పిల్లల్ని కొడితే తండ్రనుకున్నారు!
ఆ పిల్లల తల్లిని కొడితే మొగుడనుకున్నారు!
ప్రజల్ని కొడితే పోలీసనుకున్నారు! కాదు, పోలీసే! పోలీసు యేక వచనం కాదు! అసలు యిది యే వొక్క పోలీసో చేసిన చర్య కాదు! పోలీసు చర్య!
అందరు పోలీసులూ అంతే! లాఠీ వుంటే కొడుతున్నారు! తుపాకీ వుంటే కాల్చేస్తున్నారు! మొదట్లో కొందరు పువ్వులిచ్చి దండం పెట్టారు! కాని యిప్పుడు అందరూ కత్తిగట్టి కక్ష్యగట్టారు!
ఎప్పట్నుంచి?
కరోనా వచ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి!
ముందు మాత్రం?
మొదట్నుంచీ అంతే! ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేశాడని లాఠీతో కనుగుడ్లు రాలిపడేలా కొట్టడం కొత్తా? సైకిలు దొంగతనం చేశాడని సెల్లులోనే కుల్లబొడిచి లాకప్ డెత్ చెయ్యడం కొత్తా? ఫామిలీ కేసుల్లో లాఠీ ఛార్జ్ చెయ్యడం కొత్తా? జేబుదొంగ వేళ్ళు విరిచేయడం కొత్తా? నిందితుల్ని నేరస్తుల్ని చేసి ఎన్కౌంటర్ చెయ్యడం కొత్తా? ఏది కొత్త?
లాఠీ గాంధీ చేతిలో కర్రయ్యిందెప్పుడు?
అది కాదు! కరోనా వచ్చినప్పుడు కోట్లాది ప్రజల్ని కంట్రోల్ చేసింది యాంటీ మెడిసిన్ కాదు, లేదు, మెడిసిన్ కంటే గొప్పగా పనిచేసింది లాఠీయే! దుడ్డుగర్రే! రోడ్డు మీదకి వచ్చిన వాణ్ని వచ్చినట్టు చావచితకబాది ప్రజలని కరోనాని అదుపులో పెట్టింది!
కర్ర కాదది మనదేశపు జెండా కర్ర!
మువ్వన్నెల జెండాలో అశోకచక్రం మధ్యలో లాఠీ వుండాలని మేథావులు పలుతావుల వొత్తిడి కూడా చేశారు! నిక్కర్ల పాలనలో వారి చేతికర్ర జెండాకర్ర జెండా మీద కపిరాజు కావడం కావాలనుకోవడం కూడా వూతమిచ్చింది! ఈ విషయమే యిప్పుడు ప్రభుత్వ పరిశీలనలో వుంది!
కానీ కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత దేశం పరిస్థితే కాదు, పోలీసుల పరిస్థితీ మారిపోయింది?!
పోలీసులు లాఠీతో తప్ప వేరేలా మాట్లాడడం లేదు! కరోనా మాసిపోయినా తుమ్మినా దగ్గినా రేవెట్టేస్తున్నారు! ప్రవేటుగా చెయ్యాల్సిన పనులు పోలీసులు పబ్లిక్కుగా చేసేస్తున్నారు! కార్యకారణ సంబంధం అక్కర్లేదు! చేతిలో లాఠీ వుంది! ఎదురుగా వొల్లుంది! అంతే!
కోర్టులూ హక్కుల కమీషన్లూ గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు! శాంతిభద్రతలు అవి కాపాడే వాళ్ళ వల్లే కోల్పోతున్నామని ప్రభుత్వం యెట్టకేలకు గుర్తించింది!
కమీషన్‌ను కూడా వేసింది!
నివేదిక వచ్చింది!
కరోనా సమయంలో అన్నిరకాల వుద్యోగులూ పెళ్ళాం బిడ్డలతో హేపీగా వుండిపోతే, తాము మాత్రం తమ కుటుంబాలకు దూరంగా యిరవైనాలుగ్గంటలూ విధి నిర్వహణలో వుండడం వల్ల వచ్చిన ఫ్రస్టేషన్ ఫలితమని నిర్ధారించింది! అసలే కోతి అన్నట్టు, దానికి కరోనా దొరికినట్టు అర్థం చేసుకోవాలని కోరింది! పోలీసులు తంతే వాళ్ళ సేవలను గుర్తించి కాయడం తప్ప ప్రజలు తిరగబడకూడదని కోరింది! చెదురు మదురుగా వొకటీ అరా పోలీసులమీద తిరగబడడం దురదృష్టకరమని అంటూనే, పోలీసుల మీద తిరుగుబాటు రాజ్యం మీద తిరుగుబాటుగా అభివర్ణించింది! ప్రజల నిస్సహాయతని నిస్సహాయతగా కాక నిబద్ధత చూడడం అలవరచుకోవాలని కూడా కోరింది!
ఇప్పుడు లాఠీ దెబ్బ తినని వాళ్ళు అమ్మ పాలు తాగని వాళ్ళంత అరుదు!
కరోనా చీడ పోలేదని, దాని నీడలూ జాడలూ వైరస్‌లా ప్రజల్లో యింకిపోయాయని మానసిక వైద్య నిపుణులూ పరిశోధకులూ తమ పనిని మరింత విస్తృత పరిచారు! వివిధ వర్గాల గ్రౌండ్ రిపోర్టును తీసుకోవడం మొదలు పెట్టారు!
మొదటగా చదువుకొనే పిల్లల దగ్గర్నుంచి అభిప్రాయాల్ని సేకరించారు!
‘కరోనా చాలా అద్భుతం! ఎందుకంటే మాకు పరీక్షలూ మార్కులూ ర్యాంకులూ లేకుండా చేసింది, మా మీద వున్న వొత్తిడిని తీసేసింది, మా ప్రతీ ఎగ్జామ్స్ టైములో కరోనా వొస్తే బాగుంటుంది, వెల్కమ్ టు కరోనా’
విన్న శోధకులకు శోకమొక్కటే తక్కువ!
తర్వాత దిగమింగుకుంటూ గృహిణుల దగ్గరకు వెళ్ళారు!
‘అది చాలా అద్భుత కాలం! మళ్ళీ రాదు! నా జీవితంలో నా భర్తా పిల్లలతో గడిపిన కాలమదే! చాలా యేళ్ళ తర్వాత మా దాంపత్యం బలపడింది’ అని వొకరు అంటే ‘కరోనా కరుణించింది, నాకు పిల్లలు కలిగారు’ మరొకరు అంటే ‘ఉన్నప్పుడు విలువ తెలియ లేదు, క్వారంటైన్ గ్రేట్ డేస్. మా తరంలో కంప్యూటర్, సెల్ ఫోన్, కరోనా చూశామని చెప్పుకోవడానికి చాలా గర్వంగా వుంది..’ అని!
అదే సమయంలో బస్తాల కొద్దీ సరుకులూ నిత్యావసరాలూ స్టాక్ చేసుకొని వుండడంతో ‘కరోనా వెళ్ళిపోయింది కదా, యింకా యెందుకు?’ అని అడిగితే ‘అలవాటు’ అని, ‘ముందుజాగ్రత్త’ అని నవ్వేశారు దొడ్డ యిల్లాళ్ళు!
ఇటు చూస్తే వుద్యోగుల గైరుహాజరు శాతం పెరిగింది! అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతున్నారు! పని చెయ్యడానికి యిష్టపడడం లేదు! వియ్యారెస్స్ తీసుకొని యింటిపట్టున వుండడానికి కూడా వెనుకాడడం లేదు! ఆఫీసుకు వచ్చినంత వేగంగా యిళ్ళకు వెళ్ళిపోతున్నారు! అయితే యీ విషయాన్ని పబ్లిక్కుగా చెప్పడానికి వాళ్ళిష్టపడలేదు!
మరో వైపు మందుబాబుల శాతం తగ్గింది! దేశ ఆర్ధిక పరిస్థితి క్షీణించింది! వైన్ అందుబాటులో లేక అలవాటు తప్పారు! దేశం వెన్నెముక విరిగిపోయినట్టయింది! ప్రభుత్వాలు తలలు పట్టుకున్నాయి! అయితే ఆ పరిస్థితి యెన్నాళ్ళో లేదు! గేట్లు యెత్తేసిన ప్రవాహంలా యెండిన బీళ్ళలా నోళ్ళు అతి దాహం తీర్చుకున్నాయి! మళ్ళీ దేశ ఆర్ధిక పరిస్థితి గాడిలోకొచ్చింది! స్థిమితపడింది! తాగుబోతులు దేశానికి మునిపటిలా వూతమివ్వడంతో ‘కరోనా కాలంలో మీకు మద్యం అందుబాటులో లేకుండా చేసినందుకు క్షమాపణలు’ భేషరతుగా చెప్పింది ప్రభుత్వం!
కరోనా దేశ ప్రజల్లో వుద్యోగులుగా వృత్తిదారులుగా గృహస్తులుగా వారి రుచుల్నీ అభిరుచుల్నీ మార్చివేసింది!
కరోనా లేదనడానికి లేదు! ఆ వైరస్ తన రూపం మార్చుకొని ప్రజల్లో యింకిపోయిందని పరిశోధకులు తమ పరిశోధనలని ముగించారు!