ఇథనాల్ వ్యతిరేక పోరు శిబిరానికి వెళ్ళాలని రెండు రోజులుగా అనుకుంటున్నా వాయిదా పడుతూనే ఉంది. లేదు… ఇవ్వాళ ఎలాగైనా వెళ్ళి తీరాలి.
ఉదయమే నేనూ మా మిత్రుడు హనుమంతు మాట్లాడుకున్నాం. నేనిక్కడి నుండి బయలుదేరిన సమాచారం ఇస్తే తాను కర్నూల్ నుండి బయలుదేరుతాడు. ఇద్దరమూ ఐజలో కలుసుకుని ఇథనాల్ పరిశ్రమను నెలకొల్పడాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న దీక్షా శిబిరానికి చేరుకోవాలి.
పన్నెండు గ్రామాల ప్రజలు ఏకమై మహత్తరమైన ఐక్యతతో రెండు నెలలుగా కొనసాగిస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి పాలమూరు అధ్యయన వేదిక సంఘీభావాన్ని ప్రకటించడానికి పెద్ద ధన్వాడా గ్రామానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అందుకోసం నేను ఇక్కడ గద్వాల నుండి ఎవరినైనా జమ చేసుకుని వెళ్లాలి.
రెహమతుల్లాకు ఫోన్ కలిపాను. వెంటనే కలిసింది.
“హలో భయ్యా… ఆజ్ జరా వఖ్త్ నికాలేతో ధన్వాడా జాకే ఆతేథే… బోలాథానా పహలే…” అన్నాను.
“సర్ మాఫ్ కర్నా.. ఏ దో దిన్ అన్లోడింగ్ కా కామ్ రహేగా… ఆజ్ హఫ్త హైనా… మంగల్ హెూతో ఆసకూఁగా…”
పొలాలకు వేసే యూరియా, గ్రోమోర్ తదితర ఎరువు సంచుల రైల్వే వ్యాగన్ వొచ్చింది. లేబర్తో అన్లోడ్ చేయించాలి ఈ రెండు రోజులూ కుదరదన్నాడు రెహమతుల్లా.
అదివరకే మాట్లాడుకున్న ప్రకారం అడ్వకేట్ వెంకటేష్ గారినీ అడిగాను.
‘సరే వెళదాం… కానీ ఎలాగా’ అన్నాడు తను.
కార్లో వెళదామంటే డ్రైవర్ అందుబాటులో లేడు. “నా స్కూటీపై వెళదాం” అన్నాను.
“అబ్బో… ఇక్కడ్నుండి ఐజ ముప్పై కిలోమీటర్లూ… అక్కడి నుండి ధన్వాడ మరో పన్నెండు కిలోమీటర్లు… అంత దూరం కష్టం…” అన్నాడు.
“ఏముందీ… బండి ఐజలో పెట్టి అక్కడ్నుండి ఆటోలు చాలా ఉంటాయట… ఆటో మాట్లాడుకుని వెళ్ళొచ్చు…” అంటే
“ఆఁ… ఏమో అబ్బా… వెళ్లలేమేమో…” అనుమానం వ్యక్తం చేశాడు.
నిర్ణయించుకోవడంలోనే ఇట్లా రెండు గంటలు గడిచిపోయాయి.
“ఏమీ కాదు వెళదాం…” అని పట్టుపడితే మా బండి కదిలింది, గద్వాల కోర్టు ప్రాంగణం నుండి ఉదయం 11 గంటలకు.
నేనే డ్రైవ్ చేస్తున్నాను. ఊరి బయట మూడు లీటర్లు పెట్రోల్ పోసుకున్నాం. ఎక్కడా ఆగకుండా పోతా వుంది మా స్కూటీ.
పెద్దపల్లి… బూడిదపాడు… అమరవాయీ… సద్దలోనిపల్లె… మల్దకల్లూ… శేషంపల్లె.. తాటికుంట… నాగర్ దొడ్డీ… బింగిదొడ్డీ… ఊరెనక ఊరు దాటేసి పోతున్నది మా బండి.
మేం బయలుదేరిన క్రిష్ణానది ఒడ్డున ఉన్న గద్వాల నుండి చేరాల్సిన తుంగభద్ర నది ఒడ్డు గ్రామం పెద్ద ధన్వాడా దాకా రెండు నదుల నడుమ ఉండే ఊర్లన్నీ నడిగడ్డ పల్లెలుగా పిలువబడతాయి.
నలభై ఆరు నుండి యాభైల దాకా సాగిన వీరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ప్రత్యక్ష ప్రభావం అంతగా లేని పల్లెలివి.
మొత్తం దేశమంతటా 1947 ఆగష్టు 15న స్వాతంత్ర జెండా ఎగిరినా ఇక్కడి రాచరిక పాలన ప్రత్యేకతల మూలంగా ఆనాడు స్వాతంత్ర వేడుకలు జరగని ప్రాంతమిది.
ఏడాది తర్వాత సెప్టెంబర్ 17, 1948న ఇండియాలో కలిసినట్లు మూడు రంగుల జెండా ఎగిరింది.
ఆ తరువాత కూడా అరవైల నుండీ… ఆ మాటకొస్తే ఎమర్జెన్సీ అనంతర కాలం నుండీ స్థానిక పటేళ్ళ… దేశముఖ్ ల … కరడుగట్టిన భూస్వామ్య దురాగతాలు భరిస్తూ రాచరిక అణచివేత విధానాలకు తలొగ్గి తరాలుగా అమలవుతున్న వివక్షలకు తోడు కసితీరా కాటేసే నిత్య కరువులూ, దుర్భిక్షాలకు బలవుతూ ఆకలీ, భూస్వామ్య ఆధిపత్యాల్ని ఎదుర్కొనే నేర్పు కరువై సుదూర ప్రాంతాలకు వలసెల్లి ప్రాణం మిగిలుంటే ఇళ్ళ దగ్గర వొదిలేసిపోయిన పసిపిల్లలనీ… వయసుడిగిన వృద్ధుల్నీ వొచ్చి చూసుకుంటే చూసుకున్నట్లుగా… రాలేదంటే పనుల కోసం వలసెల్లిన చోటే కాలం చేసి ఉంటారన్న దుఃఖభరిత దయనీయ దరిద్ర జీవితాల్ని వెళ్ళదీసే బతుకు లేనోళ్ళ వ్యధార్థ గాథల ఖిల్లాగా వినుతికెక్కిన నేల ఇది.
నడిగడ్డ పేరు తలుపుకొస్తేనే స్మృతి పథంలో మెదిలిన మనసంతా అల్లుకుపోయిన.. విషాదభరిత గాధల జ్ఞాపకాల్లోంచి బయట పడేసింది.. అడుగు తీసి అడుగేస్తే అడుగు లోతు గుంతల గతుకుల గద్వాల ఐజ రోడ్డు.
“అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల కింద సమరసింహారెడ్డి రెవెన్యూ మినిష్టరుగా ఉన్నప్పుడు నిర్మాణానికి నోచుకున్న రోడ్డేమో ఇది…” అన్నాడు అడ్వకేటు వెంకటేష్.
“ఏ పక్క చూసినా గుంతలమయమై కుదుపులు తప్పించుకునే విఫల ప్రయత్నాల్లో వాహనాలు విరుచుకుపడే నిత్య సంఘటనలు ఎవరికీ కొత్తగా అనిపించనట్లున్నది..” అన్నాన్నేను.
ఊరు దాటి మూడు కిలోమీటర్లు వచ్చామో లేదో కుదుపులకు లోనైన ముడ్లు వెన్నులో వొణుకు పుట్టిస్తుంటే పరమ దరిద్రంగా మారిన ఆ అయిజ గద్వాల డాంబర్ రోడ్డు సోయగం నుండీ… అన్యాక్రాంతమైపోతున్న పొలాలూ… పెట్రేగిపోతున్న రియల్ ఎస్టేట్ మాఫియా ఆకృత్యాలూ… పొలాలకు తలాపున ఉండీ కృష్ణా తుంగభద్రల నీళ్ళందక వలసల పాలైపోతున్న నడిగడ్డ రైతు కూలీల దైన్యమూ… సీడు మాఫియా కబంద హస్తాల్లో చిక్కి మతలబుగా రాపిచ్చుకున్న అప్పు పత్రాల కిందికి ప్రాణంతో సమానమైన పొలాలు పోగొట్టుకొని జీవచ్ఛావాలై అనాదలై ఉన్న ఊర్లిడిసో… ఆత్మహత్యల పాలై పానాలిడిసో… కడతేరిపోతున్న రైతు కుటుంబాల సంక్షోభం గురించీ… ఎన్నో విషయాలు చర్చించుకుంటూ పోతున్నాం.
* *
రాజులకూ… ఊరి పెత్తందార్లకూ… ఊడిగం చేయడానికే పుట్టామన్నట్లు బతికిన పేదలు వీళ్ళు.
రెక్కల కష్టం తప్ప చారెడు నేల లేని, ఉన్నా విత్తు మొలవని, మొలసినా తాలుదబ్బల నోటికందని పరిగ పంటల ఎట్టి సేద్యం మట్టిపాలై ఆకలి దప్పుల సావుల్లో తరాలు తీరిపోయిన తండ్లాటే నసీబయ్యి నోళ్ళు.
“పంటల్లేని కాలంల పన్నులెట్లా కట్టేదని..” తెగేసి చెప్పిన తప్పుకు తుపాకి తూటలే తలరాతలయ్యీ శవాలు కూడా దక్కని ఆనాటి కసాయి రాచరిక రైతు గోసకు చెరగని సాక్ష్యంగా అయిజ రైతు సంఘ భవనం ముందు ఆనాటి గద్వాల రాణి ఫర్మానా కాల్పులకు బలైన అయిదుగురు దీన రైతుల పేర్లు చెక్కిన శిలాఫలకం చేస్తున్న మూగ రోదన ఎవరికీ పట్టనిదై వగస్తున్నది..
నను వొడి చేర్చుకుని ఓదార్చే చేవగల నిజమైన బిడ్డలు ఎప్పటికైనా పుట్టకపోతారా అని…
ఆనాటి రాచరిక పోలీసు కాల్పుల్లో నేల రాలిన రైతుల మరణాలపై వట్టికోట అళ్వారు స్వామి వాళ్ళు నిజనిర్ధారణ చేసుకుపోయిన ఆ దుర్ఘటన ఎవరికి గుర్తుంటుంది..
సాహితీ వైభవాలే కాదు లోకానికి నాగళ్ళు పరిచయం చేసిన ఘన చరిత గల అలంపురమూ… బంగారు పంటలే కాదు పట్టు వస్త్రాలకూ పెట్టింది పేరుగా విలసిల్లిన ఆ ఏరంచు ఊర్లుగా చరిత్రకు శోభాయమాన కాంతులందించిన వడ్డేపల్లీ, రాజోలీ, ధన్వాడా, తాండ్రపాడు, అయిజ తదితర గ్రామాలు గుర్తొస్తే మనసంతా మూగగా రోధిస్తున్నది.
నది పారిన నీటిజాడలు వెతుక్కుంటూ ఏటికెదురీదుతూ రెక్కలు గట్టుకుని ఎగిరొచ్చిన కోనసీమ గద్దలూ… గుంటనక్కల కోరలకు బలై పిడికిలి నిండని దుడ్ల ఆశలో అమ్మకాలైపోయి బదిలీ చేసేసుకున్న భూములకు యాజమానులైన ఆంధ్రోళ్ళ నగరాలుగా విలసిల్లిన శాంతి నగరాలూ… తీరొక్క క్యాంపులూ… పాకలుగా మొదలై రంగురంగుల మేడలుగా ఎదిగి ఎదలు తీసి నిలిచిన నోరు తిరగని పేర్ల నివాసాలే అడుగడుగునా దర్శనమిస్తాయి తుంగభద్ర వొడ్డెంట ఏడ జూసినా…!!
వొస్తున్న రోడ్డుకు రెండు వైపులా దారి పొడవునా ఎటు జూసినా బల్లపరుపుగా చదునుగా ఉన్న అదునైన పొలాలే… మల్దకల్లూ బింగిదొడి వరకు ఎర్రమట్టి పొలాలే!
చీనీవో, బొప్పాయివో, జామవో, మునగవో అన్నీ తోటలే… ఆ తరువాత నల్ల పొలాల సారక మొదలై అట్లే అయిజ, పులికల్లూ దాటి తుంగభద్ర వొడ్డు వరకు పరుచుకున్న నల్లరేగళ్లు.
జొన్న, కొర్ర, సజ్జ, రాగుల్లాంటి తిండిగింజల పంటలకు దూరం చేసి బుడ్డలూ… ఆముదాలూ… సన్ఫ్లవర్ లాంటి నూనెగింజలవో, మిరప, పొగాకు, మక్కజొన్న, కుసుమల్లాంటి వ్యాపార వాణిజ్య పంటల వెంట రైతులను పరుగెత్తిస్తూ.. సీడుపత్తి మాత్రమే సాగు చేయక తప్పని విషమ పరిస్థితులకు బలి చేస్తున్నరు రైతుల్ని..
అడ్డూ అదుపూ లేకుండా కమ్ముకొస్తున్న లెక్కలేనన్ని విత్తన కంపెనీలూ, వాటి ఏజెంట్లూ పథకం ప్రకారం నగదు డబ్బుల ఆశజూపి ఇరవై ముప్పై ఏళ్ళుగా సాగుచేస్తున్న అవగాహనలో ఉన్న, అనుభవం ఉన్న పంటలను వొదిలించి పత్తి సాగు పేర కమర్షియల్, సీడ్ పేరిట విత్తన పాచికలకు రైతులను బలిచేసి అప్పిచ్చి పంటలకు పెట్టించిన పెట్టుబడులు ఎల్లక, పురుగు మందుల పిచికారి జూదంతో రైతుల్ని బికారుల్ని చేసి, మళ్ళీ మళ్ళీ నగదు నోట్ల ఆశపెట్టి అప్పుడింతా ఇప్పుడింతా పంటచేతికొచ్చేదాకా ఇచ్చినట్లే కనిపించే మాయలో రైతుల్ని ముంచి చివరాఖర్న లెక్క తేల్చినప్పుడు ఎంతటి కరువూ, విపత్తులు వొచ్చి బతుకు తలకిందులైపోయినా అంతో ఇంతో భూమి ఉంటే బువ్వ వున్నట్లేనని పెద్దల నుండి వారసత్వంగా వొచ్చిన ఎకరో, అరెకరో మిగిలి ఉన్న ఆకాసింత పొలం కూడా సీడు పత్తి పంటకిచ్చిన అప్పు కిందికి చెల్లైపోయిందని ఎన్నడో రాపిచ్చుకున్న కాగితాలు ముఖాన పడేసి ఆర్గనైజర్లు ఖబ్జాలు చేసేసుకుంటుంటే అవమాన భారంతో శవాలైనోళ్ళెందరో…
ఇంట్లో పెద్ద దిక్కులేక… చావురాక అనాధలై విలపిస్తున్న కుటుంబాలెన్నో ఈ నడిగడ్డన..
**
ఎంతకూ వొడవని క్రూరాతి క్రూర కఠోర నిజాల సంఘటనల స్మృతుల్లో లీనమై బరువెక్కిన హృదయాలతో ఏకధాటిగా సాగుతున్న మా మాటల్లో మునిగిపోయి… అబ్బురపరిచే ఆ విషాదస్మృతులతో మధ్యాహ్నం పన్నెండు కావస్తుండగా ఐజ చేరుకున్నాం.
కలువాలనుకున్న ప్రజా సంఘాల మిత్రుడు భాస్కర్కు ఫోన్ చేసాం. లిఫ్ట్ కాలేదు. షాపుకూడా బందుంది. మరో అయిదారుగురికి ఫోన్ చేస్తే ఒకరిద్దరు మాట్లాడారు కానీ మావెంట పెద్ద ధన్వాడా రావడానికి సిద్ధంగా వాళ్లు లేరు.
భాస్కర్ గద్వాల్ వెళ్లాడని ఇక మేమే ఆటోను మాట్లాడుకునే పనిలోకి దిగితే.. ఆటోవాళ్ళు రానుపోను వెయ్యి అడిగేసరికి విస్తుపోయినం.
అంతట్లోకే బహుజన రాజ్య సమితి వినోద్ కలిసాడు. రెడ్ క్రాస్ తాహెర్ భాయ్ కి ఫోన్ చేసి పరిస్థితి వివరిస్తే తన టూ వీలర్ కూడా ఉంది. దానిపై ఇద్దరు వెళ్లొచ్చు. నడిపే వాళ్ళను చూసుకోండన్నాడు.
మా వినోద్కు బండిరాదు. ఒకర్ని జమచేసుకొని రమ్మని చెప్పి మా స్కూటీ పై మేం వెళ్ళడానికి సిద్ధమయ్యాం.
అప్పటికే రెండు కావస్తున్నది. భోజనానికి ఆగితే మరో గంట అవుతుందని, ఎలాగైతేనేం అక్కడికెలదాం టెంటుకు చేరుదాం ముందు అని స్కూటీ మీద పెద్ద ధన్వాడా దారిపట్టినం నేనూ మా అడ్వకేట్ వెంకటేష్.
హన్మంతు వొస్తున్న రాయచూరు ఎక్స్ప్రెస్ కర్ణాటక బస్సు కలుకుంట్ల దగ్గర చెడిపోయి ఆగి రిపేరు చేసుకున్నదనీ, ఆ బస్సులోనే డైరెక్టు గా వొస్తున్నానని ఐజకే వొచ్చేసిన హనుమంతును వెంటబెట్టుకుని మేమూ, తాహెర్ భాయ్ ఇచ్చిన బైకుపై బయలుదేరారు వినోద్ వాళ్ళు.
కాస్తంత వెనుక ముందులుగా మారెండు బైకులూ కదిలినయ్.
ఐజ దాటినంక తాండ్రపాడు రోడ్డు కుడి వైపు మళ్ళి ఆర్డీఎస్ కాలువ వెంబడి కంకర తేలిన మట్టి రోడ్డు మీదుగా దారి అడుక్కుంటూ తాండ్ర పాడు, నౌరోజు క్యాంపూ, చిన్న ధన్వాడా గ్రామాలు దాటి ఒక్కో గ్రామం దాటుకుంటూ వెళ్తున్నాం.
నలబై నిమిషాల ప్రయాణం తర్వాత అంత దూరాన మేం వెళ్ళాల్సిన ఊరు కనిపిస్తుంటే ప్రాణం లేచొచ్చింది.
చదునైన నల్లరేగడి భూములు రోడ్డుకిరుపక్కలా విరగకాసిన మిరప పంటతో ఎర్రెర్రెగా పలుకరిస్తుంటే పెద్ద ధన్వాడ ఆర్చ్ గుండా సాయంకాలం మూడున్నర అవుతుండగా ఇథనాల్ వ్యతిరేక పోరాట దీక్షా శిబిరం టెంటుకు చేరుకున్నాం.
దంచి కొడుతున్న ఆ ఎండ వేడిలో రెండు పెద్ద శామియానాలతో ఏర్పాటైన దీక్షా శిబిరం ఆ గ్రామీణ జనం గంభీరమైన నినాదాలతో సాగుతున్నది.
ప్రాణాంతక ఫ్యాక్టరీ నిర్మాణ అనుమతులు రద్దు చేయాలనీ..
పెద్ద ధన్వాడా, చిన్న ధన్వాడా, నౌరోజు క్యాంపు, నసనూరు, మాన్ దొడ్డి, కేశవరం, పచ్చర్ల, చిన్న తాండ్రపాడు, వేణి సోంపురం, ఉప్పల, పులికల్లు, రాజాపురం లాంటి పన్నెండు పైగా విష ప్రభావ ముప్పు పొంచి ఉన్న గ్రామాల లక్షలాది ప్రజల, పశు పక్షాదుల, పంటపొలాల జీవించే హక్కు కాపాడాలనీ..
బేషరతుగా ఇథనాలు కంపెనీ ఎత్తివేయాలనీ..
నినాదాలు మార్మోగుతున్నాయి శిబిరంలో.
యాభై పైగా మహిళలూ, వొంద దాకా పురుషులూ నిరసన దీక్షలో ఉన్న ఆశిబిరం మాలో నూతన ఉత్తేజాన్నీ, పోరాటపు గెలుపు భరోసాకు హామీనీ కలిగించిందంటే అతిశయోక్తి కాదు.
అప్పటికి ఇరవై రోజులుగా ఆ దీక్షా శిబిరం ప్రతి రోజూ వొక కులసంఘపు వొంతుగా ఆ రోజు గౌడ కుల ప్రజల పార్టిసిపేషన్తో దీక్షలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి మాసపు ఎండలో దీర్ఘ బైకు ప్రయాణంలో గతుకుల, రాళ్లు తేలిన మట్టి రోడ్డు పై ఎక్కడ స్లిప్పవుతామో అనే ఆందోళనతో వొచ్చిన మా ప్రయాణ బడలిక ఎక్కడికెళ్లిందో ఆ జనం స్ఫూర్తిని చూస్తే…. పాలమూరు అధ్యయన వేదిక నుండి హనుమంతు సారూ నేనూ ఇథనాల్ వ్యతిరేక పోరాటానికి సంఘీభావం ప్రకటించాం.
ఎండిన ఆర్డీఎస్ నీళ్లు పారిస్తారనుకుంటే పాలకులు ఊర్లకు ఊర్లను నాశనం చేసి మనుషులను చంపే విష రసాయనాల ఫ్యాక్టరీలకు అనుమతులిచ్చే దౌర్భాగ్యం నశించాలనీ.. ఐక్య ఉద్యమం ద్వారా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల విధానాలనూ.. మనుషుల ప్రాణాలు ఫణంగా పెట్టి లాభాల అన్వేషణలో కోట్లకు పడగలెత్తుతున్న కార్పొరేట్ కంపెనీల ఆగడాలనూ తిప్పికొట్టడానికి మీరు చేస్తున్న ఈ పోరాటం విజయవంతమై తీరుతుందనీ.. మన ఉమ్మడి జిల్లాలోనే కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి కంపెనీల ఆగడాలకూ.. దౌర్జన్యాలకూ గురవుతున్న బాధిత ప్రజలు పోరాటాలు కొనసాగిస్తున్నారనీ.. ఆయా పోరాటప్రాంతాలు సందర్శించి వారి అనుభవాల్లోంచి రాటుదేలాలనీ.. ప్రజల సంక్షేమంకోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు రాజ్యాంగ బద్ధ పాలనకు తిలోదకాలిచ్చి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకోసం పనిచేయడం ప్రజాస్వామ్యం ఎంతమాత్రం కాదనీ.. ఇక దీన్ని కొనసాగనిచ్చేది లేదనీ ఉద్యమాలు చేపట్టడమే నిజమైన ప్రజాస్వామ్యమూ.. దేశభక్తి అవుతుందని ఎలుగెత్తి చాటాల్సిన సమయం ఆసన్నమైనదని పోరాట శిబిరానికి సందేశం అందించాం.
శిబిరానికి రోజూ ఎవరెవరు వస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఏర్పాటు చేసుకున్న ఛానళ్ళ ద్వారా డిపార్ట్మెంటుకు సమాచారం ఎప్పటికప్పుడు వెళుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతూనే ఉంది.
టెంటు తీయకుంటే కేసులు అవుతాయన్న హెచ్చరికలూ అందుతూనే ఉన్నాయి ఫోన్ల ద్వారా అక్కడ వున్నవాళ్ళకు.
రాజ్యాంగ బద్దంగా సాగుతున్న శాంతియుత నిరసన దీక్షా పోరాటానికి అడ్వకేట్ వెంకటేష్ న్యాయ సపోర్ట్ ప్రకటించారు.
వినోద్, మావెంట ఐజ నుండి వచ్చిన వొక గ్రామ సర్పంచ్ ఇరువురూ సందేశం ఇచ్చాక సాయంకాలం అయిదు గంటలవేళ ఆరోజు దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశాం.
మర్రోజు జరుగబోయే దీక్ష గురించిన సమాయత్త ప్రకటనతో ఆ సమావేశం ముగిసిందావేళకు.
జనం ఒకర్నొకరు చైతన్యపర్చుకుంటూ తమ ప్రాణాలకు ముప్పు తెచ్చే ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసే దాకా ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలని తీర్మానించుకున్న తెగువను శ్లాఘించుకుంటూ ఎవరిళ్ళకు వాళ్ళం వొచ్చేశాం.
నిరసన శిబిరం అలుపు లేకుండా సాగుతున్నది.
* *
కంపెనీ ప్రతినిధులు.. మధ్యవర్తుల ద్వారా, పోలీసుల ద్వారా సాగిస్తున్న రాయభారాలూ… హెచ్చరికలూ పెరుగుతూ పోతుంటే… ప్రతిపక్ష పార్టీలూ, ప్రజాసంఘాల సందర్శనలూ… సంఘీభావాలతో అలుపు లేకుండా మరింత శక్తివంతంగా దీక్షలు కొనసాగిస్తున్నారు జనం.
ఒకనాడు జిల్లా కేంద్రంలో కంపెనీ ప్రతినిధులతో, ఉన్నతాధికారుల సమక్షంలో చర్చలు జరుపుదామని ప్రతిపాదన వొచ్చింది.
ఈ చర్చల కోసం పోలీసు అధికారులు జనాన్ని ఒప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా చేసిన ఫలితంగా జిల్లా కేంద్రంలో ఆర్.డి.ఓ. ఆఫీసులో చర్చలకు కేవలం ఇథనాల్ బాధిత ప్రజలే రావాలనే షరతుతో సమావేశం జరిగింది.
విషతుల్య వ్యర్థాల విడుదల జరగదనీ, రోగాల భయంవద్దనీ, కార్పొరేట్ తరహా అత్యాధునిక వైద్యశాల నిర్మించే బాధ్యత కంపెనీ తీసుకుంటుందనీ, కంపెనీ ప్రతినిధులు ప్రతిపాదన చేశారు.
“నమ్మమంటే నమ్మం” అన్నారు బాధితులు.
మా ఊర్ల పక్కల ఫ్యాక్టరీ కడితే ఒప్పుకునేదే లేదు.
“… కావాలంటే మా ఊర్లన్నీ మీరే కొనండి… మమ్మల్ని ఎక్కడికైనా మార్చండి…” దృఢమైన అభిప్రాయం ఖరాఖండిగా ప్రకటించారు జనం.
“జనం ఇంత స్పష్టంగా చెబుతున్న అభిప్రాయానికి భిన్నంగా నేను నివేదిక రాయలేను” ఆర్.డీ.ఓ. తేల్చి చెప్పారు.
కంపెనీ ప్రయోజనాల కోసం ఎలాగైనా ఇవ్వాళ జనాన్ని ఒప్పించి తీరాలని కాచుకున్న కంపెనీ ప్రతినిధులూ, ఏజెంట్లుగా వ్యవహరించే కొందరు అధికార అనధికార వర్గాలు తీవ్ర నిరాశకు గురైపోయి పరాభావంగా భావించి పెదవి విరిచారు. జనంలో గ్రూపులు సృష్టించడానికి చేసిన ప్రయత్నాలూ ఫలించడం లేదు.
జనహితాన్ని కాంక్షించే అధికారులను లొంగదీసుకోలేకపోతున్నామన్న అసంతృప్తి… అశాంతితో రగిలిపోతున్నారు కంపెనీ ప్రతినిధులు.
తనివితీరా చేతులు తడుపుకొని ఫ్యాక్టరీ యజమానుల ప్రయోజనాన్ని కాపాడే కర్తవ్య నిర్వహణలో ఉన్న శక్తులన్నీ ఏకమై తీసుకున్న నిర్ణయాల్లో కుట్రల్లో భాగంగా రాత్రులు రాత్రులు ఫ్యాక్టరీకి సంబంధించిన యంత్రాలూ పరికరాలూ తెచ్చేందుకు చేసే ప్రయత్నాల్ని పసిగట్టిన గ్రామీణులు ఫ్యాక్టరీ దగ్గరికి భారీ వాహనాలు రాకుండా రోడ్లను అడ్డంగా తవ్వడం, కాపలాకాయడం ప్రారంభించారు.
మధ్యవర్తులతోనూ… పాలక, ప్రతిపక్ష పార్టీల నాయకులతోనూ రాయభారాలు కొనసాగుతున్నట్లూ… ఫ్యాక్టరీని నిలువరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లూ జనాన్ని మభ్యపెట్టుకుంటూ కొంత కాలం గ్యాప్ ఇచ్చి వారితో వీరితో “ఇక ఆపారులెండి… ఇథనాల్ ఫ్యాక్టరీ
ఆగినట్లే అంటూ…” వార్తలు వ్యాపించడం ఒక పథకంగా అమలవుతున్న సందర్భంలో…
ప్రజలంతా ఎవరి పనుల్లో వారు మునిగి ఇక ఫ్యాక్టరీ రాదనుకున్న ఏమరుపాటులో ఉన్న వేళ ఓ రోజు రాతిర్రాతిరి కంటైనర్లూ… యంత్రాలూ… భారీ వాహనాల్లో డంపింగ్ చేయబడ్డాయి.
వార్త తెలిసిన జనం అడగడానికి కూడి వెళ్ళి నిలదీస్తే కంపెనోడు తోడు తెచ్చుకున్న కిరాయి గూండాలూ బౌన్సర్లతో “గీత దాటొస్తే పానాలుండవ్..”
అంటూ రెట్టలెక్కించి హెచ్చరికలూ బెదిరింపులకు సిద్ధమయ్యారు ఆ సాయంకాలం.
మర్రోజు తెల్లారాక అన్ని ఊర్ల జనమూ కలిసి వచ్చారు.
దొంగచాటుగా యంత్రాలు తెచ్చేందుకు ఎవరిచ్చారు ఆర్డర్లని అడగడానికొచ్చిన జనంపై ప్రత్యక్ష దాడులకు తెగబడి తీవ్ర గాయలపాలు చేశారు.
జనాన్ని ఆదుకోవడానికి రావాల్సిన పోలీసులు కేసులు పెట్టడానికి వచ్చి జైళ్ళకు పంపారు ప్రజల్ని.
కిరాయి గూండాల ఆగడాలకు బలైన అరవై ఏండ్ల సవరమ్మ తల పగిలి తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయింది.
ఇంకెందరో కాళ్ళూ చేతులూ వొళ్ళంతా దెబ్బలతో హాస్పిటల్ పాలైనారు.
పట్టపగలు కళ్ళముందు ఇంత బీభత్సం జరిగినా..
ఏరేరి నలభై మంది యువకుల్ని దుర్మార్గమైన కేసులు పెట్టి జైలుకు పంపారు.
గాయాల పాలైన ఆ జనం ఆగ్రహానికి కంపెనీ కంటైనర్లు ధ్వంసం అయ్యాయి ఆ వేళ!
మేక వన్నెపులులుగా, తోడేళ్ళుగా కాచుకు కూచున్న రాజకీయ నాయకులు..
“మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్ కాదిది…” అని తప్పించుకుంటుంటే…
“.. మేము ఇప్పుడు అధికారంలో ఉన్నామా… ఉన్నోల్లు రద్దు చేయొచ్చు కదా..” అనుకుంటూ..
ఒకరిపై ఒకరు నిందలేసుకుంటూ..
విషతుల్య ఫ్యాక్టరీ వొద్దే వొద్దన్న జనాన్ని మాత్రం కటకటాల పాల్జేశారనీ…
పార్టీలేవైనా ప్రజలకు ద్రోహం చేసేవే… అని తేలిపోయిందని పెద్ద ధన్వాడ ఇథనాల్ వ్యతిరేక పోరాటం సాగిస్తున్న పన్నెండు గ్రామాల ప్రజలు పసిపాపల్నుండి పండు ముసలివాళ్ళ దాకా పటపటా పళ్ళు కొరుకుతున్నారు.
“ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు… ఇది మాకు అక్కరకొచ్చేది కాదు. మా పానాలు తీసేది… ఈ విషపు ఫ్యాక్టరీ మాకొద్దు…” అన్నందుకు అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నది ఆ పల్లెల్లో…
బయటి నుండి కొత్త వాళ్ళ నెవ్వరినీ ఊర్లోకి రానివ్వకుండా పోలీసు క్యాంపు వెలిసింది.
బాధితులను పరామర్శిద్దామని… నిజనిర్ధారణతో సత్యాన్ని లోకానికి చాటుదామనీ ఎక్కడెక్కడి నుండో కదలివొస్తున్న పౌర, ప్రజాస్వామిక సంఘాల బాధ్యుల కదలికలను పసిగట్టి బాధిత ప్రజల గ్రామాలకు చేరకుండా అరవై డెబ్భై కిలోమీటర్ల దూరంలోనే… జాతీయ రహదారులపైనే కాపు కాసి కష్టడిలోకి తీసుకొని అడ్డగిస్తున్నారు రక్షకులు..
కొత్త ప్రభుత్వం ఎన్నికల వేళ అట్టహాసంగా ప్రకటించిన ఏడో గ్యారంటీ హామి గుడ్లెల్ల చెట్టింది..
ఇల్లిల్లు గాలించి తమ బిడ్డల్నీ, భర్తల్నీ పట్టుకుపోతుంటే మగవాళ్ళంతా చెట్టుకొకరు పుట్టకొకరు ఇండ్లిడిసి చెల్లాచెదురైపోతే ఆ గ్రామాల్లో ఆడోళ్ళు పడ్డ యాతన, గోస మాటలకందనిది.
వ్యవసాయ కుటుంబాలు అన్నీ కలిసి ఆనందంగా ఏడేడూ జరుపుకునే ఏరువాక పండుగ వచ్చింది అంతలోకే..
తమ బిడ్డలు నలభై మంది పైగా కేసుల్లో ఇరికించబడి ముప్ఫై మంది జైలులో చేయని నేరానికి శిక్ష అనుభవిస్తుంటే పండుగెట్ల జరుపుకునేది…
బిడ్డలొచ్చాకే పండుగ చేసుకునేదని ఊరు ఊరంతా ఒక్కటై తీర్మానించుకున్న చైతన్యం చూస్తే తమ జీవితాలను నాశనం చేయ సంకల్పించే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం లాంటి సమస్య కోసం పోరాడే ప్రజలను వారు చేసే నిస్వార్థ పోరాటాలే వారిని యోధులుగా తీర్చిదిద్దుతాయని నడిగడ్డ ఇథనాల్ వ్యతిరేక పోరాటం రుజువు చేసింది.
**
రాజ్యాంగబద్ధ సంస్థ మానవ హక్కుల కమీషన్కు తమ గోడు వినిపించుకోవడానికి సిద్ధమైన ఇథనాల్ వ్యతిరేక పోరాట బాధిత ప్రజలకు తామే సిసలైన నాయకులంగా చెలామణి చేసుకుంటున్న రాజకీయ దుష్టశక్తులు బాధిత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే పన్నాగాలకు సిద్ధమవుతుంటే..
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అధికారంలోకొచ్చిన పాలక పార్టీల నాయకులు పోరాడే ప్రజలకు అండగా ఉండి శాంతియుత పరిష్కారానికి మార్గం సుగమం చేయకుండా కంపెనీ ఏజెంట్లుగా రంగు తేల్చుకు తిరుగుతున్నారు దర్జాగా…
ప్రపంచ వ్యాప్తంగా ఇథనాల్ ఫ్యాక్టరీల విష వ్యర్థాల మూలంగా మానవ జీవితాలే కాకుండా పశుపక్షాదుల, భూగర్భ, జల, వాయు వాతావరణాలన్నీ నాశనమైపోతాయని ఎన్నో అధ్యయనాలు ఘోషిస్తుండగా..
” .. టెక్నాలజీ మారింది… వ్యర్థాలుండవు… విషప్రభావాలసలుండవు.. ” అంటూ కంపెనీల స్వార్ధలాభాల ప్రయోజనాల రక్షణ వకాల్తాపుచ్చుకుని జనాన్ని మభ్యపెట్టడానికి చూసే పాలకులూ… పట్టీ పట్టనట్లుండే సకల పార్టీల నాయకులూ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల జీవితాలను నాశనం చేయాలన్న దీక్ష పూనినట్లుగా ఏడాదికి పైగా పోరాడినా రద్దు జరగని మరికల్ దగ్గర ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమం నుండీ… ప్రారంభమే కానీయకుండా పోరు చేస్తున్న పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ బాధితుల దాకా గొంతెత్తి చాటుతున్న సత్యం ఒక్కటే…
ఈ పాలకులకూ… రాజకీయ పార్టీలకూ… జనాన్ని చంపే ఫ్యాక్టరీలిచ్చే ముడుపులే ముఖ్యం.
ఊర్లకు ఊర్లు ఎంత మంది జనం నాశనమైనా వీళ్ళకు పట్టదు…
పొలాలు నాశనమైనా వీళ్ళకు పట్టదు…
పర్యావరణం నాశనమైనా వీళ్ళకు పట్టదు…
ఊర్లల్లో పోలీసు క్యాంపులు పెట్టినా లక్ష్యపెట్టకుండా పోగై మాట్లాడుకుంటున్న జనం చేతుల్లోంచి మైకు లాగేసుకున్నా… ఉసేను గొంతు నినాదమై మార్మోగుతూనే ఉంది… ఏకధాటిగా…
మరింత నిబద్ధతతో… మొక్కవోని ధైర్యంతో…
రేపటి ఉద్యమానికి సంసిద్ధమౌదామన్న దృఢ సంకల్పంతో…
“గెలిసి తీరుతం” అన్న విశ్వాసంతో…
***