కళ్ళున్నా చూడలేవు
కనిపిస్తున్న మాయలు తప్ప
మరేవీ చూడకుండా
మనసును కట్టేసుకుంటవ్.
నీ నుంచి నీ నమ్మకాన్ని దూరం చేయడమే
కాలం టార్గెట్
నిన్ను నీకు గాకుండా చేసి
నీ అపనమ్మకంమీద అసహనాలు పండించి
అవసరాలు తీర్చుకునుడే
ఇప్పటి గేమ్.
విఫలమయ్యే కాంతిలో
చెల్లాచెదురుగా
నీ ఆలోచనల పక్షుల మంద.
అన్నీ తెలిసిన అయోమయం
అడిగి చుట్టుకోదు
ఎగరేసుకపోయే సందర్భాలు
ఎన్నైనా ఉంటయి
వెతుక్కునే ప్రక్రియే తోచదు
ఇప్పుడు తోచకుండ జేసుడే పని.
నీ జోక్యం లేకుండా సాగుతున్న నాటకంలో
పరదాల వెనుక దాగుంటవు.
ముఖాన్ని మూసిన బహుకృత వేషంలో
ఆత్మను పోగొట్టుకుని అలమటిస్తుంటావు
వెంపర్లాటలో వెర్రెక్కి వెక్కి వెక్కి ఏడుస్తవు.
పోగొట్టుకోవడం తేలికే
మళ్ళీ వెతుక్కోవడం సులువేం కాదు.
పరుచుకున్న పరిచిత అంధకారం
నాటిన చీకటి కంచె నడుమ
బతుకొక దిగులు దీపం .
తప్పదు
తప్పిపోయిన చోటే వెతుక్కోవాలి.
బైర్లు కమ్మాలే కాని
చూపు మందగించడానికి సమయం పట్టదు.
మెదట్లోకి అబద్దాన్ని స్ప్రే చేయడం
నిజాన్ని నిద్దట్లోనే నలిపేయడం
ఓ పాచిక
క్రీడ సాగుతుంది
ఆరాటాలో, అవివేకాలో, అరాచకాలో
నీ కాలాన్ని కబళించి కాటేస్తున్నప్పుడు
సాగుతున్న బలహీనతల బంతులాట
ప్రతి ఓటమి చివరా
ఓ పశ్చాత్తాపాల మూట.
ఈసారి నిన్నోడి తన్నోడినా
తన్నోడి నిన్నోడినా
మానభంగం నిజాయితీకే
ఆశాభంగం ఆశయాలకే.
అనుభవ గాయాల రక్తంతో
కళ్ళను కడిగేసుకో
మనసును నిక్కచ్చిగా నిలబెట్టాలి.
ఇన్నాళ్లుగా జారిపోయింది
ఇంకా జారవిడుచుకుంటున్నది
రెండూ నీలోనే.
అంతరాత్మా నీదే
ఆత్మవిశ్వాసమూ నీదే..
మూత పడుతున్న లో చూపే
గుండె గూటి దీపం ఆరనివ్వకు
దిక్కులన్నీ వినేలా
లో రెక్కలను ఆలాపనలుగా విప్పుకో