మొసాబ్ అబూ తోహా (32 ఏళ్ళు) – గాజా లో నివసించే పాలస్తీనా కవి, కథా రచయిత.
తన మొదటి కవితా సంపుటి ‘థింగ్స్ యూ మే ఫైండ్ ఇన్ మై ఇయర్’ కి పాలస్తీనా బుక్ అవార్డు, వాల్కాట్ పోయెట్రీ అవార్డు వంటి అనేక అవార్డులు అందుకున్నాడు ది న్యూ యార్కర్ లో ప్రచురితమైన తన రచనల కాలమ్ – ‘లెటర్ ఫ్రొం గాజా’ కు ఓవర్సీస్ ప్రెస్ క్లబ్ అవార్డు అందుకున్నాడు. అబూ తోహా గాజా లో ప్రారంభించిన లైబ్రరీ ని పునర్నిర్మించాలనే సంకల్పంతో వున్నాడు
//ఒక్క క్షణం //
నేను ఆసుపత్రికి పరుగెత్తుతున్నపుడు
ఆ చిన్న పిల్ల శరీరం
నా చేతులలో పరుగెత్తుతున్నది
ఆసుపత్రిలో కరెంటు లేదు
ఆసుపత్రి కారిడార్లు
వరుసగా మంచాలు పేర్చబడిన
అడవిలా వున్నది
నాకు తెలుసు
నేను మోసుకెళుతున్న పిల్ల
చనిపోయిందని
మందుపాతరల పేలుళ్లు
ఆ పిల్ల దేహంలోని
సన్నని రక్త నాళాలను పేల్చివేశాయని
ఆ పిల్ల చనిపోయిందని
నాకు తెలుసు
కానీ
మమ్మల్నిచూసిన
ప్రతి ఒక్కరూ
మాతో పాటు పరుగులు తీశారు
బతికి వున్న వాళ్ళు
మీతో పాటు పరుగులు తీస్తున్నప్పుడు
ఆ ఒక్క క్షణం
మీరు కూడా బతికి ఉన్నట్టు లెక్క