“గోల్కొండ కావ్యం తెలుగులో చారిత్రక కావ్య వికాస దశలో ఒక ప్రయోగం. ఆమ్రపాలి నవ్య సంప్రదాయంలో వెలువడిన సౌందరనందన కావ్యం వంటి బౌద్ధ కథాకావ్యం” (జి. వి. సుబ్రహ్మణ్యం కళా ప్రపూర్ణ డా. ఎస్ టి జ్ఞానానందకవి జీవితం – వాఙ్మయం పుస్తకం ముందుమాట)
జ్ఞానానంద కవి గోల్కొండ కోటను చూసాడు. పురా వైభవం గుర్తుకు వచ్చింది. వర్తమాన శైథిల్యానికి కన్నీరు కార్చాడు. కావ్యం ఆ దుఃఖం నుండే పుట్టింది. 1963లో ప్రచురించబడింది. ముందుమాటలో కవి నాలుగేళ్ల క్రితమే వ్రాసి పెట్టె పూజలో వున్న ఈ పుస్తకం ఇప్పుడు ఏకా ఆంజ నేయ పంతులు ద్రవ్య సహాయంతో ప్రచురించబడుతున్నదని చెప్పుకొన్నాడు. దానిని బట్టి ఈ కావ్యం రచనాకాలం 1959. ఈ కావ్యాన్నీ కవి అప్పుడు కేంద్ర సమాచార శాఖా సచివుడుగా ఉన్న బెజవాడ గోపాలరెడ్డికి అంకితం ఇచ్చాడు. నమస్కారం శీర్షికతో ఏకా ఆంజనేయ పంతులిని ప్రశంసిస్తూ ఆరు పద్యాలూ, కృతిపతి ప్రశంస పేరుతో బెజవాడ గోపాలరెడ్డి గురించి 28 పద్యాలూ వ్రాయబడ్డాయి.
బహమనీ రాజ్య పతనం తరువాత కులీ కుతుబ్ షాగా ప్రసిద్ధుడైన కులీ కుతుబ్ ఉల్ ముల్క్ తో 1512లో కుతుబ్ షాహీల పాలనా ప్రారంభమైంది. 1519 నుండి 1591 వరకు వాళ్ళ రాజధాని గోల్కొండ. అందువల్లే అది గోల్కొండ సామ్రాజ్యంగా ప్రసిద్ధికి ఎక్కింది. 1636లో షాజహాన్ కాలంలో అది మొగల్ చక్రవర్తుల ఆధిపత్యాన్ని గుర్తించి కప్పం కట్టాలన్న ఒత్తిడికి గురైంది. 1687లో ఔరంగజేబు దాడి చేసి ఏడవ సుల్తాను అబుల్ హసన్ కుతుబ్ షాను పట్టుకొని బందీగా దౌలతాబాద్ కు తీసుకొని వెళ్ళటంతో గోల్కొండ మొగల్ రాజ్యంలో భాగమైంది. ఇది చరిత్ర. దీనిని జ్ఞానానంద కవి కావ్యంగా చేసాడు. అయిదు భాగాలుగా అయిదు ప్రత్యేక శీర్షికలతో వ్రాయబడింది.
కుతుబ్ షాహీలలో అయిదవ వాడు మహమ్మద్ ఖులీ కుతుబ్ షా ఇబ్రహీమ్ కొడుకు. 1565 నుండి 1612 వరకు జీవించాడు. 1580 నుండి ముప్ఫయి ఒక్క సంవత్సరాల వరకు పరిపాలన చేసాడు. అతను కవి, కళాపోషకుడు. హైదరాబాద్ ఇతని కాలంలోనే నిర్మించబడింది. చార్మినార్ నిర్మాత ఇతనే. భాగ్యమతి అనే తెలుగు కాంతను ప్రేమించి పెళ్లాదిన కథ అతనిది. ఆమె పేరునే భాగ్యనగర నిర్మాణం జరిగిందని, అదే హైదరాబాద్ అని చెప్తారు. కావ్య వస్తువు కాగలిగిన ప్రేమకథ ఉన్నందువల్లనే కావచ్చు కవి గోల్కొండ కావ్యాన్ని ఆ బిందువు నుండే విస్తరింప చేయటానికి పూనుకొన్నాడు. ఆ ప్రేమ కథే ఈ కావ్యంలో అవతరణము అనే మొదటి భాగం. ‘గోల్కొండ తెలుగుతల్లి మేలు శిరము నందలి యశహ్ కిరీటము’ అంటాడు కవి. “భగ్యమతీ సఖీ ప్రణయ భావుకుడౌ సులతాను వల్ల నిల్చిన భాగ్యపురము అని నగర పరిచయం చేసాడు. ఏ గుట్టలపై మేపి గొల్లలు పసుల సంపదను అభివృద్ధి పరచుకొన్నారో ఆ గుట్టల మీద ఏర్పరచిన రాజ్యం కనుక అది ‘గొల్ల కొండ అయిందని అదే గోలకొండ అని స్థల మాహాత్యాన్ని స్థాపించాడు. ‘గాదిలి ఇంతిపై గలుగు గాటపు బ్రేమకు’ తార్కాణంగా హైదరాబాద్ నగరాన్ని కట్టించాడని చెపుతూ “ప్రణయ సమ్రాట్టు కుతుబుషా పాదుషాహి/ భాగ్యమతిపేర గట్టిన భాగ్యనగరు / తెలుగు సౌరభ్య వీచికల్ పొలుపు గాంచి / రత్న రాజీ ధగధద్దగలరాశి యయ్యె” అని నగర వర్ణన పూర్తిచేసాడు.
కుతుబ్ షా కాలపు నిర్మాణవైభవాలు చార్మినార్ , జుమ్మా మసీదు మొదలైన వాటిని, భాగ్యమతితోడి దాంపత్య వైభవాన్ని వర్ణించాడు కవి. “కత్తుల నేతృతేళ్ళ తరగల్ బయనించు మహమ్మదాత్మ బర్వెత్తె నుదాత్త సత్ప్రణయ దృగ్విలసద్రసవఝరుల్” అని ప్రేమ రాజు స్వభావంలో తెచ్చిన మార్పును చెప్పాడు. అతని తరువాత మేనల్లుడు సుల్తాను అహమ్మద్ రాజు అయి పదమూడేళ్ళ పరిపాలించాడు. మక్కా మసీదు కట్టించాడు. తరువాత నలభై ఆరు సంవత్సరాలు పాటు పాలించిన అబ్దుల్లా ఖుతుబ్ షా చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించిన వర్ణన. మతవిద్వేషాలు లేకుండా పాలించిన అతనిని “సహన ప్రసూన లహరీ లీలా విలాసమ్ములన్ దేలించెన్” అని మెచ్చుకున్నాడు. గోల్కొండ వైభవం విని కొల్లగొట్టే దురాలోచన చేసిన ఔరంగ జేబు కుటిలత్వాన్ని వర్ణించటం తో మొదటి భాగం ముగుస్తుంది. “తాను ప్రభువు నయ్యు దన రాజ్యమందున/ పరమతాలవారు బ్రదుకరాదు/ తన మతంపు మౌఢ్యమున మునుంగుట చేత/ భూతలమున శాంతి పొసఁగు టెట్లు?” అనే పద్యంలో రెచ్చిపోయినట్టి పిచ్చి మతస్థుడైన ఔరంగ జేబును అభిశంసించాడు.
రెండవ భాగం మీర్ జుమ్లా. అతను వ్యాపారస్థుడుగా జీవితం ప్రారంభించి బాగా డబ్బు సంపాదించి అబ్దుల్లా ఖుతుబ్ షా కొలువులో ముఖ్యమంత్రి అయ్యాడు. అతని కొడుకు అమీన్ తప్పతాగి సింహాసనాన్ని అగౌరవపరచినందుకు కారాగార శిక్షకు గురయ్యాడు. ఆ కోపం మనసులో పెట్టుకొని ఔరంగజేబు గోల్కొండ దండయాత్రను ప్రోత్సహించి సహకరించాడని అతనిని తిన్నఇంటివాసాలు లెక్కించిన వాడిగా నిందిస్తూ నీవు అని మధ్యమ పురుష సంబోధనతో అల్లిన ఉద్వేగ భరిత పద్యాల కూర్పు ఈ భాగం. దారితప్పిన కొడుకు కోసం మీర్ జుమ్లా గోల్కొండ సుల్తాను మీద కక్ష సాధింపుగా ఔరంగజేబుకు సహకరించాడన్న దానిలో చారిత్రక వాస్తవం ఎంతో తెలియదు కానీ అది అంత బలమైన కారణంగా కనబడదు. వజ్రాల వ్యాపారిగా విస్తరిస్తూ ఆర్ధికంగా బలపడిన అతనికి అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో మంత్రి పదవి వల్ల లభించిన రాజకీయ అధికార కాంక్ష అవకాశాలు వెతుక్కొంటూ విస్తరించటంలో వైరుధ్యాలు అసలు కారణమన్నది వాస్తవం.
మూడవ భాగం తానీషా. కుతుబ్ షాహీ వంశంలో చివరివాడు అబుల్ హాసన్ కుతుబ్ షా. తానాషా అన్నది ప్రసిద్ధనామం. సర్వమత సహిష్ణుతకు పేరుగాంచినవాడు. ఇతని కాలంలోనే ఔరంగజేబు దండయాత్ర. ”అల్లాయుం రఘు రామచంద్రుడిట నేకాత్మన్ బ్రశాంతముగా/ సల్లా పమ్ములు సల్పుచుండుటను” చూచి కన్నుగట్టిన ఔరంగజేబు దాడి అది అని అంటాడు కవి. లంచం తిని పున్నిఖాన్ అనే సైన్యాధిపతి చేసిన వంచనతో ఔరంగజేబు సైన్యం నగరంలోకి ప్రవేశించటం విశ్వాసపాత్రుడైన రజాక్ లాక్ ప్రతిఘటిస్తూ చేసిన వీరోచిత పోరాటం ఇందులో వర్ణితం. ఇందులో పద్యాలు కూడా తానీషాను సంబోధిస్తూ మధ్యమ పురుషలోనే ఉన్నాయి. యుద్ధ విధ్వంస వర్ణన కూడా ఉంది.
నాలుగవ భాగం అక్కన్న మాదన్నలు. తానీషా కొలువులో వాళ్ళు రెవిన్యూ శాఖ మంత్రులు. బ్రాహ్మణులు. తానీషా మతసామరస్యానికి గుర్తు వాళ్లకు వచ్చిన ఆ పదవులు. తానీషా సులతాను గారి తలలో నాలుకలని, తెలుగు మాన్యులని రకరకాలుగా వాళ్ళను ప్రశంసించటమే ఈ భాగమంతా. అయిదవ భాగం రామదాసు. అసలు పేరు కంచర్ల గోపన్న. రామ భక్తి, సంకీర్తనా కారుడు, గాయకుడు కావటం వలన భద్రాచల రాముడి గుడి కట్టించాడు కనుక దానితో కలిపి ఆయనను భద్రాచల రామదాసు అంటారు. ఆయన మహిమల వర్ణన పద్యాలు ఈ భాగంలో ఉన్నాయి. ముగింపు దిశగా కథను నడిపిస్తూ
“మతము మనుష్య జీవితపు మార్గములో సహన ప్రసూన సం
తతి గురిపించి సోదర జనముల యున్నతికై శ్రమించి ని
ష్కృత మొనరించి త్యాగమున శీలమునం బరువెత్త జేయు స
మ్మతిని:మతము మానవత మంటను గల్పగరాదు సెప్పఁగన్
మతమునఁ దొలినాటి మాన్యతాభావమ్ము
లుడిగిపోయే స్వార్ధముబికి నేఁడు
కుటిల వైరి కలహకూటమ్ము గా మారె
మతము బ్రతుకు నేర్పు కితవమయ్యె” – అని చెప్పటం కథను వర్తమానంతో ముడిపెట్టటమే.
పూస గుచ్చినట్లు కథ చెప్పే పద్ధతి కాక సామ్రాజ్య చరిత్ర వికాసానికి దోహదం చేసిన మహనీయుల మహద్వ్యక్తిత్వాలను మనోజ్ఞంగా కీర్తించి చెప్పే కథనం ఖండకావ్యాలనుండి కమనీయ కావ్యాన్ని కల్పన చేసే ఆధునిక నవ్య సంప్రదాయ ప్రయోగ లక్షణం అని గోల్కొండ కావ్య నిర్మాణ శిల్పానికి కితాబు నిచ్చారు జివి. సుబ్రహమణ్యం.
ఆమ్రపాలి 1972 లో ప్రచురించబడింది. 1974లో చతుర్ధ ముద్రణం వచ్చింది అంటే సాహిత్య లోకంలో ఈ కావ్యం ఎంత ఆదరాన్ని పొందిందో గ్రహించవచ్చు. ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా చదవబడిన ప్రశంసా పత్రం నాలుగవ ముద్రణకు పరిచయ వ్యాసంగా ప్రచురించబడింది. జ్ఞానానంద కవి ఈ కావ్యాన్ని ఎల్ మాలకొండయ్యకు అంకితం ఇచ్చాడు. అంకిత పద్యాలు మూడు. అవతరణము, స్వయంవరణము, సందర్శనము, చింతనము, ఆహ్వానము, ఆగమనము, వివరణము, స్వీకరణము అన్న ఉపశీర్షికలతో ఏడు అధ్యాయాలుగా సాగిన కావ్యం ఇది. ఈ కావ్యానికి 1975 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి లభించింది.
సూర్యాస్తమయ వర్ణనతో ప్రారంభమై వన విహారానికి వెళ్లిన శాక్యధనికి మామిడి తోటలో ఒక అమ్మాయి దొరకటం, బిడ్డలు లేని ఆ ధనవంతుడు ఆమ్రపాలి అని పేరు పెట్టి ఆమెను పెంచుకొనటం, నాటి సంఘమందు మేటి గౌరవమున్నస్త్రీలకర్హమైన’ విద్య చెప్పించి యుక్తవయసు వచ్చాక పెళ్లి చేయాలనుకొనటం, అప్పుడు వైశాలినీ పట్టణ పాలకులైన లిచ్ఛవుల శాసనం వలన కన్యకను గణికను చేసే సంప్రదాయం గురించిన భయం లోలోపల ఉన్నా వరుడి అన్వేషణకు పూనుకొనటం మొదటి అధ్యాయంలో విషయాలు.
రెండవ అధ్యాయంలో స్వయంవరం ఏర్పాట్లు. లిచ్చవ రాకుమారులు పెళ్లితో ఆమె ఏ ఒక్కరి సొత్తో కావటాన్ని అంగీకరించక శాక్యధనితో సంఘర్షించటం, తండ్రిని ఆ సంకటం నుండి బయటపడవేయటానికి ఆమ్రపాలి ఉమ్మడి అనుభవ వస్తువుగా ఉండటానికి తానై సమ్మతి తెలపటం జరుగుతుంది. ఆమ్రపాలి తన జీవితంపట్ల పెరుగుతున్న సంపద పట్ల, తన సౌందర్యానికి, సంపదకు దాసోహమైన వాళ్ళ ఇచ్చకపు మాటలపట్ల విసిగి పోయి మనః శాంతికి మామిడి తోటలోకి వెల్లి అక్కడ బుద్ధుడిని చూసి అతని పొందుకై తహతహ లాడుతుంది. తన ఇంటికి వచ్చి భోగాలు అనుభవించమని ఆహ్వానిస్తుంది. తనకు భార్యా బిడ్డలు ఉన్నారని మోక్ష కాంక్షతో వాళ్ళందరినీ వదిలి వచ్చానని చెప్తాడు. ఆమ్రపాలి తన పొరపాటుకు చింతించి క్షమించమని వేడుకొని భిక్ష స్వీకరించటానికి రమ్మని ఆహ్వానిస్తుంది. తపః సాధన పూర్తయ్యాక వస్తానన్న బుద్ధుడి సమాధానంతో మూడవ అధ్యాయం ముగుస్తుంది.
ఆమ్రపాలి తనకోసం ప్రత్యేకంగా నిర్మించబడిన భవనంలో చిత్రితమైన కళాఖండాలలో మగధ చక్రవర్తి బింబిసారుడిని ఇష్టపడి ఒక భటుడిని రాయబారం పంపటం నాలుగవ అధ్యాయంలో కథ. ఆమ్రపాలి గురించి వినివున్న బింబిసారుడు లిచ్ఛవుల వల్ల ఆపద ఉందని తెలిసి కూడా ఆమె పట్ల మొహంతో సాహసం చేసాడు. ఆమ్రపాలి ఆహ్వానాన్ని మన్నించి వెళ్లి ఆమెతో కొంతకాలం గడిపి ఒక ఉంగరం ఆనవాలుగా ఇచ్చి కొడుకు పుడితే ఆ ఉంగరం ఇచ్చి పంపిస్తే ఆదరిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమ్రపాలి బిడ్డను కానీ విద్యాబుద్ధులు చెప్పిస్తుంది. లిచ్ఛవుల దుండగాలు పెరిగిపోతుండటం చూసి ఉంగరం ఇచ్చి కొడుకును బింబిసారుడి దగ్గరకు పంపుతుంది. అది అయిదవ అధ్యాయంలో కథ.
బుద్ధుడు జ్ఞానోదయం అయి బోధలు చేస్తూ మళ్ళీ ఆమ్రపాలి ఉన్న నగరానికి వస్తాడు. ఆమ్రపాలి ఇంట భిక్షకు వెళతాడు. అపవిత్రురాలైన ఆమె ఇంటికి భిక్షకు వెళ్లాడని ఆక్షేపిస్తున్న వారికి ఆమె పూర్వ జన్మ కథ చెప్పటం మొదలు పెట్టటంతో ఆరవ అధ్యాయం ముగుస్తుంది. ఆమ్రపాలి బౌద్ధధర్మం స్వీకరించటం ఏడవ అధ్యాయంలో విషయం. ఆమ్రపాలి ఇచ్చిన మామిడి తోటలో బుద్ధుడు చేసిన ధర్మ బోధ తో అందరూ సంతృప్తులు కావటంతో కావ్యం ముగుస్తుంది.
ఈ కావ్యంపై ఎంఫిల్ డిగ్రీకోసం పరిశోధన చేసిన దార్ల వెంకటేశ్వరరావు ఆమ్రపాలి కావ్య మూల కథ క్షేమేంద్రుడు సంస్కృతంలో వ్రాసిన ‘బౌద్ధావ దాన కల్పలత’లో ఉందని, దాని మీద జ్ఞానానంద కవి చేసిన పన్నెండు మార్పులను తన సిద్దాంత వ్యాసంలో గుర్తించి వివరించారు. ఇది చారిత్రక కావ్యం అని, శాంత రస ప్రధానమైనదని కూడా స్థాపించారు.
నగరవధువులను ఉత్పత్తి చేసే రాజధర్మం ప్రేమ వ్యక్తీకరణకు సమర్ధుడు, అర్హుడు, ఆంతర్యానికి సన్నిహితుడు అయిన ఒక వ్యక్తి లేకపోవటం వలన స్త్రీల ఒంటరి వేదనలకు ఘర్షణకు కారణం అవుతుంది. అంతే కాక ఆత్మ అహంల తృప్తికి చాటు మాటు వ్యవహారాలలోకి కూడా వెళ్లేట్లు చేస్తుంది అని ఈ కావ్యం సూచిస్తున్నది. సామాజిక లైంగిక నీతి దృష్ట్యా పతితలు అయినవాళ్లకు కూడా ముక్తి మార్గం చూపగలిగిన తాత్విక దృక్పథంగా బౌద్ధం ప్రత్యేకతను స్థాపిస్తుంది.
1977లో జ్ఞానానంద కవి రాసిన క్రీస్తు ప్రబంధం జీవితచరిత్ర కావ్యం అయితే, నా జీవిత గాథ స్వీయచరిత్ర కావ్యం. కావ్యాలను కూడా ఖండికలుగా విడగొట్టి నిర్వహించే జ్ఞానానంద కవిలో కావ్యకవి కన్నా ఖండకావ్య కవి స్వభావమే బలమైనదిగా కనిపిస్తుంది. 1963లో క్రీస్తు చరిత్ర వచనంలో వ్రాసినదే 1977 నాటికి క్రీస్తు ప్రబంధంగా రూపాంతరం చెందిందేమో పరిశీలన మీద తేలాలి. 1963లో వ్రాసిన క్రీస్తు శతకంతో కలుపుకొని క్రైస్తవ సందర్భాలనుండి రాసిన ఖండికలను కూడా ప్రత్యేకం పరిశీలించాలి.