పల్లవి: కటకం సుదర్శనా-కామ్రేడా సుదర్శనా
ఎకడ నిన్ను చూడలేదు
ఎపుడూ మాట్లాడలేదు
కనుమూసిన చిత్రమే
కనికట్టు చేసినట్టు
మనుసుతో మాట్లాడుతూ తట్టిలేపుతున్నది
అడవిలొ అమరత్వమై ఆత్మబంధువైనది
1. ఎవరైనా ఒకసారే పుడుతారు గిడుతారు
తనులేని తనువొకటి ప్రజలదనెవరంటారు
తన చదువుకు వెలకట్టక ఎవరూ జీవిస్తారు
తన ఊరుకు జన రాజ్యం పేరెవరు పెడతారు
తన శక్తే జనశక్తిగ – ఎవరూ తిరిగొస్తారూ
మరణించి ఇట్లాగా – ఎవరూ మాట్లాడుతారు
llకటకంll
2. కడసారి చెవిజేరి నిను పిలిచెన చిరుగాలి
తిరిగొచ్చిన విప్లవాల సందేశమే రణభేరి
ఎండిన ఆకుల శబ్దం ఘల్లు ఘల్లు గజ్జలుగా
ఎత్తిన పిడికిళ్ళతోటి గొంతుకలిపె సవ్వడిగ
నిను గట్టిగ అల్లుకొని – విడలేదా ఎర్రజెండా
నిను ఒడిలో చేర్చుకుని – ఓదార్చెన భూమాతా
llకటకంll
3.బాంబుల వర్షం కిందే బడిలోని అక్షరంలా
బహుళజాతి వలలోకి చిక్కుకోని ఖనిజంలా
సిలిగేరు నిరసనలో చిగురించిన ఆశనీవా అడవిపైన ఆదివాసీ హక్కులన్ని చాటినవా
ఎదురీతలో ఆరితేరె – గతి తర్కపు జ్ఞానమువా
నిదురించిన విత్తునుండి – మొలకెత్తిన అంకురమా
4. ఆనందనే నీ పేరులో ఆశయముందంటాము
కనిపించని విద్యుత్తుల వెలుగే నీవంటాము
కన్నాల బస్తి కాదు కారడవుల బస్తరువు
విముక్తినే కలగన్న వీరోచిత యోధుడవు
ఆశయాల కొలిమిలో – పదునెక్కిన మానవుడవు
శ్రామికజన విశ్వానికి – శాశ్వత చిరునామావు
[దండకారణ్యంలో గుండెపోటుతో కనుమూసిన కామ్రేడ్ కటకం సుదర్శన్(69) స్మృతిలో….]