ట్రాన్స్ పోయెట్రీ: చిత్త భ్రాంతి క్షణాల్లో

అనువాదం: గీతాంజలి

కొన్నిసార్లు ఒక లాంటి చిత్త భ్రాంతిలో…
నేనెక్కడున్నానో కూడా మరిచిపోతుంటాను.
నా చేతులు నేను పడుకున్న పరుపుపై రక్తం చిందుతూ ఉంటాయి…
రక్తం అక్కడినుంచి గోడల్లోకి ఇంకిపోతూ ఉంటుంది.
అక్కడే కొన్ని రంగులు మరో రంగులోకి మారిపోతూ ఉంటాయి..
అలాగని వాటికేమీ ఒక అర్థమంటూ ఉండదు.
ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది కానీ బహుశా..
నేనే గమనించలేదేమో !
ఒక సన్నని పలుచని పొర.. పొర అంటే ఏమిటసలు?
మేము ఈ పొరల గుండానే స్పర్శించుకుంటూ ఉంటాము.
ఆ పొరల్లోంచి రెండు టిన్నుల కాన్లు… ఇంకా అంతులేని దారం అన్ని దిక్కుల్లోకీ వ్యాపించి ఉంటుంది…
బహుశా మమ్మల్ని కట్టి పడేసేవి కావచ్చు.
సరే… నాతో మాట్లాడు
ఏమైనా చెప్పు
కానీ కాసింత మృదువైన పదాలు వాడు… దయ చేసి
అవి ఎంత సున్నితంగా ఉండాలంటే…
వాటిని అర్థం చేసుకోవడానికి నేను ఏ కాలేజీకి వెళ్లకూడనంతగా అన్న మాట
ఒకటి చెప్పు.. నన్ను చూసి నువ్వు ఈ లోకం ఒక చెత్త అని అనుకుంటున్నావా?
నేను అనుకుంటున్నా !
ఎందుకంటే నేను కూడా చెత్తనే !
పైగా అలా అనుకోవడాన్ని నేనెంతో ఇష్టపడతాను… ప్రేమిస్తాను కూడా

***

2. తొలిప్రేమ

నా తొలిప్రేమ ఏంటో తెలుసా మీకు ?
నిశ్శబ్దం…!
అవును నిశ్శబ్దమే ?!
మీకు తెలుసా..నన్ను నేను ఒక గాయపు మచ్చ నుంచి పునర్నిర్మించుకున్నాను
కానీ అది చేసిన శబ్దాన్ని ఎవరూ వినలేదు .
ఇది…ఈ నిశ్శబ్దం నా జీవితం లో కెల్లా అద్భుతమైన సమయం.
చాలా సార్లు లాండ్రీ కి నా బట్టలు నేనే తీసుకెళ్ళే దాన్ని..
అప్పుడు లోకంలో ఉన్న మంచు తెరలన్నింటినీ నన్ను కమ్మేసి కనపడకుండా మూసేయ్యమని ప్రార్థించేదాన్ని.
ఆకాశంలో దూసుకుపోయే విమానాలతో సమానంగా నా ఆలోచనలను పరిగెత్తించేదాన్ని.
నా లోని స్త్రీత్వ మంతా నా నోటిలో తేనెలా తియ్యగా ఉండేది.
నన్ను నేను తెలుసు కోవడం అనేది ఎప్పటికీ ఒక పొ రబాటు కాదని నాకు తెలుసు.
అందుకే దాని గురుంచి నేనెన్నడూ ఎవరికీ చెప్పలేదు.
అలా మౌనంగా నే ఉండి పోయాను.
ఎందుకంటే ..నా తొలిప్రేమ నిశ్శబ్దం కాబట్టి !

జాషువా జెన్నిఫర్ ఎస్పీనోజా ఒక ట్రాన్స్ విమెన్. అమెరికన్ పోయెట్. డిసెంబర్ 17 ,1987 లో జన్మించారు. ఆమె కాలిఫోర్నియాలో రివర్సైడ్ లో ఆక్సిడెంటల్ కాలేజీలో ఇంగ్లీష్ లో విసిటింగ్ ప్రొఫెసర్. ఎస్పీనోజా కవితల్లో వస్తు వైవిధ్యం చాలా ఉంటుంది. మానసిక అనారోగ్యం, లైంగిక వైరుధ్యాలు, స్త్రీగా మారడంలోని బాధ ఆనందం, ప్రేమ, మోపమ్ దుఖం, అందం లాంటి సార్వత్రిక థీమ్ లను ఎస్పీనోజా ఎన్నుకుంటుంది. ఎస్పీనోజా రచనలు : ఐ యాం అలైవ్/ఇట్ హార్ట్స్/ఐ లవ్ ఇట్ (2014), దేర్ షూడ్ బి ఫ్లవర్స్ (2016), ఐ డోంట్ వాంట్ టు బీ అండర్స్ట్యూడ్ (2024). 

Leave a Reply