జాషువా దృష్టిలో కవి – కవిత్వం

గుఱ్ఱం జాషువా కవిగా ప్రసిద్ధుడు. కవిత్వం గురించి, కవి గురించి ఆయన వ్రాసిన కవిత్వ పరామర్శ ప్రస్తుత విషయం. లోకంలోని మంచి చెడులకు స్పందిస్తూ భావుకులైన మనుషులు చేసే సృజన వ్యాపారం కవిత్వం. కాగా ఆ కవిత్వం ఎలా ఉండాలి? ఎలా ఉంటుంది ? కవికి కవిత్వానికి ఉండే సంబంధం, కవిత్వానికి విలువలకు ఉండే సంబంధం, కవి పట్ల, కవిత్వం పట్ల సమాజ వైఖరి, కవి జీవనం, కవి ధర్మం , కవిత్వ ఆదర్శం ఇలాంటి అనేకానేక విషయాల గురించి చేసే ఆలోచనలు, చేసే సూత్రీకరణలు సాధారణంగా సాహిత్య విమర్శ అవుతుంది.ఆ పనిలో ఉన్నవాళ్లు విమర్శకులు. ఇలాంటి ఆలోచనలతో కూడిన విమర్శ దృష్టి పనిచేయకుండా కవులు అసలు కావ్య రచనకు సిద్ధం కాలేరు.భావోద్వేగాల తీవ్రత కలిగించే ఒత్తిడిలో వ్యక్తీకరణ మాధ్యమంగా కవిత్వాన్ని సానబెట్టే క్రమంలో కవుల విమర్శ దృష్టి అంతర్వాహిని అవుతుంది. దాని ఉనికిని గురించిన స్పృహ కవికి కలగదు. కవిలో భాగంగా ఉండే విమర్శ లక్షణం కూడా కవిత్వ రూపంలోకే అనువదితం అవుతుంది. పూర్వకవులు కావ్యావతారికలలో అది ఉన్నది. శ్రీశ్రీ వంటి కవులు, కవిత్వవస్తువు , ప్రయోజనం మొదలైన అన్నిటినీ అద్భుతమైన కవిత్వంగా చేసారు. ‘కవితా !ఓ! కవితా’ అంటూ కవిత్వంతో ఆయనచేసిన సంభాషణ సృజన విమర్శల జమిలి పోగుల అల్లికే. ఈ సాంస్కృతిక వారసత్వ సందర్భం నుండి జాషువా కవిత్వంలో కవి గురించి , కవిత్వం గురించి ఇయ్యబడిన నిర్వచనాలు, వివరణలు అధ్యయనం చేయటం ప్రయోజనకరం.

జాషువా కవిత్వ రచన 1917 లో ‘హిమధామార్కధర పరిణయము’ తో ప్రారంభం అయింది.(జాషువ , సర్వ లభ్య రచనల సంకలనము , మనసు ఫౌండేషన్) ఆ తరువాత 17 ఏళ్లకు అంటే 1934లో ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక లో ‘ఆంధ్రకవుల భావ చిత్రములు’ అనే వ్యాసం ప్రచురించబడింది. ఆ వ్యాసం ప్రారంభంలో కవిత అంటే ఏమిటి? సృష్టికర్త యగు కవి ఎట్టివాడు అన్న రెండంశాలను చర్చించాడు. కవి చరాచర ప్రకృతిని తన ప్రజ్ఞాబలంతో వడియగట్టి, పరిశుద్ధ భాషా వాహినియందు స్నానమాడించి ఛందం అనే చట్రంలో బిగించి చూపేదే కవిత అని, అది నవరసాలతో భువిని శాసిస్తుందని – దాని సౌందర్యానికి ఆశ్చర్యపడనివారు, చెమ్మగిల్లనివారు ఉండరని చెప్పాడు. కాలానికి అది లొంగదు, కాలమే కవితకు దాస్యం చేస్తుంది అని చెప్పి దానికి అధినాధుడు కవి అంటాడు. కవితాప్రపంచ మధ్యమున దివ్య సింహాసనం కవిది అని కవి దానిని అనుభవిస్తూ ప్రజలకు పంచిపెడతాడని పేర్కొన్నాడు. కవి అంటే శబ్దార్ధాలను స్థానమెరిగి ప్రయోగించగల చింతన కలవాడని, సునిశితమైన సృష్టి స్వభావం తెలిసి విజ్ఞానం పొంగులువారుతూ ఉంటాడని, అంగాంగాలలో ఉడుకునెత్తురు ప్రవహిస్తూ ఆ కారణంగా పరాధీన జీవనం సహించడు అని, సార్వజనీన సత్యాన్ని వచించటానికి ఏ మాత్రం వెనుదీయడని, హృదయతంత్రి కదిలితే చాలు గానం చేసి తీరుతాడని అందువల్ల మరణమే ప్రాప్తిస్తుందన్నా వెనుదీయడని కవి స్వభావాన్ని నిగ్గు తేల్చి చెప్పాడు.

1934 నాటి ఈ వ్యాసంలో కవికి, కవితకు జాషువా ఇచ్చిన ఈ వివరణలకు అంతకు ముందరి ఆయన కవిత్వంలో ప్రారంభాలు, ఆ తరువాత 1966 వరకూ వ్రాసిన కవిత్వం లో కొనసాగింపులు ఉన్నాయి.వాటన్నిటిని కలుపుకొని చూస్తే కవి, కవి జీవనం, కవితా వస్తువు,కవితా లక్షణాలు, గుణాలు, విలువలు మొదలైన వాటి గురించి జాషువా భావనలు తెలిసి వస్తాయి.

1.

కవి అంటే ప్రజాపతి .. సృష్టి కర్త.. క్రాంత దర్శి . ఇలా చెప్తుంటారు. ఈ నిర్వచనాలు , వివరణలు అన్నిటిలో కవి చాతుర్వర్ణ వ్యవస్థలోని పై రెండు వర్ణాలలో దేనికో ఒక దానికి చెందిన వాడు అన్న సాధారణ అవగాహన అంతర్భాగం. అంఘ్రి భవుడి అంటే భగవంతుడి పాదాలనుండి పుట్టిన వాడి కావ్యానికి విలువలేదని నిర్ధారించిన భారతీయ కావ్య లక్షణ శాస్త్ర చరిత్ర మనది. ఈ సాంస్కృతిక నేపథ్యంలో పంచమవర్ణానికి చెందిన వాళ్ళ కవిత్వానికి ఎన్ని నిషేధాలు ఎదురవుతుంటాయో ఊహించవచ్చు.

భారతీయ సమాజంలో కవికి పుట్టుకతో వచ్చే కులం ఉంటుంది. కులం నన్నయ తిక్కనాది ప్రాచీన కవులకో విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, త్రిపురనేని రామస్వామి చౌదరి, తుమ్మల సీతారామమూర్తి వంటి సమకాలిక కవులకో సమస్య కాలేదు. జాషువాకు అయింది. ఎందుకంటే వాళ్ళు నాలుగు వర్ణాల వ్యవస్థ కు లోపలి వాళ్ళు. ఈయన బయటి వాడు. బయటివాళ్లను కవితా ప్రపంచం కూడా అంటరానివాళ్ళు గా చూస్తున్నదన్న అనుభవ స్పృహ ఆయనది. అది ఆయన కవిత్వంలో రకరకాలుగా వ్యక్తం అయింది.

హిమధారార్క పరిణయం (1917) లో కవిజన ప్రార్ధనా పద్యం ఒకటి ఉంది.ఆ పద్యంలో నడవటం మొదలుపెట్టిన బాలకుడు నేలమీద పడిపోతే చూచే వారు చేయిపట్టి లేపకుండా నవ్వితే చిన్నబోడా అని ఒక సామాన్యాంశాన్ని చెప్పి కవిగా నేనూ అలాంటి పిల్లవాణ్ణే , నా కావ్యంలో దోషాలు చూసి నవ్వకండి అని అని వేడుకొన్నాడు. ‘నా తప్పులను ముద్దుమాటలనుడి’ అని వినయంగా పేర్కొన్నాడు. ఈ రకమైన వినయం సాధారణంగా మొల్ల, తరిగొండ వెంగమాంబ మొదలైన స్త్రీల కావ్యాలలో కనబడుతుంది. ఈ వినయ స్వరం అధికార పురుష సాహిత్య ప్రపంచంలో కవులుగా , రచయితలుగా ఒకింత జాగా సంపాదించుకొనటానికి తపన పడే స్త్రీలది. మరి జాషువా ఎందుకు వినయ ప్రకటన చేయవలసి వచ్చింది.? కావ్య రచనలో ఇదే తన మొదటి ప్రయత్నం కావటం వల్లనా? అలాగైతే ప్రతి కవికి మొదటి ప్రయత్నం అంటూ ఒకటి ఉంటుంది కనుక అందరిలోనూ ఆ వినయం తప్పనిసరిగా కనబడవలసిందే. కానీ అలా లేదు లోకంలో. జాషువా విషయంలో ఇది మొదటి ప్రయత్నం కావటం వల్ల వచ్చిన వినయం అనటంకన్నా సవర్ణ సాహిత్య సమాజంలో తనకు అంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొనటానికి ప్రయత్నపరుడు అవుతున్నందువలన. అంటరానితనం తన కవిత్వానికి దోషాన్ని ఆపాదిస్తుందేమోనన్నసంకోచం నుండి అలవరచుకొన్న ఒద్దిక ఫలితమే అనుకోవాలి. ఇదే ఆయన కవిత్వంలో వేదనై విస్తరించింది.

ధ్రువ విజయము ( 1925) నాటకానికి వ్రాసిన విజ్ఞాపన లో “ కుల భేదాలు గణింపక కవిత్వ తత్వమెరిగి ఆదరించిన వారికి జోహారులు” అని చెప్పిన ముగింపు వాక్యం అయినా, ‘బ్రాహ్మణేతరుండనయి సమాదరణంబు లేమిం జీర్ణించుచున్న’ తన చాతురీ గరిమ గురించి పూర్వకవి స్తుతి( శివాజీ 1926 ) లో చెప్పుకొన్నా, వర్ణ ధర్మాన్ని ఖండించే బుద్ధిమంతులు అనాధ అయిన తన కవితా చంద్రాస్యను సమాదరించారని కృతజ్ఞతలు వ్యక్తం చేసినా – ఇవన్నీ కులభేదం కవికి చేసిన గాయాన్ని గురించిన నొప్పినే సూచిస్తాయి.

1937 లోపల జాషువా వ్రాసిన కవితా ఖండికలు రెండు భాగాలుగా సంపుటీకరించబడ్డాయి. మొదటి భాగంలోని ఖండికలు రాజ దర్శనం, సమదృష్టి. మొదటిది రావు వేంకట మహీపతి సూర్య రాయని సంబోధించి వ్రాసిన పద్యాల ఖండిక. రావు వేంకట మహీపతి సూర్య రాయ పిఠాపురం రాజు. సాహిత్య పోషకుడు. ఆయనతో తనకావ్యాలను అచ్చువేయించుకొనే ఆర్ధిక స్థితి గురించి చెప్పుకొంటూ చెప్పిన చివరి పద్యం కవికి కులానికి మధ్య ఉన్న వైరుధ్య సంబంధం పట్ల జాషువా అనుభవాన్ని నమోదు చేసింది.

“నా కవితా వధూటి వదనంబు నెగాదిగఁ జూచి రూపరే
ఖా కమనీయ వైఖరుల గాంచి “ భళీ !భళి యన్నవాఁడె మీ
దే కులమన్న ప్రశ్న వెలయించి , చివుక్కున లేచి పోవుచో
బాకున ( గ్రుమ్మినట్లగును పార్థివ చంద్ర ! వచింప సిగ్గగున్”

కవిత్వం బాగుంటుందంటారు. కవి కులం తెలిసిన తరువాత కవిత్వ నైపుణ్యాన్ని వదిలేసి న్యూనపరిచే అమానవీయ అసమ సంస్కృతి సాహిత్య రంగాన్ని ఏలుతుంటే అది కవికి ఎంత హింసగా ఉంటుందో అనుభవం నుండి చెప్పాడు జాషువా. భారతమాతను ఉద్దేశించి దేశ పరిస్థితులపై విచారం వ్యక్తం చేస్తూ చేసిన సంభాషణలో చివరి మాట కూడా దీనికి కొనసాగింపే. “చక్కని కవితకు , కులమే/ ఎక్కువతక్కువలు నిర్ణయించినచో , నిం/ కెక్కడి ధర్మము తల్లీ ?/ దిక్కుంజర వేదికా ప్రతిష్ఠిత గాత్రీ! (సమదృష్టి , ఖండకావ్యము, మొదటి భాగం 1937). కవిత విలువను కవి కులాన్ని బట్టి నిర్ణయించే పరిస్థితి అనుభవానికి వస్తున్న జాషువా ఇక ధర్మం ఎక్కడ అన్న ప్రశ్నతో నిర్వేదాన్ని వ్యక్తం చేసాడు. .

‘కళావిలాపం’(ఖండకావ్యము 5వ భాగం,1952) అనే ఖండికలో “కులగోత్రంబుల కొల్తతో కవులకున్ గొప్పదనంబిచ్చి “ సత్యానికి ద్రోహం చేసే పెద్దల స్నేహం వదులుకోవలసినదన్న భావాన్ని వ్య్వక్తం చేసాడు. కులాన్ని బట్టి కవులపట్ల , వారు వ్రాసిన కవిత్వం పట్ల వివక్ష గురించిన స్పృహ జాషువాకు 1925 నాటికే ఉన్నట్లు ధ్రువ విజయం నాటకానికి ‘విజ్ఞాపన’ అనే శీర్షికతో వ్రాసిన ముందుమాటను బట్టి తెలుస్తున్నది. తన లాగే, తనలాంటి వాళ్ళ లాగే సాహిత్య చరిత్రలో భట్టుమూర్తి శూద్రకవిగా వివక్షను ఎదుర్కొన్నవాడుగా గుర్తించాడు. ‘ఈర్ష్యా పిశాచ వృత చేతస్కులై శ్లేష కవిత్వ సింహమనందగిన భట్టుమూర్తి’ అంతటివాడినే నేటికీ నిరసించే ‘బుద్ధిమంతులు’ తన కవిత్వాన్ని ఇసుకరేణువు కింద లెక్క కడతారని ఊహించాడు. “ కవిత్వ తత్వమెఱింగి కులభేదములను గణింపక గుణములను బయలుపరచు విద్వత్కవులకు జోహారు చెప్తూ నాటకాన్ని అర్పిస్తున్నానని ఆ ముందు మాట ముగించాడు.

ఈ ముందుమాటలో ఏ భట్టుమూర్తి ని ప్రస్తావించి కవిత్వాన్ని కులప్రాతిపదిక పై విలువకట్టే వ్యవస్థ ప్రాచీనతను గుర్తుచేశాడో ఆ భట్టుమూర్తి గురించి ఒక ఖండిక కూడా వ్రాసాడు ఆ తరువాతి కాలం లో. (ఖండకావ్యము , మూడవ భాగం, 1946) పెద్దనాది కవులను తత్తరపాటుకు గురిచేసిన ఎదురు లేని సత్కవిగా భట్టుమూర్తిని పేర్కొని “ కాపు కవిత్వమెవ్వరికిఁ గమ్మదనం బగునంచు” లోపాలు ఎన్నుతూ రామలింగ కవి అవమానాలు ఎన్ని చేసినా కోపానికి రాక కావ్యాల పంట పండించుకుంటూ పోయాడని భట్టుమూర్తి ని ప్రశంసించాడు.

గబ్బిలం రెండవ భాగం (1946)లో కులం కారణంగా కవులకు జరుగుతున్న అవమానాలను ప్రస్తావించాడు జాషువా. “ కవిగారికిదే నమస్కారం బనెడు వారు కళకు లెమ్మని పరోక్షమున బలుకు / కవనంబునకు మేను గరిగి మెచ్చినవాడు కవిచెంత నెర బెఱికముగ మసలు/ విద్య కళంకంబు వెదక జాలని వాడు జాతిలేదని నోరు చప్పరించు /శాఖీయులకు సహస్రములు బోసిన దాత అన్యుల మధుర వాక్యముల దనుపు” అనికులాన్ని బట్టి కవులపట్ల వివక్ష వ్యక్తమయ్యే తీరులను చెప్తూ జీవకళలు చెక్కే శిల్పిని నిరసించి శిల్పమునకు పూజ చేసినట్లున్నదని నిరసించాడు. తన కులం వాళ్ళు వ్రాస్తున్న దుఃఖ రసోత్కటంబులగు పెక్కు కావ్యాలకు జాతి లుబ్ధ వజ్ర స్థిరచిత్తములు ఏమైనా కరుగుతాయా ? సంతోషిస్తాయా అన్న సందేహానికి అతనిని లోను చేశాయి ఈ పరిస్థితులు.

కథ ఏదైనా కవిత్వ సృజన శక్తి కి కుల అసమానతలకు ఉన్న వైరుధ్యాన్ని , అది సమసి పోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయటానికి సందర్భం కల్పించుకొంటాడు జాషువా. ముంతాజ్ మహల్ కావ్యం (1943) లో తాజ్ మహల్ నిర్మాణానికి ప్రేరణగా ఒక దరిద్రుడు భార్య వియోగ దుఃఖంలో శ్మశానాలు పట్టుకు తిరుగుతూ బూడిదతో అందమైన బొమ్మలు చేస్తున్న కథను కల్పించి వాటిలో ఒక బొమ్మ భార్యా వియోగ దుఃఖంలో ఉన్న షాజహాన్ కు ఊరట కలిగించిందని చెప్తూ ఆ సందర్భంలో “ కళలు మోహించుటకు కులీనుల కాదు /కులము లేదన్న వానిని గూడ వలఁచు” అని నిర్ధారణగా చెప్తాడు జాషువా. కులానికి సంబంధించిన ఉచ్ఛనీచాలను నశింప చేసే శక్తిగా కవిత్వ శిల్ప చిత్రలేఖనాది కళల సత్తాను సంభావిస్తాడు ఇక్కడ జాషువా.

ముసాఫరులు కావ్యం(1963)లో “ఆది న్నాలుగు జాతులు /ప్రాదుర్భావము నందె భారతమున నే /డే దేవుని దయవలెనో పాదు కొనియె వేనవేలు వర్ణాంతరముల్” అని వర్ణ వ్యవస్థను నిరసన స్వరంతో పేర్కొని ఆ తరువాతి పద్యంలో ‘మనవాడా కాదా’ అని దుష్ట కుల భావనతో -కవులను తరచి చూస్తారని సూచిస్తూ మనుషులను వేరు చేసి చూసే అనాది పండిత సంప్రదాయాన్ని గురించి బాధను వ్యక్తం చేసాడు జాషువా.

అయితే గుంటూరు పొగాకు వర్తకులు పూనుకొని తనను సన్మానించిన సందర్భాన్ని వస్తువుగా చేసి వ్రాసిన జోతలు అనే ఖండిక (ఖండ కావ్యము, ఆరవ భాగము, 1962) లో “ ఎవడీతండని కాని, యెందుకని కానీ , వంశ గోత్రాలతో / సవరింప దలపోయ కేకమతి భాషా భక్తి రూపింప నా / కవితా విగ్రహ రూపురేఖల నెదన్ గామించి రీవర్తక ప్రవరుల్… అని సర్వ సమత్వ దృష్టి సమాజంలో పూర్తిగా లేకుండా పోలేదని తృప్తి పడ్డాడు.

“నల్ల త్రాచుల్ బలె వర్ణభేదములు నాల్కల్ సాచు కాలంబునన్ / వలచెన్ నన్ను కవిత్వ వాణి” అని నాకథ రెండవ భాగంలో చెప్పుకొన్నాడు.

ఆ రకంగా జాషువా 1980ల తరువాత తెలుగునాట దళిత సాహిత్య ఉద్యమం ఆత్మగౌరవ చైతన్యంతో ధిక్కార స్వభావాన్ని సంతరించుకొనటానికి కావలసిన అనుభవ జ్ఞాన వారసత్వాన్ని అందించాడు.

2.

లౌకిక ప్రపంచంలో కులమే కాదు పేదరికం కూడా కవులను న్యూనపరిచే అంశంగా ఉందన్న గుర్తింపు జాషువాకు ఉంది. జాషువా పిఠాపురం రాజావారిని సందర్శించాడు. ఆ సందర్శన సారమే రాజ దర్శనము ఖండిక. కవి ప్రపంచంలో మిణుగురు పురుగులాగా తిరుగుతున్న ‘ఒకానొక పేదను’ అని తనను పరిచయం చేసికొన్నాడు. తెలుగు వాణికి సేవ చేసే కవుల జీవితంలో ఆకలి సమస్య ఉంటుందని,వ్రాసిన పుస్తకాలను అచ్చువేసుకోగల ఆర్ధిక స్థోమత లేక ఆరాట పడుతుం టారని పెద్దలు, సంపన్నులు, జమీందారులు, రాజులు దయగల చూపు తప్ప వాటికి పరిష్కారం లేదని పిఠాపురం రాజుకు విన్నవించాడు కవి. ‘కవి’ అనే ఖండికలో రసరాజ్యాన్ని ఏలే కవులు దారిద్య్ర మూర్తులై బ్రతుకుట ‘జాతికెల్ల తలవంపులు’ అంటాడు. ( ఖండకావ్యం , నాలుగవ భాగం1950) కవిగాని బ్రతుకు శ్రీ రామరామ’ అనే ఖండికలో ( ఖండకావ్యము, ఆరవ భాగం 1962) కవిగాని బ్రతుకు శ్రీ రామరామ’ అనే ఖండికలో ( ఖండకావ్యము, ఆరవ భాగం 1962) ‘ఋణబాధాక్రకచంబునన్’ – అంటే అప్పులబాధ అనే రంపపు కోతకు గురయ్యే కవుల దుస్థితిని గురించి ‘ బాధపడ్డాడు. కవిత్వం కూటికి గుడ్డకు రాదన్న వాస్తవానికి కలత చెందాడు.

“కవులు దరిద్రులం చెరిగి” కలిగినవాళ్లు పెళ్లిళ్ల సమయంలో వారిని పిలిచి శాలువా కప్పి కాస్త డబ్బిచ్చి సంభావన చేసే ఆచారం గురించి , దానికే సంతృప్తి పడి కవులు వాళ్ళను స్తుతిస్తూ పద్యాలు అల్లటాన్ని గురించి ఆవేదనగా చెప్పుకొన్నాడు తన స్వీయ చరిత్రలో. ఆంధ్రదేశము అనే ఖండికలో ( ముసాఫిరులు 1963) కూడా ఇలా శాలువలకు, పూవుదండలకు మురిసిపోయే పుట్టుదరిద్రులైన కవుల గురించి బాధపడ్డాడు.

కవులను ఆదరించటానికి, వాళ్ళ పుస్తకాలు అచ్చువేయించటానికి రాజులు , ధనికులు దాతలు కావాలని జాషువా అనేక సందర్భాలలో చెప్పాడు. తనకావ్యాలు అచ్చుకావటానికి తోడ్పడిన వారిని కృతజ్ఞతతో స్మరించుకొన్నాడు. తన కావ్యాలను వాళ్లకు అంకితం కూడా చేసాడు. అయినా వ్యత్యయము అనే ఖండికలో (కొత్తలోకము, 1957) రాజుకన్నా కవి జన్మ సార్ధకం అని నిరూపించాడు. ఒక వైపు మేడలు , మరొక వైపు పూరి గుడిసెలు ఉన్న అసమ ప్రపంచంలో ఆ రెండు స్థానాలలో పుట్టిన పిల్లలు వ్యత్యాసాల మధ్య పెరిగి ఒకడు రాజు , ఒకడు కవి అవుతాడని ఒక వూహ చేసాడు కవి. రాజుకు అధికారం, సంపదలు సహజం. కవి జీవితం కష్టాల మయం. బతుకు వ్యత్యాసాలలో రాజుది పైస్థాయి , కవిది కిందిస్థాయి. కానీ మరణంలో ఆ స్దాన వ్యత్యయం తారుమారు అవుతుందని జాషువా అనన్య సాధారణమైన వూహ చేసాడు. “ రాజు మరణించె నొక తార రాలిపోయె / కవియు మరణించే నొక తార గగనమెక్కె / రాజు జీవించేఱాతి విగ్రహములందు /సుకవి జీవించె ప్రజల నాలుకలయందు” అన్న పద్యం లో ఈ వాస్తవాన్నే చెప్పాడు. అందువల్లనే ఇది ప్రజల నాలుకపై నిలిచిన పద్యం అయింది.

3.

కవులను సత్కవులు,కుకవులు అని రెండు రకాలుగా పేర్కొని ప్రశంశించటం కావ్యరచనా సంప్రదాయంలో భాగంగా వస్తున్నది.సత్కవులను బట్టి సత్కవ్యాలు , కుకవులను బట్టి చెడ్డకావ్యాలు ఉంటాయి. కవిగా జాషువా కూడా ఈ మంచి చెడుల కోణం నుండి కవులను అంచనా వేస్తూ కావ్య లక్షణాలను నిర్ధారిస్తూ కవిత్వం వ్రాసాడు. లక్షణ శాస్త్రాలు, విమర్శ నిర్వహించే పని ఇక్కడ కావ్యమే చేస్తుంది. అంటే సృజన రచయితలు అయిన కవులు విమర్శకులు అవుతారన్న మాట. ఆ క్రమంలో జాషువా మొదటగా అభిరుచిలేని అధ్యయనాన్ని నిరసించాడు. గ్రంధం రసవత్తరమైనది. కానీ మహత్తరమైన ఆ గ్రంథగత అర్థం ఎరుగజాలక అంతా వ్యర్థం అనే వాళ్లు సహృదయ పాఠకులు కారని జాషువా అభిప్రాయం. ( కుశలవోపాఖ్యానం విజ్ఞాపనము 1922) సత్కవిత్వాన్నిగురించి ఒక మంచి మాట అయినా చెప్పక మూతిబిగించుకొని కూర్చునే వాళ్ళ అసూయా స్వభావాన్ని కూడా గుర్తించి నిరసించాడు ఆయన (శివాజీ , పూర్వకవి స్తుతి )

జాషువా కవిత్వ రచన ప్రారంభించే నాటికి తెలుగు కావ్యప్రపంచంలో భావకవితా శాఖ ప్రబలింది. భావకవిత్వ ఉద్యమానికి నాయకుడు దేవులపల్లి కృష్ణ శాస్త్రి. మార్మికత, ఊహా ప్రేయసి, ఒంటరి రోదన వీటిపై జాషువా విమర్శ ‘అయోమయము’ ( ఖండకావ్యము , మొదటి భాగము) కవిత అయింది. భావకవిత్వాన్ని ఆయన అయోమయ కవిత్వంగా భావించాడు. ‘నూత్నపుంగవిత’ అని దానిని నెత్తినపెట్టుకొని ఊరేగుతున్న వాళ్ళను వెక్కిరించాడు. కమ్మని భావముగల పద్య మ్మొక్కటి వ్రాయలేని అసమర్థులుగా వాళ్ళను తీసి పారేసాడు. పేలవమైన అభిప్రాయాలను వరిగడ్డివలె కూరి పైకి ఇంత ఆకారాన్ని చూపించే కావ్య వైఖరికి విచారించాడు. పేరు భావకవిత్వం .. ఊహాప్రేయసిని అభావకవితాచిత్రాంగి అని ఈసడించుకొని అసలు ఎందుకీ రహస్యం ఆమె ఎవ్వరో చెప్పరాదటయ్యా అని భావకవిని సంబోధించి వ్రాసాడు ఈ ఖండికను.

‘కవితా లక్షణము’ (ఖండకావ్యము, రెండవ భాగము, 1937) అనే కవిత వ్రాసాడు జాషువా. కవిత ఉండవలసినతీరు , ఉండకూడని తీరు రెండింటినీ నిష్కర్ష చేసి పెట్టాడు. కవిత ఎలా ఉండాలి? కుదురైన కావ్యం పొదుగు బరువున నెమ్మదిగా అడుగులేస్తూ వస్తున్న పాడి ఆవులాగా, హంస నడకలోని సహజ రాజసం లాగా , కదను తొక్కే గుర్రాల గర్వపు మెడల వంపుల కులుకుల పసందు లాగా ఉండాలని అంటాడు. శ్రేష్టుడైన కవి కావ్యప్రపంచంలో ప్రతి పదం మధురరస భరితమైన ద్రాక్ష పండ్ల గుత్తి అందంతో ప్రకాశిస్తుంది అని పేర్కొన్నాడు. కావ్యం ఎలా ఉండాలో చెప్పటానికి మూడు పద్యాలు వ్రాసిన జాషువా , ఎలా ఉండకూడదో చెప్పటానికి ఒకేఒక తేటగీతి వ్రాసాడు.
“సందిటకు రాని వృద్ధ భూషణములెన్నొ
తనువున దగిల్చి , కావ్య సుందరిని దిద్ది
బరువు మోయించి , తత్వంబు మఱచి పోవు
కవి యెఱుంగఁడు వ్యంగ్య వాగ్గర్భ మహిమ” – కావ్యానికి భూషణలు అంటే అలంకారాలు. అవి ఒకటో రెండో ఉంటే సహజ సౌందర్యం ప్రకాశిస్తుంది. కానీ పట్టరానన్ని పాత అలంకారాలు దిగేసి కావ్యాన్ని తీర్చిదిద్దాము అని కవులు మురిసి పోవచ్చు గానీ అది బరువు చేటు తప్ప మరేమీ కాదు. ఆలా చేసే కవులు కావ్యతత్వాన్నే మరిచిపోతున్నారు అని జాషువా అభిప్రాయం. కావ్యతత్వం వ్యంగ్యం. దానినే ఆనంద వర్ధనుడు ధ్వని అన్నాడు. దాని సంగతి తెలియని కవులు కావ్యాన్నివిపరీతంగా అలంకరమయం చేసి వికృతం చేస్తారు. కనుక అలాంటి కావ్యరచన కూడనిది అని చెప్పినట్లయింది.

తిరుపతి వెంకటకవులను ప్రశంసిస్తూ వ్రాసిన పద్య ఖండికలో (ఖండకావ్యము, రెండవ భాగము) “ కొబ్బరికాయ పాకమునకుం గురియై, తలబొప్పిగట్టు ప్రా / గబ్బములెల్ల మూలబడగా , నొక తీయని త్రోవఁ ద్రొక్కి , మీరబ్బురపుం ప్రబంధములనల్లి” నారని వాళ్ళ ప్రత్యేకతను పేర్కొన్నాడు. కవిత్వం శైలిని బట్టి కదళీ పాకం, ద్రాక్షపాకం, నారికేళ పాకం అని మూడురకాలు. అవి ఒక దానికన్నా ఒకటి కఠిన తరమైనవి. అరటిపండు ఒలిచి తిన్నంత సులభంకాదు కొబ్బరికాయ కొట్టి తినటం. కవిత్వాన్ని శ్లేష చిత్ర బంధ కవితా పద్ధతులతో సంక్లిష్టం చేసిన సందర్భాలను జనవ్యవహారిక వాక్య విన్యాస శైలితో విప్లవాత్మకంగా మార్చారు తిరుపతి కవులు. పద్యాన్ని సులభ సుందరం చేసిన కవులను మెచ్చుకున్నాడు జాషువా. అంటే జాషువా దృష్టిలో కవిత్వం తలబొప్పికట్టించే రాతి స్వభావంతో ఉండరాదు.

గబ్బిలము రెండవభాగంలో ప్రసక్తాను ప్రసక్తంగా కవిత్వం గురించి తన అభిప్రాయాలను ప్రకటించిన జాషువా పెద్దపెద్ద రాళ్లు దొర్లించినట్లు వ్రాసే కవిత్వం పఠితలను బెదర గొడుతుందే కానీ పండిత ప్రపంచాన్ని దాటి ప్రజలలోకి వ్యాపించదని గుర్తించి చెప్పాడు. అంతే కాదు కావ్య వస్తువు గురించి , వస్తువును వ్యక్తీకరించటానికి ఎంచుకొనే పదజాలం గురించి కూడా మాట్లాడాడు. వ్యాకరణం దుష్టం అని, వ్యవహార భ్రష్టం అని పద వినిమయం మీద అనేక నిషేధాలు విధిస్తుంది. దానిని జాషువా నిరాకరించాడు. వ్యవహారంలో లేకపోవచ్చు, కానీ రసభావ స్ఫూర్తి కలిగించే శబ్దాలు ఎన్నో గ్రామీణ భాషలో ఉన్నాయని వాటిని స్వీకరించకపోతే కవిత్వానికి విలువలేదని భావిస్తాడు.

కథ ప్రసిద్ధం అయితే – అంటే అందరికీ తెలిసిన ఏ భారత రామాయణ గాధ అయివుంటే కవిత్వం కొంత బలహీనంగా ఉన్నా కావ్యం కీర్తి తెచ్చిపెట్టవచ్చునని అంటాడు.కానీ కాందిశీకుడు కావ్యానికి వ్రాసుకొన్న భూమికలో “కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు” అన్న భట్టుమూర్తి మాటను ప్రస్తావించి కాల పరిణామాన్ని బట్టి కవి తాను దర్శించిన సత్యాన్ని వ్యక్తీకరించటానికి కొత్త వస్తువులను స్వీకరించవలసి వస్తుందని భావించాడు. అవి హృదయంగమములై రసోత్పత్తిని కలిగింప గలిగితే కథ కల్పితమా అకల్పితమా అన్న వివక్షకు తావు లేదని అభిప్రాయపడ్డాడు. సూత్రం ఏదైనా సృజనకు అవరోధం కాకూడదు అన్నది తాత్పర్యం.

అలాగని పాతను పూర్తిగా వదిలెయ్యటం కూడా ఆయనకు అభిమతం కాదు. నేటి కైత ( ఖండ కావ్యము, మూడవ భాగం 1946) లో పూర్వ కవిత్వ పుంతలు పాడుపడ్డాయని, ఛందో నియమాదులు భ్రష్టమయ్యాయని బాధపడటం దానినే సూచిస్తుంది. కట్టుబాట్లలో ఉత్తమ మధ్యమ అధమ భేదాలు ఉన్నాయని చెప్తూ వానిని కొద్దిగా మరమ్మతు చేసుకోవాలే గానీ మొత్తంగా ఒదిలెయ్యటం జాషువాకు సమ్మతం కాదు.

అయినప్పటికీ “తెనుగు కవిత్వమన్న నొక తెన్నున బోయెడు పద్దు గాదు .. “ అనే పద్యంలో “ ప్రాసలు’ గణముల్ , యతుల్ పదము సాగగ నీయవు అని నిస్సహాయతను వ్యక్తం చేయనే చేసాడు. కట్టుబాట్ల సంకెలలు విదిల్చి భావమతికించుట అంత సులభం కాదని ఒప్పుకున్నాడు ( మలికోర్కె, కొత్తలోకము).

4.

కవి అంటే ఎవరు? కవిత్వం అంటే ఏది అన్న ప్రశ్నవేసుకొని సమాధానాన్ని చక్కని సీస పద్యంలో కూర్చి పెట్టాడు జాషువా ( కవి, కవిత, 1934 ఇతర ఖండకావ్యాలు ) గీర్వాణకవుల కావ్యమార్గాలలో ఒళ్ళు చెమటపట్టేట్లు నడవాలన్నాడు. కవిత్రయం పెట్టిన కావ్య భిక్ష – మహాభరతం – బాగా చదవాలన్నాడు. ఇతర దేశ కావ్యాలను చదివి గుణాలు స్వీకరించాలి అన్నాడు. ఆధునిక కవుల కావ్యాలు చదివి కొత్తదనం అర్ధం చేసుకొవాలన్నాడు. తెలుగు కావ్యాన్ని ఎరువు సొమ్ములతో అలంకరించకుండా హృదయానుభవానికి ప్రాధాన్యమిచ్చి నడిపించాలని అన్నాడు. కవికి వ్యుత్పత్తి బలం ఉండాలని జాషువా ఆశించాడు. వ్యుత్పత్తి బలం అంటే అధ్యయనంవల్ల సమకూడే శక్తి. సృజనాత్మక ప్రతిభకు పదును పెట్టటంతో పాటు అది వివేకాన్ని పెంచుతుంది. కవి అంటే అలాంటి విస్తృత అధ్యయనం, నిశిత పరిశీలన కలిగి ఉండాలన్నమాట. కవిత్వం అంటే బాహిర అలంకరణ బరువుతో కాక ఆంతరిక అర్ధ సౌందర్యంతో భాసించేది అని అతని అభిప్రాయం.అయితే ఇక్కడ అధ్యయనానికి ఇంత ప్రాధాన్యతను ఇచ్చిన కవి మరొకచోట ( ఫిరదౌసి ) గ్రంథ సమయూదాయమంతా చదవవచ్చుగానీ రసము సృష్టి చేయు ప్రజ్ఞా విశేషం “సాధనమున రాదు చదువుగాదు” అని చెప్పటం ద్వారా ప్రతిభకు పెద్దపీట వేసినట్లయింది.

“ఏ కవి పిచ్చిగా నడచు పృథ్వికి లోబడి కీర్తి కోసము
ద్రేకము సంహరించుకొని దేశము వోయిన త్రోవ బోవునో
ఆ కవి పేడుమూతి మగడంబుజ గర్భుని రాణిగారికిన్
సాకుడు బిడ్ద డాస్తిగల సామికి బేరసిక ప్రదాతకున్” గబ్బిలం రెండవ భాగంలో పద్యం ఇది. ఈ పద్యంలో ఈ నాడు మనకు అభ్యంతరకరమైన పేడు మూతి మగడు వంటి మాటలు పక్కకు పెట్టి చూస్తే కవి కీర్తికోసం సహజ న్యాయ ఉద్రేకాలను చంపుకొని లోకం పోయిన మార్గాన పోయే కవులను భరించలేడన్న విషయం తెలుస్తున్నది. అట్లా పోయే వాళ్ళు డబ్బుగల వారి పెంపుడు బిడ్డలు అవుతారుగానీ కవితా ప్రపంచానికి వాళ్ళవల్ల కొంచమైనా ప్రయోజనం ఉండదని స్పష్టంగానే చెప్పాడు జాషువా.

కావ్య సృష్టికర్త అంటే కవి. కవి జిహ్వ విశ్వసత్యాన్ని ఆలపించాలని, దృష్టి చుట్టుపక్కల తేరి చూడగలిగినది కావాలని, బుర్రలు పుక్కిటి పురాణాలలో చిక్కుకొనరాదని జాషువా ఆశించాడు. “ప్రభువుల పెండ్లి పేరంటాలు వర్ణించి కాలంబు పెక్కేం డ్లు ఖర్చుపెట్టి” అని ప్రారంభమయ్యే సీస పద్యంలో కవులు స్వార్ధపరులై బాధితులు, దుఃఖితులు అయిన వాళ్ళ ఆర్తధ్వనికి పెడచెవి పెట్టి ‘భువన హితము గోరు కవితా కళా శక్తిని’ ప్రభువుల పెళ్లిళ్లు , విరహవేదనలు వర్ణించటానికి, అంగాంగ వర్ణనలు చేయటానికి, మళ్ళీ మళ్ళీ అదే రామకథను చెప్పటానికి దుర్వినియోగం చేసారని జాషువా అభిప్రాయపడ్డాడు. మరొక చోట భయపెట్టే అస్వాభావిక కథా వేదాంత శాస్త్రాలకు చేతులు మోడ్చె అమాయక ప్రజలు సేవిస్తుంటే భోగ సముద్రంలో ఈతలు గొట్టే కవులను ఈసడించుకొన్నాడు.

కవులు భావదాస్యం చేయరాదని, ప్రజ్ఞను విస్మరించి ప్రవర్తించరాదని ఆశిస్తాడు జాషువా ‘కవి’ అనే ఖండికలో. ‘నేను’ అనే కవితలో ( ఖండకావ్యము , ఐదవ భాగం, 1952) “ సకల కార్మిక సమాజముల జీవిత కథనకము లాలించు కర్ణములు నావి / కఠిన చిత్తుల దురాగతములు ఖండించి కనికరమొలకించు కలము నాది” అన్న సీసపద్య పంక్తులు గమనించదగినవి. కవిగా ఆయనకు ఆదర్శం శ్రమజీవుల యధార్ధ జీవిత వ్యథార్థ గాధలు తెలుసుకొనటం. దుర్మార్గాన్ని ఖండించి , బాధితులపక్షాన దయతో నిలబడటం రచనకు లక్ష్యం. అలా చెప్పాడంటే కవులందరికీ దానినే ఆదర్శంగా చూపుతున్నాడన్న మాట. మతపిచ్చి , వర్ణ దురహంకారం, స్వార్ధ చింతన కృతులందు ఉండరానివి అని తొలికోర్కె ఖండికలో సూచించాడు. (కొత్తలోకము ) అందులోనే మరొక చోట కవిత్వం అంటే ఏమిటో వివరించాడు. కుల మత రాజకీయాలకు గురికాకుండా మంగళకరమైన సత్యాన్ని కమ్మని వాక్కులలో నిర్భయంగా పలికేది కవిత్వం అంటాడు. కులమత రాజకీయాలతో ప్రమేయం లేకపోవటం, సత్యాన్నే చెప్పాలి, మృదువుగా చెప్పాలి అనే పట్టుదల , ఏమి చెప్తే ఎవరు బాధపడతారో అన్న భయం లేకుండా చెప్పే స్వభావం మంచి కవిత్వ నిర్మాణ కారకాలు అని ఆయన అభిప్రాయం.

జాషువా నాకథ అనే పేరుతో స్వీయచరిత్రను పద్య రూపంలో వ్రాసుకొన్నాడు. ఇది మూడు భాగాలుగా ప్రచురించ బడింది. మొదటి భాగంలో భాషా పరిశ్రమ అనే ఉప శీర్షికతో తన సాహిత్య జీవితయాత్రను చెప్పుకొన్నాడు. అందులో జాషువా కావ్యదృష్టి తెలిసివస్తుంది. పద్యం అల్లటం నేర్చుకొని ఆనాటి తిరుపతి వెంకటకవులు , కొప్పరపు కవులు మొదలైన వాళ్ళ ప్రభావంతో అవధాన విద్య అభ్యాసం చేసిన రోజులను తలచుకొంటూ తనకాలపు కవుల కావ్య వస్తువు గురించి అసంతృప్తిని వ్యక్తంచేశాడు. సీతారాముల పెండ్లి పేరంటాలు, రాధాకృష్ణుల శృంగారం, త్రేతాద్వాపర యుగాలనాటి యజ్ఞ కర్మలు తప్ప కథావస్తువు మరేమీ లేనట్లు వ్రాస్తున్న ధోరణిని ఆక్షేపించాడు. సోదర మానవుల కష్టాలు, ఆకలిమంటల దీర్ఘ దారిద్య్రం కవులకు సాహిత్యవస్తువు గా ఆలోచించ వలసినదే కాకపోవటం గురించి ఆందోళన చెందాడు. ఆంధ్రదేశము ( ముసాఫిరులు ) అనే ఖండికలో “ ముసిరిన మూఢత్వమునే/ యుసి కొల్పుచు ప్రాచి బట్టి యున్న దివౌ/ కస కథలు గిలికి పఠితల / విసికింతురు కుండలాల విద్వద్గజముల్” అంటాడు. మూఢత్వాన్ని పెంచే పాతబడ్డ దేవుళ్ళ కథలు కావ్య వస్తువుగా చేసి ఇంకెంతకాలం ప్రజలను విసిగించటం అన్న ప్రశ్నను రేకెత్తించాడు.

“లలితకళలు దేవతల కంకితములై
ప్రజలకెప్పు డందుబాటు గావు
కాళిదాసు మొదలు కవి రాక్షసుని దాక
మానలేదు రాజ మందిరాలు”
ఈ పద్యం పరిశీలిస్తే . కవులు రాజులను ఆశ్రయించుకొని ఉండటానికి కవిత్వం ప్రజలకు అందుబాటులో లేకపోవటానికి మధ్య ఏదో సంబంధం ఉన్నదన్న స్పృహ కూడా జాషువాకు ఉన్నట్లే అనిపిస్తుంది.

ఈ విధంగా కవిగా జాషువా కవిత్వ రూపంలోనే కవి, కావ్యం, వస్తువు , కావ్య హేతువు, కవి నిబద్ధత మొదలైన అంశాలపై తనదైన దృక్పథాన్ని ప్రకటించుకున్నాడు. యాభై ఏళ్ల క్రితపు సామాజిక చైతన్య పరిమితులలో ఆయన చేసిన ఈ ఆలోచనలు నిస్సందేహంగా పురోగమన శీలమైనవే. వర్తమాన సందర్భం నుండి వీటిలో నిలబడగలిగినవి ఏవో , మరింత అభివృద్ధి పరచుకొనవలసినవి ఏవో,వదిలెయ్యవలసినవి ఏవో నిర్ధారించుకొని జాషువా వారసత్వాన్ని గుణాత్మకంగా ముందుకు తీసుకొనిపోవటం మన వివేకానికి, చైతన్యానికి సంబంధించిన విషయం.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply