ఛీ

హత్యాచార౦ వార్త విన్నప్పుడల్లా
పుట్టని నా భూమి వారసుల తల్లి పేగు తెగిపోయినట్టనిపిస్తుంది
నాగరికత వెన్నెముక ఉన్నపళాన వొరిగిపోయినట్టనిపిస్తుంది
చీకటి ముసిరిన కబోది పక్షినవుతాను
ఈ దుఖాన్ని ఒడిసిపట్టుకుని ఎక్కడికెళ్ళాలో తెలియదు
ఎటు చూసినా వెంటాడే అవయవాలే
నుంచున్న అవయవాలు, కూచున్న అవయవాలు
ఆధ్యాత్మిక వచనాలు పలుకుతున్న అవయవాలు
అవయవాల బురదలో ఒక్క మనిషి మొహం దొరికితే
బావుండును అనుకుంటాను
చూసి చూసి ఎవరినయినా చనువుగా పలకరించాలనుకుంటానా
నవ్వుతున్న దంతాల మీద రక్త చారిక కనిపిస్తుంది
అది నీ బిడ్డదా? నా బిడ్డదా? లేక అతని బిడ్డదా?
రక్త చారిక నిజమైతే రక్త సంబధమూ అబద్ధమే కదా
సర్వ మానవ సంబంధాలకు నిప్పుపెట్టినట్టే కదా
ఇంతకూ అతనెవరు?
ఒకవేళ నా తండ్రా? తమ్ముడా? కొడుకా? నా స్నేహితుడా ?
ఛీ
వాడి పుట్టుక కూడా ఒక అత్యాచారమే అయి వుంటుంది

పుట్టింది హైదరాబాద్అ.  బాల్యం , విద్యాభ్యాసం విజయవాడలో గడిచాయి. 1977 లో విజయవాడ మేరీ స్టెల్లా కాలేజీలో బి.ఎ. డిగ్రీ చదివారు. వృత్తిరీత్యా విలేకరి. ప్రవృత్తిరీత్యా సృజనాత్మక రచయిత్రి. ఒక వాదానికి బలమయిన ప్రతినిధిగా వస్తు వైవిధ్యంలోనూ, భావ గాంభీర్యంలోనూ ఒక ప్రత్యేక ముద్ర కోసం కృషి చేశారు. 1978 లో ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదక శాఖలో కెరీర్ ప్రారంభించి దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ప్రచురణ , ప్రసార, అంతర్జాల మాధ్యమాల్లో సబ్ ఎడిటర్ , ప్రోగ్రామ్ ప్రెజెంటర్ , కంటెంట్ ఎడిటర్ స్థాయిలో పనిచేశారు. రచనలు: సందిగ్ధ సంధ్య (1988), నడిచేగాయాలు(1990), బాధా శప్తనది(1994), మల్టీనేషనల్ ముద్దు(2001), కథాసంపుటాలు: శత్రుస్పర్శ (1998), ఎచటికి పోతావీ రాత్రి(2019). 2000 లో అభివృద్ధి రంగంలో అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ లో జండర్, అండ్ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ గా  పని చేశారు. అన౦తరం అర్బన్ డెవలప్ మెంట్ , వెలుగు ప్రాజెక్టులకు న్యూస్ లెటర్ ఎడిటర్ గా, కొంతకాలం అధికార భాషా సంఘంలో వ్యవసాయ , పాలనా అంశాలకు సంబంధి౦చిన నిఘంటువు రూపకల్పనలో పాత్ర వహించారు. ప్రస్తుతం జండర్ సమాచార రంగాల్లో శిక్షకురాలుగా , పాఠ్యా౦శాల రచయితగా , అనువాదకురాలుగా వున్నారు. గ్రీన్ థాట్ పేరుతో thematic poetry వీడియోలు రూపకల్పన చేస్తున్నారు. కవుల కవిత్వంతో ఫోటోషాప్ , గ్రాఫిక్ బొమ్మలు visul poetry అనే వినూత్న ప్రక్రియ చేపట్టి కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు.

3 thoughts on “ఛీ

  1. Navvuthunna danthaala meeda raktha chaarika

    Vaadi puttuka koodaa Oka athyaachaarame ayi vuntadi
    Superb poetry

  2. చూసి చూసి ఎవరినయినా చనువుగా పలకరించాలనుకుంటానా
    నవ్వుతున్న దంతాల మీద రక్త చారిక కనిపిస్తుంది
    అది నీ బిడ్డదా? నా బిడ్డదా? లేక అతని బిడ్డదా?
    రక్త చారిక నిజమైతే రక్త సంబధమూ అబద్ధమే కదా
    సర్వ మానవ సంబంధాలకు నిప్పుపెట్టినట్టే కదా
    ……మానవ సంబంధాలకు నిప్పు పెట్టినట్టే కదా సూటిగా నిప్పులా కడిగేశారు.. powerful poem sir
    ….తిప్పేస్వామి

Leave a Reply