కొలకలూరి ఇనాక్ కవిత్వంలో వస్తు వైవిధ్యం

కొలకలూరి ఇనాక్ సాగు చేసిన సాహిత్య ప్రక్రియలలో కవిత్వం ఒకటి. చదువుల కాలం నుండే కవిత్వం వ్రాస్తున్నా 1971 లో గానీ ఆయన తొలి కవితా సంపుటి ఆశాజ్యోతి రాలేదు. 1979లో షరామామూలే , 1984 లో కులం: ధనం , 2001లో వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ , 2008 లో కలల కార్ఖానా , త్రిద్రవ పతాకం , చెప్పులు, ఆదిఆంధ్రుడు , 2010లో కన్నీటి గొంతు, మెరుపుల ఆకాశం, 2016 లో సర్పయాగం, అమరావతి , 2019 లో విశాల శూన్యం -మొత్తం 13 కవితా సంకలనాలు ప్రచురించారు. (ఆచార్య కొలకలూరి మధుజ్యోతి , ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్య సృష్టి – దృష్టి) కొలకలూరి కవిత్వ నిర్మాణం ఒక్కొక్కసారి వట్టి వచనంగా వాచ్యం అవుతున్నట్లు కనిపించవచ్చు కానీ వస్తు స్వీకరణ నిర్వహణలు ఎప్పుడూ విశిష్టమే. సాధారణ లౌకిక విషయాలను అభ్యుదయ దృష్టితో దర్శించటం ప్రత్యేకించి దళిత దృక్పథంతో కొత్తగా చేయటం ఇనాక్ కవిత్వంలో కనిపించే ప్రత్యేకత.

కవులు సున్నిత మనస్కులు. భావోద్వేగులు. బాహిరప్రపంచ సంబంధంలో మెదడులో మెరుపు వలే మెరిసే ఒక భావనను కవితగా అల్లటానికి ప్రారంభ దశలో కవులకు ఆలంబన ప్రకృతి లేదా పండుగలు. కులం : ధనం సంపుటిలో పండుగ కవితలు ఎక్కువగా ఉండటం చూస్తాం. సాధారణంగా ఉగాది కవితలు ఎక్కువగా వ్రాస్తుంటారు కవులు. ఉగాదికి సాహిత్య సంస్థలు, ప్రభుత్వ సాంస్కృతిక సంస్థలు, రేడియో వంటి ప్రజా మాధ్యమాలు కవి సమ్మేళనాలు నిర్వహించటం అందుకు కారణం కావచ్చు. అలా ఇనాక్ కవితలలోనూ ఉగాది కవితలు ఎక్కువే. ఉగాది అంటే వేప పూతలు, వగరు వదుల్చుకొంటూ పులుపు సంతరించుకొనే మామిడి కాయలు, లేత మామిడి చిగుర్లు మేసి మత్తెక్కిన కోకిలల కుహుకుహూ రావాలు, వికసిస్తున్న మల్లెలు, పరిమళించే వసంత శోభ.. కొత్త అందాలు, ఆశలు, ఆకాంక్షలు. వాటి చుట్టూ వ్యాపించే భావుక సీమా విహారం కవిత్వం అంటే. కానీ ఇనాక్ లాంటి కవుల భావుక సీమలను ఆక్రమించేది, శాశించేది చేదు సామాజిక వాస్తవం. అందువల్లే కొత్తసంవత్సరాలు వస్తుంటే పోని పాతబాధలే, ప్రజల బాధలే వాళ్ళను వెంటాడుతాయి. దుర్మతి, దుందుభి సంవత్సరాల గురించి ఇనాక్ వ్రాసిన కవితలు చూస్తే ఈ విషయం అర్ధం అవుతుంది.

గడ్డితినే మనుషులు, నీటి కరువు, గూడు లేని జీవులు కలవరపెడుతుంటే ఆ నికృష్ట పరిస్థితుల మధ్య యావజ్జీవం ఉండటం ఎలా అని సన్మతుల ప్రతినిధిగా ఒక ఊపిరి ఆడని తనానికి గురిఅవుతాడు కవి. (దుర్మతీ 1981) ఆయన కవిత్వంలో దరిద్రం పొదిగిన క్షామానికి పుట్టిన ఆకలి కోకిలలు వసంతగానం చేస్తాయి. బస్ స్టాండ్ దుమ్ములో దుప్పటి పరుచుకు పడుకున్న అవిటివాడు, రైల్వే స్టేషన్ లో చెవిలో బీడీ పెట్టుకొన్న బాలకూలీ ఆయన కవిత్వంలో బొమ్మకడతారు. ఇవేవీ చూడకుండా కళ్ళుమూసుకు కూర్చున్న దేవతల మీద ఆయన ఆగ్రహం కూడా వినబడుతుంది. ( అనాహ్వానం ) “ఈ దుందుభిలో/ గుండెల భేరీలు / కళ్ళు వానలు / ఆకళ్ళు రాక్షసులు / బ్రతుకులు పాచికలు /దుందుభి తెచ్చుకొన్న చెరుగ్గడ / రుచీ పసాలేనిదని పసివాళ్లే తీర్పిచ్చారు” ఈ పంక్తులు చాలు కవి పండగ మూడ్ లో లేడని చెప్పటానికి. బద్దలవుతున్న గుండెలు, ధారాపాతంగా కురిసే కన్నీళ్లు, ఆకలి, వీటిమధ్య బ్రతుకే పాచికలాట అయినప్పుడు ఉగాది కలిగించే కొత్త సంతోషం ఏముంది ? “ఎండల్ని నెత్తిన మోస్తున్న కూలీకళ్ళను / మాంసం ముద్దలనుకొని గద్ద పీక్కుపోయింది/ బీదవాడి జేబులోని చెమట బొట్టుల్ని /కిళ్ళీ కొట్టు అంకెల కాగితం అద్దేసింది” వంటి పంక్తులను చూస్తే జీవితంలోని భీభత్సామంతా దృశ్యమానం అవుతుంది. ఇక ఉగాదికి ఆహ్వానాలు పలకటం ఎట్లా అన్నది కవి ప్రశ్న.

దీపావళి వస్తే ‘మనకేం పండగ’ అంటాడు కవి తిరస్కారంగా. ఈ సమాజంలో పండుగలు ఇష్టమైనవాళ్లు, కష్టమైన వాళ్ళు అని రెండు వర్గాలు ఉంటాయని భావించే కవి తాను కష్టమైన వాళ్ళ పక్షం. నేను అని ఉత్తమపురుష ఏకవచనంతో తనను వాళ్ళ మనిషిగా నిలబెట్టుకొని పండుగలు ఇష్టమైనవాళ్లను మీరు అని మధ్యమపురుష బహువచనంతో సంబోధించి వైరుధ్యాలను కేంద్రంలోకి తెస్తాడు. కొందరికి పండుగ ఎందుకు కష్టం అంటే ఉత్సవాలు జరుపుకోగల ఆర్ధిక స్థాయి లేదు కనుక కొత్తబట్టలు, పిండివంటలు ఇవేవీ తనకు సాధ్యం కావు కనుక . ఆ పరిస్థితిని కొనసాగించే ప్రజాస్వామ్య పాలన గురించి బాధ , కోపం ఉన్నాయి కనుక. “ప్రజాస్వామ్యానికేం ఫరవాలేదు / ప్రాణం పోలేదు /ప్రజాస్వామ్యానికేం పరాభవం లేదు / బట్టలు చిరిగాయంతే ! ప్రజాస్వామ్యానికేం ప్రమాదం లేదు / పళ్ళు మాత్రమే ఊడాయంతే !” అనే పాదాలలో ప్రజస్వామ్య శైథిల్యాన్ని గురించిన కవి ఆవేదనే ప్రతిఫలిస్తుంది. “కూటికి లేనివాళ్లు /గుడ్డలు లేనివాళ్లు /గూటికి రాని వాళ్ళు ఉన్నంతకాలం / మనకేం దీపావళి ? అని పండుగలు ఉన్నవాళ్లకే నని స్పష్టం చేశాడు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో వ్రాసిన చలిమంట కవితలో చలిమంటల్లో చాదస్తాలు, హింసలు, అన్యాయాలు తగలెయ్యమంటాడు కవి. అడవుల్లో, కొండల్లో, గుహల్లో, గనుల్లో , ఫ్యాక్టరీలలో, విద్యాలయాల్లో ఎక్కడబడితే అక్కడ అన్యాయాల కు ఎదురుతిరిగే జనాన్ని ప్రతి ఒక్కరినీ ఒక్కో చలిమంటగా సంభావిస్తాడు. చలిమంట వేడీ వెలుగే కాదు చైతన్యం అనటంలో అదే ధ్వనిస్తుంది. ఇనాక్ పండుగ కవితలలో మరొక ప్రత్యేకత రాయల సీమ స్థానీయ సమస్యల నుండి అస్సాం, అమృతసర్, అకాలీ మొదలైన సమకాలీన దేశీయ సంక్షోభాలను కూడా ప్రస్తావించటం.

ఈ వరుసలో ‘నాకు శాంతిలేదు’ కవిత మరీమరీ చెప్పుకోవలసినది.
“మీరు ఆనందించండి
వీళ్ళు దుఃఖిస్తున్నారు
నాకు సంతోషం లేదు
మనమంతా కలిసి ఆనందించిందాకా
నాకు సుఖం లేదు
శాంతి లేదు” అని ప్రారంభం అయ్యే ఈ కవితలో ‘మీరు’ సంపన్నవర్గాన్ని ‘వీళ్ళు’ కడు పేద వర్గాన్ని సంబోధించే సర్వ నామ వాచకాలు. నేను కవి. కవికి ఈ ఆర్ధిక అంతరాలు ఆందోళన కారకాలు. అందువల్లనే అంతా బాగుందని సుఖంగా , శాంతంగా ఉండలేడు. ఆ తరువాతి కవిత అంతా తనకు సుఖశాంతులను దూరం చేసే వ్యత్యాసాల స్వరూప స్వభావాలను నిరూపించి చెప్పటమే. ఒకరి నోటికి షడ్రుచుల భోజనాలు మరొకరి నోరు పిడచకట్టుకుపోయిన ఎడారి, ఒకరి ఇంటికి మామిడి తోరణాలు మరొకరి కంట్లో సాలెగూళ్ళు, ముళ్లకంపలు … ఇలా రెండు వర్గాలుగా చీలిపోయిన సమాజం పట్ల కవి స్పందనకు ప్రతినిధి కవితలోని నేను. నేను వీళ్ళ కన్నీటి బొట్టును, నేను వీళ్ళ చెమట బొట్టును, నేను వీళ్ల నెత్తుటి బొట్టును అంటూ కడుపేదలతో కవి అభేదాన్ని సంభావిస్తాడు. ‘నుదురు కొట్టుకొనే హస్తాలు/ కడుపుకొట్టుకొనే హస్తాలు /గుండె పిండుకొనే హస్తాలు పిడికిళ్ళయ్ కలవటాన్ని, పిడుగులై పడటాన్ని’ కవి కాంక్షిస్తాడు. సమస్త సంపదలను సృష్టించే శ్రమజీవుల చెమట కు విలువనిచ్చి గౌరవించగల రాజ్యం కోసం కలగన్నాడు. ‘అడవి తుపాకీ ‘తో ఐక్యత భావించాడు.

సమాజంలో కవికి ఆగ్రహం తెప్పించే రెండు అంశాలు కులం, ధనం. ఆగ్రహం ఎందుకంటే నిచ్చెనమెట్ల సమాజం, తీవ్రమైన అసమానతల సమాజం ఆ రెండు చక్రాలమీదే నడుస్తున్నది కనుక. కవులు కోరేది సమానత్వం, శాంతి. వాటికి భంగం కలిగించే కులం, ధనం వాళ్లకు ఆగ్రహ కారణాలు కాక మరేమవుతాయి ? ఇనాక్ కవిత్వం ఆవిర్భావం ఈ ఆగ్రహజ్వాలల నుండి జరిగింది. “కులం మన పూర్వజన్మహక్కు / దారిద్య్రం మన జన్మహక్కు /పీడన దోపిడీ మన దినచర్య / ఏడిపించడం, ఏడవడం మన క్షణ చర్య” ( ఆంధ్రప్రగతి ) అన్న పంక్తులు చాలు కవి దృక్పథం ఏమిటో తెలుసుకొనటానికి. “ కులం వినా బ్రతుకు లేని జనం /ఏలుతున్న , ఏలబడుతున్న, ఏలుబడిలో భారతదేశం / కుక్కలు చింపిన విస్తరి” ప్రజల యొక్క, ప్రజలచేత, ప్రజల కొరకు పాలించే ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్న నిర్వచనం నమూనాలో కులం యొక్క కులంచేత కులం కొరకు సాగే ప్రభుత్వాల దగుల్బాజీతనాన్ని ఎండగట్టాడు కవి. భారతీయత కు పర్యాయ పదం కులం అయిన దుస్థితిని ఎత్తిచూపాడు. కులం చుట్టూ ఉండే అధికార రాజకీయాల బండారాన్ని బయటపెట్టాడు ‘కులం’ అనే ఈ కవితలో. కుల వ్యవస్థలోనూ మళ్ళీ పరాయీకరణకు మరింత ఎక్కువగా గురయ్యే దళితుల గురించిన అవగాహన, ఆవేదన ఇనాక్ కవితలలో అంతర్భాగంగా ఉంటుంది. “ఏమతమూ నీ కులం మార్చదు” “ఏ పాలనా నీకు విముక్తి నీదు” వంటి పంక్తులు దానిని ధ్వనించేవే. హరిజనులు భారతదేశం పారేసుకున్నవాళ్ళు అని నిష్ఠురపడతాడు (కులం) .

ఉన్నవాడికి లేనివాడికి మధ్య వైరుధ్యాల విశ్లేషణ వస్తువుగా ధనం కవిత ను వ్రాసారు ఇనాక్. “ఉన్నవాడి /కళలు రాణిస్తాయి/కర్మ ఫలిస్తుంది / గోరంతలు /కొండంతలుగా/ పెరిగి పోతాడు / లేని వాడి/ శక్తి క్షీణిస్తుంది/శ్రమ నశిస్తుంది /కొండంతలు గోరంతలుగా / తరిగిపోతాడు” ఉన్నవాడు కొండంతలుగా పెరగటానికి లేనివాడు గోరంతలుగా తరగటానికి మధ్య ఉన్న గతితార్కిక సంబంధాన్ని ధ్వనించే ప్రారంభం ఇది. శక్తి , శ్రమ నశించేవి కావు. ఉన్నవాడి కర్మఫలించటానికి పెట్టుబడి శ్రమ శక్తి. దాని లాభం పోగుపడేది ఉన్నవాడి దగ్గర. అందువల్లనే వాడు ఉన్నవాడు అవుతున్నాడు. కొండలాగా పెరుగుతున్నాడు. ఆమేరకు లేనివాడు లేనివాడు అవుతున్నాడు.

ఇక ‘కులం : ధనం’ శీర్షికతో ఆ రెండూ కలిసి చేసే కుట్రను బట్టబయలు చేశారు ఇనాక్. 1984 నాటికే బ్రాహ్మణత్వం మాయను ఆయన ఇందులో విమర్శకు పెట్టటం ఆశ్చర్యం కలిగించక మానదు. బ్రాహ్మణీయ హిందుత్వ గురించిన అవగాహన బీజాలు ఈ కవితలో ఉన్నాయి. సాహిత్యం దానికి ధర్మ సంబద్ధతను సమకూర్చటం గురించిన సూచన కూడా ఇందులో ఉంది. వర్ణవ్యవస్థ మూలంలో ధనస్వామ్యం ఉన్నదని, అందువల్ల మతం మారినా మారని కులం చాతుర్వర్ణ వ్యవస్థను వల్లకాడు చేసినప్పుడే సాధ్యం అని భావించాడు కవి. “ కులాన్ని కూల్చందే , ధనాన్ని పంచందే / ఈ దేశం బాగుపడదు , ఈ జాతి ముందుకు పోదు” అని ఘంటాపథంగా పేర్కొన్నాడు. “కులం కుళ్ళు ధనం పుళ్ళు కడిగే / ఆగామి యుగాల వైద్యులకు స్వాగతం” పలికిన కవిత ఇది.

‘విశాల శూన్యం’ సంపుటి కూడా భిన్నవస్తు కవితలతో కూడినది. ఇందులో ‘నువ్వేకదా’ అనే శీర్షికతో వ్రాసిన కవితలు ఉన్నాయి. ఒకే శీర్షిక తో నాలుగు కవితలు కొంచం చిత్రంగానే అనిపించింది. కానీ చదువుతుంటే ప్రతి కవితలోని ‘నువ్వు’ ఒక ప్రత్యేకమైన వ్యక్తి , వ్యక్తిత్వం అని అర్ధమవుతుంది. ‘నేను’ అని ఉత్తమపురుషవాచకంతో మాట్లాడే కవికి ఆ ప్రత్యేకమైన ‘నువ్వు’ తో ఉండే భిన్నమైన హృదయదగ్ధ అనుభవాలు పాఠకుల మనసులను ఆర్ద్రం చేస్తాయి.

“నీ కలలు మొలకలై కాళ్లావేళ్లా పడితే
కన్నీటిని పారించి , పోషించి , పెంచి
ఆనందాభ్యుదయం పండించిన
సంతోష నదీ సామ్రాజ్ఞివి నువ్వే కదా !” అని మొదలయ్యే కవితలో నువ్వు ‘తల్లి’. కలలు మొలకలై కాళ్లావేళ్లా పడటం ఒక భావచిత్రమై కాళ్ళను చుట్టుకొన్న కదలనీయని శిశువులతో కూడుకొన్న తల్లి బొమ్మకు రేఖా చిత్రాన్ని గీసింది. ఇక అక్కడనుండి చర్యల ద్వారా తల్లి వర్ణచిత్రాన్ని , రసచిత్రాన్ని ఆవిష్కరిస్తూ పోతాడు కవి. ఈ తల్లికి వర్గం ఉంది. అది దరిద్రవర్గం. పేదరికంలో పిల్లలను పెంచటం మరీ పెద్ద సవాల్ . ఆ సవాల్ ను సమర్దవంతంగా ఎదుర్కొన్న తల్లి కావటం ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. పొట్టలో బిడ్డను మొయ్యటం, పాలిచ్చి పెంచటం, ఎండావానలకు పైటచెంగు గొడుగు పట్టి కాపాడటం, గోచిగుడ్డకు కోకకొంగు చింపి ఇయ్యటం, ఎగిరే రెక్కలు మొలిపించటానికి తాను రెక్కలు విరుచుకొని చాకిరీ చేయటం, ఆకలి ఆరాటానికి ఆసరాకావటం, విద్యాబుద్ధులు చెప్పించటం – ఇలాంటి చర్యలలో అపరబ్రహ్మగా, సుందర సహాయ సూర్యకాంతి గా , సంసార కల్పతరువుగా, అనంత సౌందర్యావధి గా , మహారాణిగా, ప్రేమలోక దానశీలిగా , వెన్నెలబాటగా , ధైర్య పర్వత శిఖరాగ్రంగా, మార్గదర్శినిగా, స్వర్లోక పరమహంసగా ఆ తల్లి విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది ఈ కవిత.

“సూర్యుణ్ణి నీతో పాటు ఊళ్లోకి తీసుకెళ్లి
చంద్రుణ్ణి నీవెంట పల్లె ఇంటికి తెచ్చి
నా నిద్రతలనూ బొజ్జనూ ముద్దాడిన
ప్రేమాత్మ దీవెనవు నువ్వే కదా ! “ అని మొదలయ్యే కవితలో ‘నువ్వు’ ఎవరు? తండ్రి. సూర్యుణ్ణి ఊళ్లోకి తీసుకెళ్లి చంద్రుణ్ణి ఇంటికి తెచ్చే తండ్రి కష్టజీవి. అతను పల్లె తండ్రి. మాలమాదిగపల్లె కు చెందిన తండ్రి. పేదరికం తో పాటు వర్ణ బహిష్కృతుడు. ఆ తండ్రి ఏమి చేసాడు? కొడుకుకు భూమిపై పనిచేయటం నేర్పాడు. పగలంతా కష్టపడి ఇంటిని వెలిగింపచేసాడు. ఉన్నదేదో కొడుక్కు పెట్టి ఆకలిని మోసినవాడు. భుజాల మీద మోసి ప్రపంచంచూపినవాడు . ఆటలాడి ఆనందించినవాడు. బతుకు బండి నడపమని అర్ధాంతరంగా కన్నులు మూసినవాడు. ఆ క్రమంలో ఆయన కొడుకుకు అపరబ్రహ్మ , అయ్యవారు, గజీతగాడు, ధరాచక్రవర్తి , అందాల చందమామ ఇలా అనేకరూపాలలో ఆవిష్కృతం అవుతాడు.

“చెమ్మగిల్లిన నా నేత్ర దర్పణాలలో
ప్రతిఫలించిన స్వప్నానివి నువ్వే కదా !” అని మొదలయ్యే కవితలో ‘నువ్వు’ భార్య. ఆమెది పసిమనసు. హరివిల్లు అందం. దాంపత్య సంబంధాలలో ఆమెతో పెనవేసుకున్న బంధాన్ని , ఆమె తనకు ఇచ్చిన సహకారం, నిరంతర సౌఖ్యం, నిలబెట్టిన వివేకం అన్నీ తలచుకొంటుంటే ఆమెకు కృతజ్ఞతలు ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంటే తన బిడ్డలకు తల్లి అయి ఆనందపెట్టిన వెన్నెలవెలుగుగా, నిత్యం తనలో చైతన్యం జ్వలింప చేసే అంతర్జ్వాలగా , పూలతెప్పగా , తన జీవిత ఏలికగా, పూర్ణాకృతిగా, ప్రశాంత క్షీర వారాసిగా, ఇంద్రజాల రహస్య రశ్మి గా ఆమెను తాను దర్శించి మనకు చూపుతాడు కవి.

“మా వేళ్ళకు నోళ్లకు అందక
జారిపోయిన అ ఆ ల గింజల్ని
ఏరించి మొలిపించి తినిపించిన
మా కొత్త తల్లివి నువ్వే కదా!” అని మొదలయ్యే కవితలో “నువ్వు” అక్షరాలు దిద్దిచ్చిన గురువు. పేద దళిత బాలుడికి అక్షరాభ్యాసం వేడుక కాదు. అసిధారావ్రతం. గ్రామాలకు , మాలమాదిగపల్లెలకు వచ్చి పిల్లలకు ఇసుకలో అక్షరాలు దిద్దించి విద్యాభిక్ష పెట్టిన తన చిన్ననాటి క్రైస్తవ మిషనరీ పంతుళ్లు జ్ఞాపకాలలో కదులుతుండగా ఇనాక్ ఈ కవిత వ్రాసి ఉంటారు. పొలాలలో పరిగెలు ఏరుకొనే స్థితిలో ఉన్నవాళ్లకు అక్షర తారకల పరిగె లేరే తపన కలిగించిన వాళ్ళు ఆయనకు సూర్యుళ్లు. అక్షరం ఇచ్చారంటే ఆలోచన ఇచ్చినట్లే, ఆలోచన కలిగిందంటే భవిష్యత్తు అభ్యుదయమే. తమ జీవితాలను అభ్యుదయమార్గం పట్టిచ్చిన గురువు పట్ల ఆరాధనాంజలి ఈ కవిత.

ఎవరిని ఉద్దేశిస్తున్నారో వారిని వాచ్యం చేయకుండా వారెవరో కవిత పూర్తయ్యేటప్పటికీ సూచ్యం అయ్యేట్లు చేసే నిర్మాణ శిల్పంతో వ్రాయబడిన కవితలు ఈ నాలుగు.

గింజ మెతుకు కావటం మధ్య / మానవ చరిత్ర /నాగరికత /సంస్కృతి దాగి ఉన్నాయి అని ప్రారంభించిన ‘గింజ- మెతుకు’ కవిత ముగించిన తీరులో ఇనాక్ దృక్పథంలోని పదును కనబడుతుంది. “ అన్నం తినటం / వ్యక్తిగతం అనిపిస్తుంది కానీ / నిజానికి/ అది సాంఘికం/ రాజకీయం/ ప్రతిమెతుకు మీద/ ప్రభుత్వం కన్నుంది /పన్నుంది” ‘వ్యక్తిగతమంతా రాజకీయమే’ అని స్త్రీవాదం చెప్పేవరకు తెలియలేదు. కానీ ఆలోచించి చూస్తే అధికార సంబంధాలు – అవి వర్గ , కుల, లింగ ప్రాంత భాషా విషయాలలో దేనికి సంబంధించినవి అయినా కావచ్చు – జీవితమంతా ఆక్రమించి మత సాహిత్య సాంస్కృతిక భావజాలం ద్వారా మనస్సులోకి , మెదళ్లలోకి ఇంకిపోయిన దశలో రాజకీయం కాని వ్యక్తిగతం అంటూ ఏదైనా మిగిలి ఉందా అన్న సందేహం కలగక మానదు.

పేద దళిత వర్గాలలో అన్నం కోసం ఎంత వెతుకులాటో అక్షరాలా కోసం కూడా అంత వెతుకులాటే. ఆకలి తీర్చే అన్నం దొరికినప్పుడు కలిగే ఆనందం వంటిదే జ్ఞానదాహాన్ని తీర్చే అక్షరం దొరికినప్పుడు కలిగే సంభ్రమం. అఆ ల స్వర్గం, అ ఆలు అనే రెండు కవితలు ఆ అనుభవం యొక్క అభివ్యక్తులే. నదిని సంపదకు, సంస్కృతికి , సజీవత్వానికి, చలనానికి , చైతన్యానికి ప్రతీకగా నిరూపిస్తూ వ్రాసిన నదులు ఒక మంచి కవిత. ప్రవహించటమే జీవించటం అంటాడు కవి.

కనిపించిన దానినల్లా లొంగదీసుకొనాలనే కసి ఏదో ఇనాక్ ను నడిపించింది అనిపిస్తుంది మెరుపుల ఆకాశం వంటి ఆయన ప్రయోగాలు చూస్తుంటే. హాలుని గాథా సప్తశతి సంప్రదాయ మూలం నుండి ప్రేరణపొంది, ప్రాచీన జపాను కవితా ప్రక్రియ హైకూ తో చెట్టాపట్టాల్ వేసుకొని రాసిన 500 వందల మెరుపుల తో ఒక కవితా ఆకాశాన్ని ఆవిష్కరించారు ఇనాక్. “మా పల్లె -/ పెట్టె/ నిండా/ ఉన్న /యువకులు / అగ్గిపుల్లలు”, “తుఫాను /జుట్టుపట్టి/ విసిరికొడితే/ ముడేసుకొని నిలబడ్డ సాధ్వి / పృథ్వి” వంటి గాధల ద్వారా భావచిత్రాలను కళ్ళ ముందు మెరిపిస్తాడు కవి. పుస్తకాలు, కళ్ళజోడు, పాదరక్షలు, సెల్ ఫోన్, పర్సు , కొవ్వొత్తి , కుండా, బెత్తం, టీవీ — ఇలా కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు విస్తృత వస్తు ప్రపంచం చుట్టూ గాధలు అల్లారు ఇనాక్.

చమత్కారం, ఊహ ప్రధానంగా ఉండే ఈ చిన్న గాధలలో కూడా ఇనాక్ సామాజిక వాస్తవాలను రూపు కట్టించక మానలేదు. “వాళ్లిద్దరూ /పిల్లలే / వాడు / బడికి గుడికి / వీడు / పనికి పాటుకి “ వంటివి అందుకు నిదర్శనం. బడికి పోగలిగిన పిల్లలు , పోలేని పిల్లలు అన్న విభజన ఆర్ధిక వ్యత్యాసాలను గుడికి పోగలిగినపిల్లలు, పోలేని పిల్లలు అన్న విభజన సామాజిక వ్యత్యాసాలను సూచించేవే కదా ! బడికిపోవలసిన వయసు పిల్లలు పని పాటలు చేసుకు బ్రతక వలసిన అసమాసామాజిక న్యాయం గురించి ఎంతైనా ఆలోచించటానికి వీలుంది.

అ ఆ లు, అక్షరాలు ,పుస్తకాలు కవికి చాలా పియ్రమైనవి. వాటి చుట్టూ అల్లిన గాధలు చాలానే ఉన్నాయి. “పలకపై/అక్షరాలు/ఏరుకు /తినే/ పిట్టలు / పిల్లాడివేళ్ళు” ఇలాంటి అందమూ ఆర్ద్రమూ అయిన ఊహలు పాఠకులను వెండుతాయి. “పసివాడి/పలకా/బలపాల / సంచి / కలల/ ప్రదర్శన శాల” అనటంలో అక్షరమే అభ్యుదయానికి దారి అన్న అంబేద్కర్ వాణి వినిపిస్తుంది. ఎన్నికల తంతు, ఓటరు స్థితి , పదవుల పరుగు మొదలైన వాటిపై వ్యాఖ్యానాలుగా కొద్ద ఉంటాయి ఇనాక్ హైకూలు. “ఆ చెట్టుకు / ఈ చెట్టుకు / ఆగక /దూకే / కోతులు / నాయకులు” వంటివి ఆ కోవలోవే .

కుట్టూ /కుట్టకపో / నలిపితే /చచ్చే / చీమ / దళితుడు, “నెత్తివేట్లు తిని / గోడపైన/ దేశపటం/ నిలబెట్టే / మేకు దళితుడు” వంటి హైకూలలో దళితుల మీద హింసను, దళితుల త్యాగాన్ని సూచిస్తారు. “తాళిబొట్టు/ తాడుతో/ మెట్టినింట/ కట్టుగొయ్య/గొడ్డు / అబల” వంటి హైకూలలో పెళ్లి అనే వ్యవస్థను స్త్రీల కోణం నుండి విమర్శకు పెట్టటం కనబడుతుంది. అదే సమయంలో తల్లీ పిల్లల సంబంధం, తాత మనవళ్ల సంబంధం మొదలైన కౌటుంబిక సంబంధాల లోని ఆర్ద్రత కూడా ఆయన హైకూలకు వస్తువు కావటం చూస్తాం. క్షణకాలపు దర్శనంలో వస్తువుఒక కొత్త భావచిత్రమై మనసులో వేసే ముద్ర హైకూ అవుతుంది. అది కవి సద్యః స్ఫూర్తికి చేతి అద్దం.

దళిత జీవితం, చరిత్ర దళిత దృక్పథం ఇనాక్ కవిత్వాన్ని ఎలా వెలిగింపచేసాయో ప్రత్యేకంగా పరిశీలించటానికి అవకాశం ఉన్న కావ్యాలు ఆది ఆంధ్రుడు , కన్నీటిగొంతు, సర్పయాగం.

(ఇంకావుంది)

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply