జాషువా విశ్వకవి ఎందుకయ్యాడు?

మహాకవి గుర్రం జాషువా గురించి ఆనాడు మార్క్సిస్టు విమర్శకులు, కవి పండితులు సరైన అంచనా వేయలేదు. ఈనాటికీ సమగ్రమైన అంచనాతో వారు లేరు. అంబేద్కరిస్టు విమర్శకులు, కవి పండితులు ఇప్పుడు వేస్తున్న అంచనా ఒక ధోరణిలో ఉంటుంది. ఇద్దరికీ కేంద్ర బిందువుకి కులాన్ని ఉంచాలి. కాకపోతే మార్క్సిస్టులు కులం కాదు వర్గమే అంటూ జాషువాను, ఆయన వచ్చిన నేపథ్యం నుంచి ఆయన చూపించిన కవితా ప్రతిభ నుంచి మాత్రమే కొలవడానికి ప్రయత్నం చేస్తారు. అంబేద్కరిస్టులు కులమే అంటారు. ఈ సెప్టెంబర్ 28 కి జాషువా పుట్టి 130 సంవత్సరాలు అయింది. ఇప్పటికైనా ఒక స్పష్టమైన మార్క్సిస్టు అంబేద్కరిస్టు అవగాహనతో కూడిన ఒక అంచనా కట్టాలన్న నా చిరు ప్రయత్నంగా జాషువా జయంతి నాడు ఒక వీడియో చేశాను. దానికి అక్షర రూపమే ఈ వ్యాసం. ఒకసారి ఈ పద్యాన్ని గుర్తు చేసుకుందాం.

“కుల మతాలు గీచుకున్న గీతలు జొచ్చి పంజరాన కట్టువడను నేను
నిఖిల లోకమెట్లు నిర్ణయించిన, నాకు తిరుగు లేదు విశ్వనరుడ నేను”

కుల మతాల మధ్య నన్ను బంధించకండి, నేను విశ్వ నరుడను అని జాషువా చెప్పుకున్నాడు. కానీ ఆయన ఆనాడు భారతీయ సమాజాన్ని చూసిన చూపు, గ్రహించిన జ్ఞానం, దాన్ని తన అక్షరాల్లో అద్దం పట్టిన తీరు. మొత్తం జాషువాని- ప్రాంతీయత నుంచి జాతీయత వైపు నడిపించి విశ్వ వేదిక మీద నిలబెట్టిన విషయాన్ని కళ్ళుంటే చూడాలి, హృదయం ఉంటే రాయాలి. తన దేశపు కాలమాన పరిస్థితులను, సామాజిక ఆర్థిక పరిస్థితులను గతి తార్కిక భౌతిక దృష్టితో పరిశీలించి ఆ స్థితులను అత్యంత అద్భుతమైన తన రచనా వైదుష్యంతో కవిత్వంగా మలిచిన కవి జాతీయ కవిగా విశ్వకవిగా ఎదుగుతాడు. ఏ దేశంలోనైనా రెండే వర్గాలు ఉంటాయి. శ్రమ చేసే వర్గం, ఆ శ్రమను దోపిడీ చేసే వర్గం. మనదేశంలో కూడా అంతే. కాకపోతే ఇక్కడ శ్రామికుల వర్గం దోపిడీకి గురి కావడానికి కారణం కేవలం వారు శ్రామికులు అయినందుకు మాత్రమే కాదు, వారంతా తరతరాలుగా అణగారిన కులాల నుంచి వచ్చిన వారైనందుకు, ఆ కులాల అసమానతలే ఆత్మగా కలిగిన మతం, వారి దోపిడీని నిరాటంకంగా కొనసాగించే ఆధిపత్య బ్రాహ్మణ పురోహిత కులాల వారికి అండగా నిలిచినందుకు. ఇది ఈ దేశపు ప్రత్యేక పరిస్థితి. దీన్ని పట్టుకున్నాడు జాషువా. మార్క్సిస్టు దృక్పథాన్ని అంబేద్కరిస్టు దృక్పథాన్ని మేళవించి గబ్బిలం కావ్యం ద్వారా వర్గ దోపిడీని, దానికి ప్రాణాధారమైన కుల దోపిడీని ఏకకాలంలో ఎండగట్టి, భారతీయ అసమసమాజ అసలు రూపానికి అక్షరాక్షరం అద్దం పట్టి అసలు సిసలు విశ్వకవిగా జాషువా ఎదిగాడు.

తెలుగు సాహిత్యంలో అత్యంత గొప్ప కవులు జీవించిన కాలంలో జాషువా పుట్టాడు. గురజాడ, కందుకూరి, చిలకమర్తి లాంటి హేమాహేమీలు జీవన చరమాంకంలో ఉన్నారు. అప్పుడు నూనూగు మీసాల నవ యువకుడు జాషువా. కందుకూరి, చిలకమర్తి ఆశీస్సులు స్వయంగా పొందాడు. కులరక్కసి తాండవిస్తున్న దేశంలో నువ్వు బాధలే ఎదుర్కొంటావు, కానీ నీ కవితా ప్రస్థానం ఆపవద్దని కందుకూరి ఇచ్చిన ఆశీస్సులు మరువలేనివి. అయితే జాషువా కాలంలోనే ఆంగ్ల సాహిత్య ప్రభావంతో భావ కవితా వినీలాకాశంలో ధృవతార వెలుగొందిన కృష్ణశాస్త్రి, అభ్యుదయ కవిత్వానికి నాయకుడిగా నిలబడి సాహిత్యంలో భూకంపం పుట్టించిన మహాకవి శ్రీశ్రీ, సాంప్రదాయ కవిత్వానికి ప్రతినిధిగా పేరుగాంచిన కవి సామ్రాట్ విశ్వనాథ మొదలైన వారు ఆ కాలంలోనే ఉన్నారు. అవధాన ప్రక్రియకు ఆకాశమంత కీర్తి తెచ్చిన తిరుపతివెంకట కవులు, కొప్పర్తి కవులు కూడా అదే కాలంలో ఉన్నారు. చెళ్ళపిళ వెంకట శాస్త్రి స్వయంగా గండపెండెరాన్ని తొడిగి జాషువాను గౌరవించిన చారిత్రక సందర్భం మరువలేనిది. అయితే ఇలాంటి ఆనాటి మేటి కవుల కంటే జాషువాను ప్రత్యేకంగా నిలబెట్టే అంశం, భారతీయ ఆత్మలోని కులవర్గ అసమానతల అసలు స్వరూపాన్ని ఆయన అక్షరాల్లో బద్దలు కొట్టడమే. పట్టిన వస్తువును కవిత్వంగా మార్చే తీరులో ఆనాటి మేటి కవులు ఎవరికీ తక్కువ కాని, సాటిలేని అసమాన ప్రతిభను జాషువా కనబరిచాడు. ఆయన ఖండకావ్యాలు గానీ, ఫిరదౌసి, ముంతాజ్ మహల్ లాంటి కావ్యాలు గానీ ఎన్నో ఉదాహరణలు చూపించవచ్చు. కానీ వర్గ దృక్పథాన్ని, అలాగే వర్ణ దృక్పథాన్ని మేళవించి భారతీయ సమాజంలో ఉన్న దోపిడీ తత్వం వెనక ఉన్న కులమతపరమైన ప్రత్యేక పరిస్థితి ఆయువు పట్టును జాషువా పట్టుకున్నందుకే ఆయన విశ్వకవిగా నిలిచాడు. ఉదాహరణకు కొన్ని పద్యాలు చూద్దాం.

“వాని రెక్కల కష్టంబు లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమ్మటనోడ్చి ప్రపంచమునకు భోజనము బెట్టు వానికి భుక్తి లేదు”

ఈ పద్యం పక్కా మార్క్సిస్టు దృక్కోణంతో శ్రమ దోపిడీ విధానాన్ని ప్రతిభావంతంగా పట్టి చూపిస్తుంది. గబ్బిలం కావ్యం లోని ఇలాంటి పద్యాలతో పాటు అసలు శ్రమదోపిడి వెనక ఉన్న కుల దోపిడీ, దానికి కొమ్ముకాస్తున్న మతం, ఆ మతాన్ని నిలబెడుతున్న 33 కోట్ల దేవీ దేవతలు- ఈ మొత్తాన్ని చీల్చి చెండాడిన పద్యాలు జాషువాని ఆనాటి మేటి కవుల కంటే భిన్నంగా నిలబెడతాయి. ‘కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి / స్వార్థలోలురు నా భక్తిననుభవింత్రు’ ఇలాంటి పద్యాలు వర్గ దృక్పథంతో రాసినవి. ఈ విషయంలో పొలాలన్నీ హలాల దున్ని అంటూ ఆనాడు విరుచుకుపడిన శ్రీశ్రీ లాంటి అభ్యుదయ కవులు జాషువా కంటే ముందే ఉంటారు. కానీ విచిత్రంగా దాని వెనుక ఉన్న కుల దోపిడీ మత దోపిడీని కూడా శ్రమ దోపిడీతో ముడిపెట్టి రాయడంలోనే జాషువా విశిష్టత ఉంది. “వాని తల మీద పులిమిన పంకిలమును/ కడిగి కరుణింప లేదయ్య గగనగంగ/ వాని నైవేద్యమున అంటువడిన నాడు/ మూడు మూర్తులకు కూడ కూడు లేదు” ఇలాంటి పద్యాలకు వచ్చేసరికి జాషువా విశ్వరూపం మనకు కనిపిస్తుంది. వర్గ దృక్పథం కళ్ళజోడు లోంచి చూసిన వారికి భారతీయ సమాజంలోని అసమానతల అసలు రహస్యం కులం అనేది కనిపించలేదు. ఒకటి కాదు రెండు కాదు ఇలాంటివి అనేక పద్యాలు ఉన్నాయి. హిందూ మతానికి అసమానత ఆత్మ అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట గాని, ఇక్కడ శ్రమ విభజనే కాదు శ్రామికుల విభజన కూడా జరిగిందని ఆయన నొక్కి వక్కాణించిన విషయం గాని ఆనాటికీ ఈనాటికీ పెద్దగా వర్గ దృక్పథాన్నే ప్రధానంగా భావించేవారు పట్టించుకోరు. ఇప్పుడిప్పుడే కాస్త లాల్ నీల్ అంటున్నారు. కానీ అప్పుడు అంటే జాషువా కాలం నాడు ఇది అసలు పట్టించుకోలేదు. అందుకే జాషువా మిగిలిన వారి కంటే ముందున్నాడు. ‘పామునకు పాలు చీమకు పంచదార’ లాంటి పద్యాలు గాని, ‘వాడిని ఉద్ధరించు భగవంతుడే లేడు’ అనే పద్యం, ‘ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు వేలు వ్యయింత్రు గాని’ అనే పద్యం, “ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి/ ఇనుప గజ్జల తల్లి జీవనము సేయు/ కసరి బుసకొట్టు నాతని గాలి సోక/ నాల్గు పడగల హైందవ నాగరాజు’ ఇలాంటి పద్యాలు గాని ఎన్నో ఎన్నో అసమానతలకు ఆటపట్టైన ఈ దేశంలో శ్రమదోపిడికి అతి కీలకమైన హిందూ మతం, ఆ మతంలోని దోపిడీ తత్వం పై జాషువా సాగించిన దండయాత్ర అతి కీలకమైంది. అదే జాషువాను ఆనాటి గొప్పకవులందరికంటే గొప్ప స్థానంలో నిలబెట్టింది.

దీనితోపాటు ఖండకావ్యాలలో ఆయన తీసుకున్న కవితా వస్తువులు విశ్వజనీయమైనవి. తాత్కాలిక ఉద్యమాలతో విప్లవాలతో సంబంధం లేనివి. కాలంతో పాటు మనిషి.. మనిషితో పాటు మానవ జీవన తాత్విక ప్రస్థానం సాగినంత కాలం ఆ కవితా వస్తువులు సజీవంగా ఉంటాయి. ఇది కూడా నాటి కవుల కంటే మేటి స్థానంలో జాషువాను నిలిపి ఉంచడానికి కారణంగా చెప్పవచ్చు. ఏది ఏమైనా జాషువాను ఇప్పటికైనా సరిగ్గా అంచనా వేయడం అంటే, ఈ దేశంలో శ్రమదోపిడి ఏ రూపంలో జరిగింది అనేది ఒక సరైన అవగాహనకు రావడమే. అలా వచ్చినప్పుడు అంబేద్కరిజం ఈ దేశానికి ఎంత అవసరమో అర్థమవుతుంది. జాషువా లాంటి కవులు సృష్టించిన విప్లవం ఏంటో మనకు తెలియ వస్తుంది. ఏ దేశంలోనైనా కమ్యూనిజం అవసరమే కానీ ఈ దేశంలో కమ్యూనిజం కడుపునిండా అంబేద్కరిజం నిండినప్పుడే ఇక్కడ విప్లవం పరిపూర్ణమవుతుంది. జాషువా గబ్బిలం ఇచ్చిన సందేశం కూడా ఇదే. తనను తాను విశ్వ నరుడుగా జాషువా అభివర్ణించుకున్నాడు. కులమతాలతో తనను కట్టి వేయవద్దని వేడుకున్నాడు. కేవలం కులం కారణంగానో, అంటరానితనం నేపథ్యంగా వచ్చిన కారణంగానో, అతని కవిత్వ నిర్మాణ ప్రతిభ కారణంగానో ఆయన మహాకవి కాలేదు. కవిత్వంలో చూపించిన అసమాన ప్రతిభతో పాటు భారతీయ శ్రమ దోపిడీ తత్వాన్ని అంబేద్కర్ కళ్ళతో చూసి అక్షరాలను ఆవిష్కరించినందుకే జాషువా విశ్వనరుడే కాదు, విశ్వకవి కూడా అవుతాడని మనం గుర్తించాలి. అలా గుర్తించడమే జాషువాకు నిజమైన నివాళి.

(సెప్టెంబర్ 28 గుర్రం జాషువా 130వ జయంతి)

పుట్టిన ఊరు నిడమర్రు, పశ్చిమ గోదావరి జిల్లా. ఎంఏ(తెలుగు), ఎంఏ(ఇంగ్లిష్), శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి పీహెచ్ డీ చేశారు. ఐదేళ్లు ప్రింట్, పదేళ్లు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేశారు. రచనలు: 1. కలనేత(1999), 2. మాట్లాడుకోవాలి(2007), 3. నాన్న చెట్టు(2010), 4. పూలండోయ్ పూలు(2014), 5. చేనుగట్టు పియానో(2016), 6. దేశం లేని ప్రజలు(2018), 7. మిత్రుడొచ్చిన వేళ(2019), ప్రసాదమూర్తి కవిత్వం(2019) కవితా సంకలనాలు. సగం పిట్ట(2019) కథా సంపుటి ప్రచురించారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.

Leave a Reply