గోడలు (ఇల్లు సీక్వెల్ )

ఇంటి గోడలైతేనేం? కథలెన్నో చెబుతూనే ఉంటాయి
అవి వొట్టి గోడలేం కావు
గోడలు మనుషుల్లాంటివే !
రాత్రింబగళ్ళు గోడలు
హృదయపు తలుపులు తెరిచి
కిటికీ కళ్ళు విప్పార్చి
నిన్ను ప్రేమగా వేదనగా చూస్తూ ఉంటాయి
పూల తీవేలె కాదు
ముళ్ళు కూడా పాకిన గోడలు కదా మరి
నిన్ను రక్షించుకుంటాయి
నిన్ను నిలేస్తాయి
**
ఇంటి గోడలు యుగాల తరబడి తన చెవులతో ఇంటి దుఃఖాన్ని
విషాద కథల్ని వింటూ
ఇంటి లోపలి రంగస్థల నాటకాల్ని చూస్తూ
కఠినమై, పిగిలిపోయి, పగుళ్లువారి
దుఃఖంతో తడిసిపోయిన గోడలు
బతికి, చచ్చిపోయి మాయమైన మనుషులకి నిలువెత్తు సాక్ష్యాలు
**
వంటింటి గోడలు ఇల్లాలి దుఃఖంతో చెమ్మబారి
పొగ చూరి కరిగిపోయిన అనేకానేక ఆమెల
ఊపిరితిత్తులు వొదిలే కొన శ్వాసల రహస్య సవ్వడిని ధ్వనిస్తాయి
పడకటింటి గోడలు
ఆమె అలిసిన దేహం మీద
అతడు గీసిన చిత్రాల్ని చూసి నివ్వెర పోయి
లైట్లార్పేసి చీకట్లో మొహం దాచుకుంటాయి
**
చాలా సార్లు గోడలు పురాజ్ఞాపకాలను మోసే చిత్రపటాలవుతాయి
ఇల్లు కట్టిన అమ్మ నాన్నల ఫోటోలను
హృదయం మీద నవ్వుతూ మోస్తాయి
అవే కాదు… పెళ్లి ఫోటోలు, గుంపు ఫోటోలు
చావు కళతో నవ్వే ఫోటోలు గోడ స్వంతాలు
ఇష్టమైన వాళ్ళ ఫోటోలని
తనలోకి మేకులు కొట్టించుకుని మరీ దిగేసుకుంటుంది
పొలం నుంచొచ్చిన నాన్న కొడవలిని గోడకే ఆనిస్తాడు
నాన్న ఇంటికొచ్చేదాక
గోడ నాన్న కండువానో, చొక్కానో తడుముతూ ఉంటుంది
అలిసిపోయిన అమ్మ వీపుకు
తన చల్లని వొడిని ఆసరా ఇస్తుంది
**
కొన్ని ఇంటి గోడలు
రాముడు, కృష్ణుడి బొమ్మల్ని తిరస్కరిస్తాయి
మార్క్స్, అంబేద్కర్, బుద్ధుడు, భగత్ సింగ్ బొమ్మల్ని
అమరులైన అన్నల బొమ్మల్ని
ఎర్రెర్రని సుత్తి కొడవలిని గర్వంగా మోస్తాయి
ఆ పటాలను మోస్తూ గోడలు
వినమ్రంగా గౌరవంగా తల వంచుకుని నిలబడతాయి
ఇంటి గోడలు కాస్తా స్తూపాలవుతాయి
**
తాళాలను కొక్కాలను, మేకులను భరించే గోడలు
కొన్ని సార్లు కోరలున్న మనుషుల్ని చూసి భయపడతాయి
పిల్లల్ని కొట్టే పాము లాంటి నాన్న బెల్ట్ ని చూసి
ఇంట్లోని ప్రతీ గోడా చిన్న పిల్లాడిలా వణుకుతుంది
ఇంటి గోడ తన మీద వేలాడుతున్న అద్దాలలో
ముసుగు మనుషుల నగ్న రూపాలను పట్టిస్తాయి
**
తనలోపల కిటికీలను, తలుపులను
అలమరాలను, పుస్తకాలను
దీపపు గూళ్ళను
దీపాలను
ఉత్తరాల సంచులను
మెత్తటి అమ్మ చీరను
జేబుల్లో డబ్బే లేని నాన్న చొక్కాను మోసే గోడ
ఒక పురావస్తు మ్యూజియంలా నిలువెత్తుగా నిలబడుతుంది
పిల్లల అల్లిబిల్లి బొమ్మల గీతలతో మెరిసే గోడ ఒక పెయింటింగ్ కాన్వాస్
**
గోడ ఇంట్లో అలజడిగా కదలాడిన మనుషుల నీడల్ని
చిత్రిక పట్టే చిత్ర కారుడవుతుంది
వృద్ధాశ్రమానికి నిస్సహాయంగా వెళ్ళిపోతున్న
అమ్మమ్మ తాతయ్యల నీడలు
తననానుకుని ఏడ్చే అమ్మ నీడ
అమ్మని కొట్టబోయే తాగుబోతు నాన్న
ఎత్తిన చెయ్యి నీడలు చెప్పే రహస్యాలను
వెతల కథలుగా.. తనలో దాచుకుంటుంది గోడ
**
అది సరేకానీ… ఇంటి గోడల పరిమళం చూసావా ఎప్పుడైనా?
గది గదికీ ఒక పరిమళం ఉంటుంది
పొలం నుంచి అప్పుడే కోసుకొచ్చిన పచ్చని గడ్డి పచ్చి వాసన
గాదె నిండిన ధాన్య సుగంధం
ఎరువుల… పురుగు మందుల భయపు వాసన
బతుకమ్మ గునుగు పూల సౌగంధం
వరుస పండగల వాసన
మండువాలో స్నానం చేయించే పసివాడి దేహపు పసి వాసన
పిల్లాడికి పాలు తాపే పచ్చి బాలింత పాల వాసన
అమ్మ చేసే పిండి వంటల వాసన
ప్రేమ దక్కని విరహిణి హృదయం దగ్ధమవుతున్న వాసన
అమ్మ రహస్యంగా దుఃఖించే కన్నీటి వాసన
చూసావా ఎన్నడైనా?
**
ఇంటి గోడలని స్పర్శించావా ఎప్పుడైనా
వేసవి వేడిని, చలికాలపు చలిని
వర్షా కాలపు తడిని మోసే రుతువుల్లాంటి గోడల స్పర్శని?
గోడ చాలా సార్లు అమ్మలా చల్లగా కౌగలించడం
ఓదార్చడం తెలుసా నీకు?
**
ఇంటి గోడలు వినడమే కాదు… మాట్లాడతాయి కూడా
తన మీది పొట్టు దేలిన గాయాల్లాంటి సున్నపు పెచ్చుల గురించి
రంగుల గురించి
ఫోటోల గురించి
అమ్మని సతాయించి చంపిన నాన్న ఫోటో
బహుశా వద్దని చెప్పబోతాయి
తన లోలోపల దాచిపెట్టుకున్న కథలు విప్పుతాయేమో?
ఆ ఇంట్లో పారాడిన పిల్లల నవ్వుల ధ్వని
అనేకానేక అమ్మల, నాన్నల, బతికి చచ్చిన మనుషుల
ఇంటిని ఒంటరిని చేసి ఎగిరి పోయిన
పిల్లల ఆశనిరాశల నిట్టూర్పుల సడి,
ఎండిన పంటతో నాన్న గుండెల్లో పగిలిన కలల చప్పుడు
కళ్ళ ముందే ఉరిబోసుకున్న నాన్న చివరి ఊపిరి
అప్పులతో పట్నం వలసెళ్ళిన అమ్మా పిల్లలు
ఎవరో చదివిన కవిత్వం
బయటపడని ప్రేమికుడు గాల్లో పంపిన హిందోళ రాగం
గుండె బద్దలవడాన్ని మోగించిన డప్పు
రాని లెక్కని ఎక్కిళ్ళతో బట్టీ పట్టిన పిల్లవాడి ఎక్కం
గుళ్లోంచి ఎగిరొచ్చిన అయ్యవారి మంత్రాలు
గోడ కానుకుని రహస్యంగా చదువుకున్న ప్రేమలేఖలు
విడుపు కాగితాల వెక్కిళ్లు
గోడలు బద్దలు కొట్టాలనుకునే స్త్రీల చేతుల్లో సుత్తి కొడవళ్ళు
వానా కాలపు వర్ష ధ్వని, కొట్టంలో ఆవు పెట్టే అంబా అరుపు
ప్రసవపు నొప్పి భరించలేక అమ్మలు పెట్టిన పెను కేకలు
కట్నం తేని…
కోరిక తీర్చని భార్యల మీద పడ్డ చెంపదెబ్బల మగ శబ్దాలు
అన్నం దొరకని పేగుల ఆకలి అరుపులు
ఇవే వింటాయా గోడలు?
ఈ గోడలు ఇంటి శ్రోతలు కదా!
ఏం విని ఉంటాయో గోడలు
డప్పుల్లాంటివి… ఏం మోగించి ఉంటాయో?
గోడలు ఖాళీ కాగితాల్లాంటివి
ఏం రాసుకుంటూ ఉంటాయో?
గోడల మధ్య మనుషులు చేసే కుట్రలు
గోడల చాటున చేసే హత్యలు
వినలేక, చూడలేక దాచాలని
మరిన్ని కొత్త రంగుల్ని పొరలు పొరలుగా వేసుకుంటుందేమో ?
గోడ ఒక్కోసారి ఆడదానిగా మారిపోతుంది
ఆ ఇంటి ఆడవాళ్ళతో కలిసి
వెక్కివెక్కి ఏడుస్తూ తడిసి పోతాయేమో?
తమ దుఃఖానికి ఇంటిని గొడుగు పట్టమంటాయేమో
బలహీనమైన గోడలు
**
అసలు గోడలే లేని గుడిసెల గురించి కూడా ఆలోచిస్తాయి గోడలు
**
అసలు గోడలు పుస్తకాల్లాంటివి
పేజీ పేజీలో ఇంటి చరిత్రని కథలు కథలుగా రాస్తూ ఉంటాయి
**
గోడలు చాలా సార్లు నిటారుగా నిలబడతాయి
బతుకు అఘాతానికి కుప్పకూలి పోయే
ఇంట్లోపలి మనుషుల్నినిలబెట్టుకోవడానికి
ఇంట్లోని మనుషుల మధ్య కనిపించని గోడల్ని కూడా
ఈ రాతి గోడలు గుర్తు పడతాయి… ప్రశ్నిస్తాయి
చెరిపేస్తాయి…
**
భూకంపాల్లో… బాంబు దాడుల్లో
విరిగిపోయిన ఇంటి గోడలు మాత్రం
తమలో బూడిదైన పిల్లల
ఎముకల పుర్రెల మాంసపు ముద్దల బూడిదను
పదిలంగా తల్లులకందించి
తమను మళ్ళీ నిలబెట్టి ఇళ్లు
గా మార్చే చేతుల కోసం ఆశగా ఎదురు చూస్తుంటాయి
ఇలాంటప్పుడే గోడలు సమావేశమవుతాయి
ఒకదానితో ఒకటి… తలుపులతో కిటికీలతో మంతనాలడతాయి
చివరికి గోడలేం చేస్తాయంటే….
చీకటి నిండిన ఇళ్లను వెలిగించడానికి
తమకి తామే దీపాలను వెలిగించుకుంటాయి
విడి మనుషుల్ని కలిపి ఉంచే ఇళ్లవుతాయి!
గోడలు లోపలా… బయటా తోటల్నిమొలిపించుకుంటాయి
గోడలు మనుషులుగా మారిపోతాయి.

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

Leave a Reply