గవ్వల కలలు

కల్లోల కళ్ళ
సముద్రాలు
ఒలికే అలల కన్నీళ్ళు తోడుగా,

విశాల జలావరణంలోకి,
గాయపడ్డ నావను తీసుకొని
అతుకులేసుకున్న కాలపు వలతో వాళ్ళు
జీవితాన్ని పట్టడానికి వెళతారు!

ఒక్కో సారి సాగరానికి కరువు వచ్చినట్టు
ఒట్టి చేతులతో తిరిగొస్తారు!!
ఒక్కోసారి శూన్యం
నింపుకున్న పడవలు ఒడ్డుకు కొట్టుకొని రావచ్చు,

సొర చేపల కోపం
బతుకునావకు రంధ్రం చేయవచ్చు,
రంధ్రాలు కనబడితే చాలు దూరిపోయే నీరు
ప్రాణం మొత్తాన్ని ఉప్పుతో నింపేయవచ్చు,

లోపలంతా నిశ్శబ్దంగా ప్రయాణించి
వాటి ఉనికి తెలిసే లోగా నీటి గుర్రాల్లా
జల తరంగాలు
అమాంతం మీద పడొచ్చు,

జాలరి జీవితాన్ని పట్టడానికి ముందు
మరణానుభవాన్ని పొందాలి!

చేపలు చేజిక్కించుకోవడానికి ముందు
సాగరతలాన్ని జోకొట్టాలి!!

బతుకుపోరాటం
మృత్యువు తో
ముఖాముఖి ఏర్పాటు చేశాక,

తుపానులతో సంభాషణ జీవనాధారంగా మారుతుంది!
తీరానికీ నావ కి మధ్య ఆటుపోట్లు వారధులౌతాయి!!

ఇంటికి పట్టెడన్నం పెట్టడం కోసం
వాళ్ళు ప్రతిసారీ నేరుగా-
వెళ్ళేది మృత్యుకుహరంలోకే!

లోపలికి పోయిన నావ
తిరిగొస్తుందా అనే శంక పీడకలై
మూత పడని వాళ్ళ కళ్ళలో
చీకటి దుప్పటి కప్పుకొని
రాత్రులు నిదురబోతుంటాయి

ఉదయం
అలలు మోసుకొచ్చిన వాళ్ళ కలలు
గవ్వల్లా తీరంలో పడి ఉంటాయి..

మనలో తడి మిగిలి
ఉందో లేదో తెలుసుకోవాలంటే
వాటినో మారు తడిమి చూడాలి

ఈ సారి సముద్రాన్ని సందర్శించినప్పుడు
పిడికెడు గవ్వల్ని ఇంటికి తీసుకురావాలి!

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

2 thoughts on “గవ్వల కలలు

  1. ఉదయం
    అలలు మోసుకొచ్చిన వాళ్ళ కలలు
    గవ్వల్లా తీరంలో పడి ఉంటాయి.

    ఈ సారి సముద్రాన్ని సందర్శించినప్పుడు
    పిడికెడు గవ్వల్ని ఇంటికి తీసుకురావాలి.

    ఎంత శక్తిమంతమైన చిత్రణ చేసారో. అభినందనలు.

Leave a Reply