2024 ఆర్థిక బిల్లుకు వ్యతిరేకంగా కెన్యాలో జరిగిన నిరసనోద్యమాలు – తదనంతర పరిణామాలు

అనువాదం: రమాసుందరి 

అమెరికా, ఇంగ్లండ్, ఐరోపా కూటమి చేస్తున్న సామ్రాజ్యవాద దోపిడీపై వెల్లువెత్తిన నిరసనోద్యమంపై  క్రూర నిర్బంధం 

పేద వ్యతిరేక, ధనిక అనుకూల 2024 ఆర్థిక బిల్లుపై దండెత్తుతూ, అదే ఏడాది జరిగిన సామూహిక ఉద్యమాల సాంవత్సరిక ఉత్సవాలను ఇప్పుడు కెన్యా ప్రజలు జరుపుకొంటున్నారు. ఇంచుమించి రెండొంతుల మెజారిటీతో గెలిచినా కూడా ఈ బిల్లు అనేక విమర్శలను ఎదుర్కొన్నది. రూటో అధ్యక్షుడుగా వున్న ప్రభుత్వం దీన్ని ఉపసంహరించాల్సి వచ్చింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 2024లో జరిగిన నిరసనోద్యమాలను అణచటానికి సైనికులు తుపాకీలనూ, భాష్ప గోళాలనూ, నీటి ఫిరంగులనూ ప్రయోగించినపుడు -60మంది కంటే ఎక్కువమంది ప్రజలు చనిపోయారు. వందలాదిమంది గాయపడ్డారు. 20 మంది ఇప్పటికీ కనబడటం లేదు.  

ఇటీవల కాలంలో కెన్యాలో జరిగిన నిరసనోద్యమాల వివరాలలోకి వెళ్లేముందు, 2024 జూన్ నిరసనలలోకి వెళ్లాలి. ప్రధానంగా యువకులు, విద్యార్థుల సారధ్యంలో కెన్యా ప్రజల అపూర్వమైన తిరుగుబాటుకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకోవాలి.  

కెన్యా దేశంలో 2024 ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టగానే, పెద్ద ఎత్తున ప్రజా నిరసనలు, ప్రదర్శనలు శక్తివంతంగా ఎగిసిపడ్డాయి. ఈ అశాంతి దేశ, ప్రపంచ దృష్టిలో పడింది. దేశంలోని ఆర్థిక విధానాల మీద, పరిపాలన మీదా, ప్రజాస్వామిక పరిస్థితి మీదా పౌరుల్లో పాతుకొని పోయిన ఆగ్రహం ప్రస్ఫుటంగా కనిపించింది. నిరసనోద్యమాల చుట్టూ అల్లుకొన్న సంఘటనల వివరాణాత్మక కథనాలనూ, ప్రజా ఆగ్రహానికున్న సందర్భాన్నీ, ప్రభుత్వ ప్రతిస్పందననూ, ఈ నిరసనలు జరిగాక కెన్యా సామాజిక, రాజకీయాల పరిణామాలనూ -ఈ వ్యాసం వివరిస్తుంది.  

వివాదాస్పద 2024 ఆర్థిక బిల్లు 

రాబోయే సంవత్సరానికి ఆర్థిక విధానాన్ని ఖరారు చేసుకోవటానికీ, ప్రభుత్వం రాబడిని ఎలా సృష్టించుకొంటుందో వివరించటానికీ, ఖర్చులకు నిధులను కేటాయించటానికీ -కెన్యా ప్రభుత్వం ఒక ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టింది. ఆమాటకొస్తే అన్ని దేశాలు ఇలాగే చేస్తాయి. కెన్యా పన్నుల పునాదిని విశాలం చేయటం, ప్రజల అప్పులను తగ్గించటం, అభివృద్ధి నిధులను పెంపొందించటం -2024 బిల్లు ప్రాధాన్యతలని అని చెబుతూ ప్రభుత్వం రకరకాల పన్నులను, రుసుములను ప్రతిపాదించింది. అయితే ఆర్థిక కష్టాలు ఆకాశాన్నంటుతున్న సమయంలో, అప్పటికే ద్రవ్యోల్భణంతో కెన్యా ప్రజలు కిందామీదా పడుతున్నపుడు, పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరిగి వినిమయ శక్తి క్షీణిస్తున్నపుడు -ఈ బిల్లు వచ్చింది. 

నిత్యావసర వస్తువుల మీద విలువ ఆధారిత పన్నును (Value added Tax -VAT) పెంచటం; డిజిటల్ సేవలు, బ్యాంకు లావాదేవీలు, చమురుల మీద కొత్త పన్నుల విధింపు; ఎగుమతి అయి వచ్చిన వస్తువుల మీద పెద్ద ఎత్తున లెవీలు; పర్యావరణానికి అపాయకరంగా కనిపించే వస్తువుల మీద ‘పర్యావరణ లెవీ’ విధింపు ప్రతిపాదనలు – ఈ బిల్లులోని కీలక అంశాలు. ఆర్థిక స్థిరత్వానికి; ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాలు, సామాజిక కార్యక్రమాల కోసం కావాల్సిన నిధుల కోసం ఈ విధింపులు తప్పనిసరి అని ప్రభుత్వం వాదించింది. కానీ ఈ బిల్లు తెచ్చిన సందర్భమూ, దాని పరిధీ -తమ జీవనోపాధుల మీద ప్రత్యక్ష దాడిగా చాలామంది కెన్యా ప్రజలు భావించారు. 

కెన్యా దేశపు అప్పు భారాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా 2.7 బిలియన్ల డాలర్ల పన్నులను పెంచటాన్ని ఈ ఆర్థిక బిల్లు లక్ష్యంగా పెట్టుకొన్నది. 2024 జూన్ కి, ఆ దేశపు జీడీపీలో 68 శాతంగా కెన్యా ప్రజల అప్పు పెరిగింది. ఈ శాతం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ నిర్దేశించిన 55 శాతం కంటే చాలా ఎక్కువ. వడ్డీ చెల్లింపులే కెన్యా దేశపు ఆర్థిక రాబడిలో 37 శాతాన్ని మింగేస్తున్నాయి. ఈ పరిణామాల ఫలితంగా ఐఎంఎఫ్ రంగంలోకి దిగి -ఇంకో విడత ఆర్థిక సహాయం పొందటానికి అర్హత సాధించే ముందు, పన్నుల్ని పెంచి లోటును తగ్గించమని కెన్యా ప్రభుత్వాన్ని కోరింది (డిమాండ్ చేసిందని అర్థం చేస్తుకోవాలి).      

అప్పు సంక్షోభం      

2021లో ఐఎంఎఫ్ ఇచ్చిన కోవిడ్-19 అప్పుల మీద సమీక్ష చేస్తూ, 33 ఆఫ్రికా దేశాలు తమ దేశాల్లో పొదుపు  విధానాలను అమలు చేస్తున్నాయని ఆక్స్ ఫామ్ సంస్థ చెప్పింది. పొదుపు విధానాలను అమలు చేయటం వలన పేదరికం, అసమానత్వం మరింతగా పెరుగుతాయని ఐఎంఎఫ్ స్వయాన తన సొంత పరిశోధన ద్వారా తెలియచేసింది. 2020 ఏప్రిల్ లో కోవిడ్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మూసేసినపుడు, దక్షిణ ప్రపంచ దేశాల నుండి 1.2 ట్రిలియన్ల డాలర్ల అప్పు కావాలనే అభ్యర్థనల ప్రభంజనాన్ని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు అందుకొంటున్నాయి. అప్పుల్ని మంజూరు చేయటానికి ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు అంగీకరించాయి. అయితే అప్పులు ఇవ్వటానికి  ‘మితిమీరిన నిబంధనలూ, సబ్సిడీలూ, లైసెన్సుల పాటింపూ, వ్యాపార భద్రతా, చట్టపరమైన అడ్డంకులూ వున్న దేశాల విషయంలో -వాటి మార్కెట్ల అభివృద్ధి, అవి కోలుకొనే సమయంలో త్వరితగతిన వృద్ధి చెందే అవకాశాల గురించి ఆయా దేశాలతో కూర్చొని మాట్లాడాలి’ అనే షరతును ఈ సంస్థలు పెట్టాయి. ఇంకో మాటలో చెప్పాలంటే నయా ఉదారవాదాన్ని పెంచుతామని చెప్పటమే ఆ షరతుకు అర్థం. 

ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పేదరికం పెరుగుతుండటం కారణంగా నయా ఉదారవాదానికి దారి తీసే పొదుపు  విధానాలను అమలు చేయాలనే డిమాండును ఐఎంఎఫ్ చేయకూడని ఆక్స్ ఫార్మ్ అంతర్జాతీయ సంస్థ 2022 ఏప్రిల్ లో ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారా పట్టుబట్టింది. ఆక్స్ ఫార్మ్ సంస్థ చెప్పిన దాని ప్రకారం ఐఎంఎఫ్ కున్న 15 అప్పుల కార్యక్రమాల్లో 13 కార్యక్రమాలు అప్పులు ఇవ్వటానికి -రెండో విడత కోవిడ్ కాలంలో ఆఫ్రికా దేశాలతో చర్చలు జరిపాయి. ఆహారం, చమురు మీద పన్నులు విధించటం ద్వారా, నిధులను తగ్గించి కీలక ప్రజా సేవలను ప్రమాదంలో పడేసేలాంటి కఠిన విధానాలను అమలుజరపటం చేయాలని ఆయా దేశాలతో మాట్లాడాయి. 

2021లో 2.3 బిలియన్ డాలర్ల అప్పుకు కెన్యా, ఐఎంఎఫ్ లు ఒక అంగీకారానికి వచ్చాయి. 3 సంవత్సరాల పాటు పబ్లిక్ సెక్టార్ లో జీతాలను పెంచకుండా ఉండటం; వంట గ్యాసు, ఆహారం మీద పన్నులను పెంచటం ఈ అప్పుకు షరతులుగా వున్నాయి. ఆ సమయానికి 30 లక్షల మంది కెన్యా ప్రజలు విపరీతమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు. కోవిడ్ వలన వచ్చిన దయనీయ పరిస్థితులతో పాటు, దశాబ్దాలుగా వర్షాలు పడకపోవటం వలన వినాశకరమైన కరువు దేశమంతా అలుముకొని వుండింది. ఆక్స్ ఫార్మ్ సంస్థ చెప్పిన దాని ప్రకారం కెన్యా కుటుంబాలలో సగం కుటుంబాల దాకా అప్పు చేసి ఆహారాన్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అవే పరిస్థితులు కెన్యా పొరుగు దేశాలైన కామెరోన్, సెనెగల్, సురినామ్ లలో కూడా ఉన్నాయి. ఆ దేశ ప్రజల మీద VAT ను విధించమని ఐఎంఎఫ్ నిర్దేశించింది. దాని ఫలితంగా ఆ దేశ ప్రజల పేదరికం మరింత పెరిగింది.

సుపరిచిత నమూనా                 

ఐఎంఎఫ్ అప్పుల విషయంలో ఎప్పటి నుండో అందరికీ సుపరిచితమైన నమూనానే ఇది. ముఖ్యంగా దక్షిణ ప్రపంచ దేశాల్లో ఈ నమూనా అమలు అవుతోంది. హటాత్తుగా చెల్లింపుల సమస్య వస్తుంది. గల్ఫ్ ప్రాంతంలో చమురు సంక్షోభం రావటం, లేకపోతే చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఉగ్రవాద దాడులు జరగటం లాంటి ఘటనల వలన ఈ సమస్య ఉన్నట్లుండి ముందుకు వస్తుంది. తగ్గిపోతున్న విదేశీ నగదు నిల్వలను తిరిగి భర్తీ చేసుకోవటానికి పరిష్కారంగా ప్రభుత్వం ఐఎంఎఫ్ అప్పును కోరుతుంది. కఠిన పొదుపు విధానాలు, ఖచ్చితమైన ఆర్థిక క్రమశిక్షణ, ప్రజల మీద పెట్టే ఖర్చును తగ్గించటం, ద్రవ్యోల్భణం అదుపు లాంటి కఠోర ఆర్థిక నిర్దేశాలు వెనువెంటనే అమలు ఆవుతాయి. ఈ పరిణామాలన్నీ దేశ ఆర్థిక పెంపుదల అనే పేరుతోనే జరుగుతాయి. 

వాస్తవానికి ఐఎంఎఫ్ నిర్దేశిస్తున్న షరతులు శాశ్వతమైన పరిష్కారాలను ఇవ్వటం చాలా అరుదుగా జరుగుతుంది. పరిష్కారం రాకపోగా ఆర్థిక దాడికి ఈ షరతులు దారులు వేస్తూనే వుంటాయి. అసలే అప్పుల్లో వున్న ఈ దేశాలను అమెరికా, ఇంగ్లాండ్, ఐరోపా కూటమి దేశాల్లోని బహుళజాతి ఆర్థిక బడా సంస్థలు దోపిడి చేయటానికి అనుమతినిస్తాయి. చౌక ముడి పదార్థాల సరఫరాదారులుగా, తక్కువ వేతనాలకు పని చేసే కార్మికుల వనరులుగా ఈ దేశాలు దిగజారిపోతాయి. బ్రెట్టన్ వుడ్స్ కవలలుగా అందరికీ తెలిసిన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులకు ఒక లక్ష్యం వుంది. దక్షిణ ప్రపంచ దేశాలను పాశ్చాత్య ఆర్థిక, పారిశ్రామిక బహుళజాతి సంస్థలకు ఆటస్థలాలుగా మార్చే లక్ష్యం అది. బయటకు చెప్పకపోయినా, అందరికీ అర్థం అయ్యే లక్ష్యమే అది. ఈ విధానాల అమలు దక్షిణ ప్రపంచ దేశాలను పదేపదే గ్లోబల్ వాల్యూ చైన్ లో కిందకు తోసేస్తుంది.

పైన చెప్పిన విధమైన పద్ధతే కెన్యాలో మొదలైయ్యింది. పాలకపక్ష ధనికులు అమితమైన విలాస జీవితాలను గడుపుతూ, (మే 2024న, అధ్యక్షుడు విలియం రూటో అమెరికా వెళ్లటానికి ఖరీదైన రాయల్ జెట్ విమానాన్ని దుబాయ్ నుండి కిరాయికి తీసుకొన్నాడు. గంటకు 2.4 మిలియన్ల కెన్యా షిల్లింగులు, అంటే 18000 డాలర్ల ప్రజాధనం దీని కోసం ఖర్చు పెట్టాడు) ప్రపంచ పెట్టుబడి ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాడు. ఈ ప్రపంచ పెట్టుబడి వాల్ స్ట్రీట్ నుండీ, లండన్ నుండీ, ఫ్రాంక్ ఫర్ట్ నుండీ, నిహోన్ బషీ కబుటో-చో (జపాను ఆర్థిక కేంద్రం), షాంఘయ్ ల నుండి వెలువడుతుంది. కెన్యా ఖనిజ, ఖనిజేతర వనరులను అమెరికా, ఐరోపా, ఇంగ్లాండ్, చైనాలాంటి పెట్టుబడి శక్తులు స్వాధీనం చేస్తుకొంటున్నాయి. సోడా యాష్, జెమ్ స్టోన్లు, టిటానియం, ఫ్లోర్ ఫ్లర్, బంగారం, ముడి ఇనుము, అరుదైన భూగర్భ వనరులను విదేశీ సంస్థల ప్రయోజనాల కోసం మెల్లిమెల్లిగా తవ్వి తీస్తున్నారు. అత్యధిక నాణ్యత గలిగిన బంగారం, రాగి, ఇల్మెనైట్, టిటానియం వనరులకు కెన్యా గనుల సెక్టారు ప్రసిద్ధి గాంచింది.    

కెన్యా జీడీపీలో మైనింగ్ సెక్టారు ఒక్క శాతంగానే వుందనే ఇప్పటి వాస్తవం -ఈ దేశం ప్రపంచ పెట్టుబడికి గొప్ప ఆకర్షణగా మారటానికి కారణం అయింది. అంటే ఇంకా అనంతమైన తవ్వని ఖనిజ సంపద కెన్యాలో ఉందని అర్థం. కెన్యా వనరుల భూభాగం మీద అమెరికా, ఐరోపా, చైనా దేశాల మధ్య భయంకరమైన పోటీని రేకెత్తించటానికి ఈ వాస్తవమే కారణం.       

కెన్యా సంపదను అమెరికా, ఇంగ్లాండ్ లు ఎప్పటి నుండో దోపిడీ చేస్తుండగా, చైనా ఇప్పుడు కొత్త భాగస్వామిగా రంగప్రవేశం చేసింది. చైనా వలన ఎంత వాణిజ్య లోటు కెన్యా ఎదుర్కొంటున్నా కూడా ప్రస్తుతం చైనానే కెన్యా ప్రధాన వాణిజ్య భాగస్వామిగా వుంటోంది. చైనా ప్రభావం కెన్యా మీద ఎంతగా వుందంటే -మౌలిక సదుపాయాల అభివృద్ధిలోనూ, భద్రతా సహకారంలోనూ, రాజకీయంగా పార్టీల మధ్య ఇచ్చిపుచ్చుకోవటాల మీద కూడా -ఒక రకమైన రాజకీయ సూక్ష్మ నిర్వహణను పోలిన ఒడంబడికలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ చైనాకున్న అత్యాశతో కూడిన ప్రపంచ లక్ష్యాలకు కెన్యాను దగ్గర చేస్తున్నాయి. ముఖ్యంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు ద్వారా చైనా ఈ లక్ష్యాలకు చేరువ కావాలనుకొంటుంది. 

ఈ నేపథ్యంలో ఈ 2024 ఆర్థిక బిల్లు రొట్టె (బ్రెడ్డు) మీద 16 శాతం వాల్యూ యాడెడ్ టాక్సును ప్రవేశపెట్టింది. ఇంకా కెన్యా డిజిటల్ ఆర్థిక రంగంలో మూలస్తంభంగా వుంటున్న మొబైల్ నగదు బదిలీల మీద పన్నును పెంచింది. కారు యాజమానుల మీద 2.5% కొత్త సాంవత్సరిక పన్నును ప్రవేశపెట్టింది. ‘పర్యావరణ నష్టం’ అనే పేరుతో రోజూ వాడే కవర్లు, ప్లాస్టిక్కులు, డయాఫర్లు, సానిటరీ పాడ్స్, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల మీద అన్ని రకాల పన్నులను వడ్డించింది. కొన్ని రకాల ఆర్థిక సేవలు, విదేశీ మారకం మీద కూడా ఈ బిల్లు 16 శాతం వాట్ పన్నును విధించింది.       

ఆహారం, ప్రజలు కష్టపడి పొందే సంపాదన లాంటి ప్రాధమిక అవసరాలను ప్రభుత్వాలు ప్రజలకు అందనీయకుండా చేస్తే ప్రజల్లో నిరసన పెరిగి, కోపం కట్టలు తెంచుకొంటుందని అధ్యయనాలు తెలియ చేస్తున్నాయి. ఈ అశాంతి తక్షణ అర్జీలు ఇవ్వటంతో ముగిసిపోదు. నిరుద్యోగం, ఉపాధి లేకపోవటం, పేదరికం, ఇళ్లు లేకపోవటం, భూమి లేకపోవటం లాంటి వాటికి సంబంధించి ఎన్నో విషయాలలో పెద్ద ఎత్తున ఆగ్రహం రావటానికి ఈ అశాంతి వాహకంగా వుంటుంది. కెన్యాలో బ్రెడ్డు, డిజిటల్ మనీ లాంటి అత్యవసర విషయాల మీద పన్ను పెంపుదల -అన్ని సమూహాల్లో ఉన్న ప్రజలను వీధుల్లోకి తీసుకొని రావటానికి నిప్పురవ్వలాగా పని చేసింది. ఈ నిరసనలు అధ్యక్షుడు విలియం రూటో ప్రవేశపెట్టిన 2024 ఆర్థిక బిల్లును నిర్మొహమాటంగా తిప్పికొట్టే శక్తివంతమైన తిరస్కరణలు అయ్యాయి.  

నిరసనోద్యమాలు-తదనంతర పరిణామాలు  

2024 ఆర్థిక బిల్లుకు వ్యతిరేకంగా కెన్యా పౌర సమాజం, యువ కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలు వెనువెంటనే సమాయత్తం అయ్యారు. సామాజిక మాధ్యమాల వేదికలను విరివిగా వుపయోగించుకోవటం వలన  -సమాచారాన్ని వేగంగా అందిపుచ్చుకొని, అన్ని రకాల పరికరాలను వాడుతూ కార్యరంగంలోకి దూకమని పిలుపునిచ్చారు. #RejectFinanceBill2024, #OccupyParliament లాంటి హాష్ టాగ్స్ బాగా ప్రచారం అయ్యాయి. క్షేత్రస్థాయిలో అసంతృప్తి వుందనే సంకేతాన్ని ఇచ్చాయి.  

కెన్యా ప్రజా అసంతృప్తుల్లో కొన్ని  

1.     ఈ బిల్లు రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లను, వాళ్లు ఎలాంటి త్యాగాలు చేయనక్కరలేకుండా తప్పించుకొనేటట్లు చేసి -సామాన్య పౌరులను, చిన్నచిన్న వ్యాపారస్తులను ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ఇబ్బంది పెట్టింది. 

2.     రొట్టె, చమురు, పరిశుభ్రత కోసం వాడే అత్యవసరమైన వస్తువులు లాంటివి చాలా ప్రియం అయ్యాయి. అధిక పన్ను వడ్డింపు నుండి చిన్నపిల్లలకు వాడే డయాఫర్లకు కూడా మినహాయింపు రాలేదు.

3.      ఎప్పటి నుండో ఉన్న అవినీతి, నిర్వహణా లోపాలను పట్టించుకోకుండా చేసిన కొత్త పన్ను ప్రతిపాదనలు ప్రజలను ప్రభుత్వం పట్ల విముఖుల్ని చేశాయి. 

4.     బిల్లు ముసాయిదాను తయారు చేసేటప్పుడు ప్రజలతో అర్థవంతమైన సంప్రదింపులు చేయలేదు.

5.     ప్రభుత్వం ప్రతిపాదించిన పన్నులు సమాజంలో అన్ని వర్గాల వాళ్లను ప్రభావితం చేశాయి. అయితే పేదలు, శ్రామికవర్గం ఎక్కువగా బాధితులు అయ్యారు. 

2024 జూన్ 18న కెన్యా రాజధాని నైరోబీలో నిరసనోద్యమాలు మిన్నంటాయి. అవి ప్రధాన నగర ప్రాంతాలైన మొంబసా, కిసుము, ఎల్డోరెట్, నకూరులకు వెనువెంటనే వ్యాపించాయి. యూనివర్సిటీ విద్యార్థుల నుండి సంఘటిత కార్మికసంఘాల వారు, వృత్తి విద్యానిపుణులు ఈ నిరసనోద్యమంలో పాల్గొన్నారు. ఆర్థిక దిగ్బంధనం మీద సామూహిక ఆగ్రహం వారందరినీ ఐక్యం చేసింది. సామాన్య కెన్యా ప్రజలు ఎదుర్కొంటున్న బాధల నుండి రాజకీయ వర్గం దూరం జరగటం ఒక వాస్తవం. 

మొదట్లో ఎప్పటిలాగానే ప్రదర్శనలు, ధర్నాలు, శాంతియుతంగా ర్యాలీలు జరిగాయి. నిరసనకారులు ప్లకార్డులు పట్టుకొని, పాటలు ఆడుతూ, బిల్లును ఖండిస్తూ, దాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమీకరణ కోసం, ఇంకా ప్రపంచ ప్రజలకు తమ అసంతృప్తిని తెలియచేయడానికి డిజిటల్ వేదికలను వాడుతూ -యువత నాయకత్వ పాత్రను తీసుకోవటం ఆసక్తికరం.  

నిరసనలు ఊపందుకోగానే, రాజ్య బలగాలతో ఘర్షణలు తరచుగా జరిగేవి. పోలీసులు టియర్ గ్యాస్ ను, నీటి ఫిరంగులను, ఒక్కోసారి తూటాలను కూడా ప్రయాగించేవాళ్లు. మితిమీరిన పోలీసు బలగాల ప్రయోగం, గాయాలు, మరణాల వార్తలు బయటకు వచ్చి, ఉద్రిక్తతలు పెచ్చరిల్లి -జాతీయ, అంతర్జాతీయ మానవహక్కుల సంస్థల ఖండనల వరకూ వెళ్లాయి. 

కెన్యాలో నిరసన ఉద్యమాలు జరుగుతున్నపుడు ఆస్తుల ధ్వంసం, దోపిడీలు అప్పుడప్పుడు జరిగేవి. అయితే అలాంటి ఘటనలను ఆందోళనను నడిపిస్తున్న వారు వెంటనే ఖండించేవారు. పోలీసు బలగాల ప్రవర్తన విషయంతో సహా ప్రభుత్వం చేస్తున్న చట్టవ్యతిరేక, అణచివేత చర్యల పట్ల న్యాయమైన ఆగ్రహాన్ని వ్యక్తీకరిస్తూనే -ఏకాగ్రతతో, క్రమశిక్షణతో మెలగాలని నిరసనకారులను వాళ్లు ఎప్పడూ కోరేవాళ్లు. బిల్లు పార్లమెంటులో పాస్ అవకముందే నుండే దాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ‘ఏడు రోజుల ఆగ్రహం’ అనే బ్యానర్ తో ప్రదర్శనకారులు ర్యాలీ అయ్యారు. #RejectFinanceBill2024, #RejectFinanceBill2024#, #TotalShutdownKenya అనే హ్యాష్ టాగ్స్ ను వాడుతూ చక్కటి క్రమశిక్షణతో కూడిన ఆన్ లైన్ ఉద్యమాలు నడిపారు.

క్రూర నిర్బంధం 

నైరోబీలో కొంతమంది ఆందోళనకారులు ఉవ్వెత్తున పార్లమెంటు భవనానికి నిప్పంటించే ప్రయత్నం చేశారు. దేశ ఆర్థిక పరిపుష్టత కోసం ఈ బిల్లు జారీ అవటం కీలకమని చెబుతూ అధ్యక్షుడు విలియమ్ రూటో, ఇంకా అతని అధికార వర్గం మొదట్లో ఈ ఆర్థిక బిల్లును సమర్థించారు. ప్రభుత్వ ప్రతినిధులు చర్చలకు ఆహ్వానిస్తూ, సహనంగా ఉండాలని ప్రజలను కోరారు. అయితే పతాక స్థాయికి చేరిన ప్రజాగ్రహం మధ్య ఈ అభ్యర్థనలు నీళ్లు కారిపోయాయి.

నిరసనోద్యమాలు ఉధృతి అయ్యే కొద్దీ, ప్రభుత్వం రెండు అంచెల పద్ధతులను అవలంబించింది. ఒక పక్క బుజ్జగిస్తూనే, దండ ప్రయోగం సాగించింది (carrot and stick method). 2024 ఆర్థిక బిల్లులో వివాదాస్పద అంశాలని మారుస్తామని చెబుతూనే, శాంతి భద్రతల పేరుతో భద్రతా బలగాలను మోహరించింది. బలగాలను ఉపయోగించటం వలన ప్రజా సెంటిమెంటు మరింత రగులుకుని -అది ఆఫ్రికన్ యూనియన్, ఐక్యరాజ్య సమితి, పాశ్చాత్య దౌత్యవేత్తలు లాంటి అంతర్జాతీయ పర్యవేక్షకుల దృష్టిలో పడిందని జర్నలిస్టులు, పౌర ప్రతినిధులు వార్తలు రాశారు. మానవ హక్కులకు గౌరవం ఇచ్చి, సంయమనం పాటించాలనే పిలుపులు సర్వత్రా వినిపించాయి. 

ఎంత వ్యతిరేకత వచ్చినా, బిల్లు ప్రయోజనాలను, లోపాల గురించి చర్చ చేస్తూనే -పార్లమెంటు శాసన ప్రక్రియతో ముందుకు పోయింది. శాసనకర్తలకు తమ తోటి సభ్యుల నుండే విపరీతమైన వత్తిడి వచ్చింది. కొంతమంది తమ అసమ్మతిని తెలియచేయడానికి తమ సొంత పార్టీలతోనే సంబంధాలు తెంచుకొన్నారు. 

రోజుల తరబడి చర్చలు జరిగి, పార్లమెంటు వెలుపల జరిగిన నిరసనోద్యమాల మధ్య, బిల్లును ఓటింగు కోసం పెట్టారు. 204 మంది మద్దతుతో, 115 మంది వ్యతిరేకతతో తీవ్రతను కొద్దిగా తగ్గించే మార్పులతో ఆర్థిక బిల్లు పాస్ అయింది. చమురు, ఆహారం, డిజిటల్ సేవలు లాంటి వాటి మీద పన్నుల పెంపులో ఎలాంటి మార్పూ లేదు. 

బిల్లు వెంటనే పాస్ అవటం ప్రభుత్వ వర్గాలకు పెద్ద ఉపశమనం కాగా, ప్రజలలో ఆగ్రహం అలాగే కొనసాగింది. బిల్లు తిరస్కరణ డిమాండ్ నుండి ఇంకా పైకి వెళ్లి -ప్రధానంగా జవాబుదారీతనం, పారదర్శకత కోరుతూ, ఇంకా ముఖ్యంగా ప్రెసిడెంట్, ఇతర కీలక అధికారుల రాజీనామాను కోరుతూ -రోజుల తరబడి నిరసనలు జరిగాయి. పోలీసు, భద్రతా దళాల నిర్బంధం వలన కెన్యా అంతటా తక్కువలో తక్కువ 23 మంది ప్రజలు చనిపోయారు. వందలాది మందికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. 

జూన్ చివరకు పోలీసు క్రూరత్వాన్ని, విచ్చలవిడిగా జరిగిన అరెస్టులను, అనేకానేక మరణాలను మానవ హక్కుల సంస్థలు గ్రంథస్థం చేసాయి. విచారణలను జరిపిస్తామని, జవాబుదారీతనంగా ఉంటామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ కెన్యా వివాదాస్పద చరిత్రను పరిశీలిస్తే అలాంటి వాగ్దానాలు ఇచ్చిన మరు సంవత్సరంలో మఫ్టీ దుస్తుల్లో పోలీసులు కిడ్నాపులు, అపహరణలు, క్రూర అణచివేతలు, న్యాయాతీత హత్యలు జరుపుతారని తెలుస్తుంది. 

ఈ నిరసనలు, కొత్త పన్నుల ప్రభావం త్వరలోనే బయటపడింది. వాణిజ్యానికి అంతరాయం కలిగింది. రాజకీయ అస్థిరత్వం మధ్య పెట్టుబడులు పెట్టటానికి పెట్టుబడిదారులు సంశయించారు. కుటుంబాల మీద, చిన్నచిన్న వ్యాపారాల మీద అదనపు భారం పడి జీవన వ్యయం పెరిగిపోతూనే ఉండింది. 

కెన్యా రాజకీయాల మీద ఈ ఆర్థిక బిల్లు సంక్షోభం కీలకం మలుపని రుజువు అయ్యింది. ఈ బిల్లు పాలక పక్ష పార్టీల కూటముల మధ్య పునర్వ్యవస్థీకరణకు దారి తీసింది. పాలక పక్ష కూటమి నుండి చాలమంది పార్లమెంటు సభ్యులు దూరం జరిగారు. ప్రతిపక్ష పార్టీలు ఊపందుకొన్నాయి. ఆర్థిక విధానాల రూపకల్పనలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించటానికి చట్టపరమైన సంస్కరణలు జరగాలనే పిలుపులు ఇచ్చారు. రాజకీయ కార్యకర్తలు -ముఖ్యంగా యువకులు, విద్యార్థులు -ప్రతిపక్ష పార్టీల అసలు రంగును అర్థం చేసుకోవటం మొదలుపెట్టారు. ఈ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ప్రజాగ్రహాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని వాళ్లు గ్రహించారు. ఆందోళనకారులు తమ ఉద్యమాన్ని నిలబెట్టుకోవటానికి, వీధి పోరాటాలకతీతంగా తమ నాయకుల జవాబుదారీతనాన్ని కాపాడుకోవటానికి దారులు వెతకటం మొదలుపెట్టారు. 

టెక్నాలజీ పాత్ర 

2024 నిరసనోద్యమాలలోని చెప్పుకోదగిన చాలా అంశాల్లో ఒకటి యువత భాగస్వామ్యం, అది టెక్నాలజీని సృజనాత్మకంగా వాడుకొన్న విధానం. ట్విటర్, టిక్ టాక్, వాట్స్ అప్ లాంటి వేదికలు ఊహాత్మక పట్టణ కూడళ్లయి -తమ ఆలోచనలనూ, కోపాలనూ, వ్యూహాలను ఒకరికొకరు పంచుకొన్నారు. చిన్న చిన్న నాటికలు, విస్తృతంగా ప్రచారం అయ్యే వీడియోలు, లైవ్ లో ప్రసారం చేసే వార్తలు -ఇవన్నీ ఉద్యమాన్ని బలోపేతం చేశాయి. అంతేకాదు అంతర్జాతీయ సంఘీభావాన్ని, మీడియా దృష్టినీ ఆకర్షించాయి.  

ప్రభుత్వం జరుగుతున్న దాన్ని సులభంగా అదుపు చేయలేదనీ, అసంతృప్తిని అణచివేయలేదనీ ఈ డిజిటల్ యాక్టివిజం రుజువు చేసింది. కెన్యాలోనూ, ఇంకా ఆఫ్రికా ఇతర దేశాల్లో రాబోయే సామాజిక వుద్యమాలకు ఈ యాక్టివిజం నమూనాగా నిలిచిపోయింది. ఆయా దేశాల్లో సాంప్రదాయక మీడియాను, రాజకీయ మార్గాలను మూసివేశారు. అలాకాక పోతే గట్టిగా అదుపు చేశారు.    

బిల్లు ఉపసంహరణ 

కెన్యాకు అంతర్జాతీయ అభివృద్ధి భాగస్వామ్యులతో, పెట్టుబడీదారులతో ఎంత దగ్గరి సంబంధాలు వున్నాయంటే -దేశంలోని ఈ అశాంతి బయట దేశాల్లో తెలియకుండా పోలేదు. ఐక్యరాజ్య సమితి, యూరేపియన్ యూనియన్, అమెరికాలు అక్కడ జరిగిన హింస మీద ఆందోళనను వ్యక్తం చేశాయి. సంప్రదింపులు జరపాలని సూచించాయి. మానవ హక్కుల భగ్నాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని దాతృత్వ సంస్థలు వాళ్లు అప్పటికే ఇచ్చిన సహాయాన్ని  మళ్లీ సమీక్షిస్తామని బెదిరించాయి. అయితే అసలు విషయం -ఐఎంఎఫ్ నిర్దేశించిన కార్యప్రణాళిక తిరుగులేని విధంగా భగ్నం అయిందనీ, ప్రపంచ ప్రత్యర్థులు ఈ పరిస్థితిని అదునుగా తీసుకొంటాయని అమెరికా, యురేపియన్ యూనియన్ లు బెంగపడ్డాయి.   

తూర్పు ఆఫ్రికా ప్రాంతం కెన్యా రాజకీయ నాటకాన్ని దగ్గరగా చూసింది. ఆ ప్రభావాలో, అలాంటి తిరుగుబాట్లో తమ దేశాల్లో కూడా వస్తాయని కొన్ని దేశాలు భయపడ్డాయి. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వ్యవస్థల ద్వారా కెన్యా ఆర్థికరంగాన్ని తమ చెప్పుచేతల్లో వుంచుకోవచ్చుననే తమ దీర్ఘకాల ప్రణాళికను -యువత, విద్యార్థులు నాయకత్వం వహించిన ఈ ప్రజా ఉద్యమం ధ్వంసం చేస్తుందని భయపడి, తాత్కాలికంగా వెనక్కి తగ్గమని -అమెరికా, ఇంగ్లాండ్ దేశాలు కెన్యా ప్రభుత్వం మీద వత్తిడి చేశాయి. ఆ దేశాల ఆదేశం మేరకు అధ్యక్షుడు రూటో ‘ప్రజలు ఇంకా రాయితీలు ఇమ్మని మమ్మల్ని కోరుతున్నారు. ప్రజల మాట వింటున్నాం’ అని చెబుతూ బిల్లును ఉపసంహరించాడు.      

నిర్బంధ వాతావరణం 

2024 ఆర్థిక బిల్లు నిరసనోద్యమాల తరువాత, ముఖ్యంగా యువతలో రాజకీయ అవగాహన, ప్రజా కార్యాశీలత  పెరగటం కెన్యా గమనించింది. ప్రభుత్వ బిల్లు ఉపసంహరణ రాయితీగా కనిపించినా, నిజానికి అదొక వ్యూహాత్మక తిరోగమనం అని తరువాత రుజువైయ్యింది. 2024 నిరసనలకు, అశాంతికి -అధ్యక్షుడు విలియం రూటో అధికార యంత్రాంగం మరింత అణచివేతతో ప్రతిస్పందించింది.  

ఆర్థిక విధానాల మీద యువతతో, ఇతర ఉద్యమ భాగస్వామ్యులతో సంప్రదింపులు జరుపుతామనే ప్రభుత్వం వాగ్దానాలు చేసినప్పటికీ అలాంటి ప్రయత్నలేమీ సాకారం కాలేదు. దానికి బదులుగా ప్రభుత్వం బలగాలను ఉపయోగించి అదృశ్యాలను, రాత్రికి రాత్రే అపహరణలను చేస్తూ, దాడులను తీవ్రం చేసింది. నిరసనలలో పాల్గొన్న విద్యార్థులనూ, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేసింది. 

ప్రధానంగా ప్రభుత్వాన్ని విమర్శించే వారి అపహరణలు, చట్టాతీత అదృశ్యాలలో కలవపెట్టే పెంపుదలను మానవహక్కుల సంస్థలు నివేదించాయి. అలాంటి ఘటనలు 2024 నిరసనలలో కనిపించినా, ఆ ఘటనల సంఖ్య తీవ్రంగా పెరిగిపోయింది. ఆల్ జజీర లెక్కల ప్రకారం 2023 సెప్టెంబర్, 2024 ఆగస్టుల మధ్య 44% ఈ ఘటనలు పెరిగాయి. మిస్సింగ్ వాయిస్ అనే పేరుగల ఒక గ్రూపు 159 చట్టాతీత హత్యలు, అదృశ్యాలను రికార్డ్ చేసింది. మావహక్కుల పైన పని చేస్తున్న కెన్యా నేషనల్ కమిషన్ (KNCHR) 82 అపహరణల కేసులను డాక్యుమెంట్ చేసింది. వాటిల్లో 29 కేసులు ఇంకా పరిష్కారం కాలేదు. 

ఎలాంటి గుర్తులు లేని జేబుల్లో, మఫ్టీలో ఉండే పోలీసులు వచ్చి బాధితులను అపహరించుకొని పోవటం వలన ప్రభుత్వ భద్రతా బలగాలను అనుమానించాల్సి వచ్చింది. కేసులు పెరుగుతున్నా, జవాబుదారీతనం శూన్యం. భయానక వాతావరణం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను తీవ్రంగా అణచివేసింది.

రూటో మొదట ఈ అదృశ్యాల గురించి తనకేమి తెలియదని బుకాయించాడు. తరువాత జరుగుతున్నాయని గుర్తించినా ప్రభుత్వ ప్రమేయాన్ని తిరస్కరించాడు. ‘నేరస్తులను, విధ్వంశకర శక్తులను’ చట్టప్రకారమే అరెస్టు చేశామని చెప్పాడు. అయితే వ్యక్తులను టార్గెట్ చేసి, నిర్బంధించే పద్దతుల్లో ఒకేలాంటి నమూనాలు ఉండటం గురించి హక్కుల సంఘాలు ఎత్తి చూపాయి. ఈ అపహరణలు చట్ట వ్యతిరేకమని తీర్మానిస్తూ కెన్యా న్యాయవ్యవస్థ -భద్రతా బలగాలు చట్ట నియమాలకు లొంగి ఉండాలని ఆదేశించింది. అయినా ఆ వ్యవస్థ వంచనాపూరితంగానే వుంది.          

నిర్భంధాల మధ్య కూడా యువత వీధుల్లోకి పునరాగమనం 

2024 కెన్యా నిరసనోద్యమంలో క్రూరమైన నిర్బంధం జరిగి ఏడాది అయిన తరువాత, దేశం ఆర్థిక సంక్షోభంలోనే కొనసాగుతూనే వుంది. యువత మళ్లీ వీధుల్లోకి వచ్చింది. జూన్ తిరుగుబాటు సాంవత్సరిక ఉత్సవాలు జరుపుతుండగా, ప్రభుత్వం పయోగించిన హింసలో ప్రాణాలు పోగొట్టుకొన్నవారిని స్మరిస్తూ కెన్యా అంతటా ప్రదర్శనలు రాజ్యమేలాయి. 

ఈ ఏడాది జూన్ 8న, ఆల్ బెర్ట్ ఒజ్వంగ్ అనే ప్రముఖ బ్లోగర్ మరణం తరువాత అశాంతి మళ్లీ రాజుకొన్నది. అధ్యక్షుడు విలియం రుటోని సామాజిక మాధ్యమాల్లో విమర్శించినందుకుగాను అతన్ని ఇంటి నుండి అపహరించుకొని వెళ్లారు. తరువాత అతను పోలీసు నిర్బంధనంలో చనిపోయి కనిపించాడు. అతని మరణం ఎల్లెడలా ఆగ్రహాన్ని రాజేసింది. ప్రధానంగా నైరోబిలో పెద్ద ఎత్తున్న నిరసనలు పెట్రేగాయి. కెన్యాలోని రెండవ స్థాయి పోలీసు అధికారి రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రజా వత్తిడి పెరిగింది.

దీని తీవ్రత జూన్ 25వ తేదీకి తారస్థాయికి చేరింది. ఆ రోజుకి 2024 నిరసనోద్యమాలు జరిగి సరిగ్గా ఏడాది అయింది. ‘రూటో గో బాక్’ అంటూ ఆందోళనాకారులు నినదించారు. పోలీసులు భాష్ప వాయువులను, నీటి గోళాలను, తూటాలను ప్రయోగించారు. ఘర్షణలు పెరిగాక జరిగిన పోలీసు కాల్పుల్లో తక్కువలో తక్కువ 16మంది హత్యకు గురయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. 

పత్రికా స్వేచ్ఛ అణచివేతలో భాగంగా నిరసనల లైవ్ కవరేజిని ఆపేయమని కెన్యా కమ్యూనికేషన్ అథారిటీ ఆదేశించింది. ప్రభుత్వ హింసను ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయటాన్ని ఆపుతూ, ఏడు రేడియో స్టేషన్లను ప్రసారం చేయనీయకుండా చేసింది. మఫ్టీ పోలీసు అధికారులు, కిరాయి గూండాలు నిరసన ప్రదర్శనలలోకి చొచ్చుకొని వచ్చి, ఉద్యమానికి అపకీర్తి తీసుకొని రావటానికి లూటీలు, విధ్వంసాలు చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. అసమ్మతిని అణగదొక్కటానికి అందరికీ తెలిసిన వ్యూహమే ఇది.       

ఎంత హింసను ప్రయోగించినా, ఈ ప్రదర్శనలు కెన్యాలోని 47 కౌంటీలకు పాకాయి. వర్గ స్ఫృహతో, నిగూఢంగానైనా ఇవి పెరుగుతున్నాయని ఈ సంఖ్య సూచిస్తుంది. 

ఇంతకుముందు ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ కెన్యా’ పేరుతో ఉన్న పార్టీ, 2024 చివరలో ‘కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ -కెన్యా’ గా పేరు మార్చుకొని ఈ అలజడులలో గట్టిపాత్రను పోషించింది. సంస్కరణ శక్తులతో చేతులు కలపటం విషయంలో అంతర్గత చర్చల తరువాత, పార్టీలో ఆధిపత్యంలో ఉన్న గ్రూపు ‘దిద్దుడు కార్యక్రమం’ ద్వారా మార్క్సిస్ట్ -లెనినిస్టు విధానాల మీద తన నిబద్ధతను నొక్కి చెప్పింది. సరిగ్గా అర్థం చేసుకోవటానికి ఈ పరిణామాలను ఇంకా అధ్యయనం చేయాల్సి వుంది.  

బ్రిటిష్ వలసవాద వారసత్వంగా, కెన్యాలో వేళ్లూనికొని ఉన్న భూ అసమానత్వం ఈ దేశపు పేదరికానికి కీలక ప్రేరకంగా కొనసాగుతూనే ఉంది. బ్రహ్మాండమైన వ్యవసాయోగ్య భూమిని ఒక చిన్న ధనిక సమూహం అదుపు చేస్తుంది. స్వాతంత్ర్యం తరువాత వచ్చిన కెన్యా పెట్టుబడిదారులు, వలసవాద ప్రభావంతో తమ రూపు రేఖలను రూపొందించుకొని, సామ్రాజ్యవాద ప్రయోజనాలను నెరవేరుస్తూనే వున్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కేంద్రంగా ఒక సరికొత్త పెట్టుబడిదారీ వర్గం పుట్టుకొచ్చింది. ఇది పాశ్చాత్య పెట్టుబడికి గట్టిగా కట్టుబడి వున్నది.       

ఈ పరిస్థితుల్లో దేశంలోని భూస్వామ్య కులీనులకు, సామ్రాజ్యవాదులతో అంటకాగుతున్న దళారీ పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా స్థిరమైన పోరాటం నడపటానికి కెన్యా శ్రామిక వర్గం, భూమిలేని రైతులు, ఇంకా ఇతర విప్లవ శక్తులు ఐక్యం కావాల్సి వుంది. ఇదంతా కమ్యూనిష్టు పార్టీ బ్యానర్ కిందనే జరగాలి. స్పష్టమైన విప్లవ యుద్ధతంత్రం, క్రమశిక్షతో కూడిన వ్యూహం లేకుండా దీర్ఘకాలం మనగలిగే విముక్తిని కెన్యా ప్రజలు సాధించలేరు.    

విజయ శేఖర్ LICలో పని చేస్తారు. 'జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ' అనే బ్లాగ్ ను నిర్వహిస్తారు. పొలిటికల్ ఎకనామిక్స్ ఆయనకు ఇష్టమైన సబ్జెక్టు.

Leave a Reply