కూలిన నీడలు!

‘అమ్మా…’

‘ఊ!’

‘చెట్లకు ప్రాణం వుంటుందామ్మా…’

‘ఎందుకుండదు?’

‘ప్రాణం వుంటే పాపం చాలా నొప్పి వేసుంటుంది కదమ్మా?’

‘చచ్చిపోయాయి కదా, యింక నొప్పి వుండదు…’

పిల్లవాడి నొప్పి గ్రహించి వూరడించడానికి ఆ మాట అంది తల్లి. ఎండకు మాడు మాడిపోతూవున్నా కొడుకు నెత్తిన కొంగు కప్పి నడుస్తూ వుంది.

‘అమ్మా… నీ కొంగు నాకు గొడుగు కదా?’

‘ఊ…’

‘చెట్లు వుండి వుంటే, నీకూ నాకూ- మనలా నడిచేవాళ్ళందరికీ- గొడుగు పట్టేవి కదా?’

‘ఊ…’

రోడ్డు పక్కన నేలకు వొరిగివున్న చెట్లను చూస్తూ లెక్కపెట్టడం మొదలుపెట్టాడు పిల్లవాడు.

‘ఒకటీ రెండూ మూడూ నాలుగూ…’

‘నిన్నా మొన్నా కూడా లెక్కపెట్టావు కదరా… పద’

‘ఊ… మొత్తం డబ్బై శవాలు!’

‘………………………………’

‘హంతకుడికి శిక్షలుండవా అమ్మా?’

‘హు…’

నిట్టూర్చింది తల్లి. పిల్లవాడు తల్లి కొంగు వదిలి పరుగునవెళ్ళి వేళ్ళతో పెకిలించిన చెట్లను తడిమాడు. కోసేసిన కాండాల్నీ కొమ్మల్నీ తడిమాడు. తెగిన కొన్ని చెట్లనుండి జిగురులాంటి పదార్ధం చిమ్ముతోంది. చేతివేళ్ళతో ఆ తడిని అంటుకొని చూశాడు.

‘రా…’

‘ఇది రక్తమా అమ్మా?’

‘……………………….’

‘లేకపోతే యేడుస్తోందా?’

‘……………………….’

‘ఈ చెట్లన్నీ మనుషులయితే?’

‘పగ ఫలసాయంగా వచ్చేది!’

‘ఈ చెట్లకు నోళ్ళుంటే?’

‘గొంతెత్తి అరిచేవి!’

‘ఈ చెట్లకు చేతులుంటే?’

‘కనీసం తమని చంపకుండా అడ్డుకోనేవి. తిరగబడేవి!’

‘ఈ చెట్లకు కాళ్ళుంటే?’

‘ఎక్కడికన్నా పారిపోయి బతికేవి!’

‘ఈ చెట్లకు రెక్కలుంటే?’

‘ఎక్కడికన్నా యెగిరిపోయి వాలేవి!’

నేలమీద పడివున్న పచ్చని ఆకుల్ని చేతుల్లోకి తీసుకున్నాడు పిల్లవాడు. సున్నితంగా వేలితో తాకాడు. అప్పటికే ఆ ఆకులు యెండపడి రంగుమారుతూ నల్లగా చుట్టుకుపోతున్నాయి.

‘ఎండ పెరుగుతోంది పద వెళ్దాం’

‘చెట్లు కొట్టేస్తే యెండలు పెరగవా అమ్మా’

‘మ్…’

‘అమ్మా… చచ్చిపోయాక నొప్పి వుండదు సరే, చంపేసేటప్పుడు?’

‘……………………………’

‘అమ్మా… యీ చెట్లకింద మనుషులు సేద తీరినట్టే, చెట్లమీద పక్షులు వాలివుంటాయి కదా?’

‘ఊ…’

‘ఎన్నో గూళ్ళు వుండివుంటాయి కదా?’

‘ఊ…’

‘ఆ పక్షులు యేమయివుంటాయి?’

‘ప్చ్…’

‘మనమిప్పుడు యింటికి వెళ్ళేసరికి మన యిల్లు లేకపోతే?’

‘ఆ…?’

‘భయమేస్తోంది కదమ్మా?’

‘ఊ… చాలా…’

‘పాపం చిన్ని బుజ్జిబుజ్జి పక్షి పిల్లలు బాగా యేడ్చి వుంటాయి కదమ్మా?’

‘………………………..’

‘వాళ్ళ అమ్మానాన్నా ఆహారం సంపాదించడానికి యెక్కడికో వెళ్ళుంటాయి కదా?’

‘ఔను…’

‘వచ్చేసరికి యిల్లుండదు. పిల్లలుండరు. బాగా యేడ్చేవుంటాయి కదా?’

‘………………………..’

‘గుడ్లు చితికిపోతే తల్లిపక్షి యెంత తల్లడిల్లిపోయి వుంటుందో?’

‘………………………..’

‘గూళ్ళు లేకుండా చేశారు కదా?’

‘హు…’

‘వొక్కో పుల్లా పుటకా వెతికి యెక్కడెక్కడినుండో ముక్కున కరుచుకొని తెచ్చి గూడు అల్లుకోవాలంటే, మళ్ళీ చాలా టైం పడుతుంది కదా?’

‘ఊ… శ్రమకూడా!’

‘ఒక మొక్క చెట్టు కావడానికి యెన్నో యేళ్ళు పడుతుంది కదా?’

‘ఊ… యేళ్ళకు యేళ్ళు… కొన్నితరాలు!’

‘అమ్మా… మరి చెట్లకు కోపం రాదా?’

‘అవి మనుషులు కాదు!’

‘కానీ చెట్లకు కోపం రావాలమ్మా… లేదు, చాలా చాలా… బోలెడంత కోపం రావాలి!’

‘ఎందుకు?’

‘కోపం వస్తే కార్బండయాక్సైడ్ తీసుకోవడం మానేసి ఆక్సిజన్ తీసుకొని, కార్బండయాక్సైడ్ యివ్వాలి… రివర్స్ యిస్తే అప్పుడు తిక్క కుదురుతుంది’

‘అది మనకు ప్రమాదకరం కదా?’

‘అయితే అవ్వనీ, చెట్లకు జరిగిన ప్రమాదం మనుషులకు తెలియాలి కదా?’

‘కొందరు చేసిన పనికి అందరికీ శిక్ష పడాలా?’

‘తప్పు చేసిన కొందరికి శిక్ష పడనప్పుడు- అందరూ దాన్ని అనుభవించాల్సిందే!’

‘………………………..’

‘ముందుగా అశోకుని మీద కేసు పెట్టాలి!’

‘మధ్యలో ఆయనేం చేశాడు?’

‘రోడ్డుకు యిరువైపులా చెట్లు నాటించాడు కదా?’

‘బాగుంది…’

నిట్టూర్పుగా తలూపుతూ చూసింది తల్లి. పిల్లవాడు యేదో ఆలోచిస్తున్నాడేమో తల్లి వంక చూడనే లేదు. అడ్డంగా తలూపుతూ-

‘అటు రోడ్డు పక్కన చెట్లు నాటిన వాళ్ళనీ శిక్షించక, యిటు చెట్లు కూల్చిన వాళ్ళనీ శిక్షించక…’

‘పాదచారులకే శిక్ష!’

‘అందరికీ పడుతుంది శిక్ష!’

‘ఎలా?’

‘చెట్లు కొట్టేస్తే యెండలు పెరుగుతాయి కదా?’

‘ఔను…’

‘వర్షాలు పడవు, భూమిలో నీళ్ళు యింకవు…’

‘నిజమే…’

‘అమ్మా… మనం తినే తిండి కూడా మొక్కలనుండి చెట్లనుండి వొస్తుంది కదా?’

‘వస్తుంది…’

‘అమ్మా… మనం వాడే ఔషదాలు కూడా మొక్కలనుండి చెట్లనుండి వొస్తాయి కదా?’

‘వొస్తాయి…’

‘మనం వేసుకొనే బట్టలు కూడా…’

‘ఔను…’

‘మరి చెట్టుని నరికినవాడు?’

‘……………………………..’

‘యాంటీ సోషల్ యెలిమెంట్!’

‘అమ్మా… చెట్లని నరికితే ఫైన్ వుందిగా?’

‘ఫైన్ కట్టకపోతే జైలు శిక్ష కూడా వుంది!’

‘డబ్బులు వున్న వాళ్ళు ఫైన్ కట్టేయవచ్చని తప్పులు చేస్తారేమో?’

‘ఏమో?’

‘తినొచ్చూ తినకూడదని తెలియని యే ఆవులో మేకలో గొర్రెలో ఆకుల్ని తింటే కర్రతీసి కొడతారు కదమ్మా?’

‘ఊ!’

‘డబ్బై చెట్లని తినేసిన పశువుని వొక్క దెబ్బన్నా కొట్టాలి కదమ్మా, కనీసం బెత్తం దెబ్బన్నా?’

‘హు…’

నిట్టూర్చింది తల్లి. పిల్లవాడి వంక చూసింది. వాడు వొరిగిన చెట్టు మొదులు మీద బోర్లా పడుకున్నాడు, తల్లి గుండెలమీద బబ్బున్న పసివాడిలా! చెట్టు వేళ్ళని చేత్తో పట్టుకొని-

‘అమ్మా… అసలీ చెట్లని యెందుకు నరికారు?’

‘అదిగో… ఆ భవంతులు కనపడాలని!’

‘చెట్టుకొమ్మల సందుల్లోంచి చూసినప్పుడు ఆ భవంతి కనిపించీ కనిపించక బావుండేది. ఇప్పుడు బోడిగా… యెవడు చూస్తాడమ్మా?’

‘వాడి భవంతి వాడిష్టం’

‘చెట్లు నావి… అందరివీ…’

‘నీవెలా?’

‘నేనూ మా బడి పిల్లలం అందరం చదువు పక్కన పెట్టి యెండలో వెళ్ళి మొక్కలు నాటాం తెలుసా?’

‘……………………………..’

‘హరితహారంలో మా చేతులూ నొప్పి పుట్టాయి. మా కాళ్ళు పీకాయి. మేం మొక్కలకు నీళ్ళు పోసాం. పేర్లు కూడా పెట్టాం’

‘ఏం చేస్తాం చెప్పు?’

‘మరెందుకమ్మా పేపర్లలో టీవీల్లో యీ గ్రీన్ ఛాలెంజ్‌లు?’

‘……………………………..’

‘ఓ మొక్కని వుడిచి గొప్పైపోవడం కాదు, యిలా చెట్లు నరికేసినప్పుడు కదా యీ హీరోలూ హీరోయిన్లూ లీడర్లూ ఛాలెంజ్‌లు చెయ్యాలి?’

‘……………………………..’

‘ఎవరూ యెందుకు మాట్లాడరు?’

‘దేవుడు చూసుకుంటాడు… పద పోదాం…’

‘చెట్టూ చేమా ప్రకృతీ… మన దైవం అంటావు, మరి డబ్బై దేవుళ్ళని నరికేసాడా?’

‘తప్పు… అలా మాట్లాడకూడదు’

‘పోనీ… చెట్లు కూల్చేసినట్టు వాడి భవంతి కూల్చేస్తే వూరుకుంటాడా?’

‘వాడు మంత్రి. అంటే రాజు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా?’

‘నేనూ తలచుకుంటున్నాను…’

‘ఏమని?’

పిల్లవాడు నవ్వాడు. వాడు యేదేదో వూహిస్తూ నవ్వుతున్నాడు. ఆ తల్లికి అంతుపట్టడం లేదు. కొడుకుని చూస్తూ-

‘ఏమని తలచుకుంటున్నావ్?’

‘ఓ పెద్ద మేకలా… ఓ పెద్ద గొర్రెలా… ఓ పెద్ద అడ్డగేదెలా… యింకా పెద్ద దున్నపోతులా…’

చెప్తూ నవ్వుతున్నాడు పిల్లవాడు. ఆ తల్లి భయంగా చుట్టుపక్కల చూసింది. మళ్ళీ కొడుకుని చూసింది.

‘చూడు… చెట్లని యెలా తినేస్తోందో…’

ఏమీ కనపడక బెదురుతూ ఆందోళనతో అలజడితో కొడుకునే చూస్తూ తల్లి. తన వూహ వంక చూస్తూ నవ్వుతూ పిల్లవాడు!

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. నాలుగు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. అల్లిబిల్లి కథలు పిల్లల కథా సంపుటం. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- ఇంకా జాతీయాల మీద వచ్చిన పురాణ పద బంధాలు, పిల్లల సమస్యల మీద వచ్చిన ఈ పెద్దాళ్ళున్నారే వంటి పుస్తకంతో ఇరవైయ్యేడు వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’ కాలమ్స్ కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

9 thoughts on “కూలిన నీడలు!

  1. చాలా బాగుంది రాసేవారిలో వార్తను కథగా ఎలా మలచొచ్చునో చక్కగా చెప్పారండీ

  2. Super జగదీష్ ….కూలిన చెట్టు వెనకాల కానరాని వ్యతలెన్నో….

  3. Trees are living beings…They may not be able to protest, 0r bribe… Very well written Jagadiswara Rao…Will that politician read and will it move him in any manner? I do not think so.

  4. Trees are living beings…They may not be able to protest, 0r bribe… Very well written Jagadiswara Rao…Will that politician read and will it move him in any manner? I do not think so. Chetla badhani ela cheppavachho raasi chupincheru…

  5. గొప్ప రచన. బజరా మాత్రమే రాయగల కథ.

  6. Excellent one sir —mallareddy stupid -corrupted minister -needs to go

  7. Excellent one sir —MALLAREDDY stupid -corrupted minister—needs to go

  8. బజరా 80ల్లో కొత్తగా కథలు రాసి చదివి వినిపించినప్పుడు ఎంత హాయిగా కొత్తదనం ఉట్టిపడేదో అదే ధోరణి ఈ కూలిన చెట్లు కథనం చదువుతుంటే అవే జ్ఞాపకాలు అదే హాయి అనిపించింది అదే అతని స్పెషాలిటీ.

  9. కదిలించే రచన ఇది , వృక్షాక్రోశం బలంగా చెప్పగలిగారు. బజరా కు ధన్యవాదాలు. చదవటం ఆలస్యమైంది.

Leave a Reply