గాజాలో కాలం భిన్నంగా, భారంగా గడుస్తుంది!

సాధారణంగా ఎవరైనా, దేనికైనా ఒక సమయం, ఒక  ప్రాంతం ఉంటాయి అని అంటారు కదా, మీరు వేరే ప్రదేశంలో ఉండటం వల్ల మీరు వేరే రకమైన కాలంలో జీవిస్తున్నట్లు నా అనుభవం నాకు చెబుతోంది. 

నేను పాఠశాలలో ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని చదివాను, కానీ అది నాకు నిజంగా ఎప్పుడూ సరిగా అర్థం కాలేదు. కానీ నాకు అర్థం కాని ఆ సమీకరణాలు, సూత్రాలతో నిండిన యదార్ధ భావనలు ఇప్పుడు నా సొంత జీవితంలోకి దూసుకొచ్చి, బద్దలవుతాయని  నేను ఎప్పుడూ ఊహించలేదు. 

కానీ గాజాలో, సమయం సాపేక్షంగా ఉంటుంది. అది అందరికీ నడిచినట్లు గాజాలో మాకు నడవదు. అది హఠాత్తుగా, హింసాత్మకంగా మాకు మాత్రం చీలికలు, పేలికలైపోతుంది.

మేము ప్రపంచంలోని సెకన్లతో, నిమిషాలతో అనుసంధానం కావచ్చు, కానీ కలవరపెట్టే వేదనామయమైన నిజం ఏమిటంటే, మేము వాటినే సంవత్సరాలుగా జీవిస్తాం. 

కొన్ని క్షణాల రెప్పపాటు కాలంలో మా మనుషుల ఉనికి అకస్మాత్తుగా, స్పష్టంగా నిర్ణయించబడుతుంది. అమరవీరులు, గాయపడినవాళ్ళు, తప్పిపోయినవాళ్ళు, చివరికి ఎలాంటి కనికరానికి నోచుకోని ఛిద్రమైన సాక్షులుగా మిగిలిపోతారు! 

నేను జూలై 3న, చెవులు బద్దలయ్యే శబ్దంతో వినిపించిన బాంబు దాడితో ఉలిక్కిపడి నిద్ర నుంచి మేల్కొన్నాను. అప్పుడు సమయం తెల్లవారుజామున 2 గంటలు దాటింది.   

పేలుళ్లు ఎడతెగకుండా దగ్గరగా భయానకంగా వినిపిస్తున్నాయి. ఏమి జరుగుతుందో గ్రహించడానికి ఒక క్షణం నిశ్శబ్దంగా వేచి చూస్తూ, భీకరమైన గందరగోళాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.  

సాధారణంగా పిండి పంపిణీకి, ప్రజలు ట్రక్కులకు సహాయం చేయడానికి పరుగెత్తే సమయం కదా ఇది అని నేను మొదట ఆలోచించాను. కానీ నిస్సహాయంగా మహిళలు పెట్టే గావుకేకలు, దఃఖపు రోదనలు నా ఆలోచనల్ని చెదరగొట్టాయి. 

“అమ్మో, ఇది, అది కాదు”,  అని నేను నాలో నేనే తర్జన భర్జనలు పడ్డాను. 

వీధి నుండి దుఃఖపు స్వరాలు ఇంకా బిగ్గరగా వినిపించాయి, అయినప్పటికీ “పాఠశాల! పాఠశాల!” అని గగ్గోలుగా ఏడుస్తున్న మహిళల కర్ణ కఠోరమైన కేకలు ఇంకా తగ్గలేదు:  

గాజా నగరంలోనే  మేము అంతకుముందు అద్దెకు తీసుకున్న అపార్ట్‌ మెంట్ కాలి బూడిదైపోయింది. దానికి ఎదురుగానే  అల్-రిమల్ ప్రాంతంలోని “పేషెంట్స’స్ ఫ్రెండ్స్ బెనెవలెంట్ సొసైటీ హాస్పిటల్‌” ఉంటుంది. అక్కడ నుంచి చూద్దామని నేను మా పాత అపార్ట్‌మెంట్ కిటికీ దగ్గరకు పరుగులు తీశాను.   

మా కాలిపోయిన ఈ అపార్ట్‌ మెంట్, ఆసుపత్రి వైపు ఉండడం వల్ల – నేను చూస్తుండగానే  ఎగిసిపడే మంటలు, విపరీతంగా వ్యాపిస్తున్న దట్టమైన పొగ నలువైపులా వ్యాపించి ప్రతిదీ నల్లగా మాడి మసైపోయి కనిపించింది – ఈ యుద్ధంలో మేము ఏడు సార్లు ఇల్లు మారిన తర్వాత ఇది మా ఏడవ స్థానభ్రంశం తర్వాత మా తాత్కాలిక నివాసంగా మారింది. అదీ ఇప్పుడు భస్మమై పోయింది.

అస్తవ్యస్త గందరగోళ పరిస్థితి:

మొదట, కిటికీ నుండి ఎడమవైపు చూసినప్పుడు, ముస్తఫా హఫీజ్ పాఠశాల పక్కన ఉన్న పాఠశాలలో నాకు ఏమీ కనిపించలేదు, కేవలం రెండు నిమిషాల తర్వాత కొంచెం దూరంలో – కలవరపరిచే విధంగా గందరగోళం, అలజడులు వినిపించాయి.  

నేను ముస్తఫా హఫీజ్ పాఠశాలకు నేరుగా ఎదురుగా ఉన్న బాల్కనీకి వెళ్లాను. 

మంటలు, చిక్కగా ఎగజిమ్మే పొగ, పిల్లలు, మహిళల కల్లోలపరిచే భీతిల్లిన అరుపులతో అక్కడ భయానకంగా ఉంది:  

నిస్సహాయంగా అభ్యర్ధిస్తున్న స్వరాలు: 

“అమ్మా, అమ్మా!”

“వాళ్ళు తినడానికి సరిపడా ఆహారం లేదా?” 

“ప్లీజ్, ఈ హింసను ఆపండి!” 

నిశి రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చివేసే ఉరుములతో కూడిన పేలుడు సంభవించింది, వెంటనే చీకటిగా ఉన్న ఆకాశంలోకి  పొగలతో మంటలు ఎగసిపడుతున్న దృశ్యం కనిపించింది. ఆ వెంటనే ఫెడీల్మనే పెద్ద ప్రకంపన ఒకటి హింసాత్మకంగా భూకంపం లాగా   భూమిని కదిలించింది. 

అత్యంత బాధాకరమైన వారి వేదనతో కూడిన కేకలు, పిల్లల హృదయ విదారకమైన గగ్గోలు రోదనలు నాకు వినిపించాయి. 

“అతను బతికే ఉన్నాడు! ఏడవకు! ఏడవకు! ఫరవాలేదు! అతను లోపలికి వెళ్ళమని చెప్పాడు! అతను బతికే ఉన్నాడు! నాకు ఖచ్చితంగా తెలుసు!” 

ఒక స్త్రీ గొంతు, బహుశా తన చుట్టూ ఉన్నవారికి భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు, ఆమె బహుశా తనను తాను ధైర్యంగా నిలబెట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉండవచ్చు.

ఈ దృశ్యాలు కనపడి కేవలం రెండే రెండు నిమిషాలు గడిచాయి, అంతే, అయినప్పటికీ, ప్రాణాలతో బయటపడిన వారు తమ ప్రియమైన వారిని వెంట వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడం ప్రారంభించారు!

కానీ మారణహోమం చెలరేగిన తర్వాత, ఈ ఛారిటీ ఆసుపత్రి గర్భిణీ స్త్రీలు, పిల్లలను మాత్రమే చూసుకోవడంపై దృష్టి పెట్టింది, అది ఇంకెంతమాత్రమూ నిర్వహించలేని దీనమైన పరిస్థితుల్లో దాని అత్యవసర విభాగాన్ని మూసివేసింది. 

నేను స్థానభ్రంశం చెంది, రెండు నెలలకు పైగా ఇక్కడ ఉంటున్న సమయంలో, చాలా మంది గాయపడిన వారు సహాయం కోసం ఎంత తీవ్రంగా ప్రయత్నించినా, వారికి ఎటువంటి ఫలితం లభించకపోవడం స్వయంగా చూశాను. 

“తలుపు తెరవండి!”, “తలుపు తెరవండి!” అని గధ్గద కంఠాలతో ప్రజలు ఆందోళనతో అరవడం వినిపించింది.  

“వారిని అల్-షిఫాకు తీసుకెళ్లండి,” అని వారికి బదులు చెప్పారెవరో. 

నేను జీవించి ఉన్నంత కాలం, గాయాలతో శుష్కించి పోయిన మనుషులు, ఆకలితో కృశించి బిగుసుకుపోయిన చర్మం గుండా

ఎముకలు ముందుకు పొడుచుకు వచ్చిన వ్యక్తులు – తమ గాయపడిన నెట్టురోడుతున్న పిల్లలను మోసుకెళుతున్న దృశ్యాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను.  

వారు తలుపులు కొట్టడం ఆపలేదు. 

ఆసుపత్రి వైపు భారీ జనసమూహం ప్రవాహంలా వచ్చింది. అక్కడ అంతా అల్లకల్లోలమే! 

కానీ ఆసుపత్రి గేట్ల నుండి అవే మాటలు మళ్ళీ మళ్ళీ వినిపించాయి: “వారిని అల్-షిఫాకు తీసుకెళ్లండి.” 

మాకు నిమిషాలు సంవత్సరాలుగా సాగుతున్నాయి.

దిక్కుమాలినతనం 

సముద్రపు అలలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నట్లుగా, తమ సెల్ ఫోన్ టార్చిలైట్ల వెలుగులో చీకటిని చీల్చుకుంటూ, తమ ప్రియమైన వారిని ఎత్తుకుని, యువకులు వరసగా వస్తున్నారు. వారిలో చాలామంది అప్పుడప్పుడే మేల్కొన్నట్లు అనిపించింది.

ఒక యువతి భయంతో, గాయాలతో వణుకుతున్న పిల్లవాడిని ఎత్తుకుని కనిపించింది, షాక్ లో ఉన్న తన తల్లిని చూస్తూ, బాధగా కేకలు  పెడుతూ  ఏడుస్తున్నాడు.  ఇంకొక యువకుడు ఆమె చేతిని పట్టుకుని పెద్దగా అనునయంగా ఆమెను ఓదారుస్తూ ఇలా చెప్తున్నాడు: “బాబు బతికే ఉన్నాడు, ఏడవకు, ప్లీజ్ ఏడవకు, ఫరవాలేదు. అతను నన్ను లోపలికి రమ్మని చెప్పాడు. నేను అతని పక్కనే ఉంటే బాగుండును. అతను దయగా ఉన్నాడు, దేవుడి దయతో చిన్నారి కోలుకుంటాడు!” 

నేను బాల్కనీలో నిలబడిపోయి పూర్తిగా నిస్సహాయంగా అనిపించి, చాలాసేపు గట్టిగా, బిగ్గరగా ఏడ్చాను. నెమ్మదిగా నన్ను నేను సంబాళించుకుని, ఆ తర్వాత ఉన్న గదికి వెళ్లి కిటికీ వద్ద నిలబడి, నేను మా భవనం ప్రవేశద్వారం ఎదురుగా ఉన్న ఆసుపత్రి గేటు వైపు చూశాను. 

కొందరు సహాయ పంపిణీ కేంద్రాల వద్ద ఆహారాన్ని పొందడానికి ప్రయత్నించి వెనక్కి తగ్గారు – కింద డ్రైవర్ తో పాటున్న  కొంతమంది యువకులు – ఎవరినీ తీసుకెళ్లడానికి గానీ  సహాయం చేయడానికి గానీ ఇష్టం లేనట్లు పక్కనే నిలబడి ఉన్నారు.

ఒక యువకుడు పిండి సంచిని మోసుకెళ్లి విలువైన ఆహారాన్ని బహుమతిగా తీసుకోమని కోరినప్పటికీ, ప్రయాణిస్తున్న డ్రైవర్ గాయపడిన వ్యక్తిని తీసుకెళ్లడానికి నిరాకరించాడు. 

నేను ఎవరికైనా సహాయం చేసి ఉంటే బాగుండేది, వాళ్ళని బ్రతికించగలిగి ఉంటే బాగుండేది అని అనుకున్నాను. 

ఒక బాలిక తన తండ్రో, సోదరుడో గానీ అతడిపై ఆనుకుని – కొద్ది దూరంలో ఉన్న పేషెంట్’స్  ఫ్రెండ్స్ ఆసుపత్రికి తడబడుతూ నడిచి వెళుతుంది. ఆమె ఎడమ చేతితో, కుడిచేతిని గట్టిగా నొక్కిపట్టుకుంది.  కుడిచేయి నుంచి  తీవ్రంగా రక్తస్రావం అవుతోంది! 

పది నిమిషాల తర్వాత, అంబులెన్స్‌లు రావడం ప్రారంభించాయి, గాయపడిన వారిని పట్టుకుని అంబులెన్స్‌లలో ఉంచి ప్రజలు చూపిన చోటికి బయలుదేరాయి. 

దాడి జరిగిన పద్నాలుగు నిమిషాల తర్వాత, సివిల్ డిఫెన్స్ వచ్చింది. 

“అమరవీరులను తీసుకెళ్లండి” అని ప్రజలు పారామెడిక్స్‌కు చెప్పారు.  

నా సోదరుడి తలకు గాయమైనప్పుడు, మేము అంబులెన్స్ సహాయం అడిగితే, అమరవీరులను మాత్రమే రవాణా చేస్తున్నామని చెప్పి అంబులెన్స్ సిబ్బంది అక్కడినుంచి వెళ్ళిపోవడం నాకు అప్పుడు గుర్తుకు వచ్చింది. 

బాంబు దాడి జరిగి ఇరవై నిమిషాలు గడిచాయి. నేను షెల్లింగ్ విన్నాను, ఎగిసిపడే జ్వాలలతో పాటు దట్టమైన పొగ చూశాను, గాయపడిన వారి పొలికేకలు, అమరవీరుల కుటుంబాల వేడికోళ్ళూ, పిల్లల ఏడుపులూ కూడా విన్నాను. 

మరణం, ధ్వంసమైన గుర్తులను కలిగి ఉన్న ప్రతిచోటా బలహీనమైన శరీరాలు పడిపోయి  ఉన్నాయి. 

ఏదైనా బాంబు దాడికి పట్టే సమయం కొన్ని సెకన్లు మాత్రమే.  కానీ అది మాకు గంటలు, రోజులు, దీర్ఘకాలిక సంవత్సరాల ఎడతెగని తీరని బాధలను సృష్టిస్తుంది!

తెల్లవారుజామున 2.32కి,  పౌర రక్షణ సిబ్బంది మంటలను ఆర్పారు. 

2.40 కి ప్రజలు నిశ్శబ్దమైపోయారు. 

సివిల్ డిఫెన్స్ ఇంకా అక్కడే ఉంది, తీవ్రంగా గాయపడి, మరణపు అంచుల్లోకి జారుకోబోతున్నవారిని, అమరవీరులను తీసుకువెళుతోంది.

చనిపోయిన, గాయపడిన, మాయమయిన వారి పట్ల జనాలకి ఇప్పటికీ షాకింగ్ గా, నమ్మలేని నిజాలుగా ఉన్నాయి. సహాయ పంపిణీ నుండి తిరిగి వస్తున్న వారికి తమ ప్రియమైనవారి గతి ఏమిటో తెలిసి అల్లాడిపోతున్నారు.  

ఇంకా ఒక గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి వేచి ఉన్నారు. ఇంకో అమరవీరుడిని గుర్తించవలసి ఉంది. 

జూలై 3న జరిగిన బాంబు దాడిలో పదమూడు మంది మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు.

మరో రోజు వస్తుంది.

కానీ గాజాలో కాలం భిన్నంగా గడుస్తుంది!  

(ఇస్రా అల్సిగాలీ (Israa Alsigaly) గాజాలో రచయిత్రి, అనువాదకురాలు)

(The Electronic intifada.net సహకారం)  

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

Leave a Reply