జులై నెలలో పాలస్తీనాలో ఇజ్రాయేల్ అమలు చేసిన దౌర్జన్య కాండలు – 2

పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, అక్టోబర్ 2023 నుండి గాజాలో కనీసం 1,581 మంది ఆరోగ్య కార్యకర్తల్ని హత్యలు చేశారు. 

ఇజ్రాయెల్ గాజాలోని అనేక ఆసుపత్రులను నాశనం చేసింది. మందులు, వైద్య పరికరాలు, సామాగ్రి ప్రవేశాన్ని తీవ్రంగా అడ్డుకున్నారు. ఆసుపత్రులపై దాడుల సమయంలో వైద్యులు, నర్సులను అరెస్టు చేసి నిర్బంధించారు.  అనేకమంది వైద్యరంగానికి   చెందిన నిపుణులు ఇజ్రాయెల్ హింస, అధికార దౌర్జన్యాల కస్టడీలో మరణించారు. 

“గాజాలో మిగిలి ఉన్న వైద్య నిపుణులు అసాధారణమైన పరిమితుల మధ్య పనిచేస్తున్నారు, మనుగడ కోసం పోరాడు తున్నప్పుడు, తమకు, తమ కుటుంబ సభ్యులకు రోజువారీ హత్యల బెదిరింపులను ఎదుర్కొంటున్నారు” అని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం తెలిపింది. 

“వైద్య నిపుణులపై ఈ దాడులు దాదాపు 200,000 మంది పాలస్తీనియన్లు గాయాల బారిన పడుతున్న, మరణించిన సందర్భంలో జరిగాయి,” .. “చాలా మంది పౌరులు ప్రధానంగా ఇజ్రాయెల్ యుద్ధ పద్ధతులు, పాలస్తీనియన్ల జాతి హనన ఎంపికల ఫలితంగా చనిపోయారు..” అని ఐక్యరాజ్యసమితి  కార్యాలయం జోడించింది. 

జూలై 17న, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ, “అవసరమైన పాలస్తీనా రోగులందరి వైద్య తరలింపును సులభతరం చేయాలని – గాజాకు సురక్షితంగా, స్వచ్ఛందంగా, గౌరవప్రదంగా తిరిగి వచ్చేవారి హక్కును పక్షపాతం లేకుండా కాపాడాలని” ఇజ్రాయెల్‌కు పిలుపు నిచ్చింది.

4,500 కంటే ఎక్కువ మంది పిల్లలతో సహా దాదాపు 11,000 నుండి 13,000 మందికి గాజాలో అందుబాటులో లేని వైద్య చికిత్స అవసరమని స్వచ్ఛంద సంస్థ తెలిపింది. 

“అయినప్పటికీ ఇజ్రాయెల్ అధికారులు వైద్యపరమైన  తరలింపును అభ్యర్థించే వారిలో అతి కొద్దిమందిని మాత్రమే అనుమతించారు, అత్యవసర వైద్య పరిస్థితితో సంబంధం లేకుండా అనేక క్లిష్టమైన కేసులను తాత్సారం చేశారు, పూర్తిగా తిరస్కరించారు.” అని స్వచ్ఛంద సంస్థ జోడించింది. 

“కాలిన గాయాల సంరక్షణ లేదా పునర్నిర్మాణ శస్త్రచికిత్స అవసరమయ్యే రోగులకు పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది.”

అనేక ఆతిథ్య దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇజ్రాయెల్ అధికారులతో చాలా సమన్వయం తర్వాత 22 మంది రోగులను మాత్రమే వైద్యపరంగా వివిధ దేశాలకు తరలించగలిగామని ‘డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్’ తెలిపింది. 

గాజా వెలుపలికి ప్రయాణాలకి అనుమతించవలసిన కోగాట్ అనే ఇజ్రాయెల్ సైనిక సంస్థ అనేక కేసులను తిరస్కరించిందని స్వచ్ఛంద సంస్థ తెలిపింది.

జూలై 16న గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ పంపిణీ స్థలంలో 20 మందిలో కొందరిని తీవ్రంగా చితక్కొట్టి చంపారు, కొందరిని కత్తులతో పొడిచి చంపారు. 

సామూహిక ప్రాణనష్టానికి సాయుధ హమాస్ ఆందోళనకారులే కారణమని గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ ఆరోపించింది. ఆహార సహాయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రజలపై పెప్పర్ గ్యాస్ ప్రయోగించి కాల్పులు జరిపినందుకు గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ గార్డులను, ఇజ్రాయెల్ దళాలను హమాస్ నిందించింది.  

“ఆ ప్రదేశంలోని గార్డులు కేంద్రానికి గేట్లను లాక్ చేసిన తర్వాత వారిపై పెప్పర్ గ్యాస్ చల్లారని, గేట్లు – బయటి వైర్-ఫెన్స్ మధ్య వారిని బంధించారని సాక్షులు రాయిటర్స్ కు తెలిపారు” అని వార్తా సంస్థ నివేదించింది. 

పాలస్తీనియన్ ఎన్జీఓ నెట్‌వర్క్ అధిపతి అమ్జాద్ అల్-షావా రాయిటర్స్‌ తో మాట్లాడుతూ, గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ ప్రదేశాలకు తరలివచ్చే వేలాది మంది ప్రజలు “ఆకలితో అలసిపోయారు, సహాయ కొరతే గాక, గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్కి  సరైన వ్యవస్థీకరణ, క్రమశిక్షణ లేకపోవడం వల్ల వారు ఇరుకైన ప్రదేశాలలోకి నెట్టబడ్డారు” అని అన్నారు. 

జూలై 18న, ఆ ప్రాంతంలోని ఏకైక కాథలిక్ చర్చిపై ఇజ్రాయెల్ దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించిన సందర్భంలో, కార్డినల్ పియర్‌బాటిస్టా పిజ్జబల్లా అనే ఒక విదేశీ ప్రముఖుడు సందర్శన కోసం గాజాలోకి ప్రవేశించారు. జెరూసలేం పాట్రియార్కేట్ ప్రకారం, దాడి సమయంలో చర్చి మైదానంలో దాదాపు 600 మంది నిరాశ్రయులైన ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. 

పోప్ ఫ్రాన్సిస్‌కు చర్చి పరిస్థితిపై క్రమం తప్పకుండా నవీకరణలను అందించే అర్జెంటీనాకు చెందిన పారిష్ పూజారి ఫాదర్ గాబ్రియేల్ రోమనెల్లి అనే ఆయన కూడా దాడిలో గాయపడిన అనేక మందిలో ఉన్నారు. 

పైకప్పుపై ఉన్న ప్రధాన శిలువకు దగ్గరగా ఉన్న చర్చిపై జరిగిన దాడికి “విచ్చలవిడి మందుగుండు సామగ్రి” కారణమని నెతన్యాహు నిందించి, దాడి తర్వాత పోప్ లియోకు ఫోన్ చేశాడు. 

మేము లక్ష్యం కాదని కార్డినల్ పిజ్జబల్లా అన్నారు. ఇక్కడ అందరూ అది నిజం కాదని నమ్మినప్పటికీ [ఇజ్రాయెల్ ప్రజలు] ఇది పొరపాటు అని అంటున్నారు.

గాజాలో మసీదులను  విస్తృతంగా విధ్వంసం చేశారు. “గాజా పారిష్‌లో స్నిపర్తో కాల్చి చంపబడిన ఇద్దరు క్రైస్తవ మహిళలపై దర్యాప్తు, ఏడాదిన్నర గడిచినా ఇంకా ఎటువంటి ఫలితాలు రాలేదని” వాటికన్ అధికారి ఆండ్రియా టోర్నియెల్లి ఇజ్రాయెల్ వాదనపై సందేహాన్ని వ్యక్తం చేశారు. 

మరుసటి రోజు, ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబారి మైక్ హకబీ, వెస్ట్ బ్యాంక్ గ్రామమైన తైబెలోని 5వ శతాబ్దపు చర్చిపై జరిగిన స్థిరనివాసుల దాడిని “ఉగ్రవాద చర్య” గా అభివర్ణించారు, అంతేగాక బాధ్యులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 

జూలై 21న, పోప్ లియో, రమల్లాలోని పాలస్తీనియన్ అథారిటీ అధిపతి మహమూద్ అబ్బాస్‌తో మాట్లాడుతూ, గాజాలో పాలస్తీనియన్ల బలవంతపు తరలింపులను, వారిపై “విచక్షణారహితంగా బలప్రయోగం” చేయడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు.

జూలై 18న, ఇజ్రాయెల్, పాలస్తీనా అధికారులిద్దరకీ “బలవంతంగా అదృశ్యమైన బాధితులందరి వివరాలతో, ఒకవేళ బతికిబయటపడితే, వారి ఆచూకీని తెలియ చేయాలని” ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణులు పిలుపునిచ్చారు. 

వైద్య నిపుణులు, జర్నలిస్టులతో సహా దాదాపు 4,000 మంది పాలస్తీనియన్లు, 51 మంది ఇజ్రాయెలీయులు “అక్టోబర్ 7, 2023 నుండి ఇప్పటికీ కనిపించకుండా పోయారు” అని నిపుణులు తెలిపారు. 

ఇజ్రాయెల్ సైనిక భూ కార్యకలాపాల సమయంలో ఆసుపత్రులు, అరెస్టు చేయబడిన వ్యక్తుల నుండి “ముఖ్యంగా గాజా ఉత్తరం నుండి దక్షిణానికి లేదా చెక్‌పోస్టులు దాటేటప్పుడు చివరిసారిగా కనిపించిన వ్యక్తులతో సహా”, బలవంతపు, అసమ్మతమైన  అదృశ్యాలపై వర్కింగ్ గ్రూప్ కేసులు నమోదు చేస్తూనే ఉందని వారు తెలిపారు.

కానీ బలవంతంగా అదృశ్యమైన పాలస్తీనియన్ల సంఖ్య “చాలా తక్కువగా నివేదించబడింది” అని నిపుణులు చెప్పారు, బాధితుల బంధువులు వారి భద్రత కోసం భయపడి ఈ కేసులను నివేదించడానికి ఇష్టపడడంలేదని అన్నారు. 

“అదృశ్యమైన వారి బంధువుల బాధ, వారి బాధ ఒక రకమైన మానసిక హింసే గాక అమానుషంగా వ్యవహరించడం లాగా  ఉంటుంది” అని నిపుణులు అన్నారు.

జూలై 20న, ఉత్తర గాజాలోని జికిమ్ క్రాసింగ్ సమీపంలో, ఆహార పంపిణీ చేసే ప్రపంచ కాన్వాయ్ కోసం పెద్ద సంఖ్యలో వేచి ఉన్న పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపింది.

“లెక్కలేనన్ని మంది ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద సంఘటన పట్ల మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము, చాలా విచారిస్తున్నాము” అని ఐక్యరాజ్యసమితి ఆ మరుసటి రోజు పేర్కొంది, అంతేగాక “చాలా మంది ప్రాణాంతక గాయాలకు గురయ్యారు” అని చెప్పింది.   

“ఈ ప్రజలు తిండి లేక ఆకలికి మల మల మాడిపోతూ, మరణిస్తున్న పరిస్థితుల్లో తమను, తమ కుటుంబ సభ్యులను పోషించు కోవడానికి ఆహారాన్ని పొందటానికి ప్రయత్నిస్తున్నారు” అని ప్రపంచ ఆహార పంపిణీ సంస్థ జోడించింది.

“దాదాపు ముగ్గురిలో ఒకరు రోజుల తరబడి తినడం లేదు” అని ఆ సంస్థ తెలిపింది. 

“ఆహార సహాయ పంపిణీలో భారీ పెరుగుదల మాత్రమే ఈ పెరుగుతున్న ప్రమాదకర పరిస్థితిని స్థిరీకరించగలదు, విపరీతమైన భయాందోళనలను శాంతపరచగలదు, సరిపడినంత ఆహారం వస్తుందనే నమ్మకం, ఆశలు మాత్రమే ఈ సమాజాన్ని పునర్నిర్మించగలదు.” 

జికిమ్ సంఘటన తర్వాత ఆసుపత్రి అంతులేని ప్రాణనష్టంతో మునిగిపోయిందని, వచ్చిన కేసుల్లో ఎక్కువ భాగం తల లేదా ఛాతీలో గాయపడ్డారని అల్-షిఫా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ముహమ్మద్ అబూ సాల్మియా అన్నారు. 

“అందుబాటులో ఉన్న నివేదికల ఆధారంగా, మే 27 తర్వాత ఒకే చోట, ఒకే రోజున  ఆహారం కోసం నిరీక్షిస్తున్న పాలస్తీనియన్లలో ఇది అత్యధిక మరణాల సంఖ్యగా కనిపిస్తోంది” అని ఐక్యరాజ్యసమితి మానవీయ వ్యవహారాల సమన్వయ కార్యాలయం తెలిపింది.  

జూలై 22న, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ మాట్లాడుతూ సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని డీర్ అల్-బలాలో ఇజ్రాయెల్ కొత్తగా జారీ చేసిన బలవంతపు స్థానభ్రంశం ఆదేశాలు, తీవ్రమైన  దాడులు “ఆకలి బాధలతో ఉన్న పాలస్తీనియన్లకు మరింత విపత్కర పరిస్థితుల్ని కలిగించాయి” అని అన్నారు. 

ఈ ప్రాంతంలో పౌరుల నిర్బంధ సాంద్రత, ఇజ్రాయెల్ అనుసరిస్తున్న “పద్ధతులు – యుద్ధ రీతులను” గమనిస్తూ, వోల్కర్ టర్క్ “చట్టవిరుద్ధమైన హత్యలు, అంతర్జాతీయ మానవ భద్రతా చట్టం, ఇతర తీవ్రమైన ఉల్లంఘనల ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి” అని జోడించారు. 

“ఈ దాడులకు క్లినిక్‌లు, ఇతర వైద్య సౌకర్యాలు కల్పించే ప్రాంతాలు, షెల్టర్‌ హోమ్స్, కమ్యూనిటీ వంటశాలలు, అతిధి గృహాలు, గిడ్డంగులు, ఇతర కీలకమైన మౌలిక సదుపాయాలతో సహా అనేక మానవతా సంస్థల నిలయాల” ను లక్ష్యంగా చేసుకున్నారు  అని ఆయన అన్నారు. 

“ఈ పీడకల మరింత హీనంగా దిగజారడం సాధ్యం కాకపోవచ్చు అనిపించింది. అయినప్పటికీ అది ఇంకా భీభత్సంగా మారుతుంది,”  అని వోల్కర్ టర్క్ గాజాలో ఇజ్రాయెల్ దాడి గురించి అన్నారు. 

జూలై 21న, ఇజ్రాయెల్ రహస్య దళాలు దక్షిణ గాజాలోని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ ఫీల్డ్ హాస్పిటల్ వెలుపల సీనియర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి మార్వాన్ అల్-హామ్స్‌ను అపహరించి నిర్బంధించారు. ఆ సమయంలో ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరపడంతో అల్-హామ్స్‌తో ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్ట్ టామర్ అల్-జానిన్ మరణించగా, మరో జర్నలిస్ట్ గాయపడ్డాడు. 

జూలై 22న, ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆరోగ్య సంస్థ, తరలింపు ఆదేశాలు జారీ చేసిన మరుసటి రోజు, డెయిర్ అల్-బలాలో తన సిబ్బందిని ఉంచిన భవనంపై ఇజ్రాయెల్ దాడిని “తీవ్రమైన పదజాలంతో” ఖండించింది. 

ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆరోగ్య సంస్థ  తన ఉద్యోగుల నివాసాలపై ఇజ్రాయెల్ సైన్యం మూడుసార్లు దాడి చేసిందని, వాటి వల్ల తన సిబ్బంది, వారి కుటుంబాలు “తీవ్రమైన ప్రమాదానికి గురయ్యాయి” అంతేగాక వారికి “అగ్నిప్రమాదం, గణనీయమైన నష్టం” సంభవించిందని పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం “భవనాల ఆవరణలోకి ప్రవేశించింది, మహిళలు, పిల్లలను అల్-మవాసి వైపు వెంటనే కాలినడకన ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళమని బలవంతం చేసింది” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ  తెలిపింది. 

“పురుష సిబ్బంది, కుటుంబ సభ్యులను చేతులకు సంకెళ్లు వేసి, బట్టలు విప్పి, అక్కడికక్కడే విచారించారు, తుపాకీతో పరీక్షించారు” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ  పేర్కొంది. ఈ ఆరోగ్య సంస్థ  తన ప్రకటన జారీ చేసిన సమయంలో ఇద్దరు సిబ్బంది, ఇద్దరు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు, ఒక ఉద్యోగి నిర్బంధంలో ఉన్నాడు. 

జూలై 21న జరిగిన “దాడిలో పేలుళ్లు, మంటలు సంభవించిన తర్వాత” ప్రపంచ ఆరోగ్య సంస్థ  ప్రధాన గిడ్డంగి శిధిలమైపోయింది “తర్వాత ఆకలి, నిరాశా, నిస్పృహలతో అలమటిస్తున్న జనసమూహం అందులోని ఆహార, వస్తువులను తీసుకుపోయారు”. 

ఈ దాడి వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థకు “ఆసుపత్రులు, అత్యవసర వైద్య బృందాలు, ఆరోగ్య భాగస్వాములకు తగినంతగా సహాయం చేయడంలో తీవ్రంగా పరిమితం చేయబడింది, అప్పటికే మందులు, ఇంధనం, పరికరాల కొరత ఉంది.” 

ఐక్యరాజ్యసమితి ఆపరేషనల్ విభాగం అధిపతి జార్జ్ మోరీరా డ సిల్వా జూలై 21న, డీర్ అల్-బలాలోని ఆపరేషనల్ విభాగపు  సెంట్రల్ గాజా ప్రాంగణం దాడికి గురైందని, భవనాలు, మౌలిక సదుపాయాలకు అపారమైన నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. డీర్ అల్-బలా ప్రాంతంలోని ఐక్యరాజ్యసమితి ఆపరేషనల్ ఉద్యోగులు “క్లిష్టమైన ఇంధనం, అనేక రకాలుగా పాలస్తీనియన్లకు సహాయాన్ని అందించడానికి చాలా క్లిష్ట పరిస్థితులలో అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు” అని అన్నారు. 

మార్చిలో అదే ప్రదేశంలో ఇజ్రాయెల్ ఫిరంగి కాల్పులు జరిగాయి, ఒక ఐక్యరాజ్యసమితి ఉద్యోగి మరణించాడు. 

జూలై 27న సహాయక కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తున్న డీర్ అల్-బలా ప్రాంతాన్ని ప్రభావితం చేసే స్థానభ్రంశం ఉత్తర్వులను రద్దు చేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు మానవీయ  సంస్థలకు తెలియజేశారు.

జూలై 22న, మహిళలు, బాలికలపై జరుగుతున్న దారుణమైన హింసలపై ఐక్యరాజ్యసమితి  మహిళా స్పెషల్ రిపోర్టర్ రీమ్ అల్సలేం, గాజాలో జరుగుతున్న “స్త్రీ-జాతి హత్యల” ను ఆపడానికి తక్షణ చర్యలు  తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు, ఇక్కడ చంపబడిన వారిలో మూడింట రెండు వంతుల మంది మహిళలు, బాలికలేనని అంచనాలు తెలియజేస్తున్నాయన్నారు. 

“పాలస్తీనియన్లు కావడం ఒక కారణమైతే, రెండోది మహిళలు కావడం వల్ల పాలస్తీనియన్ స్త్రీలను పెద్ద ఎత్తున, ఉద్దేశపూర్వకంగా, క్రమబద్ధంగా చంపడం అనేది పాలస్తీనియన్లను జాతి విధ్వంసం చేయడానికి ఉపయోగించబడుతుంది” అని పేర్కొంటూ రీమ్ అల్సలేం ఇటీవల ఐక్యరాజ్యసమితి  మానవ హక్కుల మండలికి ఒక నివేదికను సమర్పించారు. 

జాతి హనన కార్యక్రమం యొక్క మానసిక కోణాన్ని గమనిస్తూ, రీమ్ అల్సలేం ముఖ్యంగా పాలస్తీనియన్ తల్లులు భరించే భయానక పరిస్థితులు – వారి పిల్లలు నెమ్మదిగా ఆకలితో అలమటించడం, చంపబడడం, అంగవైకల్యం చెందడం, సజీవంగా పాతిపెట్టబడటం ఇవన్నీ చూసత్యన్న వారిని – ఒకే రోజులో పదే పదే వారిని చంపుతున్నారు” అని అన్నారు. 

దాదాపు 150,000 మంది గర్భిణీ, పాలిచ్చే మహిళలకు గాజాలో అవసరమైన సంరక్షణ అందుబాటులో లేదు, అయితే అంచనా ప్రకారం 17,000 మంది మహిళలు, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 60,000 మంది పిల్లలు “ఇప్పుడు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు” అని రీమ్ అల్సలేం జోడించారు. 

ఇజ్రాయెల్ బేబీ ఫార్ములా ఆహార ప్రవేశాన్ని అడ్డుకుంటుండగా, ఇంధనంపై ఇజ్రాయేల్ నిషేధించడం వల్ల ఇంక్యుబేటర్లలో ఉన్న నవజాత శిశువులు జీవించడానికి అవసరమైన మద్దతును నిలిపివేసే ప్రమాదం ఉంది.

“డజన్ల కొద్దీ శిశువులు పూర్తికాలం ముగియకముందే అకాలంలో జన్మించారు, పుట్టిన వెంటనే మరణించారు, మరికొందరు అపూర్వమైన జన్యు ఉత్పరివర్తన మార్పులతో జన్మించారు, బహుశా ఆకలి, గాయం, రేడియోధార్మిక విష పదార్థాలకు గురికావడం వల్ల ఇటువంటి విపత్కర పరిణామాలు సంభవించవచ్చు,” అని రీమ్ అల్సలెం అన్నారు.  

జూలై 22న, గాజాలో ప్రజలు ఆకలితో ఆహారం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనియన్లను  చంపేస్తుందని అలా ఆకస్మిక హత్యలకు పాల్పడవద్దని  ఐక్యరాజ్యసమితి  మానవ హక్కుల కార్యాలయం హెచ్చరించింది. 

24 గంటల వ్యవధిలో పోషకాహార లోపంతో మరణించిన పదిహేను మంది పాలస్తీనియన్లు ఉండగా, ఆకలి కారణంగా 100 కంటే ఎక్కువగా మరణించిన వారిలో ఎక్కువ మంది పిల్లలున్నారు.  

“ఇంకా చాలా మంది ఆహారం లేకపోవడం వల్ల తీవ్ర అలసటతో ఆసుపత్రులలో మగ్గిపోతున్నారు”… “ఇతరులు వీధుల్లో కుప్పకూలిపోతున్నారు. ఇంకా చాలా మంది నివేదించబడకుండానే చనిపోతుండవచ్చు.”- అని ఐక్యరాజ్యసమితి కార్యాలయం పేర్కొంది.

గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ గాజాలో పనిచేయడం ప్రారంభించిన మే 27 నుండి జూలై 21 మధ్య ఆహారం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ సైన్యం 1,000 మందికి పైగా పాలస్తీనియన్ ప్రజలను చంపింది.

“వీరిలో 766 మంది గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ సైట్ల సమీపంలో, 288 మంది ఐక్యరాజ్యసమితి, ఇతర సహాయ కాన్వాయ్‌ల చుట్టూ మరణించారు” అని ఐక్యరాజ్యసమితి కార్యాలయం తెలిపింది.

“ఇజ్రాయెల్ సైన్యం ఆహారం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులపై కాల్పులు జరపడాన్ని వెంటనే ఆపాలి” అని ఐక్యరాజ్యసమితి కార్యాలయం చెప్పింది. అంతేగాక “ఐక్యరాజ్యసమితి, ఇతర మానవతా వాదుల పనిపై, ఇజ్రాయెల్ చట్టవిరుద్ధమైన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి” అని డిమాండ్ చేసింది.  

జూలై 23న, ఐక్యరాజ్యసమితి లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య సంస్థ యు.ఎన్.ఎఫ్.పి.ఎ (United Nations Population Fund Agency) “గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువులకు సంభవిస్తున్న విపత్కర జనన ఫలితాలు, మొత్తం పాలస్తీనియన్  భావి తరాల మనుగడకే ముప్పు కలిగిస్తున్నాయని” హెచ్చరించింది. 

“తీవ్రమైన ఆహార కొరత, విచ్ఛిన్నమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, మరణపు అంచులలో కలిగే విపరీతమైన మానసిక ఒత్తిడి” – ఈ కారణాల వల్ల ఈ తీవ్ర మానవీయ  సంక్షోభం ఏర్పడిందని ఐక్యరాజ్యసమితి లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య సంస్థ తెలిపింది. 

గాజాలోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటాను ఉదహరిస్తూ, మూడు సంవత్సరాలలో జననాలు 41 శాతానికి పైగా తగ్గాయని ఏజెన్సీ తెలిపింది. 

2025 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో, కనీసం 20 మంది నవజాత శిశువులు పుట్టిన 24 గంటల్లోపు మరణించారు, 33 శాతం మంది పిల్లలు “నెలలు నిండకముందే, అతి తక్కువ బరువుతో  జన్మించారు, ఆ శిశువులు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్‌కు చేరుకోవాల్సిన అవసరం కలిగింది.”  

“ఆరోగ్య సంరక్షణను క్రమపద్ధతిలో లక్ష్యంగా చేసుకోవలసిన  వాతావరణంలో తల్లులు, నవజాత శిశువులు ఎదుర్కొంటున్న తీవ్ర సవాళ్లను గణాంకాలు నొక్కి చెబుతున్నాయి, ఆకలి – ప్రాథమిక అవసరాల లేమి ఈ పరిణామాలకు కారణమవుతున్నాయి” అని యు.ఎన్.ఎఫ్.పి.ఎ  పేర్కొంది. 

జూలై 23న, 130కి పైగా మానవీయ వాద సంస్థలు “వారి స్వంత సహోద్యోగులు, భాగస్వాములు తమ కళ్ళముందే అన్యాయమైపోతున్నారు” అని హెచ్చరించాయి. 

“పాలస్తీనియన్ల నేలను అడ్డుకుంటున్న దారులన్నీటినీ తెరవాలని; సూత్రప్రాయమైన, ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని యంత్రాంగం ద్వారా ఆహారం, స్వచ్ఛమైన నీరు, వైద్య సామాగ్రి, ఆశ్రయం ఏర్పరచుకోవడానికి అవసరమైన వస్తువులు, కావలసిన ఇంధనం యొక్క పూర్తి సరఫరాలను పునరుద్ధరించాలని; ముట్టడిని ముగించాలని ఇజ్రాయేల్ ప్రభుత్వానికీ, తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాలని” మానవీయ వాద సంస్థలు ఇరు ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. 

గాజా వెలుపల, గాజాలో కూడా గిడ్డంగులలో ప్రజలకు అత్యవసరంగా అవసరమైన టన్నుల కొద్దీ ఆహారం, నీరు, వైద్య సామాగ్రి, ఆశ్రయ వస్తువులు, ఇంధనం పేరుకుపోయాయి, కానీ “సంస్థలను వాటిని పంపిణీ చేయనీయకుండా ఇజ్రాయేల్ ప్రభుత్వాధికారులు నిషేధిస్తున్నారు” అని మాన మానవీయ వాద సంస్థలు జోడించాయి. 

“ఇజ్రాయెల్ పూర్తి ముట్టడిలో విధించిన ఆంక్షలు, చేసిన తాత్సారాలు, విచ్ఛిన్నాలు – పాలస్తీనియన్లలో గందరగోళం, తట్టుకోలేని ఆకలి,  తద్వారా లెక్కలేనన్ని మరణాలను సృష్టించాయి” అని మానవీయ వాద సంస్థలు చెప్పాయి.  

సహాయాన్ని పెంచడానికి ఇజ్రాయెల్, యూరోపియన్ యూనియన్లు  జూలై 10న చేసిన ప్రకటనను సంస్థలు గుర్తించాయి “కానీ గాజా నేలపై నిజమైన మార్పులేమీ కనపడనప్పుడు ఈ సహాయ “పురోగతి” వాగ్దానాలు పచ్చి అబద్ధాలుగానే మిగిలిపోయాయి” అని మానవీయ వాద సంస్థలు తెలిపాయి. 

“ఆయుధాలు, మందుగుండు సామగ్రి బదిలీని నిలిపివేయడం వంటి నిర్దిష్ట చర్యలను రాష్ట్రాలు వెంటనే ఆపి, ముట్టడిని ముగించడానికి తక్షణం ప్రయత్నించాలి” అని మానవీయ వాద సంస్థలు పేర్కొన్నాయి.

జూలై 24న, ఐక్యరాజ్యసమితి  మానవ హక్కుల నిపుణులు వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనా రైతులు, గ్రామీణ కార్మికులపై ఇజ్రాయెల్ రాజ్యం, స్థిరనివాసుల హింసను అంతం చేయాలని పిలుపునిచ్చారు. 

“మామీద విస్తృతంగా జరుగుతున్న బెదిరింపులు, హింస, మా భూములను ఆక్రమించుకోవడం, మా జీవనోపాధిని నాశనం చేయడం -వీటన్నిటి పరాకాష్ఠగా కమ్యూనిటీలను బలవంతంగా స్థానభ్రంశం చేయడం పట్ల మేము తీవ్రంగా కలత చెందుతున్నాము. ఇది మా పాలస్తీనియన్లను మాభూమి నుండి వేరు చేస్తుందని, మా ఆహార భద్రతను దెబ్బతీస్తుందని మేము చాలా ఆందోళన చెందు తున్నాము.” అని వారు చెప్పారు.

“స్థిరవాసుల హింసలో దౌర్జన్యంగా ఇళ్ళు కాల్చి వేయడం, పశువుల్ని దొంగిలించుకుపోవడం, నీటి వనరులను విషపూరితం చేయడం వంటి దుష్ట చేష్టల వల్ల పాలస్తీనియన్లు తమ వ్యవసాయ జీవన విధానాన్ని కొనసాగించే సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి” అని నిపుణులు జోడించారు. 

ఇటువంటి దాడులు అక్టోబర్ 2023 నుండి  2024 డిసెంబర్ మధ్య వెస్ట్ బ్యాంక్‌లో $76 మిలియన్ డాలర్ల ప్రత్యక్ష వ్యవసాయ

నష్టాన్ని కలిగించాయని నిపుణులు తెలిపారు. వెస్ట్ బ్యాంక్‌లో స్థూల దేశీయోత్పత్తి 19 శాతానికి పైగా తగ్గిందని, నిరుద్యోగం రేటు 35 శాతానికి పెరిగిందని అంచనా వేశారు. 

“పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కులు మరియు అంతర్జాతీయ చట్టాన్ని పూర్తిగా గౌరవించే ప్రాతిపదికన వెస్ట్ బ్యాంక్‌ను పాలస్తీనా నియంత్రణలో ఉంచడం చాలా అవసరం” అని నిపుణులు అన్నారు.

జూలై 25న, అమెరికన్ ప్రభుత్వ అంతర్గత సమీక్షలో వాషింగ్టన్ నిధులు సమకూర్చిన మానవీయ వాద సామాగ్రిని హమాస్ క్రమబద్ధంగా దొంగిలించిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ఇది సైనికీకరించబడిన గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఆ దేశం, ఇజ్రాయెల్ ఇచ్చిన ప్రధాన హేతువును సవాలు చేస్తుంది. 

అక్టోబర్ 2023 నుండి మే 2025 మధ్య అమెరికా నిధులు సమకూర్చిన సామాగ్రిని హమాస్ దొంగిలించిందని ప్రచారం చేస్తున్న 150 కంటే ఎక్కువ కేసులను రాయిటర్స్ విశ్లేషణ పరిశీలించింది. 

“రాయిటర్స్ చూసిన ఫలితాల స్లయిడ్ ప్రజెంటేషన్ ప్రకారం, హమాస్ అమెరికా  నిధులు సమకూర్చిన సామాగ్రిని ఉపయోగించిందని ఆరోపించే నివేదికలు ఏవీ కనుగొనబడలేదు” అని ఏజెన్సీ నివేదించింది.

వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు ఈ నివేదిక ఉనికిపై సందేహం వ్యక్తం చేస్తూ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “మానవీయ వాద ఎజెండా” ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్న ‘బహుశా ఒక లోతైన రాష్ట్ర కార్యకర్త  ద్వారా తయారు చేయబడి ఉండవచ్చు’ అని రాయిటర్స్‌ తో అన్నారు. 

జూలై 26న, గాజాలో మానవీయ వాద కారిడార్ల ఏర్పాటును ఇజ్రాయెల్ ప్రకటించింది. అదికూడా యుద్ధంలో వ్యూహాత్మక విరామాలను పాటిస్తామని, పెరుగుతున్న కరువుపై అంతర్జాతీయ ఒత్తిడి ఎక్కువగా ఉంది కాబట్టి పరిమిత పరిమాణంలో ఆహారాన్ని విమానాల ద్వారా కిందికి పడవేయడానికి అనుమతిస్తామని ఇజ్రాయెల్ చెప్పింది. 

పాలస్తీనా రక్షణ క్లస్టర్ ఈ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు పేర్కొంది, అయితే “చిత్తశుద్ధి లేని సూత్రబద్ధ వ్యతిరేకమైన  సమన్వయంతో కూడిన మానవీయ వాద సహాయానికి  ఎయిర్‌డ్రాప్‌లు సరిపోని ప్రత్యామ్నాయం” అని పేర్కొంది. 

అవి పాలస్తీనా పౌరులకు గాయాలు, మరణాలు కలిగించే ప్రమాదాన్ని కలిగిస్తాయి. “గాజా లోపల విస్తృతమైన అవసరాలను తీర్చడానికి ఎయిర్‌డ్రాప్‌లు తగినంత స్థాయిలో ఉండవు, అంతేగాక అవసరమైనంతమేరకు ప్రజలకు ఆహార, తదితర వస్తువులను అర్ధవంతంగా, సులభతరంగా  సహాయం  చేయడం  అనేది, ఇజ్రాయెల్ చట్టపరమైన బాధ్యతల నుండి సులభతరంగా వైదొలగే ప్రమాదం ఉంది.” అని రక్షణ క్లస్టర్ పేర్కొంది. 

రక్షణ క్లస్టర్ పేర్కొన్నట్లు గానే జూలై 27 రాత్రి సమయంలో కిందకు పడిపోయిన సహాయం గుడారాలపై పడిందని, “భారీ బాంబు దాడులకు గురైన దెబ్బతిన్న భవనాలు, ఆ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను  గాయపరచడం, పేలుడు మందుగుండు పదార్థాల ద్వారా అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నించే పాలస్తీనియన్లను గాయపరచడం, మరణాలకు గురిచేయడం లాంటి ప్రమాదాలకు గురి చేసింది” అని రక్షణ క్లస్టర్ నివేదిక తెలిపింది. 

“గాజాలోని జనసాంద్రత గల ప్రాంతాలలో నిన్న రాత్రి అమలు చేయబడిన ఎయిర్‌డ్రాప్‌ల సహాయం ప్రజల అవసరాలను  తీర్చడానికి ఏమాత్రం సరిపోక పోగా, పైపెచ్చు దానికి  బదులుగా ఈ పద్ధతి పాలస్తీనియన్లకు అన్యాయంగా, న్యాయ విరుద్ధంగా, అనూహ్యంగా, భరించరాదిగా,  ప్రమాదకరంగా మారింది” అని రక్షణ క్లస్టర్ జోడించింది.

జూలై 27న, ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాలో 2025లో నమోదైన 74 పోషకాహార లోపం సంబంధిత మరణాలలో 63 జూలైలో సంభవించాయని తెలిపింది.  వాటిలో “5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 24 మంది చిన్నారులు, 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఒక చిన్నారి బాలుడు, 38 మంది పెద్దవాళ్ళు  ఉన్నారు.” అని తేల్చింది. 

“వీరిలో ఎక్కువ మంది ఆరోగ్య కేంద్రాలకు చేరుకునే లోపే, లేదా చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే  మరణించినట్లు ప్రకటించారు.  వారి శరీరాలు తీవ్రమైన పోషకాహార క్షీణతకు బలైనట్లుగా స్పష్టమైన సంకేతాలను చూపిస్తున్నాయి” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ  ప్రకారం “గాజా నగరంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఐదుగురు పిల్లలలో ఒకరు ఇప్పుడు తీవ్రంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.” “ఖాన్ యూనిస్ ప్రాంతంలోనూ, మిడిల్ ఏరియాలో కూడా పోషకాహార లోపంతో మరణపు అంచుల్లోకి వెళ్ళే వారి సంఖ్య ఒక నెలలోపు రెట్టింపు అయ్యాయి” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా తెలిపింది.

 ఈ గణాంకాలు “చాలా తక్కువగా అంచనా వేసి కూడా చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే అనేక కుటుంబాలు ఆరోగ్య కేంద్రాలను చేరుకోకుండా ఇజ్రాయేలీ అధికారులు నిరోధిస్తున్నారు. భద్రతా పరిమితుల కారణంగా కూడా ప్రజలు కాలు కదపడానికి భయపడుతూ ఉండవచ్చు” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

జూలై 29న, “సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి ఆహార వినియోగం, పోషకాహార సూచికలు అత్యల్ప స్థాయికి చేరుకున్నందు వల్ల గాజా కరువు ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది” అని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు పేర్కొన్నాయి. 

“గాజాలోని మూడు కరువు ప్రాంతాలలో రెండిటిని పూర్తిగా  ఉల్లంఘించారు” అని తాజా ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ అలర్ట్ చెప్పింది.  

గాజా జనాభాలో 39 శాతం మందిలో ముగ్గురిలో ఇద్దరు “ఇప్పుడు తినకుండా రోజులు గడుపుతున్నారు” అని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు పేర్కొన్నాయి. 

“500,000 కంటే ఎక్కువ మంది అంటే గాజా జనాభాలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది – భీకర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు, మిగిలిన జనాభా అత్యవసర స్థాయి ఆకలిని ఎదుర్కొంటోంది.”

“గాజాలో తీవ్రమైన పోషకాహార లోపం – రెండవ ప్రధాన కరువు సూచిక – అసాధారణమైన, వికృతమైన, అత్యంత హీనమైన స్థాయిలో రోజురోజుకీ పెరిగిపోతోంది” అని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు జోడించాయి.

“గాజాలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలందరూ “తీవ్రమైన పోషకాహార లోప ప్రమాదంలో ఉన్నారు, వేలాది మంది పెద్దలు కూడా ఘోరమైన, ప్రమాదకర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు, ఇది అత్యంత ప్రాణాంతకమైన పోషకాహార లోపం” అని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు చెప్తున్నాయి. 

జూలై 29న, “ఇజ్రాయెల్ పాలస్తీనియన్లను చంపడానికి నీటి సరఫరాని నిషేధించి దాహాన్ని కూడా ఒక ఆయుధంగా ఉపయోగిస్తోంది” అని ఐక్యరాజ్యసమితి   మానవ హక్కుల నిపుణులు అన్నారు. 

“నీరు, ఆహారాన్ని నిలిపివేయడం అనేవి నిశ్శబ్దంగా ఉంటాయి గానీ అవి ప్రాణాంతకమైన బాంబులు, ఇవి ఎక్కువగా పిల్లలు, శిశువులను చపుతాయి.” — అన్ని మధ్యధరా ఓడరేవుల నుండి ఇంధనం, నీరు, సరఫరాలే గాక సిబ్బందితో సహా సహాయాన్ని ఆపివేయాలని పిలుపునిచ్చారు  అని మానవ హక్కుల నిపుణులు అన్నారు. 

“శిశువులు తమ తల్లుల చేతుల్లో చనిపోతున్నట్లు చూడటం భరించలేనిది. ఈ బాధ కొనసాగుతుండగా ప్రపంచ దేశాల అగ్ర, ప్రజాస్వామికంగా పాలిస్తున్నామని  చెప్పుకునే నాయకులు ఎలా నిద్రపోగలుగుతున్నారు?” ఆధునిక యుగంలో జీవిస్తున్న వీళ్ళకు మనిషి లక్షణాలున్నాయా? 

ఇజ్రాయెల్ విధానాలను బహిరంగంగా ఖండించకపోవడం వల్ల విమర్శలు ఎదుర్కొంటున్న హింసపై ఐక్యరాజ్యసమితి స్పెషల్ రిపోర్టర్ ఆలిస్ ఎడ్వర్డ్స్ అనే మహిళ “ఆహారం, నీరు లేకపోవడం వల్ల కలిగే మానసిక ప్రభావం సహజంగానే చాలా క్రూరమైనది” అని అన్నారు. 

“నిరంతరం మారుతున్న నియమాలు, సైనికీకరించిన పంపిణీలు, ఈ ప్రాథమిక అవసరాలను ఎప్పుడు తీర్చబోతున్నారనే దానిపై  ప్రతి గంట గంటకు మారుస్తున్న ఇజ్రాయేల్ విధానాలు పాలస్తీనా పౌరులకు తీవ్ర నిరాశ, ఒత్తిడి, భయానకంగా మానసిక గాయాలను  కలిగిస్తున్నాయి” అని ఆమె జూలై 30న తన ప్రకటనలో జోడించారు.  

జూలై చివరి రోజున, ఇజ్రాయెల్ సైన్యం రక్షణలో ఉన్న యూదు వలసదారులు వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా అథారిటీ కేంద్రమైన రమల్లా ప్రాంతంలోని మూడు గ్రామాలపై దాడి చేశారు. 

సెటిలర్లు నిప్పంటించిన వాహనాలను ఆర్పడానికి ప్రయత్నించినప్పుడు 40 ఏళ్ల అబ్దులతీఫ్ అయ్యద్ ఊపిరాడక మరణించారని పాలస్తీనా అధికారిక వార్తా సంస్థ వాఫా నివేదించింది. 

వాఫా ప్రకారం, ఈ సంవత్సరం ఇప్పటివరకు వెస్ట్ బ్యాంక్‌లో సెటిలర్లు 2,150 కంటే ఎక్కువ దాడులు చేశారు, దీని ఫలితంగా నలుగురు పాలస్తీనియన్లు మరణించారు. 

వారిలో జూలై 28న, సౌత్ హెబ్రాన్ హిల్స్‌లోని ఉమ్ అల్-ఖైర్ అనే గ్రామంలో సెటిలర్ యినన్ లెవి కాల్చి చంపాడని చెప్తున్న ప్రముఖ కార్యకర్త అవ్దా హతలీన్ కూడా ఉన్నారు. 

గాజాలో భవనాలను ధ్వంసం చేస్తున్న సైన్యం కోసం పనిచేసిన లెవిని అరెస్టు చేసి, నిర్లక్షంగా  నరహత్య చేశాడనే కపట అభియోగం మోపి, కొన్ని రోజుల తర్వాత గృహ నిర్బంధం నుండి విడుదల చేశారు. 

హతలీన్‌ను ఉమ్ అల్-ఖైర్‌లో కాకుండా యట్టా నగరంలో ఖననం చేయాలని, అంత్యక్రియలకు 15 మంది మాత్రమే హాజరుకావాలని, అతని కుటుంబం ఈ షరతులకు అంగీకరిస్తేనే, హతలీన్ మృతదేహాన్ని అప్పగిస్తామని ఇజ్రాయెల్ సైన్యం నిలిపివేసి, బెదిరించింది. 

హతలీన్ హత్య తర్వాత నిర్మించిన సంతాప గుడారాన్ని సైన్యం మూసివేసి, దానిని  సైనిక జోన్‌గా ప్రకటించింది. “గ్రామ నివాసితులు కాని జర్నలిస్టులు, కార్యకర్తలు, పాలస్తీనియన్లను బలవంతంగా అక్కడనుంచి గెంటి వేసింది.” అని హారెట్జ్ పత్రిక తెలిపింది. 

జనుటా గ్రామం నుండి పాలస్తీనియన్లను బలవంతంగా తరలించడంలో లెవీ నిర్వహించిన దుష్టపాత్రకు గత సంవత్సరం అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలు లెవీపై ఆంక్షలు విధించాయి. 

జూన్‌లో హతలీన్‌ జీవించి ఉన్నప్పడు కాలిఫోర్నియాలోని యూదు సమూహాలతో మాట్లాడటానికి ఆహ్వానించారు. కానీ తర్వాత హతలీన్‌ను అమెరికాలోనికి  ప్రవేశించరాదని  నిరాకరించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ట్రంప్ పరిపాలన మొదలయ్యాక లెవీపై ఆంక్షలను అమెరికా తొలగించింది. 

జూలై 30న, అవధ్ హతలీన్ హత్య తర్వాత, “ఇజ్రాయెల్ భద్రతా దళాల అంగీకారంతో, మద్దతుతో, కొన్ని సందర్భాల్లో వాటి భాగస్వామ్యంతో కూడా పాలస్తానీయుల మీద స్థిరనివాసులు పెంచుతున్న హింసల వల్ల ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఒత్తిడి, ఉద్రిక్త వాతావరణం రోజు రోజుకీ మరింత హీనంగా దిగజారుతుంది”  అని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం పేర్కొంది. 

జూలై 24-26 మధ్య, సెటిలర్లు బెత్లెహెం ప్రాంతంలోని 17 పాలస్తీనియన్ పశువుల కాపరుల కుటుంబాలను వారి ఇళ్ల నుండి బలవంతంగా తరిమేశారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం తెలిపింది.

“సెటిలర్లు, పాలస్తీనా పౌరులను వారు గనక వారి నివాసాలను విడిచిపెట్టకపోతే, చంపేస్తామని బెదిరించారు. పాలస్తీనియన్ ఆస్తులను ధ్వంసం చేశారు, వారందరికీ నీటి సరఫరాను నిలిపివేశారు” అని మానవ హక్కుల కార్యాలయం తెలుపుతూ, ఇజ్రాయెల్ దళాలు వారిని రక్షించలేకపోతున్నాయని నివాసితులకు తెలియజేసినట్లు పేర్కొంది. 

ఇవి గాక, నాలుగు సంవత్సరాల విరామం తర్వాత, ఇజ్రాయెల్ అధికారులు “E1 అనే స్థిర నివాస భవనాల నిర్మాణ ప్రణాళికల అమలును తిరిగి ప్రారంభించారు, ఇందులో ఆక్రమిత తూర్పు జెరూసలేం – మాలే అడుమిమ్ మధ్య స్థిరనివాసుల కోసం 3,400 కంటే ఎక్కువ గృహ యూనిట్ల నిర్మాణం ఇజ్రాయెల్ చేపట్టబోతుంది.” ఐక్యరాజ్యసమితి హక్కుల కార్యాలయం చెప్పింది

గత వారంలో ఇజ్రాయెల్ దళాలు ఎనిమిది మంది పాలస్తీనియన్లను చంపాయి, వారిలో ఐదుగురు బాలురు కూడా ఉన్నారు, “వారు ఏ తప్పూ చేయకపోయినా వారిని కాల్చి చంపారు” అని ఐక్యరాజ్యసమితి కార్యాలయం చెప్పింది. 

జూలై 23న, ఇజ్రాయెల్ పార్లమెంట్ – నెస్సెట్, ప్రభుత్వం అధికారికంగా వెస్ట్ బ్యాంక్‌కు సార్వభౌమత్వాన్ని విస్తరించాలని పిలుపునిచ్చే తీర్మానాన్ని భారీ మెజారిటీతో ఆమోదించింది. 

“ఏ విషయాన్నీ పట్టించుకోకుండా, దేన్నీ లెక్క చెయ్యకుండా ఇజ్రాయెల్ తనకి తాను చేసుకున్న చట్టం ప్రకారం చేసుకున్న ఈ తీర్మానం అధికారిక వెస్ట్ బ్యాంక్‌ సార్వభౌమత్వ విలీనాన్ని సమర్థించుకుంది. కానీ, ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఘోరంగా, తీవ్రంగా ఉల్లంఘించడం అవుతుంది” అని ఐక్యరాజ్యసమితి హక్కుల కార్యాలయం చెప్పింది. 

జూలై 30న ఇజ్రాయెల్ మితవాద స్థిరనివాసులు గాజా సరిహద్దు వైపు కవాతు చేశారు. 

జూలైలో వెస్ట్ బ్యాంక్‌లో ఎనిమిది మంది పాలస్తీనా పిల్లలను ఇజ్రాయెల్ దళాలు చంపేశాయి. 

జూలై 6న ఉత్తర వెస్ట్ బ్యాంక్‌లోని అస్కార్ శరణార్థి శిబిరం సమీపంలో సాయుధ సైనిక వాహనంలో నుండి ఇజ్రాయెల్ సైనికుడు ఇయాద్ షల్ఖ్తిని (14) కాల్చి చంపాడు. ఇయాద్‌ను అక్కడినుంచి పంపడానికి ప్రయత్నించిన బాలుడి స్నేహితులపై సైనికులు కాల్పులు జరిపారు, ఈ ఘటనలో ఒక బాలుడి చేతికి, మరొక బాలుడి పాదానికి బాగా గాయాలయ్యాయి. 

జూలై 9న ఇయాద్ గాయాలతో మరణించాడు. 

ఉత్తర వెస్ట్ బ్యాంక్‌లోని యాబాద్‌ గ్రామంలో సైనికుల బృందం పాలస్తానీయుల స్థానాలను ఆక్రమించుకున్నారన్న విషయం తెలియని 13 ఏళ్ల అమ్ర్ ఖభా అటువైపు నడుస్తున్నప్పుడు అతన్ని కాల్చి చంపేశారు. “అమ్ర్ వెనక్కి తిరిగి, కవర్ చేసుకోవడానికి ప్రయత్నించగా, సైనికులు 10 మీటర్ల దూరం నుండి అతనిపై ప్రత్యక్ష మందుగుండు సామగ్రితో కాల్పులు జరిపారు” అని పాలస్తీనా డిఫెన్స్ ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ తెలిపింది. 

సైనికులు వైద్యులను ప్రథమ చికిత్స చేయకుండా అడ్డుకున్నారు.  అమ్ర్ తండ్రి, అమ్ర్ వద్దకు అతి కష్టంగా చేరుకుని ఆలింగనం చేసుకున్న తర్వాత అతని చేతులకు సంకెళ్లు వేసి కొట్టారు, ఆ సమయంలో అమ్ర్ ఇంకా బతికే ఉన్నాడని తండ్రి చెప్పాడు. అమ్ర్ తండ్రిని దాదాపు 40 నిమిషాల పాటు రక్తస్రావంతో ఉన్న తన బిడ్డ పక్కనే ఉంచారు

“అమ్ర్ చనిపోయాడని సైనికులు నిర్ధారించుకున్న తర్వాత, వారు అంబులెన్స్‌ దగ్గరకు తీసుకెళ్ళి యాబద్ ప్రభుత్వ అత్యవసర కేంద్రానికి తీసుకెళ్లడానికి అనుమతించారు, తర్వాత జెనిన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను అక్కడికి చేరుకునేలోపే మరణించినట్లు ప్రకటించారు” అని పాలస్తీనా డిఫెన్స్ ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. 

జూలై 22న ఉత్తర వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ సమీపంలోని ఖబాటియాలో జరిగిన దాడిలో ఇజ్రాయెల్ దళాలు 15 ఏళ్ల ఇబ్రహీం అలీ నాస్ర్‌ను కాల్చి చంపాయి. పాలస్తీనా డిఫెన్స్ ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ ప్రకారం, ఇబ్రహీం అలీ, మరొక బాలుడు వారి నుండి తప్పించుకోవాలని పారిపోతుండగా సైనికులు 10 నుండి 15 మీటర్ల దూరం నుండి ఆ బాలుడిని కాల్చి చంపారు.

జూలై 23న వెస్ట్ బ్యాంక్ నగరం బెత్లెహెం సమీపంలోని అల్-ఖాదర్ పట్టణంలో ఇజ్రాయెల్ దళాలు అహ్మద్ సలాహ్ (15), ముహమ్మద్ ఇస్సా (17) లను కాల్చి చంపాయి. 

పాలస్తీనా – డిఫెన్స్ ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ ప్రకారం, “అహ్మద్, ముహమ్మద్ మోలోటోవ్ కాక్‌టెయిల్స్‌ను బైపాస్ రోడ్డు వైపు విసిరినట్లు ఆరోపణలు ఉన్నాయి”. అంబులెన్స్ సిబ్బందిని అబ్బాయిల వద్దకు రాకుండా సైనికులు అడ్డుకున్నారు, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

జూలై 23న, ఉత్తర వెస్ట్ బ్యాంక్ నగరం నాబ్లస్ సమీపంలోని అల్-ఐన్ శరణార్థి శిబిరంలో జరిగిన దాడిలో ముహమ్మద్ మబ్రూక్ (15)ను ఉద్దేశపూర్వకంగా ఒక సైనికుడు లక్ష్యంగా చేసుకుని అతని తొడపై  పేల్చివేశాడు. ముహమ్మద్‌ను పైకి లేపడానికి ప్రయత్నించిన యువకుడిపై కూడా ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపాయి, కానీ అతను కూడా కాల్పులకు గురై విపరీతంగా  గాయపడ్డాడు. జూలై 25న ముహమ్మద్ గాయపడ్డాడని పాలస్తీనా డిఫెన్స్ ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. 

జులై 24న, ఇజ్రాయెల్ దళాలు ఉత్తర వెస్ట్ బ్యాంక్‌లోని అరబా పట్టణం సమీపంలో ఇబ్రహీం హమ్రాన్ (13) ను కాల్చి చంపాయి. ఖబాటియా నుండి వెనక్కి తిరిగి వెళుతున్న సైనిక వాహనాలపై రాళ్ళు విసిరిన పిల్లలపై, సైనికులు సైనిక వాహనాల నుండి దిగి పిల్లలపై నేరుగా కాల్పులు జరిపారు. 

డిఫెన్స్ ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్-పాలస్తీనా ప్రకారం, ఈ సంవత్సరం ఇప్పటివరకు వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దళాలు 38 మంది పాలస్తీనా పిల్లలను చంపాయి, 2023 అక్టోబర్ 7 నుండి ఇజ్రాయెల్ దళాలు, ఆ భూభాగంలో స్థిర నివాసులు 212 మంది పాలస్తీనా పిల్లలను చంపినట్లు పేర్కొంది. 

“జూన్ 2016 నుండి ఇజ్రాయెల్ దళాలు కనీసం 53 మంది పాలస్తీనా పిల్లల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి” అని డిఫెన్స్ పాలస్తీనా డిఫెన్స్ ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ తెలిపింది. “ఆరుగురి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించగా, 47 మంది పాలస్తీనా పిల్లల మృతదేహాలను ఇజ్రాయెల్ అధికారులు దాచి ఉంచారు.”

జూలై 31న, “కొన్ని రోజుల క్రితం సైన్యం “మానవీయ విరామాలు” ఇస్తున్నట్లు ప్రపంచదేశాలకు కనిపించడానికి ఇజ్రాయెల్ కాల్పుల విరమణను నాటకీయంగా ప్రకటించింది. అయినప్పటికీ ఆహార కాన్వాయ్ మార్గాల్లో, హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ సమీపంలో పాలస్తీనియన్లు వేచి ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనియన్లను కాల్పులు, షెల్లింగ్‌లకు ఘోరంగా బలి చేస్తూనే ఉంది” అని ఐక్యరాజ్యసమితి  మానవ హక్కుల కార్యాలయం చెప్పింది. 

జూలై 30 – 31 తేదీల మధ్య గాజాలో ఆకలి తీవ్రతరం కావడంతో, కాన్వాయ్ మార్గాల్లో, హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ప్రాంతాల్లో గుంపులుగా నిరీక్షిస్తున్న పాలస్తీనా పౌరులపై, తన మాటకి తానే కట్టుబడకుండా ఇజ్రాయేల్ సైన్యం జరిపిన భీకర దాడుల్లో 100   మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు, అంతేగాక 680 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం తెలిపింది.

మే 27 నుండి గాజాలో ఆహార సహాయం కోరుతూ నిలబడిన పౌరుల్లో కనీసం 1,373 మంది మరణించారు. 

“ఇజ్రాయెల్ విధించిన ప్రత్యక్ష విధానాల ఫలితంగా, గాజా స్ట్రిప్‌లో ప్రాణాలను రక్షించే సహాయం ఎవరు చేయబోయినా మోసపు వాగ్ధానాలతో తిరస్కరిస్తూ పరమ ఘోరంగా, దౌర్జన్యంగా ఇజ్రాయేల్ అడ్డుకుంది.” అని “ఈ మానవతా విపత్తు మానవ నిర్మితమైనది” అని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం ఆవేదన చెందింది. 

“అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనలను ఆపడానికి, పౌరులు మరింతగా హత్యలకు గురికాకుండా ఉండటానికి, చట్టపరమైన, నైతిక బాధ్యతలను నెరవేర్చడానికి దేశాలు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించాలి” అని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం పేర్కొంది. 

(మౌరీన్ క్లేర్ మర్ఫీకి ధన్యవాదాలతో  శివలక్ష్మి)

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

Leave a Reply