గద్ద కంటికి కోడిలా లాటిన్ అమెరికా

గతంలో 1960 , 70, 80ల నాటి నుంచి చిలీలో , నికరాగువా, క్యూబా దేశాల్లో జరిగిన ప్రగతిశీల ప్రజాస్వామ్య, సోషలిస్టు విప్లవాలను అణచివేయాలని అమెరికన్ ప్రభుత్వాలు ఎన్నో కుయుక్తులు పన్నాయి. కొన్ని చోట్ల ప్రతి పక్షాలకు ఆర్థిక , నైతిక, సైనిక మద్దతు ఇచ్చి వాటిని అధికారంలోకి తెచ్చారు. తమ ప్రయోజనాలకు వ్యతిరేక దేశాలపై అమెరికా ఆర్థిక ఆంక్షలు లేదా వాటి చుట్టూ సముద్ర జలాల్లో నౌకలు తిరుగుతూ ఆక్రమణ బెదిరింపు .దీనికి “గన్ బోట్ డిప్లమసీ” అనే పేరు వచ్చింది. వెనుజువేల ఆయిల్ వనరుల కోసం, సోషలిస్టు విధానాల పట్ల వ్యతిరేకత వల్ల హ్యూగో చావెజ్ కాలం నుండి యత్నిస్తూ నేటికి అధ్యక్షుడు మదురో దంపతులను అపహరించింది. పైగా క్యూబా, మెక్సికో, కొలంబియాలపై ఆధిపత్యానికి సిద్ధమవుతోంది. ఈ వ్యాసంలో ఆ బడుగు దేశాల చారిత్రక దోపిడీ ఎలా జరిగింది, వాటి పర్యవసానాలు చూడవచ్చు.

ఎడ్వర్డో గాలియానో రాసిన “ఓపెన్ వీన్స్ ఆఫ్ లాటిన్ అమెరికా” అనే పుస్తకంలో సామ్రాజ్య వాదం ఏ విధంగా స్ధానిక భూస్వాములు , పెట్టబడిదారీ అనుయాయులతో కలిసి శతాబ్దాల పాటు దోచుకున్నదీ తెలిపారు. గాలియానో పుస్తకం ఉరుగ్వే , చిలీలలో నిషేధించగా , అర్జెంటీనా లో టీవీ షో లలో తీవ్రంగా విమర్శించారు.ఈ దేశాలలో ఏదో ఒకటే పంటపై ఆధార పడేలా చేయటం, తమ అభివృద్ధి రథ చక్రాలకు వాటిని కట్టి లాక్కుని వెళ్ళటం, ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం, తమకు అనుకూల మిలటరీ నియంతలను గద్దె నెక్కించి, ప్రతికూల ప్రజాస్వామ్య, సోషలిస్టు ప్రభుత్వాలను పడడోయటం సామ్రాజ్య వాద దేశాలకు పరిపాటి అయింది.

గాలియానో రాసిన దాని ప్రకారం బ్రిటీష్ వారు 1762లో క్యూబా లోని హవానా ను ఆక్రమించారు. నాడు దాని ఆర్థిక వ్యవస్థ చిన్న చిన్న పొగాకు తోటల మీద, పశు క్షేత్రాల మీద ఆధారపడి ఉండేది. హవానాలో ఫిరంగుల ఉత్పత్తి, లాటిన్ అమెరికాలోనే తొలి నౌకా నిర్మాణ పరిశ్రమలు ఉండేవి. బ్రిటీష్ వారి బానిసలను తెచ్చి , స్థానికంగా ఉన్న అల్ప సంఖ్యాక పెత్తందారులతో కలిసి బానిసల శ్రమ అదనపు విలువను దోచుకుంటూ ప్రపంచ మార్కెట్ కోసం చక్కెర ఉత్పత్తి చేయించారు. గతంలోని స్పెయిన్ ఏక స్వామ్యం బద్దలైంది. కార్మికులు, వృత్తి పనులవారు, చిన్న రైతులు ఈ చక్కెర ఉత్పత్తిలో సాగించిన క్రూర విధ్వంసానికి బలి అయ్యారు. గతంలో క్యూబా విదేశాలకు ఎండు మాంసం ఎగుమతి చేసేదల్లా 1792 నాటికి దిగుమతుల బారిన పడింది. స్థానిక పరిశ్రమలు దెబ్బ తిని చక్కెర తోటల్లో బానిసలు రోజుకు ఇరవై గంటల పాటు పని చేసేవారు. హరిత అరణ్యాలు అంతరించి అక్కడి కలప విదేశీ రాజ భవనాల్లో అలంకార వస్తువులుగా మారింది. ఒకే పంట మూలానా భూసారం నశించింది. “సుగరోక్రసీ’ అవినీతికి, నియంతల ఉత్తాన పతనాలకు దారి తీసింది. “ఒకే వస్తువును నమ్ముకునే ప్రజలు ఆత్మహత్య చేసుకుంటారు” అని జోస్ మార్టి చెప్పాడు.

అమెరికాలో చక్కెర ధరలు తగ్గి 1921లో క్యూబాలో సంక్షోభం వచ్చి బ్యాంకులు దివాళా తీసాయి.సమ్మెలు మొదలయ్యాయి. మూడేళ్లలో క్యూబా నుంచి ఎగుమతులు 75 శాతం తగ్గింది. నిరుద్యోగం పెరిగింది.1948 నాటికి పరిస్థితి కొంత మెరుగైనా అమెరికాపై ఆధార పడటం పెరిగింది. 1952లో నియంత బటిస్తా అధికారం చేపట్టాడు.

20 వ శతాబ్ది మొదట్లో అమెరికా ప్రాబల్యం పెరిగి దాని అండతో 1902లో పాల్మా క్యూబాకు తొలి అధ్యక్షుడు అయ్యాడు. క్యూబా చక్కెర , తోలు, ఇనుము మొదలగునవి ఎగుమతి చేసి క్యాండీ, బూట్లు, నాగళ్ళు దిగుమతి చేసుకొనేది. వీటితో పాటుగా ఆటోమొబైల్స్, యంత్రాలు, రసాయన వస్తువులు, కాగితం, వరి, చిక్కుళ్ళు, ఉల్లి, మాంసం, కొవ్వు పదార్థాలు, పత్తి దిగుమతులు అయ్యేవి. దేశ అవసరాల నిమిత్తం పళ్ళు,కూరగాయలలో సగం వరకు దిగుమతిపై ఆధారపడటం జరిగింది. కేవలం 13 మంది అమెరికాస్ చక్కెర ఉత్పత్తి దారులకు భూమిలో 47 శాతంపై ఆధిపత్యం. ఏడాదిలో ప్రతి కాపు నుంచి 180 మిలియన్ డాలర్లు ఆదాయం.

బటిస్తా వ్యతిరేకంగా కాస్ట్రో విప్లవం తర్వాత పరిస్థితి మారింది. 58 శాతం ఉన్న నిరక్షరాస్యత తగ్గింది. విద్యా, వైద్య , నీటి పారుదల సౌకర్యాలు,సిమెంటు, విద్యుత్తు ప్లాంట్లు పెరిగాయి. ఉచిత నీరు,కరెంటు, టెలిఫోన్, క్రీడలకు సాయం దొరికింది. అమెరికా ఆంక్షల వల్ల చక్కెర పై ఆధారపడటం తగ్గకున్నా , ఆ ఆదాయం అల్ప సంఖ్యాకులకు కాక దేశాభివృద్ధికి ఉపయోగ పడింది. సోవియెట్ సాయం దొరికింది.1961లో అమెరికా దన్నుతో, గ్వాటెమాల సైనిక శిక్షణతో మాజీ దోపిడీ దారులు, రక్షణ దళాలు బే ఆఫ్ పిగ్స్ లో చేసిన దాడి విఫలమయింది. కాస్ట్రో హత్యకు చేసిన ఎన్నో కుట్రలు విఫలమయ్యాయి. అలుపెరగని చే గువేరా బొలీవియాలో విప్లవ క్రమంలో స్థానిక మిలటరీ , సీ ఐ ఏ సంయుక్త కుట్రలో అమరుడు అయ్యాడు. కాస్ట్రో పిదప రాల్ కాస్ట్రో , అతడి తర్వాత 2019 నుంచి మిగుయేల్ లడయాజ్ కెనాల్ బెర్ముడెజ్ అధ్యక్షుడుగా ఉన్నారు.కరోనా కాలంలో క్యూబా వైద్యులు ఎన్నో దేశాల్లో రోగ బాధితులకు సాయం చేశారు. క్యూబా పతనానికి నాటి నుంచి నేటి దాకా కుట్రలు, కూహకాలు జరుగుతూనే ఉన్నాయి.

మెక్సికో చరిత్రలో ఇరవయ్యో శతాబ్దంలో 1910 నాటికి 800 మంది భూస్వాములు, విదేశీయుల చేతుల్లో ఎక్కువ భూమి ఉండేది. వీరు విదేశాల్లో ఎక్కువగా ఉంటూ అపుడపుడు వచ్చి భవంతుల్లో సేద తీరేవారు. మొత్తం 15 మిలియన్ల మందిలో 12 మిలియన్ల మంది గ్రామీణ రైతులు. అప్పులు, ఒప్పందాల పిడికిలిలో బానిసలు. అమెరికా వారి పెట్టుబడులు పెరిగి వారు నియంత డయాజ్ కు మద్దతు ఇచ్చారు. 1845 లోనే అమెరికా మెక్సికో నుంచి టెక్సాస్,కాలిఫోర్నియా లలో బానిస విధానం తెచ్చింది.ఇంకా కొలరాడో, అరిజోనా, నెవాడా, ఉతా ప్రాంతాలను స్వాధీనం చేసుకుని దాదాపు సగం దేశాన్ని లాక్కుంది. మిగిలిన చోట రాగి, పెట్రోలియం, రబ్బర్, చక్కెర, బ్యాంకు, రవాణా రంగాల్లో అమెరికా పెట్టుబడులు పెట్టింది.అమెరికన్ ఆయిల్ కంపెనీ , స్టాండర్డ్ ఆయిల్ అఫిలియేట్ అమెరికన్ కోర్దేజ్ ట్రస్ట్ మాయా, యాకీ ఇండియన్ నేటివ్ జాతులను నిర్మూలించారు. బానిసత్వ దోపిడీ పెరిగింది. 19 వ శతాబ్దం చివరి దశాబ్దంలో మొరేలాస్ ప్రాంతంలో పట్నాలు, గ్రామాలు, చక్కెర ప్లాంటేషన్లు పెరిగి భూమి, నీరు, శ్రామిక శక్తి కబ్జా జరిగింది. చక్కెర ఎస్టేట్లలో సంపద పెరిగి మిల్లులు, డిస్టిలరీలు, రైలు రోడ్లు వచ్చాయి. భూములు పోయి ఎదురు తిరిగిన రైతులను యూకాటాన్ నిర్బంధ శిబిరానికి పంపారు.

మెక్సికో లో నియంత డయాజ్ ప్రభుత్వం కూలిపోయి మదేరో వచ్చినా మార్పు లేదు.
దక్షిణ మెక్సికో నుంచి వచ్చిన జపాటా దోపిడీ దారు నియంతలైన డయాజ్, మదేరో, హుయెర్టా, కరంజా లకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ప్రజలపై అణచివేత బాగా పెరిగింది.చివరకు విజయం సాధించిన జపా టా, పాన్చోవిల్లో లు .అధికారంలోకి రాగానే 1914లో మొరేలాస్ ప్రాంతంలో వ్యవసాయ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. రైతులకు గతంలో కోల్పోయిన భూములు తిరిగి ఇచ్చారు. వాతావరణం, భూ సారాన్ని బట్టి ఒక్కొకరికి వచ్చే భూమిపై పరిమితి పెట్టారు. విప్లవ వ్యతిరేక శక్తుల భూములు లాక్కున్నారు.భూస్వామ్యం.పోయి విద్య, వైద్య, బ్యాంకు రుణ సౌకర్యాలు పెరిగాయి.చక్కెర మిల్లులు, డిస్టలర్లు జాతీయం చేశారు. 1916లో జపాటిస్టా జిల్లా, మొరేలాస్ రాజధాని అయిన కోయనవాకా పై దాడి జరిగింది.మరో మూడేళ్లకు జపాతా హత్యకు గురయ్యాడు.1934 నుంచి 40 మధ్య కార్డెనాస్

విప్లవ సాంప్రదాయం కొనసాగించి దేశీయ, విదేశీ కబ్జాదారుల నుంచి 67 మిలియన్ హెక్టార్ల భూమి స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆధునికీకరణ , పారిశ్రామికీకరణ, నగరాలు, వినియోగ దారులు మార్కెట్ పెరిగాయి. కానీ క్రమేణా విప్లవ ఫలితాలు మందగించి జనం బాధలు పెరిగాయి.1968లో ట్లాటేలోల్కో జరిగిన 500 మంది విద్యార్థుల ఊచకోత ఆ దేశ వ్యవస్థ లోని వైరుధ్యాలు బయట పెట్టింది. కొత్త ముసుగులో లాటిఫండియా లు వచ్చాయి. కరంజా సేనలోని ఆర్టిమియో క్రజ్ యువకుడిగా విప్లవ కారుడు గా ఉండి తర్వాత వ్యాపారిగా ఐశ్వర్యం, అధికారం సంపాదించి అణచివేతదారుడిగా మారాడు. కార్లోస్ ఫ్యూంటెస్ గొప్ప నవల “ది డెత్ ఆఫ్ ఆర్టిమియో క్రజ్” మరణ శయ్యపై అతడి అంతరంగ పరిస్థితిని , గతం యొక్క సింహావలోకనాన్ని, అవకాశాల వరుస ఎంపిక ద్వారా రూపొందించుకునే లేదా వ్యక్తపరిచే అస్తిత్వ సమస్యను చిత్రిస్తుంది.

మెక్సికో అధికారిక పేరు యునైటెడ్ మెక్సికన్ స్టేట్స్. దీనిలో 32 రాష్ట్రాలు ఉన్నాయి. దీని అధికారిక పేరును తొలుత 1824 రాజ్యాంగంలో ఉపయోగించారు. తరువాత 1857, 1917 లలో వచ్చిన రాజ్యాంగాలలో అలాగే ఉంచారు. దేశానికి ప్రస్తుతం క్లాడియా షీన్ బామ్ పార్దో తొలి మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె వామ పక్షం నుంచి వచ్చి, నయా ఉదారవాద ఆర్థిక విధానాలు కాక సంక్షేమ చర్యలకు ప్రాధాన్యం ఇస్తూ , డ్రగ్స్ రవాణా నిరోధ విషయంలో తమ దేశ సర్వ సత్తాకతకు ప్రాధాన్యమిస్తున్నారు. అమెరికా అనవసర జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఇక కొలంబియాలో 1940లో కొలంబియా ఆర్థిక వేత్త లూయిస్ నైటో అటేటా కాఫీ ను పొగుడుతూ గనులు, పొగాకు, ఇండిగో , క్వినైన్ లు తీసుకురాలేని అభివృద్ధి కాఫీ తెచ్చింది అన్నాడు. కాఫీ ఉత్పత్తి ప్రాంతాలైన అంటియోకియా, కాల్డెజ్, బాయే డెల్ కౌకా , కూన్డీనామార్కా లలో బట్టల మిల్లులు, చిన్న పరిశ్రమలు వచ్చాయి.

కాఫీ శాంతి, అభివృద్ధి తెచ్చిందని అనుకునే తరుణంలో హింస ప్రబలింది.1948 నుంచి దశాబ్ద కాలం అన్ని ప్రాంతాల్లో రైతాంగం, ప్రభుత్వం మధ్య యుద్ధం జరిగి కమ్యూనిటీలు పారిపోయాయి. గెరిల్లాలు పెరిగారు . నేరాలు, ఘోరాలు పెరిగాయి.ఈ ఘర్షణల్లో 1,80,000 మంది చనిపోయారు. కన్సర్వేటివ్, లిబరల్ పార్టీల మధ్య పోరులో లిబరల్ నేత గైతాన్ హత్యతో జనం వీధుల్లో తిరగబడ్డారు. ప్రభుత్వ సేనలు దమన కాండ సాగించారు. దారుణ మారణ హోమంలో ప్రజలపై వర్ణించలేని , ఊహించలేని అత్యాచారాలతో, దహన కాండ, ఊళ్ళు , తోటలు నాశ నమయి జన రక్తం ఏరులై పారింది. పర్వతాల్లోకి పారిపోయిన వారు అక్కడే వ్యవసాయం , ఆత్మ రక్షణ ఏర్పాట్లు చేశారు. జాతీయ కన్సర్వేటివ్, లిబరల్ పార్టీలు ఒప్పందం చేసుకుని జన హననం చేశారు. మార్క్వెటాలియా అనే చోట బాంబుల వర్షం కురిసింది. దేశీయ, విదేశీయ దోపిడీదారులు కలిసిపోయారు. 1957 నాటికి పోషకాహారం లేక పిల్లలు , రైతులు, కార్మికులు రోగాల బారిన పడ్డారు. నాడు ప్రతి ఏడూ 2,50, 000 మంది శ్రామికులు మార్కెట్లో ప్రవేశిస్తున్నా ఉపాధి లేదు. ఒక మిలియన్ పిల్లలు పాఠశాలకు దూరమయ్యారు.

ప్రస్తుతం గుస్తావో ఫ్రాన్సిస్కో పెట్రో ఉర్రెగో 2022 నుండి కొలంబియాకు పదవీ బాధ్యతలు స్వీకరించిన 35 వ మరియు మొదటి వామపక్ష అధ్యక్షుడయ్యాడు. తన దేశం కోసం ట్రంప్ అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ గట్టిగా నిలబడిన నేత.

ఎంతో బాధామయ చరిత్ర కలిగిన దేశాలపై , నాలుగున్నర శతాబ్దాలు సాగిన స్పానిష్,పోర్చుగీసు , బ్రిటీష్ , అమెరికా వలసవాద అణచివేత, సర్వ సత్తాకత కల దేశాల్లో బాహ్య జోక్యం వల్ల లాటిన్ అమెరికా దేశాల స్థానిక భాషలు, సంస్కృతులు, ఆర్థిక వ్యవస్థలు ఎంతో బాధపడ్డాయి. వాటి వెనుకబాటు తనానికి ప్రత్యక్ష, పరోక్ష హేతువు వలస వాదం, నయా వలసవాదమే. లాటిన్ అమెరికా భావిని ఆ ప్రజలే నిర్ణయించుకోవాలి కానీ ఏకైక అగ్ర రాజ్యం కాదు. గాలియానో రాసినట్లు లాటిన్ అమెరికా దేశాల “ అల్పాభివృద్ధి అనేది అభివృద్ధిలో ఒక దశ కాక దాని ఫలితమే. లాటిన్ అమెరికా యొక్క అల్పాభివృద్ధి బాహ్య అభివృద్ధి వలన ఏర్పడి ఇంకా కొనసాగుతోంది.” నేడు లాటిన్ అమెరికా ప్రధాన ఎగుమతి ముడిపదార్ధాలు లేదా వస్తువులు కాక చౌక శ్రమశక్తి.ఇటీవలి వెనిజులాపై దాడి, క్యూబా , మెక్సికో, కొలంబియా, గ్రీన్ లాండ్ తదితర దేశాల పై అమెరికా బెదిరింపు గద్ద కోడి పిల్లలను ఎత్తుకొని పోయినట్లు చేసే రీతిని ఖండించడం ప్రపంచ మానవుల, అన్ని దేశాల నైతిక బాధ్యత!

Leave a Reply