నిన్న మట్టిలో పూడ్చిపెట్టబడిన
దేహంతోనే
అతడు ఇవాళ మళ్ళీ కనబడ్డాడు
అవే ప్రశ్నార్థకాల్లాంటి కళ్ళు
అదే పొద్దురంగు చొక్కా
చుట్టూ అదే పచ్చిగాయాల వాసన
పిడికిలి బిగించిన కుడి చెయ్యి
మలుపు తిరుగుతున్నప్పుడు
అతడి నీడ
నాలోకి జొరబడింది
మొదట్నుంచీ
అతడు నన్ను
వెంటాడుతూనే వుంది
ఇప్పుడు కొత్తగా
అతడి మరణం కూడా..
తెలిసో తెలియకో
అతడి సమాధి మీద ఎవరో
ఒక చెట్టును నాటారు
కొమ్మల మీద వాలిన పిట్టలు కొన్ని
పాటలు పాడి
అతడిని బతికించాయి
ఇక అతడు చనిపోతాడనే దిగుల్లేదు
చావని కలని
మోసుకుంటూ తిరిగేవాడిని
మరణం మాత్రం ఏం చేయగలదు?
రాక రాక ఊరి కొచ్చిన
కొడుకును
ఆత్రంగా కావలించుకునే ముసలితల్లిలా
కాసేపు కావలించుకుని.. తృప్తి పడడం తప్ప
కొన్ని మరణాలు శాశ్వతాలు కావు
నిజాలూ కావు