వర్గ స్పృహను
దారిమళ్లించామనే
సంబరంలో
ఆస్తిత్వవాదాలు
తలమునకలై ఉన్నాయి..
ఎక్కువ తక్కువల
తకరారుల్లో
సకల జన సంవేదనలు
అలసి పోతున్నాయి..
ఎత్తుగడలు
తలగడలుగా
రూపాంతరంచెంది
శ్రామిక జన
పోరాట పటిమకు
లాభ నష్టాల
లాబీయింగులద్దడంలో
రివిజనిస్టు ప్లీనరీలు
వాదులాడు కుంటున్నాయి..
కడలి అలలకు
కౌగిళ్లను పరిచే
మైదానలిప్పుడు
కాల్చేతులాడని
పక్షవాతాల్లో
కాయకాల్ప చికిత్సకోసం
కన్నీరింకిన కళ్ళతో
దిక్కులు చూస్తున్నాయి..
రాజ్యం రాజేసిన
అధర్మ యుద్ధ
విద్రోహ దహనాల్లో
పచ్చని అడవి
ధగ ధగా
అంటుకుపోతున్నది..
అయినా…
గూడు చెదిరిన పక్షులు
గుండెలవిసేట్లు
విలపించడం లేదు..
కనుకొలుకులు
దాటని చెమ్మను
కందెనలు చేసుకుని
విల్లంబుల మొనలకు
పదునులద్దుకుంటునాయి..
ఒరిగిన సహచరుల
వొడవని జ్ఞాపకాల్ని
ఆరని కుంపట్లుగా
కళ్ళల్లో రాజేసుకుంటూ..
గుండె దిటవు చేసుకొని
ప్రసవించే ఉదయాలకోసం
తూరుపు లోగిళ్ళ
పురిటి పాన్పులు
సిద్ధం చేసుకుంటాయి..
అంతిమ యుద్ధంగా
విరుచుకు పడుతున్న
కంగాలీ దాడుల్ని
అంతం చేయడానికి
సన్నధ్ధ మౌతాయి…
Excellent