కాలాన్ని కదిలించిన ప్రజాకవి అందెశ్రీ

తెలంగాణ భూమికి తాకిన ప్రతిసారి గాలి ఉద్యమగీతమై ఊగిన కాలం ఉంది. ఆ గాలికి జ్యోతి చూపిన అక్షరజ్యోతి అందెశ్రీ. “పాడితే కంఠనాళం తెగి పడాలి” అనే విశ్వాసంతో, పాటను ఆయుధంలా చేతపట్టి ప్రజా జీవితాన్ని రగిలించిన వీరు జన ప్రభంజనమైన లోకకవి. ఉద్యమవాగ్గేయకారుడు.

జననం – బాల్యం:
1961 జూలై 18న సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించిన అందె ఎల్లయ్య (అందెశ్రీ) పేద కుటుంబంలో జన్మించినా, కడు బీదరికపు అనుభవాలతో పెరిగారు. పశువుల కాపరిగా జీవితం ప్రారంభమవగా, చిన్న వయసులోనే బాలకార్మికుడిగా ఎన్నో పనులు చేశారు.
రాత్రిళ్ళు వినిపించే యక్షగానాలు, భాగోతాల స్వరాలు ఆయనకు పాఠములయ్యాయి; సమాజం ఆయనకు పాఠశాలగా మారింది. మనుషులే పాఠ్యపుస్తకాలు అయ్యాయి.
అనుభవం ఆయనకు గురువులయ్యాయి. మాటల పొరల్లో దాగిన బాధలు, పల్లె జీవితపు సత్యాలు ఆయనను సహజకవిగా తీర్చిదిద్దాయి.

నిజామాబాద్‌ వలస జీవితం ఆయనకు ఆధ్యాత్మిక పరిచయాలను తెచ్చింది. శ్రింగేరి మఠాధిపతి శంకర్ మహారాజు ఆశీస్సులు, వారి బోధనలు ఆయనలోని కవిని లోతుగా మేల్కొలిపాయి.
“భజన భజంత్రీల పాటలు కాదు; నీవు చూసిన బతుకు పాటలు రాయ్” అన్న గురువుగారి మాట అందెశ్రీ కవిత్వానికి దిక్సూచిగా నిలిచింది.
అక్కడినుండే ఆయన గీతాలు అనుభవాల అక్షరాలు అయ్యాయి.

తెలంగాణ ఉద్యమంలో అక్షరమే అగ్నిశిఖ
2001లో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ అక్షరాలు అగ్నికణాలయ్యాయి.
కామారెడ్డి ధూంధాం సమావేశం (2003) అతనిలోని ఉద్యమకవిని పూర్తిగా మేల్కొలిపింది.
2003 నవంబర్ 1న సిద్ధిపేటలో మొదటిసారి తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించారు.
ఆపై 2009లో 12 చరణాలతో ‘జయ జయ హే తెలంగాణ’ గీతాన్ని సంపూర్ణం చేశారు.
ఈ గీతం ఉద్యమానికి శ్వాసగా, సభలకు ప్రాణంగా, ప్రజలకు నినాదమైంది.
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం
ఈ పాట ప్రతి ఊరిలో పాడబడిన ఈ గీతం,
జూన్ 2, 2024న అధికారికంగా రాష్ట్ర గీతంగా ప్రకటింపబడింది.
ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చగా, అందెశ్రీ రెండు వేర్వేరు నిడివులతో అధికార కార్యక్రమాలకు అనుకూలంగా గీతాన్ని అందించారు.

సినీగేయ సాహిత్యంలో అందెశ్రీ ప్రభావం :
అందెశ్రీ పేరుతో రాసిన పాటలు సినిమా కోసం రాయబడలేదు. ప్రజల కోసం రాయబడి తర్వాత సినిమాల్లో స్థానం సంపాదించాయి.

ప్రసిద్ధ గీతాలు:
“మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు” – ఎర్ర సముద్రం (2007)
ఆధునిక జీవితంలోని సంబంధాల అంతరాలను సమస్యాత్మకంగా ప్రతిబింబించిన ఈ పాట తర్వాత విశ్వవిద్యాలయ సిలబస్‌లో చోటుపొందింది.
“చూడ చక్కని తల్లి…”
పల్లె పట్ల ప్రేమ, తల్లి పట్ల మమత, పల్లె సంస్కృతికి ఇచ్చిన గౌరవం.
“కొమ్మ చెక్కితే బొమ్మరా…”
ప్రకృతిని తల్లి రూపంలో ఆరాధించిన తాత్విక గీతం.
‘గ్రామదేవతలందరో…’ – వేగుచుక్కలు (2004)
“ఒకటే జననం ఓహౌ…” – జై బోలో తెలంగాణ
ఉద్యమ సామూహిక శక్తిని రగిలించిన అరుదైన ప్రేరణ గీతం.
గంగ (2006) చిత్రంలోని పాటకు నంది అవార్డు.

అందెశ్రీ పాటల్లో విశ్వమానవతా దృక్పథం
అందెశ్రీ గీతాలలో ముఖ్య లక్షణాలు :
మానవ సమానత్వం
కులవివక్షపై ధిక్కారం
మూఢాచారాలపై విమర్శ
పల్లె సంస్కృతి, ప్రకృతి ఆరాధన
సమాజంలోని అసమానతలపై కఠిన ప్రతిఘటన

ఆయన స్వయంగా అంటారు: “ఒక మతంలో, ఒక కులంలో పుడటం దురదృష్టం.
మనిషితనం ఉన్నచోట నేనున్నాను.”
సాహిత్య సేవ – సంపాదకత్వం:
అందెశ్రీ స్థాపించిన ‘వాక్కులమ్మ ప్రచురణలు’ తెలంగాణ సాహిత్యానికి గొప్ప సేవ చేసింది.
ప్రధాన గ్రంథాలు :
‘నిప్పులవాగు’ – 1365 పేజీలు, 790 పాటలు/కవితలు
→ తొలినాటి 144 మంది ఉద్యమ కవులను పరిచయం
→ రైతాంగ పోరాట పాటలు, 1969 ఉద్యమ గేయాలు
‘హాసిత భాష్పాలు’ – (శ్రీరామ్)
‘శూద్రశ్రీ గంగ’ – (సుద్దాల అశోక్ తేజ్)
‘సౌందర్యలహరి’ – అందెశ్రీ అనువాదం

అందెశ్రీకి లభించిన పురస్కారాలు :
కాకతీయ విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ (2014)
Academy of Universal Global Peace, Washington DC – గౌరవ డాక్టరేట్, ‘లోకకవి’ బిరుదు
దాశరథి సాహితీ పురస్కారం (2015)
రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం (2015)
నంది పురస్కారం
సుద్దాల హనుమంతు–జానకమ్మ జాతీయ పురస్కారం (2022)
దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం – 2024

అందెశ్రీ చేసిన కృషి ఆయనను ఉద్యమ ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా నిలిపింది.

వ్యక్తిత్వ తత్వం – జీవితపాఠం :
అందెశ్రీ జీవితం కష్టాలతో నిండిఉన్నా, ఆయన గీతం ఎప్పుడూ తట్టుకొని నిలిచే ధైర్యాన్ని ఉపదేశించేది. “కొలిమిలో కాలితే తప్ప బంగారం ఆభరణం కాదు.
ఇది ఆయన జీవితమే.
1994లో ఆత్మహత్యకు ఒడిగట్టిన సమయంలో స్నేహితుడు యలమంచి శేఖర్, రామకృష్ణారెడ్డి ఇచ్చిన తోడ్పాటు వల్ల ఆయన తిరిగి నిలిచారని స్వయంగా పేర్కొన్నారు.
అవమానాలు, కులవివక్ష ఆయనను ఆపలేదు.
అవే ఆయన అక్షరాలను అగ్నిశిఖలుగా మార్చాయి.
అంతిమ దశ :
2025 నవంబర్ 10న అకస్మాత్తుగా అస్వస్థత ఏర్పడి ఆయన మరణించారు.
తెలంగాణ ముఖ్యమంత్రమే స్వయంగా ఆయన పాడె మోయడం, ప్రజా కవికి లభించే అరుదైన గౌరవం.

అందెశ్రీ లేరు; కానీ ఆయన గీతాలు ఇంకా సమాజాన్ని మేల్కొల్పుతూనే ఉన్నాయి. ఉంటాయి కూడా.
అందెశ్రీ ఒక కవి కాదు
కదిలే కాలంపై కరకర పొడిచే సూర్యకిరణం.
పల్లెలో పుట్టి, ప్రజలలో పెరిగి, సమాజం కోసం అక్షరాన్ని అంకితం చేసిన రవి.
తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు నినాదాలు;
తెలుగు సాహిత్యంలో ఆయన కవిత్వం నిలిచిపోయే చరిత్ర.
సమాజాన్ని మేల్కొల్పిన కవిత్వం –
తెలంగాణను ఏకం చేసిన గీతం.
చరిత్రను అక్షరాల్లో బంధించిన వాగ్గేయకారుడు.
భవిష్యత్తులో ముందుకు వెళ్లటానికి వారిచ్చిన స్ఫూర్తి గెలుపు పొందె వరకు అలుపు లేదు మనకు.

జ‌న‌నం: గోనెప‌ల్లి, సిద్ధిపేట జిల్లా. క‌వి, రచ‌యిత, ఉపాధ్యాయుడు. 'మా తొవ్వ‌'(క‌విత్వం), 'బ‌తుకు పాఠం'(క‌విత్వం), 'త‌ప్ష‌'(క‌థ‌) ప్ర‌చురించారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుంచి 'తెలంగాణ‌ పాట‌ల్లో సామాజిక చిత్ర‌ణ' అనే అంశంపై ప‌రిశోధ‌న చేశారు. ప్ర‌స్తుతం వేముల‌ఘాట్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో స్కూల్ అసిస్టెంట్‌(తెలుగు)గా ప‌నిచేస్తున్నారు.

Leave a Reply