కొత్త రెక్కల పొద్దు పావురం

పొద్దుపొద్దుకో సూర్యుడ్నికనే
తూరుపు సముద్రం
ఇవాళెందుకో చింతల్లో ఉంది
రెక్కల సడిలేని నేల సరిహద్దు
తుపాకీ ముందు గొంతుక్కూర్చుంది
ఆకాశమంతా రాకాసి పాదాలతో
నడిచి వెళ్లిన సాయుధులెవ్వరో
తోవంతా నాటి వుంచిన కత్తులు గీసుకుని
పావురం ఒళ్ళంతా రక్తమోడుతోంది

ఈ గ్రహాంతరసీమలో
ఎటు చూసినా ఏలియన్స్
తలలు దించుకుని నడిచిపోతున్నారు
ఈ నేలనెవరో పూర్తిగా
ఆట బొమ్మల్తో నింపేశారు
మనుషుల తలల్లో
కొత్త చిగురు వేసిన దాఖలాలైతే
అస్సలు కనిపించడం లేదు
దుమ్ము కొట్టుకుపోయిన గొంతులు
మౌనం గడప దాటి
ఒక్క అడుగూ బయట పెట్టడం లేదు

రోజువారీ ఆకలిపేగుల ఘోష
రొద పెడుతున్నప్పుడు
రాజదండం అంతరాత్మలో
ఈదులాడే యుద్ధ నౌకలు
నిరాయుధుల కళ్ళకు ఆనడంలేదు
మసిబొగ్గుల కడుపు చింత
మనసు లోతుల్లో ఆక్టోపస్ లా
తిరుగాడుతున్నపుడు
ముసి ముసిగా నవ్వుకునే
దస్త్రం చాటు నాజూకు హింస
కన్నీరయ్యే చూపులకు చిక్కడంలేదు

ఇక ప్రజావేగులెవరో
చత్వారపు చూపుల్ని సరిచేసే
లెన్స్ తయారీపై దృష్టి పెట్టాలి
వెలుతురు కిటికీలయ్యే విజిల్ బ్లోయర్స్
తూరుపు తలుపుల వెనుక కావలుండాలి
అప్రకటిత యుద్ధాలు సద్దుమణిగేవరకు
నిరాయుధులంతా నిరసనకు సిద్ధపడాలి
ఏ ఆంక్షలూ లేని స్వప్నాలు ఉదయించే వేళ
స్వార్థశక్తుల ఎగదోతల వల్ల రాజుకునే
కులమతవర్గవర్ణప్రాంతభాషల
కొట్లాటలన్నీ రద్దయిపోయి
యుగయుగాల రక్తస్రావం ఆగిపోయి
ప్రతి పొద్దూ పావురమై రెక్క విప్పాలి!

కవి, రచయిత. పుట్టింది శ్రీకాకుళం జిల్లాలో బడగాం అనే మారుమూల పల్లె వ్యవసాయ కుటుంబంలో. చదువు: M.A.(English), M.A.(Telugu), B.Sc., B.Ed. వృత్తి: ఉపాధ్యాయ వృత్తి. రచనలు: 1) వలస పక్షుల విడిది - తేలినీలాపురం (2005) 2) కొంగా! నా గోరు మీద పువ్వెయ్యవా...(నానీ సంపుటి) (2010). ఇంకా వివిధ పత్రికల్లో వందకు పైగా వచన కవితలు, కొన్ని సాహితీ వ్యాసాలు, సమీక్షా వ్యాసాలు ప్రచురించబడ్డాయి. గత రెండు దశాబ్దాలుగా సాహిత్యంతో అనుబంధం.

One thought on “కొత్త రెక్కల పొద్దు పావురం

  1. తూరుపు తలుపుల వెనుక కావలుండాలి

Leave a Reply