స్వంత అస్తిత్వం కోసం పెనుగులాట గాఫిల్ కథ

మనిషి తనెవరూ? అనే స్పృహను కోల్పోవడం కంటే విషాదం ఉండదు. మన దేశంలో పౌరులను మతం కులం అనే సంకుచితత్వం లోకి కుదించేసి వాళ్ళ మధ్య అడ్డుగోడలను నిర్మిస్తున్నారు .మనిషికి వాడి కులం లేదా మతమే ఇప్పుడు గుర్తింపు. వాడిప్పుడు డాక్టర్ కాదు, కళాకారుడు కాదు, రచయిత కాడు, నటుడు కాదు, కవి కాదు. మొత్తంగా ఒక సృజనాత్మక జీవి కాదు. పాలకులు తమ‌ అధికారంలో కొనసాగడానికి అవసరమైన శాలభంజికలుగా భారతీయులు మిగిలిపోవాలన్నదే వారి ఆకాంక్ష. దాని కోసం భిన్న మతస్తులు ఒకరికొకరు శత్రువులుగా ఎదురెదురుగా నిలబడాలి, ద్వేషం ప్రదర్శించుకుంటూ బతకాలి. “ఏవీ నిరుడు కురిసిన” అన్నట్టు హిందూ ముస్లీం సోదర భావం ఆవిరైపోవాలి. ఈ దేశానికి ఆంతరింగక శత్రువులన్నారు వారు ముస్లీంలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు అని “బంచ్ ఆఫ్ థాట్స్” లో రాశాడు గోల్వార్కర్. ఇది జర్మనీలో హిట్లర్, ఇటలీలో ముసస్సోలినీ చూపిన ఒక ఫాసిస్టు నమూన! 

పాలకవర్గాలు అధికారం లో కొనసాగడం కోసం పన్నుతున్న పంజరంలో పక్షులు గా పౌరులు మార్చివేసే ఒకానొక కుట్ర ఇది. ఈ నమూనాతోనే అటు హిట్లర్ ఇటు ముస్సోలినీ అధికారంలోకి వచ్చారు. 

ఎంత తొందరగా వచ్చారో అంతే తొందరగా కనుమరుగైపోయారు. ఫాసిజం ఎప్పుడో ఒకప్పుడు ఓడిపోక తప్పదు అనేది చరిత్ర పాఠం. అది ఒక పాఠంగా పాఠ్య పుస్తకాలలో ఉంటుంది కానీ దాన్నుంచి జర్మనీ లేదా యూరప్ నేర్చుకున్నట్టు పాఠాలు మనం నేర్చుకోకపోగా బిజెపి ఆ నమూనానే ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నదని తెలిసీ మౌనం వహిస్తున్నాం. ఒకవైపూ దాని ఎదుర్కునే పోరాటాలు ఒక వైపు కొనసాగుతూన్న అవి ఇంకా ప్రజాబలాన్ని పొంద లేకపోయున్నాయి. 

ఇది ఇప్పటికీ చాలా మంది అధికారాన్ని సుస్థిరం చేసుకోడానికి లాభదాయకమైన వనరు గా మారిపోయింది. నీ అస్తిత్వం ఏమిటీ? నిన్ను నువ్వు ఏమని ఆవిష్కరించుకుంటావు? పోనీ నువ్వు ఏ ఆవిష్కరణలు చేసి ఈ సమాజాన్ని సంమృధ్ధి పరుస్తావు? ఇత్యాది ప్రశ్నలకు విలువ లేదసలు. నిన్నీ సమాజం ఓ సృజనాత్మక జీవిగా ఇక ఎంత మాత్రం చూడజాలదు.   నువ్వెవరికీ  జ్ఞానసంపన్నుడి కనబడడం వాళ్ళకి ఇష్టంలేదు. నిన్ను నువ్వు ముస్లీంగానో, హిందువుగానో, అగ్రవర్ణంగానో, బహుజనుడిగానో మిగిలిపోవడమే ఆధిపత్యవర్గాలకి కావాలి. ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే నీకసలు ఏ గుర్తింపులేని మతిలేని జీవిగా మార్చేసినా ఆశ్చర్య పోనక్కలేదు. వాళ్ళకి నువ్వో మతోన్మాదిగా ఉండడం ఇష్టం, ఒక హంతుకుడిగా, ఒక రేపిస్టుగా,ఒక బానిసగా ఉండడం ఇష్టం.  లేదంటే ఒక నజీబ్ మాయమైపోడు, ఒక వరవరరావూ, సాయిబాబా జైళ్ళల్లో మగ్గరు, ఒక రోసిత్ వేముల ఆత్మహత్య చేసుకోడు, పదుల కొద్దీ దళిత మహిళలు రేపులకు గురి కారు, కేవలం ఒక కశ్మీరీ ముస్లీం గా పుట్టినందుకు ఐదేళ్ళ బాలికపై దేవాలయం లో అత్యాచారం బారినపడి హత్యకు గురి కాదు, ఇదంతా సొంత అస్తిత్వం, లేదా ఓ సృజనాత్మక గుర్తింపు, లేదా ఓ ప్రజా ఉద్యమంలో ఉన్నందుకు పడుతున్న శిక్ష. పరువు హత్యలూ, లవ్ జిహాద్లూ ఒక ఆయుధంగా వారి చేతిలో మారిపోయి స్వఛ్ఛమైన ప్రేమికులను విడదీసి వాళ్ళ ఉనికి మాయం చేయడం ఉండదు గాక ఉండదు. 

స్కైబాబా గాఫిల్ అనే కథ లో డీల్ చేసిన అంశం ఇదే! తనలోంచి బలవంతంగా తన అస్తిత్వాన్ని లాగేసుకున్నాక మతి స్థిమితం కోల్పోయిన మనిషి పడే యాతన ఈ కథ. ఇదో సమకాలీన కథ. చాలా హృద్యంగా మలిచిన కథ. ద్వేషంతో మనుషులను విడదీసే వారికీ, ప్రేమతో మనుషులను కలిపే వారికీ మధ్య జరుగుతున్న ఘర్షణను చిత్రించిన కథ. 
ఈ కథలో స్పష్టమైన రెండు పొరలున్నాయి. ఒకటి- సామాజికమైందీ రెండు- రాజకీయమైంది. ఇంత ఆధునికతా, ఇంత అభివృద్ధి మానవ సంబంధాలు ఇంకా మతం చుట్టూ, కులం చుట్టూ తిరగడం ఏమిటీ? కులాంతర, మతాంతర ప్రేమలను అంగీకరించలేని వెనుకబాటుతనంలో ఈ సమాజం ఎందుకు ఉండిపోయిందీ? ఈ అంశాలను నడిపిస్తున్న శక్తులు ఏమిటీ? అనే సామాజిక అంశం ఒకటైతే ఈ బలహీనతని ఉపయోగించుకోని లభ్ధి పొందాలనుకునే రాజకీయ కోణం రెండోది. ఈ రెండు పొరల మధ్య అల్లబడ్డ కథ ఇది.  రాజకీయాలు, సమాజం ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ను శాసించడం అభివృధ్ధి నిరోధకతకు గుర్తు. సమాజంలో చాందసత్వాన్ని తగ్గించడానికి రాజకీయాలే పనిచేయాలి. కానీ దీనికి విరుధ్ధంగా రాజకియాలు మతాంతర వివాహాలను, కులాంతర వివాహాలను అడ్డుకోవడానికి అవసరమైన లుంపెన్ మార్గాలను ఎన్నుకోవడం దానికి కోసం కొందరిని పెంచిపోషించడం దేశంలో దిగజారిన రాజకీయ సామాజిక,సాంస్కృతిక పరిస్థితికి నిదర్శనం. ఈ సామాజిక వెనుకబాటు తనాన్ని రాజకీయ స్వార్థాన్నీ ప్రశ్నించేదే ఈ కథ. తప్పకుండా చదవలసిన కథ. మనదైన అస్తిత్వాన్నీ, మనదైన గుర్తింపుని కలిగి ఉండడం ఇప్పుడెంత కష్టతరం అని చెబుతూనే “ప్రేమ” మన చుట్టూ ఉన్న మనుషుల మధ్య ఎలా ఒక సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించగలదో చర్చించే కథ. మనుషుల మధ్య గోడలను నిర్మించి వారిని విడదీసే శక్తులు ఒక పక్క, ఆ గోడలను కూల్చడానికి తమ శాయశక్తులా ప్రయత్నించే సామాన్య మానవులు ఒక పక్క ఘర్షణ పడుతూ మనకీ కథలో కనబడతారు. పైన ఉదహరించిన ఫాసిస్టు పంధాతో ప్రేమ ఎలా గెలిచి నిలువ గలదో చెప్పిన కథ. ఇలాంటి కథ రాసినందుకు స్కై కీ, ఇలాంటి కథను ధైర్యంగా అచ్చేసినందుకు అనంతు చింతపల్లి కి అభినందనలు.

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

One thought on “స్వంత అస్తిత్వం కోసం పెనుగులాట గాఫిల్ కథ

  1. Why we are paying more attention to Kulamu.mathamu ???without religion /caste
    We can not live in the world —
    By reading a story —people cannot change — nothing happens
    Needs CHANGE in our thinking /mentality/ vision /
    Writers —rayadam—paatinchadam /amalucheyadam Mukhyam
    75 years independence — no democracy /family rulings —varasathva paalanalu —too much corruption
    No importance to Telugu language in Telugu states ??telugu palana bhash Kaadu.
    Too much gap between rich and poor //why
    Writers —medhavulu needs to focus on these issues
    =========

Leave a Reply