అతను వచ్చినప్పుడు, చడీ చప్పుడు లేకుండా వచ్చాడు. అత్యంత సహజంగా, నిశ్శబ్దంగా మా జీవితాల్లోకి ఇంకిపోయాడు. చెప్పులు పెట్టే ఆ మూలన ముడుచుకొని కూర్చుని, అతను ఆ మురికిలోకి ఆకృతి లేకుండా కరిగిపోవడానికి ప్రయత్నిస్తున్నాడా? కానీ చెమట, కన్నీళ్ళు, బురదతో రెండు బుగ్గలపై కట్టిన చారలతో మురికిపట్టిన ఆ ముఖాన్ని, దేనినీ వదలని ఆ చిన్నటి మెరిసే కళ్ళను ఎవరు తప్పించుకోగలరు? ఆ సమయంలో అతని జవాబులు చాలావరకు తల ఊపడానికే పరిమితమయాయి. అక్కడో పదం ఇక్కడో పదం. దానితో పాటుగా పిల్లల కళ్ళల్లో మాత్రమే చాలా తేలిగ్గా పలక గలిగే భావాలు.
అతను “ఇక్కడ” ఎందుకున్నాడు? ఈ హై సెక్యూరిటీ బ్యారక్ లో? ఎందుకంటే అతను “లాల్ గేటు” (ఎర్రగేటు) నుండి సాహసంగా పారిపోయే ప్రయత్నం చేశాడు. ఏ గేటు బయట స్వేచ్ఛా ప్రపంచం పరుచుకొని ఉందో ఆ జైలు ప్రధాన ద్వారాన్నే!
“ఆ పాత బ్యారక్! జైలు హాస్పిటల్ పక్కన లేదూ! ఆడనే, బురద కింద దాక్కున్న. చెత్త ఏసే ట్రక్కులో. ఎవ్వరు జూడలే!” అతను ఏడుస్తూ వివరించాడు.
ఎవ్వరూ….అంటే జైలు సిబ్బంది దగ్గర మార్కులు కొట్టేద్దామని కక్కుర్తిపడే ఒక్క “ఖబరీ” (ఇన్ఫార్మర్) తప్ప. జబ్బార్ ని బయటికి లాగి చెప్పులతో కొట్టి, ఎర్రని ఎండలో చెప్పుల్లేకుండా స్పృహ తప్పేవరకూ, (లేదా స్పృహ తప్పినట్టు నటించేవరకూ) పరిగెత్తించారు.
ఇప్పుడు శిక్షగా అతను ఈ హై సెక్యూరిటీ “అండా బ్యారక్”లోకి…. ఏడు తలుపులు, ఏడు గేట్లు కలిగిన, కిటికీలు లేని చిన్న, చిన్న సెల్లులు ఉండే ఈ నిషిద్ద ప్రదేశంలోకి, వచ్చిపడ్డాడు. లైట్లు, ఫ్యాన్లు, కాంక్రీటు మధ్యలో కాసిన్ని ఖాళీలు, టీవి వంటి సౌకర్యాలతో మొన్నటి వరకూ అతను నివసించిన, “బచ్చాబ్యారక్” ఈ పక్కనే…! కానీ, అతనికి మాత్రం ఇప్పుడు యోజనాల దూరంలో ఉంది.
మనుషులు, మరీ ముఖ్యంగా మనుష్యజాతిలోని చిన్న తరం, చాలా తొందరగా సర్దుకుపోతుంది. బహుశా అతని గతం దీనిని మరింత సులభం చేసింది. మా సెల్ సమూహం కూడా అతన్ని ఆహ్వానించడానికి ఇబ్బంది పడలేదు. వడ్రంగం నుండి, జాలరిగా, చివరికి బంగారం దొంగగా మారిన, సీనియర్ ఖైదీ అయిన సెల్లు పెద్దకు, తన దగ్గర కొలువులోకి చేర్చుకోవడానికి బహుశా ఒక సమర్థవంతమైన వ్యక్తి కనిపించిఉంటాడు.
కటికపని నుండి మాదకద్రవ్యాలు సరఫరాకి మారిన ఖైదీకి, తన బట్టలు ఉతికి సెల్లు శుభ్రం చేసేందుకు ఒకడు దొరికాడనిపించింది. జబ్బార్ తన వృత్తి “గట్టర్-సాఫ్” (మురికి కాలవలు పూడిక తీసి శుభ్రం చేసే పని) అని గర్వంగా ప్రకటించగానే ఒక్క క్షణం గొంతులో చిన్న అడ్డు. అయితే పుష్కలమైన సబ్బు సరఫరా, సుదీర్ఘమైన బలవంతపు స్నానాలతో ఆ సమస్య పరిష్కారం అయ్యింది.
పాత తరం పోరాటంగాడి నైన నన్ను ఆకర్షించింది – అతని నేపథ్యం – దోపిడీకి గురవుతున్న వర్గానికి, అణచివేతకు గురవుతున్న సమూహానికి, యువతరానికి చెంది ఉండడం, బహుశా ఇంకా కొన్ని విషయాలు కూడా కావచ్చు.
అసమ్మతి ఉన్న ఏకైక వ్యక్తి, ఎస్ఎంఎస్ డాన్. అది అతనికి మీడియా ఇచ్చిన బిరుదు. వర్ధమాన నటీమణులకు వెయ్యికి పైగా పంపిన బూతు ఎస్ఎంఎస్ లు, వయసుమళ్ళిన బాలీవుడ్ నటుడిని కూడా పెళ్లిచేసుకొన్న అతని భార్య, అనేక సార్లు జైలు సిబ్బందితోనూ తోటి ఖైదీలతోనూ దెబ్బలు తిన్నా తగ్గని అతని అహం, అతనిని ఆలోచింపచేశాయి. రేపు పేజ్ 3 కి కానీ తాను ఒక మురికి కాలవలు కడిగే వాడితో సెల్ పంచుకున్నానని తెలిస్తే? అయితే మరీ ముఖ్యంగా అతని అధమ స్థాయి జైలు జీవితం వల్ల అతని అసమ్మతి లెక్కకు రాలేదు. కొత్తగా వచ్చిన అతనికి పడుకోవడానికి కేటాయించిన ఆ స్థలాన్ని తాకకుండా వుండడానికి విశ్వప్రయత్నాలు చేయడానికి మాత్రమే అది పరిమితం కావలిసి వచ్చింది.
అతని పక్కన పడుకునే ఆ గౌరవం నాకు దక్కింది. స్నేహం లాంటిది ఒకటి మొలకెత్తడానికి అది పునాది వేసింది.
ముచ్చట్లు తొందరగానే మొదలయ్యాయి. మొదలు సిగ్గుగా, గుంభనగా మొదలయ్యి త్వరలోనే కథల చెప్పుకునే సమయంలో ఏకాగ్రతతో వినక తప్పని స్థితికి చేరుకుంది.
పదహారేళ్ళ వయసు వాళ్ళ జీవిత కథలు కిక్కిరిసి ఉండనక్కర్లేదనీ నియమాలు చెప్తాయి. కానీ సామాజిక నిచ్చెన చిట్టచివర్లో వేలాడేవారికి మినహాయింపులు ఉంటాయని అనిపిస్తుంది. తరవాతి రోజుల్లో విడి విడిగా జబ్బార్ కథలు వింటుంటే, లక్షలాది వీధి పిల్లల భయానక కథలు కేవలం అవి వాళ్ళ జీవితాల్లో పదే పదే జరుగుతున్నాయి కాబట్టి భయంకరంగా ఉండడం మానెయ్యగలవా? అని ఆశ్చర్యం కలగక మానదు.
అతని కథలకి ఏదో ప్రత్యేకమైన గొప్పతనపు ముద్ర ఉన్నదని కాదు. అతని కథలు నిజానికి చాలా సాధారణ ప్రదేశాలలో ప్రతిరోజూ జరిగేవే. అందువల్ల నా ఆశ్చర్యం, అంత ఆశ్చర్యమేమీ కాదు. బహుశా దానికన్నా ఆ కథలు కొంత మందికి చాలా సాధారణమైనవనీ కఠోర వాస్తవాలనీ తెలియడంవల్ల వచ్చే అశాంతి ఎక్కువ కావచ్చు.
కథనంలోకి వెళ్ళే ముందు ఆ కథనాన్ని సందర్భ సహితంగా అర్థం చేసుకోవడానికి కొంత నేపథ్యం:
కథకుడు: అబ్దుల్ జబ్బార్. తండ్రి అన్వర్ (లేదా బహుశా అక్తర్) షేక్
వయసు: సుమారుగా 16 యేళ్ళు, 17 కూడా కావచ్చు.
జన్మ స్థలం: ముంబై
నివాస స్థలం: ముబై సెంట్రల్ స్టేషన్ పక్కనున్న జగ్జీవన్ రామ్ పశ్చిమ రైల్వే ఆసుపత్రికి సరిహద్దుగా ఉన్న రోడ్డు మీద చిన్న భాగం. నాయర్ మునిసిపల్ ఆసుపత్రి నుండి కూత వేటు దూరం.
నిద్రపోయే ప్రదేశం: మూలనున్న ఎస్టిడి బూత్ బయట.
స్వస్థలం: మధుబని, బీహార్. (దర్భంగా దగ్గర రైలు దిగాలి.)
పూజ చేసే ప్రదేశం: నిజానికి అలాంటిది ఏమీ లేదు. అప్పుడప్పుడు హాజీ అలీ దగ్గరికి వెళ్లడమే.
పుణ్యక్షేత్రం: ఇప్పటి వరకూ 4 సార్లు ఆజ్మీర్ షరీఫ్ కి. మూడు సార్లు టిక్కెట్ లేకుండా.
చదువుకున్న ప్రదేశం: ఉర్దూ మున్సిపల్ ప్రాధమిక పాఠశాల. టీచరు తిట్లకు నిరసనగా చురుకుగా రాళ్ళు రువ్వినందువల్ల కొన్ని నెలలకి కుదింపు.
కుటుంబ పెద్ద: అమ్మి. జబ్బార్ తల్లి.
వృత్తి: “మోల్కారీన్” అంటే చుట్టుపక్కల ఉన్న వివిధ ఉన్నత మధ్యతరగతి ఇళ్ళల్లో పనిమనిషి.
ఆదాయం: నెలకు 1500 రూపాయలు. పండగలకు, సమస్యలు వచ్చినపుడు, కొంత అదనంగా. అప్పుడప్పుడూ మిగిలిన ఆహారపదార్థాలు.
ఆస్తులు: పైన తెలిపిన చిరునామాలో “డూప్లే జోప్డ” (గుడిసె) అందులో చేతులుమారి అందిన టీవీ.
ఇతర కుటుంబ సభ్యులు: అబ్బా. జబ్బార్ తండ్రి, అమ్మి కి రెండవ భర్త. దర్జీ. ఇప్పటికీ పాతదైపోయిన కుట్టు మిషన్ ఉంది. ప్రస్తుతం తాగుబోతు. రోజు తాగాక తన్నులు తింటూ ఉంటాడు.
చోటూ: జబ్బార్ తమ్ముడు. ఒకటో రెండో యేళ్ళు చిన్న. సంపాదించే బాధ్యత గల వ్యక్తి. రెండుసార్లు జబ్బార్ తాగి ఉన్నపుడు అతన్ని బాగా తన్ని సోయిలోకి తేవడానికి కావల్సినంత బాధ్యత కలవాడు.
చోటీ: జబ్బార్ చెల్లి, వయసు తొమ్మిదో పదో. పాఠశాలకి వెళ్లడానికి, అలాగే ఇంటిని కూడా చూసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అలాగే తన పట్ల అతి శ్రద్ధ చూపించే పెద్దన్న మీద కోపం తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తోంది.
విస్తృత కుటుంబం: వివాహిత అయిన ఒక సవతి సోదరి, ప్రస్తుతం ఢిల్లీలోని నిజాముద్దీన్ స్టేషన్ దగ్గర ఉంటోంది. అమ్మీ మీద ఆధారపడిన ఇద్దరు సవతి సోదరులూ వాళ్ళ కుటుంబాలు. అందులో జబ్బార్ సూటిగా చూసి తన్నిన ఫలితంగా గర్భం కోల్పోయిన వదిన కూడా ఉంది.
** **
చిన్నగున్నప్పటి నుండే అమ్మీ నన్ను గోవిందా అని పిలిచేది. చంటి పిల్లోడిగా ఉన్నప్పుడే నేను అతనిలా ఉంటానని గమనించింది. (అతను…., నీకు తెలుసా అతను? అదే “పార్ట్నర్” లో సల్మాన్ తో పాటు ఉండడా!) అమ్మీకి అప్పుడే తెలుసు నేను ఒక రోజు “స్టార్” అయితా అని.
ఆ పేరు స్థిరపడింది. మా జోపడ పట్టీ (గుడిసె) లో ఎవ్వరూ నన్ను జబ్బార్ అని పిలవరు. అయితే నేనింకా సినిమాల్లో నటించాల్సి ఉందనుకో! ఒకసారి ఒకతను నాకు ఒక పాత్ర ఇస్తానని ప్రామిస్ చేశాడు. “ఎక్స్ ట్రా” గా. నేను అతనికి 50 రూపాయలు ఇచ్చాను. అతను తన నంబరు ఇచ్చాడు. మొబైల్ నంబరు. నేను పదే, పదే ప్రయత్నం చేశా. ఎప్పుడూ అది పనిచేయలేదు. “టోటల్ నల్లా”.
అయితే నేనందంగా లేనా చెప్పు. మంచి సబ్బూ, నీళ్లూ, కావల్సినంత ఉంటేనా! గట్టిగా తోమితే అప్పుడు నేను తెల్లగా ఉంటాను. కదా! నా తోలు చూడు. ఎంత నున్నగా ఉందో. ఈ మచ్చలే. ఈ మచ్చలకి ఏమన్నా క్రీమ్ తెలుసా నీకు?
నేను అరెస్టయినపుడు నాకు జుట్టు పొడుగ్గా ఉండేది. జాన్ అబ్రహాం లాగా. అచ్చంగా అట్లాగే. అబ్బాయిలు నన్ను ‘హగ్రా జాన్’ అని పిలిచే వాళ్ళు కూడా.
నేను అన్ని సినిమాలూ చూస్తా. మరాఠా మందిర్ కి వచ్చే అన్నీ. ఇంటర్వల్ అయిపోయిన తరవాత వాచ్ మెన్ మమ్మల్ని వదిలేస్తాడు. ఖాళీగా ఉంటే! ఒకవేళ హౌస్ ఫుల్లు అయిందనుకో మేము “బ్లాక్” చేస్తాం. నీకు టిక్కెట్లు కావాలంటే దొరుకుతాయి. జస్ట్ నా పేరు చెప్పు. గోవిందా అని అడుగు.
నేను బాగా పాడతాను కదా! నా డాన్సు కూడా. సల్మాన్ లాగా ఉంటది కదా. నాకెవ్వరూ నేర్పలేదు తెలుసా. ఊరికే అట్లా ఆయన సినిమాలు చూసి నేర్చుకున్న. నా బాడీ కూడా సల్మాన్ లెక్క ఉంటది. జైలు కి వచ్చాక తగ్గిపోయాను కానీ. ఈ చరస్, ఇవ్వన్నింటితో పాడుచేసుకున్నా.
కానీ ఎక్సరసైజ్ చేస్తాలే. బాగా బాడీ పెంచుతాను. నేను స్టార్ నయితా. అమ్మీ చూస్తది. ఆమె చాలా సంతోషపడ్తది.
** **
మా రోడ్డు మీద నువ్వు బతకడం తొందరగా నేర్చుకుంటావు. నాలుగేళ్ళకు, మూడేళ్లకూ, లేదా ఇంకా ముందు కూడా. నీకు కొట్లాడడం రాకపోతే కనీసం నిన్ను ఆడుకోను కూడా ఆడుకోనివ్వరు. నేను చిన్నప్పటి నుండే గట్టిగా ఉండేటోణ్ణి. నేను ఒక్క పంచ్ కొట్టానంటే….. తెలుసా ….ఆరోజు జైలర్ మొఖం పగలగొట్టేవాణ్ణి. ఏం చేస్తాం! ఇది జైలు. మొదటి సారి వచ్చినపుడైనా సరే నువ్వు “కాలా టోపీ” (పదే పదే నేరాలు చేసేవాళ్ళు) లాగా తెలివిగా ఉండడం నేర్చుకోవాలి.
నేను ఏడేళ్ళ వయసులో, లేదా ఎనిమిది కూడా కావచ్చు, అమ్మీ కి వచ్చేది సరిపోయేది కాదు. నేనూ, చోటూ ఎప్పుడూ ఆకలితో ఉండేవాళ్లం. నేను చెత్త ఏరడం మొదలుపెట్టాను. మొదట్లో చాలా కష్టంగా ఉంటది. చెత్తలో బోలెడన్ని ఉంటాయి. ఏది మంచిదో, ఏది పనికిరానిదో, దేనికి డబ్బులొస్తాయో మనకి తెలీదు. కానీ నేను తొందరగా నేర్చుకున్నాను. తెలుసా, నేను చాలా ఫాస్ట్.
మొదట్లో ఏదంటే అది ఏరేవాడిని. ప్లాస్టిక్కు, పేపరు, డబ్బాలు, ఏదైనా. ఎక్కువేమీ రాదు. కాకపోతే కనీసం తినడానికి సొంతగా సంపాదిస్తా. ఒక్కోసారి ఇంటికి పట్టుకెళ్లడానికి ఏమైనా దొరుకుతాయి. ఒక్కోసారి అది మంచి తిండి కూడా కావచ్చు. ఇంక ఇనుము గాని దొరికిందనుకో. అదృష్టమే. ఒకసారి నాకు 12 కిలోలు దొరికింది. తోట పక్కన. వెంటనే దాచేశాను. ఇనుముకి ‘భంగార్ వాలా’ (తుక్కు వ్యాపారి) మంచి ధర ఇస్తాడు. డబ్బులు మిగిలితే ఛోటూకి ఏదన్నా కొంటాను. ఒక్కోసారి అమ్మీకి డబ్బులు ఇస్తాను.
ఈ మధ్య నేను చెత్త ఏరడం మానేశాను. ఏదైనా లోహం కనిపిస్తేనే. ఒక కన్నేసి ఉంచాలి. పొద్దున్న పూట, ఒక్కసారి… అలా ప్రయత్నించాలి. తిన్నగా భంగార్ వాలా దగ్గరికి తీసుకుపోవాలి.
ఈ మధ్య నేను గట్టర్ (మురికి కాలవలు శుభ్రం చేయడం) పని చేస్తున్నా. మేన్ హోల్ లోకి కూడా దిగుతా. పని అంటే ఏదైనా పనే మరి. నేనేమీ ఎవ్వరినీ అడుక్కోవడం లేదు కదా. కానీ నేను మాత్రం అరువుకు పని చెయ్యను. రేపిస్తా అంటే నాకు కుదరదు. అదే రోజు, సాయంత్రానికి చేతిలో వంద రూపాయలు పడాల. లేదంటే నేను పని తీసుకోను. రేపు ఎవ్వడు చూశాడు?
నేను మాంఛి పనిమంతుడిని. అందరూ నన్నే పిలుస్తారు. బిల్డింగ్ వాలాలకు తెలుసు. ఎవ్వరూ చేయలేకపోయారంటే గోవిందా తప్పక చేయగలడు. మా నంబర్ కారీ ఉన్నాడు కదా, అదే, నాకేసులో వచ్చినవాడు (సహ నిందితుడు)! వాడొకసారి కాలవ పూడిక తియ్యడానికి రెండు గంటలు ప్రయత్నం చేశాడు. అప్పుడు బిల్డింగ్ వాలా నన్ను పిలుచుకు రమ్మన్నాడు. వెంటనే వెళ్ళాను. అది పూర్తిగా పూడుకుపోయి ఉంది. నా కాళ్ళతో లోపలకి తోసి తోసి ప్రయత్నం చేశాను. మొత్తం శక్తినంతా పెట్టాను. అప్పుడు వదులుగా అయ్యింది. వూహ్, హటాత్తుగా నీళ్ళు భళ భళలాడుతూ వచ్చేశాయి. ఇప్పుడు బిల్డింగ్ వాలా నన్ను మాత్రమే పిలవమని చెప్తాడు. కాలవ పూడిక తీసి శుభ్రం చేయడం ఒక్క గోవిందాకు మాత్రమే తెలుసు.
నీ అడ్రసు ఇవ్వు. నేను ఏ పనికి అయినా వస్తాను తెలుసా. నేను రాళ్ళూ రప్పలూ కూడా తీస్తా. ఎంత ఉంది అనేదాన్ని బట్టి ఉంటది. అందుకే చూస్తే గాని చెప్పను. ఒక సారి మేము తొమ్మిదో అంతస్తు నుండి తేవాల్సి వచ్చింది. లిఫ్ట్ వాడకుండా. ముడ్డి పగిలిపోయే పని. ఆ సాబ్ చాలా సంతోషపడ్డాడు. 50 రూపాయలు ఎక్కువిచ్చాడు.
మహమ్మద్ భాయ్ కూడా నన్నే పిలుస్తాడు. బాంబే సెంట్రల్ కి ఎదురుగ్గానే ఆయన చాయ్ బల్ల ఉంటది. రాత్రంతా నడుపుతాడు. రాత్రిపూట మాత్రమే! కస్టమర్లను పట్టుకోవడంలో నేను దిట్ట. వాళ్ళని తిన్నగా బల్ల దగ్గరికి పట్టుకురాగలను. చాయ్ చెయ్యడం కూడా వచ్చు. ఫస్ట్ క్లాస్ చాయ్. కానీ ఆయన కస్టమర్లను పట్టుకు రమ్మని అంటాడు. నేను అందుకే బాగా పనికొస్తాను. నన్ను గల్లా పెట్టె దగ్గర కూడా పెట్టడు. ఒక సారి ఆయన ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది. “నేనిప్పుడే వస్తాను. గల్లా పెట్టె చూస్తూ ఉండు” అన్నాడు. నేను కొంచెం డబ్బు తీశాను. రెండు మూడు క్వార్టర్లు తెచ్చుకున్నాను. ఒక గుక్క తాగి కస్టమర్లను పిలిచాను. ఒక్క గుక్క తాగడం, కస్టమర్లను పిలవడం. మహమ్మద్ భాయ్ కి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అందులో చాలా డబ్బు ఉంది. బహుశా టీ చేసే అబ్బాయే “ఖబరీ గిరి” (గూఢచారి పని) చేసినట్టున్నాడు. అహ్మద్ భాయ్ ఏమీ అనలేదు కానీ, తరవాత నన్ను మళ్ళీ ఎప్పుడూ గల్లా పెట్టె దగ్గర పెట్టలేదు.
నేను మందు కొడతా. జిఎం ఒక్కటే. ఇంక ఏదీ ముట్టను. చరస్ లాంటివన్నీ ఇక్కడ జైల్లోనే. ఏదో ఒక నషా ఉండాలి కదా. ఆ…తంబాకు, బీడీ సిగరెట్ వంటివి ఉంటాయిలే గానీ, అది నషా అనలేము కదా. బ్రౌన్ షుగర్, వైటినింగ్ సొల్యూషన్ అలాంటివన్నీ నాకు గిట్టదు. సొల్యూషన్ అన్నిటికన్నా ఘోరం.
మా దగ్గర వైఎంసిఏ మైదానం లో చరస్ తీసుకుంటారు. నేను వాళ్ళతో కలిసి కూర్చోను. అది “హై” ఇవ్వనే ఇవ్వదు. ఇంకా దిగి పోతది. అది “గాండు నషా”. నేను మాత్రం ఎప్పుడైనా సరే, మందు కొడతా.
ఎప్పుడైనా డబ్బులున్నాయి అంటే ఇంక మందు కావాల్సిందే. నాకిష్టమైన బార్ అంటే అలెగ్జాండ్ర వెనుకనే కామాటిపుర గల్లీలో ఉంటది. మాంచి బజ్జీలు ఉంటాయి. తినాలక్కడ. ఒక్కోసారి మైదానం దగ్గర పిట్టగోడ మీద కూర్చుని, ఖంబా కానీ, జిఎం ఫుల్ బాటిల్ గాని తెచ్చుకొని బజ్జీలు నంజుకోడానికి పెట్టుకొని కూర్చుంటాము. మైదానం మీదుగా వీచే చల్లని గాలిలో ఇంకా బాగుంటుంది. మంచి కిక్ ఇస్తది.
మందు నన్ను పులిని చేసేస్తది. నేను బాగా “హై” లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొట్లాటకు పోవాల్సిందే. ఈ గాటు చూశావా? కొంచెం ఉంటే కన్ను పోయేది. ముగ్గురు కలిసి అబ్బాని కొడుతున్నారు. అబ్బాదే తప్పు. అమ్మీని సతాయించినపుడు నేను కూడా కొడతాను కానీ, బయటివాళ్ళని ఎట్లా కొట్టనిస్తా? వాళ్ళని ఖాతం చేసేద్దును. కానీ ఒకడు వెనక నుండి వచ్చాడు. సీసా పెట్టి నా తల మీద కొట్టాడు. కన్నుకు సరిగ్గా పైన.
ఒకసారి నేను నా ‘నంబరుకారీ’ ని రక్షించాను. నేను గనక లేకపోతే చచ్చిపొయ్యేవాడు. స్పృహతప్పి పడిపోయాడు. నేను వాళ్ళను ఒక చెక్క తో కొట్టి తరిమేశాను. ఎంత రక్తాలు కార్చారో వాళ్ళు.
ఒకసారి నేను కుక్కను చంపాను. అప్పుడు తాగి ఉన్నాను. అది మంచిది కాదు. అది చాలా చెడ్డపని కదా. నేను తప్పు చేశాను. ఆ పాపం వల్లే నేను ఇక్కడికొచ్చి పడ్డాను, ఈ మర్డరు కేసులో!
లేకపోతే కాకిది కావచ్చు. అది నా కబాబుల పేకెట్ ఎత్తుకొని ఎగిరిపోయింది. ఒక ముక్క కాదు, రెండు కాదు, మొత్తం పేకెట్. నేను చాలా ఆకలిమీదున్నా. నాకు పిచ్చి కోపం వచ్చింది. అవకాశం కోసం ఎదురుచూశాను. ఒక్క రాయి దెబ్బతో చంపేశాను. అదే కాకి కాకపోవచ్చు. మరి నా తిండిని ఎందుకు తీసుకుపోవాలి? నేను దానిని చంపాను. అది నన్ను శపించింది. ఇప్పటికీ నాకు పీడకలలు వస్తాయి. అది నా వెంటపడినట్టూ, నేను పరిగెత్తుతున్నట్టు. కానీ అది నా తిండి ఎందుకు ఎత్తుకుపోవాలి? నేను తప్పు చేశానా? అందువల్లే నాకు శాపం తగిలిందా? నేను రైటే చేశాను కదా?
వైఎంసిఏ మైదానమే మా ముఖ్యమైన అడ్డా. చాలా గొప్ప ప్లేసు. అవతలి వైపు క్రిస్టియన్ వాళ్ళ బిల్డింగ్ ఉంటది. కొన్నిసార్లు వాళ్ళు నాకు మొక్కలకు నీళ్ళు పోసినందుకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. మంచి వాళ్ళు. నా ఇంగ్లీష్ మాటలన్నీ అక్కడే నేర్చుకున్నా.
ఆదివారం క్రికెట్ ఆడతాము. అక్కడే! మైదానంలో. మాది బిహారీ లెవన్. దూర….దూరం నుండి టీం లు వస్తాయి. వాళ్ళతో ఆడతాం. నాకు బౌలింగ్ అంత బాగా రాదు కానీ, నా ఫీల్డింగ్ చూడాలి నువ్వు. మేము చాలా మ్యాచుల్లో గెలిచాం. దాదాపుగా అన్ని మ్యాచుల్లో. భలే సరదాగా ఉండేది.
హామీదాని నేను మొట్టమొదట, క్రికెట్ మ్యాచ్ లోనే చూశాను. ఆరోజు తాను ప్యాంట్ వేసుకుంది. చాలా అందంగా ఉంది. ఆమె ఎప్పుడూ అందంగా ఉంటుంది. నేను టీ షార్ట్ వేసుకున్నాను. నేను కూడా బాగున్నాను. ఆరోజే ఢిల్లీ నుండి వచ్చాను కాబట్టి, ఆడటం లేదు. అప్పుడే స్నానం చేసి వచ్చాను. బాగా రుద్దుకున్నాను. అందుకని తెల్లగా కనిపిస్తున్నాను. నా పెదవులు ‘రెడ్ రెడ్’ గా ఉన్నాయి.
ఆమె నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లితో కలిసి వచ్చింది. నేను వంటరిగా ఉన్నాను. ఒక్కడినే పిట్టగోడ మీద కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను. వాళ్ళు చిన్నచిన్నగా నవ్వుతున్నారు కానీ పట్టించుకోలేదు. తరవాత వాళ్ళు చిన్న చిన్న రాళ్ళు విసరడం మొదలుపెట్టారు. నేను వాళ్ళని ఛాలెంజ్ చెయ్యాలి. అలా మా లవ్ స్టోరీ మొదలయ్యింది.
తరవాత మేము చాలా సార్లు కలుసుకున్నాం. ఆ తోటలోనే. అప్పుడప్పుడూ చౌపట్టీకి వెళ్ళే వాళ్ళం. ఒక్కోసారి తన చిన్న చెల్లిని కూడా తీసుకువచ్చేది. అప్పుడు నా స్నేహితులు కూడా వచ్చే వాళ్ళు. బీచ్ లో ఎంత సరదాగా గడిపే వాళ్ళమో!!
ఒక రోజు ఆమె నన్ను ఎత్తుకోమని ఛాలెంజ్ చేసింది. తెలుసా నేను రెండు చేతుల్లో ఎత్తుకున్నాను. ఇదిగో ఇలాగే…బ్రిడ్జ్ చివ్వరి దాకా ఎత్తుకుని నడిచాను. ఆ బ్రిడ్జ్ తెలుసు కదా, గ్రాంట్ రోడ్ పక్కన. అందరూ మా వైపే చూస్తున్నారు. నేను ఎత్తుకొంటానని ఆమె వూహించలేదు. నేనేదో భయపడతానన్నట్టు!
ఆమె తాటి కల్లు మాత్రమే తాగుతుంది. డ్రింక్స్ తీసుకోదు. సొల్యూషన్ గానీ ఏమీ తీసుకోదు. మేము కలిసినపుడు తాటి కల్లు తాగేవాళ్ళం. ఆమెకి కొంచెం నషా వచ్చేది. పూర్తిగా ఎప్పుడూ కాదు.
మాది నిజమైన ప్రేమ. ఆమె నొక్కదాన్నే నేను పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాను. ఆమెకు కూడా నా పెదవులంటే ఇష్టం. తప్పకుండా నా గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నాకు తెలుసు. ఒకసారి లాక్ అప్ కు కూడా వచ్చింది…అనుకుంటా. పోలీసులు ఆమెని తరిమేశారు.
ఒకసారి చౌపట్టీ నుండి తిరిగి వస్తూ ఉండగా ఆమె మంచి మూడ్ లో ఉంది. నా రుమాలు తీసుకొని కమీజ్ లో పెట్టేసుకుంది. ధైర్యం ఉంటే తియ్యమని సవాల్ చేసింది. నేను తిన్నగా చెయ్యి పెట్టాను. తరవాత మేమిద్దరం టెంపోల వెనక్కి వెళ్ళాం. మూలాన….గోడను ఆనుకొని….కాలవ పక్కన …మేము కలుసుకున్నాం. అక్కడే నిద్రపోయాం. తెల్లవారి మూడు గంటలప్పుడు నేను మెల్లగా ఎస్టిడి దగ్గరికి జారుకున్నాను.
ఆమె రాజుని పెళ్ళి చేసుకుంది. అతను హిందూ. టోచన్ వాలా. రాంగ్ పార్కింగ్ చేస్తే వాహనాలను తీసుకుపోయే వ్యాన్ లలో పనిచేస్తాడు. ఆమె కుటుంబాన్ని కూడా తప్పు పట్టలేము. మురికి కాలవలు కడిగే వాడిని ఎందుకు తెచ్చుకోవడం??
నాకు ఆ విషయం తెలిసినపుడు ఎంతగా తాగానో చెప్పలేను. బాగా తిక్క మీద ఉన్నాను. ఆమె గుడిసె ముందుకు వెళ్ళి గొంతు చించుకొని అరిచాను. బ్లేడు తీసుకొని ఇదిగో…. ఇక్కడ… చేతుల మీద చూడు, ఒకటి, రెండు, మూడు, మొత్తం ఏడు సార్లు. చిన్న చిన్నగా కాదు, బాగా లోతుగా కోసుకున్నాను. ఈ గాట్లు నా ప్రేమ. విపరీతంగా రక్తం కారింది. కానీ వాళ్ళు ఇంట్లో లేరు. ఆ విషయం నాకు తరవాత తెలిసింది.
ఇప్పటికీ ఆమెను కలుస్తుంటాను. ఆమె నన్ను ఇప్పటికీ ప్రేమిస్తుంది. ఆమె నాగపాదా సిగ్నల్ దగ్గర అడుక్కుంటుంది. ఆమెని అక్కడ కలుస్తాను. ఆమె నన్ను చూసి పరిగెత్తుకొని వచ్చింది. మేము వూరికే మాట్లాడుకుంటున్నాము. ఇంతలో ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు ఆ రాజు వచ్చాడు. బహుశా అతని వ్యాను అటువైపు నుండి వెళ్తుందో ఏమో! ఆమెని చెంప మీద ఒక్కటి కొట్టి చెడ్డ మాటలు తిట్టుకొంటూ జుట్టు పట్టి లాక్కెళ్ళాడు. అతన్ని తేలిగ్గా కొట్టేసే వాడిని. కానీ ఏం చేస్తాం? ఆమె ఇప్పుడు అతని భార్య కదా!
నా పెళ్ళి నిలబడలేదు. కనీసం రెండు రోజులు కూడా కాదు. మేము బీహార్ కి వెళ్ళినపుడు నాకు పెళ్లి చేశారు. ఆమె పళ్ళు ఎత్తు. మొదటి రాత్రి కలుసుకున్నాం. కానీ నేను ఆమె పెదవుల మీద ముద్దు కూడా పెట్టలేదు. ఆమె పళ్ళు మరీ బయటకు పొడుచుకొస్తున్నాయి.
మేము బాంబేకి తిరిగి వచ్చాక ఆమె అన్నలు ఆమెను మా ఇంటికి పంపలేదు. వాళ్ళకి హామీదా గురించి తెలిసింది. తలాక్ ఇచ్చెయ్య మని బలవంతం చేశారు. నేనేదో పట్టించుకుంటానన్నట్టు!
వేరే అమ్మాయిలు కూడా ఉన్నారు. సొల్యూషన్ వాలీలు అందరూ నా వెంట బాగా పడేవారు. వాళ్ళకి డబ్బులు కావాలి కదా. మొదట్లో ఒక సొల్యూషన్ సీసా 18 రూపాయలు ఉండేది. ఇప్పుడు 22. కొంచెం దుపట్టా మీద చల్లుకుంటారు. తరవాత ముక్కు దగ్గర పెట్టుకుంటారు. అది లేకుండా అస్సలు ఉండలేరు. వాళ్ళకి అది ఎప్పుడూ కావాలి. ఆ నషా కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధంగా ఉంటారు. అందుకోసమే ఎవ్వరితోనైనా పడుకోడానికి సిద్ధపడతారు. నేను ఎప్పుడూ….ఎప్పుడూ సొల్యూషన్ వాలీలతో పడుకోను. నెవర్!
షాహీన్ ఉంది. కానీ నాకు తెలియదు మరి. నా అరెస్టుకు రెండు రోజుల ముందు నేను బీహార్ వెళ్ళాను. భాభీ ని వాళ్ళ ఊరిలో దింపేశాను. షాహీన్ ని కొంచెం మా ఇంటికి వెళ్ళి అమ్మకు బట్టలవీ ఉతకడానికి సహాయం చెయ్యమని చెప్పాను. ఎలాగూ తను కూడా అక్కడ ఇళ్ళల్లో పని చేస్తుంది. అలా వస్తూ ఉంటేనే కదా అమ్మకు తన గురించి తెలిసేది. తరవాత పెళ్ళి చేసుకోవచ్చు. కానీ తను రెండు సార్లు వచ్చి మానేసింది. ఇప్పుడు నాకింకా తెలియదు. అరెస్టు తరవాత ఆమె ఎక్కడుందో ఎవరికి తెలుసు. అయినా ఏం ఫరక్ పడుతుంది?
నేను నేరాల్లోకి ఎప్పుడు వచ్చానో నాకే తెలియదు. నిజానికి నేరాల్లో లేను. అక్కడ నుండి ఇక్కడ నుండి కొంచెం ఇనుము పట్టుకొచ్చుకోడం. దానిని నేరం అని పిలవం కదా! పిలుస్తామా?
చిన్నప్పటి నుండి నేను బాంబే సెంట్రల్ ట్రైన్లలో మాత్రమే చెత్త ఎరే వాడిని. ముఖ్యంగా రాజధాని, శతాబ్ది. ట్రైన్ వస్తున్నప్పుడే దూరిపోవాలి. వదిలిపెట్టేసినవి ఏవైనా పట్టుకోవాలి. ప్లాస్టిక్ బోటిల్స్, న్యూస్ పేపర్లు, ఏదైనా సరే. అప్పుడు వాటిని అమ్ముకోవచ్చు. ఎప్పుడైనా ఎవరైనా పర్సు మర్చిపోవచ్చు. అప్పుడు డబ్బులు కూడా దొరుకుతాయి. అదేమీ నేరం కాదు, అవునా? అయినా మేము ఎక్కువగా తిండి కోసమే చేస్తాం. రాజధాని లో తిండి ఏం ఉంటుందంటే!! పైగా వాళ్ళు ఎలాగూ పడేస్తారు.
నాకు పన్నెండో పదమూడో ఉన్నప్పుడు మేము సీట్లు కూడా పట్టి పెట్టేవాళ్ళం. బాగా రష్ ఉండే సీజన్ లో అయితే ఎంత డిమాండు ఉంటదో! చాలా డబ్బు. చాలా సార్లు తాగేవాడిని. నీకు ఎప్పుడైనా సీటు కావాలంటే చెప్పు. ‘నో ప్రాబ్లం’. నీ దగ్గర డబ్బులు తీసుకోను. తాగను. అసలు మాకు పోలీసులతో ఇబ్బంది వచ్చేదంతా తాగినప్పుడే. కొందరు కొట్లాడి చౌకీ (పోలీసు స్టేషన్) లో పడతారు. బాగా కొట్టి పంపేస్తారు. కొన్ని సార్లు వైఎంసిఏ మైదానంలో తాగుతూ పట్టుబడతాం. పోలీసులు లాఠీలు ఝుళిపిస్తారు. సీసాలు పగలకొడతారు. మైదానం నుండి తరిమేస్తారు.
హా!!! కొన్నిసార్లు మైదానం లోకి కొత్తగా వచ్చే వాళ్లనుండి డబ్బులు కక్కిస్తాం. “ఎక్కడి నుండి వచ్చిందీ డబ్బు, దొంగతనం చేసిందేగా! బయటికి తియ్యి. లేకపోతే నిన్ను నంగా చేసి (నగ్నంగా) పంపుతాం.” కానీ ఇలాంటివి మేము ఎప్పుడైనా ఒకసారి చేసేవాళ్ళం. అదీ ఇంకెవ్వరూ కాదు, టోనీ ఉన్నప్పుడు మాత్రమే.
నేను చేసిందేమిటంటే మైదానంలో నిద్ర పోతున్న వాళ్ళ నుండి వస్తువులు కొట్టేయ్యడం. వాళ్ళు గాఢంగా నిద్రపోయేదాకా ఆగు. నంబర్ కారీ కాపలా ఉంటాడు. బూట్లు అయితే చాలా తేలిక. 30-40 రూపాయలు వస్తాయి. నా దగ్గర పదునైన బ్లేడు ఉంది. నేను మెల్లగా నిద్రపోతున్న వాడి దగ్గరికి వెళ్తాను. తరవాత నిశ్శబ్దంగా అతని ‘చోర్’ పాకెట్ కత్తిరిస్తాను. ఇట్లా….రెండు వేళ్ళు ఇట్లా పెట్టి….సున్నితంగా లాగెయ్యాలి. ఒకవేళ లేచాడు అనుకో. అతని మీద దాదా గిరి చెయ్యి. “నువ్వు ఏదో పెద్ద గొప్పోడి ననుకుంటున్నావా? ఏమీ లేని దానికి పట్టుకుంటున్నావు? నీ చిల్లర పైసలు మాకేమీ అక్కర్లేదు!!” అతను నోరుమూసుకోవాల్సిందే.
ఒక రోజు నాకొక మొబైల్ దొరికింది. మంచిది. కానీ ఎక్కడ అమ్మాలో తెలియలేదు. టోనీ 100 రూపాయలు ఇచ్చాడు. అంతే ఉందన్నాడు. నన్ను నిశ్చయంగా మోసం చేశాడు.
నాకెప్పుడూ పోలీసు సమస్య రాలేదు. నిజానికి పోలీసులందరికీ నేను తెలుసు. అగ్రిపాద చౌకీ, నాగపాద చౌకీ. ఆఖరికి నాగపాద కమీషనర్ కి కూడా నేను తెలుసు. కానీ అవసరం అయినపుడు ఎవ్వరూ సహాయపడరు. కానీ నేను వాళ్ళకి ఖబరీగిరీ (రహస్యంగా సమాచారం ఇవ్వడం) కూడా చేశాను. పెద్ద పెద్దవి కాదు. పేకాట లాంటివి అంతే. ఎవరికీ పెద్ద నష్టాలు చేసేవి కాదు.
ఈ కేసు కంటే ముందు నాకు ఒక్కటే కేసు ఉండేది. ఒకబ్బాయి వాళ్ళ నాన్న ఫిర్యాదు చేశాడు. అతన్ని కొట్టాం, మేము. అయితే అతనికి తొమ్మిదేళ్ళే అని వాళ్ళ నాన్న అన్నాడు. నిజానికి అతనింకా పెద్దోడు.
మేజిస్ట్రేట్ నన్ను చూసి మెడికల్ చెక్ అప్ కి పంపాడు. డాక్టర్ నా ఎక్స్ రే తీశాడు. అతను నాకు 15 యేళ్ళు అని చెప్పాడు. అది గత యేడాది ‘ఈద్” కి ముందు.
నన్ను డోంగ్రి జైలు కి పంపారు. అది పిల్లల జైలు. అక్కడి నుండి తప్పించుకోడం చాలా తేలిక. కానీ నేను గోడ ఎక్కుతున్నపుడు ఒక పిల్లోడు చూసి ఊరికే అరవడం మొదలు పెట్టాడు. నేను వెనక్కు దూకేసి ఏమీ జరగనట్టు నటించాను. అయితే నా లాయర్లు నన్ను కొన్ని రోజుల్లోనే విడిపించుకు వెళ్ళారు.
ఎవ్వరికీ చెప్పకు. ఆ కేసు 377. నిజంగా ఆ అబ్బాయిని నేను ఏం చేయలేదు. పోలీసులు తప్పుడు కేసు పెట్టారు. నేను నిజంగా ఏం చేయలేదు. అతనికి సరైన గుణపాఠం చెప్పానంతే. నేనేమీ ‘హోమో’ ని కాదు. కానీ జైల్లో ఇంకెవరికైనా తెలిసిందటే వాళ్ళు నన్ను ఏమైనా చెయ్యగలరు. ఇప్పుడు పోలీసు గుమాస్తా నేరం ఒప్పుకుంటే జువనైల్ కోర్టులో శిక్ష పడదు అంటున్నాడు. బహుశా అతను చెప్పినట్టే చేస్తాను.
ఈ మర్డరు కేసు కూడా అంతా తప్పుడు కేసు తెలుసా. నేనెక్కడ మర్డరు చేయగలను చెప్పు! టోనీ చేశాడు. అతన్ని పట్టుకోలేకపోయారు. అందుకని మమ్మల్ని లోపలేశారు. సైరాని కూడా. ఆమెకు ఎవ్వరూ లేరు. వాళ్ళ పాప ఎంత ముద్దుగా ఉంటుందో. ఆరు నెలలు అంతే. సైరా మైదానంలోనే ఉంటుంది. నాతో పాటు జిఎం తాగేది. వేరే అబ్బాయిలతో కూడా. వూరికే ఆమెను కూడా పెట్టేశారు జైల్లో. ఏమీ లేకుండానే! తన పాపకి నేనంటే ఇష్టం. ఆమెని తలుచుకుంటే ఏడుపొస్తది నాకు. ఆమె చిరునవ్వు ఎంత బావుంటుందో. చాలా తెల్లగా ఉంటుంది. జైల్లో ఎట్లా ఉందో పాపం పిల్ల.
నీకేమనిపిస్తుంది? నేను బయటికి వెళ్తానా? నాకు బెయిల్ వస్తుందా? అమ్మీ ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది. ఏదైనా సరే. తాను ఉన్నంత వరకూ తాను ఏదో ఒకటి చేస్తుంది. మన్ ఖుర్ద్ లో వాళ్ళు మా గుడిసె కి బదులుగా ఒక ఫ్లాట్ ఇస్తున్నారు. ఆ ఫ్లాట్ కి ఒక రెండు లక్షలు వస్తుందంటావా? వాళ్ళు అంటున్నారు అట్లా! అప్పుడు మేము లాయర్ కి ఇవ్వచ్చు. లేకపోతే ఎవరికి తెలుసు?
నేను కనక బయటికి వెళ్తే నేరం చెయ్యను. ఆఖరికి తిండి కోసం అయినా సరే. నాకు తిండి ఎక్కడైనా దొరుకుతుంది. నాకు చాలా ప్లేసులు తెలుసు. ఎక్కడైనా ఫ్రీగా తిండి దొరుకుతుంది. శాండీ సడక్ లో బతార్ ఖానా నాకు చాలా ఇష్టం. మోర్ ల్యాండ్ రోడ్ లో! మంచి తిండి. నువ్వు తొందరగా వెళ్ళి బయట కూర్చుంటే నీకు తప్పక తిండి దొరుకుతుంది. ఎక్కువేమీ కాదులే. కానీ ఓకే. చల్తా హై.
నాకు శిక్ష పడుతుందని అనిపిస్తుందా నీకు? ఉరి శిక్ష అయితే వెయ్యరు కదా! ఒకవేళ “లైఫ్” (జీవిత ఖైదు) పడితే! నాకు జైల్లోనే ముసలి అయిపోవాలని లేదు. నేను బయటికి వెళ్తాను కదా? నేను బయటికి వెళ్తాను కదా???
** **
జబ్బార్ అసలు ఆర్థర్ రోడ్ జైలుకి రావాల్సిన పనే లేదు. అతను మైనర్ అని పోలీసులకి తెలుసు. అయినా కావాలని అతని వయసు 18 అని వేశారు. ఎందుకంటే వాళ్ళకి క్రిమినల్ కోర్టు, జువనైల్ కోర్టులకు సంబంధించి చేయవలిసిన రాత పనులు అన్నీ తప్పిపోతాయి.
నేర విభాగానికి సంబందించిన ఈ చిన్న అసౌకర్యం, (లేదా వట్టి దుర్బుద్ధి) జబ్బారూ, అతని నంబర్ కారీ ల నెత్తిమీదకు వచ్చింది. జువనైల్ కోర్టులో అతనిని ప్రవేశ పెట్టి ఉంటే అతను ఆర్థర్ రోడ్డు జైలు, (సైరాకి బైకుల్లా మహిళా జైలు) తప్పి ఉండేవి. వాళ్ళకు ఎక్కువలో ఎక్కువ మూడేళ్ళ శిక్ష వేసి ప్రభుత్వ ప్రత్యేక వసతి గృహానికో, పరిశీలక గృహానికో పంపి ఉండేవారు. క్రిమినల్ కోర్టులో విచారణ అంటే విచారణ ఖైదీగానే ఎన్నో యేళ్ళు గడపవలిసి వస్తుంది. ఉరిశిక్షలు ఎడాపెడా వేసే జడ్జీ గాని దొరికాడా వాళ్ళకి మరణ శిక్ష కాకపోయినా జీవిత ఖైదు వేసేస్తాడు.
క్రిమినల్ కోర్టులోని మేజిస్ట్రేటు జబ్బార్, సైరా, వారి మరో సహ నిందితుడి వయసును వైద్య సహాయంతో నిర్ధారణ చేయమని అడిగి ఉండవలిసింది. ఎందుకంటే వాళ్ళని చూస్తే చిన్న వయసు అనే విషయం అర్థం అవుతోంది. కానీ పోలీసుల కల్పనలకి ఆయన ఎంతగా అలవాటు పడిపోయాడంటే యాంత్రికంగా వాటిని నమ్మే స్థితికి వచ్చేశాడు.
నేను జబ్బార్ వయసును వైద్యపరంగా ధృవీకరించమని దరఖాస్తు తరవాత దరఖాస్తు చేస్తూనే ఉన్నాను. భారత క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ సహజ లక్షణం ప్రకారమే అవి అంతులేని అగాధం లోకి పడిపోయాయి.
మొదటి దరఖాస్తు, జుడీషియల్ చిత్రహింస కోసం కనిపెట్టిన అధునాతన పరికరం అయిన “వీడియో కాన్ఫరెన్సు” తెర పైననే కూలిపోయింది. చార్జి షీటు నమోదు చేసేవరకూ కోర్టుకు తీసుకువెళ్ళరు. కోర్టు వాయిదాల తేదీల్లో వాళ్ళని జైళ్లలోనే ఉన్న ‘వీడియో కాన్ఫరెన్సింగ్’ కు తీసుకు వెళ్తారు. అక్కడ వాళ్ళు తెర మీద ఎవరో ఒక మేజిస్ట్రేట్ ని చూస్తారు. చాలా సార్లు వాళ్ళు వీళ్ళ కేసు చూసే మేజిస్ట్రేట్ కూడా అయి ఉండరు. జబ్బార్ తన వయసును ధృవీకరించాలని కెమెరాకు చెప్పినప్పుడు మేజిస్ట్రేట్ రాతపూర్వకంగా ఇవ్వమని చాలా దయగా చెప్పాడు. తదుపరి వీడియో కాన్ఫరెన్సుకు జబ్బార్ దరఖాస్తు తీసుకుపోయాడు. గౌరవనీయులైన ఆయన చిరునవ్వు నవ్వి, పక్కన వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్న జైలు కానిస్టేబుల్ కి ఇవ్వమని సూచించారు. కానిస్టేబుల్ దానిని నిశ్శబ్దంగా నమోదు చేశాడు. అది లాల్ గేటు దాటలేదు.
మూడు నెలల వీడియో కాన్ఫరెన్సింగు తరవాత జబ్బార్ తాజాగా మరొక దరఖాస్తు తీసుకొని గర్వంగా కోర్టుకి వెళ్ళాడు. అదే దయమయమైన చిరునవ్వు. “నీ కేసుని సెషన్స్ కోర్టు కి పంపుతున్నాను. కాబట్టి నేను దరఖాస్తు స్వీకరించ కూడదు. సెషన్స్ కోర్టులో ఇవ్వు.”
సెషన్స్ కోర్టులో మొదటి రోజు. “నేను రిజిస్ట్రార్ ని. దరఖాస్తులు స్వీకరించను. కోర్టులో ఇవ్వాలి. తరవాత వాయిదా లో”.
కానీ తరవాతి వాయిదా ఎన్నో, ఎన్నో నెలల తరవాత కానీ లేదు. ఆహార కొరత ఏర్పడినప్పుడు అట్టడుగున వాళ్ళకే మొదటి దెబ్బ పడుతుంది. గార్డుల కొరత అయినా అంతే!
జబ్బార్ కి ఇది తొందరగానే అనుభవంలోకి వచ్చింది. శాసన సభ సెషన్ లో ఉంది – గార్డు కొరత. రాజ్ థాకరే ఆగ్రహంగా ఉన్నాడు – గార్డు కొరత. నవరాత్రి ఉత్సవాలు – గార్డు కొరత. మొహర్రం శోకం – గార్డు కొరత. ఛత్రపతి జయంతి – గార్డు కొరత. బాబా సాహెబ్ వర్ధంతి – గార్డు కొరత. గార్డు లేకపోవడం అంటే కోర్టుకు పోకపోవడం అని అర్థం.
అతని దరఖాస్తు కొనలు మెల్లగా చిరిగిపోయి, వెలిసి పోయి, శిధిలమయ్యి, విస్మృతిలోకి జారిపోయింది.
గాఢమైన చీకటి రాత్రుల్లో కూడా మిణుకు మిణుకు మనే గుడ్డి దీపాలు వెలుగుతాయి. జబ్బార్ అంధకార న్యాయంలోకి వెలుగురేఖ – ఒక అపరిచిత న్యాయవాది అనుకోకుండా సెల్ గేటు దగ్గరికి తెచ్చిన “వకాలత్ నామా” రూపంలో వచ్చింది. పెళ్ళికూతురిని చూడకుండానే పెళ్లిళ్లు చేసుకోగలుగుతున్నపుడు, అపరిచిత వ్యక్తికి నీ న్యాయపర అదృష్టాలను వేలిముద్ర వేసి ఇచ్చేయ్యడం ఏం పెద్ద విషయం కాదు. తరవాత అమ్మీ లాయరును పెట్టడానికి ఎలాగో ఒకలాగా పది వేలు సంపాదించిందని తెలిసింది. ఆ డబ్బు జేబులో వేసుకొని, వకాలత్ నామా మీద వేలి ముద్ర పడ్డాక లాయరు కనుమరుగయిపోయాడు. చార్జ్ షీట్ ని పరిశీలించింది లేదు. బెయిల్ కోసం వేసింది లేదు, జబ్బార్ ని మైనరుగా నిర్ధారించగలిగే పరీక్ష చేయమని దరఖాస్తు లేదు. ముఖ్యంగా చివరి పని చాలా సుదీర్ఘకాలం కొనసాగే లాభసాటి వ్యవహారాన్ని వేగంగా తగ్గించగలదు.
ఈలోపు అమ్మీ మంచాన పడ్డది. జబ్బు కన్నా భయంకరమైన విషయం ఆదాయం లేకపోవడం. ఒక్కొక్కరుగా బిల్డింగ్ వాలాలు ఆమెకు బదులుగా వేరేవాళ్ళని పెట్టేసుకున్నారు.
అంతుపట్టని విధంగా రేషన్ కార్డు, గుడిసె కాగితాలను నష్టపోవడం మాత్రం అన్నిటికన్నా పూడ్చలేని నష్టం. అలాంటి “ప్రమాదాలు” సాధారణంగా ఒక మురికివాడను ఖాళీ చేయించడానికి బిల్డర్స్, డెవలపర్లు నియమించిన గూండాల వల్ల జరుగుతాయి. కాగితాలు లేకపోవడం అంటే – గుడిసె యజమాని అర్హతను కోల్పోవడమనే పెను ప్రమాదానికి గురి కావడం. దానర్థం మరికొన్ని లక్షల రూపాయలు వాళ్ళ జేబుల్లోకి వెళ్తాయి.
అమ్మీలకి కూడా వల్లకాని ఒక పరిస్తితి వస్తుంది. విశ్రాంతిగా తలవాల్చడానికి బహుశా ఆమెకు బీహారే కనిపించిందేమో, వెళ్లిపోయింది.
అప్పుడప్పుడు జబ్బార్ కార్చే కన్నీళ్లు, హటాత్తుగానూ నిశ్శబ్దంగానూ ఉంటాయి. అవి తొందరగానే నవ్వులలోకి మారిపోతాయి. జీవితం ముందుకు పోవాలి కదా మరి!
జైల్లో పడ్డ కంపెనీ డాన్ లకి పని చేసే వాళ్ళు కావాలి. బట్టలు ఉతకడం, ఊడ్వడం, తుడవడం, వంట చేయడం, అంట్లు తోమడం, బాస్ కి గాలి విసరడం ఇవన్నీ పని పట్టికలో చేరి ఉంటాయి. జబ్బార్ ని కుదుర్చుకున్నారు. “కష్టపడి పనిచెయ్యి. నీకు లాయర్ ని పెడతాం. నువ్వు బయటికి వెళ్ళాక, పని సంగతి చూద్దాం.”
జబ్బార్ పనికి వెళ్ళాడు. మొదటి రోజు, మధ్యాహ్నం పూట పెద్ద మనిషి తమ్ముడికి గాలి విసిరే ఒక దుర్భర కార్యక్రమం జరిగింది. రెండవరోజు జబ్బార్ ఏకపక్షంగా ఒప్పందం రద్దుచేసుకున్నాడు. కార్పొరేట్ క్రమశిక్షణ అంటే తెలియకపోవడం, చాలా పెద్ద మోతాదులో ఆత్మాభిమానం దెబ్బ తినడం ఈ పరిణామానికి దారితీసింది.
జైలు అధికారులకు “కామ్ వాలా” లు (పనివాళ్లు) కావాలి. బ్యారక్కులు శుభ్రం చేయడం, భోజనం పట్టుకు వచ్చి పంపిణీ చేయడం, సిబ్బందికి చిన్న చిన్న పనులు చేయడం ఇదంతా చాలా పెద్ద పని. పోలీసు పరిపాలనా వ్యవస్థ, కోర్టులు ఎంతో వివేకంతో అందుబాటులోకి తెచ్చిన ఈ తక్కువ వయసు పిల్లల సైన్యం, కావల్సినంత మందిని ఉచిత శ్రమకోసం అందిస్తుంది. కానీ సాధారణంగా “అండా” లో తక్కువ వయసు పిల్లలు ఉండరు. అవసరమైతే వాళ్ళను బచ్చా బ్యారక్ నుండి తెచ్చుకోవాలిసిందే. జబ్బార్ రాకతో సిబ్బంది పంట పండింది. అండాలో తమకే సొంత “కామ్ వాలా” ఉండడం కన్నా కావాల్సిందేమీ లేదు.
అయితే జబ్బార్ అంత తేలిగ్గా దొరికేవాడు కాదు. బ్యారక్ లోపల ఉండే కామ్ వాలా కు ఎన్ని సంతోషాలు, అధికారాలు దక్కుతాయో అర్థం చేయించడానికి కొన్ని నెలల పాటు వివిధ స్థాయిల్లోని సిబ్బంది ప్రయత్నించాల్సి వచ్చింది. ఆఖరి ప్రయత్నం ఒక దుష్ట హవల్ దార్, జబ్బార్ తిరస్కరించలేని ఒక ఆశ చూపించాక సఫలమయ్యింది. జబ్బార్ మా సెల్ నుండి బయటకు వెళ్లిపోయాడు.
త్వరలోనే తన కొత్త పాత్రలో వికసించాడు. ఊడ్చడం, చెత్త ఎత్తి వేయడం ఒక సర్వ శ్రేష్టమైన “గట్టర్ సఫాయ్” కి అంత కష్టమైనది కాదు. బాత్రూం చీపురు మీద గాలిలో గిటార్ వాయించడం, చెత్త డబ్బాల మీద దరువెయ్యడం వంటి వాటితో అతడు దుర్భర పనులకు సంబందించి పనిలో సంతృప్తి, శ్రమకు గౌరవం అనే కాలం చెల్లినవాటికి కొత్త అర్థాలను జోడించాడు.
కామ్ వాలా కి జైల్లో అన్ని చోట్లకీ వెళ్లడానికీ, అందరు బందీలనూ కలవడానికి అవకాశం ఉంటుంది. విస్తృత పరిచయాలు అంటే గ్యాంగులతో సన్నిహిత సంబంధాలు, వాళ్ళ పనులు చేయడానికి అవకాశం, మరింత చరస్ వంటి వాటి సరఫరాలు, జైలు బయటకు వెళ్లాక వృత్తి అవకాశాలు. జబ్బార్ కి భవిష్యత్తులో తనకు దొరికే అవకాశం ఉన్న వాటిని అస్పష్టంగా గుర్తించడం మొదలుపెట్టాడు. ఆ ఆశతోనే తనని తాను ఛోటా డాన్ అని పిలుచుకోవడం మొదలుపెట్టాడు.
మర్డర్ కేసు ఇప్పుడు ఒక ఆస్తి లాగా పరిణమించింది. “నేను కూడా మర్డర్ లోనే వచ్చాను”. అంతకు ముందు ప్రకటించుకున్న నిర్దోషిత్వం స్థానంలో ఇప్పుడు ఎక్కడో కొంచెం మెల్లగా హంతక పాత్రను చొప్పించే కథలు వస్తున్నాయి.
అయితే నేరం అంటే ఇప్పటికీ పెద్ద ఫ్యూడల్ ప్రపంచమే. అక్కడ ప్రభువులు ఇలాంటి కొత్తవాళ్ళని అంత దయగా ఏమీ చూడరు. ముంబై నేర ప్రపంచానికి అనేక ధృవాలు కాబట్టి పరిస్థితులు అంత సులువుగా ఏమీ ఉండవు. ఒక డాన్ తో ఉంటే ఇంకొక డాన్ కు దుస్సహంగా ఉండొచ్చు. కొందరు డాన్ లకు కోపం తెప్పించడానికి నూతన జబ్బార్ కి ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు. అక్కడి నుండి “అండా” బయటికి వెళ్లగొట్టించుకోడానికీ మధ్య ఉన్నది చిన్న అడుగే.
అయితే జబ్బార్ ను అతను నిజంగా ఉండాల్సిన మైనర్ల అబ్జర్వేషన్ హోమ్ కీ పంపలేదు. కనీసం 18-21 మధ్య వయసు వాళ్ళను ఉంచే బచ్చా బ్యారక్ కీ పంపలేదు.
జైలర్ వివేకం అతన్ని మర్డర్ బ్యారక్ కి పంపింది. సెక్షన్ 302 కింద వచ్చే విచారణలో ఉన్న ఖైదీలు ఉంటారక్కడ. కొత్త పాఠశాల, కొత్త ఉపాధ్యాయులు, కొత్త విద్య.
ఇప్పుడు మేము చాలా అరుదుగా కలుస్తాము. కానీ ఎప్పుడు కలిసినా మేము చేసుకున్న ఒప్పందం గుర్తుచేసుకుంటాము.
మేమిద్దరం విడుదలయ్యాక వైఎంసిఏ దగ్గర కలవాలి. తను జిఎం ఖంబా పట్టుకొస్తాడు. నేను బజ్జీలు తేవాలి. మేము పిట్టగోడ మీద కూర్చుని, చల్లని గాలి మైదానం మీదుగా వీస్తూండగా వాటిని సేవిస్తాం.
నా కేసులతో నేను, అతని కేసుతో అతనూ తిప్పలు పడుతూ ఈ ఒప్పందాన్ని ఎప్పుడైనా అమలుచేయగలమా అని ఆలోచిస్తాను.
జబ్బార్ కి శిక్ష పడుతుందా? విడుదలవుతాడా! ఒకవేళ విడుదలయితే సమాజం అతని కోసం దాచి ఉంచిన ఆపదలను తట్టుకోగలుగుతాడా?
మరి నేను! న్యాయ వ్యవస్థ ఇలాగే ఉంటే, అన్ని కేసుల్లో నుండి ఎప్పటికైనా బయట పడగలుగుతానా? లేకపోతే కొత్త సమాజం నన్ను బయటికి తీసే దాకా ఆగవలిసి వస్తుందా?
మెరుగైన న్యాయం అందించే నూతన సమాజంలో కలవడం ఎంత గొప్పగా ఉంటుందీ! అయినా ఒక అనుమానం పీడిస్తోంది. ఆ “రేపు” గాంధీ నైతిక విలువలను తోసిపడేయగలిగేంత సాహసంగా ఉంటుందా!
ఏదో ఒక రోజు స్వేచ్ఛ గా నేను, జబ్బార్, ఇద్దరం జైలు పక్షులం వైఎంసిఏ దగ్గర “చీర్స్” చెప్పుకోవడం చాలా బావుంటుంది.
** **
(రచయిత వెర్నన్ గొన్సాల్విస్ ఈ కథను ఆర్థర్ రోడ్ జైలులో ఉండగా రాశారు. 2007 లో అరెస్టయి, శిక్ష పడి అప్పటి వరకూ గడిపిన ఆరేళ్ళనూ శిక్షాకాలంగా గుర్తించడంతో 2013 లో విడుదలయ్యారు. మళ్ళీ బీమా కోరేగావ్ కేసులో జైలులో గడుపుతున్నారు. బికే-16 (విషాదంగా ఇప్పుడు 15) అందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ …)
(అనువాదం: బి. అనూరాధ)