చెమ్మగిల్లిన కళ్లను ఆత్మీయంగా తుడిచి అంతరాత్మను ఆవిష్కరించే మాటల ఆర్ద్రతే కవిత్వం. సృజనతను స్పర్శించిన చేతివేళ్ల పనితనం అందమైన కావ్య సృష్టికి ప్రాణవాయువవుతుంది. సందర్భానికి ఆవశ్యకతగా, విప్పారిన వ్యవస్థాపనగా, మార్మికతల క్రియాత్మకతగా, వర్తమాన పరితపనగా కుదురుకున్న కవితా వాక్యమే మనస్సు చుట్టూ అల్లికై ముసురుకుంటుంది. మన్ను ముద్ద అద్దిన కాటుకగా, నిరంతరాన్వేషణలో దక్కిన పరిపూర్ణమైన నీటి బొట్టులా, అనిర్వచనీయమైన ప్రజ్వలిత కాంతిగా కవిత్వాన్ని భాసింపజేయడం కవిలోని కళాత్మకతకు నిదర్శనం. అనాహత లో అంతర్గత నదులను అదిలించి కాలనాళికలో భావ ప్రవాహమైన నామాల రవీంద్రసూరి . రవి లాంటి కవి అనిపించుకున్నారు. హృదయ ద్రావకంగా సాగిన కవితాధారతో సరికొత్త ఒరవడిని ఆయన ప్రతిపాదించారు.
కచ్చరం కనిపిస్తుందా/ ఉసిల్ల ఊసైనా ఉందా/ గీసకత్తి మొక్కబోయింది/ కుమ్మరాము కనుమరుగైంది/ మోటబావి- చెరువుతూము/ ఛిద్రమైన పల్లెటూరి సంస్కృతి/ పాలపిట్ట-శమరకాకి/ లింగనపురుగు- కుమ్మరిపురుగు/ తుమ్మిష్క-భూం పాప/ ఎర్రలు-తేనెటీగలు-బుడ్బుంగలు.. తీరొక్క పక్షులు ఏమైనట్టు అని ప్రశ్నించడంలో పర్యావరణ అసమతుల్యత, వైభవాన్ని కోల్పోయిన పల్లె కనిపిస్తాయి. గతం పునాదులపై భవిష్యత్తును నిర్మించుకుంటూ జీవవైవిధ్యాన్ని వెతుక్కుంటున్నాడు మనిషి అంటారు. రాయలసీమ ఒకనాడు రత్నాలు పండించిన భాగ్యసీమ అని ఇప్పుడు రగిలే జ్వాలలతో రావణకాష్టంగా మారిందని వేదన పడతారు. మొక్కనైతేనేం/ మనిషి మొక్కేంతగాఎదుగుతాను/ మనిషికి ఆదర్శమే నేను అంటూ అమ్మతనం లాంటి హరిత గీతాన్ని ఆలపించారు. చెట్టునైతేనేం/ చెట్టంత మనిషిగా తోడుంటాను అని భరోసా ఇచ్చారు. లోతైన చూపులు కొన్నైతే/ పైపైన చూపులెన్నో అంటూ అనేక రకాల చూపులను విశ్లేషించి చూపారు. దృశ్యాల మూటలను తెచ్చి మనిషి మదిలో ముద్రించగలిగే శక్తి చూపులకు ఉందంటారు. బతుకమ్మ పండుగ ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉండేదని చెప్పి ఇప్పుడు మారిన కాలమాన కర్కశ పరిస్థితులలో పండుగ వైభవం ఎండమావి అయ్యిందంటారు. పిస్తోలు బిల్లలు మోగకుండా, ఒంటి మీద కొత్త బట్టల వాసన తగలకుండా, టపాసుల శబ్దాలు మారుమ్రోగకుండా నిశ్శబ్దంగా బతుకమ్మ బయలెళ్లిందని వేదన చెందారు.
డబ్బే ముఖ్యం కాదని సంపాదనంటే జ్ఞానమని చెప్పారు. చూడలేని నీలిదృశ్యాన్ని/ ఆపలేక/ గుడ్డివాడైన సూర్యుడు/ గుండె పొడుచుకొని/ ఆకాశం ఆరేసిన శవమైనప్పుడు సర్వం ధ్వంసం అనడంలో సమస్యల చీకటిలో చిక్కుకొని దయనీయంగా మారిన బతుకును విశ్లేషించారు. నేను కంటున్న కల/ తీరని అలల తాకిడికి ముక్కలైతే/ చీకటిని దాటేస్తూ అతికించుకుంటున్నాను/ నేను ఏనాడో రాత్రి అనే పదానికి రిప్ చెప్పేశాను/ ఒళ్లు తెరిచే నిద్రపోతున్నాను అనడంలో గాయపడిన జీవితం గుర్తుకు వస్తుంది. ముక్కలవుతున్న కలలకు ప్రాణం పోయాలన్న తపన వ్యక్తమైంది.
బాల్యం, మానవత్వం, మానవజీవితంపై మాధ్యమాల ప్రభావం, దుఃఖం, సినిమా రంగం వంటి అంశాలు కవితలలో కనిపిస్తాయి. జీవితం దుఃఖాల కూడిక/ సంతోషాల తీసివేత అంటారు. ఆకాశం/సముద్రం/భూమి అక్కడే కుర్చుంటారు…నాలాగ/కూర్చుని ఉండడమంటే/ చలనం ఆగినట్టా/ సంచలనం కోసమే అన్న ఉద్విగ్నస్థితి వ్యక్తమైంది. బంధాలు, బంధుత్వాలు శాశ్వతమా అని ప్రశ్నించారు. క్రమంగా వెళ్లినవాడు/ గమ్యాన్ని చేరుకుంటాడు/ దారి తప్పిన మనిషి/ ఎంత దూరమని వెళ్లగలడు అని అన్న నగ్న సత్యాన్ని చెప్పారు. ఊపిరిపోసిన/ అమ్మతో సమానం/ ఊరు కన్నబిడ్డలా/ వెచ్చటి కౌగిలింతల్లాంటి పచ్చటి జ్ఞాపకాలు అని తన ఊరును గుర్తు చేసుకుంటారు. నేను తిరిగేది ఎక్కడో/ వెతికేది ఎంటో/ ఎవ్వరికీ కనిపించదు అనడం ఆయనలోని అన్వేషణా శీలతను తెలుపుతుంది. పలు కవితల్లో ప్రయోగాలు, ప్రతీకలు, ఉపమానాలు, పదబంధాలు అనేకంగా కనిపిస్తాయి.
జంటపదాల ప్రయోగం కూడా పలు కవితలలో ఉంది. పాపాన్ని,శాపాన్ని తుడిచిపెట్టేది జ్ఞానమే అంటారు. అహం కొమ్మలను/ అప్పుడప్పుడు అదిలించకపోతే/ వదిలించుకుంటుంది సమాజం అని నిర్మొహమాటంగా ప్రకటిస్తారు. చెట్టుకు మనిషికి పోలికెక్కడిది అన్నారు. విజ్ఞానం విఛ్చిన్నమైన చోట ఫలితం మనిషికి దక్కదని చెప్పారు. అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరిస్తేనే చెట్టు నేలను చూస్తూ నింగిని అందుకోగలదని అంటారు. రిక్తహస్తాలతో/ నిలుచున్న మనిషి కూడా ఋషి కాగలడు అని సందేశిస్తారు. స్త్రీలో గణించలేనన్ని గగనాలు/ కనిపించని సంవేదనల సమాహారాలు ఉన్నాయంటూ ప్రతీరోజూ కొత్త దుఃఖాన్ని కొనుక్కునే సహనశీలిగా ఆమెను అభివర్ణించారు. స్త్రీని సముద్రాన్ని పోలిన అక్షరంగా భూదేవికి సమనార్థకంగా సూచించారు.
తాత్విక అధ్యయనం, జీవిత అనుభవంతో వెలువడిన వ్యక్తీకరణలుగా కవితలు కనిపిస్తాయి. నిరంతర అధ్యయన సృజనశీలత అడుగడుగునా వ్యక్తమైంది. ప్రభాతకు నులివెచ్చని చురకలో ఆగమరచిపోయారు. సృష్టికర్తకే తెలియని మరొక ప్రపంచంగా సమాజంలోని వేదనను ఎత్తిచూపారు. ఆకలితో కూడిన కడుపుమంట ఎవ్వరికీ ఉండకూడదని కోరుకుంటారు. సృష్టిలోని ఆవిష్కరణలు అన్నీ మనిషి ఆలోచనలకు ప్రతిరూపాలేనని అంటారు. ఆలోచనల వేగంతో సర్వవిద్యల మకుటధారిగా మనిషి అవతరించాడని చెప్పారు. మట్టికున్న సమానత్వాన్ని మనిషి తెలుసుకోవాలంటారు. ఏ ఇంట్లో పుడితేనేం/ ప్రతి ఒంట్లో ప్రవహించేది/ ఎర్రటి నెత్తురే అంటూ అచంచల మానవత్వాన్ని గుర్తు చేశారు. రాజకీయ ఎత్తులు, స్వార్థపు జిత్తులు సమాజ పటంపై మాసిపోని మరకలని అన్నారు. ఏ జీవితమైనా/ అక్షర బద్ధమైతేనే కదా/ ఆదర్శమవగలదు అని శాశ్వతత్వానికి నిర్వచనమిచ్చారు. ఓదార్పును అమ్మతనమని వివరించారు. నా ఆలోచనల ధార/ ప్రవహిస్తూనే ఉంటుంది/ జ్ఞాపకాల జాడలను సృష్టిస్తూ అంటూ తన నిత్యపురోగమనాన్ని స్పష్టంగా సూచించారు.
విభిన్న అంశాలు ఉన్నా విషయసమన్వయాన్ని పాటిస్తూ మట్టికోయిల గొంతులో కొత్త చైత్రాన్ని పట్టుకున్నట్టుగా గతిశీలంగా, వైవిధ్యభరితంగా రవీంద్రసూరి కవిత్వం సాగింది. గాయాలకు ఆప్తవాక్యాలను అద్ది కొండంత భరోసా ఇచ్చారు. సమస్యలపై పోరాటంలోనే మందహాసాన్ని వెదికారు. కన్నీళ్ల సిరాతోనే వెన్నంటే ధైర్యం నూరిపోశారు. చలిముల్లులు గుచ్చిన చోట దుప్పటిలాంటి రక్షణ కవచమయ్యారు. చెరువంత విశాలతనూ, చెదిరిపోని దైర్యాన్ని అవలంబించారు. చీకటిని తరిమే సూర్యుడిలా ప్రకాశిస్తూనే తల్లివేరులా దయాళువై ప్రాణస్పర్శను కురిపించి విశ్వసనీయ కవితా పత్రాన్ని ఆవిష్కరించారు.