చీకటీ చెమటల మధ్య
మిణుకు మిణుకుమనే
మూగ చిరు దివ్వె
ఇరుకుని చల్లదనంలో
ఇముడ్చుకున్న మట్టి గోడలు
ఆ పైన తాటికమ్మల గోచీలు
గూని నులక మంచం
జిల గోనె సంచులు
అంతకు మించని ఒంటి సుఖం
సరిపెట్టుకొనే చాలనితనం
రాళ్లకు కొట్టుకొని రక్తాలోడిన
చెప్పుల్లేని నా చిన్న కాలి వేళ్లు
ఎంతమొత్తుకున్నా పట్టించుకోని
మొరటిది ఎర్రమట్టి దారి
మొండికేయడం దాటి, మొద్దుబారిన
గిడసతనం నా చిన్నతనం
గడ్డిగోకే బాల్యం వేళ్ళపై
హద్దులు మీరిన బొరిగిలు
గాయాలు మానిన గుర్తే లేదు
నాటి ప్రపంచ బాల కార్మికున్ని
కొడవళ్ల అలసట పై
పొలాల పెత్తనాలు
గాయాల మచ్చలు
నేటికీ జ్ఞాపకాలుగా మొరాయిస్తున్నవి
రెండే రెండు జతల బట్టలు
కారుతూ, ఆరుతూ
ఒకటి ఒంటిమీద, ఇంకొకటి ఇంటిమీదా
సర్దుకుపోతూ ఉండేవి
చెమటికీ, చెమట ఆరడానికీ
చాల డానికీ , చాలకపోవడానికీ
కురచని ఎడతెరపి చిన్నతనం
చేతులు మారి వాడిపారేసిన పాతపుస్తకాలు
వీపుకెక్కి స్వారీ చేసే రోత వాసనలు
చెరగని మరకలు చింపిరి రాతలు
చాలనితనాన్ని చుట్టలుగా
దాచుకుంటున్న పేజీల కొసలు
జేబులనిండా సిరా కక్కి
కొంత రాసినా,
ఎంత దులిపినా రాయని కలం
కలం పైనా, నా పైనా మా మాస్టారి
ఈసడింపు సణుగుడు
చాలనితనం చదువుల బడిలో
చులకదనం మరకలు
చాలీచాలక పోవడమంటే
చాలీచాలనితనం మాత్రమే
ఆచరించగల
గ్రామీణ రహస్య తత్త్వం
(బొరిగి : ఒక వ్యవసాయ పనిముట్టు. ఉత్తరాంధ్రలో వాడుతారు )
Samaajam chinna buchhukovaalsinde
చాలాబాగుంది సార్