2005లో ప్రొద్దుటూరులో విరసం సదస్సును పోలీసులు అడ్డుకొని హాలు ఓనర్ ను బెదిరించి హాలుకు తాళం వేసేశారు. మీటింగ్ సమయానికి కొంచెం ముందు మేమక్కాడికి చేరుకొని అవాక్కయ్యాం. నాకైతే అటువంటి అనుభవం మొదటిసారి. నేను ఆ ఏడాదే విరసం సభ్యత్వం తీసుకున్నా. కాస్త పుస్తక జ్ఞానం తప్ప ఏ ఉద్యమాలతో పరిచయం లేదు. సదస్సుకు బైటి ఊర్ల నుండి వచ్చిన వక్తలు విషయం తెలుసుకొని ప్రెస్ మీట్ కు కూడా రామనేశారు. హాలు బైట నిలబడి ఏం చేయాలా అని మిత్రులంతా ఆలోచనలో పడ్డారు. అప్పుడు జయశ్రీ వచ్చింది. అప్పటికి చాలా సార్లే చూశాను గాని నేరుగా మాట్లాడినట్లు గుర్తు లేదు. ‘సాహిత్య సభ అంటే మీరేదో వస్తువు, శిల్పం, పునాది, ఉపరితలం అని మాట్లాడుకుంటుంటారు, నాకయన్నీ అర్థమై సావదు కదా అని రాలేదు. వాడు బీగాలేసినాడంటే వచ్చినా’ అంది. రచయితలు వాడే భాష గురించి జోకులు వేయడమే కాదు, ‘నా హార్మోనియం నేను వాయించాల గదా’ అంది. మేం నవ్వినవ్వి చచ్చాం. సమాజంలో అణచివేత గురించి, హింస, వివక్షతల గురించి సాహిత్య సృజన చేస్తున్న రచయితలు నేరుగా ఆ అణచివేత ఎదురైనప్పుడు ముఖం చాటేస్తే, హక్కుల కార్యకర్త జయశ్రీ అక్కడ ప్రత్యక్షమయ్యారు. సభలు, ప్రసంగాలు ఆమెకు పడవు. ఫీల్డ్ లో పనిచేయకుండా ఎందుకివన్నీ అనేది.
ఆరోజు ప్రెస్ మీట్ తర్వాత మీరు దీని మీద కంప్లయింట్ ఇవ్వాలి అని, మానవ హక్కుల కమిషన్ ను ఎట్లా అప్రోచ్ అవ్వాలో చెప్పింది. అప్పటి నుండి ఆమె ఇంటికి వెళ్ళడం మొదలైంది. సరే, ఆ కంప్లైంట్ ఏమీ ఫలితం ఇవ్వలేదనేది వేరే విషయం. బాలగోపాల్ తరచుగా కడప జిల్లాకు వచ్చేవాడు. వాళ్ళు నిజనిర్ధారణకు వెళ్లేటప్పుడు నువ్వూ వస్తావామ్మా అని జయశ్రీ అడిగేది. నేను సంతోషంగా వెళ్ళేదాన్ని. ఆమెను చూస్తే భలే సంభ్రమంగా ఉండేది. చాలాసార్లు మగవాళ్ళందరి మధ్య ఆమె ఒక్కతే మహిళ. అయితే అందరూ ఆమె మాట కోసం, దిశానిర్దేశం కోసం చూసేవాళ్ళు. సహజంగానే ఇది నాకు ఆకర్షిణీయంగా కనపడేది.
మా చిన్నతనంలో జయశ్రీ గురించి ప్రొద్దుటూరు జనం ఆశ్చర్యంగా మాట్లాడుకోవడం లీలగా గుర్తు. నక్సలైట్ జయశ్రీ అని, ఆమె అంటే పెద్దపెద్ద నాయకులు కూడా హడాలిపోతారని, ఆమె గుంపును వెంటేసుకొని డాషింగ్ లేడీలా తిరిగేదని.. సుమారుగా అలా అనుకునేవాళ్ళు. నాకు పరిచయమైన జయశ్రీ చాలా సరదాగా, ఎటువంటి స్థితిలోనూ చిక్కగా నవ్వుతూ ఉండేది. ఆమె మానవ హక్కుల ఉద్యమంలోకి ఎలా వచ్చింది, ఆమె జీవిత నేపథ్యం గురించి ఇప్పటికే మిత్రులు రాసి ఉన్నారు కనక ఆ వివరాల్లోకి పోను కానీ శారీరకంగా, మానసికంగా ఆమె ఎంతో సంఘర్షణను అనుభవించారు. చిన్నతనం నుండీ ఉండే గుండె జబ్బు వెంట కాలక్రమంలో చాలా అనారోగ్య సమస్యలు తోడయ్యాయి. ఆమె చివరి సంవత్సరాల్లో ఊరికూరికే అలసిపోయే శరీరాన్ని తన మానసిక స్థైర్యంతో నెట్టుకుపోవడం నేను చూశాను.
ఆమె చాలా మొండి మనిషి. తాను నిర్ణయించుకున్న తర్వాత ఎవరి మాటా వినదు. కాలేజీ రోజుల్లో అబ్బాయిలతో పోటాపోటీగా అల్లరిచేసేదని ఆమె మిత్రులు సరదాగా గుర్తుచేసుకుంటారు. పుస్తకాలు గుండెలకు హత్తుకొని తలవంచుకొని నడుచుకుంటూ పోయే అమ్మాయి కాదు ఆమె. నిటారుగా నడిచేదట. ఆమె వెంట నడుస్తూ అమ్మాయిలు సేఫ్ గా ఫీలయ్యేవారట. తండ్రి ఆధునిక భావాలు గలవాడు కావడం చేత, ఆయన ఎనిమిది మంది కూతుర్లను అప్పట్లోనే ఉన్నత చదువులు చదివించాడు. అందర్లోకి జయశ్రీ చాలా చురుకు. ఆఖరి బిడ్డ కావడం వల్ల కుటుంబంలో అందరూ ముద్దుగా చిట్టీ అని పిలిచేవారు. మా ఊర్లో పాతవాళ్ళు ఆమెను చిట్టెక్క అంటారు. మాకు మాత్రం జయశ్రీ మేడం.
ఎంత స్వేచ్ఛను అనుమతించినా ఆరోజుల్లో ఒక ముస్లింను పెళ్లిచేసుకోవడం భూకంపం పుట్టించే విషయమే. నిజానికి ఈరోజుకు కూడా అలాగే ఉందన్నది వేరే విషయం. అఖ్తాబ్ గారిని జీవిత సహచరునిగా ఎన్నుకోవడం ఆనాడు ఎంతో సాహసంతో కూడిన నిర్ణయం. దాని పర్యవసానాలు చాలా ఏళ్ల పాటు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులేనా, కుటుంబం నుండి వెలివేతలేనా… ఇంట్లో అందరి కంటే చిన్నదిగా ఎంతో గారాబంగా పెరిగిన జయశ్రీ కఠినమైన జీవిత వాస్తవికతలోకి వచ్చిపడినట్లయింది.
ఎంవి రమణారెడ్డి వారి కుటుంబానికి సన్నిహిత మిత్రుడు. ఆయన దగ్గర అడ్వకేట్ గా మొదలైన ఆమె కెరియర్ పౌరహక్కుల ఉద్యమ పరిచేయంతో తొందరగానే పూర్తి మలుపు తిరిగింది. రాడికల్ విద్యార్థి ఉద్యమం, రైతుకూలీ, కార్మిక సంఘాల ప్రభావం ఉన్నరోజులవి. రాయలసీమలో పెత్తందార్లను ఎదిరించడం నేర్పిన పోరాటాలు. ఎన్కౌంటర్లు, అక్రమ నిర్బంధాలు, ప్రజలపై పోలీసు వేధింపులు –వీటికి వ్యతిరేకంగా పౌరహక్కుల సంఘం గొంతెత్తేది. పోలీసులు వర్సెస్ పౌరహక్కుల సంఘం పరస్పర స్టేట్మెంట్లు, కరపత్రాలు, పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాలు అదంతా ఇప్పుడు చరిత్ర కాని ఆ రోజుల్లో ఒక మహిళ అంత సాహాసికంగా ముందుకొచ్చి మాట్లాడ్డం అంటే ఆశ్చర్యమే. ఈ చరిత్ర పట్ల కనీసం శ్రద్ధ లేని జయశ్రీ మీద మాకు బోలెడంత కోపం ఉంది. ఆనాటి కరపత్రాలు, పేపర్ కటింగ్స్ ఒక పెద్ద కట్ట తనదగ్గరుండేవి. అఖ్తాబ్ రికార్డ్ చేస్తుంటాడని చెప్పింది ఒకసారి. వాటి గురించి ఒకసారి అడిగితే అవన్నీ పోయాయని సింపుల్ గా చెప్పేసింది. ‘అయ్యో’ అంటే పెద్దగా నవ్వేసింది.
సరే, అటువంటి వాతావరణంలో పౌరహక్కుల ఉద్యమం పరిచయమయ్యాక, ముఖ్యంగా బాలగోపాల్ ఆచరణ చూశాక కొంత కాలం బతికినా ఇలా అర్థవంతంగా బతకాలని నిర్ణయించుకున్నట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఏ క్షణమైనా ఆగిపోవచ్చు అనుకున్న గుండె ముప్పై ఏళ్ల పాటు సామాజం కోసం కొట్టుకుంటూనే ఉంది. మార్పు కోసం పరితపిస్తూనే ఉంది.
నాకు జయశ్రీ పరిచయమయ్యాక ఒక ఏడాదిలోనే 2006 లో పులివెందుల ప్రాంతంలో యురేనియం మైనింగ్ ప్రతిపాదన వచ్చింది. కడప జిల్లాలో అన్ని ప్రజాసంఘాలను, ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని యురేనియం వ్యతిరేక వేదికను ఏర్పాటు చేయడంలో ఆమెదే కీలక పాత్ర. అంతకు ముందు నల్గొండ యురేనియం వ్యతిరేక పోరాట అనుభవాలను మాకు పరిచయం చేయడమే కాదు, జార్ఖండ్ రాష్ట్రంలోని జాదూగూడ యురేనియం మైనింగ్ దుష్ఫలితాల మీద రిపోర్టులన్నీ సేకరించి ఇచ్చింది. నేను ఆ అధ్యయనాల మీద ఆసక్తి చూపడంతో ఆమె ఇక నన్ను వదల్లేదు. జయశ్రీతో పాటు వేముల మండలంలోని తుమ్మలపల్లె పరిసర గ్రామాలన్నీ ఎన్నో సార్లు తిరిగాను. ఇంటింటికీ పోయి అందర్నీ పిలిచి మీటింగ్ ఏర్పాటు చేయడం మొదలు, వినతి పత్రాలు, ఫిర్యాదులు, కోర్టు కేసులు అన్నీ నడిపించేది. ఇవన్నీ చేయడానికి ఎక్కడికక్కడ ఆమె పరిచయాల్లోని స్నేహితుల సహకారం తీసుకునేది. ఆమె గ్రామస్తులతో కుటుంబసభ్యురాలిగా కలిసిపోయేది. అవ్వలు, తాతలు ఆమెతో జోకులేసేవాళ్ళు. వారితో కలిసి ఆమె గలగలా నవ్వేది. పరిచయమయ్యాక రెండో రోజుకే ఎంతో పరిచయమున్నట్టు పొట్టి పేర్లు పెట్టి పిలిచేది.
పులివెందుల ప్రాంతంలో వైయస్ కు వ్యతిరేకంగా మాట్లాడ్డం, ఉద్యమించడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. కనుక ఇక్కడి సమస్యకు విస్తృత ప్రచారం కల్పించాలని ఎంతగానో ఆరాటపడింది. ఆమెకు స్థానికంగా మీడియాతో మంచి పరిచయాలుండేవి. విలేకర్లను వెంటబడి మరీ వార్తలు రాయించింది. రాష్ట్రవ్యాప్తంగా, ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజాసంఘాల నాయకులను, శాస్త్రవేత్తలను, పర్యావరణ ఉద్యమకారులను ఇక్కడికి రప్పించి పులివెందుల యురేనియం గురించి మాట్లాడేలా చేసింది. ఒకదశలో ప్రజలు యురేనియం ప్లాంట్ పెట్టొద్దని ఉద్యమించేదాకాపోయింది. అన్ని రకాల కుట్రలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులు చేసి రాజశేఖర రెడ్డి స్వయంగా అక్కడ యురేనియం మైనింగ్ ప్లాంట్, శుద్ది కర్మాగారం ఏర్పాటు చేయించాడు. ‘సక్సెస్ఫుల్ గా ఓడిపోయినామమ్మా’ అంది జయశ్రీ. ఇది కూడా నవ్వుతూ చెప్పింది. అది జీర్ణం చేసుకోడానికి నాకు సమయం పట్టింది. మనవి ఓడిపోయే ఉద్యమాలే లే అనేది చాలా సార్లు. చేసేదేమీ లేదని అందరూ వదిలేశారు గాని జయశ్రీ మాత్రం చివరి దాకా ఆ పల్లెలు తిరుగుతూనే ఉంది. క్రమంగా అక్కడ విధ్వంసం మొదలై పంటలు, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినసాగాయి. చాలా కాలం తర్వాత నేను జయశ్రీతో ఆ ఊర్లకు వెళితే ‘వచ్చినావా తిక్క తల్లీ’ అని ఒక పెద్దాయన పలకరించాడు. అందరూ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు గనక ఈమె వాళ్ళ దృష్టిలో తిక్కతల్లి. వంటి మీద గడ్డలు వచ్చినవాళ్ళను సొంత ఖర్చులతో కడపకు తీసుకెళ్ళి, పరీక్షలు చేయించి రిపోర్ట్స్ కోసం టెన్షన్ గా ఎదురు చూసింది తిక్కతల్లి. అవి కాన్సర్ గడ్డలు కావు అని తెలిసి ఊపిరి పీల్చుకుంది.
చెప్పుకుంటూపోతే ఆమెతో కలిసి తిగిన పదిహేనేళ్ళలో వందల కొద్దీ అనుభవాలున్నాయి. జిల్లాలో తెలియని ఊర్లను, మనుషులను, సమస్యలను నాకు పరిచయం చేసింది. చాలాసార్లు రాయలసీమ సమాజం పొట్ట విప్పి చూపినట్లు అనిపించేది. రేపు పులివెందులలో కరపత్రాలు పంచాలి, పొద్దున్నే రెడీగా ఉండు, పోదాం అని చెప్పిందొకసారి. కరపత్రాలు పంచడానికి ఇంతదూరం నుండి పోవాలా అంటే అవును మనమే పంచాలి అంది. ఎంత దౌర్జన్యకారులైనా ఆడవాళ్ళ జోలికి రారు. ఇక జయశ్రీ అంటే జిల్లాలో అందరికీ తెలుసు. ఇంకెవరుపోయినా రిస్క్ తీసుకున్నట్లే.
ఎన్.ఆర్.సి. వ్యతిరేక ఉద్యమంలో స్థానికంగా అందర్నీ కూడగట్టింది జయశ్రీయే. స్వయంగా ఎంతో మంది ముస్లిమేతరులను కలిసి సమస్య వివరించి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అట్లా కాలేజీలకు వెళ్ళి ప్రచారం చేయడంలో, ఇంగ్లీష్ మీడియం – తెలుగు మీడియం చర్చ జరుగుతున్నప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు తిరిగి క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయడంలో ఆమెదే ప్రేరణ చొరవ. లెక్క లేనన్ని మహిళా సమస్యలు, పిల్లల మీద లైంగిక వేధింపులు, మద్యం వ్యతిరేక ఆందోళనలు – తెల్లారితే ఏదో ఒక సమస్య గురించి జయశ్రీ నుండి తరచూ ఫోన్ రావడం జీవితంలో ఒక భాగమైపోయింది.
అట్లా ఉదయాన్నే ఫోన్ రాక రెండు నెలలైంది. నిద్ర లేవకముందే ఫోన్ అంటే అది జయశ్రీదే. ‘పేపర్ చూసినావా? సెలవు పెట్టి రానీకి ఐతుందా?’ ఎన్ని సార్లు విసుక్కొని ఉంటానో! ‘నేను మీతో తిరగలేను అని చెప్పాలనిపిస్తుంది. తీరా ఇదీ పని అంటే కాదనలేను.’ ‘నువ్వు బాగా రాయగలవు. ఫీల్డ్ తిరిగితే ఇంకా బాగా రాయగలవు’ అనేది. దారి పొడవునా వందల కొద్దీ విషయాలు చెప్పి ఉంటుంది. పొట్టపగిలేలా నవ్వించేది. రాత్రుళ్లు నిద్ర పట్టనివ్వని విషాదాలెన్నో చెప్పేది. ఎంతో మంది ఆడవాళ్ళు తమ తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేని విషయాలు, పంచుకోలేని దుఃఖాలు ఆమెతో పంచుకుంటారు మరి. ఎన్ని ఘోరాలు, ఎన్ని దుర్మార్గాలు.. చాలా సార్లు నిద్ర పట్టదుమ్మా అనేది. ఇంటికి రమ్మని చెప్పి ఆ స్త్రీల వంటి మీద గాయాలు నాకు చూపించిన సందర్భాలున్నాయి. ఒక్క జయశ్రీ ఏం చేయగలదు, ఎంత చేయగలదు? సమస్య బైటికొస్తుంది. తర్వాత చాలాసార్లు బాధితులు సర్దుకుపోయి, లొంగిపోతారు. ‘ఎట్ల చేయాలి, మన సామాజానికి ఎప్పుడు నోరొస్తుంది’ అని బాధపడేది.
‘ఓపికుండడం లేదు తల్లీ. ఎక్కడికీ తిరగొద్దని డాక్టర్ అంటాడు. ఏమీ చేయకుండా బతకడం ఎందుకు’ చివరి నెలల్లో అన్నదొకసారి. ఓపికుండడం లేదని పదేళ్ళ నుండి అంటూనే ఉంది కాబట్టి సీరియస్నెస్ అర్థం కాలేదు. ప్రజాజీవితం లేకపోతే జీవితమే లేదు అనుకున్న జయశ్రీ ఆరోగ్యరీత్యా చేయకూడని ప్రయాణం చేసి తిరిగి రాకుండా వెళ్ళిపోయింది. నేనిప్పట్లో రాలేను, ఫలానా చోటికి వెళ్ళి ఆ గొడవేదో తెలుసుకొని ఫాలో అప్ చేయండి అని చివరి గంటలో మెసేజ్ పెట్టింది. ఆమెకు చివరి వీడ్కోలు పలికాక ఆమె చెప్పిన పని చేసి వచ్చాం.
ప్రొద్దుటూరులో ఏమూలకెళ్ళినా ఆమెతో కలిసి తిరిగిన జ్ఞాపకాలు చుట్టుకుంటున్నాయి. సూటిగా, నిక్కచ్చిగా చక్కని కడప భాషలో అలవోకగా రాజకీయాలు మాట్లాడే ఆ గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ మాటల్లోని విరుపు, వ్యంగ్యం, సునిశిత విమర్శ తలపుకొస్తూనే ఉంటాయి. వెచ్చగా అల్లుకున్న ఆమె నవ్వులు, ఆమె స్నేహం ఎప్పటికీ మాలోనే ఉంటాయి. జయశ్రీకి ప్రేమపూర్వక జోహార్లు.
👍✊✊
Maa Satyam
పి. వరలక్ష్మి గారు రాసిన
“జనం కోసం పరితపించిన గుండె” వ్యాసం లో మానవ హక్కుల కార్యకర్త జయశ్రీ గారి జీవిత ఆచరణ లోని పలు సంఘటనలను, వారితో ఉన్న అనుభవాలను తెలియజేశారు. నిజమే! జయశ్రీ గారు పేర్కొన్నట్లు
“ఫీల్డ్ లో పనిచేయకుండా ఎందుకివన్నీ.” అనేది తన జీవిత ఆచరణలో నుంచి వచ్చిన ఎంతో స్ఫూర్తిదాయకమైన మాట.
రాజ్యము తో రాజీపడక
తను నమ్మిన విశ్వాసాలను ప్రజా ఉద్యమాలలో ప్రతిఫలింప చేస్తూ, కొన ఊపిరి వరకు హక్కుల అణిచివేతలను ప్రశ్నిస్తూనే ఉంది.
వరలక్ష్మి గారు వ్యాసంలో పేర్కొన్నట్లు
“ప్రజాజీవితం లేకపోతే జీవితమే లేదు అనుకున్న జయశ్రీ ఆరోగ్యరీత్యా చేయకూడని ప్రయాణం చేసి తిరిగి రాకుండా వెళ్ళిపోయింది. నేనిప్పట్లో రాలేను, ఫలానా చోటికి వెళ్ళి ఆ గొడవేదో తెలుసుకొని ఫాలో అప్ చేయండి అని చివరి గంటలో మెసేజ్ పెట్టింది. ఆమెకు చివరి వీడ్కోలు
పలికా క ఆమె చెప్పినపని చేసి వచ్చాం.”
చక్కగా వుంది వ్యాసం… జయశ్రీ గారి ఆచరణ ధీరత్వాన్ని కళ్ళ ముందు ఉంచారు..