మర్యాదస్తుడి ముసుగు చినిగి
మూక మూర్ఖత్వం
మట్టి కలిసిన మనిషితనం
కుల అహంకారంతో
రంకెలేసే ఆంబోతు పెత్తనం
రక్తం అద్దిన తెల్ల చొక్కా
నాన్న కులం కట్టుబాటు కత్తిగా
అమ్మ సానెపెట్టే ఆకురాయిగా
అన్న అదృశ్య అండగా
వికృత కుటుంబ రూపం
ప్రేమ పెళ్ళి కూతురు
తెగిన ప్రేమికుడి జీవితాన్ని ముద్దాడుతూ
తరాల ప్రేమ రాహిత్యానికి సవాలుగా
పేదరికంపై పూసిన వెకిలినవ్వుపై
ఆ క్షణంలో ఆమె
సామూహిక ఖడ్గమృగంపై
సాహస పోరాటం
భయంతో ముడుచుకున్న
వానపాము జీవితాలకు ఉలికిపాటు
అసమర్థ ఆదర్శజీవులకు చెంపపెట్టు
ఆధిపత్యాలు లేని హక్కు కోసం
ఒక ప్రేమ చుక్కని పండించడం కోసం
ఆమె … ఆ క్షణం
నిద్ర నటిస్తున్న చరిత్రను చరుస్తూ
జీవితమంటే
డబ్బు, అంతస్తు, పరువు, కులం గీతలు
కాదంటూ
ఆదిమ జంతువుపై బల్లెం విసురుతూ
చరిత్ర చిగురించిన మెరుపు
ఆ క్షణాన్ని
దాచుకుందాం
రేపటి వెన్నెల వానకై