అది 1974. నేను నా పదో తరగతి అయిపోయి హాస్టల్ నుండి వచ్చేసి మా ఊరు దేవరుప్పులలోనే వుంటున్నాను. ఇంకా చదివించే స్థోమత మా తల్లిదండ్రులకు లేకుండే. కూలీ నాలీ బతుకులు. మే 18, 1974 న సాయంత్రం మసక బారుతున్న సమయానికి అంతకు ముందే పరిచయమున్న నా సహచరుడు లక్ష్మయ్య, ప్రతాపరెడ్డి మా ఇంటికి వచ్చిండ్రు. వరంగల్ జిల్లా, వెల్దండ గ్రామం లో మరుసటి రోజు జననాట్యమండలి ప్రోగ్రామ్ వుంది. ఆ ప్రోగ్రామ్ కోసం నన్ను తీసుకువెళ్లేందుకు వాళ్ళు వచ్చిండ్రు. పొద్దున్నే లేవగానే బయలుదేరి వెల్దండ గ్రామం చేరుకున్నం.
ఆ జననాట్యమండలి కార్యక్రమానికి పత్తిపాటి వెంకటేశ్వర్లు గారు, బి. నర్సింగరావు, భూపాల్, నర్సింగ్, ధర్మయ్య, శ్రీనివాస్ రెడ్డి, ఇంకా కొంత మంది కళాకారులు వచ్చిండ్రు. కార్యక్రమం మొదలయినంక వాళ్ళు పాడుతుంటే విని వెంటనే కోరస్ పాడిన. నన్ను కూడా పాడమంటే అప్పటికే నేర్చుకున్న ‘పాలబుగ్గల జీతగాడా’, ‘ఎరుపంటే కొందరికీ భయం’ పాటలు పాడిన. నేను పాడుతుంటే విని నర్సింగ్ అన్న రూమ్ లో నుండి బయటకు వచ్చి, “ఎవరా అమ్మాయి? బాగా పాడుతుంది,” అని నా గురించి వివరాలు అడిగి ఈ అమ్మాయి మా జననాట్య మండలి లో జాయిన్ కావాలి అని అడిగిండు. మా నాయనకు చెప్పి లక్ష్మయ్య నర్సింగ్ అన్న స్థాపించిన ‘ఆర్ట్ లవర్స్’ అల్వాల్ లో అప్పగించిండు. అక్కడికి జననాట్యమండలి సభ్యులు ఒకొక్కరూ వస్తుంటే పరిచయం చేసిండ్రు. భూపాల్, నిమ్మి, ఎల్.ఎస్.ఎన్. మూర్తన్న, విఠలన్న (గద్దర్), దశరథ్, రమేష్, నర్సింగ్, పద్మారావు, ధర్మయ్య, శ్రీనివాస్ రెడ్డి, నందు, సుదర్శన్, యిట్లా చాలా మంది సభ్యులు పరిచయమయ్యిండ్రు. విఠలన్న నన్ను చూసి “ఏం పేరు” అని అడిగిండు. ‘సంధ్య’ అని చెప్పిన. “ఇక్కడ అందరితోనూ పాటలు, స్టెప్పులు మంచిగా నేర్చుకో సరేనా” అని చెప్పి వెళ్లిపోయిండు. అదే నేను మొదటిసారి విఠలన్న ను చూసింది. అప్పుడు గద్దరన్న ను విఠల్ అనే పిలిచేవాళ్ళు. అందుకే మేము కూడా విఠలన్న అనే పిలిచేవాళ్ళం. అప్పటికి తన కలం పేరు మాత్రం వి. బి. గద్దర్ అని వుండేది.
అప్పుడు ఎక్కువ బొల్లారం చుట్టు పక్కల గ్రామాల్లో తుర్కపల్లి, యాప్రాల్, వెంకటాపురం, సుభాష్ నగర్ కార్యక్రమాలకు నన్ను తీసుకువెళ్తూనే వున్నరు. నెల రోజుల్లో పాటల బాణీలు చాలా వరకు నేర్చుకున్న. ఆ తర్వాత ఆగస్టు 11, 1974 న జననాట్యమండలి మిత్రులే లక్ష్మయ్య కు నాకు పెండ్లి ఏర్పాట్లు చేసిండ్రు. విఠలన్న, భూపాల్, పత్తిపాటి గారి ఆధ్వర్యంలో మా పెండ్లి జరిగింది. అప్పటి నుండి నేను, లక్ష్మయ్య సీతాఫల్ మండిలో వుండేవాళ్ళం.
1972 లో ఆవిర్భవించిన జననాట్యమండలి అప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేసింది. గద్దరన్న అప్పటికే, ‘పోదామురో జనసేనలో కలిసి,’ ‘ఆపుర రిక్షోడో రిక్షెనుక నేనొస్తా,’ ‘వీడేనమ్మో డబ్బున్న బాడుకావు’, ‘మాయన్నా జీతగాడా,’ ‘వాన పడతాది జాన,’ ‘పిల్లో నేనెళ్ళిపోతా,’ ‘ఎత్తినాడే ఎర్రజెండో మాయన్న జగదీషు,’ ‘నీవు నిజం తెలుసుకోవరో కూలన్నా రైతన్నా (కవాలీ పాట),’ ‘రిక్షా దొక్కే రహీమన్నా, రాళ్లు గొట్టే రామన్నా,’ యిట్లా చాలా పాటలు రాసిండు. 1974 వరకే విఠలన్న, బి. నర్సింగన్న మీద ప్రభుత్వం నిఘా వుందని వాళ్లను బయట ఎక్కువ తిరుగవద్దని చెప్పిండ్రు. వాళ్లిద్దరూ బయట ప్రోగ్రాంలకు రావడం మానేసిండ్రు. జననాట్యమండలిలో నర్సింగ్, నేను మెయిన్ పాటగాళ్ళం. మిగతావాళ్ళతో కలిసి డప్పు, డాన్స్ బ్యాలే, వీధి బాగోతం, బీదలపాట్లు డ్రామా ప్రదర్శించేవాళ్ళం.
ఇక నేను జననాట్యమండలిలో చేరిన తర్వాత గద్దరన్న మాతో ఎప్పుడూ ప్రోగ్రామ్ కి రాలేదు. మాకు భూపాల్ ఆర్గనైజర్ గా వుండేవాడు. జననాట్యమండలి బృందం వెళ్ళిన ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో మా పాటలతో ప్రదర్శనలతో ప్రజలను ఉత్తేజపరిచేవాళ్లం. చివరికి వినాయక చవితి ఉత్సవాల్లో కూడా వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చేవాళ్లం.
1974 లో పి.డి.ఎస్.యు. నుండి విడిపోయి ఆర్.ఎస్.యూ ఏర్పడినప్పుడు సారస్వత పరిషత్ హాల్ లో ఆర్.ఎస్.యూ మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్ లో పాడాలని గద్దరన్న ‘ఎర్రెర్ర దండాలు’ పాట రాసి మా యింటికొచ్చి నాకు నేర్పించి వెళ్ళిండు. ఆ మీటింగ్ లో ఎక్కువ శాతం విద్యార్థులే. గ్రామ గ్రామాల నుండి తరలివచ్చిండ్రు. హాలంతా విద్యార్థి యువకులతో కిటకిటలాడుతుంది. ఏదో నూతన ఉత్సాహం. ఇక నన్ను పాడటానికి వేదిక మీదికి పిలిచిండ్రు. అప్పుడు నా వయసు 18 ఏండ్లు. నేను ‘ఎర్రెర్ర దండాలు’ పాడుకుంటూ, ఆడుకుంటూ అమరవీరులకు ఎర్రెర్ర దండాలు చెబుతుంటే హాలు హాలంతా కోరస్ పాడింరు. ఆ రోజు నుండి ప్రతి ప్రోగ్రామ్ లో ఎర్రెర్ర దండాలు పాట ఉర్రూతలూగించింది.
తర్వాత మేము ఆదిలాబాద్, బెల్లంపల్లి, మందమర్రి, సింగరేణి ప్రాంతాలలో ప్రచారానికి వెళ్తున్నం. ఆ సందర్భంలో అటు సైడు ఒడ్డెరోల్లు ఎక్కువ వుంటరని గద్దరన్న ‘ఒడ్డెరోల్లమండి మేము’ పాటను నా ముందే పాడుకుంటూ, నాతో పాడిస్తూ, “యిట్ల బాగుందా చూడు సంధ్యా” అని అడుగుకుంటూ ఆ పాటను పూర్తి చేసి నాకు పాట యిచ్చి, “యిగ పాడుపో” అని చెప్పిండు. ఆ పాటను ఆ ప్రాంతమంతా పాడిన. ఆ పాటలో వాళ్ళ జీవితాన్ని విని అక్కడి ఒడ్డెరోల్లు బాగా కదిలిపోయింరు. అట్లా ప్రతి పాటలో ప్రజల జీవితాన్ని కండ్లకు కట్టినట్టు అన్న చిత్రించేవాడు. ముఖ్యంగా తాను పాట రాసేముందు వాళ్ళతో కొన్ని రోజులు గడిపి, వాళ్ళు పనులు చేసేదగ్గరికి పోయి, పరిశీలించి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు వాడిన మాటలనే తన పాటలో పెట్టేవాడు. అందుకే ప్రతిపాటకు ప్రజలనుండి అంత స్పందన వచ్చేది.
అట్లనే స్త్రీలు నాట్లు వేస్తుంటే, కలుపు తీస్తుంటే అన్న ఒడ్డు మీద కూర్చోని వాళ్ళ పాటలు విని వాళ్ళ పని విధానాన్ని గమనించి, వాళ్ళ బాణీలు తీసుకుని పాటలల్లేవాడు. అట్లా రాసిందే ‘సిరిమల్లె సెట్టుకింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా, సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా’. ఈ పాటను కూడా మా యింటికొచ్చి నేర్పించిపోయిండు. ఈ పాట గ్రామాల్లో పాడుతుంటే పనిపాటలోల్లంతా ఒకటే ఏడ్చేవాళ్ళు. మా అమ్మ ముందు ఎప్పుడు పాడినా బాగా ఏడ్చేది. ఆమె కూడా ఒక కూలితల్లి. ఈ పాట నాకు చాలా యిష్టమైనది. చాలా లీనమై పాడేదాన్ని. తను రాసిన పాటలు ఇచ్చి వెళ్ళడానికి గద్దరన్న మా ఇంటికొచ్చినప్పుడు, ‘సంధ్యా! నాకు ఆకలి అవుతుంది’ అనుకుంటూ వచ్చేవాడు. తొందరగా వంట చేసి అన్నం పెడుతుంటి.
గుంటూరు ప్రాంతంలో 1975లో ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో గద్దరన్న ఒక పాట రాసిండు.
ఖాకీబట్టలోడా కాంగ్రేసు గులాపోడా
కబర్దార్ కొడుకో కదిలింది ఎర్రదండు
కబర్దార్ కొడుకో కదిలింది కూలిదండు
ఓరోరి అమీనోడా ఓరోరి సర్కిలోడా
పదిలంగా ఉండు కొడుకో కదిలింది ప్రజాదండు
గొల్లోళ్ల గొర్లు మింగి కూలోళ్ల కోళ్ళు మింగి
కల్లు సారా బాగ తాగి కాగంత కడుపు పెంచి
మైసమ్మా పోతునాగా మదమెక్కినాది కొడుకో //ఖాకీ//
ఇంపైన బట్టలేసి సొంపైన సూటు తొడిగి
తూపాకి సంకకేసి తూటాల మాల తొడిగి
సైకీలు మోటరెక్కి సారెల్లినావు కొడుకో //ఖాకీ//
గంజీలో బట్టలుతికి కడకిస్త్రీ చేసినోళ్ళు
నీ కాళ్ళ గోర్లు తీసి గడ్డాలు గీకినోళ్ళు
పెయ్యంత నూనె రాశి మాలీసు జేసినోళ్ళు
ప్రజదండులో జేరిండ్రు పండేసి తొక్కుతారు //ఖాకీ//
సమ్మెట పట్టినోళ్ళు, సమ్మెలు జేసినోళ్ళు
కవులు కళాకార్లు కాలేజీ పొల్లగాండ్లు
తొడగొట్టి నిలిచినారు మెడబట్టి ఇరుసుతారు //ఖాకీ//
దొంగల్ల దొంగవోరి లంగల్ల లంగవోరి
లుచ్చల్ల లుచ్చవోరి
మా పోరు కడ్డమొస్తే కడతాము నీకు గోరి //ఖాకీ//
మా బాట చైనా బాట
మా దారి చారు దారి
మా మాట మావో మాట
మా గుండె ఎర్ర గుండె
మా జెండ ఎర్ర జెండ
బెదిరించబోకు కొడుకో – ఎదిరించి సూడుకొడుకో
ఇంకా ఈ పాటలో బూతులున్న చరణాలున్నయ్. అవి ఇక్కడ రాయడం లేదు. ఈ పాట రాసి మా యింటికొచ్చి ‘బండెనుక బండి కట్టి’ పాట ట్యూన్ లో పాడమని చెప్పి వెళ్లిపోయిండు.
ఇక గుంటూరు ప్రాంతంలో ఈ పాటకు విశేష ఆదరణ దొరికింది. ఒక్క వేదిక మీదనే రెండు మూడు సార్లు పాడించుకున్నరు. రిక్షావాళ్ళు రోడ్డు మీద పోలీసోళ్ళు వెళ్తుంటే ‘సైకీలు మోటరెక్కి సారెల్లినావు కొడుకో’ అని పాడుతున్నరట. ఇక పోలీసులకు పట్టరాని కోపమొచ్చింది. ఐదు ప్రోగ్రామ్ లు అయిపోయి ఆరో ప్రోగ్రామ్ గుజ్జనగుండ్ల ఊరిలో యిస్తున్నం. నేను ఈ పాట మొదలు పెట్టి మూడో చరణం పాడుతున్న. ముందరి నుండి పెద్ద అరుపులు వినిపిస్తున్నయ్. ఏంటిదని చూసేవరకు పోలీసుల లాఠీలు ప్రజల మీద నాట్యం చేస్తున్నయ్. నేను వేదిక మీద నుండి దూకి ఒక గుడిసెలో దూరిన. ఆ రాత్రి దొరకలే. తెల్లవారి అందరం కలిసి హోటల్ కి వెళ్తుంటే పోలీసులు పట్టుకోని మమ్మల్ని నెత్తిమీద చేతులు పెట్టించి రోడ్డు పొడుగునా కొట్టుకుంట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి వాళ్ళ కసంతా తీర్చుకున్నరు. నేను పాట పాడిన కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ నన్ను కొట్టిండు. తెల్లవారేసరికి తొడలన్నీ కమిలి, చేతులు చీములు పట్టినై. నన్ను, భూపాల్ ను, సి.ఎస్.ఆర్ ప్రసాద్ ను బాగా కొట్టిండ్రు. సరే రెండు రోజులు సబ్ జైలులో ఉంచి బెయిల్ మీద విడిచి పెట్టిండ్రు. 1975 జూన్ 25, తెల్లవారితే ఎమర్జెన్సీ. మమ్మల్ని పట్టించుకోడానికి ఎవరూలేరు. మొత్తానికి హైదరాబాదు చేరుకుని మా కష్టాలు మేము పడ్డం. ఈ పాట రాసిన మహానుభావుడు చాలా రోజులకు కనిపించినప్పుడు “మామలు బాగా వాయించిండ్రంట కదా” అని కిస కిసా నవ్విండు జోక్ గా. “అవునన్నా” అని నేను నవ్విన. అన్నకు నవ్వించడం అంటే చాలా యిష్టం. ప్రతిదాన్నీ హాస్యంగా మాట్లాడే వాడు. ఈ పాట అంతటితో ఆగిపోయింది. మళ్ళీ ఎవరూ ఎక్కడా పాడలేదు.
ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత 1977 నవంబర్ లో దివిసీమ ఉప్పెన వచ్చి గ్రామాలన్నీ అతలాకుతలమైన సందర్భం. ఆ సందర్భంలో కూడా గద్దరన్న ‘వరద పాట’ రాసి నేర్పించి పోయిండు. ‘ఏమని సెప్పుదు బాబు, నేనెంతనీ సెప్పుదు బాబు. ఉప్పెనొచ్చింది బాబు, ఊర్లన్నీ మింగింది బాబు.” ఆ పాట పాడుతుంటే జనమంతా ఒకటే ఏడుపు. ఈ ప్రోగ్రామ్ కి సంజీవ్ మొదటిసారి వచ్చిండు.
1978 జూన్ జులై నెలల్లో బి. నర్సింగన్న, గౌతం ఘోష్, గద్దరన్న, రవీంద్రనాథ్ వీరంతా కలిసి ‘మాభూమి’ సినిమా తీయాలని అనుకున్నప్పుడు అందులో ఏమి పాటలు పెట్టాలో నిర్ణయించింరు. నాతో ‘పాలబుగ్గల జీతగాడా’, గద్దరన్న తో ‘బండెనుక బండి కట్టి,’ మోహన్ రాజుతో ‘పొడల పొడల గట్ల నడుమనేరా, పొడసినాదిరా సందామామా’ పాటలు నర్సింగన్న పాడించాడు.
ఆ నాలుగేండ్లు (1974-1978) పాటలు రాయడం గద్దరన్న డ్యూటీ, పాడడం మా వంతు. అన్న వేదికలు ఎక్కేవాడు కాదు. అన్నవాళ్ళ ఇంట్లో కూడా మేము నేర్చుకోవడం, అక్కడి నుండి అందరం కలిసి ప్రోగ్రామ్స్ కి వెళ్ళడం చేసేవాళ్ళం. మా జననాట్యమండలి సభ్యుల ఇండ్లు బొల్లారం చుట్టుపక్కల ఊర్లలో వుండేవి. నర్సింగన్న, గద్దరన్న, భూపాల్ మేమంతా వెంకటాపూర్, సుభాష్ నగర్, ఆల్వాల్ నడిచే తిరిగేవాళ్ళం. ఒక కుటుంబ వాతావరణం వుండేది.
నాకు 1978 ఆగస్టు 26 న పాప పుట్టింది. చైతన్య క్లినిక్ అమీర్ పేటలో. ‘మాభూమి’ ప్రొడ్యూసర్ రవీంద్రనాథ్ సహచరి శారద నాకు డెలివరీ చేసింది. తెల్లవారి మమ్మల్ని చూడడానికి నర్సింగన్న, విఠలన్న (గద్దరన్న) వచ్చింరు. పాపను చూసి విఠలన్న ‘పాప ఎంత అందంగుంది సంధ్యా’ అన్నడు. నర్సింగన్న వేలు యిస్తే గట్టిగా పట్టుకుంది పాప. ‘సంధ్యా ఇది చాలా హుషారైతది’ అని అన్నడు నర్సింగన్న. చైతన్య చిత్ర బ్యానర్ పై మాభూమి నిర్మించారు, ఎనిమిది నెలల గర్భంతో ‘పాలబుగ్గల జీతగాడా’ పాట పాడిన, చైతన్య క్లినిక్ లో పుట్టింది. ఈ పేరు బాగానే వుంది కదా అని మా పాపకు చైతన్య అని పేరు పెట్టినం.
1978 ఆగస్టు 14 తారీఖున లక్ష్మయ్యకు జహీరాబాద్ షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం రావడం వల్ల మేము అక్కడికి వెళ్లిపోయినం. ఇక హైద్రాబాద్ తో సంబంధాలు తక్కువయినయ్. ఇక జననాట్యమండలి (జె.ఎన్.ఎం) ప్రోగ్రామ్స్ కి కూడా దూరమయిన. అక్కడ ఏమి జరుగుతుందో నాకు తెలియకుండా అయింది.
1985 లో హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో AIRSF (ఆల్ ఇండియా రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫ్రంట్) సభ జరుగబోతుంది, దానిలో జె.ఎన్.ఎం ప్రదర్శనలు వుంటాయి, పలు రాష్ట్రాల నుండి కళాకారుల ప్రదర్శనలు వుంటాయని పేపర్ లో చూసిన. ఇక నా మనసు ఆగలేదు. జననాట్యమండలి పేరు వింటేనే నా ఒల్లు పులకరిస్తది. ఇక నేను ఆగలేక నా పిల్లలను తీసుకొని సాయంత్రం వరకు గద్దరన్న వాళ్ళింటికి వెళ్ళిన. ఆ రాత్రి అందరం కలిసి భోజనం చేసినం. పడుకునే ముందు, “అన్నా ఒక పాట పాడవే” అని అడిగిన. “కాదు. నువ్వే పాడు” అని ‘తోటారాముని తొడకు కాటా తగిలిందాని’ పాడించుకున్నడు. చాలా బాగా పాడుతున్నవ్ అని మెచ్చుకున్నడు. తెల్లవారి లేచేసరికే అన్న మీటింగ్ కి వెళ్లిపోయిండు. తర్వాత గద్దరన్న సహచరి విమల, వాళ్ళ పిల్లలు, నేను, నా పిల్లలు ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్లినం. ఆరోజు ఎన్.టీ.ఆర్ కారును అడ్డుకోవాలని ప్రోగ్రామ్. దాదాపు స్త్రీలు, విద్యార్థినులు మూడు వందల మంది వరకు వెళ్ళి ఎన్.టీ.ఆర్ కారు వస్తుంటే ఎదురుగా వెళ్ళి కార్ ను ఆపినం. అక్కడ వందల మంది పోలీసు బలగాలు కాపలావున్నయి. అక్కడ ధర్నాకు వెళ్ళిన వాళ్ళందరినీ పోలీసు వ్యానులో ఎక్కిస్తున్నరు. స్వర్ణ అనే అమ్మాయి వ్యాను ఎక్కిస్తుంటే పోలీస్ ఆఫీసర్ కాలర్ పట్టుకున్నది. ఇదంతా పక్కనే వుండి నేను చూస్తూనేవున్నా. మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో పెట్టింరు. నా పిల్లలను విమల దగ్గరే కూర్చుండబెట్టి వెళ్లిన. ఆ కస్టడీలో రెండు మూడు గంటలు పాటలు పాడినం. నేను పాడుతుంటే అందరూ కోరస్ పాడారు. తర్వాత మమ్మల్ని విడిపించుకొచ్చారు. నేను వెళ్ళి పిల్లలతో పాటు వేదిక ముందు అందరితో కూర్చున్నా. కొంతసేపటికి విఠలన్న, “సంధ్య! నువ్వు తోటారాముని తొడకు పాట పాడాలె. తయారుగుండు” అని చీటీ పంపిండు. అట్లా మూడు సార్లు చిట్టీలు పంపిండు కానీ వేదిక మీదకు పిలువలేదు. ఇక కార్యక్రమం అయిపోయింది. వేదిక పక్కన నర్సింగన్న కనిపిస్తే, “గద్దరన్న నన్ను ఎందుకు పాడనివ్వలేదు? పార్టీ నన్ను పాడనివ్వద్దని చెప్పిందా” అని బాధపడుతూ అడిగిన. నర్సింగన్న “నిజమేరా సంధ్యా! గద్దర్ నీపట్ల ఎందుకు అట్లా ప్రవర్తించిండో అర్థం కాలేదు” అనేంతలో గద్దరన్న అక్కడికి వచ్చిండు. “ఏమోయ్ గద్దర్! మా సంధ్యను పాట పాడనివ్వలేదు ఎందుకు?” అని నర్సింగన్న ఆడిగిండు. గద్దరన్న “నన్నే పాడనిస్తలేరు. నేనెందుకు పాడనియ్యలే” అన్నడు. “అన్నా! వెళ్తున్నా!” అని చెప్పి నా పిల్లలను తీస్కుని జహీరాబాద్ వచ్చేసిన.
ఇక నాకెప్పుడూ జె.ఎన్.ఎమ్ నుండి పిలుపు రాలేదు. మళ్ళీ 1990 లో మేము బోధన్ షుగర్ ఫ్యాక్టరీలో వున్నప్పుడు నిజామాబాద్ కు జననాట్యమండలి వస్తుంది అని పేపర్ లో చదివి నా బిడ్డను, ఇంకో అమ్మాయిని తీసుకొని నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో కార్యక్రమం దగ్గరికి చేరుకున్నా. నాతో వచ్చిన అమ్మాయి “అక్కా పాట పాడు” అని ఒకటే గోల. “నేను పాడుతరా. కానీ నన్ను పాడనివ్వరు. పాడనిస్తే తప్పక పాడుత” అని చెప్పిన. ఆ అమ్మాయి “అయితే నేను అడిగి వస్తా” అని వెళ్తుంటే, “అడిగితే వరవరరావు సార్ ను అడుగు” అని చెప్పిన. ఆ అమ్మాయి జనం మధ్యలో నుండి తోసుకుని వెళ్ళి వివి సార్ తో “సంధ్యక్క వచ్చింది సార్” అని చెప్పింది. వివి సార్ “ఎవరు ‘పాలబుగ్గల జీతగాడా’ సంధ్యనా” అని అడిగి తెలుసుకుని నన్ను వేదిక మీదకు పిలిపించిండు. వేదిక మీద రమేష్, దివాకర్, యాదగిరి, యేసు, ఇ.వి ఉన్నరు. వివి సార్ “గద్దర్! సంధ్య వచ్చిందయా! ఒక పాట పాడించు” అన్నడు. మొదట వినిపించుకోనట్టు చేసినా మూడోసారికి నా దగ్గరికి వచ్చి “ఎరుపంటే కొందరికి భయం” పాడు అన్నడు. వివి సార్ “ఆ పాటలేముంది పెద్దగా, పాలబుగ్గల జీతగాడా పాడుతది” అన్నడు. గద్దరన్న “ఆ సరే! ఆ సాకీ తీస్తవు చూడు అది తీసి మొదలుపెట్టు” అని చెప్పిండు. ‘తెలంగాణ పోరాటంలో’ అని సాకీ తీసి ‘పాలబుగ్గల జీతగాడా’ పాట పాడిన. తర్వాత ‘ఎరుపంటే కొందరికి భయం’ పాట కూడా పాడిన. కార్యక్రమం అయిపోయినాక గద్దరన్న నా దగ్గరికి వచ్చి “మరి ఆంధ్రప్రదేశ్ అంతా మాతోటి తిరుగుతవా” అని అడిగిండు. “ఆ వస్తా అన్నా” అని చెప్పిన. నాతో యేసు (సత్యం) ను మా యింటికి పంపితే తెల్లవారి యేసు, నేను హైదరాబాద్ చేరుకున్నం. ఆ ట్రిప్ లో మళ్ళీ అన్ని కార్యక్రమాలకు వెళ్ళిన.
ఆ తర్వాత చాబాల గ్రామంలో జె.ఎన్.ఎమ్ ట్రెయినింగ్ క్లాసులు పెట్టిండ్రు. దానికి కూడా నా బిడ్డను తీసుకొని వెళ్ళిన. అక్కడికి అన్నీ జిల్లాల జె.ఎన్.ఎమ్ సభ్యులు వచ్చిండ్రు. గద్దర్, వంగపండు, వివి, డప్పు రమేష్, సంజీవ్, పద్మ, కుమారి, దివాకర్, అరుణ, ఇంకా చాలా మంది కళాకారులు హాజరయింరు. ఒక పక్క డప్పు నేర్పడం, ఒక పక్క డాన్స్ స్టెప్స్ నేర్పడం, ఒక పక్క గద్దరన్న రాసిన ‘స్వర్ణ’ ఒగ్గుకథ నేర్పడం, పాటలు, పొద్దున్నే లేచి వ్యాయామం చేయడం చాలా బాగా నిర్వహించారు. నేను కూడా ‘స్వర్ణ కథ’ నేర్చుకున్న. వంగపండు రాసిన ‘నక్సలైటు నారాయణమ్మ’ వీధిబాగోతం కూడా నేర్చుకున్నం. స్వర్ణ కథలో కాలేజీలో అడుగుపెట్టిన స్వర్ణ చూసిన, కాలేజీల్లో జరుగుతున్న అన్యాయాలపై పి.డి.ఎస్.యూ, ఆర్.ఎస్.యూ విద్యార్థులు ఎలా తిరగబడ్డది, ర్యాగింగ్, ఆడపిల్లలను టీజింగ్ చేయనివ్వకుండా ఎట్లా అడ్డుకున్నరో గద్దరన్న ఒక పాట ద్వారా చక్కగా వివరిస్తాడు. ఆ పాట నేను పాడుతుంటే విని గద్దరన్న “ఎట్ల పాడాలెనో వేరే పిల్లలకు చూపించు సంధ్యా” అంటే చాలా సార్లు పాడి చూపించిన.
వరంగల్ లో 1990 మే నెలలో చాలా పెద్ద ఎత్తున రైతుకూలి సంఘం మహాసభ జరిగింది. దానికి ముందు జె.ఎన్.ఎమ్ సభ్యులకు ద్వారకా హోటల్ లో 15 రోజులు ట్రెయినింగ్ క్లాసులు నిర్వహించింరు. గద్దరన్న అప్పుడప్పుడు పర్యవేక్షించడానికి అక్కడికి వచ్చివెళ్లిండు. సంజీవ్ కూడా అప్పుడు వున్నడు కానీ ద్వారకా కు రాలేదు. నేను, డప్పు రమేశ్, దివాకర్, ఇ.వి. ఇంకా చాలా మందిమి అక్కడ పూర్ణచందర్ గారు ఒక డ్రామా నేర్పిస్తే నేర్చుకున్నాం. మే 5 వరకు ఊరూరా తిరుగుకుంటూ ప్రదర్శనలిస్తూ మొత్తానికి వరంగల్ సభకు చేరుకున్నం. మా గొంతులన్నీ జీరబోయి అసలు మహాసభలో పాడలేకపోయినం. ఆ సభలో గద్దర్, సంజీవ్, వంగపండు మాత్రమే పాడగలిగారు. ఆ మీటింగ్ కు దాదాపు 10-12 లక్షల మంది ప్రజలు వచ్చింరు. వేదిక మీద నుండి చూస్తుంటే నదులు పాయలు పాయలుగా వచ్చి సముద్రంలో కలిసినట్టుగా ఒకటే జనప్రవాహం. మళ్ళీ అంత పెద్ద మీటింగ్ ఎప్పుడూ చూడలేదు. అదొక గొప్ప జ్ఞాపకం.
2004 లో మావోయిస్ట్ పార్టీ ప్రభుత్వంతో జరిపిన చర్చల సమయంలో, తెలంగాణా ఉద్యమంలో 2001 నుండి 2014 లో తెలంగాణా ఆవిర్భావం వరకు ఎన్నో ఊర్లలో గద్దరన్నతో వేదికలు పంచుకున్నాను. కానీ 1985 AIRSF సభలో నాతో స్నేహభావంలో నేను గమనించిన మార్పు తెలంగాణా ఉద్యమ కాలంలో నన్ను ఎరుగనట్టుగానే తలతిప్పుకునే వరకు వెళ్ళింది. అయినా ప్రజల పాటలు రాసి, విప్లవోద్యమం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆడి, పాడి, పనిచేసిన గద్దరన్న అంటే ఎప్పుడూ ప్రేమనే, గౌరవమే!
2021 లో కాకరాల గారి సహచరి సూర్యకాంతమ్మ గారు చనిపోయినప్పుడు చివరిసారి కనిపించిండు. దగ్గరికి రమ్మని సైగ చేస్తే వెళ్ళి తన పాటకు కోరస్ పాడిన. ఆ తర్వాత నాతో “ఒకసారి మా ఇంటికి రండి” అని అన్నడు. “సరే మంచిదన్నా” అని అన్నాను. అదే ఆఖరి కలయిక.
గద్దరన్న మరణవార్త విన్నప్పుడు ఆయనతో యాభై ఏండ్ల పరిచయం, జననాట్యమండలి ఉద్యమ సాహచర్యం, ఎన్ని వ్యక్తిగత వైరుధ్యాలున్నా ప్రజాఉద్యమమాల్లో కలిసి పని చేసిన సందర్భాలు అన్నీ గుర్తు చేసుకుని నేను, లక్ష్మయ్య చాలా దుఃఖపడ్డాం. కష్టజీవుల కష్టఫలితం తాము పొందేవరకు, సాగే విప్లవోద్యమం వున్నంతవరకు గద్దరన్న పాట వుంటది. అన్నకు నా విప్లవాభివందనాలు. ఎర్రెర్ర దండాలు.
మీ పాటల ప్రస్థానం లో… గద్దర్ ఒక జ్ఞాపకం
gaddar gurinchina sandhya jnapakaalu sandhyanu koodaa telusukonetlu chesaayi.
గద్దర్ గారు సంధ్య గారికి కళా వేదికల మీద అవకాశం ఇవ్వకపోవడం పితృస్వామ్య భావజాలంలో భాగము. మా భూమి’ సంధ్య గారికి గురించి ఈ విధంగా తెలుసుకోవడం మాకు లభించిన అదృష్టం.
సంధ్య గారి గద్దర్ స్మరణలో స్త్రీ దృక్కోణం చాలా subtle గా వ్యక్తమైంది. బాగుంది.
Very remarkable memories of the legendary revolutionary singer Com. Sandhya..
Red Salutes to her and Com. Gaddar.✊💐
Sandya presented early history’ of JNM.cangrats akka.
సంధ్య గారు మరిచిపోలేని సంగతులు తెలిపారు . మిరు ధిల్లి 1983 లో జరిగిన AILRC సభలకి వస్తె నేను అన్ని రొజులు గద్దరన్న బ్రుందం తొనే ఉన్నాను.