధానాలు
లభిస్తాయి
అప్పుడప్పుడు
పుస్తకాల నడుమ నెమలీకలలా
తారసపడిన జ్ఞాపకాల వలలో
చిక్కిన హృదయం
చేపపిల్లలా తుళ్ళిపడుతుంది
గతపుపువ్వుల
రేకులు విప్పినపుడల్లా
ఏదో ఒక పుప్పొడి
అరచేతిలో రాలుతూ ఉంటుంది
స్మృతుల నెమరేతలో
పాత పలకపై రాసిన
తప్పులు దిద్దుకుంటూ
కొత్త కాగితంపై అందంగా
అక్షరాలను రాసుకోవాలి
మనలను మనం
స్ధిరంగా నిలబెట్టుకుంటూ
ముందుకు మృదువుగా సాగిపోవాలి
జ్ఞాపకాలు ప్రశంసనీయంగా వున్నాయి