ఈ భీకర సంక్షోభకాలంలో ఎక్కడున్నా, ఏంచేస్తున్నా పాలస్తీనా కళ్ళల్లో మెదులుతూ ఊపిరి సలపనివ్వడం లేదు. పాలస్తీనా ప్రజలు, మహిళలు, పసిపిల్లల గురించి చదువుతూ అదే పనిగా అక్కడక్కడా వెతుకుతున్న క్రమంలో పాలస్తీనాలో జరిగిన, జరుగుతున్న ఘోరకలి నన్ను నిలువునా దుఃఖంలో ముంచెత్తింది. Electronic Intifada లో ఆగస్టు 4న Maureen Clare Murphy రాసిన “Palestine in Pictures” ని తీసుకుని స్వేచ్ఛానువాదం చేశాను. ఆమె ఒక నెలలో జరిగిన మహా విలయాన్ని హృద్యంగా బొమ్మలతో చిత్రిక పట్టింది. ఏదో ఒక సంఘటన కాకుండా ఇలా ఒక నెల మొత్తంలో ఇజ్రాయేల్ అమలు చేసిన దుష్ట, దుర్మార్గ చేష్టలు అందరికీ తెలియపరిస్తే మంచిదనిపించింది. ఒక్కొక్క సంఘటన చదువుతుంటే వరదలా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. వెంటనే రాయలేక, మధ్య మధ్యలో ఆపుతూ, నన్ను నేను సంబాళించుకుని మళ్ళీ మొదలు పెట్టి పూర్తి చేశాను. ఏవేవో యుద్ధాలు చరిత్రలో జరిగాయని చదువుకోవాడమే గాని ఇప్పుడు మనకళ్ళముందు ఈ ఆధునిక కాలంలో ఇంతంత దుష్ట, దుర్మార్గ చేష్టలతో పిల్లల కాళ్ళు నరకడం, మనుషుల్ని ఆకలికి మలమల మాడిపోయేలా చేసి చంపడం అమ్మో ఇది యుద్ధం కాదు. నిరాధారంగా ఉన్నమనుషుల మీదా, పసి బిడ్డలమీదా కసిగా కక్ష తీర్చుకోవడానికి సాధారణ ప్రజలు ఏమి చేశారు?
నేను ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 న మానవ హక్కుల దినోత్సవం సందర్భంలో ఐక్యరాజ్యసమితి చెప్పే మానవ హక్కుల గురించి చదువుతుంటాను. “మనం ఎవరిమైనప్పటికీ, ఎక్కడినుండి వచ్చినప్పటికీ, మన తరగతి, మన అభిప్రాయాలు, మన లైంగికత్వం ఏవైనప్పటికీ – వాటితో ఏమీ సంబంధం లేకుండా మనుషులందరికీ మానవ హక్కులు అన్ని వేళల్లోనూ అమలవుతాయని మేము ప్రకటిస్తున్నాం.” అని ఐక్యరాజ్యసమితి చెప్పింది. ప్రతి సంవత్సరం ఒక థీమ్ ని ప్రకటిస్తూ, సాధించవలసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యా లంటూ ఇంకా చాలా చెప్తూ ఉంటుంది గానీ క్లుప్తంగా చెప్పుకోవాలంటే “ప్రపంచ ప్రజలందరికీ సమానత్వం, స్వేఛ్చ, న్యాయం సాధించడమే తన లక్ష్యాలని చెప్పుకుంది. అవి చదువుతున్నప్పుడు ఆహా, ఏ మూల, ఎవరికి, ఏమి అన్యాయం జరిగినా మనకి ఐక్యరాజ్యసమితి అనే ఒక ప్రపంచ సంస్థ ఉంది అనే భరోసా కలిగేది. కానీ పాలస్తీనాకి ఇప్పుడు జరుగుతున్న జీవన విధ్వంసం విషయంలో ఐక్యరాజ్యసమితి కూడా మనలాగే నిస్సహాయంగా చూస్తూ దుఃఖం కలిగించే నివేదికలు ఇవ్వడం అనేది నాకు చాలా నిరాశా నిస్పృహలు కలిగించాయి!
1945 అక్టోబర్లో స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి, అదే సంవత్సరం డిసెంబర్ 10 నుంచి పనిచేస్తూ, 2023లో తన జనరల్ అసెంబ్లీ 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. సరిగ్గా ఈ సమయం అంటే 2023, అక్టోబర్ నుంచే హమాస్ దాడి చేసిందనే వంకతో అబద్ధపు ప్రచారాలతో ఇజ్రాయేల్, పాలస్తీనాలో జాతి హననం మొదలు పెట్టింది. నిజానికి పాలస్తీనా- ఇజ్రాయేల్ ల ఘర్షణ ఈనాటిది కాదు. ఇది సామ్రాజ్య వాద దేశాలు పాలస్తీనాకు అసత్య వాగ్ధానాలు చేసి, అమలు చేయకుండా వాళ్ళ దేశాన్ని వాళ్ళకు కాకుండా చేశారు. ఇప్పడు కూడా అగ్ర సామ్రాజ్యవాద దేశాలే వాటి స్వార్ధ ప్రయోజనాల కోసం, ఈ దేశాల మధ్య రాజకీయ ఘర్షణలతో ఏమాత్రం సంబంధం లేని అమాయకులైన, సామాన్య జనాన్ని నిస్సహాయులని చేసి చేతులారా దారుణంగా హింసించి చంపుతున్నారు. ఇజ్రాయేల్, స్థిరనివాసులతో కలిసి చేస్తున్న హింసలతో వేలాదిమంది ప్రాణాలు తీస్తున్న క్రూర కృత్యాలతో పోలిస్తే హమాస్ దాడి చాలా చిన్నది. అయినా ఆ దాడి పాలస్తీనా పౌరులు చేయలేదు. ఈ పరిస్థితిలో ఐక్యరాజ్యసమితి “మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలు రక్షించలేని స్థితిలో “అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ” మనుగడే అర్ధరహితమవుతుంది” అని కూడా ఆవేదన వ్యక్తం చేసింది! ఈ దారుణ మారణకాండను చూస్తూ మానవత్వాన్ని మరిచి అసలు వాళ్ళు ఎలా నిద్ర పోగలుగుతున్నారు?ఈ ఘోరాలను ఎవరి మద్దతుతో నెతన్యాహూ నడిపిస్తున్నారు? ఇది అందరికీ తెలిసిందే కదా!
కొన్ని విషయాలు వివరించడానికి మనకి తెలిసిన భాష చాలదు అని శరత్ అన్నారు. నిజంగా పాలస్తీనా భీభత్సమైన మారణకాండను వర్ణించడానికి నాకు తెలిసిన భాష చాలా శక్తిహీనంగా, పేలవంగా మారిపోయింది. నిజంగా వాళ్ళ బాధని చెప్పే సరైన పదజాలం దొరక్కపోయినా సరే నా శక్తి మేరకు ప్రయత్నించాను. చాలా నాగరికంగా అత్యాధునిక ప్రపంచంలో జీవిస్తున్నామని డంబాచారాలు పలికే నేటి ప్రపంచ పాలకులు ఐక్యరాజ్యసమితిని కూడా పాలస్తీనా పౌరులకు సంస్థలుగా, మనుషులుగా, చేయగలిగిన సహాయం చేయనివ్వకుండా ఆపుతూ, పసి బిడ్డల ప్రాణాలను పాశవికంగా తీస్తూ సంబరాలు చేసుకుంటున్నారు! మనకి చేతనైన పని ఏమాత్రమైనా సంవేదనతో చేసి ఇజ్రాయేల్ అమానుషత్వాన్ని, పాలస్తానీయులు మనకి తెలియకపోయినా, అజ్ఞాతంగా అయినా సరే, అందరికీ తెలియజేసి సంఘీభావంతో ఉందామనిపించింది!
నీటిని అందకుండా చేస్తే ఆ మహిళలు, బాలికలు ఒక చిన్న ఇరుకు నేలలో బతుకుతూ, వాళ్ళు నెల నెలా తమ రుతుస్రావాలనుంచి ఏ విధగా తట్టుకుని తమను తాము నిలబెట్టుకుంటున్నారు? తల్లులు చూస్తుండగానే కడుపు చీల్చుకుని పుట్టిన కన్నబిడ్డలు నరకయాతన అనుభవిస్తూ చనిపోతుంటే, భరిస్తున్న స్త్రీలు మానసిక వేదనతో బతుకులు వెళ్ళదీస్తున్నారు. చివరికి వాళ్ళ గతి ఏమవుతుంది? ఒక బాలుణ్ణి కాల్చి, ఇజ్రాయేల్ అన్ని వైపులనుంచి దిగ్భంధనం చేస్తున్న పరిస్థితిలో, రక్తమోడుతున్న బిడ్డని చూసుకోవడానికి కష్టపడి తండ్రి అక్కడికి చేరుకుని, బిడ్డని గుండెలకు హత్తుకుని “నాబిడ్డ ప్రాణాలతోనే ఉన్నాడు, ప్రాధమిక చికిత్స చెయ్యండి, రక్షించండి” అని వేడుకుంటున్న తండ్రిని కొనప్రాణంతో అల్లాడుతున్న బిడ్డ ఎదుటే భయానకంగా చితక్కొట్టడం, తండ్రిని బిడ్డ ప్రాణాలు వదిలే వరకూ అక్కడే 45 నిమిషాల పాటు బంధించి ఉంచడం-ఇవి మనుషులు చేసే పనులేనా? ఇంతంత దారుణమైన విషాదాలు భరిస్తూ పాలస్తీనా పౌరులు వాళ్ళు నిలుచున్న నేలకోసం అలుపెరుగని పోరాటాలు చేస్తున్నారు. అసలు అంత నిర్ధాక్షిణ్యంగా మనుషుల్ని చంపేసే వీళ్ళు మనుషులేనా? నానాటికీ మనుషులలో మానవ భావోద్వేగాలు, మనిషి లక్షణాలు నశించి పోతున్నాయని భయమేస్తుంది. వాళ్ళు అనుభవిస్తున్న విపత్తుని సాటి పౌరులుగా మనందరం అర్ధం చేసుకోవడానికి మౌరీన్ క్లేర్ మర్ఫీ పాలస్తీనా పౌరుల నరక యాతనని చిత్రాలలో చూపించడం నాకు చాలా సవ్యంగా అనిపించింది. మనం నివసిస్తున్న ఈ నేల మీదే, ఇంకో మూల మాటలతో చెప్పలేని ఘోరాలు జరుగుతున్నాయి. ఈ రచనలో తేదీలు వరసగా లేనప్పటికీ జులై నెల మొత్తంలో పాలస్తీనా పౌరులకు, ఇజ్రాయేల్ కావాలని చేసిన చిత్రహింసలని నమోదు చేసిన వివరాలు ఉన్నాయి!
“అన్యాయాన్ని ఎదిరించడానికి మనకు శక్తి లేని సందర్భాలు ఉండవచ్చు. కానీ మనం మన నిరసనలు తెలపడానికి సంకోచించే సందర్భాలు గానీ విఫలమయ్యే సమయాలు గానీ ఎప్పటికీ ఉండకూడదు” అని యూదుల మారణహోమం నుంచి బయటపడి, ఐక్యరాజ్యసమితిలో పనిచేసిన ఎలీ వీసేల్ (Eli Weisel) అన్నారు. “నీరు, ఆహారాన్ని నిలిపివేయడం అనేవి నిశ్శబ్దంగా ఉంటాయి గానీ అవి ప్రాణాంతకమైన బాంబులు” అని ఐక్యరాజ్యసమితి మహిళా స్పెషల్ రిపోర్టర్ అన్నారు. “ప్రపంచ ప్రజలందరూ కలిసి పూర్తి స్థాయి మానవీయ ప్రతిస్పందనను పెంచే సమయం ఆసన్నమైంది” అని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ఏజెన్సీలు ప్రమాద హెచ్చరికాలు జారీ చేశాయి! ఇప్పడు మన సమకాలీన చరిత్రని నమోదు చేస్తున్న ఈ భయానక మానవ హననం పట్ల తోటి మనుషులుగా మనం అప్రమత్తంగా ఉండి మన ప్రతిఘటనని తెలిపే మన స్వరాలను, నిరసనలను వినిపిస్తూనే ఉందాం!
హృదయ విదారక చిత్రాలలో పాలస్తీనా!
మౌరీన్ క్లేర్ మర్ఫీ (అనువాదం: శివలక్ష్మి)

జూలై 2 నుండి 30 వరకు గాజాలో ఇజ్రాయెల్ జరిపిన మారణహోమం వల్ల 2,600 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని, మరో 11,677 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది. అదే కాలంలో గాజాలో పదిహేడు ఇజ్రాయెల్ సైనికులు మరణించినట్లు గాజా నివేదికలో తెలిపారు.
2023 అక్టోబర్ నుండి గాజాలో మరణించిన వారి సంఖ్య 60,000 దాటింది. వారిలో 18,500 మంది పిల్లలు, 146,000 మంది తీవ్రమైన గాయాల బారిన పడ్డారు.

మే 27 నుండి, ఆహార సహాయం పొందేందుకు ప్రయత్నిస్తూ దాదాపు 1,250 మంది మరణించగా, 8,150 మంది గాయపడ్డారు. అంతేగాక, గాజాలో పోషకాహార లోప సంబంధిత మరణాలు పెరిగాయి, జూలై 30న గత 24 గంటల్లో ఏడుగురు పిల్లలు మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఈ నెలాఖరులో ప్రపంచ ఆహార భద్రతా సూచిక “నిరంతర సంఘర్షణ, తరచుగా స్థానభ్రంశం, కనీస మానవ జీవనానికి అవసరమైన సరుకులు, నీరు మొదలైనవి అందనివ్వని పరిస్థితుల్లో కుప్పకూలుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల మధ్య, గాజాలో అత్యంత దారుణమైన పరిస్థితి వేగంగా విస్తరిస్తోంది” అని హెచ్చరించింది.
“గాజాలోని పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ బలవంతంగా స్థానభ్రంశం చేయించి, అతి తక్కువ స్థలంలో గిరి గీసి హద్దులలో నిర్బంధించి ఉంచుతుంది. గాజాలో రెండు మిలియన్లకు పైగా ప్రజలు ఇప్పుడు 45 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ విస్తీర్ణంలో నివసిస్తున్నారు. గాజా నగర పరిమాణంలో 88 శాతం భూభాగం ఇప్పుడు సైనిక జోన్ ఆదేశాల కింద ఉంది” – అని ఐక్యరాజ్య సమితి మానవ వ్యవహారాల సమన్వయ కార్యాలయం నివేదిక వెల్లడించింది.
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో, జూలై 2 – 30 మధ్య ఎనిమిది మంది పిల్లలు, ఒక అమెరికన్ పౌరుడు, ఒక వృద్ధుడు, మరొక ప్రముఖ కార్యకర్తతో సహా 24 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ దళాలు, స్థిరనివాసులు సెటిల్‌మెంట్ గార్డులు చంపారు. అదనంగా, గత సంవత్సరం ఒక పాలస్తీనియన్ వ్యక్తి గాయాలతో మరణించాడు, మరొకరు ఇజ్రాయెల్ కస్టడీలో మరణించాడు.
ఈ సంవత్సరం ఇప్పటివరకు వెస్ట్ బ్యాంక్‌లో దాదాపు 170 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ దళాలు క్రూరంగా చంపేశాయి.
జూలైలో ఒక సెటిల్మెంట్ గార్డును ఇద్దరు పాలస్తీనియన్లు చంపారు, వారు ఆ నెలలో చంపబడిన వారిలో ఉన్నారు.

ఇజ్రాయెల్ – హమాస్ ల మధ్య త్వరలో గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంటామనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆశావాద ప్రకటనలతో జూలై నెల ప్రారంభమైంది.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వాషింగ్టన్ పర్యటించి, ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశాడు.
ఫలితంగా గాజాకు సహాయం, రక్తపాతాన్ని ఆపే ప్రయత్నాలు ఆగిపోయాయి. దానికి బదులుగా, గాజా జనాభాలో రెట్టించిన కరువు తాండవించింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదరకుండానే ముగిసింది.
మారణహోమాన్ని ఆపాలనే అంతర్జాతీయ బాధ్యతకు అనుగుణంగా, ఇజ్రాయెల్ మిత్రదేశాలైన ఫ్రాన్స్, బ్రిటన్, కెనడాతో సహా జులై నెలలో ఆంక్షలు, ఇతర చర్యలు విధించడానికి బదులుగా, పాలస్తీనా దేశ హోదాను గుర్తించడం వైపు మొగ్గు చూపాయి. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, ఇంకా 30 కంటే ఎక్కువ దేశాలు కలిసి జూలై 21 న గాజాలో యుద్ధాన్ని ముగించాలని, గాజాకు “అందుతున్న సహాయ సహకారాలపై ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని” పిలుపునిస్తూ ఒక ప్రకటన విడుదల చేశాయి.
పాలస్తీనా దేశ హోదాను గత సంవత్సరమే గుర్తించిన స్లోవేనియా, యూరోపియన్ యూనియన్ మానవ హక్కుల బాధ్యతలను నిలబెట్టడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమైందని పేర్కొంటూ జూలై 31 న ఇజ్రాయెల్‌తో ఆయుధ వ్యాపారంపై నిషేధం విధించింది. ఇటామర్ బెన్-గ్విర్, బెజలెల్ స్మోట్రిచ్ పర్సన నాన్ గ్రాటాలను తీవ్రవాద ఇజ్రాయెల్ క్యాబినెట్ మంత్రులుగా ల్జుబ్లానా ప్రకటించిన రెండు వారాల తర్వాత – యూరోపియన్ యూనియన్ లోని స్లోవేనియా దేశం తీసుకున్న మొదటి చర్య ఇది.
జూలైలో ఈ జంటను తమ దేశంలోకి ప్రవేశించకుండా నెదర్లాండ్స్ నిషేధించింది; ఇటామర్ బెన్-గ్విర్, స్మోట్రిచ్ పర్సన నాన్ గ్రాటా లను గతంలో బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నార్వే దేశాలు దేశాలు నిషేధించాయి. ఈ చర్యను అమెరికా ఖండించింది, అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో జవాబుదారీతనం కొనసాగించలేని పాలస్తీనా అథారిటీ, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అధికారులపై ఆంక్షలు విధించినట్లు జూలైలో అమెరికా ప్రకటించింది.

అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుతో నడుస్తున్న, గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న దక్షిణ గాజాలోని నాసర్ మెడికల్ కాంప్లెక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి జూలై ప్రారంభంలో సందర్శించినప్పుడు, ఈ గాజా పంపిణీ కేంద్రాలలో, రోజువారీ సామూహిక మరణాలతో ఈ కాంప్లెక్స్‌ను “ఒక భారీ ట్రామా వార్డ్” గా మార్చాయని వాపోయారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, డాక్టర్లు గాజాలోని ఆసుపత్రులలో రద్దీగా ఉన్న రోగులతో, వనరులు తక్కువగా ఉండడం వల్ల, వేరు వేరు జబ్బులవాళ్ళని విడి విడిగా ఉంచటానికి స్థలం లేదు గనక, పిల్లలలో మెనింజైటిస్ కేసులు పెరుగుతాయని ఆందోళనలతో హెచ్చరించారు.
ఇజ్రాయెల్ దిగ్బంధనం వల్ల గాజాలోని ఆసుపత్రులకు ఇంధన కొరత ఏర్పడింది. ఫలితంగా అత్యవసర సహాయం అవసరమైన అనేక మంది శిశువులను ఒకే ఇంక్యుబేటర్‌లో ఉంచవలసి వచ్చింది, డయాలసిస్ చికిత్సను చాలావరకు పరిమితం చేయడం, లేదా ఏకంగా దిక్కుతోచని స్థితిలో మూసివేయవలసి వచ్చింది.
పాలస్తీనియన్లు గాజాలో నివసించవలసి వస్తున్న అపరిశుభ్ర పరిస్థితులు మెనింజైటిస్‌తో పాటు పోలియో వంటి వ్యాధుల వ్యాప్తికి దారితీస్తాయని అన్నారు.
పోలియో వైరస్ వల్ల కలిగే సిండ్రోమ్ అయిన అక్యూట్ ఫ్లాసిడ్ పక్షవాతానికి సంబంధించిన ఐదు కొత్త కేసులు జూలైలో ఒక వారంలో గాజాలో బయటపడ్డాయి. మేలో సేకరించిన పర్యావరణ నమూనాలలో వ్యాక్సిన్-ఉత్పన్నమైన పోలియో వైరస్ కొత్త వైవిధ్యం కనబడింది.
ప్రకృతి కూడా పగ పట్టినట్లే జూలై 15న గాజా నగర మునిసిపాలిటీ షేక్ రాడ్వాన్ పరిసరాల్లోని వర్షపునీటి సేకరణ చెరువు పొంగిపొర్లడంతో “రాబోయే ఆరోగ్య విపత్తు” గురించి వాతావరణ శాఖ హెచ్చరించింది.
చెరువు శుద్ధి చేయని మురుగునీటితో నిండి ఉంది, ఇంధన కొరత కారణంగా మునిసిపాలిటీ చెరువు డ్రైనేజీ పంపుల ఆపరేషన్ల గంటలను తీవ్రంగా తగ్గించింది.
చెరువులో పెద్ద మొత్తంలో మురుగునీరు పేరుకుపోవడం “దుర్వాసనలు, హానికరమైన కీటకాలు పేరుకుపోవడం వల్ల ఈ ప్రాంతంలో తీవ్రమైన పర్యావరణలు ప్రజలకు అనారోగ్య సంక్షోభాన్ని సృష్టించింది, ఇవి ప్రజలు అనేక అంటువ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి” అని మునిసిపాలిటీ పేర్కొంది.

జూలై 1న, 200 కి పైగా ప్రభుత్వేతర సంస్థలు గాజాలో “ప్రాణాంతకమైన ఇజ్రాయెల్ పంపిణీ పథకాన్ని ముగించడానికి తక్షణ చర్యలు” తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
ఈ సమూహాలు “ఇప్పటికే ఉన్న ఐక్యరాజ్య సమితి నేతృత్వంలోని సమన్వయ యంత్రాంగాలకు తిరిగి అనుమతినివ్వాలని, సహాయం, వాణిజ్య సరఫరాలపై ఇజ్రాయెల్ ప్రభుత్వ ముట్టడిని ఎత్తివేయాలని” పిలుపునిచ్చాయి.
జనవరి చివరలో ప్రారంభమైన కాల్పుల విరమణ సమయంలో నాలుగు వందల సహాయ పంపిణీ కేంద్రాలు చురుకుగా పని చేశాయి, కానీ మార్చిలో ఇజ్రాయెల్ హింసాత్మకంగా ఏకపక్షంగా వాటిని అడ్డుకుని గాజాను నలువైపులా దిగ్భంధనం చేసింది.
ఈ పంపిణీ కేంద్రాల స్థానంలో “ఇప్పుడు కేవలం నాలుగు సైనిక నియంత్రణలో ఉన్న పంపిణీ కేంద్రాలతో భర్తీ చేశారు.” అని ప్రభుత్వేతర సంస్థలు తెలిపాయి. పాలస్తీనియన్లు ప్రాథమిక అవసరాలను పొందేందుకు ప్రయత్నిస్తూ “రోజువారీ కాల్పులు, సామూహిక ప్రాణనష్టాలను ఎదుర్కొనే రద్దీగా ఉండే, సైనికీకరించబడిన మండలాల్లోకి” వెళ్ళవలసిందిగా బలవంతం చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి
సహాయం కోసం ఎదురుచూస్తూ మరణించిన వారిలో దక్షిణ గాజాలోని అల్-మావాసిలో డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ క్లినిక్‌లో పనిచేసిన పరిశుభ్రత శిక్షణ నిచ్చే నిపుణుడు అబ్దుల్లా అహ్మద్ హమ్మద్ కూడా ఉన్నాడు.
2023 అక్టోబర్ నుండి గాజాలో చంపబడిన ‘డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ క్లినిక్ సంస్థ’ 12వ ఉద్యోగి హమ్మద్, ఇజ్రాయెల్ దళాలు “సహాయ పిండి ట్రక్కుల కోసం వేచి ఉండగా హెచ్చరిక లేకుండా”కాల్పులు జరిపారు. “కావాలనే ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్న” వ్యక్తుల సమూహంలో అతను కూడా ఉన్నాడు, అని ఛారిటీ తెలిపింది.
ఖాన్ యూనిస్‌లో జూలై 3న జరిగిన సంఘటనలో 16 మంది మరణించినట్లు నివేదిక తెలియజేసింది.

జూలై ప్రారంభంలో, ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రిపోర్టర్ ఫ్రాన్సిస్కా అల్బనీస్, “కార్పొరేట్ శక్తులు తమ లాభాలకోసం ఇజ్రాయెల్ చట్టవిరుద్ధ దుష్ట చర్యలను ఎలా సాధ్యం చేశాయో” వివరిస్తూ ఒక నివేదికను విడుదల చేసింది.
“గత 21 నెలల్లో, ఇజ్రాయెల్ దురాక్రమణ మారణహోమం పాలస్తీనియన్ జీవితాలను, ప్రకృతి దృశ్యాలను, సర్వస్వాన్ని నాశనం చేస్తుండగా, టెల్ అవీవ్ నగరంలోని స్టాక్ ఎక్స్ఛేంజ్ 213 శాతం ఆకాశానికి ఎగబాకింది” – అని ఫ్రాన్సిస్కా అల్బనీస్ అన్నారు. “కొంతమందికి, మారణహోమం లాభదాయకంగా ఉంది” అని కూడా అన్నారు.
“కార్పొరేట్ కపట నటులు ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఆక్రమణ, వర్ణవివక్ష, మానవ హననం వ్యవస్థలలో చాలా బలంగా ముడిపడి ఉన్నారు” అని కూడా ఆమె జోడించారు.
“దశాబ్దాలుగా, ఇజ్రాయెల్ అణచివేతలతో పాలస్తీనా ప్రజలను కార్పొరేట్ శక్తులు ఉరికంబాలకెక్కిస్తున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలు, అంతర్జాతీయ నేరాలు అనేక దశాబ్దాలుగా జరుగుతున్నప్పటికీ వాటి పట్ల ఉదాసీనంగా ఏమీ తెలియనట్లే ఉంటున్నాయి.”
“ఆధునిక చరిత్రలో పాలస్తీనా ప్రజలపై అత్యంత క్రూరంగా జరుగుతున్న మారణహోమాలలో ఘోరమైనది ఇది” అని ఫ్రాన్సిస్కా అల్బనీస్ జెనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి చెప్పారు. కాబట్టి ఇజ్రాయెల్‌పై ఆయుధ నిషేధం, ఆర్థిక ఆంక్షలు విధించాలని ఆమె దేశాలను కోరారు.
ఫ్రాన్సిస్కా అల్బనీస్ నివేదిక విడుదలైన కొన్ని రోజుల తర్వాత, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి నిపుణులపై ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో అమెరికన్, ఇజ్రాయెల్ అధికారులు, సంస్థల పట్ల జవాబుదారీతనం కోసం అల్బనీస్ వాదించినందుకు ఈ చర్య ఒక శిక్ష అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు.
గత నెలలో, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్, ఆఫ్ఘనిస్తాన్‌లలో యుద్ధ నేరాలపై దర్యాప్తు చేసినందుకు ట్రంప్ పరిపాలనా యంత్రాంగం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులోని నలుగురు న్యాయమూర్తులపై ఆంక్షలు విధించింది.
ఐసిసి న్యాయమూర్తులు, అమెరికా ఆంక్షల కింద ఉన్న ఇద్దరు నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్‌పై అరెస్ట్ వారెంట్లను ఉపసంహరించుకోవాలనే ఇజ్రాయెల్ అభ్యర్థనను జూలై 16న తిరస్కరించారు, కానీ కోర్టు ప్రాదేశిక అధికార పరిధికి టెల్ అవీవ్ చేసిన సవాలుపై వారు ఇంకా తీర్పు చెప్పలేదని చెప్పారు.

జూలై 3న, గాజాలోని హమాస్ అధికారులు గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్‌కు సహాయం చేయవద్దని స్థానికులను హెచ్చరించారు, ఐక్యరాజ్యసమితిని ప్రధానమైన సహాయకారిగా చూపిస్తూ, కపటమైన ఉపాయాలతో నివాసితులను నిర్మూలించి ఆ భూభాగాన్ని భర్తీ చేయడానికి ఇజ్రాయెల్ మద్దతుతో అమెరికా పన్నుతున్న పథకమని వివరించారు.
మే చివరలో గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ పంపిణీ కేంద్రాలలో ఆహార సహాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వందలాది మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం చంపింది.
ఆ ముందు రోజు, హమాస్ అధికారులు దక్షిణ గాజాలోని రఫాలో పనిచేస్తున్న యుద్ధ నాయకుడు యాసర్ అబూ షాబాబ్ ను లొంగిపోవాలని డిమాండ్ చేశారు, అతని దళాలు ఇజ్రాయెల్ మద్దతుతో ఆహార సహాయ ట్రక్కులను దోచుకున్నాయి.
జూలై 5న, గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ప్రాంతంలో ఇద్దరు అమెరికన్లను గ్రెనేడ్ దాడిలో హమాస్ సభ్యులు పాల్గొని గాయపరిచారని అమెరికా చేసిన ఆరోపణలను హమాస్ అబద్ధమని తోసిపుచ్చింది.
హమాస్ సంస్థకి అనుబంధంగా పనిచేసే 800 మందికి పైగా పోలీసు అధికారులు, భద్రతా దళాలు ఉన్నాయని హమాస్ తెలిపింది.
ఐక్యరాజ్యసమితి సమన్వయంతో నిర్వహించబడుతున్న కార్యకలాపాల సమయంలో సహాయ వాహనాలను, కాన్వాయ్ మార్గాలను రక్షించేటప్పుడు సంస్థతో అనుబంధంగా ఉన్న 800 మంది సైనికులను ఇజ్రాయెల్ దళాలు చంపేశారు.
గాజా పౌర పోలీసు దళం పతనమైన కారణం వల్ల శాంతిభద్రతలకు భంగం ఏర్పడి, మానవీయమైన సహాయం అందజేయడానికి కలిగిన ప్రాథమిక అడ్డంకులలో ఇది ఒకటి అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

జూలై ప్రారంభంలో, పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ అయిన UNRWA, (United Nations Relief and Works Agency for Palestine) గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడి “తీవ్రమైన, మానవత్వాన్ని విస్మరించి, నిస్సహాయంగా ఉన్న వృద్ధులు విపరీతమైన రక్షణ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు, ఇది వారిపై తీవ్రమైన అసమాన ప్రభావాన్ని చూపుతుంది” అని ప్రముఖంగా ప్రకటిస్తూ ఒక అధ్యయనాన్ని విడుదల చేసింది.
గాజా జనాభాలో వృద్ధులు 5 శాతం ఉన్నప్పటికీ, “నమోదు చేయబడిన అన్ని మరణాలలో వారు దాదాపు 7 శాతం ఉన్నారు” అని ఐక్యరాజ్యసమితి రిలీఫ్ ఏజెన్సీ తెలిపింది.
“సామూహిక ప్రాణనష్టాలు సంభవించబోయే సంక్షోభ పరిస్థితులలో, ఎక్కువమందిని ప్రాణాపాయ ప్రమాదాలనుంచి రక్షించి మనుగడ రేటును పెంచడానికి అత్యావశ్యకమైన ట్రయాజ్ (ఆసుపత్రిలో ఒక వ్యక్తి తీవ్రంగా అనారోగ్యంతో ప్రమాదంలో ఉన్నప్పుడు క్షణాల్లో అధిక సంఖ్యలో వైద్య బృందాలు ప్రాధాన్యతనిచ్చి అత్యంత తీవ్రమైన కేసులను ముందుగా చికిత్స చేసే వ్యవస్థ) లను ఉపయోగించడం వంటి అవకాశాలు లేనే లేవు” అని ఏజెన్సీ జోడించింది.
“తమను తాము చూసుకోవడానికి సహాయక నెట్‌వర్క్ లు, ఎటువంటి శారీరక లేదా ఆర్థిక మార్గాలు లేని వృద్ధులు కూడా నిర్లక్ష్యం, ఆకలి, చికిత్స అందని వైద్య పరిస్థితులలో ఒంటరిగా, దీనంగా చనిపోయే ప్రమాదం ఉంది.”
“అనారోగ్యం బారిన పడిన వారు, శారీరకవైకల్యాలు లేదా ఏ రకమైన మద్దతు లేకపోవడం వల్ల అయినా బలవంతంగా స్థానభ్రంశం చెందిన నివాసితులు, ద్వేష భావాలతో శత్రుత్వాలు పెరిగిపోతున్న ప్రాంతాలలో వారు వెనుకబడి ఉండే అవకాశం ఉంది, వారిని కూడా అధిక ప్రమాదానికి గురిచేస్తుంది.”- అని ఐక్యరాజ్యసమితి రిలీఫ్ ఏజెన్సీ చెప్పింది.

జూలై 4న, వెస్ట్ బ్యాంక్ నగరమైన జెరిఖోకు సమీపంలో ఉన్న తూర్పు అల్-మురజాత్ పశువుల కాపరుల సంఘం వారు, అక్కడున్న స్థిరనివాసుల తీవ్రమైన హింస వల్ల వారి భూమి నుండి స్థానభ్రంశం చెందారని ‘ది గ్లోబల్ ప్రొటెక్షన్ క్లస్టర్ & యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్’ పేర్కొంది.
వెస్ట్ బ్యాంక్ అంతటా వ్యాపించి ఉన్న ఈ పశువుల కాపరుల సంఘం “2025లో స్థిరనివాసుల విపరీతమైన హింసల కారణంగా వారి ఇళ్లను, జీవనోపాధిని, సర్వస్వాన్నీ విడిచిపెట్టి, కట్టుబట్టలతో వందలాది మంది పాలస్తీనియన్ పశువుల కాపరులను వెళ్ళగోట్టే చర్యలను స్థిరనివాసులు ఇజ్రాయెల్ దళాల పూర్తి మద్దతుతో దౌర్జన్యగా, సులభంగా అమలు చేశాయి.”
ఈ నిర్వాసితులైన వారు పాతాళానికి జారుకున్నట్లుగా, చెరసాలల పాలైనట్లుగా, మానవతా సహాయంపై ఆధారపడి, తిరిగి తమ తమ ప్రాంతాలకు వచ్చే ఆచరణీయమైన వ్యూహం ఏమీ లేకుండా నిశ్చలస్థితిలోనే ఉన్నారు అని ‘ది గ్లోబల్ ప్రొటెక్షన్ క్లస్టర్ & యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్’ చెప్పింది.
జూలై 2-4 తేదీల మధ్య, స్థిరనివాసులు జనావాసాల మధ్యలో కొత్త అవుట్‌పోస్టులను ఏర్పాటు చేసి, డజన్ల కొద్దీ గొర్రెలను దొంగిలించి “పాలస్తీనియన్ నివాసితులను వారి ఇళ్లలో నిర్బంధించి వేధించారని” ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం తెలిపింది.
సెటిలర్లు “పాలస్తీనా ప్రజలకు చెందిన ఇళ్లలో ఒకదాన్ని ఆక్రమించి, దానిని ధ్వంసం చేసి, నివాసితులను బలవంతంగా బయటకు పంపారు” ఆ తర్వాత పాలస్తీనియన్ జనసంఘంలోని మిగిలిన 25 కుటుంబాల ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు.
“ఇజ్రాయెల్ సైన్యం మద్దతుతో, పాలస్తీనియన్ల వెస్ట్ బ్యాంక్‌లోని ఆక్రమిత భూభాగంలోని ప్రాంతాన్ని, స్థిరనివాసులు దీర్ఘకాలంగా సమన్వయంతో చేసిన ప్రయత్నాల వల్ల ఇజ్రాయేల్ రాష్ట్రం ద్వారా మంజూరు చేయించుకున్న ప్రక్రియలో భాగంగా కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయించారు.” అని ఐక్యరాజ్యసమితి కార్యాలయం పేర్కొంది.
జనవరి 2023 నుండి తీవ్రతరం అవుతున్న స్థిరనివాసుల హింస, ప్రవేశాల పరిమితుల వల్ల వెస్ట్ బ్యాంక్‌లోని 69 కమ్యూనిటీలకు చెందిన దాదాపు 2,900 మంది పాలస్తీనియన్లు స్థానభ్రంశం చెందారని, వాటిలో 636 కేసులు 2025లోనే జరుగాయని, ఐక్యరాజ్యసమితి మానవీయ వ్యవహారాల సమన్వయ కార్యాలయం జూలై మధ్యలో తెలిపింది.

జూలై 5న, ‘ప్రపంచ ఆహార కార్యక్రమం’ ఇటీవలి అంచనా ప్రకారం, “దాదాపు ముగ్గురిలో ఒకరు రోజుల తరబడి తినడం లేదు, దీనివల్ల ఎక్కువ మంది ఆకలితో అలమటించిపోయే ప్రమాదం ఉంది” అని హెచ్చరించింది.
“పోషకాహార లోపం రోజు రోజుకీ పెరిగిపోతోంది, దాదాపు 90,000 మంది పిల్లలు, మహిళలకు అత్యవసరంగా చికిత్స అవసరం” అని కూడా ఐక్యరాజ్యసమితి ఆహార ఏజెన్సీ జోడించింది.
“యుద్ధానికి ముందు కంటే రొట్టెలు చేసుకోవడానికి ఉపయోగించుకునే గోధుమ పిండి 3,000 రెట్లు ఎక్కువ ఖరీదైపోయింది. అదీగాక “వంటచేసుకోవడానికి ఇంధనం ఎక్కడా దొరకడంలేదు.” ఫ్రపంచ ఆహార ఏజెన్సీ చెప్పింది.
జూలై 1,2 తేదీలలో గాజాను సందర్శించిన ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్ కార్ల్ స్కావ్ మాట్లాడుతూ, “నేను ఇప్పటివరకు చూసిన అత్యంత దారుణమైన పరిస్థితి ఇది… ఆహారం కోసం అలమటిస్తూ ప్రజలు చనిపోతున్నారు.” అని అన్నారు.
“వంటగదులు ఖాళీగా ఉన్నాయి; వారు ఇప్పుడు వేడి నీటిని అందిస్తున్నారు, అందులో కొంత పాస్తా తేలుతోంది” అని ఆయన అన్నారు.

జూలై 7న, గాజాలోని దక్షిణ భాగపు చివరన ఉన్న రఫాలో ఒక “మానవీయ నగర” నిర్మాణాన్ని చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సైన్యాన్ని ఆదేశించినట్లు ప్రకటించారు, ఇజ్రాయెల్ అధికారుల దృష్టిలో సర్వజనామోదమైన నగరమంటే పాలస్తీనా జాతి హననం జరిగి, అది సర్వ నాశనం చేయబడడమే!
కాట్జ్ పథకం ప్రకారం “భద్రతా స్క్రీనింగ్” తర్వాత 600,000 మందిని ఒక జోన్‌లోకి బలవంతంగా బదిలీ చేస్తారు, అక్కడికి చేరుకున్న తర్వాత, వారిని బంధించి, బయటకు వెళ్లడానికి అనుమతించరు!
అదే రోజు, పాలస్తీనియన్లకు స్వచ్ఛంద ప్రాతిపదికన నివాసం కల్పించడానికి గాజా లోపల, వెలుపల “మానవ రవాణా ప్రాంతాలు” నిర్మించడానికి గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ పేరుతో ట్రంప్ పరిపాలనకు సమర్పించిన $2 బిలియన్ల ప్రతిపాదన గురించి గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ నివేదించింది.
రాయిటర్స్ ప్రకారం, గాజాలోని జనాభాపై “హమాస్” నియంత్రణను భర్తీ చేయడానికి ఈ ప్రణాళిక ఒక దార్శనికతను వివరిస్తుంది.
“రాయిటర్స్ చూపిన గాజుపలకలలో ‘మానవ రవాణా మండలాల’ పై వివరణాత్మకంగా, సమగ్రంగా అవి ఎలా అమలు చేయబడతాయి, వాటికి ఎంత ఖర్చవుతుంది’ అని ఏజెన్సీ తెలియజేసింది.
“స్థానిక జనాభాతో విశ్వాసాన్ని పొందడానికి” అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘గాజా దార్శనికత’ ను సులభతరం చేయడానికి విశాలమైన సౌకర్యాలను ఉపయోగించాలని ఇది పిలుపునిస్తుంది” దీని ప్రకారం జనావాసాలు లేని ప్రాంతాన్ని అమెరికా స్వాధీనం చేసుకుని తిరిగి అభివృద్ధి చేస్తుందని రాయిటర్స్ జోడించింది.
“ఇది మానవ రవాణా ప్రాంతాల కోసం ప్రణాళికలు వేయడం లేదు, అమలు చేయడం లేదు” అని గాజా హ్యుమానిటేరియన్ ఫండ్ తెలిపింది.

జూలై 7న యెమెన్ నుండి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినందుకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ యెమెన్‌లోని మూడు ఓడరేవులు, ఒక విద్యుత్ ప్లాంట్‌పై దాడి చేసింది. యెమెన్‌కు చెందిన అన్సరుల్లా ఆ దాడులకు ప్రతీకారంగా తమ దేశంలో తయారైన క్షిపణులను యెమెన్ ఉపరితలం నుండి ఇజ్రాయెల్ గగనతల లక్ష్యాలను ఛేదించడానికి ప్రయోగించమని ఆదేశించాడు.
ఇజ్రాయెల్ దాడులకు కొన్ని గంటల ముందు, యెమెన్ తీరంలో 22 మంది సిబ్బందితో పాటు ముగ్గురు సాయుధ గార్డులతో కూడిన ఓడపై దాడి జరిగింది. దాడి జరిగిన వారం తర్వాత ఓడలో ఉన్న పది మందిని రక్షించారు, నెలాఖరులో విడుదల చేసిన వీడియో ఫుటేజ్‌లో తప్పిపోయిన 11 మందిని సజీవంగా, క్షేమంగా ఉన్నట్లు చూపించారు. మిగిలిన ఐదుగురు చనిపోయినట్లు భావిస్తున్నారు.
గాజాలో జరిగిన మారణహోమానికి నిరసనగా అన్సరుల్లా ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌పై ఓడల రాక పోకల నిషేధాజ్ఞలను విధించాడు.
అదే నెలలో జూలై 16న, ఇరాన్ పంపిన 750 టన్నులకు పైగా యుద్ధ సామాగ్రిని, ఆయుధాలను అన్సరుల్లాను వ్యతిరేకిస్తున్న యెమెన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
జూలై 8న లెబనాన్ దేశానికి ఉత్తరాన ఉన్న ట్రిపోలిలో, ఇజ్రాయెల్ హమాస్ కమాండర్‌ను లక్ష్యంగా చేసుకుని ముగ్గురు వ్యక్తులను చంపింది.
జూలై 15న, లెబనాన్‌లోని బెకా లోయలో ఇజ్రాయెల్ చేసిన దాడులకు 12 మంది బలైపోయారు.
“చనిపోయిన వారిలో ఐదుగురు హిజ్‌బుల్లా యోధులున్నారని భద్రతా సిబ్బంది రాయిటర్స్‌కు తెలిపింది”- అని ఒక వార్తా సంస్థ తన నివేదికలో చెప్పింది. మిగిలిన వారు వ్యవసాయం చేసుకునే సిరియన్ జాతీయులు అని ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు.
జూలైలో సిరియాలోని స్వీడా ప్రాంతంలో కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది.

న్యూయార్క్ నగరంలోని ఫిజిషియన్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే న్యాయవాద బృందం, చికాగో విశ్వవిద్యాలయం లా స్కూల్‌లోని గ్లోబల్ హ్యూమన్ రైట్స్ క్లినిక్ సభ్యులు “వైద్య సామాగ్రిని గాజాలోకి ప్రవేశించనివ్వకుండా ఇజ్రాయెల్ విధించిన తీవ్ర ఆంక్షల వల్ల పాలస్తీనా ప్రజలకు అనేక మరణాలు, అనేక శారీరక మానసిక క్షోభలు సంభవించాయి” అని జూలై 9న పేర్కొన్నారు.
ద్వంద్వ వినియోగ వస్తువులపై ఇజ్రాయెల్ “విస్తారమైన, అనూహ్యమైన ఆంక్షలు” విధించడం వల్ల “వైద్య సంరక్షణ కోరుకునే గాజాలోని పిల్లలు, మహిళలు, పురుషులకు విపరీతమైన ఒత్తిడికి, తీవ్రమైన నొప్పికి దారితీశాయి”. దీనిలో “మత్తుమందులివ్వలేని స్థితిలో అనస్థీషియా లేకుండా అంగచ్ఛేదాలు. వైద్య విధానాలలో ప్రత్యేకమైన కణజాలంలో ఖచ్చితమైన చోట్ల కోతలు చేయడానికి ఉపయోగించే శస్త్రచికిత్సా పరికరాలు లేకుండా శస్త్రచికిత్సలు, చికిత్స చేయలేని అంటువ్యాధులు, చివరికి అవసానదశలో చికిత్స చేయగలిగిన గాయాలు కూడా ప్రాణాంతక హానిగా రూపాంతరం చెందాయి”- అని ఫిజిషియన్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ సామ్ జరీఫీ పేర్కొన్నారు.
గాజాలోకి ప్రవేశించకుండా నిషేధించబడిన వస్తువులలో “మత్తుమందులు, బలమైన నొప్పి నివారణ మందులు, పారిశుద్ధ్య పదార్థాలు, స్కాల్పెల్ హ్యాండిల్స్, ఇన్సులిన్, డ్రిల్స్, స్క్రూలు, మెటల్ ప్లేట్ల వంటి ఆర్థోపెడిక్ సాధనాలు, గాయాలైన చోట్ల చర్మాన్ని ఒకచోట చేర్చి కుట్టే పదార్థాలు, కట్లు కట్టడానికి ఉపయోగించే గాజుగుడ్డలు, యుద్ధ సంబంధిత నిరాశా నిస్పృహలకు లోనవుతున్న రోగులకు తీసుకోవలసిన సంరక్షణ కేంద్ర పరీక్షా విధానాలు, నీటిని పరిశుభ్రం చేసే పదార్థాలు, ఛాతీ గొట్టాలు, గర్భవతుల ఆరోగ్యానికి హార్మోన్ మందులు, డయాలసిస్ సామాగ్రి, బ్యాటరీలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేషన్ సామాగ్రి, రక్తస్రావాన్ని ఆపడానికి వాడే టేపులు లేదా బ్యాండులు, సర్జరీలలో కణజాలాన్ని పట్టి ఉంచడానికి వాడే క్లాంప్‌లు, స్కిన్ స్టేప్లర్లు, పల్స్ ఆక్సిమీటర్లు” ఉన్నాయని ఆరోగ్య సంరక్షకులు పరిశోధకులకు తెలిపారు.
2025లో ఇజ్రాయెల్ వైద్య సామాగ్రి, స్వచ్ఛంద ఆరోగ్య సంరక్షణ దాతల ప్రవేశాన్ని గణనీయంగా నిషేధిస్తూ క్రూరమైన ఆంక్షలను తీవ్రతరం చేసింది, ఇది పాలస్తీనా ప్రజల ఆరోగ్యాన్ని అత్యంత ఘోరంగా ప్రభావితం చేసిందని అధ్యయనం తెలిపింది.

వెస్ట్ బ్యాంక్ సెటిల్‌మెంట్ అయిన యిట్జార్‌లో నివసించిన, ఇజ్రాయెల్ మిలిటరీలో స్టాఫ్ సార్జెంట్ గా పనిచేస్తూ పాలస్తీనియన్లపై హింసకు పెట్టింది పేరుగా ప్రసిద్ధి గాంచిన అబ్రహాం అజులేని దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో జరిగిన అపహరణ ప్రయత్నంలో మరణించినట్లు తెలుస్తోంది.
సైనికుడి మరణం “ఘోరమైన కార్యాచరణ వైఫల్యం కారణంగా” జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొందని, హారెట్జ్ నివేదిక తెలిపింది.
అబ్రహాం అజులే అంత్యక్రియలకు హాజరైన ఇజ్రాయెలీలు పాలస్తీనాపై ప్రతీకారం తీర్చుకోవాలని, గాజాలో పాలస్తీనియన్లను పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. భారీ పరికరాల ఆపరేటర్ అబ్రహాం అజులే, పాలస్తీనా నివాసితులను తిరిగి వారి ఇళ్లకు ఎప్పటికీ రాకుండా నిరోధించడానికి గాజాలో వారి ఇళ్లను సర్వనాశనం చేశాడని ప్రగల్భాలు పోతూ సభలో గొప్పలు చెప్పుకున్నారు.
ఈ నెల చివరిలో, ఇజ్రాయెల్ మిలిటరీ, రక్షణ మంత్రిత్వ శాఖ కలిసి గాజాలో ఇళ్లను కూల్చివేసేందుకు కాంట్రాక్టర్లను నియమించ బోతున్నట్లు హారెట్జ్ పత్రిక నివేదించింది.
“ఇజ్రాయెల్లో పనిచేయడం చాలా కష్టమే గాక అమానవీయంగా, చెడ్డగా ఉంటుంది. సైన్యం తెలివిగా పనిచేయదు” అని ఒక కాంట్రాక్టర్ హారెట్జ్ పత్రికతో అన్నారు. “ఇది వీలైనంత వరకు పాలస్తీనా ఇళ్ళను నేలమట్టం చేయాలని కోరుకుంటుంది, అంతకుమించి వాళ్ళకు ఇంకేమీ ముఖ్యం కాదు.”

జూలై 11న, ఐక్యరాజ్యసమితి పిల్లల సంస్థ యూనిసెఫ్ అధికారి కేథరీన్ రస్సెల్, మధ్య గాజాలోని డీర్ అల్-బలాలోని ఒక భాగస్వామి సంస్థ పంపిణీ చేస్తున్న పోషకాహార సామాగ్రి కోసం వరుసలో నిలబడి ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దళాలు తొమ్మిది మంది పిల్లలతో సహా 15 మంది పాలస్తీనియన్లను చంపడాన్ని తీవ్రంగా ఖండించారు.
“వీరు నెలల తరబడి ఆకలి, నిరాశ, నిస్త్రాణతో ఉన్న తల్లులు తమ పిల్లలకు జీవనాధారాలను కోరుకుంటున్నారు” అని కేథరీన్ రస్సెల్ చెప్పారు.
“వారిలో డోనియా అనే ఒక మహిళ కూడా ఉన్నారు, ఆమె తన ఒక సంవత్సరం వయసున్న బాలుడు మొహమ్మద్ క్రూరంగా చంపబడ్డాడని, ఆ చిన్నారి కొన్ని గంటల ముందే ఆమెతో తన మొట్ట మొదటి పదాలను ముద్దుగా పలికాడని ఆమె చెప్పింది.”
ఐదు రోజుల తర్వాత, కేథరీన్ రస్సెల్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో మాట్లాడుతూ, “గత 21 నెలల యుద్ధంలో, గాజాలో 17,000 మందికి పైగా పిల్లలు మరణించారని, 33,000 మంది గాయపడ్డారు” అని అన్నారు.
“ప్రతిరోజు సగటున 28 మంది పిల్లల్ని చంపుతున్నారు – ఇది మొత్తం ఒక తరగతి గదిలో ఉండే పిల్లల సంఖ్యకి సమానం” అని కేథరీన్ రస్సెల్ జోడించారు. “అందరూ ఒక్క క్షణం ఆలోచించండి. దాదాపు రెండు సంవత్సరాల నుండి ప్రతిరోజూ మొత్తం ఒక తరగతి గది పిల్లలని చంపేశారు.”

జూలై 11న, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం జూలై 8-9 మధ్య, గాజాలో స్థానభ్రంశం చెందిన పాలస్తీనియన్లను ఉంచిన గుడారాలపై జరిగిన 21 దాడుల్లో 30 మంది పిల్లలు, మహిళలు సహా కనీసం 77 మంది మరణించారని తెలిపింది. ఈ దాడులలో తొమ్మిది దాడులు, ఇజ్రాయెల్ ప్రజలను ఖాళీ చేయమని ఆదేశించిన ప్రాంతం అల్-మవాసిలో జరిగాయి,
“ఈ గుడారాలు సాధారణంగా కుటుంబసభ్యులను కలిపి దగ్గరగా ఉంచుతాయి కాబట్టి, వాటిపై జరిగే ఏ దాడైనా సాధారణంగా మొత్తం కుటుంసభ్యులందరిని చంపడానికి దారితీస్తుంది” అని ఐక్యరాజ్యసమితి కార్యాలయం పేర్కొంది.
“మానవీయమైన నగరం” అని పిలవబడే రఫాలోని ప్రదేశంలోకి గాజా జనాభాను రప్పించాలని ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తున్నట్లు నివేదించబడింది. “బహుశా వారిని రఫా భూభాగం వెలుపలికి బలవంతంగా తరలించాలనే ఉద్దేశ్యంతో”, ఇజ్రాయెల్ చేస్తున్న ఈ అమానుష్యమైన చర్యలు “దారుణమైన నేరాలుగా పరిగణించాలి” అని ఐక్యరాజ్యసమితి కార్యాలయం తెలిపింది.

“గాజాలో మనుగడకు వెన్నెముక” గా ఐక్యరాజ్యసమితి అభివర్ణించిన ఇంధన వాయువుని ఇజ్రాయెల్ 130 రోజుల పాటు దిగ్బంధించిన తర్వాత అది చాలా కొరతగా ఉందని జూలై 12న, ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
ఆసుపత్రులు, నీటి వ్యవస్థలు, పారిశుద్ధ్య పనులు, అంబులెన్సులు, మానవ కార్యకలాపాలకు సంబంధించిన ప్రతి అంశానికి సంబంధించి శక్తినిచ్చే ఇంధనం గాజాలో 2 మిలియన్లకు పైగా ప్రజలకు జీవనాధారమని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
తగినంత ఇంధనం లేకుండా గాజాలో కార్యకలాపాలను నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలను బలవంతం చేసారు, అంటే పాలస్తీనా ప్రజలకు “ఆరోగ్య సేవలు లేవు, స్వచ్ఛమైన నీరు లేదు, సహాయం అందించే సామర్థ్యం లేదు” అని ప్రపంచ సంస్థ తెలిపింది. జూలై 9 నుండి ఇజ్రాయెల్ వారానికి ఐదు రోజులు, రోజుకు రెండు ట్రక్కుల ఇంధనాన్ని మాత్రమే అనుమతించడం ప్రారంభించింది – “జీవితంలోని ప్రతి అంశం ఇంధనంపై ఆధారపడిన గాజాలో అవసరమైన ప్రాణాలను రక్షించే సేవలను నడపడానికి అవసరమైన దానిలో ఈ కొంత భాగం ఏమాత్రం దేనికీ సరిపోదు” అని ఐక్యరాజ్యసమితి మానవ వ్యవహారాల సమన్వయ కార్యాలయం పేర్కొంది.
జూలై 26న, ఇజ్రాయెల్ అధికారులు దక్షిణ గాజాలో ఒక నీటిని శుభ్రం చేసే డీశాలినేషన్ ప్లాంట్‌ను విద్యుత్ గ్రిడ్‌తో తిరిగి అనుసంధానించారు, ఇది “సురక్షితమైన తాగునీటిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది” అని ఐక్యరాజ్యసమితి మానవ వ్యవహారాల సమన్వయ కార్యాలయం తెలిపింది.
పూర్తి కార్యాచరణ సామర్థ్యంతో, ఈ డీశాలినేషన్ ప్లాంట్ (లవణ నిర్మూలన ప్లాంట్) “ఒక వ్యక్తికి రోజుకు 6 లీటర్ల చొప్పున తాగునీటిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది, దీనికి తోడు ఇతర గృహావసరాల సరఫరాకు కూడా ఉపయోగపడుతుంది.”
కానీ ఇది “నీటి ట్రక్కులకు ఇంధనం, విడిభాగాల లభ్యత, ఫిల్లింగ్ స్టేషన్ల నిర్వహణ, నిర్మాణం, నీటి పంపిణీ కేంద్రాల ఏర్పాటు, నీటి పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తరించే సాధ్యాసాధ్యాల” పై ఆధారపడి ఉంటుంది అని ఐక్యరాజ్యసమితి మానవ వ్యవహారాల సమన్వయ కార్యాలయం (OCHA) చెప్పింది.
ఆఫీస్ ఫర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ హుమానిటేరియన్ ఎఫైర్స్ (OCHA) ప్రకారం, జూలై ప్రారంభంలో సర్వే చేయబడిన దాదాపు అన్ని గృహాలు చాలా మితమైన అధిక స్థాయిల నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. అధిక ధరలు, తగినంత పంపిణీ లేకపోవడం వల్ల పరిశుభ్రమైన వస్తువులు అందుబాటులో లేకపోవడంతో 40 శాతం కంటే ఎక్కువ గృహాలకు సబ్బులు లేకపోవడం, జూన్ నుండి టాయిలెట్లు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది.

జూలై 11న రమల్లా సమీపంలోని వెస్ట్ బ్యాంక్ గ్రామంలోని సింజిల్‌లో ఇజ్రాయెల్ స్థిరనివాసులు ఇద్దరు పాలస్తీనియన్లను చంపారు – వారిలో ఒకరు అమెరికన్ పౌరుడు.
20 ఏళ్ల సైఫుల్లా ముసల్లెట్‌ను కొట్టి చంపారు, 23 ఏళ్ల హుస్సేన్ అల్-షలాబి ఛాతీపై కాల్చి చంపారు.
ఫ్లోరిడాకు చెందిన ముసల్లెట్ కుటుంబం, విదేశాంగ శాఖ దర్యాప్తుకు నాయకత్వం వహించి, “సైఫుల్లా ముసల్లెట్‌ను చంపిన ఇజ్రాయెల్ స్థిరనివాసులను వారి నేరాలకు జవాబుదారీగా ఉంచాలని” డిమాండ్ చేసింది.
అమెరికన్ పౌరులు, ఇజ్రాయెల్ సైన్యం చేత చంపబడినప్పుడు కూడా, దీర్ఘకాలంగా అపఖ్యాతి పాలవుతున్న ఇజ్రాయెల్ స్వీయ-దర్యాప్తు విధానాలను అమెరికా వాయిదా వేస్తుంది.
క్రిస్టియన్ జియోనిజానికి కట్టుబడి ఉన్న ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్న అమెరికా రాయబారి మైక్ హకబీ, ముసల్లెట్ హత్యను “తక్షణమే దర్యాప్తు” చేయాలని ఇజ్రాయెల్‌కు పిలుపునిచ్చారు. దీనిని అతను “నేరపూరితమైన ఉగ్రవాద చర్య” గా అభివర్ణించాడు.

జూలై 15న విడుదల చేసిన ఒక ప్రకటనలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం, వెస్ట్ బ్యాంక్‌లో హత్యలు, గృహ కూల్చివేతలను ఇజ్రాయెల్ వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ సెటిలర్లు దురాక్రమణ దళాలు కిందటి వారాల్లో “పాలస్తీనియన్లపై హత్యలు, దాడులు, వేధింపులను తీవ్రతరం ఇజ్రాయెల్ సెటిలర్లు చేశారు” అని పేర్కొంది.
జనవరిలో గాజాలో కాల్పుల విరమణ ప్రకటించిన రెండు రోజుల తర్వాత ఉత్తర వెస్ట్ బ్యాంక్‌లో ఒక ప్రధాన సైనిక దాడి ప్రారంభించిన ఇజ్రాయెల్, దాదాపు 30,000 మంది పాలస్తీనియన్లను బలవంతంగా నిరాశ్రయుల్ని చేశారు.
2023 అక్టోబర్ 7 నుండి తూర్పు జెరూసలేం సహా, వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దళాలు, స్థిరనివాసుల చేతిలో కనీసం 964 మంది పాలస్తీనియన్లు హత్యకు గురయ్యారని ఐక్యరాజ్యసమితి కార్యాలయం తెలిపింది. అదే కాలంలో, 53 మంది ఇజ్రాయెల్‌లు “పాలస్తీనియన్ల సాయుధ ఘర్షణల్లో మరణించారు, వెస్ట్ బ్యాంక్‌లో 35 మంది, ఇజ్రాయెల్‌లో 18 మంది” అని ఐక్యరాజ్యసమితి కార్యాలయం తెలిపింది.
జనవరి చివరి నుండి, వెస్ట్ బ్యాంక్‌లోని దాదాపు 1,400 ఇళ్లకు కూల్చివేత ఆదేశాలు జారీ చేసింది ఇజ్రాయెల్. కూల్చివేతలు 2023
అక్టోబర్ 7 నుండి ఈ భూభాగంలోని 2,900 మందికి పైగా పాలస్తీనియన్లను నిర్వాసితులను చేశాయి.
“అదే కాలంలో, ఇజ్రాయెల్ స్థిరనివాసులు వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తీనియన్లలో ఎక్కువ మందిని ఖాళీ చేయించడం వల్ల మరో 2,400 మంది పాలస్తీనియన్లు, వారిలో దాదాపు సగం మంది పిల్లలు బలవంతంగా స్థానభ్రంశం చెందారు” అని ఐక్యరాజ్యసమితి కార్యాలయం తెలిపింది.
“అంతర్జాతీయ న్యాయస్థానం జారీ చేసిన సలహాలకు, ఆదేశాలకు అనుగుణంగా, ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో తన చట్టవిరుద్ధ ఉనికిని అంతం చేయాలి” అని ఐక్యరాజ్యసమితి కార్యాలయం జోడించింది.

గాజాలో “వికలాంగులు, వృద్ధులు ఎదుర్కొంటున్న అంతులేని ఆటంకాలు, అడ్డంకుల” పై జూలై 15న, గ్లోబల్ ప్రొటెక్షన్ క్లస్టర్ – ప్రభుత్వేతర సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీల నెట్‌వర్క్ ఒక నివేదికను విడుదల చేసింది.
20 నెలల “తీవ్రమైన ద్వేషం, శత్రుత్వాలు” వల్ల 40,500 కంటే ఎక్కువ మంది పిల్లలతో సహా 134,100 మందికి పైగా కొత్త యుద్ధ సంబంధిత గాయాలకు గురయ్యారు; 25 శాతం మందికి “తీవ్రమైన, కొనసాగవలసిన పునరావాస సౌకర్యాలు అవసరమయ్యే కొత్త వైకల్యాలు ఉన్నాయని అంచనా వేశారు.”
35,000 మందికి పైగా ప్రజలు “నిరంతర బాంబు పేలుళ్ల కారణంగా గణనీయంగా వినికిడి శక్తిని కోల్పోయారు” అంతేకాదు, రోజుకు 10 మంది పిల్లలు “ఒకటి లేదా రెండు కాళ్లను కోల్పోతున్నారు” అని గ్లోబల్ ప్రొటెక్షన్ క్లస్టర్ పేర్కొంది.
“గాజాలో 83 శాతం కంటే ఎక్కువ మంది వికలాంగులు తమ సహాయక పరికరాలను కోల్పోయారు, గాజాలో 80 శాతం మంది వృద్ధులకు మందులు, వైద్య సామాగ్రి అత్యవసరంగా అవసరం అవుతాయి” అని నెట్‌వర్క్ చెప్పింది.

జూలై 16న, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం “ఇజ్రాయెల్ సైన్యం అనేకసార్లు దాడులు” చేసి గాజాలో వైద్య నిపుణులను కిరాతకంగా హత్యలు చేయడాన్ని ఖండించింది.
“రెండు నెలల్లోపు కనీసం 10సార్లు భీకర దాడులు చేసింది, ఆ దాడులలో కనీసం 10 మంది వైద్యులు, ఐదుగురు నర్సులు మరణించారు”. — “ఈ సంఘటనలలో, ఏడు గుడారాలపై దాడులు జరిగాయి, పిల్లలతో సహా వారి కుటుంబ సభ్యులందరిని చంపేశారు.” అని ఐక్యరాజ్యసమితి కార్యాలయం జోడించింది.
“ఒక దాడిలో, ఒక గర్భిణీ మహిళా వైద్యురాలిని, ఆమె భర్తతో పాటు వీధిలో చంపేశారు.” అని ఐక్యరాజ్యసమితి కార్యాలయం చెప్పింది.
జూలై 14న, ఖాన్ యూనిస్‌లోని వారి టెంట్‌పై జరిగిన దాడిలో మజేద్ సలా అనే మేల్ నర్సు, అతని ముగ్గురు కుమార్తెలు, పిల్లలందరూ మరణించారని ఐక్యరాజ్యసమితి కార్యాలయం తెలిపింది.
అంతకంటే 10 రోజుల క్రితం, జూలై 5న, ఖాన్ యూనిస్ ప్రాంతంలోని వారి టెంట్‌పై జరిగిన దాడిలో వైద్యుడు ఖలూక్ ఖఫాజా, అతని ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు మరణించారు.
జూలై 2న, ఉత్తర గాజాలోని ఇండోనేషియా ఆసుపత్రి డైరెక్టర్, ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ మార్వాన్ అల్-సుల్తాన్, అతని భార్య, సోదరి, కుమార్తె – అల్లుడుతో పాటు గాజా నగరంలోని ఒక నివాస భవనంపై జరిగిన దాడిలో మరణించారు. పాలస్తీనా – హెల్త్ కేర్ వర్కర్స్ ప్రకారం, అతను 50 రోజుల కాలంలో మరణించిన 70వ ఆరోగ్య కార్యకర్త.

ఇంకా వుంది…
(రెండవ భాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.)