గోడలికావల వనాలు…

వణుకుతోన్నమనసుతో యెవ్వరూ అడుగుపెట్టాలని అనుకోని, యెక్కువ మంది అడుగు పెట్టని అసలు అడుగుపెట్టాల్సిన అవసరమేలేని, అడుగుపెట్టిన వాళ్ళు అసలు తామెందుకు అడుగుపెట్టాల్సి వచ్చిందో తెలియక సతమతమయ్యే ఆ అపరిచిత ప్రాంగణంలోకి అడుగు పెట్టింది జీవని. దడదడలాడుతోన్నగుండె. సినిమాల్లో తప్పా యెప్పుడూ చూడని దృశ్యాలు చుట్టూ. తనలాగే అక్కడ తమవారికోసం యెదురుచూస్తోన్న వారి వైపు చూసింది.
వీళ్ళంతా యెవరు…

తల్లితండ్రులూ… భార్యలు… భర్తలు… పిల్లలు… అన్నలూ… అక్కలు… యిలా అంతా తనలానే రక్త సంబందీకుల్లానే వున్నారు. యీ లోపల వున్న వాళ్ళు వొక్కక్కరూ వొక్కో చెత్తని యిళ్ళల్లోకి తీసుకొచ్చి జీవితాల్లోని జీవనాన్నేసమూలంగా పెకిలించివేస్తారు యెందుకో…


తన యిరుగూపొరుగూ వాళ్ళ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి యెంతో కాలం అయింది. బంధువుల చూపుల్లోని భయం, వెటకారం ఆమెకి అలవాటైపోయి చాల కాలం అయింది. ప్రతిచోటా వో అప్రకటిత వెలివేత. ప్రతిక్షణం యెప్పటికి సడలించని కర్ఫ్యూ. యిక్కడ చుట్టూ వున్నవాళ్ళ చూపులతో చూపులు కలగల్పగలిగింది. వాళ్ళూ చూపులని తిప్పుకోలేదు. యీ ప్రాంగణంలో వాళ్ళూ తనూ వొక్కటేనన్న వూహ ఆమెకి స్థిమితాన్ని యిచ్చాయి.


పడినశిక్షలు, వాదోపవాదాల నడుమ శిక్షల కోసమో, స్వేచ్చ కోసమో యెదురు చూస్తున్న వాళ్ళoదరినీ శిక్ష వొక్కరమనే భావాన్నీకలగచేసాయి.
సమాన పరిస్థితి వున్న మనుష్యులు గుమిగూడిన ఆవరణలో నిలబడటంలో వున్న ధైర్యం ఆమె అనుభవంలోకి వచ్చిన క్షణమది. మనుష్యులని కలపాల్సిoది ప్రేమ, స్నేహం కదా… శిక్షలు కలపటం అంటే యీ సమాజమెంత వొంటరిదో కదా.

కాసేపు తన అరిచేతుల్లోని గ్రంధం వైపు చూస్తూ నిలబడింది.
తిరిగి చుట్టూ చూసింది.


అందరి పక్కనా మరో మనిషో… నలుగురైదుగురు మనుష్యులో యేవో కబుర్లు చెప్పుకొంటూ కనిపించారు. తనింత వొంటరిదా… మొదటిసారి ఆమెకి స్పష్టంగా అనుభవంలోకి వచ్చిన యేకాకితనం.
‘వీళ్ళందరికి సంబంధించిన వాళ్ళు లోపల వుండి వుంటారు కదా… యే యే నేరాలపైనో?!!
హత్యా… దొంగతనము… అప్పు యెగవేత… రేప్… కిడ్నాప్… నిషిద్ధ సంస్థలతో సంబంధాలు… యింకా ఆలోచిస్తోంది… మరి తన కూతురు లీలా చేసిన నేరం యేమిటి?!!!
అదస్సలు నేరమేనా… నేరమే అయితే యెలాoటి నేరం… యిన్ని రోజులుగా తానెప్పుడూ యిలా ఆలోచించలేదు. యిలాంటి ఆలోచనలూ రాలేదు’ యీ అపరిచిత ప్రాంగణంలో నిలబడినప్పుడు ఆమెకే తెలియని ఆమెలోలోపలి మరో వ్యక్తి బయటకు వస్తోన్న విషయాన్ని ఆమె గుర్తించింది.

జీవని తలెత్తి చూస్తోంది. చుట్టూ యెతైన నిర్బేద్యమైన గోడలు.
‘యీ గోడల పక్కన్నున్న మెయిన్ రోడ్డు మీద నుంచి లెక్కలేనన్నిసార్లు తన పుట్టింటికి నాగార్జునసాగర్ వెళ్ళడానికి తాను ప్రయాణిoచింది. కానీ తానెప్పుడూ ఆ నిలువెత్తు గోడల వెనుక జీవితాలు వుంటాయని అనుకోలేదు. జైలంటే తప్పు చేసిన మనుష్యులకి శిక్షలు వేసి నేరస్థులని వుంచే చోటు కదా జైలంటే… మరి యిప్పుడు తనకెందుకు అలా అనిపించటం లేదు. అసలేమయింది…’


…. మూడు నెలల క్రితం… ఆదివారం మధ్యాహానం బయట నుంచి తాళం తీసుకొని యింట్లోకి వచ్చింది జీవని. తన చేతితోని గ్రంధాన్ని టేబిల్ మీద పెడుతుండగా ఆమె భర్త కరుణకుమార్ వచ్చారు. కాసేపటికి జిమ్ కి వెళ్ళిన ఆమె పద్దెనిమిదేళ్ళ కొడుకు వినయ్ కూడా యింట్లోకి వచ్చాడు. కరుణకుమార్ కాళ్లు కడుక్కుని డైనింగ్ టేబిల్ దగ్గరకి వచ్చేసరికి ఆమె గ్లాసుల్లో నీళ్ళు పోసింది. టేబిల్ మీద బోర్లించి వున్న నాలుగు ప్లేట్స్ ని తిప్పిoది. వినయ్ కుర్చీ లాక్కుని కూర్చోబోతుంటే ‘’కాళ్లు కడుక్కున్నావా’’ అడిగారు కరుణకుమార్.


వినయ్ ముఖం చిట్లించుకొని వెళ్లి కాళ్లు కడుక్కొచ్చాడు.
వీళ్ళకి వడ్డించి మూడో పళ్ళెంలో పెట్టబోతూ ఆగి, బెడ్ రూమ్ దగ్గరకి వెళ్ళింది.
బెడ్ రూమ్ తాళo తీసి లోపలికి వెళ్ళింది. మంచం మీద పడుకొని తిరుగుతోన్న ఫ్యాన్ వైపు చూస్తోన్నలీల తలుపు తీసిన కిర్రుమనే సవ్వడి వినిపించినా గుమ్మం వైపు చూడలేదు.


‘’అన్నం తిందాం రా’’ పిలిచారు మృదువుగా జీవని.
లీల తల్లి వైపు చూడలేదు. జీవని మరో సారి పిలిచినా
లీల యేమి జవాబు చెప్పలేదు.


‘’నువ్వు రా. కడుపు మాడితే అదే వస్తుంది’’ అన్నారు కరుణకుమార్.
యీ మొత్తంతో యేమీ సంబంధం లేనట్టు లెగ్ పీస్ లని యేరి తన పళ్ళెంలో వేసుకొని, సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొన్న లేటెస్ట్ సినిమాని చూస్తూ తన లంచ్ ని తాను యెoజాయ్ చేస్తున్నాడు వినయ్.


తలతిప్పి వూరుకోమన్నట్టు భర్త వైపు చూసారు జీవని.
వేస్తోన్న ఆకలిని పెంచుతోన్న చికెన్ కర్రీ. తిండి తిననని నిన్నటి నుంచి మొoడికేస్తోన్న కూతురు. చిన్న పిలైతే నాలుగేసైనా దారికి తీసుకురావొచ్చు… పంతొమ్మిదేళ్ళ పిల్లని యెలా దారికి తీసుకురావటం.


గదిలోంచి బయటకి వచ్చి ‘’ మీ కూతురు కదా… మీ లానే మొoడిది. తను అనుకున్నది అయ్యే వరకూ తిండి తినదు. మీరూ అంతే కదా తిండి తినకుండా మీక్కావలసింది సాధించేవారు చిన్నప్పుడూ… పెళ్ళయ్యాక కూడా అంతే కదా…
అని పైకి అని, ‘నే మీకు అనుగుణంగా లేనని మీకు అనిపించినప్పుడు నన్ను దారిలోకి తీసుకురావటానికి మీరు అన్నం మానేసి పంతం పట్టే ప్రతిసారీ, యీ పస్తుల హింస కాకుండా నన్నోరెండు దెబ్బలు వేసినా బాగుణ్ణని యెన్నోసార్లు అనుకున్నా. అన్నం వడ్డించే భాద్యత వున్న ప్రాణికే తెలుస్తుoది హంగర్ స్ట్రైక్ లోని హింస… యిళ్ళల్లో చాల పవర్ఫుల్ ఆయుధం’ లోలోపల అనుకొన్నారు జీవని.


‘’నా ముద్దుల కూతురా కానే కాదు. చెడబుట్టింది. నా నరనరాన్న వున్న యే భక్తీ లేని భడుద్దాయిలా తయ్యారయింది. బయటకు వెళ్ళితే కాళ్లు విరగొడతా’’ అన్నంలో కూర కలుపుకొంటూ కోపంగా అన్నారు కరుణకుమార్.


‘’యిప్పుడంతా రకరకాల ప్రోగ్రామ్స్ కి వెళ్ళుతున్నారు కదా. యీ వొక్క సారికీ వెళ్ళనివ్వండి. వెళ్ళనివ్వక పొతే అది పచ్చినీళ్ళు కూడా తాగనంటుoది’’ అన్నారామె.


‘’మరీ మంచిది… కడుపులో యెలకలు పరిగెడితే అదే దారికొస్తుoది. అన్నం తిననని లీలా అనటం కాదు. నేనే చెపుతున్నా, దాని మంకుపట్టు వదలనంత వరకూ వొక్క పూట కూడా తిండి పెట్టకు. తినకపోయినా పర్లేదు…. కానీ అది బయటకి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళితే పోయేది దానొక్కదాని బతుకే కాదు మనందరిదీ’’ ఖచ్చితంగా చెప్పేసారతను.


’లీలామన బిడ్డ. మనం నచ్చచెప్పుకోవాలి’’ అందామె.
‘’అదే కదా నా బాధా… మన కూతురు కాబట్టే వద్దంటున్నా. మన కూతురు కాబట్టే రక్షించుకోవాలనుకొంటున్న’’ అన్నాడతను.
అతని కంఠంలో బాధ స్పష్టంగా తెలుస్తోంది.
‘’యీ వొక్క సారికీ పంపుదామా’’ ఆమె మళ్ళీ అడిగారు.
‘’నీకేమైనా పిచ్చా… వొక్క సారితో ఆగదు. అగ్నిరేగకూడదూ. రేగిందా యెటు చెలరేగుతుందో తెలీదు. దాన్ని ఆర్పెంత నీరు యెవ్వరి దగ్గరా లేదు. అందికే కనీసం ఆ ఆలోచనలే వొద్దు. అలాంటి ఆలోచనలూ వాళ్ళని దహించివేస్తాయి. వాళ్ళ మెదడు మండిందా వాళ్ళ హృదయం కూడా ఆపలేదు. యింక యీ విషయంలో మాటలు అనవసరం. దాన్ని బయటకు వెళ్ళనివ్వకు’’ నిస్సహాయంగా అన్నారతను.
‘’మీరే వొక సారి దానికి చెప్పండి ఆ విషయం. అది నా మాట వినదు’’ అందామె.
‘’అసలు నిన్ననాలి… అది అలా తయారవుతుందనే విషయాన్ని నువ్వు కనిపెట్టనే లేదు’’ జీవని మీద విరుచుకు పడ్డారు కరుణకుమార్.


జీవని కుర్చీలో కూర్చుంటూ కొడుక్కి మరి కాస్త కూర వేస్తూ ‘’వొరేయ్, ఆ డౌన్ లోడ్స్ చూడకురా అంటే వినవు. యెప్పుడో ఆ యాంటీ పైరసీ వాళ్ళు నిన్ను లోపల పడేస్తారు… నిన్న నీ ఫేవరేట్ హీరో యాడ్ కూడా వచ్చింది పైరసీ క్రైం అని’’ అన్నారామె.


‘’వాడిని యెవ్వరూ తీసుకువెళ్ళలేరు. మన కార్పొరేటర్ మన వాడిమీద దోమని కూడా వాలనివ్వరు’’ అన్నారు కరుణకుమార్.
‘’మరి లీల విషయంలో భయమెందుకు. మనకి ఆ కార్పొరేటర్ గారున్నారు కదా… వెళ్ళనివ్వండి’’ అన్నారు లీల.


‘’వినయ్ లా వాళ్ళ జెండాలూ కట్టను కదా… నాకే కార్పొరేటర్ హెల్ప్ అక్కర్లేదు. అయినా యిదేo పద్దతి డాడీ. మీరు నమ్మని తోరణాలు వినయ్ కడితే మీకే అభ్యంతరం లేదు. నే మాటాడే మాటలని మీరు నమ్ముతారో లేదో మీకే తెలియాలి. అయినా మీరు నమ్మేవి… మీకు నచ్చే మాటలే నేనెందుకు మాటాడాలి. నే మేజర్ని… నాకంటూ నా ఆలోచనలు వుంటాయి. మీకు నచ్చనoత మాత్రానా నన్ను కట్టడి చేసి నిర్భందిస్తారా…?!!! నా ఫోన్ తీసేసుకొన్నారు. నా లాప్ టాప్ దాచేశారు. నన్నింట్లోoచి బయటకి పంపటం లేదు. మీరు బయటకి వెళ్ళుతూ నన్ను లోపల పెట్టి లాక్ చేసి వెళ్ళుతున్నారు. పైగా నా గదిలో నేనెక్కడ బోల్ట్ పెట్టుకుంటానోనని ఆ బోల్ట్ ని పీకించేసారు… ‘’ అని నవ్వి‘’డాడీ, మీకూ వాళ్ళకీ యేమైనా తేడా వుందా?!! వాళ్లకి నచ్చని మాటలు మాటాడితే వాళ్ళు జైళ్ళల్లో పడేస్తున్నారు. మీరేమో నన్నిలా గదిలో బంధించేస్తున్నారు’’ అంది లీలా.
జీవనీకి కంగారెత్తిపోతోంది.

మాటకిమాటా పెరిగితే యీ మధ్యాహానం మొత్తం స్పాయిల్ అయిపోతుందనిపించింది.


లీలకి యింజినీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవ్వటం యిష్టం లేక యెoసెట్ పరీక్ష బాగా రాయగలిగీ సరిగ్గా రాయలేదు. చాల తక్కువ ర్యాంక్ వచ్చింది. అయినా డొనేషన్ కరుణకుమార్ సీట్ సంపాదించారు. ఆ కాలేజ్ లో జాయిన్ అవ్వనని మొoడికేసింది. జీవనీ మీద ఆ విషయంలో విరుచుకు పడుతుంటే తల్లి తన వల్ల మాటలు పడుతుందనే బాధని తట్టుకోలేక అయిష్టంగా జాయిన్ అయింది. పూర్ అటెండెన్స్… సబ్జెక్ట్ మీద ఆసక్తి లేదు. యేమి చదవాలని వుందని అడిగితే యిప్పుడా ఈ విషయం అడుగుతావు అని తల్లితో నిష్టూరంగా మాటాడిoది. లీలాకి యిష్టం వున్నా లేకపోయినా యిం జినీరింగే చదవాలి. మిగిలిన చదువులంటే కరుణకుమార్ కి యిష్టం లేదు. చదువు కంటే అనవసరమైన విషయాలు… గొడవలు… ప్రొటెస్ట్ లు యెక్కువనే అభిప్రాయం కరుణకుమార్ కి వుంది. మొదటి సంవత్సరం పరీక్షలకైతే లీల వెళ్ళింది కానీ సరిగ్గా రాయలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రొటెస్ట్ లు ఆమెని ఆకర్షించటం… ఆ పోస్ట్ లు షేర్ చెయ్యటం చూసి వినయ్ తండ్రికి చెప్పాడు. లీలాని అవి చెయ్యవద్దని హెచ్చరించారు కరుణకుమార్.

‘’యీ యింటిని నేనూ మీ అమ్మా కలిసి కట్టుకున్నాం. మన గురించి మన బంధువులంతా హ్యాపీ ఫ్యామిలీ అని ప్రతి యేడాది ఫ్యామిలీ గెట్ టూ గెదర్ ల్లో మనకే కదా బోలెడు పేరు. నువ్విలా చదువుని నిర్లక్ష్యం చేస్తే యెలా. యిన్నేళ్ళల్లో మనం యిలాంటి గొడవలు యెప్పుడైనా పడ్డామా. చదువుకో. మంచి సంబంధాలు అప్పుడే వస్తున్నాయి కూడా. నీకూ నచ్చిన మంచి కుటుంబంలోకి కోడలిగా వెళ్ళొచ్చు. నీ పెళ్లికి కొనాల్సిన నగల కోసం గత పదేళ్లుగా మేం బంగారం కొట్టల స్కీమ్స్ లో మెంబెర్స్ గా వున్నాం. వినయ్ ని మంచి యింజినీరింగ్ కాలేజ్ లో జాయిన్ చెయ్యాలి. మీ చదువులు, పెళ్లుళ్ళు మీ యిద్దరికి కాసింత ఆస్తైనా యివ్వాలని అనుకొంటున్నాo. అంతకు మించిన ప్రోగ్రామ్ మాకేం లేదని తల్లీతండ్రి పిల్లలిద్దరిని కూర్చోపెట్టుకొని చెప్పారు.


‘’యేమిటో మీరు మన నలుగురి గురించి తప్పా కనీసం మరో పిల్లిపిల్ల గురించి కూడా ఆలోచించేట్టు లేరే…’’ అంది లీల.
‘’ యీ మాత్రం బాగుండటానికి మేమెన్ని సరదాలని వాదులుకొన్నామో తెలుసా’’ అన్నారు కరుణకుమార్.

‘’మీకు తెలుసో లేదో డాడీ… యిప్పుడు పిల్లలేం చేసినా పేరెంట్స్ అడ్డు చెప్పటం లేదు. కరెక్ట్ డెసిషనా కాదాని మాత్రమే చూస్తున్నారు కొంతమంది. కొంతమంది అదీ చూడటం లేదు. లీగలా యిల్లీగాలా మన నమ్మకమా కాదా యిలా యేమి పట్టించుకోకుండా వినయ్ ని మీరు సపోర్ట్ చేస్తున్నట్టు పిల్లలు యేమి చేసినా సపోర్ట్ చేస్తున్నారు పేరెంట్స్. యిలా తాళాలేసి దొంగల్ని చూసినట్టు చూడటం లేదు’’ అంది లీల.

జీవని కూతుర్ని పిలిచి ‘’నాన్నగారు నిన్ను యెక్కడికీ వెళ్ళొద్దని చెపుతున్నది నీ మంచి కోసమే కదా… దా అన్నం తిందాం’’ అన్నారు జీవని.
‘’నన్ను వెళ్ళనిస్తేనే తింటా’’ పంతం పట్టింది లీల.

’’నీకైమైనా పిచ్చా… మనకెందుకు యీ గొడవలన్నీ. నీకెన్ని సార్లు చెప్పాలి అతి కష్టం మీద యీ మిడిల్ క్లాస్ కి వచ్చినవాళ్ళం’’ అన్నారు జీవని.
యెంతో ఆకలితో యిష్టంగా భోజనం దగ్గర కూర్చున్నకరుణకుమార్ తృప్తిగా తిన్నారో లేదో తెలియకుండానే అన్నం తినటం ముగించారు.
కూతురు తినకుండా తినటానికి మనసొప్పలేదు జీవనీకి. ఆకలికి మనసుతో పనేంవుండదేమో కొన్నిసమయాల్లో. నెపం డయాబిటీస్ మీదకి నెట్టి భోజనం చేసింది జీవని.


కరుణాకర్ మనసంతా చికాగ్గా వుంది.
యీ ప్రొటెస్ట్ రాజకీయాలేవీ తన యింటావంటా లేనట్టే లీల చదువుకొన్నచోట కూడా యిలాంటివేమీ లేవు.


యే బేస్ లేకుండా తన కూతురు రెడీమేడ్ వుద్యమాలకి యెందుకు ఆకర్షితురాలవుతోoది. యెప్పటికప్పుడు వాళ్ళని వీళ్ళని చూసి అప్పటికప్పుడే వొక స్లోగన్ కోసం చేయ్యి పైకి యెత్తుతోంది. యే సిద్ధాంతాలు లేని జనం సడన్ గా రోడ్ల మీదకి వస్తోన్న యీ సందర్భంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న అమ్మాయిల ఫొటోలకి ఆకర్షితురాలవుతోందా… ఆ లైక్స్ కి, షేర్ స్ కి ఆకర్షితురాలవుతోoదా… తన యె ఫ్ బీ లో అవే పోస్టింగ్స్. షేరింగ్స్. లీలా యెవరైనా అబ్బాయిని యిష్టపడుతోందా… ఆ అబ్బాయి యిన్ ఫ్ల్యుయన్స్ లో వుందా… యెందుకు ఆ ప్రొటెస్ట్ ల్ల వైపు వెళ్ళుతోంది…

వో నెల్లాళ్ళ క్రితం స్టూడెంట్స్ కి స్టూడెంట్స్ కి నడుమ గొడవ జరిగింది. ఆ స్టూడెంట్స్ లో లీలాకి తెల్సిన వాళ్ళు యెవరైనా వున్నారా…
పోలీసుల యెంట్రీ… ముతక ఖద్దరూ లేదు… యెర్ర జెండా లేదు… మరి యీ వుద్యమాలు యేమిటో… యేమీ అర్ధంకానితనమే వున్నట్టుంది లీలలో. యేదో ఫ్యాషన్ ప్రొటెస్ట్ లు అనుకొని వెళ్ళుతోoదా. లేక సీరియస్ వ్వే అనుకొని తనూ అందులోకి వెళ్ళుతోందా… సమ్ థింగ్ రాంగ్… లోపల నుంచి తీతువేదో గిర్రున తిరుగుతోన్న అనీజీన్స్ కరుణకుమార్ లో.

యీ విషయాలని వో రెండు వారాల క్రితం వరకూ మరీ సీరియస్ గా పట్టించుకోలేదు కరుణకుమార్. అతనికి వుద్యగంలో కానీ తన సంసారంతో కానీ యే అలజడులూ లేకుండా జీవితం సాగిపోతూనే వుందతనికి. యీ మధ్యే లీల చదువుతో కాస్త చికాకు మొదలైయింది. యీ యింజినీరింగ్ డిగ్రీ లేకపోతే లీలాకి సరియైన హోదా వున్న పెళ్లి సంబంధం రావటం కష్టం.

అయితే లీల విషయాన్ని సీరియస్ గా తీసుకోవలసిన పరిస్థితి యిలాంటి వో మధ్యాహ్నం మొదలయింది. కరుణకుమార్ మటన్ బిర్యానీని తృప్తిగా తిని నెట్ ఫ్లిక్స్ లో లస్ట్ స్టోరీస్ చూస్తుండగా వెంటనే కలవాలని సురేష్ ఫోన్ చేసారు. యిరానీ ఛాయి హోటల్ ల్లో యెదురు చూస్తున్నా సురేష్, కరుణకుమార్ న్ని చూసి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుకుని క్షేమ సమాచారాలు అడిగి టీ తాగుతూ పిల్లలని దేశాన్ని కాపాడుకోవటం మీద మాటాడుతున్నాడు. ఆ రెండిoటికీ వున్న సంబంధం యేమిటో అర్ధంకాక కొత్తగా మాజిక్ రియలిజం చదువుతోన్న పాఠకుడి అహభావాల్లా మలుపులుమలుపులు తిరుగుతున్నాయి కరుణకుమార్ కనుబొమ్మలు.

చిట్టచివరి ఛాయ్ సిప్ తాగుతూ ‘’మీ అమ్మాయిని కాస్త అదుపులో పెట్టుకో’’ అన్నాడు సురేష్.
తన కూతురేమైనా ప్రేమ వ్యవహారoలో వుందానుకొని ‘’వివరంగా చెప్పన్నా’’ సురేష్ న్ని కరుణకుమార్ అడిగాడు.
సురేష్ వెంటనే మాటాడలేదు.

‘’యేమైనా ప్రేమా… అబ్బాయి… ‘’ చివరికి తనే అడగలేనట్టు అడుగుతూ ఆగాడు కరుణకుమార్.
‘’అంత చిన్న సమస్యలని దేముడు మనకెందుకిస్తాడు. మొన్న వాళ్ళ మీటింగ్ కి వెళ్ళిన వాళ్ళ వీడియో మనవాళ్ళు తీయించారు. అందులో వున్న యూత్ యెవారాని చూసాం. వాళ్ళని మన వైపు తెచ్చుకోవాలి కదా. మనవాళ్ళ పిల్లలూ వున్నారు. పేరెంట్స్ కి చెపుతున్నాం. మన అమ్మాయి కూడా వుంది. కాస్త అదుపులో పెట్టు. రోజులు బాలేవు’’ అన్నారు సురేష్.


ఆ మీటింగ్ కి వెళ్ళటం వల్ల ప్రమాదం యేమిటో అర్ధంకాక అనీజాగా కదుల్తూ ‘’యెవరైనా దోస్త్ లతో వెళ్ళిందేమో. అయినా మీటింగ్ కి వెళ్లితే యేమవుతుంది’’ కరుణకుమార్ అన్నారు.

‘’నువ్వెక్కడ నుంచొచ్చావు. నీ అమ్మాబాబు యెక్కడ నుంచి వచ్చారు. నువ్వు వెళ్ళే భక్తి మార్గం యేది. నీ కొడుక్కో భక్తీ నీకో భక్తీ యిలా నిన్నెప్పుడైనా అడిగామా. వినయ్ మాతోనే వున్నాడుగా. నీ కూతురు మనతో లేకపోయినా పర్లేదు. కానీ అటుoది. తేడాగా వుంటుంది. చూసుకో’’ అన్నారు సురేష్.
విధ్వంస దృశ్యమేమీ లేదు చుట్టుపక్కల. కానీ వో విధ్వంస దృశ్యమేదో మాయమయిపోయిన అనీజీనెస్ చుట్టూ కమ్ముకొంటున్న వుక్కిరిబిక్కిరి.
కోపమో… అశాంతో… యేమో కానీ షాకింగ్ గా అనిపించి యింటికి వెళ్లి లీలాకి మీటింగ్స్ కి వెళ్ళడానికి వీలులేదని కరుణకుమార్ చెప్పారు. మాటామాటా పెరిగింది.

‘’యెందుకెళ్ళకూడదు’’ లీల యెదురు ప్రశ్న వెయ్యటంతో కరుణకుమార్ అలజడిగా జీవనీ వైపు చూసారు. అలా లీల నిలదీసినట్టు ప్రశ్నించటం కరుణకుమార్ జీర్ణించుకోలేకపోయారు. లీలాకి మాటలతో సమాధానం చెప్పలేక యిరిటేట్ అవ్వుతూ చాచి పెట్టి కొట్టాడు. భవిష్యత్ గోళం భళ్లుమన్న శబ్దం జీవని హృదయoలో.
అప్పటి నుంచి లీలాని కట్టడి చెయ్యటం మొదలు పెట్టారు.

**

లీల కొద్ది రోజులు అరిచింది. గొడవ చేసింది. ఆర్గ్యూ కి దిగింది. చివరికి లీలా పారిపోవాలని ప్రయత్నం చెయ్యటంతో ఆమెని గదిలో పెట్టి లాక్ చెయ్యటం మొదలు పెట్టారు కరుణకుమార్.

‘’లీలా… లీలా… యెక్కడికి…’’ జీవని కేకలకి కరుణకుమార్ అప్పటి ఆలోచనల నుంచి వెలుపలికి వచ్చి చూసే సరికి లీలా యింట్లోoచి వెళ్ళిపోయింది.
‘’వినయ్… రారా… బండి తీయి.లీలాని తీసుకొద్దాం’’ అన్నారు జీవని.

‘’అవసరం లేదు’’ అన్నారు కరుణకుమార్.

‘’అదేమైనా చేసుకుంటే’’ భయంగా అన్నారు జీవని.
‘’చేసుకోదు… చేసుకొన్నా చేసుకొనీ’’ అన్నారు కరుణకుమార్.
కృత్రిమమైన గంభీరపు తొడుగుని వేసుకోవటం మర్చిపోయినట్టు మాటాడుతోన్న కరుణకుమార్ ని జీవనీ భయంభయంగా చూస్తోంటే బోలెడంత అడ్మిరేషన్ తో వినయ్ తండ్రిని చూస్తున్నాడు.


ఆ సాయంత్రం యెనిమిది గంటల వేళ యింటి కాలింగ్ బెల్ మోగుతుంటే ‘’హమ్మయ… లీలా వచ్చేసినట్టుంది’’ అని తలుపు తీయ్యడానికి జీవనీ వెళ్ళుతుంటే ‘’నువ్వాగు’’ అని వెళ్లి తలుపు తీసారు కరుణకుమార్.

సురేష్. వెనక మరో ఆరుగురు.
బిలబిలమంటూ లోపలి వచ్చేసారు.
‘’సినిమా చూస్తున్నారా చెల్లమ్మా… న్యూస్ చూడటం లేదా’’ అని చొరవగా టీవి న్యూస్ ఛానల్ ల్లోకి మార్చారు.
వస్తోంది బ్రేకింగ్ న్యూస్… పదేపదే రిపీట్ అవుతూ.

టాంక్ బండ్ దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన జరుగుతోంది. గత రెండ్రోజులుగా వో యీవెంట్ లో ఆలపిoచే గీతం దగ్గర రెండు వర్గాల మధ్య జరుగుతోన్నఘర్షణ కొట్టుకోవటం వరకూ రావటం, ఆ కొట్టుకోవటంలో ముగ్గురికో నలుగురికో కాళ్లు చేతులూ విరిగి ఆసుపత్రిలో వున్నారట. వాళ్లకి సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శన జరుగుతోన్న లాన్ లో అందరితోపాటు కూర్చుoదoట లీల. అక్కడ రోడ్డుకి అడ్డంగా వున్నారని అక్కడ నుంచి వెళ్ళిపోమని పోలీసులు వచ్చారు. అప్పుడక్కడ కూర్చున్న వాళ్ళల్లో కొందరు పోలీసులపై వెళ్ళమని తిరగబడ్డారు. దొరికిన వాళ్ళని దొరికినట్టే పోలీసులు వ్యాన్ లోకి యెక్కించి వాళ్ళని స్టేషన్ కి తరలిస్తోoటే మేం రోడ్ కి అడ్డంగా లేమని వ్యాన్ లో అందరి కంటే లీల, మరి కొంత మంది యెక్కువ గొడవ చెయ్యటంతో వాళ్ళపై కేస్ పెట్టారు.


టాంక్ బండ్ మీద జరుగుతోన్నఆ గొడవలో గుంపులో అరుస్తోన్న లీలాని టీవీ స్క్రీన్ మీద చూస్తుండగానే బెంబేలెత్తిపోయారు కరుణకుమార్.
వినయ్ కళ్ళు యెరుపెక్కుతోన్నాయి.

లీలా అక్కడేo అంటుందో పూర్తిగా వినాలని జీవని ప్రయత్నం చేసే లోగా కరుణకుమార్ టీవి ఆఫ్ చేసేసారు.
అతని ముఖంలో తిరస్కారం చూసి మళ్ళీ టీవీ పెట్టడానికి జీవని ప్రయత్నం చెయ్యలేదు.


‘’ఛాయ్ పట్రా అందరికి’’ అన్నారు కరుణకుమార్.
బిత్తరపోతూ లోపలి వెళ్ళింది జీవని.
లీలా అక్కడ యేమి అందోనన్న కుతూహలం వినయ్ లో. సెల్ ఫోన్ ల్లో చూడాలనే అతని ఆలోచనని పసిగట్టిన్నట్టు ‘’అవసరం లేదు వినయ్’’ అన్నారు కరుణకుమార్.
వులిక్కిపడి ఆ ప్రయత్నం నుంచి వెనక్కి తగ్గాడు వినయ్.
వూహించని భయాలేవో పహారా కాస్తుంటే టీ కలుపుతోంది జీవని.
యేమి జరిగిందో తెలీదు. లీల త్వరగా వచ్చేస్తే బాగుణ్ణు. టీ కప్పులతో సహా ఆమె హల్లోకి వచ్చింది.


‘’మనిషి బతకడానికి మించిన సుఖమైన జీవితం మాది. దాని ఖర్మ… అది నా కూతురే కాదు’’ అంటున్న భర్తని చూసి ఆమె ‘యిదేo దౌర్భాగ్యపు మాట’ అనుకొంది జీవని.

టీ తాగి వాళ్ళు వెళ్ళిపోయారు.
‘’యేమి అయిందండి. న్యూస్ పూర్తిగా చూడనివ్వలేదు’’ అంది జీవని.
‘’యిప్పుడు మన బతుకే వొక న్యూస్’’ అని అతను అంటుండగా తలుపుపై దబదబా చప్పుడు.


తలుపు తీసే శ్రమే లేకుండా లోపలికి వచ్చిన మూక వొకే వొక్క నిమిషoలో మొత్తం ద్వంసం చేసి వెళ్ళిపోయారు.
ఆ ముసుగు ముఖాల కళ్ళల్లో విజయానందపుతృప్తి వినయ్ చూపుకి గట్టిగా అతుక్కుంది.


హఠాత్తుగా భూకంపం వచ్చి ఆగిన తరువాతి నిశ్శబ్దం… మళ్ళీ వస్తోందో రాదో తెలియని ప్రకంపనాల కోసం వస్తాయేమోనని అదిరే గుండెల యెదురు చూపు.

**
తెల్లవారింది.
లీల రాలేదు.
‘’పగిలినవాటిని యెత్తి పోయి’’ అన్నారు కరుణకుమార్.
‘’పోలీస్ కంప్లైంట్ యిస్తే’’ అన్నారమె.
‘’క్లీన్ చేయి’’ అని అతను విరిగిన సామాను మధ్య కాస్త చోటు
చేసుకొని మళ్ళీ పడుకున్నారు.


విధ్వంస దృశ్యాన్ని శుభ్రం చెయ్యటమెంత భయాన్ని కలిగిస్తుందో అనుభవంలోకి వచ్చింది జీవనీకి. ‘’మనిషి బతకడానికి మించిన సుఖమైన జీవితం మాది. దాని ఖర్మ… అది నా కూతురే కాదు’’… అని కరుణకుమార్ అన్నప్పుడు ఆ క్షణంలో యిదేo దౌర్భాగ్యపు మాటగా తను అనుకొంది కానీ నిజమే. ప్రాణాల్ని అరిచేతుల్లో పెట్టుకొని రాత్రిరాత్రంతా బిక్కుబిక్కుమంటూ బతికిన తరువాత జీవనీకి లీల గురించి మరి అడిగే వోపికని కోల్పొయి అలసిపోయినట్టు నిద్రపోయింది.

రాత్రి వచ్చి క్షణాల్లో అంతా ముక్కలుముక్కలు చేసిన వాళ్ళ కళ్ళల్లోని విజయానందపుతృప్తిని యెలాగైనా కైవసం చేసుకోవాలనే జీవితపు ధేయంగా వారిని వెతుక్కుంటూ వినయ్ బయలుదేరాడు.

**

ఆ రోజు విరిగిపోయిన సామాన్ని మళ్ళీ యెప్పటికి కొనుక్కోగలమోనని చింతిస్తూ కరుణకుమార్ కి వినయ్ కి నేల మీద పళ్ళాలు పెట్టి వడ్డిస్తోంది.
‘’నాన్ వెజ్ లేదా… యివేం కూరలు’’ విసుగ్గా అన్నాడు వినయ్.

ఆ రోజు గొడవ అయినప్పటి నుంచి నాన్నగారు మార్కెట్ కి వెళ్ళటం లేదు. యింటి ముందుకి వచ్చిన కూరలే కొంటున్నా. మళ్ళీ మనిల్లు యెప్పటికి మునుపుటిలా అవ్వుతోoదో. మీరింక ఆఫీస్ కి వెళ్ళటం మొదలుపెట్టండి. వొక్క రోజేదో అంతా వింతగా చూస్తారు. తరువాత వాళ్ళే అలవాటు పడిపోతారు. అయినా మీకీ పట్టుదలెందుకు… లీలని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యోచ్చు కదా’’ అన్నారు జీవని.


‘’తనక్కడ వుండటమే మంచిది. మన మాట వినదు. కనీసం అక్కడుంటే యింటి విలువ తెలుస్తుంది. జీవితపు విలువ తెలుస్తుంది’’ అన్నారు కరుణకుమార్.

**

చుట్టూ కలకలoతో జీవనీ యెదురుచూపుల ప్రాంగణoలోకి వచ్చింది.

మూడు నెలల్లో తన పొదరిల్లులోని రెండు గువ్వపిల్లల్లో వొకటి యీ యెతైన గోడల వూచల వెనక వొంటరి సెల్లో… మరో గువ్వపిట్ట యే తలుపులన్నా క్షణాల్లో పగలకొట్టే సమాహపుబహిరంగ దారుల్లో…

లీల నెలల పిల్లగా వున్నప్పుడు యెవరైనా యెత్తుకుంటామని అడిగినప్పుడు ఆ వేరే వాళ్ళ అరచేతుల్లో పెట్టడానికి తనెంత తటపటాయించేది… మెడ నిలపటమిoకా చేతకాని పాపాయి తలని వాళ్ళు సరిగ్గా తమ అరిచేతుల్లో పెట్టుకుంటారా లేదాని తనెంతో తల్లడిల్లేది. నిండా యిరవై యేళ్ళు నిండని లీల గత మూడు నెలలుగా యీ జైల్లో వుంటే వొక్కసారి కూడా తను రాలేకపోయింది. ప్రాణమెంతగా కొట్టుకొన్నా…

యిప్పుడు కూడా చాల కరుణకుమార్ కి చెప్పకుండా లాయర్ సహాయంతో వచ్చిన జీవనీకి లీలాకి యే సపోర్ట్ యివ్వని కరుణకుమార్ యివ్వొద్దన్న కరుణకుమార్ కి తను యిక్కడికి వచ్చానని తెలిస్తే తనతో మాటలు మానైవొచ్చు. లేదా బయటకీ పొమ్మనవచ్చు. మొక్కు తీర్చుకోవడానికి వెళ్లాలని యింట్లో oచి బయటపడింది. కరుణకుమార్ కి తనలానే జీవనీ కూడా లీలని దూరoగా పెట్టినట్టు అనిపించి ఆమె పట్ల నమ్మకoతోనే వున్నారు.
జీవనీని పిలిచారు.

అటు లీల. యిటు జీవని.
కళ్ళ నీళ్ళతో తన వైపు చూస్తున్న తల్లిని చూస్తూ ‘’బాగున్నారా అంతా’’ అని అడిగింది లీల.
తమ యింటి పరిస్థితులని చెప్పింది. వినయ్ అలా అయ్యాడని తెలిసి లీల పెదవి విరిచింది నిస్సహాయంగా.
కాసేపు నిశ్శబ్దం.

‘’వినయ్ ని వొక్క సారి తీసుకురా. మాటాడతాను. ఆ దారులు సరియినవి కావు. వినయ్ ని కనీసం న్యూస్ పేపర్ చదవమను. న్యూస్ చూడమను.’’ అంది లీల.

‘’నీది సరియైనది కాదని వినయ్ అంటున్నాడు. నువ్వేమో వినయ్ ది కాదంటున్నావ్. మీ డాడీ అయితే నువ్వు పూర్తిగా చెడిపోయావు. యిక్కడ వుంటే జీవితపు విలువ తెలుస్తుంది అంటున్నారు. యిక్కడెలా వుంది… యేo చేస్తున్నావ్’’ అన్నారు జీవని.
‘’నా యిరవై యేళ్ళ జీవితంలో పదహారేళ్ళుగా చదువుకొంటూనే వున్నాకదా. డాడీ చెప్పింది నిజమే. యిక్కడికి వచ్చాక జీవితం అంటే యేమిటో తెలుస్తోంది. థాంక్స్ టూ హిం. అక్కడ నాకు విషయాలని అర్ధం చేసుకునే చదువు లేదని యిక్కడికి వచ్చాక అర్ధమయింది. నేరమంటే యేమిటి… ద్రోహమంటే యేమిటి… ప్రేమoటే యేమిటి… జీవితాన్ని తెలుసుకొంటున్నా… నాకే కాదు అన్నకి అర్ధం కాలేదు. అందికే తనలా అటువైపు వెళ్ళాడు. మాకే కాదు చాలా మందికి… వాళ్ళు వీళ్ళని కాదు చాలమందికీ సమాజం బాగుపడటానికి కావాల్సిన జ్ఞానాన్ని యీ చదువులు యివ్వటం లేదు. యేది ప్రశ్నించాలో యేది యెలా ప్రశ్నించాలో యెందుకు ప్రశ్నించాలో తెలియనితనం యీ చదువులిస్తున్నాయి. సినిమాలు, టీవీ వార్తలు వొక్కటేమిటి అన్నీ వొకే తానులో ముక్కలు కదా… ముఖ్యంగా టాలరెంస్ ని, ప్రేమని యివ్వటం లేదు. తమ భావాలకి విరుద్ధంగా వున్న భావాలని వినే వోపికా, సహనం లేని సమాజంలో నెత్తురే పారుతుంది… తెలుసుకోవాలి చాల తెలుసుకోవాలి… డాడీ తన జీవితంలో నాకు చేసిన మేలు యేమిటంటే నన్ను డిస్ వోన్ చేసుకోవటం. అక్కడ వుంటే నాకెప్పుడూ అసలైన విషయాలు చదువుకునే అవకాశం ఆ గైడెన్స్ దొరికి వుండేది కాదు… ‘’ అంది లీల.


‘’గైడెన్ స్సా…’’!!! అడిగారు జీవని.
‘’వు… యిక్కడ వో అక్క వున్నారు. అక్క యీ సమాజానికి అవసరమైనవి బోలెడు చదువుకున్నారు. పుస్తకాల్ని చూసి వాళ్ళు యెందుకు వులిక్కిపడతారో నాకర్ధమయిందిక్కడే అక్క వల్ల’’ అంది లీల.

మౌనంగా కూతురి కళ్ళల్లోకి చూస్తుంటే ఆమె తన మార్గాన్ని యేదో నిర్ణయించుకునే యెరుక వైపు సాగుతున్నట్టనిపించి యిదే చివరిసారా లీలాని తనకి మాత్రమే సంబంధించిన కూతురిగా చూడటం… ఆమె ప్రజల మనిషిగా విరబూయబోతుందా…
కూతురి చేతిని స్పర్శించి జీవని దిటవు గుండెతో బయటకి వచ్చింది.
కరుణకుమార్ యేమన్నారు…

‘’మనిషి బతకడానికి మించిన సుఖమైన జీవితం మాది. దాని ఖర్మ… అది నా కూతురే కాదు’’… ఆ క్షణంలో యిదేo దౌర్భాగ్యపు మాటగా తను అనుకొంది కానీ నిజమే. ప్రాణాల్ని అరిచేతుల్లో పెట్టుకొని రాత్రిరాత్రంతా బిక్కుబిక్కుమంటూ బతికిన తరువాత తనూ అలానే అనుకొంది.
యిప్పుడు అలా అనిపించటం లేదు.

‘మనిషి బతకడానికి కావాల్సిన యే జీవితాన్నే తామింకా చేరుకోలేదు. యింక సుఖమనే మాట యెక్కడ…’ అని అనిపిస్తోంది.
జీవని పూర్తిగా రోడ్డు మీదకి వచ్చిoది. వూబర్ చేసుకోవాలని ఫోన్ ఆన్ చేసింది. నో సిగ్నల్. కాస్త ముందుకెళ్ళి రోడ్ దాటింది. వూబర్ బుక్ చేసింది. వేకిల్ వచ్చింది. యెక్కబోతూ యెదురుగా వున్న జైలు గోడల వైపు కళ్ళెత్తి చూసింది. ఆ నిర్భేద్యమైన గోడలకి మించి యెదిగిన వృక్షం. చిగురుతో. జీవని కళ్ళ ముందు చిగురేస్తోన్నలీల.
కొన్నసార్లు గోడలికావల వనాలుoటాయి… విరబూస్తాయి.
**

కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, మూడు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, 'మసిగుడ్డ', 'ముక్త', 'ఇన్స్టంట్ లైఫ్', ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, ముక్త, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, 'నెమలీకలు పూసే కాలం' (కవిత్వం), 'మంత్రనగరి సరిహద్దుల్లో (ప్రేమ కథలు), 'పొగమంచు అడవి', 'మోహనదీ తీరంలో నీలి పడవ' (కవిత్వం) సంకలనాలుగా వచ్చాయి.

6 thoughts on “గోడలికావల వనాలు…

  1. ఇప్పటి పరిస్తితి ఈ బాగా చెప్పారు . లీల లాంటి ఆలోహించే మనుషులకు కావలసింది బాగా చెప్పారు. “అక్కడ నాకు విషయాలని అర్ధం చేసుకునే చదువు లేదని యిక్కడికి వచ్చాక అర్ధమయింది. నేరమంటే యేమిటి… ద్రోహమంటే యేమిటి… ప్రేమoటే యేమిటి… జీవితాన్ని తెలుసుకొంటున్నా… నాకే కాదు అన్నకి అర్ధం కాలేదు. అందికే తనలా అటువైపు వెళ్ళాడు. మాకే కాదు చాలా మందికి… వాళ్ళు వీళ్ళని కాదు చాలమందికీ సమాజం బాగుపడటానికి కావాల్సిన జ్ఞానాన్ని యీ చదువులు యివ్వటం లేదు. యేది ప్రశ్నించాలో యేది యెలా ప్రశ్నించాలో యెందుకు ప్రశ్నించాలో తెలియనితనం యీ చదువులిస్తున్నాయి. సినిమాలు, టీవీ వార్తలు వొక్కటేమిటి అన్నీ వొకే తానులో ముక్కలు కదా… ముఖ్యంగా టాలరెంస్ ని, ప్రేమని యివ్వటం లేదు. తమ భావాలకి విరుద్ధంగా వున్న భావాలని వినే వోపికా, సహనం లేని సమాజంలో నెత్తురే పారుతుంది… తెలుసుకోవాలి చాల తెలుసుకోవాలి… డాడీ తన జీవితంలో నాకు చేసిన మేలు యేమిటంటే నన్ను డిస్ వోన్ చేసుకోవటం. అక్కడ వుంటే నాకెప్పుడూ అసలైన విషయాలు చదువుకునే అవకాశం ఆ గైడెన్స్ దొరికి వుండేది కాదు… ‘’ అంది లీల.

    ‘’గైడెన్ స్సా…’’!!! అడిగారు జీవని.
    ‘’వు… యిక్కడ వో అక్క వున్నారు. అక్క యీ సమాజానికి అవసరమైనవి బోలెడు చదువుకున్నారు. పుస్తకాల్ని చూసి వాళ్ళు యెందుకు వులిక్కిపడతారో నాకర్ధమయిందిక్కడే అక్క వల్ల’’ అంది లీల

  2. జీవితమంటే ఏమిటో తెలుసుకునే లీల ప్రయత్నం విజయవంతవ్వాలి..చదువులు నేర్పని, ఎల్లో మీడియాల్లో చూపని జీవితం ఒకటుంది. అది తెలుసుకోగలిగితే
    ప్రతీ పౌరుడు ఒక నిజమైన నాయకుడిగా ఎదుగుతాడు.
    ..పద్మగారు అభినందనలు

  3. ఎన్నార్సీ, సి ఏ ఏ నేపధ్యంలో వచ్చిన తొలి కథ అనుకుంటున్నాను. రెండు ప్రపంచాలు పక్కపక్కనే ఉన్నప్పుడు సమాజానికి, ప్రజలకు ఉపయోగపడేది ఎంచుకునే వాళ్ళు, ‘అసహనం’ ని అసహ్యించుకునేవాళ్ళు ఇబ్బందులకు గురికావడం తప్పడం లేదు. సరిగ్గా ఇందులో ప్రధానంగా విమెన్ విక్టిమ్ హుడ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేని కధ. అవసరమైన మంచి కథ.

  4. ఇప్పటి చదువులు,ఉద్యోగాలు ఒక సుఖమయం అయిన జీవితాలు ఇవి అనే భ్రమ కలిగించే ఈ కాలంలో ప్రజల సమస్యల కోసం ఉద్యమించే/ఆలోచించే వ్యక్తులు రాను,రాను కరువై పోతున్నారు.

    గొప్పవాళ్ళు పక్కింట్లో పుట్టాలి,మనం మాత్రం సుఖంగా ఉండాలి అనుకునే కాలం ఇది.

    నేటి పరిస్థితులకు తగ్గట్టుగా మంచి కథ ఇది పద్మ గారు.

  5. ఆ నిర్భేద్యపు గోడల వెనుక ఎన్నో వృక్షాలు ఎదగాలని కోరుకుంటూ
    రాజ్యాన్ని ఎన్ని ముక్కలైనా చేయనీ వృక్షాలు
    వృక్షాల నీడలో జనం జనంలా బతకగలగాలి అంతే

  6. ఒక చేతిలో గ్రంధం, మరో చేతిలో సెల్ఫోనులో లస్ట్ చిత్రాలు చూసే పెసిమిస్టిక్ తండ్రి, ఉబర్ టాక్సీ బుక్ చేసుకోగల్గినన్త చదువున్న యాగ్నోఐస్ట్ తల్లి, టిపికల్ గల్లీ కుర్రాళ్ళ పోకడలున్న అబ్బాయి… ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఆన్లైన్ విప్లవాల ప్రభావం… జైలు…అక్కడో విప్లవ “”అక్క””..ఆమె ప్రభావం ,అమ్మాయి ప్రొటాగనిస్ట్ గా రూపాంతరం చెందడం..గోడల్ని దాటి ఎదిగి చిగురిస్తున్న వృక్షం.. ప్రస్తుత తరుణం… కాన్వాసు పై తైల వర్ణ చిత్రం లా ఉంది…. పద్మగారు మీకు నెనర్లు💐💐💐💐

Leave a Reply