ఉగాదికి
ఉగాది మీద పద్యం రాయాలని
రూలేమి లేదు
ఉగాదికి
ఉతికి ఆరేయాల్సిన
మనిషి జీవితం గురించి కూడా రాయోచ్చు
కాలం చెల్లిన
వంతెన కూలినట్టు
తుఫానుకి
చెట్టు విరిగినట్టు
కూలిన మన తనం మీద మాట్లాడొచ్చు
పిట్ట పాడే పాటకు
చెట్టు తల ఊపదు
చెట్టు పూసే పువ్వు కి
పిట్ట కవిత్వం చెప్పదు
వసంతం ఒక విరామం
గ్రహాలకు విగ్రహాలు పెట్టి
ఆగ్రహించాయని వాటి చుట్టూ
గానుగెద్దు తిరిగినట్టు తిరుగుతావ్
గ్రహాలు వాటి కక్ష్య లో గిరి గిసుకొని బతుకుతుంటే
నువ్వేమో స్కూల్లో కుర్రాడు
చాడీలు చెప్పినట్టు
వాటి పై నిందలు వేస్తావ్
అవి అక్కడే ఉంటాయి
నువ్వెక్కడ తప్పిపోయావో
ఏ పాచికలు, చిలుకలు జవాబివ్వలేవ్
కాలం మెడలో యమ రాహు అంటూ గుర్తింపు కార్డులు తగిలించి
వెలివేస్తున్నావ్
కాలం అంటే చేతులకు, గోడలకు తగిలించిన గడియారం కాదు
కాలం అమేయం ,అనంతం అజేయం
ఫలానా
నక్షత్రంలో పుట్టాను కనుక జమానా సరిగా లేదని ,విని
నీకు నువ్వే గాలిపోయిన బెలూన్ లా ముడుచుకుంటావు
నువ్వో నక్షత్రాల పంటవని
చుక్కల చేనువని తెలుసుకుంటే
చంద్రుడు నీ తలమీద కిరీటం అవుతాడు
మనిషి అంటే పాలపుంత పొదుగు
సూర్యుడు చుట్టూ భూమి తిరగడం పాత సంగతి
మనిషి మనుషులు చుట్టూ తిరగాలి
గుండె,గుండెకు దూరం తగ్గాలి
చీకట్లన చీల్చే కాంతి గోళం కావాలి
వసంతం వసంతాన్ని
పొందలేదు
వసంతం వసంతాన్ని
ఆస్వాదించ లేదు
ఒక్క మనిషి మాత్రమే
వసంతాన్ని హృదయంలోకి తీసుకోగలడు.
Excellent
Super
Superr
Super sir
Excellent sir……
ధన్యవాదాలు
Super sir
Super sir
Super sir
Excellent sir