చిత్రం చెప్పిన కవితలు

1. కెమెరా కన్ను

నాగరికత ఇంకా నిద్రలో జోగుతున్న ఓ ఉదయం
ఫ్లైఓవర్ పై ఓవర్ స్పీడ్ తో
దూకుతున్న నా వాహనం
అద్దాల కళ్ళల్లో నిలిచిన చిత్రం
లిప్త పాటు ఆగిన నా వేగం
ఏ చీకటి రాత్రో వదిలి వెళ్ళిన తల్లి
వెంటాడుతున్న ఆకలి
ఎక్కడని తిరగాలి?
ఎవరిని అడగాలి?
ఎవడి ప్రపంచం వాడిది
ఎవరు ఎవరికి కావాలి
ఎవడి బతుకు బండి వాడిది
సీట్లు పట్టినోళ్ళంతా సి కాటగిరి అయితెనేం వాళ్ళంతా Z ప్లస్ లో సురక్షితం
ఇక్కడ గోడలు
రోడ్లు వాళ్ళ కోసం ముస్తాబు అవుతాయి
అందుకే ఆగోడపై జీవితాన్ని తన కుంచెతో అద్దాడు ఓ కళా కారుడు
అది మాతృ ప్రేమకు వెలుతురు భాష్యం
వెతికే కళ్ళకు
తడిమే చేతులను
ఏ కెమెరా కన్ను బంధించిందో
ఆక్షణం…

(2) అన్వేషణ

ఏ స్పర్శ కోసం నీవు పలవరించావో
ఏ ఎడబాటును నీవు కలవరించావో
ఏ తల్లి కోసం నీ చిట్టి పాదాలు
వెతుకుతున్నాయో
కనుమరుగైన ఏ పూల పందిరి
నీడ కోసం నీవు అలమటిస్తున్నావో
ఏ చీకటి దారుల్లో నీ చూపులు నిలవరిస్తున్నాయో
పిచ్చి కన్నా నీ కళ్ళ ముందున్నది
స్పర్శ తెలియని ఓ రంగు రంగుల రేఖా చిత్రం
ఓ కళాకారుని సృష్టి తత్వం

గతమైన ఏ తల్లి కోసమో
ఈ అన్వేషణ
ఏ పొట్టలు నింపడానికో
దారితప్పిన అనుబంధాల వలయంలో చిక్కుకుని
తల్లడిల్లిన ఓ చిన్నారి
అది కేవలం స్పర్శ తెలియని
ఓ గోడ బొమ్మ
మమతలు, మాతృత్వాలు
మ్యూజియం చేరిన కాలమైనా
కనువిందు చేసే ప్రాకృతిక సౌందర్యం సాక్షిగా
నీ అన్వేషణ మొదలైంది
అది ఏ తీరాలకు చేరుతుందో…?

నా చిరునవ్వుల దీపాలు వెలిగిస్తానా
వీడి చుక్కల కన్నులతో
నన్ను చుట్టేస్తాడు
చీకటిలో అమ్మకోసం వెతుకుతూ ఉంటానా
అపుడు వీడు నా చేతికి
నులివెచ్చగా అల్లుకుంటాడు
నా కనురెప్పలపైన వాడు
ఆత్మీయతను అద్దుతూ మురిపిస్తాడు
ఆకలి మరచి
దుఃఖం మార్చి
కాలం వెంట పరుగులు తీస్తానా ఇదిగో ఇప్పుడిలావాడికి
నడకనయ్యాను
గోడలు లేని గదులు
తలుపులు లేని పాఠాలు
ఎంతకూ తెల్లారని సుదీర్ఘ రాత్రులు
మురుగు కాల్వలు చుట్టేస్తూ
కాసింత మైదానం కోసం
కనుమరుగై పోయిన
మమతల కోసం
మేమిలా వెతుకుతూ
ఉంటాం… వీలయితే
మీరూ మా ధారావికి రండి
కాసింత సంతోషం కోసం

కడప జిల్లా. కవయిత్రి, కథా రచయిత. ఎం.ఏ., ఎం.ఏ., ఎంఇడి., ఎల్.ఎల్.బి., పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివారు.
రచనలు : చెదిరిన పిచ్చుక గూడు (కథాసంపుటి), మా తుఝే సలాం (కథా సంపుటి), అనువాదాలు : అమలు కాని హామీల చరిత్ర, తలకిందులలోకం, హలో బస్తర్. కవితలు, పుస్తక పరిచయాలు, అనువాదాలు. కొన్ని వ్యాసాలు.

Leave a Reply