కాళీపట్నం రామారావు అట్టడుగువర్గాల జీవన సమస్యలను ఎంత సూక్ష్మంగా చూడగలిగిన రచయితో చెప్పే కథ ‘జీవధార’. తాగునీటి సమస్య అతిసాధారణ శ్రామిక జనజీవితాలను ఎంత సంక్షోభానికి లోను చేస్తున్నదో, దానిని పరిష్కరించుకొనటానికి ఎప్పటికప్పుడు మనుషులు తమదైన మార్గంలో ఎట్లా పోరాటశీలురు అవుతున్నారో చూపిన కథ ఇది. భూమి పొరలనుండి, కొండ వాగుల నుండి ఉబికివచ్చి ప్రవహించే ప్రకృతి సహజ వనరు అయిన నీళ్ల పై కొందరిపెత్తనం ఎలా స్థిరపడిందా అని ఆలోచించే దిశగా ప్రేరేపిస్తుంది ఈ కథ.
జీవధార కథ పందిగుట్ట పాక ప్రజల త్రాగునీటి సమస్య ను చిత్రించింది. పందిగుట్టపాక అప్పుడే మహానగరంగా ఎదుగుతున్న విశాఖపట్నంలో ఒక శ్రమజీవుల ఆవాస ప్రాంతం. వాసిరెడ్డి నవీన్ ప్రోద్భలంతో ఈ కథ వెనుక కథ గురించి వ్రాస్తూ తను జనాభా లెక్కల వ్రాస్తున్న సందర్భముగా చూసిన సన్నివేశాన్ని కథగా మలిచానని చెప్పాడు రామారావు. మంచినీటి కోసం బడుగు ప్రజలు పడుతున్న ఇబ్బందులను తన సహచరుల ద్వారా విన్నవీ, వార్త పత్రికలలో వచ్చిన నీటి సమస్యల కథనాలు చదివీ పొందిన అవగాహన ఈ కథ వెనక ఉంది. 1971 సెప్టెంబర్ లో స్వాతి పత్రికలో ఈ ఈ కథ ప్రచురణ అయ్యే నాటికి శ్రీకాకుళ ఉద్యమం సెట్ బ్యాక్ అయింది.
1970 ఫిబ్రవరిలో విశాఖపట్నంలో జరిగిన షష్టిపూర్తి సభలో రచయితలారా మీరు ఎటువైపు? అంటూ విశాఖ విద్యార్థులు వేసిన కరపత్రం తెలుగు సాహిత్య రచయితలను రెండుగా చీల్చింది. రచయితలు అనివార్యంగా పాలక వర్గం వైపో, ప్రజల వైపో తేల్చు కోవలసిన సందర్భం వచ్చింది.ప్రజల వైపు నిలబడ్డ రచయితలు 1970 జూలై 4 వ తేదీన విప్లవ రచయితల సంఘంగా ఏర్పడ్డారు. అలా ఏర్పడ్డ విప్లవ రచయితల సంఘం వ్యవ స్థాపక సభ్యుడుగా కాళీపట్నం రామారావు కథా వస్తువును ఇంతకు పూర్వంలాగా తనకు బాగా తెలిసిన మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల నుండి కాక, శ్రామిక బహుజనుల జీవితాల నుండి స్వీకరించి కథలుగా మలిచే నిబద్ధతకు ఒక గుర్తు జీవధార. ఒక విధంగా జీవధార విప్లవ కథే. విప్లవ కథ అంటే ప్రజల వాస్తవ జీవితాన్ని చిత్రిస్తుంది. అనవసరమైన కల్పనలకు విప్లవ కథలో ఆస్కారం ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే సమాజంలోని ఉత్పత్తి సంబంధాలను చిత్రిస్తుంది. ఆ ఉత్పత్తి సంబంధాల మూలాన్ని విశ్లేషిస్తుంది.
వ్యవసాయ సంబంధాలలో తీవ్రతరమైన సంఘర్షణ కారణంగా వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు పల్లెలను వదిలి పనులు వెతుక్కొంటూ పట్టణాలకు వచ్చారు. చేలూ చెలకల మధ్య, చెరువులమధ్య గాలికి, వెలుతురుకూ బతికిన జనం పట్టణపు ఇరుకుపాకల లో చేరారు. ఒకవైపు పెరుగుతున్న సంపదకు, ఈ ఇరుకు పాకలకు మధ్య వ్యత్యాసాన్ని కళ్ళకు కడుతూ మూలకారణాల వైపు పాఠకుల ఆలోచనను మళ్లించే మంచి కథ జీవధార.
విశాఖపట్నంలో సముద్రపు గాలి తగిలే దూరంలో ఒక కూలి వాడ ఉన్న ప్రాంతం పంది గుట్ట. ఆ వాడలోని 50, 60 పాకల వాళ్ళకు కేవలం ఒక కొళాయి ఉంది. దాని ద్వారా వచ్చే నీరే ఆ పాకల వాళ్ళు వాడుకోవాలి. ఆ నీళ్ళతోటే తమ అవసరాలు తీర్చుకోవాలి. ఆ నీళ్లు సరిపోనప్పుడు వాళ్ళలో వాళ్ళు ఘర్షణ పడుతారు, కొట్టు కుంటారు, కేసులు పెట్టుకుంటారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతారు తప్ప తమ సమస్యకు కారణాలు వెతుక్కోరు.
ఉన్నఆ ఒక్క కొళాయి దగ్గరికి అమ్మాజీ నీళ్ల కోసం వస్తుంది. అప్పటికే ధార సన్నగా అవుతుంది. ఇక లాభం లేదనుకొని సత్యవతి సూచన మేరకు అమ్మాజీ తవిటమ్మతో కలిసి ఆమెతో రావు బంగాళాకు నీళ్ళ కోసం వెళ్తుంది. రావు భార్య, తల్లి ఇద్దరూ వాళ్ళు నీళ్లు పట్టుకెళ్ళటానికి ఒప్పుకోరు. తోటమాలి వాళ్లకు వత్తాసు.
నీళ్ల కోసం తమ ఇంటి మీదికి వచ్చిన అమ్మ్మాజిని , సత్యవతిని, తవిటమ్మను మా ఇంటి మీదికి వస్తే ఏం లాభం? మీరు పోయేదేదో మున్సిపాల్టీ వాళ్ళ మీదికి పోండి అని రావు తల్లి నిలువరించే ప్రయత్నం చేస్తుంది. అది వాళ్ళ మీదికి కుక్కను ఉసిగొల్పేందుకు సిద్ధమయ్యే వరకు పోతుంది. బిందెడు నీళ్లకోసం ప్రాధేయపడుతూ ఉన్నవాళ్లు కుక్కను మీదికి వదులుతామని వాళ్లంటే ఉక్రోషం పట్టలేక ఏదీ వదలండి చూద్దాం అంటూ ఎదురు సవాల్ చేస్తూ యాగీకి దిగారు. అప్పటికే మున్సిపాలిటీ కొళాయి నీళ్లు ఆగిపోయి ఖాళీ బిందెలతో వెనుదిరుగుతున్న తోటి స్త్రీలను కుక్కను వదులుతామని అంటున్నారు చూడండి అని అరచి చెప్తుంటే వాళ్లేమో అక్కడ నీళ్లు దొరుకుతాయి రమ్మంటున్నట్లుగా అర్ధమై అందరూ వచ్చి చేరారు. వాళ్ళల్లో అప్పాయమ్మ చేసిన మధ్యవర్తిత్వంతో ఆపూటకు తలా ఒక బిందెడు నీళ్లు తీసుకు వెళ్ళటానికి వాళ్లకు అనుమతి దొరికింది. అందరూ కదిలినా అమ్మాజీ, సత్యవతీ కదల్లేదు. ‘బతకటానికి ముందు గంగ కావాల, ఆ తరవాత పంతాలూ పట్టింపులూ, అని వాళ్ళను కూడా కదలమని హెచ్చరించింది. వాళ్ళ నీళ్ళ సమస్య అప్పటికి తీరింది. రెండవ బిందె నీళ్లకు మళ్ళీ ఏ గుమ్మం ఎక్కాలి? ఎవరిని వేడుకోవాలి? అన్న సమస్య వాళ్లకు ఉండనే ఉంది. అందువల్ల కథ మళ్ళీ మొదటికి వస్తూనే ఉంటుంది. ఇలా ఎన్నాళ్ళు అంటే కడవరకు… అన్న మాట తో కథ ముగుస్తుంది.
జీవధార కథ లో ఘటన ఒకటే అయినా పొరలు పొరలు గా దానిచుట్టూ నిర్మితమైన జీవితం సంక్లిష్టమైన సామాజిక ఆర్ధిక అసమానతల వ్యవస్థ ను వ్యాఖ్యానిస్తుంది. దీనిని మూడు కోణాలనుండి చూడవచ్చు.
- వర్గ వ్యత్యాసాలు
- కూలివాడ జనజీవితం
- నీటి సమస్య – మహిళా సమస్య
వర్గవ్యత్యాసాలు:
ఈ కథలో పంది గుట్ట అంచున ఫర్లాంగ్ ఫర్లాంగ్ దూరంలో లేచిన పేదవాళ్ల వాడలు మూడూ కలిసి కూలివాడ. ఈ కూలివాడ కు రోజూ ఉదయం పదిగంటల తరువాత ఒక గంటా గంటన్నరపాటు నీళ్లు వచ్చే ఒకే ఒక కుళాయి నీళ్లు దొరకనప్పుడు కూలివాడ ఆడవాళ్లు నీళ్లకు వెళ్లి గేటు తెరవమని వేడుకొంటూ సాగిలపడేది రెండంత స్తుల భవంతి ముందు. యాభై అరవై ఇళ్ల వాళ్లకు రోజుకు గంటా గంటన్నర మాత్రమే విడవబడే నీళ్లు ఆ భవంతిలోని ఒక్క కుటుంబం వాళ్లకు లైను తెరిచి ఉన్నంతసేపూ వస్తూనే ఉంటాయి. నీళ్లను ఇంజన్ తో ట్యాంకులకు ఎక్కించుకొని ఆ ఒక్క కుటుంబం సమృద్ధిగా ఉపయోగించుకోగలదు. చుట్టూ తోటలు కూడా పెంచుకోగలదు.
నీళ్లు ఒకరు ఉత్పత్తిచేసే వస్తువు కాదు. దానికోసం ఫ్యాక్టరీలు కట్టక్కరలేదు. జీతాలు ఇచ్చి కార్మికులను నియోగించనక్కరలేదు. అది ప్రకృతిసహజ వనరు. కానీ దానిని పంపిణీ చేయటంలో ఉన్న వ్యత్యాసాలే కూలివాడ మహిళలను రెండంతస్తుల భవనం గేటు ముందుకు తెచ్చాయి. వాళ్లకు కరువైన నీళ్లు అక్కడ సమృద్ధిగా ఉన్నాయి. కరువును, సమృద్ధిని ఎదురెదురుగా నిలపటం ద్వారా కరువు కు సంపదకు మధ్య కార్యకారణ సంబంధాన్ని ఆలోచించమంటాడు రచయిత.
ఆలోచించటానికి ఆధారాలు అమ్మాజీ కారణంగా ప్రస్తావనకు వచ్చిన పదేళ్ళక్రితపు ఘటనలో ఉన్నాయి. వాళ్ళు నీళ్లకోసం వెళ్లిన బంగళా యం.పి. రావు ది. ఆయన ఏదో ఇంగ్లిష్ కంపెనీ లో పెద్ద మేనేజర్. ఇంగ్లిష్ కంపెనీ అనే మాట విదేశీ పెట్టుబడులు ఉన్న కంపెనీని సూచిస్తుంది. పదేళ్లక్రితం ఆయన హోదా ఇంతపెరగలేదు. ఇక్కడ జాగా కొనుక్కొన్నాక పందిగుట్ట అంచులో ఉన్న కూలి వాడల్లోకి కాలినడకన వచ్చాడు. నీళ్ళూ నిప్పులూ అక్కరలేదా అంటూ పలకరించాడు. మహజర్లు రాసి వాళ్ళ వేలిముద్రలు తీసుకొన్నాడు. దగ్గరుండి ఏ కొళాయి ఎక్కడ పెట్టించాలో, ఏ దీపం ఎక్కడపెట్టాలో అక్కడ పెట్టించే ఏర్పాటు స్వయంగా ఉద్యోగుల వెంట ఉండి చేయించాడు. ఆరునెలల తరువాత తాను కొన్న స్థలంలో ఇల్లు మొదలు పెట్టాడు. మున్సిపాలిటీ కొళాయి నీళ్లతో, పెట్టించిన విద్యుద్దీపాల వెలుగులో, అక్కడ ఉన్న 50, 60 పాకల ఆడామగా కూలిచేయగా మూడునెలలలో ఆ బంగాళా పూర్తయిందని ఆ కథనం సారాంశం.
మహానగరానికి పంది గుట్టకు మధ్య పాతిక ముప్ఫయి ఎకరాల పెద్ద మట్టి దిబ్బ. మూడుపక్కలా నగరం తాకిన దిబ్బ అది. నీటి సదుపాయం లేకపోవటం వల్ల నాల్గోపక్క ఇళ్లు లేవలేదు. దానిని అభివృద్ధి చేయాలనుకున్నాడు రావు . ఆ వైపున దిబ్బ అంచు వెంబడి వున్న పాతరోడ్డు మీద చౌకగా స్థలాలను కొని వసతుల పరికల్పనద్వారా వాటి విలువ పెంచి ఆస్తిగా అభివృద్ధి చేసుకొనటమే అభివృద్ధి అంటే. నీరు, విద్యుత్ దీపాల సౌకర్యం వసతుల పరికల్పనలో భాగమే. ఇందుకు అతనికి పనికివచ్చినవాళ్లు అక్కడ పాకలువేసుకొని ఉన్న బడుగు బలహీన వర్గాల జనం. వాళ్ళ కోసం అని మొదలుపెట్టి తాను కొన్న స్థలాలకు అనుకూలంగా ఏర్పాట్లు చేసుకొన్నాడన్నమాట. ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం అంటే ఇదే. ఆ రకంగా వచ్చిన కుళాయి నీళ్ళ తోనే రావు బంగళా నిర్మాణం మొదలుపెట్టాడు. కొళాయి, విద్యుత్, రోడ్లు తెప్పించాడనే భావనతో ఎక్కువో తక్కువో పాకల కూలీ వాళ్ళు బంగాళా పని చేసారు. అమ్మాజీ నాన్నా కూడా వడ్రంగి పని చేసాడు.
కొళాయి రావడం వలన బంగాళా నిర్మాణానికి నీళ్ళు దొరికాయి. ఆ దీపాల వెలుతురులోనే పనులు చకచకా జరిగిపోయి బంగాళా నిర్మాణం మూడు నెలలలోనే పూర్తయింది. నీటి కొళాయి, విద్యుత్ రావడం వలన పదేళ్లలో అక్కడి భూముల ధరలు పెరిగాయి. అప్పటికే భూములు కొనిపెట్టుకున్న రావు ఆస్తి విలువ పెరిగింది. ఒక విధంగా రావు బాగుపడ్డాడు. కానీ పాకల వాళ్ళ జీవితాల్లో ఈ పదేళ్లలో ఎలాంటి మార్పు లేదు. నిజానికి పాకల వాళ్ళ అవసరాలను తీర్చాలన్న ప్రజాప్రయోజన దృష్టి అతనికేమీ లేదు. వాళ్ళ అవసరాన్ని ముందు బెట్టి ప్రభుత్వ అనుమతులను తీసుకురావటం పూర్తిగా తన అవసరాల కోసమే.
పాకల వాళ్ళకోసం ఏర్పాటుచేసిన కొళాయి కూలివాడలో లేదు. వాడను విడిచి వాడను ఒరుసుకొంటూ ఎత్తుకుపోయే రోడ్డుమీద ఉంది అని రచయితే చెప్తాడు. పాకలు దిగువగా గుట్ట వార గోతిలో ఉండగా కొళాయి ఎత్తుకుపోయే రోడ్డుమీద ఉందంటే నీటి పైపులైన్ వేయటంలో, కొళాయి పాయింట్లను గుర్తించటంలో ఎత్తుమీద ఉండే వాళ్ళ ప్రయోజనాలే ప్రాధాన్యం వహించాయాన్నది స్పష్టం. ఉద్యోగులుగా ప్రభుత్వ వ్యవస్థలను ప్రభావితం చేయగల వర్గాల ప్రయోజనాలకు అనుకూలంగానే పనులు జరిగిపోతుంటాయన్నది జగమెరిగిన సత్యం. రావు వాళ్లకు ప్రతినిధి. కూలివాడ ఇళ్ళన్నిటికీ ఒక కొళాయి పెట్టించి తన ఒక్క ఇంటి కోసమే మరొక కొళాయి ఏర్పాటు చేసుకొనటంలోనే రావు ఎలాంటివాడో అర్థమవుతుంది. ఆధిపత్య శక్తులు తమ తమ ప్రయోజనాలను ప్రజల ప్రయోజనాలుగా ప్రచారం చేసి ,తమ ప్రయోజనాలను నేరవేర్చుకుంటారు. రావు చేసింది అదే.
పైగా నీళ్లు పట్టుకొంటాము అని అడగవచ్చిన వాళ్లను లేదు పొమ్మని విసిరి కొట్టటమే కాక మాట వినటం లేదని ఆ పాకల వాళ్ళ మీదికి కుక్కలను వదులుతామని బెదిరించగల సంస్కారం ప్రదర్శిస్తారు రావు ఇంటిల్లిపాదివారు. అసమానతల వ్యవస్థలో ఆస్తిపరవర్గాలు ఎలా ప్రవర్తిస్తాయో చూపిస్తారు. ఎక్కడయితే సంపద పోగుపడుతుందో అక్కడ అనేక దౌర్జన్యాలు ఉన్నాయని అర్థం. అక్కడ శ్రమ దోపిడీ జరుగుతుందని అర్థం. అక్కడ చౌకగా శ్రమ కొనబడుతుందని అర్థం. రావు ఇల్లు కట్టేటప్పుడు పని జరిగినంత కాలం అణా బేడా ఎక్కువో తక్కువో పాకల్లో కూలీలందరూ అక్కడే పనిచేశారు అని రచయిత చెప్పిన మాట గమనిస్తే అది వాస్తవమే అనిపించక మానదు. అట్లా శ్రమను చౌకగా కొంటూ ఆస్తులు పోగేసుకొనే వర్గం తమ ఆస్తుల రక్షణ కోసం, వ్యక్తిగత రక్షణ కోసం తాము చెబితే వినని శ్రామికుల మీద దౌర్జన్యాలు చేయడం కోసం కుక్కలను, పోలీసులను, చట్టాన్ని, న్యాయస్థానాన్ని, రాజ్యాంగ యంత్రాలను, రాజ్యాన్ని వాడుకొంటుంది. ఒక విధంగా రాజ్యం ఏర్పడిందే ఇలాంటి దోపిడిదారుల రక్షణకోసం.
అమ్మాజీ తండ్రి రావు ఇంటిపనిలో వడ్రంగం పని చేసినవాడు. అతను ఒకసారి అమ్మాజీని తీసుకొని ఆయనదగ్గరకు వెళ్లి ఆ అమ్మాయి ఎప్పుడైనా వస్తే బిందెడు నీళ్లు పట్టుకు పోవటానికి అనుమతి ఇయ్యమని కోరాడు. ఆయన తన కుమారుడికి ఈ అమ్మాయి ఎప్పుడయినా నీళ్ళకు వస్తే ఒక బిందెడు పట్టుకోనియ్యి అని చెప్పటంలో అతని బూర్జువా మనస్తత్వమే కనబడుతుంది. ఎందుకంటే ఆ నీళ్ళు ఆయనవి కాదు. తనవి కాని నీళ్ళ పై ఆధిపత్యం సంపాదించి అవసరంలో ఉన్నవాళ్లకు దయాధర్మంగా ఇయ్యగల అధికారస్థానం చేరుకొనటం లోని వైరుధ్యం అది.
తమ శ్రమతో తన ఇంటి నిర్మాణములో పాలు పంచుకున్న పాకల వాళ్లకు రావు ఇంటిగేటు మూసుకుపోయిందంటే వాళ్ళు తాము సృష్టించిన సంపదకు పరాయీకరింప బడ్డారన్నమాట. గేట్లు తెరవకపోగా నీళ్ళు ఇవ్వకపోగా వారి మీదికి కుక్కలను ఎగ దోయడం అంటే పాకలల్లో ఉండే ప్రజల లాంటి వాళ్ళ నుండి తన సంపదలను కాపాడుకునే ప్రయత్నమే కదా!
పాకల వాళ్ళు నీళ్లు దొరక్క నానా యాతన పడుతుంటే…రావు తన ఇంట్లో అందం కోసం పెంచుకునే క్రోటను మొక్కలకు కొళాయి నీళ్లను వృధా చేయడం ఈ వర్గ సమాజ వైరుధ్యమే.
కూలివాడ జనజీవనం :
ఈ కథలో యాభై అరవై పాకల కూలివాడ ఎలా ఏర్పడింది? విశాఖ పట్నం చుట్టుపక్కల ఊళ్ళనుండి బ్రతుకు గడవక వలసవచ్చిన బడుగు మనుషులతో ఏర్పడింది. పదేళ్ల క్రితం రావు బంగళా కట్టేనాటికే అక్కడ ఆ వాడ తయారైంది. అడపాదడపా వచ్చి చేరేవాళ్ళు చేరుతూనే ఉన్నారు. అమ్మాజీ కుటుంబం ముందు నుండీ ఉంటే సత్యవతి కుటుంబం బంగాళా మొదలైన కాలంలో అక్కడికి చేరింది. తవిటమ్మ వాళ్ళు రెండు వారాల క్రితమే అక్కడకు వచ్చారు. ఎవరు ఎప్పుడు వచ్చినా పట్ణణాల లో బతకడానికి తాము చేయ గలిగిన పనులను ఎంచుకొని జీవనం కొనసాగించటం కొరకే. అందరూ కూలి పనులు చేసుకు బతికేవాళ్లే.
అమ్మాజీ కుటుంబం బతుకుతెరువు మార్గాలు వివరంగా చెప్పబడ్డాయి. ఆమె తండ్రి ఇల్లు కట్టేచోట వడ్రంగం పని చేస్తాడు. వడ్రంగం కులవృత్తి కాదు. అతను ఎంచుకొన్న వృత్తి. షరాబులు కానివాళ్లు వడ్రంగం పనిచేయటం పల్లెలోకం నుండి అప్పుడే వచ్చిన తవిటమ్మ ఊహకందని విషయం. తల్లి ఆడపిల్లల మెస్సులో పనిచేస్తుంది. పట్నం కనుక ఆడపిల్లలు బయటఊళ్ళనుండి చదువులకో, ఉద్యోగాలకో బయటకు రావటం, వాళ్లకు వసతిగృహాల ఏర్పాటు అక్కడ పనిచేయటానికి మనుషుల అవసరం – అది అమ్మాజీ తల్లికి పనికల్పించింది. అట్లాగే ఉద్యోగాలకు వెళ్లే వాళ్లకు మధ్యాహ్నం భోజనాలు వేడిగా వండి కారియర్లు పంపగల తాహతు ఉన్నవాళ్లకు అవి తీసుకువెళ్లి ఇయ్యవలసినవాళ్లకు ఇచ్చి రాగల అవసరం ఉంది. దానిని ఉపాధిగా మలచుకున్న కుటుంబం అమ్మాజీది. అమ్మాజీతో పాటు, మేనత్త, మేనత్త కూతురు కలిసి రెండు తట్టల కారేజీలు మోస్తారు. ఇద్దరు క్యారేజీ తట్టలు పట్టుకుపోతే ఒకళ్ళు ఇంటిపని చక్కబెట్టాలి. అదీ వంతులవారీగా.. ఒక కుటుంబంలో అయిదుగురూ పనిచేస్తేనే ఆ కుటుంబానికి బతుకు భద్రత.
తవిటమ్మ మొగుడు నిజానికి ఆర్నెల్ల క్రితమే పట్నం వచ్చాడు. పల్లెలో కూలిచేసుకొని బతికినవాడు పట్నంలో తనుచేయగలిగిన పని రిక్షా తొక్కటం అని నిర్ణయించుకున్నాక ఆ ఏర్పాట్లు చేసుకొని భార్యను తీసుకొని రెండువారాల క్రితం ఈ కూలివాడకు వచ్చి చేరాడు. ఆమె పసిబిడ్డతల్లి. అయినా ఎదో ఒక పని త్వరలోనే తానూ చూసుకోవలసిందే. ఇక ఆ పాకలలో ఉన్నది అందరూ ఎదో ఒకరకమైన కూలిపనులు చేసుకొనేవాళ్లే. రావు ఇల్లుకట్టుకొన్నప్పుడు ‘అందరూ అక్కడే పనిచేశారు’ అని కథకుడు చెప్పిన విషయం గమనించవచ్చు.
ఈ కథలో ప్రత్యక్షంగా కనిపించే శ్రామిక జనం అంతా మహిళలే. రావు ఇంటి తోటమాలి ఒక్కడే మగవాడు. ఈ కథకు వాళ్ళ బతుకుతెరువులకు సంబంధించిన సమస్యలు కాక నీటిసమస్య కేంద్ర స్థానంలో ఉంది కనుక ఇది ప్రధానంగా మహిళల కథ అయింది.
నీటి సమస్య – మహిళా సమస్య
నీటి సమస్య కేవలం విశాఖపట్నంలోని ఒక కూలివాడ మనుషుల సమస్య మాత్రమే కాదు. ప్రపంచం పెద్దఎత్తున ఎదుర్కొంటున్న సంక్షోభం అది. నీళ్లు వంట, కడుక్కొనటం, ఉతుక్కొనటం, తాగటం వంటి ఇంటి అవసరాలకు సంబంధించిన సరుకు కనుక, ఇంటిపని స్త్రీలదిగా చేయబడిన సమాజంలో నీళ్లు తేవటం పూర్తిగా స్త్రీలకు సంబంధించిన వ్యక్తిగత సమస్య గానే చూడబడుతున్నది. అవసరమైన నీటివనరులు వెతుక్కొంటూ వెళ్ళటం, దూరప్రాంతాలకు నడచివెళ్లటం, క్యూలలో నిలబడి కలబడి నీళ్లు తెచ్చుకొనటం ఆడవాళ్ల బాధ్యతే. పిల్లలు వాళ్లకు సహాయకులు. ప్రపంచం మొత్తంమీద స్త్రీలు, పిల్లలు కలిసి నీళ్లను తీసుకురావటానికి వెచ్చిస్తున్నది 200 మిలియన్ గంటలు అని ఒక అంచనా. మిలియన్ల సంఖ్యలో పేదప్రజల జీవితం ఈ నీటి సంక్షోభం వల్ల దుర్భరం అవుతున్నదని అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. స్త్రీలు ఆత్మగౌరవంతో జీవించటానికి, సాధికారత సాధించటానికి రక్షిత త్రాగు నీటి సౌకర్య లభ్యతకు ఉన్న సంబంధాన్ని గురించి కూడా ఈ నివేదికలు పేర్కొన్నాయి. స్త్రీల సాధికారత గురించిన ఈ రకమైన ఆలోచనలకు పాతికేళ్ళముందే కాళీపట్నం రామారావు జీవధార కథ వ్రాసాడని గుర్తుంచుకోవాలి.
నీటిసమస్య పందిగుట్ట పాకలవాళ్ళకే కానీ, ఫర్లాంగ్ దూరంలో ఉన్న రావు బంగాళా వాళ్లకు లేదు. రోజుకు గంటగంటన్నర మాత్రమే నీళ్ళువచ్చే మున్సిపాలిటీ కొళాయి యాభై అరవై పాకలవాళ్ళకు, లైను తెరిచి ఉన్నంతసేపూ నీళ్ళువచ్చే వ్యక్తిగత కొళాయి రావు బంగళాకు ఉండటమే అందుకు కారణం. కనీసావసరమైన నీటి లేమి పాకల లోని ప్రజల ఐక్యతకు, వైరుధ్యాలకూ కూడా కారణం కావటం గమనించవచ్చు. నీళ్లు తేవటం ఆడవాళ్ళ పని కనుక ఈ కథలో పాత్రలుగా వచ్చే వాళ్లంతా మహిళలే. వాళ్ళ ప్రవర్తనలను, సంబంధాలను నిర్ణయించేది నీళ్ల అవసరమే. దానిని భిన్న కోణాలనుండి ఈ కథలో భాగం చేసాడు కాళీపట్నం రామారావు.
సహజంగా ఆడవాళ్ళ మధ్య ఉండే స్నేహ సానుభూతులను నీటి అవసరం ఎలా చంపేస్తుందో ప్రారంభంలోనే చూపాడు. నువ్వు ముందొచ్చావ్ నీళ్లు పట్టేసుకో అని కొళాయిరావటం మొదలైన తొలిపావుగంటలో న్యాయానికి నిలబడే ఆడవాళ్లు మరికాసేపటికే అది ముందువచ్చిందా నేను ముందువచ్చానా అని తర్కానికి దిగటం , మూడోమనిషిని మధ్యలోకి లాగి తీర్పును కోరటం, ధారసన్నమయ్యేటప్పటికి ఒకరినొకరు తప్పులెన్నుతూ తాను పట్టుకొనటమే న్యాయమన్నట్లు వితండవాదం చేస్తూ తోపులాటలకు దిగటం కొళాయిదగ్గర దృశ్యం దానినే సూచిస్తుంది. ఇది ఒక్కొకసారి దొమ్మీగామారి పోలీసులవరకూవెళ్లి జైళ్లకు,బెయిళ్లకు కు కూడా దారి తీస్తుంటుంది.
నీళ్లు దొరకని వాళ్ళ దైన్యం, దొరికినవాళ్ల అతిశయం రెండింటినీ ఒకే ఫ్రేమ్ లో చూపించాడు రచయిత. ఆలస్యంగా కొళాయి దగ్గరకు వచ్చిన అమ్మాజీ యాభై అరవై కడవలు ఇంకా బోర్లించే ఉండటం చూసి తనవరకూ నీళ్లు వస్తాయన్న ఆశ అడుగంటి అప్పటికే నీళ్లు పట్టుకొని వెడుతున్న ఆవిడను నీళ్లుపోయమని అడుగుతుంది. ఆవిడ తిరస్కరించటం గురించి చెప్తూ ‘ఏక వరసని మూడుకుండల నీళ్లు పట్టుకుందేమో – ఆమెకు ఒళ్ళూ పయి తెలియడం లేదు’ అని రచయిత చేసిన వ్యాఖ్యానం గమనిస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. అమ్మాజీ కంటే ఆలస్యంగా వచ్చిన తవిటమ్మ ఉంది. ఆమె కు పసిబిడ్డ. ఆ బిడ్డను చూసుకొనేవాళ్లెవరూ ఇంట్లో లేరు. బిడ్డకు పాలిచ్చి నిద్రపుచ్చితే కానీ ఆమె ఇల్లు కదిలే పరిస్థితే ఉండదు. అట్లాంటి వాళ్లపట్ల జాలిపడి ముందు నీళ్ళుపట్టుకొనే అవకాశం ఇచ్చే గుండె మెత్తనను అవసరం అణచివేసిన విషయం కూడా ఈ కథలో సూచించ బడింది.
సత్యవతి, అమ్మాజీ, తవిటమ్మ నీళ్లకోసం బంగాళా దగ్గరకు వెళ్లారు. అక్కడ వాళ్లకు ఎదురైంది ముందు అవహేళన. రావు గారి చిన్నకొడుకు, తరువాతి పిల్లలు బయటకు రావటం నవ్వటం … ఏవో గుసగుసలు పెట్టుకొనటం ….. మళ్ళీ మళ్ళీ వీళ్ళను చూసి నవ్వటం… వాళ్లేందుకు అలా తమను చూసి నవ్వుతున్నారో వాళ్లకు అర్ధంకాదు. మూడుపూట్లా ముద్దా కాళ్ళకాడకొచ్చి ,చెయ్యడాని కేపనీ లేకపోతే ఇలాగే ఉంటుందని అమ్మాజీకి ఒక క్షణం అనిపించినా మరుక్షణం తండ్రి తనను తీసుకొచ్చి పరిచయం చేసి ఎప్పుడైనా వస్తే బిందె నీళ్లు ఇప్పించమని రావు గారిని అడిగితే అప్పుడు ఆ చిన్నతనాన ఆమెతో ఆదుకున్న చిన్నకొడుకు శేషుబాబుకె ఆయన అమ్మాజీ వచ్చినప్పుడు నీళ్లు పట్టుకోనియ్యమని చెప్పాడు. దానిని దృష్టిలో పెట్టుకొని ఆ ఇంట్లో పిల్లలు అంతా తనను శేషుబాబు కోసమే వచ్చిందని ఆటపట్టిస్తూ నవ్వుతారని అమ్మాజీకి అర్థమైంది . కానీ ఓర్చుకొనటం తప్ప వాళ్ళను ఏమీ అనలేని పరిస్థితి ఆమెది. ఎట్లాగో ఒకలా బిందెడు నీళ్లు తీసుకుపోవటమే ఆమె తక్షణ అవసరం. అందుకు ఆ ఇంటి వాళ్ళ దయను కోరుతూ గేటు ముందు నిల్చున్న యువతి ఆమె. తనగురించి అవమానకరంగా ఆలోచించవద్దని, చూడవద్దని చెప్పగల హక్కు, అవకాశం ఆమెకెక్కడ?
ఆ తరువాత అక్కడ వాళ్లకు ఎదురైంది తిరస్కారం. నీళ్లు లేవు … వెళ్లిపోండి అన్న తిరస్కారం. ముందు ఆ మాట అన్నది నడీడు మనిషి. ఆ ఇంటి ఇల్లాలు. రావు భార్య. వాళ్ళు బతిమిలాడారు . చంటిపిల్ల తల్లి తవిటమ్మను చూపి, తమ పెద్దకుటుంబాల అవసరాలను చెప్పుకొని ప్రాధేయపడ్డారు. ఆమె కాస్త మెత్తబడి సరే అనే వేళకు లోపలినుండి వచ్చిన ముసలమ్మ ససేమిరా కుదరదంటూ అడ్డుపడింది. ఆవిడ రావు తల్లి. అత్తగారిని కాదని అంగీకారం చెప్పగల స్థితికాదు కోడలిది. ‘కుక్కలను ఉసి కొల్పనా’ అని మాట తూలింది ముసలమ్మ. ఇక అక్కడనుండి మొదలైంది ఘర్షణ. నీళ్ళడగటానికి వస్తే కుక్కలను చూపి బెదరగొట్టి పంపాలనుకొన్న పెద్దింటి మహిళలకు పేదింటి మహిళలు సవాల్ విసిరారు. కుక్కలను వదులుతారా వదలండి చూద్దాం అని సత్యవతి తెగించి మాట్లాడటం అందులో భాగమే. అవసరం తీరేమార్గం మూసుకు పోతుంటే నిస్సహాయత నుండి జనించిన ఉక్రోషం వాళ్ళది. ఆ ఉక్రోషమే కొళాయి నీళ్లు ఆగిపోవడంతో ఖాళీ బిందెలతో వెనుదిరుగుతున్న తోటివాళ్లను తమ బాధలో భాగం పంచుకొనటానికి సమీకరించేట్లు చేసింది. ముగ్గురం ముప్పయి మందిమి అయితే గానీ కొళాయినీళ్ళు పట్టుకోనీయం అని పంతంపట్టిన రావు భార్యను, తల్లిని వంచటం సాధ్యం కాదని తెలుసు గనుకనే వాళ్ళు అలా చేశారు. కాసేపటి క్రితం మున్సిపాలిటీ కొళాయి దగ్గర నీళ్లకోసం ఎకసెక్కాలు ఆడుకొన్నవాళ్ళు, పోటీపడ్డవాళ్లు, తగాదా పడ్డవాళ్ళు ఇప్పుడు అందరూ ఏకమై ముసలమ్మతో వాదనకు దిగారు.
తాము మూడు బిందెలనీళ్లకు ముప్పుతిప్పలు పడుతుంటే రావు గారింట్లో మూడుపూట్లా స్నానాలు చేయటానికి, నాలుగైదుసార్లు మొహాలు కడగటానికి, నాలుగు కప్పులు కడగాలన్న అరగంట ధారగా నీళ్లు వదలటానికి, మొక్కలకు పట్టటానికి సమృద్ధిగా నీళ్లు ఉండటం మించిన వ్యత్యాసం మరొకటి లేదని తెలిసినవాళ్ళు కనుకనే వాళ్ల లోలోపలి ఆగ్రహం ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి రూపం తీసుకొంటుంది. నిజానికి ఇది ధర్మాగ్రహమే. కానీ పెద్దింటివాళ్ల దృష్టిలో పేదింటివాళ్లకు అర్హతలేని వ్యక్తీకరణ ఆగ్రహం. వాదన తీవ్ర స్థాయికి చేరుతున్నప్పుడు శ్రామిక మహిళల సంఘటిత శక్తిముందు బలహీనపడుతున్న ముసలమ్మ స్వరాన్ని కనిపెట్టి ఆసరాకు వచ్చిన మనుమరాలు “పొగరుగా మాట్లాడితే ఇవ్వం. మంచిగా అడిగితే ఆలోచిస్తాం” అనటం గమనించతగ్గది. మంచిగా అడగటం అంటే హక్కుగా కాక వినయంగా దయాధర్మ భిక్షకోసం అభ్యర్ధిస్తున్నట్లుగా మాట్లాడటం. పేదల స్వరం ఆ స్థాయిని మించరాదన్నది వర్గ సమాజ సూత్రం.
పొగరా .. మాకాడ ఏటుందని మీ దగ్గర పొగరు చూపిస్తాము ? అందమా, చందమా ? మళ్ళా మాన్యాలా? డబ్బా? మీ కన్నా మాకు ఏమి ఎక్కువున్నాయని .. అని అప్పాయమ్మ మనుమరాలి మాటను తిప్పికొట్టటంలోనూ కనబడేది కంటికి కనిపించే అంతులేని అసమానతల గురించిన వాళ్ళ ఆక్రోశమే. దాని మూలకారణం ఏమిటో, దానిని రద్దుచేయటం ఎలాగో తెలిసి పోరాటం నిర్మాణ రూపం తీసుకొనేవరకూ కసురుకున్నా, విసుక్కున్నా కుక్కల్ని, పోలీసులను చూపి భయపెట్టినా లేనివాళ్లు కలవారిని ఇబ్బందిపెడుతూ వాళ్ళ గుమ్మాల ముందు తమ అవసరాలకోసం పడిగాపులు పడటం అనివార్యంగా కొనసాగేదే అని ఈ కథ ముగింపు సూచిస్తుంది.
మరొక్క విషయం ఉంది. పుచ్చుకొనే వాళ్లెప్పుడూ ఇచ్చేవాళ్లకు లోకువే. నీటి ని అడుక్కునే స్థితిలో అమ్మాజీలు, సత్యవతీలు ఉంటారు. దయాధర్మంగా ఇచ్చేవాళ్లలో రావుగారి తల్లి, భార్య , పిల్లలు ఉన్నారు. ఇచ్చేవాళ్లకు పుచ్చుకొనేవాళ్లను ఎన్ని మాటలైనా అనటానికి, అవమానపరచటానికి, బెదిరించటానికి అవకాశం ఉంది. అదెలా ఉంటుందో ఈ కథ చెప్పనే చెప్పింది. పడ్డ వాళ్లెప్పుడూ చెడ్డవాళ్ళు కాదు అని ఓదార్పుగా చెప్పేమాట. కానీ పడ్డవాళ్ళు మనుషులు కదా !? వాళ్లకు ఆత్మాభిమానం, గౌరవం గా జీవించే హక్కు ఉంటాయి కదా!? అమ్మాజీ, సత్యవతి, తవిటమ్మ — ఇలాంటి స్త్రీల అభిమానం అంతగా అవమానించ బడుతున్నప్పుడు దానిపట్ల నిరసన వ్యక్తం చేసే అవకాశం వాళ్లకు ఉన్నదా అంటే లేదు. అవహేళనలకు ఎదురు సమాధానం ఇయ్యాలని, అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవాలని, ఆత్మగౌరవ ప్రకటన చేయాలనీ వాళ్లకు ఎంత ఉన్నా తక్షణ అవసరాలకోసం అన్నిటినీ వదులుకోవలసిన దయనీయ స్థితిలో కూలీనాలీ మనుషులు ఉంటారు. ఆర్ధిక వ్యత్యాసాలు, అవకాశాలలో అసమానతలు ఉన్న సమాజంలో చాలామంది ఇలా మానవత్వానికి పరాయీకరింపడే భీభత్సాన్ని గురించి ఆలోచించమని ప్రేరేపిస్తుంది ఈ కథ. ఆర్తి వంటి కథల ముగింపులో కూడా కాళీపట్నం రామారావు దీనిని కీలకాంశం చేయటం గమనించవచ్చు.
శైలీ – శిల్పం
శైలి అంటే కథను చెప్పే పద్ధతి. శైలి రచయిత ధోరణిని, దృక్పథాన్ని వ్యక్తం చేస్తుంది.పదచిత్రాలను వాడడంలో, భాషను ఉపయోగించడంలో, భౌతిక పరిస్థితుల వర్ణనలలో, పాత్రల మానసిక స్థితులను చిత్రించడంలో కారా గొప్ప నైపుణ్యం చూపాడు. ప్రజల పట్ల, వారి సమస్యల పట్ల తన నిబద్దతను ఈ కథ ద్వారా చాటుకున్నాడు. విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ అనివార్యం అని ఘర్షణ లేకుండా ఏ సమస్య పరిష్కారం కాదని సూచించాడు.ఉత్తరాంధ్ర ప్రజల వ్యవహార భాషను సంభాషణలలో వాడాడు. దీని వల్ల సంభాషణలకు సహజత్వం అబ్బింది. ఒక్క సిటం ఒక్క సిటం, షరాబులు, నెలవు, బేపు –వంటి స్థానిక ఉత్తరాంధ్ర ప్రజల భాషా వ్యవ్యహరం కథకు సహజమైన వాతావరణాన్ని సమకూర్చింది. సన్నివేశాల చిత్రణకు ప్రామాణిక భాష ను వాడాడు.స్థానిక ప్రజల ఆచార వ్యవహారాలను సందర్భానుసారంగా తెలిపాడు.
మున్సిపల్ కొళాయి దగ్గర ఉన్న అలికిడితో కథ మొదలవుతుంది. ఈ అలికిడి వాళ్ళ జీవితాల్లోని అలికిడిగా భావించాడు.
శిల్పం దృష్ట్యా గొప్పకథగా విమర్శకులు భావించిన కథ ‘జీవధార’
కథ ఎక్కడ మొదలవుతుందో కథ అక్కడే పూర్తిచేయడం ఈ కథలో ఉన్న గొప్ప శిల్పము. నీటి.సమస్య తో మొదలైన ఈ కథ ఆ నీటి సమస్యతోనే ముగుస్తుంది. ఈ ఆద్యంతాల మధ్య కాళీపట్నం రామారావు సామాజిక రాజకీయ ఆర్ధిక వాస్తవాలను వ్యాఖ్యానించాడు. పట్టణాలు పెరుగుతూ పేదవాళ్ల సేవలను వాడుకొంటూ వాళ్ళ కనీస అవసరమైన నీటికి హామీ ఇయ్యకపోవటంలోని విషాదాన్ని చిత్రించాడు. ప్రజల అవసరాలను ముందు పెట్టి తమ అవసరాలను తీర్చుకునే దళారుల స్వభావాన్ని బట్టబయలు చేసాడు.
సహజ వనరులు ధనిక వర్గాల స్వంతం అయి ఎంతోమందిని వాటికి పరాయీ కరించే అసమ సామాజిక ధర్మం ఎంత వికృతమైనదో చెప్పిన కథ జీవధార ఈ అసమ ధర్మ పరిరక్షణకోసం కుక్కల కాపలా, పోలీసుల రక్షణ ఉన్నాయంటే ప్రభుత్వాలు ధనికవర్గం పక్షాన ఉన్నట్లే. ప్రజల కనీస అవసరాలైన నీటిని అందించలేని దుస్థితిలో ఉన్న పాలకవర్గాలు సిగ్గు పడాల్సిన దుస్థితిని ఎత్తి చూపిన కథ.
తమ కనీస అవసరాలు తీరని స్థితిలో సామాన్యులు సహనం కోల్పోవటం అనివార్యం అని సూచించిన కథ. మనుషుల స్వభావాలలోని వైరుధ్యాలను అతిసహజంగా వర్ణించిన కథ.
.
ఏది ఏమైనా ప్రజలు తమ సమస్యలకు పరిష్కారాలు వెతికే ప్రక్రియ నిరంతరం జీవధార లాగా కొనసాగుతుందని కారా అభిప్రాయం.