జయజయహే తెలంగాణ

కాలం కదలడం లేదా, ఆగిపోయిందా, ముందుకు నడిచినట్టు అనిపిస్తూనే వెనక్కి నడుస్తున్నదా వంటి ప్రశ్నలు నిత్యజీవితంలో ఎన్నోసార్లు కలుగుతుండగా, వాటిని అర్థం చేసుకోవడానికీ చర్చించడానికీ ఈ శీర్షిక ప్రారంభించాను. ఇప్పటికి స్థూల విశ్లేషణలు మాత్రమే చేశాను. కాని ఎప్పటికప్పుడు జరుగుతున్న సూక్ష్మ సంఘటనల మీదా, పరిణామాల మీదా కూడా ఈ ప్రశ్నలు చర్చించాలని నా కోరిక. ఈ నెల అటువంటి ఒక ఉదంతం, పరిణామం అందరి దృష్టికీ వచ్చినదే జరిగింది. అది తెలంగాణలో కాలం కదలికకు, ముందు వెనుకల నడకకు మంచి ఉదాహరణ.

అది అందెశ్రీ రాసిన ‘జయజయహే తెలంగాణ’ గీతం గురించి తలెత్తిన వివాదం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో ప్రఖ్యాతమైన ఆ గీతాన్ని, దాదాపుగా ఉద్యమకారులందరూ “జాతీయ గీతం”గా, “రాష్ట్ర గీతం”గా భావించిన ఆ గీతాన్ని, తొలి పది సంవత్సరాల ప్రభుత్వం నిర్లక్ష్యం చెయ్యడం, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం, ఆ ప్రకటన రేకెత్తించిన వివాదం తెలంగాణ సమాజంలో కాలం నడకకు ఒక నిదర్శనం.

ఈ గీతం చరిత్రలో 2003 నుంచి 2024 దాకా కాలం నడిచినట్టే ఉంది, కాని ఎన్నోసార్లు కాలం నిలిచిపోయింది, వెనక్కి కూడ నడిచింది. ఇప్పుడు చివరికి ఆ గీతపు చరిత్రే నిలిచిపోయిందా అని అనుమానం కూడా కలుగుతున్నది.

దాన్ని జాతీయ గీతం అనాలా, రాష్ట్ర గీతం అనాలా అనేదే కాలం నడకకు సంబంధించిన ప్రశ్న. భారతదేశంలో ఉన్న చప్పన్నారు జాతుల్లో తెలుగువాళ్లం ఒక జాతి అనుకున్న కాలం ఒకటి ఉంది. వలసవ్యతిరేక ఉద్యమ క్రమంలో అన్ని రాజకీయ పక్షాలూ భారత ఉపఖండం విభిన్న జాతుల నిలయమనే అనుకున్నారు, అన్నారు. “జాతి అంటే సామూహిక సంస్కృతిగా తనను తాను నిర్ధారించుకునే, భాష, ప్రాదేశికత్వం, ఆర్థిక జీవనంతో కూడిన, చారిత్రకంగా రూపొందిన సమూహం” అని అద్భుతమైన, సమగ్రమైన నిర్వచనం ఇచ్చినది జె వి స్టాలిన్ అని ఎంతమందికి తెలుసునో గాని, ఆయన చెప్పిన ఉమ్మడి సంస్కృతి, ఉమ్మడి భాష, ఉమ్మడి ప్రాంతం, ఉమ్మడి ఆర్థిక జీవనం, ఉమ్మడి చరిత్ర అనే ఐదు ప్రమాణాలలో భాషను ఒక్కదాన్నే ప్రాతిపదికగా తీసుకుని భారత జాతీయ కాంగ్రెస్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పరచడం తన లక్ష్యంగా ప్రకటించింది. జాతి సమస్య మీద లెనిన్, స్టాలిన్ ల అవగాహనలు అనుసరించి కమ్యూనిస్టులు ప్రతి జాతికీ విడిపోయే హక్కుతో సహా స్వయం నిర్ణయాధికార హక్కు ఉండాలన్నారు. ఆ భావధారలో ఇరవయో శతాబ్ది తొలి అర్ధభాగంలో తెలుగు జాతి అనే భావన పెల్లుబికింది. అటు బ్రిటిష్ పాలనలో ఉన్న తెలుగువారైనా, ఇటు నిజాం పాలనలో ఉన్న తెలుగువారైనా ఒకే జాతి అనుకున్నారు.

1947 తర్వాత హఠాత్తుగా నాలిక మడత వేసిన అన్ని రాజకీయ పక్షాలూ భారత జాతి అంతా ఒకటే అనీ, దేశం లోపల భిన్న జాతులను గుర్తించబోమనీ అనడం మొదలుపెట్టాయి. అయినా వేరు వేరు భాషా సమూహాలలో, ముఖ్యంగా సాహిత్య సాంస్కృతిక రంగాలలో జాతి భావన తొలగిపోలేదు. ‘తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది’ అని కవి అన్నప్పుడు వ్యక్తమైనది అదే. అలా తెలుగు జాతీయ గీతాల రచన, ప్రచారం విరివిగానే సాగాయి.

ఆ ఉమ్మడి జాతి భావనతోనే ఏకమైన ఆంధ్రప్రదేశ్ పాలకులు ‘పెద్దమనుషుల ఒప్పందాని’కి తూట్లు పొడిచి, తెలంగాణకు అన్యాయం చేయడం మొదలుపెట్టాక, తెలంగాణలో మళ్లీ ప్రత్యేక అస్తిత్వ భావనలు చెలరేగినప్పుడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు వెల్లువెత్తినప్పుడు, ‘ఆంధ్ర జాతి వేరు, తెలంగాణ జాతి వేరు’ అనేంత తీవ్రమైన జాతి – ఉపజాతి వాదనలు కూడ తలెత్తాయి. ఆ వేడిలో తెలంగాణ “జాతీయ” గీతాలు కూడా వచ్చాయి. ఆ అర్థంలోనే మరెందరో రాసిన మరెన్నో గీతాలతో పాటు అందెశ్రీ రాసిన ‘జయజయహే తెలంగాణ’ కూడా “జాతీయ గీతం”గా గుర్తింపు పొందింది. రాష్ట్రాన్ని జాతి అనవచ్చునో లేదో అనుమానం వచ్చినప్పుడల్లా ఆ “జాతీయ గీతాన్నే” “రాష్ట్ర గీతం” అనే ఆనవాయితీ కూడా మొదలైంది.

సరే, అది జాతీయ గీతమా, రాష్ట్ర గీతమా అనే అవగాహనా సమస్య, కాలపు సమస్య అలా ఉంచి, అసలది ఆ రెంటిలో ఏదో ఒకటి ఎందుకు కాలేకపోయింది అనేడి కాలం విసిరిన మరొక ప్రశ్న. కాలం వేసిన చిక్కు ముడి.

దొరుకుతున్న ఆధారాల ప్రకారం, కామారెడ్డిలో 2003 మార్చ్ లో జరిగిన ఒక తెలంగాణ సభలో తనకు ఈ “జాతీయ గీతపు” ఆలోచన వచ్చిందని అందెశ్రీ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 2003 నవంబర్ లో ఆదిలాబాద్ లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక సభలలో, తెలంగాణ పతాకావిష్కరణ తర్వాత పతాక వందనంగా ఈ గీతాన్ని పాడారని ఆధారాలున్నాయి. అప్పటికి ఆ గీతం ఒక పల్లవి, నాలుగు చరణాలు మాత్రమే ఉండేవి. క్రమంగా అది దాదాపు ప్రతి తెలంగాణ సభలో పాడడం, తెలంగాణ మీద ఆ కాలంలో విరివిగా వెలువడిన పత్రికలలో, పుస్తకాలలో ప్రచురించడం మొదలయింది. అప్పుడు పుట్టిన ఎన్నో సంస్థలలో, వేదికలలో ఒకటైన తెలంగాణ ఉత్సవ్ 2006లో ఈ గీతాన్ని యూ ట్యూబ్ మీదికి ఎక్కించింది. క్రమంగా ఆ గీతం సిడిల మీదికి కూడా ఎక్కింది.

2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నామని ప్రకటించి, మర్నాడే వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వ మోసానికి భగ్గుమన్న తెలంగాణ అప్పటి నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకూ పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచాయని అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ధూమ్ ధామ్ అనే కార్యక్రమం వేలాది గ్రామాలలో, పట్టణాలలో జరిగినప్పుడు, అక్కడి ఆటా మాటా పాటా కార్యక్రమాలలో జయజయహే తెలంగాణ గీతం ఒక ప్రధానాంశంగా ఉండింది. ఆ ఐదు సంవత్సరాలలో వెల్లువెత్తిన తెలంగాణ సాంస్కృతిక సృజన వికాసంలో వందలాది మంది పాటల రచయితలు, గాయకులు పుట్టుకు వచ్చారు, దాదాపు ప్రతి ఒక్కరి గొంతులోనూ జయజయహే తెలంగాణ మార్మోగింది. అప్పటికి ఆ గీతంలో మరొక రెండు చరణాలు చేరాయి. అంటే పల్లవి, ఆరు చరణాల గీతంగా మారిందది. ఆ ఆరు చరణాల గీతం ఆ కాలంలో అనేక తెలంగాణ ఉద్యోగ సంఘాల డైరీలలో కూడా ప్రచురితమయింది.

ఇంత ప్రాముఖ్యతనూ గౌరవాన్నీ ఆదరణనూ సంపాదించుకుని ప్రతి నాలుక మీద ఆడిన ఈ గీతం సహజంగా తెలంగాణ జాతీయ గీతంగానో, రాష్ట్ర గీతంగానో గుర్తింపు పొందుతుందని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కాని 2014 జూన్ 2న కాదు గదా, ఆ తర్వాత పదేళ్ల కాలంలో ఆ గీతానికి అధికారిక గుర్తింపు దొరక లేదు. ఉద్యమకాలపు ప్రభావం వల్ల విద్యార్థులూ ఉపాధ్యాయులూ ఉద్యోగులూ సాధారణ ప్రజలూ పాడుకుంటున్నారు, పాఠశాలల్లో, కార్యాలయాల్లో పాడుకుంటున్నారు. కాని ప్రభుత్వం అధికారికంగా గుర్తించలేదు. కాలం నిలిచిపోయిందనడానికి అది మరొక గుర్తు.

అంతకు ముందరి గీతంలో ఒకటో రెండో చరణాలు కె చంద్రశేఖర రావు కలిపారని, కనుక ఇద్దరి సంయుక్త రచనగా ప్రకటిద్దామని ప్రతిపాదించారని, ఆ ప్రతిపాదనకు అందెశ్రీ అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్యా వైమనస్యాలు పెరిగాయని, అది అంతిమంగా గీతం మరుగున పడడానికి కారణమయిందని వదంతులు వచ్చాయి. నిజానిజాలు ఎవరికీ తెలియవు గాని అధికార పార్టీ బహిరంగంగా ఆ గీతం గురించి మౌనం వహించడం ప్రారంభించింది.

తర్వాత పది సంవత్సరాలలో మూసీలో చాల కన్నీళ్లూ నెత్తురూ ప్రవహించాయి. అందెశ్రీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బహిరంగంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయి కాంగ్రెస్ గద్దెనెక్కింది. కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వ పనులను తిరగదోడే ప్రతీకార రాజకీయాలు ప్రారంభించింది. బహుశా ఆ కారణం వల్లనే కావచ్చు, కొత్త ప్రభుత్వం ఆ ప్రతీకార రాజకీయాలలో జయజయహే గీతాన్ని తురుఫు ముక్కగా వాడుకోదలచింది. ‘జయజయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గీతంగా ప్రకటించింది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినం రోజున దాన్ని విడుదల చేస్తామని ప్రకటించింది.

మళ్లీ ఒకసారి జయజయహే వివాదాస్పదంగా చర్చలలోకి వచ్చింది. ఈ గీతాన్ని ఎవరితో పాడిస్తున్నారు, దానికి సంగీతం ఎవరు సమకూరుస్తున్నారు అనేవి మొదట వివాదాస్పదమయ్యాయి. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ఉండే ఈ గీతం పాడడానికి, సమగీతం సమకూర్చడానికి తెలంగాణ వారెవరూ దొరకలేదనే, సరిపోరనే మాట తెలంగాణ వాదులను నొప్పించింది. ఇది ఒకరకంగా 1930లలో తెలంగాణలో కవులు లేరని ఒక ఆంధ్ర విమర్శకుడు చేసిన దురహంకార వ్యాఖ్యకు పునరుక్తి. అంటే నిలిచిపోయిన కాలానికి గుర్తు.

మొదటిసారి ప్రభుత్వ అధికారం సంతరించుకున్న ఈ గీతం, తన ఇరవై సంవత్సరాల ఉత్తేజకర స్వభావాన్నీ, ప్రజా భాగస్వామ్యాన్నీ కూడ వదులుకునే దిశలో సాగింది. ఇప్పుడు ఈ గీతం పూర్తి పాఠం పల్లవి కాక పదకొండు చరణాలకు, అంటే మొత్తం 10 నిమిషాల 32 సెకన్ల నిడివికి పెరిగింది. అధికారిక గీతం అంత సుదీర్ఘంగా ఉండడానికి వీలు లేదు గనుక పల్లవి, రెండు చరణాలతో రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకన్ల పాఠం కూడ తయారు చేశారు.

జాతీయ గీతం, రాష్ట్ర గీతం అన్నప్పుడు ప్రాదేశిక నైసర్గిక అంశాలు, చరిత్ర, సంస్కృతి, ప్రజాజీవనం, ప్రాంతీయ విశిష్టత వంటివన్నీ అందులో ప్రతిఫలించాలి. కాని పదకొండు చరణాల పూర్తి పాఠంలో మూడు చరణాలు కేవలం ప్రాచీన కవిత్వ చరిత్ర మాత్రమే ఉంది. అదే అంశం మరొక మూడు చరణాలలో కూడా పాక్షికంగా కొనసాగింది. అంటే పదకొండు చరణాలలో ఆరు చరణాలు కవిత్వ చరిత్ర, కవుల ప్రశంస మాత్రమే అన్నమాట. ఆ కవిత్వ చరిత్ర కూడా మధ్యయుగాల కవిత్వ ప్రశస్తి మాత్రమే. “జాతీయగీతం” పద్దెనిమిదో శతాబ్ది దాటి ఇవతలికి వచ్చి ఆధునిక కాలం వైపు తొంగిచూడనైనా లేదు. అలాగే ప్రాదేశిక నైసర్గిక అంశాలలో నదులున్నాయి తప్ప ఇతర అంశాలు లేవు. మొత్తం రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేదు. చరిత్రలో ప్రధానమైన అంశాలు లేవు, ఉన్నవైనా అంత ప్రధానమైనవి కావు. సంస్కృతి, ప్రజా జీవనం, ప్రాంతీయ విశిష్టత కనబడవు. మొత్తం మీద గీతం నడుస్తున్న కాలానికి అనుగుణంగా, ప్రతిబింబంగా, ప్రతిఫలనంగా నడవలేదు.

మరికొన్ని విచిత్రమైన అంశాలు కూడా ఉన్నాయి. గీతంలో అవసరం లేనిచోట్ల కూడా సంస్కృత సమాసాలు, బరువైన మాటలు ఉండడం, వీలైన చోట్ల కూడా తెలంగాణ మాటలు లేకపోవడం కొట్టవచ్చినట్టు కనబడుతుంది. కంచర్ల గోపన్న – భక్త రామదాసు గురించి చెప్పేటప్పుడు, “రాములోరి గుడి కట్టి” అని అనవసరమూ, ప్రస్తుత సందర్భంలో నరేంద్ర మోడీని స్ఫురణకు తెచ్చే అవకాశమూ ఉన్న మాటలు పెట్టారు. తొలి పాఠాలన్నిటిలోనూ “గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు” అని ఉండగా, ఇప్పుడు అధికారిక గీతంలో “గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగు చార్మినారు” అని మార్చారు. హైదరాబాదుకు ఎప్పుడూ భాగ్యనగరి అనే పేరు లేదు. ఒకరిద్దరు పదిహేడో శతాబ్ది యాత్రికుల కథనాలలో ఉన్న బాగ్ నగర్ అనే మాట, సంస్కృత భాగ్య కాదు, అది బాగమతి పేరు. సంఘ్ పరివార్ కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసినవే. అవి ఇప్పుడు అధికారిక గీతంలోకి ఎక్కాయన్నమాట.

మరొక పక్క, తెలంగాణ చరిత్రలో అత్యంత ప్రధానమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట (1946-51) ప్రస్తావన లేకపోవడం, పాలకుర్తి అయిలమ్మ, దొడ్డి కొమరయ్య, షోయెబుల్లా ఖాన్ వంటి వీరయోధుల పేర్లు లేకపోవడం తప్పకుండా గుర్తించదగిన అంశం. పైగా కొమురం భీం, పండుగ సాయన్న, మీరేసాబు వంటి పేర్లు ఉండి, వారితో సమానమైన, లేదా ఇంకా ప్రధానమైన పేర్లు లేకపోవడం యాదృచ్ఛికమని అనుకోలేము.

తెలంగాణలో కాలం ముందుకు నడవడం లేదు. ముందుకు నడుస్తున్నట్టు అనిపించినప్పుడు కూడా వాస్తవానికి అది నిలిచిపోయి ఉంటున్నది, లేదా వెనక్కి అడుగులు వేస్తున్నది.

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
ర‌చ‌న‌లు: 'స‌మాచార సామ్రాజ్య‌వాదం', 'క‌ల్లోల కాలంలో మేధావులు - బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌', 'అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌', 'క‌థా సంద‌ర్భం', 'క‌డ‌లి త‌ర‌గ‌', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, 'పోస్ట్‌మాడ‌ర్నిజం', 'న‌వ‌లా స‌మ‌యం', 'రాబందు నీడ‌', 'క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌', 'ప‌రిచ‌యాలు', 'తెలంగాణ‌ - స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, వాస్త‌వాలు', 'శ్రీశ్రీ అన్వేష‌ణ‌', 'లేచి నిలిచిన తెలంగాణ‌', 'ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జాద్రోహం - శ్రీకృష్ణ క‌మిటీ నివేదిక‌', 'రాబందు వాలిన నేల‌', 'ఊరి దారి- గ్రామ అధ్య‌య‌న ప‌రిచ‌యం', 'విద్వేష‌మే ధ్యేయంగా విశాలాంధ్ర మ‌హార‌భ‌స‌', 'క‌విత్వంతో ములాఖాత్‌', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాద‌క‌త్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంట‌లు', 'హైద‌రాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జ‌న హృద‌యం జ‌నార్ద‌న్‌', 'స‌మ‌గ్ర తెలంగాణ' పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

One thought on “జయజయహే తెలంగాణ

  1. Sir— geetham avasaramaa venu garu >????
    Andesri — he thinks that he is sri sri //tagore ??
    His comments about Dalitulu— not right one
    Too much ego
    Kcr added 2 sentences —bogus gossip news

Leave a Reply