సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ వర్డ్స్ ఎగైనెస్ట్ వాల్స్ ( గోడలను ఛేదించే అక్షరాలు) అనే అంశంతో 2025 నవంబర్ 22 న యువజన సాహిత్యోత్సవాల నిర్వహణకు తలపెట్టినప్పటి నుండి తెలుగు సాహిత్యంలో గోడల పట్ల నిరసనగా వచ్చిన కథా సందర్భాలు, ప్రస్తావనలు ఆలోచనలలో కదలాడటం మొదలయింది. మనిషి నుండి మనిషిని విడదీసి అధికారం నెరిపే సంప్రదాయాలు, ఆచారాలు, సనాతనధర్మాలు,అసమానతల పట్ల మానవజాతి అసహనం ఈ నాటిది కాదని తెలిసి వచ్చింది. గోడలను కూల్చటమే పనిగా మానవ జాతి సాగిస్తున్న ప్రస్థానం సుదీర్ఘమైనదే అయినా ఆ క్రమంలో విస్తరించవలసిన గోడలు లేని మైదానాల స్వేఛ్చ ను అభావం చేస్తూ మనిషిని తనకుతననే పరాయీకరించే రకరకాల రంగు గోడల నిర్మాణం విస్తృతమవుతున్న వర్తమానం ఆందోళన కలిగించింది. వర్తమానమే వస్తువు అయిన ‘ఆఖరిగోడ’ కథ ను పరిచయం చెయ్యటానికే ఈ రచన.
ఈ కథ 2022 సెప్టెంబర్ ఆంధ్రజ్యోతి పత్రికలో ఇది ప్రచురించబడింది. రచయిత . పాణిని జన్నాభట్ల. అమెజాన్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ మేనేజర్. ఉత్తర అమెరికాలోని మస్సాచుసెట్స్ రాష్ట్ర రాజధాని నగరం బోస్టన్ లో నివాసం. ‘తనలో నన్ను’(2022) ఆయన తొలి కథా సంపుటి. ‘చెయ్యాల్సిన పని’ (2024 ) మలికథా సంపుటి. ఇందులోని పదిహేను కథలలో ‘ఆఖరిగోడ’ ఒకటి. ‘మాంత్రిక వాస్తవికతతో(మ్యాజికల్ రియలిజం)మన సమాజంలోని అంశాలకి ఫాంటసీ ఎలిమెంట్లను జోడించి’ వ్రాసిన కథలలో ఇది ఒకటి అని పాణిని ఆ పుస్తకానికి వ్రాసుకొన్న ‘రచయిత మాట’లో చెప్పుకొన్నారు.సమకాలీన సమాజంలో మనుషుల మధ్య రకరకాలుగా నిర్మితమవుతున్న గోడల గురించిన వాస్తవం ఈ కథకు వస్తువు. గోడల నిర్మాణం గురించిన ఎరుక గానీ , గోడల మధ్య కుంచించుకు పోతున్న జీవిత భీభత్సం గురించిన స్పృహ గానీ యేమాత్రం లేక ఏవేవో భ్రమల మధ్య ఉరుకులు పరుగులుగా బతికేస్తున్న మనుషులను యాంత్రికత నుండి వాస్తవంలోకి మేల్కొల్పటానికి ఎంచుకొన్నకథా నిర్మాణ పద్ధతి మ్యాజిక్ రియలిజం. వాస్తవాన్ని అతిశయోక్తి గా చెప్పటం దీని లక్షణం. వాస్తవాన్ని గుర్తించలేని మొద్దుబారిన ఇంద్రియాలను చైతన్యవంతం చేయటానికి అవసరమైన విధానం.
నేను అంటూ ఉత్తమ పురుషలో కథచెప్పే వ్యక్తి, మహి అన్న రెండు పాత్రలతో కథ నడుస్తుంది. నేను యజమాని. మహి సహాయకుడు. ‘నేను’ చెప్పినట్లు గోడలు కట్టటమే మహి పని. ఎనిమిది అడుగుల ఎత్తులో అవతలివైపుకు చూడటానికి ఒక కిటికీ అయినా లేకుండా ఒక గోడ నిర్మించటం కథకు ఉపాధ్ఘాతం వంటిది. ముగింపులో మళ్ళీ ఒక గోడ నిర్మాణం వుంది. తలుపు వున్నా బయటివాళ్ళెవరూ తెరవటానికి వీల్లేకుండా గొళ్ళెం ,తాళం తనవైపు మాత్రమే ఉండేట్లు నిర్మించుకున్న గోడ. అదే ఆఖరి గోడ. ఈ ఆద్యంతాల మధ్య నా గురించీ , మా ప్రపంచం గురించీ చెప్పాలి అంటూ ‘నేను’ చెప్పిన దంతా ప్రధాన కథ.ఇది గోడలు కట్టటమే ప్రధాన జీవితవిధానం, జీవితాదర్శం అయిన స్థితి గతుల కథనం.
‘మా ప్రపంచం’ అని అతను నిర్దేశించింది భారతీయ సమాజాన్నే అన్నది స్పష్టం. కథనంలో మతమార్పిడి, ఓమతం వాళ్ళు చరిత్రలో మన ధర్మాలను కాలరాయడం వంటి ప్రస్తావనలు అందుకు సాక్ష్యం. ఆ ప్రపంచం విధానమే ఇంటా బయటా గోడలు కట్టటం నేర్పించటం. ఆ ప్రపంచ పౌరులందరి పని శ్రద్ధగా ఆ విద్య నేర్చుకొనటమే. వేగంగా, అందంగా కట్టటం గొప్ప.ఇంతకూ ఏమిటా గోడలు? ఇంటి గోడలు కాదు. మనిషికీ మనిషికీ మధ్య గోడలు. వాటికి పెద్ద కారణాలు కూడా అక్కరలేదు. మన అంతస్తుకు,అభిరుచికి, అవకాశాలకు, అభిప్రాయాలకు భిన్నమైనది ఎంత అల్పమైనదైనా గోడలు కట్టుకోటానికి అర్హమైనదే.
“అసలు గోడలు కట్టడం మా రాజ్యాంగం మాకిచ్చిన ప్రాధమిక హక్కు. ఓట్ల కోసం దాన్ని అమలుపరచటానికి ఏ ప్రభుత్వమూ వెనుకాడలేదు. గోడలు కట్టలేని అమాయకులకి ఎలా కట్టాలో మా ప్రభుత్వాలే స్వయంగా నేర్పిస్తాయి కూడా”అన్న కథకుడి మాటలు ప్రత్యేకం పరిశీలించ వలసినవి. దేశంలో వ్యక్తులు శక్తి, తెలివితేటలూ ఆధారంగా ఉన్నతిని సాధిస్తూ అభివృద్ధి చెందటానికి దోహదపడే పరిస్థితుల పరికల్పనకు రాజ్యాంగం ఇచ్చే హామీ ప్రాతిపదికగా రూపొందినవే ప్రాధమిక హక్కులు. భారత రాజ్యాంగంలోని సమానత్వం, స్వాతంత్య్రం, మత సాంస్కృతిక విద్యాహక్కులు, ఆస్తి హక్కు మొదలైనవి ఆ కోవలోవే. జాతి కులమతలింగ భేదాలు లేకుండా అందరికీ వర్తించ హక్కులివి. ఈ ప్రాధమిక హక్కులలోనే మనిషికీ మనిషికీ మధ్య గోడలు లేపే తత్వం ఏదో ఉందన్న అవగహన లేకపోతే రచయిత “అసలు గోడలు కట్టడం మా రాజ్యాంగం మాకిచ్చిన ప్రాధమిక హక్కు” అనలేడు.
ఉన్నతిని సాధించే శక్తి , తెలివితేటలు, ఆస్తి హక్కు మొదలైనవి తరతరాల సామాజిక కట్టుబాట్లు, ఉత్పత్తి సంబంధాల ప్రమేయం వల్ల వ్యక్తులందరికీ, స్త్రీ పురుషులకు, కుల సమూహాలకు సమానంగా ఉండవు. ఇది మనుషుల మధ్య గోడల నిర్మాణాన్ని అనివార్యం చేస్తుంది. ఓట్ల కోసం దాన్ని అమలుపరచటానికి ఏ ప్రభుత్వమూ వెనుకాడలేదు అన్న వాక్యంతో కలిపి చూస్తే ఈ గోడల నిర్మూలన అసలు ప్రభుత్వాల ఎజండాలోనే లేదని, పైపెచ్చు అధికారంలోకి రావటానికి, స్థిరపడటానికి ఆ గోడల నిర్మాణాన్ని ప్రభుత్వాలు స్థిరీకరిస్తాయి, బలోపేతం చేస్తాయి అని అర్ధం అవుతుంది. దాని పరిణామ సూచనే ‘గోడలు కట్టలేని అమాయకులకి ఎలా కట్టాలో మా ప్రభుత్వాలే స్వయంగా నేర్పిస్తాయి కూడా’ అన్న ముక్తాయింపు వాక్యం. హిందూ ముస్లిం ప్రజా సమూహాల సకల జీవనరంగాలలో మేము , ఇతరులు అనే భేదభావాన్ని అంటుగట్టిన బిజెపి అధికార రాజకీయసంస్కృతి ఈ వాక్యం తో స్ఫురణకు రాకమానదు.
‘గోడలు కట్టలేని అమాయకులకి ఎలా కట్టాలో మా ప్రభుత్వాలే స్వయంగా నేర్పిస్తాయి కూడా’ అన్న మాట దగ్గర ఆగలేదు ఈ కథనం. దానిమీద కట్టుకొనే సమయం లేనివాళ్లకు ప్రభుత్వం చేయూత కార్యక్రమం అమలులోకి తెచ్చినట్లు మరొక కల్పన జరిగింది.ఇంటర్వ్యూ లు పెట్టి అర్హులైనవారికి ప్రత్యేకంగా గోడలు కట్టిపెట్టటానికి ఒక పనివాడిని జీవితకాలానికి కేటాయించటం దాని పతాకస్థాయి పరిణామం. కథకుడు అలా తన పదిహేనేళ్ల వయసులోనే ఆ చేయూత పథకం కింద ప్రయోజనం పొందినవాడు. అందుకు అతనికి ఉన్న అర్హత అప్పటికే గోడలు కట్టటంలో అబ్బిన నైపుణ్యమే.
ఏమిటతని నైపుణ్యం.? సన్నిహిత స్నేహితుడే. కానీ అతని తండ్రి కూరలు అమ్ముతాడని తెలిసినప్పుడు అతనికి తనకు మధ్య గోడలేపేసాడు. బంధువే కానీ వాళ్ళది పెంకుటిల్లు అని తెలిసినప్పుడు వాడికీ తనకు మధ్య గోడ లేపేసాడు. ఇంకొక స్నేహితుడున్నాడు కానీ వాడికి జిల్లా ఫస్ట్ మార్కులు వచ్చాయని తెలిసినప్పుడు ఇద్దరి మధ్యా గోడ తప్పనిసరి అయింది. ఈ మూడు సందర్భాలను పరిశీలిస్తే అసమానతలు వాస్తవం, ఆధిక్యత, అధికారం ఆదర్శం అయిన సమాజంలో గోడల నిర్మాణంలో పిల్లలకు ఇయ్య బడుతున్న శిక్షణ స్వభావం తెలిసివస్తుంది. దానికీ మనిషినుండి మనిషిని వేరు చేసి ఒంటరివాళ్లను చేసే ప్రక్రియ అవసరమైనదిగా ప్రోత్సహించబడుతున్న వర్తమాన రాజకీయాలకు మధ్య సంబంధం గురించి ఆలోచించటానికి , చర్చించటానికి ఇక్కడ ఎంతైనా అవకాశం ఉంది.
కథకుడికి నీడ మహి. ఇద్దరి వయసు ఒకటేనని కూడా చెప్పబడింది కథలో ఒకచోట. కథకుడి మనోభావాలకు తగ్గట్లు మహి కట్టిన గోడల గురించి ఈ కథలో వచ్చిన ప్రస్తావనలు గమనిస్తే స్వీయ కులాభిమానం, వ్యక్తి ఆరాధన, పరభాషలపట్ల అసహనం, అవహేళన, భిన్నాభిప్రాయాన్ని,ప్రశ్నను సహించలేని తత్వం,అస్తిత్వ అహంకారం సాటివాళ్లను ఇతరులుగా వేరుచేసే గోడల నిర్మాణానికి కారణమని స్పష్టం అవుతుంది. సోషల్ మీడియాలో ‘వర్చువల్ వాల్స్’ కట్టటం గురించిన ప్రస్తావన కూడా ఇందులో ఉంది. ఇది భిన్నాభిప్రాయాలు మీద, భిన్నాభిప్రాయాలు కలిగిన వాళ్లపట్ల ద్వేషాగ్ని వెళ్ళగక్కే ట్రోల్స్ రోజురోజుకు ఎక్కువవుతున్న సమకాల సూచిక.
నేను అని కథ చెప్తున్న వ్యక్తి ఒక రాజకీయ పార్టీలో చేరి ఆ పార్టీ అవసరాలకు అనుగుణంగా పెద్దపెద్ద గోడలు కట్టే పనిలో మహిని పెట్టి అతనిచేత ఎన్నో గోడలు కట్టించటం ఈ కథలో మరొక అంశం. ఎవరికోసం, ఎందుకోసం ఇన్ని గోడలు కడుతున్నారో తెలియకుండానే మహి వంటివాళ్ళు అనేకమంది ఆ సంస్థలో గోడలు కట్టటం పనిలోనే ఉన్నారు. ఇది బీజేపీ రాజకీయ అవసరాలకు,ప్రయోజనాలకు అనుగుణంగా నిర్మించబడిన అంతర్జాల సాంకేతిక వ్యవస్థ పని తీరును గుర్తుకు తెస్తుంది. ఆ ప్లాట్ ఫారం మీద మనుషుల మధ్య, జాతుల మధ్య నిర్మించబడే వర్చువల్ గోడల నీడలు వాస్తవ ప్రపంచంలోకి వ్యాపింపచేసే విద్వేషం,విధ్వంసం అర్ధమవుతున్నపుడు ఇదంతా కరెక్ట్ కాదు అని మహి వంటి కొందరికైనా అనిపించకపోదు. అలా అనిపించటం దగ్గరే ఈ కథ మలుపు తీసుకొంటుంది.
గోడలు కట్టేది మహి అయినా అవి నేను అని చెప్పుకొనే ఒక అహంభావి ఆకాంక్షలమేరకు కట్టినవి. అతని ఆదేశాల మేరకు ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం కట్టినవి. అందువల్ల గోడల గురించి వస్తుగతంగా ఆలోచించగల జీవలక్షణం మిగుల్చుకోగలిగాడు. అందువల్లనే కథకుడితో పేచీ పడగలిగాడు. మన ధర్మం, మన మతం అంటూ మరొక మతాన్ని పరాయిదిగా , ద్రోహిగా చెప్పే కథకుడి అభిప్రాయంతో విభేదించగలిగాడు. గోడలు కట్టటం తగ్గించుకోమని సలహా ఇయ్యగలిగాడు. “ఒక్కసారి ట్రై చేసి చూడు. ఈ గోడల్ని కూల్చి, ఇరుకు దారుల్ని కాదని విశాలమైన ప్రపంచంలోకి అడుగుపెట్టు. అప్పుడు చూడు భేదాలు లేని ఈ సమాజం ఎంత అందంగా కనబడుతుందో నీకు” అని హితవుచెప్పాడు.
అది అతనికి రుచించలేదు. ఇంకొక గోడ కట్టమని ఆదేశించాడు. ఈ సారి ఈ గోడ కట్టాల్సింది మహికి తనకూ మధ్య అని చెప్పాడు. తొందరపడకు అని మహి ఎంత వేడుకొన్నా అతను వినలేదు. ‘వాడు తన నీడ’ అని ఏ మహి గురించి సగర్వంగా అనుకున్నాడో ఆ మహి ఉపదేశాలు వినాల్సిన అవసరం లేకుండా,వినపడే అవకాశం లేకుండా తప్పనిసరిగా ఇద్దరిమధ్యా గోడ నిర్మించబడాలన్నదే అతని ఆంతర్యం. తనకూ ఇతరులకు మధ్య గోడల దగ్గర ప్రారంభమైన మనిషి తనకూ నీడకూ మధ్యకూడా గోడలు నిర్మించుకొనే దశకు దిగజారడం విషాదం. ఇద్దరిమధ్యా నల్లగా మసిబారిన గోడ , గోడకు లోపల ఒకరు. బయట మరొకరు. అటు( బయట )నుండి పెద్దగా ఎక్కిళ్ళు వినిపిస్తుండగా కథ ముగుస్తుంది.
కథకుడికి పదిహేనేళ్ల వయసులో జతపడ్డవాడు మహి. ఇరవై ఏళ్ల సహవాసం.అయినా కథకుడు మహిని వదులుకొనటానికి సిద్ధపడ్డాడు కానీ గోడలు కట్టే పని మాత్రం మానుకోవాలి అనుకోలేదు.గోడలు కట్టే మరొక సహాయకుడిని ఇయ్యమని ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టు కొన్నాడు. కానీ “వాళ్ళకిప్పుడు బాగా గిరాకీ ఉంది, వాళ్ళ కోసం చాలామంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు, మీకు కొత్తవాళ్లను ఇయ్యటం కుదరదు, ఉన్న వాడితో సరిపెట్టుకోమని” సమాధానం రావటంతో మహిని వదిలించుకొనటానికి ఇద్దరిమధ్యా గోడ నిర్మాణం అతను ఎంచుకొన్న కార్యక్రమం. ఈ క్రమాన్ని అనుసరించి ఆలోచిస్తే అసలు మహి ఒక ప్రత్యేక వ్యక్తి కాదనిపిస్తుంది. అతనికి వేరే జీవితంలేదు. ‘వాడు నా నీడ’ అని కథకుడి చేత రచయిత చెప్పించటాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనిషి లోపలి వివేకం మహి. సున్నితమైన మానవాత్మ మహి. వివేకం వెన్ను తట్టినప్పుడైనా కదలని మనుషులు , ఆత్మ ప్రబోధాన్ని లెక్కచేయని మనుషులు గోడల నిర్మాణంలో అహం తృప్తిని పొందుతారు. అధికారంతో తాదాత్మ్యం చెందుతారు.గోడకు అటువైపు నుండి పెద్దగా ఏడుస్తున్న మహి పెట్టె ఎక్కిళ్ళు గోడ లోపల తమను తాము బందీ చేసుకొన్నవాళ్ళ గురించే. గోడలు కూల్చి విశాల ప్రపంచంలో సహజ స్వేచ్చా వాయువుతో గుండె నింపుకొనటానికి, భేదాలు లేని సమాజ సౌందర్యాన్ని ఆస్వాదించటానికి పెడముఖం పెట్టె మానవ ముఖం కోల్పోయిన వర్గాల కోసమే.