గాజా చిన్నారి కవిత!

అనువాదం: శివలక్ష్మి

నాకూ ఒక కల ఉంది…
ఒక నాటికి యూదులు, క్రైస్తవులు
నన్ను నేనుట్లుగా చూస్తారని:
ఒంటరిగా, ఒక చిన్నారి పిల్లగా, భీతిల్లుతూ
బేలగా వారి పెద్ద బాజూకాల గొట్టాల వైపు చూస్తూ,
నా మీద ఇంతటి శత్రుత్వాన్ని చూపేందుకు
నేను ఏ తప్పూ చేయలేదని తెలుసుకుంటారని.

అంతా వాత్సల్యం గా చూసే ప్రపంచంలో
జీవించాలని మాత్రమే నేను కోరుకున్నాను;
ప్రజలు ప్రేమను పంచుకునే ప్రపంచంలో
మాత్రమే నేను జీవించాలని కోరుకున్నాను;
దయతో, మీరు నన్ను ఆడుకో నిచ్చి, స్వేఛ్చగా నేర్చుకో నిస్తే,
అప్పుడు మీరు నిజంగా నాపై శ్రద్ధ చూపిస్తున్నారని నేను నమ్ముతాను;
లేకపోతే, మీ మాటలు డొల్లగా
మీ మతం నిస్సారమైనదిగా భావిస్తాను.

నన్ను చూడండి… నేను రక్త మాంసాలతో, ఉన్న చిన్నారిని…
నేను నవ్వగలను… నాకు గాయమైతే రక్తమొస్తుంది… బాధతో ఏడుస్తాను.
సర్ నన్ను చూడండి; మీకు ధైర్యం ఉంటే
నా కళ్ళలోకి చూసి చెప్పండి
నేను, మా అమ్మ, మమ్మల్ని
చంపడానికి ఏ నేరం చేశామో చెప్పండి.

నేను ఒక చదరంగపు పావును కాదు, నేను ఒక చిన్నపిల్లని!
నేను ఒక సంఖ్యను కాదు, నేను ఒక చిన్నపిల్లని!
నేను ప్రయోగశాల ఎలుకను కాదు, నేను ఒక చిన్నపిల్లని!
మీరు నిజమైన మనుషులైతే… నేను మీ బిడ్డనే,
దేవుని పట్ల మీ విశ్వాసం నిజమైతే, మనిద్దరం దేవుని బిడ్డలమే!

ఏసు ప్రభువు ప్రపంచంలోని,
చిన్నపిల్లలందరినీ ప్రేమిస్తాడు;
ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు రంగుల వారినందరిని,
వారందరూ ఆయన దృష్టిలో అమూల్యమైన వారు.
ఏసు ప్రభువు ప్రపంచంలోని,
చిన్నపిల్లలందరినీ ప్రేమిస్తాడు.

ఖాలీద్ జుమా పాలస్తీనియన్ కవి, నాటక రచయిత, బాలల కోసం కూడా ఎన్నో రచనలు చేశారు. ఆయన గాజా స్ట్రిప్‌లోని అల్-షబౌరా పాలస్తీనా శరణార్థుల శిబిరంలో పెరిగారు. అతను ప్రస్తుతం పాలస్తీనా న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీలో కల్చరల్ డిపార్ట్‌ మెంట్ హెడ్‌గా ఉన్నారు, గతంలో ఏడేళ్ల పాటు రోయా మ్యాగజైన్‌కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా పని చేశారు.

Leave a Reply