గాజా.. నా గాజా..నువు గెలిసి తీరుతావు!!

నెత్తురోడుతున్న
పసిబిడ్డల
ఎడతెరపి లేని
ఆర్తనాదాల హోరులో..

చిమ్మ చీకట్లు కమ్మిన
ఆకాశ గాయాల
గర్జనల గురుతువై..

గాజా
వో గాజా
నా గాజా
నువు లేచి నిలుస్తావు…

చిగురు తొడిగే
కలల కడలి
అలల అలజడివై..
బలిదాన
బస్తర్ల
పేగు బంధానివై..

మోడు బారని
ఆశయాల
ఆచరణలు
విరబూసే
సంకల్పానివై..

నువు మళ్ళీ
లేచి నిలుస్తావు…

సృష్టి
ఔన్నత్యాన్ని
శ్లాగించే
అజా
పిలుపుల్ని
అపహాస్యం చేస్తూ..

నిత్య
బాంబుల మోతలే
శివాలెత్తి
సందు గొందులనిండా
శవాల గుట్టల పేర్చే
సామ్రాజ్యవాద
దుడుకు దురాక్రమణ
అధర్మం యుద్ధంలో..

కను తెరువకుండానే
కండ కావర కాష్టంలో
కనుమూసే
నవజాత శిశువుల
ఉచ్వాస నిశ్వాసల్ని
దగ్ధం చేస్తూ
సాగే ఈ సంహార
విలయ కేరింతల్ని
ధ్వంసం చేస్తూ..

సకల పెత్తనాల
జులుములను
తుత్తునియలు చేసిన
తరాల
తిరుగుబాట్ల
గెలిచి నిలిచిన
వైభవోపేత
చైతన్య చరితవై
మళ్ళీ మళ్ళీ
వరదలెత్తుతావు…

నిత్య నిర్భంద
దగ్ధ కాండలో
నెత్తుటేరులు
పొంగిస్తూ..

పసిబిడ్డల
హనన కేళి
సంబరమై సాగిస్తున్న
దగుల్బాజీ దహన
దొంగ దాడుల్లో
వొడవని దుఃఖాన్ని
పంటికింద
అదిమి పట్టి..

రంజాను
పర్వదినాన్ని
హరాము చేయబడ్డ
యుద్ధభూమిలో
నిలబడి..

దువా కోసం
ఎత్తిపట్టిన
అరచేతుల్లో
ఉబుకుతున్న
పచ్చి నెత్తురు
ప్రవాహం సాక్షిగా..

వినూత్న
పోరు దారులకు
ప్రాణం పోస్తూ
పడి లేస్తూ..
నిబ్బరంగా
సాగుతున్న
గాజా.. నా గాజా..

నువ్వొక నాటికి
అంతిమ యుద్ధంలో
నిటారుగా నిలబడి
గెలుపును ప్రకటిస్తూ..
విజయ కేతన రెపరెపలను
ఆవాహన చేస్తూ..

శత్రు సంహార
సంరంభానివై..
నెత్తుట తడిసిన
నెలవంక ఆశ్వాసమై..

మళ్ళీ మళ్ళీ
దిగ్బంధనాలు
పెనవేసిన
తూరుపు ఎదల
ఎగిసిన పొదలను
చీల్చుకు ఎదుగుతావు..

గాజా.. గాజా..
నువు లేచి నిలుస్తావు!
గజా.. నా గాజా
నువు గెలిసి తీరుతావు..!!

పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)

Leave a Reply