ఏడాది గడువలేదు
పాలస్తీనా – అమెరికా కవి అబూ రషీద్
తన మృతదేహాన్ని
ఆకాశంలో పాతరేయమని అడిగి
పాదాల కింద నేల కోల్పోయి
దశాబ్దాలుగా పోరాడుతున్న ప్రజలు
ఒక్కొక్కటే కోల్పోతున్నారు
ఆత్మ విశ్వాసమూ, స్వేచ్ఛాకాంక్ష పోరాట పటిమ తప్ప
పసిపిల్లలను, సహచరులను, తలిదండ్రులను
బాంధవ్యాలన్నీ కోల్పోతున్నారు
అనుబంధం తప్ప
ఆసుపత్రి శత్రువుకు అనుమానిత లక్ష్యమైంది
శరణార్థి శిబిరమిపుడు శత్రుదాడికి సాకు అయింది
ఐక్యరాజ్య అంతర్జాతీయ సహాయం
ఏకపక్ష నిషేధానికి గురైంది
మనుషులు మెసిలే స్థలాలు లేవు
శిథిలాలు తప్ప సమాధులు లేవు
నీలి సముద్రమంతా నావికా స్థావరాలు
ఆహార సహాయం కాదు శత్రువుకు ఆయుధాల సరఫరా
ఆక్రమణలో గాజా ఒక్కటే లేదు
ఆక్రమణ దాడి ఇపుడు ఆకాశానికి విస్తరించింది
పేజర్లు పేలాయి వాకీటాకీలు పేలాయి
వైద్యభాషలో అంటారు
శరీరంలో ఏదో ఫారిన్ బాడీ చేరిందని
హమాస్, హిజ్బుల్లాల కోసం ఇజ్రాయిల్ వేట
ఆకాశ ఆక్రమణ యుద్ధమైంది
లెబనాన్ ఇరాన్ లపైన.
దాతలు, విద్యాదాతలు
బాధ లేకుండా హాయిగా చచ్చే శాంతి నిలయాలు
నిర్మించిన కాన్సర్ ఫండమెంటల్ పరిశోధకులు
బిల్ గేట్లు, మస్క్ లు, అంబానీలు, ఆదానీలు
అభివృద్ధి నిర్మాతలంతా విధ్వంస యుద్ధంలో ఉన్నారు
శాంతి దూతలంతా ప్రచ్ఛన్న యుద్ధంలో ఉన్నారు
గుజరాత్ నుంచి కగార్ దాకా వృద్ధి రేటుకు
మారణకాండలు కొలమానం
ప్రపంచ యుద్ధాలను నివారించే విశ్వ గురువు
దైవాంశ సంభాషణకు నీరాజనం
ఇజ్రాయిల్ ప్రతీకార దాడికి ఆయుధాలందించే
అమెరికాది కాల్పుల విరమణ దౌత్యం
అవును గదా,
ఆరుగురు పిల్లలకు
గుడారం ఇరుకైంది గానీ
బూడిదయితే… కన్నతల్లి అరచేతిలోకొస్తారు
అవనీ, ఆకాశమూ, అన్ని గ్రహాలు
సామ్రాజ్యవాద జియోనిస్టు విస్తరణకు
గురయినపుడు
మనిషికి స్థలం మిగలనపుడు
చేతులు చాచి
అక్కున చేర్చుకోవాల్సింది
మానవ హృదయమొక్కటే.
*
(30 అక్టోబర్, 2024)