ఓ బ్రహ్మ
నీ అరికాళ్ళ నుండి జారిపడ్డోన్ని
ఊరికి అవతల విసిరేయపడ్డోన్ని
అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్న
నీ సృష్టిలో మనిషి జాడెక్కడని?
నీ తలలో పుట్టిన విషం
నిరంతరంగ ఈ లోకం మెదళ్ళలోకి ప్రవహిస్తూనే వుంది
నీ భుజాలు చీల్చుకొని వచ్చిన రాజ్యం
అధర్మాన్ని నాలుగు పాదాల నడిపిస్తూనే వుంది
నీ పొత్తి కడుపులో పురుడు పోసుకున్న స్వార్థం
సర్వం మింగే ఉప్పెనయ్యింది
ఎన్ని వికృత రూపాల సృష్టికర్తవు నీవు!
ఎంత అమానవీయ రాతలు రాయగలవు!!
దేవా, అంతా లోక కల్యాణం కోసమేన?
అన్నీ నీ ఆజ్ఞలేన?
అయితే, కాళ్ళు తలను తన్నే కాలమొస్తుంది
అది కూడ నీ ఖతాలోనే జమ చేసుకో.