గాయాలు అమూర్తమైనవి కావు

గాయాలు
ఎప్పుడూ నెత్తుటి రంగులోనే చిమ్మబడతాయి
కాని
ఒకే దేహంలోని ఒకే హృదయంలోనివే అయినా
వాటి ధ్వనులు వేర్వేరు, భాషలు వేర్వేరు,
వ్యక్తీకరణ వ్యాకరణాలు వేరువేరు

గాయాలు
అమూర్తమైనవి కావు
పిల్లల శవాల కోసం
పరుగాడిన గుండె చప్పుడంత వాస్తవం
పసికూనల చేతివేళ్ళ కోసం
బూడిద కుప్పలో వెతుకాడిన
దుఃఖమంత వాస్తవం
తల్లుల గర్భాలపై
తూటా పేల్చినంత వాస్తవం
యుద్ధంలో
పసిపిల్లాడి తల దొరకనంత వాస్తవం
గాయాలు.. ఎప్పటికీ అమూర్తమైనవి కావు
మంటల నాట్యంలో బాంబుల వర్షంలో
నడక సాగిస్తున్న ఎదురుచూపులంత వాస్తవం

అన్ని జలపాతాల్లాంటి జలపాతం కాదు
గొంతులోని దుఃఖం

అన్ని సముద్రాల్లాంటి సముద్రం కాదు
తల్లడిల్లే హృదయం

జలభాష కాదు
ఇది అలజడుల భాష
కూడికలతో కొట్టివేతలతో ఉండే
బండగుర్తుల భాష కాదు
ఇది బడబాగ్నుల భాష

నీరు మేఘమైనట్టు
మేఘం వర్షమైనట్టు
నాభిలో
సుడి తిరిగే దుఃఖాలకు
సులువైన ప్రణాళిక ఉండదు
పిల్లలను బాంబులు మింగేస్తున్నప్పుడు
అమ్మల కడుపులో
అలల అలజడుల రాగానికి
అతి సులువైన వ్యాకరణం ఉండదు

దేహాలు వేర్వేరు
యుద్ధాలు వేర్వేరు
శబ్దనిశ్శబ్దాలు వేర్వేరు
చూపులు వేర్వేరు
జాడ దొరకని అమ్మల కోసం
పిల్లల ఎదురుచూపుల అంతస్సారమంతా ఒక్కటే
అని తెలిసిన నేను
జాడ దొరకని పిల్లల కోసం
అమ్మల పోరాటాల అంతస్సారమంతా ఒక్కటే
అని తెలిసిన నేను
అనేకానేక యుద్ధాల మధ్యలో నిలబడి
వేర్వేరు కవితలు రాస్తున్నాను

ఈ కవితల అంతస్సారమంతా ఒక్కటే
అని తెలుసుకున్న నేను

నాలోపల జరిగే యుద్ధాల వైపు
ఓసారి తొంగి చూసుకున్నాను

పుట్టిన ఊరు వింజమూరు, నల్లగొండ జిల్లా. కవి, సామాజిక కార్యకర్త. ఎనిమిదో తరగతి నుంచే కవిత్వం రాస్తున్నాడు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రాచ్య కళాశాల(నల్లకుంట, హైదరాబాద్)లో డిగ్రీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగు లిట్ పూర్తి చేసాడు. ప్రస్తుతం జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ప్రవృత్తి ఫోటోగ్రఫీ.

Leave a Reply