సాయత్రం రెండు తూనీగలు నా గది కిటికీ పక్కనుంచి ఎగిరాయి
ఒక్కోసారి ఢీకొంటూ
మరోసారి రెక్కలతో సుతారంగా ఒకదాన్నొకటి తాకుతూ
ఇంకోసారి దూరంగా ఎగిరిపోయి ఒకదాన్నొకటి కవ్వించుకుంటూ
ఇంకొన్నిసార్లు రికామిగా గాలిలో తేలిపోతూ
ఇంతకీ అవి హద్దులకోసం కొట్లాడుకుంటున్నాయో
లేక ప్రేమలో ఉన్నాయో?
చెట్టునుంచి రాలిన ఆకు
ఆఖరి ఆసరా అయిన పేవ్మెంటును వదల్లేక
దాని పొరల్లోకి ఇంకిపోయి, చివరికి
అందరూ తొక్కుకుంటూపోయే నీడగా మిగిలినట్లు
కడతేరి పోతోంది మరో యుగం
ఇంతకీ నీకు చెప్పాలనుకున్నది
మోహ కొట్లాటల గురించో
కుళ్లి మరుపున పడిపోతున్న యుగాల గురించో కాదు
ఊపిరితిత్తులని కోసేస్తూ
నిప్పులబంతై మేలుకున్న ఈ రాత్రి గురించి
ఈ రాత్రి సముద్రాన్ని
ఇక ఎన్నటికీ చేరలేని నది గురించి
గొంతెండిపోయిన ఆ నది నెర్రెల్లో తలలు ఆకాశానికి ఎత్తి
ఊపిరాడక ఎండిపోయిన చేపల గురించి
దేశభక్తిని పీల్చుకుని
ఎండిన ఆ చేపల మధ్య విరిసిన కమలం మత్తులో
గర్వంగా జోగుతున్న కోట్లాదిమంది జనం గురించి
ఆ జనం సాక్షిగా
ఇప్పటిదాక కప్పుకున్న ముసుగులను పీకి అవతలికి గిరాటేసి
పీడకుడికి బిగికౌగిలినిస్తున్న నయాఉదారవాదం గురించి
ఆ పీడకుడి గుప్పిట్లోని చల్లని వెన్నెల
అందరికీ అందాలని గొంతెత్తినందుకు
సంకెళ్లు బలి తీసుకుంటున్న కలల గురించి
పాలపుంత నీడలో ఆ కలల ఏకాంతాన్ని
పాడుతున్న కీచురాళ్ల గురించి
కలలంటే ఏమో అనుకున్నావేమో
కలలంటే
చచ్చిపోయిన అడవిని తన రెక్కలమీద మోస్తున్న ఓ సీతాకోకచిలుక
గుబులెందుకు? విను, విను, చూడు, విను
పురారణ్యాల్లోని జీవనది ఒకటి
ఆ సీతాకోకచిలుక గుండెలో ఇంకా హోరెత్తుతూనే ఉంది
ఇదీ కవిత్వం!! అసలుసిసలైన ప్రశ్నల జడివాన