“విప్లవం జయిస్తుంది”: కాకరాల తో సంభాషణ

(కాకరాల ఇంటిపేరు. అసలు పేరు వీర వెంకట సత్యనారాయణ. 1937 డిసెంబర్ 18 న పశ్చిమ గోదావరిజిల్లా కాకరపర్రులో పుట్టారు. నాటకాలతో మొదలుపెట్టి నటన వృత్తిగా సినిమా రంగంలో స్థిరపడ్డారు. అభ్యదయ విప్లవ సాహిత్యోద్యమాలతో కలిసి నడిచారు. నడుస్తున్నారు. ఎనభై ఏడేళ్ల ఏళ్ళ ఈ వయసులో కూడా ప్రజాస్వామిక విలువల కోసం జరిగే ఏ సదస్సులలోనైనా ఆయన ముందు వరస కుర్చీలలో కూర్చొని వింటూ కనబడతారు. విలువల వెన్నుబలంతో నడుము పట్టు సడలినా ఈ నాటికీ నిటారుగా నిలబడ్డ మనిషి. వంగిన నడుము ప్రభావం మెడను కిందికి వంచేస్తున్నా తలెత్తి నిలబడ్డ వ్యక్తిత్వం ఈ 87 ఏళ్ళ వయసులో అయన బలం.

ఆయనను ‘కొలిమి’ కోసం ఇంటర్వ్యూ చేయాలని 2024ఆగస్టు 5 న ఉదయం సమావేశంలో సంపాదకవర్గం అనుకొంది. ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకొని సంప్రదించవలసిన బాధ్యత నేను తీసుకొన్నాను. చిత్రంగా కాసేపటికే కాకరాలగారు వరంగల్ లో ఉన్నారు, కలవాలని అనుకొంటున్నారని తిరుమల నుండి ఫోను. ఆరోజే వెళ్లి కలిసి మాట్లాడి వచ్చాను. కాకరాలతో ముఖాముఖి అలా ప్రారంభం అయింది. 12వ తేదీ సాయంత్రం కాకరాలతో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక మిత్రులం పదిమందిమి సమావేశమై ముచ్చటించాం. 13 వతేదీ సాయంత్రం వరంగల్ సాహితీ మిత్రులు కొందరితో కలిసి కాకరాలతో మరొక సంభాషణ జరిగింది. ఆగష్టు 23 నుండి 31 వరకు ప్రతిరోజూ సమయంతో నిమిత్తం లేకుండా అనేక విడతలుగా చెప్పుకొన్న ముచ్చట్లు. ఈ అన్నీ కలిస్తే ఈ ముఖాముఖి. ఘటనలు, తేదీలు విషయంలో సందిగ్ధాలు తీర్చుకొనటానికి సజ్జ వెంకటేశ్వర్లు గారితో, పాణి గారితో చేసిన సంభాషణలు ఉపయోగపడ్డాయి. వారికి ధన్యవాదాలు.)

కాకరాల గారూ మీ కుటుంబ నేపథ్యం చెబుతారా?
మాది రాజమండ్రి దగ్గర తొర్రేడు. అది కమ్మవారి సంస్థానం. మా తాతలు అక్కడ పౌరోహిత్యం చేశారు. రాజమండ్రిలో కోటిలింగాల రేవులో కూడా వైదీకం ఉండేది. కోటిలింగాల నుండి ఆర్యాపురం వరకు (ఏడు కిలోమీటర్లు) మా కాకరాలవారి కుటుంబాలే. మా తాత తొర్రేడు లో ఉంటే మా నాన్న రాజమండ్రి కి వచ్చాడు. అవసరమైనప్పుడు మా తాతకు పౌరోహిత్యం లో సహాయంగా తొర్రేడు వెళ్లి వస్తుండేవాడు. నాన్న పేరు వీరభద్రం. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. అక్కగారు పెంచింది. అమ్మ పేరు కనకమహాలక్ష్మి. మేము నలుగురు అన్న దమ్ములం. ఒక చెల్లెలు. నేను పెద్దవాడిని.

ఎప్పుడు పుట్టారు? మీ బాల్యం గురించి చెబుతారా?
1937 డిసెంబర్ 18 న పుట్టాను. నా బాల్యం చాలావరకు మా అమ్మమ్మ గారి వూరు కాకరపర్రులో గడిచింది. మా అమ్మమ్మ కూచిభట్ల సీతమ్మ. ఆమెకు మా అమ్మ ఒక్కతే కూతురు. పెద్దమనుమడిగా నేను అమ్మమ్మ కు ఇష్టుడిని. ఆమె వొళ్ళో పెరిగాను. అప్పుడే ఆ వూరికి బడి కూడా వచ్చింది. నాతో పాటు స్కూల్ లో తరగతులు కూడా పెరుగుతూ వచ్చాయి. ఫిఫ్త్ ఫారం వరకు అక్కడే చదువుకొన్నాను. రాజమండ్రిలో స్కూల్ ఫైనల్ పరీక్షలు రాసాను. ఫెయిల్ అయ్యాను. అక్కడితో నా చదువు ఆయిపోయింది.

ఇక్కడ మా అమ్మమ్మతో పాటు ఆవిడ అక్కగారు వేదుల గౌరీశమ్మ గారి గురించి కూడా చెప్పాలి. వాళ్ళు పురాణపండ వారి ఆడబడుచులు. అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఆస్తిపాస్తులు ఉండటంవల్లనేమో స్వతంత్రంగా వ్యవహరించేవాళ్ళు. న్యాయంపక్షాన నిలబడే వాళ్ళు. ఒకే మాటగా వ్యవహారాలు చేసేవాళ్ళు. హనుమద్దాసు అని ఒకాయన వాళ్ళ అన్న జోగయ్య గారికి రావలసిన పీఠాన్ని కబ్జా చేసినప్పుడు జోగయ్యగారి పక్షాన నిలబడి మాట్లాడినవాళ్లు, ఆయనను కనిపెట్టుకొని ఉన్నవాళ్లు మా అమ్మమ్మలే.

వేదుల గౌరీశమ్మగారు తెలివైంది. ఏమి చేయాలనుకున్నా అభ్యంతరాలు పెట్టె భర్తతో తాను గొడవపడకుండా చెల్లెలిని పురమాయించేది. మా అమ్మమ్మ నదురుబెదురూ లేని మనిషి. ఆయనతో వాదానికి దిగి ఒప్పించేది. జుట్టు తీయించుకుంటానంటే కాశీ తీసుకువెళతానని ఆయన అంటే చాల్లేవయ్యా, నువ్వు కాశీ తీసుకెళ్లనక్కరలేదు… నేను జుట్టు తీయించుకొనేదీ లేదు అని అంటుండేది. రాజమండ్రిలో వీరేశలింగం చేసినది కాకరపర్రు చుట్టుపక్కల ఊళ్లలో వీళ్లది చేశారు.

మీ అమ్మమ్మ జుట్టు తీయించుకొనేది లేదు అని అన్నదని అంటున్నారు. మీ తాతగారు లేరా?
అవును. తాతగారు నాకు వూహ తెలిసేటప్పటికే పోయారు. మా అమ్మమ్మ అలా అనగలగటం వెనక వీరేశలింగం ఇచ్చిన నైతిక బలం ఉంది అనుకొంటాను.

వీరేశలింగం సంస్కరణ స్త్రీల కోసం కదా! రాధికా స్వాంతనం రాసిన ముద్దుపళనిని వేశ్య అని తక్కువ చేసి మాట్లాడటం, ఆమెను బట్టి ఆ రచనకు విలువ కట్టటం సమంజసమేనా?
నిస్సందేహంగా కాదు. సంస్కరణవాదులకున్న సంకుచితత్వం అంతా వీరేశలింగంలో వుంది.

వీరేశలింగం చేసినది మీ అమ్మమ్మ, పెద్దమ్మమ్మ చేశారని అన్నారు కదా! స్త్రీవిద్య, పునర్వివాహాలు వంటి సంస్కరణ కార్యక్రమాలలో పాల్గొన్నారా వాళ్ళు?
అలాగని కాదు, పరిమితుల మధ్య అయినా న్యాయం గురించి, ఆడవాళ్ళ గురించి ఆలోచించారు. ఒక విషయం చెప్తే అర్ధం అవుతుంది. కళింగదేశం నుండి ఒకాయన ఇద్దరు కూతుళ్లతో బతుకు వెతుక్కుంటూ కాకరపర్రు వచ్చాడు. కులభేదాలతో పనిలేకుండా ఎవరికైనా ఆశ్రయం ఇచ్చే లక్షణం కాకరపర్రులో వుంది. గుడిసె వేసుకొనటానికి స్థలం చూపి వాళ్ళ తిండికి ఏర్పాటుచేశారు. కొన్నాళ్ళకు తండ్రి చనిపోయాడు. ఆడపిల్లలు ఇద్దరూ అనాధలు అయ్యారు. వాళ్ళ సంగతి ఎలా అని చర్చవచ్చినప్పుడు వాళ్ళను చేరదీసి పెళ్లిళ్లు చేసిపంపే బాధ్యత మా అమ్మమ్మ తీసుకొంది. అలాగే తంటాలు పడి కాళింగులను వెతికి మరీ వాళ్లకు పెళ్లిళ్లు చేసింది. వాళ్ళల్లో పెద్దపిల్ల తెలివిగలది. కనకాంబరం ఆమె పేరు. ఆ అమ్మాయి చదువుకొనటానికి మా అమ్మమ్మ ప్రోత్సహించింది కూడా. రెండవ అమ్మాయి నీలాంబరికి ఏదో మంచి సంబంధం వచ్చిందని, పెద్దదాని పెళ్లి ముందు చేయాలనీ చదువును పక్కకు పెట్టించి పెళ్లి చేసింది. ఆ విషయంలో మా అమ్మమ్మతో నాకు భేదాభిప్రాయం. ఆ అమ్మాయికి చదువు చెప్పించి ప్రయోజకురాలిని చేయకుండా ఈ పెళ్లి వ్యవహారం ఎందుకు అనుకొన్నాను. ఆవిడతో అనలేక పోయాను కానీ ఆ అమ్మయికి చెప్పా చదువుకొంటే చెప్పించగల పరిస్థితిలో ఉన్నానని… ఏదో ఏర్పాటు చేస్తానని… కానీ ఆమె మామ్మ గారి మాట దాటేది లేదని చదువు మాని పెళ్లి చేసుకొంది.

మీ అమ్మమ్మ గారి ముందు మాట్లాడలేకపోయానన్నారు. ఆవిడ ఒళ్ళో పెరిగిన మీకు ఆ జంకు ఎలా కలిగింది?
ఆవిడ ఎవ్వరి మాటా వినేరకం కాదు. ఆవిడ మాట అందరూ వినాలి. పవర్ ఫుల్ లేడీ. విక్టోరియా మహారాణి. మా అమ్మ ఒక్కతే కూతురు కదా ఆమెకి. తల్లి చెప్పినట్లు వినటం, తల్లి కొన్న బట్ట కట్టుకొనటం, చేయించిన నగ పెట్టుకొనటం తప్ప మా అమ్మ నోరెత్తి ఆవిడను కాదనటం నేనెప్పుడూ వినలేదు. మా నాన్న కూడా అందరిమీద ఎన్ని పెత్తనాలు చేసినా ఆవిడదగ్గరకు వస్తే మాత్రం ‘సీతమ్మత్తా’ ఏం చేయమంటావు అని అడగవలసిందే.

మీ నాన్న అందరి మీద పెత్తనం చేయటం గురించి చెప్పారు… కాస్త వివరిస్తారా?
ఏముంది? అది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో మగవాళ్లకు సంక్రమించే అధికారం నుండి వచ్చే పెత్తనం. తనపై పెత్తనాన్ని ఆమోదించటం, ఇతరులపై పెత్తనం చేయటం. అదీ సూత్రం. మా తాతలు మొదట్లో భాగవతాలు ఆడేవాళ్లు. మా పెద్దతాత కథ చెప్పేవాడు. రెండవ తాత, చిన్న తాత హాస్యం చెప్పేవాళ్ళు. అది మానేసి తరువాత వైదికం వృత్తిలోకి వచ్చారు. మా నాన్న నాటకాలు ఆడేవాడు. ‘ఇప్పటివరకు పూసుకొన్న మసిచాలు… ఇక ఆపెయ్య’మని తండ్రులు చెప్పారని మా నాన్న నాటకాలు మానేసాడు. ఆయన తండ్రి అధికారానికి లోబడి పనిచేశాడు, కనుక మేము ఆయన అధికారానికి లోబడి ఉండాలను కొంటాడు. మామీద అధికారం తన హక్కు అనుకొంటాడు.

నాకు పెళ్లయ్యాక మా ఆవిడను తీసుకువెళ్ళటానికి వాళ్ళ నాయన ఎప్పుడు వచ్చినా వాడికి ఇష్టమైతే తీసుకువెళ్ళు అని నెపం నా మీదకు పెట్టేవాడు. ఆ మాట ఆయన అన్నాక నేను స్వతంత్రించి ఆమెను తీసుకుపోండి అనలేను. అంటే అది కుటుంబంలో మా నాన్న అధికారాన్ని తోసి రాజన్నట్లే. ఆమె మేనమామలు మొదలైన బంధువులు ఎవరు వచ్చి అమ్మాయిని తీసుకువెళతాం అన్నా పంపించేవాడు. తండ్రి వస్తే మాత్రం ఇదీ తంతు. ఆయన ఈ అధికార వైఖరి అన్యాయం అనిపిస్తున్నా ఏమీ అనలేక లోలోపల బాధపడేవాణ్ణి. మా మామగారు కూడా ఆయన ఆ మాట అన్నాక ఏమిరా ఏమంటావు అని నన్ను అడగలేకపోయేవాడు. అలా అడగటం కుటుంబ యజమాని అధికారాన్ని ధిక్కరించటమే. అవమానించటమే. ఇలా ఉంటాయి కుటుంబంలో మగవాడికి, కుటుంబ పెద్దకు ఉండే అప్రకటిత అధికారాలు.

మరి ఈ సమస్యను మీరెలా పరిష్కరించుకొన్నారు?
ఒకసారి ఇలాగే మామామగారు వచ్చారు మాఇంటికి. ఆరోజు ఎవరినో కలవాలని నన్ను వెంటపెట్టుకొని ఊళ్లోకి వెళ్ళాడు. తోవలో “ఏమిటిరా ఇది? కన్న తండ్రిని, కూతురిని ఇంటికి తీసికెళ్లే యోగం నాకు లేదా,” అని మా నాన్న ప్రవర్తనను ఉద్దేశించి బాధపడుతూ అడిగాడు. “నాకు తెలుసు మామయ్యా ఇది అన్యాయమని, కానీ ఏమిచేయాలో తెలియక బాధపడుతున్నాను,” అని చెప్పి… పోనీ ఇలా చేద్దాం… అని ఒక ఉపాయం చెప్పాను. యథాప్రకారం కూతుర్ని తీసుకువెళతానని మా నాన్నను అడుగు. ఆయన ఇదివరకులాగానే నా మీద పెట్టి ఊరుకొంటాడు. అప్పుడు నువ్వు మునుపటిలా వెళ్లిపోకుండా నా వైపు చూసి అమ్మాయిని తీసుకువెళతానని చెప్పు. తండ్రిగా నీకూతురు నీ ఇంటికి రావాలని నువ్వనుకొనటం న్యాయమే. అలాగే తీసుకెళ్ళు అంటాను నేను. వెంటనే రిక్షా తెచ్చి ఆమెను తీసుకుపో అని చెప్పాను. అయన అలాగే చేసాడు. కూతుర్ని తీసుకొని వెళ్ళాడు.

ఇక ఆ తరువాత ఇంట్లో ఎంత యాగీ అయిందో చెప్పలేను. ఆయన అధికారం కోట గోడలు బద్దలైనట్లు బాధపడ్డాడు మా నాన్న. నా వాదం నాది. మా ఇద్దరిమధ్య ఎవర్నీ ఏమి అనలేక మా అమ్మ గిలగిల లాడిపోయింది. నాకప్పుడు నాలుగైదు ఊళ్లలో నాటకాలు ఆడే పని ఉండటంతో అప్పటికి మా నాన్నను తప్పించుకొని బయటపడ్డా. కానీ ఆ తరువాత సమస్య ఉండనే ఉందిగా… ఆయన అనుమతి లేకుండా వెళ్లిన కోడలు ఇంటికి తిరిగి రావటం ఎలా? దానికి మా అమ్మమ్మ పరిష్కారం చెప్పింది. మావగారింటికి వెళ్లి నాలుగురోజులు ఉండి నీ భార్యను తీసుకునిరా… ఎలా కాదంటారో చూద్దాం అన్నది. మా నాన్నకు ఏమి చెప్పిందో కానీ సంఘర్షణ సద్దుమణిగింది. అప్పుడే ఆమె రాజమండ్రిలో మా కోసం ఇల్లు కట్టించటానికి కాకరపర్రు నుండి మేస్త్రీలను మాట్లాడి పంపింది. అంతటి వ్యవహర్త ఆమె.

మీ పెళ్లి ఎప్పుడైంది?
నా పదహారవ ఏట జరిగింది. స్కూల్ ఫైనల్ చదువుతున్నా. అప్పుడామెకు పదునాలుగేళ్ళు. 1939 సెప్టెంబర్ 19 న పుట్టింది. వాళ్ళది పశ్చిమ గోదావరి జిల్లా… మీ ప్రరవే మీటింగు కు నరసాపురం వచ్చానే… ఆ చుట్టుపక్కల వూళ్ళల్లోనే వాళ్ళ బంధువులంతా వుండేవాళ్ళు. (ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ప్రథమ వార్షిక సదస్సు నర్సా పురం లో 2011 జనవరి 25, 26 తేదీలలో “తెలుగు నాటక సాహిత్యం – స్త్రీలు” అనే అంశం మీద జరిగింది. దానికి ముఖ్య అతిధి కాకరాల. సూర్యకాంతి తో సహా వచ్చారు.) ఆవిడ వేదుల వారి ఇంటిపిల్ల. మా వేదుల గౌరీశమ్మ అమ్మమ్మ కుటుంబ బంధువులలో పిల్లే. కాకరపర్రులో వేదుల బాపన్నఅవధాని గారు, వేదుల రామావధాని గారు అని అన్నదమ్ములు ఉండేవాళ్ళు. రామావధానిగారు పూనుకొని ఈమె గురించి మా అమ్మమ్మకు చెప్పి, ఒప్పించి మా పెళ్లి కుదిర్చాడు.

అయితే మీ పెళ్లి 1953 లో అయిందన్నమాట!?
అంతే … మా పెళ్ళికి ముందర గోదావరి వరదలు. సీతంపేటలో ఉన్న మాఇంట్లోకి నీళ్ళొచ్చి ఇల్లు కుప్పకూలిపోయింది. ఆ హడావిడిలో నా కాళ్ళు పొంగిపోయినాయి. ఆ పెళ్లి తతంగంలో నేను కళ్ళు తిరిగి పడిపోయాను. దానితో ఆల గోల పాలగోల… అది చూసి నేనేదో తిరుగువుతునన్నట్లుగా సుబ్బయ్యగారు సంబంధాన్ని సరిగా చూసుకోలేదా అనేశాడు. ఆయన వధువుకు చిన్న మేనత్త భర్త. అయ్యో అదేమిటి? బంగారప్ప కొడుకుని ఎరగని వారెవరు? అని ఆవిడ అనేసరికి ఆయన తన మాట వెనక్కు తీసుకొన్నాడు. ఇక మళ్ళీ నన్నా దృష్టితో ఎన్నడూ చూడలేదాయన. కోడలిని ఎంత ప్రేమించారో నన్నూ అలాగే చూసుకున్నాడు.

మీ భార్య పేరేమిటి?
సూర్యకాంతం. ఆపేరుతో పిలవటం నాకు నచ్చలేదు. తనకీ నచ్చలేదు. ఏమోయ్ అని పిలవటం మొదలు పెట్టాను. ఆమె తన పేరును సూర్యకాంతి అని మార్చుకొంది. పెళ్లి తరువాత ఏడాదికి అటూ ఇటూగా శోభనం అయింది. ఆ రాత్రి ఆమెతో “నీ తరువాతే వేరెవరైనా… నీకు, నీ పిల్లలకి రక్షక స్థానంలో నేనుంటాను” అని చెప్పాను. ఆ నాటి నుండి ఆమెతో నా అనుబంధాన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చాను. ఎన్ని ఆటంకాలు, అవాంతరాలూ ఎదురైనా ఆమే నా జీవితానికి వెలుగు. ఎన్ని పరీక్షలు, అగ్నిపరీక్షలు ఎదురైనా నా వెలుగుకి దూరం కాను. నాతోనే నాలోనే ఆమె ఉన్నది. నేను ఉన్నంత కాలం నాతోనే నాలోనే ఆమె ఉంటుంది.

ఆమె తల్లిదండ్రులు?
మా మామగారు ఆకునూరి గోపాలశాస్త్రి. విలువలు గల మనిషి. వైద్యుడు. పౌరోహిత్యం ఉంది. ఏవీ డబ్బుకోసం చేయలేదు. రాజమండ్రి, కాకరపర్రు ఇలాంటి నగరాలు, నగరసమీప గ్రామాలలో ఆయన ఎప్పుడూ లేడు. అల్లూరి సీతారామరాజు తిరిగిన
రంపచోడవరం వంటి లోతట్టు గ్రామాలలో ఉండేవాడు. దారులు వెతుక్కొంటూ కాలినడకన పోవలసిందే ఆయన దగ్గరకు. తరువాతి కాలంలో భద్రాచలం చేరి పౌరోహిత్యం చేసుకొంటూ రాముల వారి సన్నిధి లో గడిపాడు. సూర్యకాంతి పెద్ద మేనత్త సుభద్రమ్మ. ఆమె కూతురిని మా బాబాయి కి ఇచ్చారు.

పెళ్లయ్యేటప్పటికి మీ చదువు అయిపోయిందా?
లేదు. పెళ్లయిన ఏడాదికి ఆమె మార్టేరు నుండి మాఇంటికి వచ్చింది. ఆమెతో పాటే నేనూ కాకరపర్రు వదిలి రాజమండ్రి చేరాను. రాజమండ్రి మున్సిపల్ హైస్కూల్ లో చేరాను. రాజముండ్రి స్కూల్ లో సహదేవ సూర్యప్రకాశ రావు వంటి మంచి టీచర్లు ఉండేవాళ్ళు. అక్కడే నేను స్కూల్ ఫైనల్ పరీక్షలు రాసాను.

నాటకాలలోకి మీరెలా వచ్చారు?
మా నాన్న నాటకాలు వేసేవాడు అని చెప్పానుగా… ఆయనతో పాటు రిహార్సల్స్ కు తీసుకువెళ్ళేవాడు. నాటకాలు వేస్తుంటే తీసుకువెళ్లేవాడు. అలా నాకు చిన్నతనంలోనే నాటక ప్రపంచం తెలిసింది. 1940 లనాటికే రంగస్థల నటుడుగా ప్రసిద్ధికి ఎక్కిన పీసపాటి నరసింహమూర్తి మా తాతగారి దగ్గర స్మార్తం నేర్చుకొన్నాడు. ఆ రకంగా ఆయన నాకు సన్నిహితుడు. చివరివరకు కూడా. ఈ నేపధ్యంలో మా తాతల సంప్రదాయాన్ని కొనసాగించాలని నాకు పట్టుదల కలిగింది. కాకరపర్రు బడి చదువులకాలంలో వేదుల సూరి మాష్టారు నన్నునాటకాలలోకి దింపాడు. సంస్కృత నాటకాలు తాను వేస్తూ నాలాంటి వాళ్లకు పాత్రలు ఇచ్చి నటన నేర్పాడు.

మీరువేసిన మొదటి నాటకం? మొదటిపాత్ర?
భోజసభ. వేదుల సూరిమాష్టారు మాబడిలో సంస్కృతం మాష్టారిచేత ఈ నాటకం రాయిం చాడు. తాను కాళిదాసు పాత్ర వేసాడు. నా చేత భోజసభలో ఒక పండితుడి వేషం వేయించాడు. అందుకోసం సంస్కృత శ్లోకాలు, సంభాషణలు బట్టీయం వేసాను.

తరువాత నాటకాలలో ఎలా కొనసాగారు?
కాకరపర్రు నుండి రాజమండ్రికి వచ్చాను. ఆవిడ కాపురానికి వచ్చింది. నాటకాల మీద దృష్టి మాత్రం చెదరలేదు. రాజమండ్రి వచ్చాక నాటకాలకు దగ్గరయ్యాను. మా నాన్న వాళ్ళ నాన్న మాటవిని నాటకాలు మానేసాడు కానీ మా పెదనాన్న – నాన్న పెత్తండ్రి కొడుకు – కాకరాల కామేశ్వరరావు మాత్రం నాటకాలు ఆడుతూనే ఉన్నాడు. ఆయన ద్వారా రాజమండ్రి లో నాటకాలలోకి ప్రవేశించాను. గుండెపల్లి కరణం అనే ఆయన, బేతా రామచంద్ర రావు కలిసి పౌరాణిక నాటకాలు ఆడుతుండేవాళ్లు. చింతాసుబ్బారావు అనే ఆయన పౌరాణిక నాటకాలకు దుస్తులు ఇచ్చి నాటకాలు వేయించేవాడు. పద్యనాటకాలలో హార్మోనిస్టు కూడా. అలా కాకరపర్రులో సంస్కృత నాటకాలతో మొదలైన నా జీవితం రాజమండ్రిలో పౌరాణిక నాటకాలలోకి వచ్చి పడింది.

బేతా వెంకట్రావు అని ఒక నటుడు ఉండేవాడు. ఆంజనేయుడి పాత్రకు ప్రసిద్ధుడు. బేతా రామచంద్రరావు ఆయన కొడుకే. తండ్రి చనిపోయాక ఆయన వారసత్వం తీసుకొని ఆంజనేయుడి పాత్ర వేస్తుండేవాడు. వాళ్ళు వేసే నాటకాలు రామాంజనేయ యుద్ధం, హరిశ్చంద్ర. అందులో మా పెదనాన్న కాకరాల కామేశ్వరరావు వశిష్ఠుడు పాత్ర, నేను విశ్వామిత్రుడి పాత్ర వేస్తుండేవాళ్ళం. ‘ఆర్యాపురం ఆంధ్రకేసరీ వాణీ నాట్యమండలి’ ట్రూప్ లో భాగంగా ఈ నాటకాలు వేసేవాళ్ళు. దేవీ నవరాత్రులు, రామనవమి నవరాత్రులలో పౌరాణిక నాటకాలు బాగా ఆడుతుండేవి. నాటక సమూహాలు, డ్రెస్ కంపెనీలు బిజీగా వుండే సమయం అది.

నాటకంలో వేషం వేసినందుకు మీకేమైనా పారితోషికం ఇచ్చేవాళ్లా?
ఆఁ. శిక్షణ ఇచ్చి, డ్రస్సులు ఇచ్చి నాటకం వేయించి అయిదు రూపాయలు ఇచ్చేవాళ్ళు.

మీరిలా నాటకాలలోకి రావటం మీ నాన్న కు ఇష్టమేనా?
తండ్రి మాటవిని నాటకాలు మానేసిన మా నాన్నకు నేను నాటకాలు వేయటం ఎలా ఇష్టం అవుతుంది? శొంఠి పిక్కలు పెట్టినట్లు వెనుక నుండి ఏదో ఒకటి అంటూ ఉండేవాడు. కానీ మా పెదనాన్నతో కలిసి వేస్తుండటం వలన ముఖం పట్టుకొని నన్ను ఏమీ అనటానికి వీల్లేకపోయింది.

నాటకాల వల్ల నికరమైన ఆదాయం లేదుకదా! అది సమస్య కాలేదా ఇంట్లో?
ఎందుకు కాదు!? అయితే అప్పటికి నేను ఆర్యాపురం యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తుండేవాడిని. అక్కడి పిల్లలకు ఒకరికి రూపాయి తీసుకొని ట్యూషన్ చెప్పేవాడిని. ముప్ఫయి నలభై మంది పిల్లలతో అదొక వీధిబడిగా ఉండేది. 30 రూపాయలవరకు అలా సంపాదించేవాడిని. నాటకాల మీద వచ్చే ఆ ఐదూ పదీ కలుస్తుండేవి .. దానితో ఆర్ధికంగా ఆయన మీద ఆధారపడే అవస్థ రాలేదు. అందువల్లనే ఆయన నా నాటకాలకు ప్రత్యక్షంగా అభ్యంతరం చెప్పే వీలు లేకపోయింది.

నాటకాల నుండి సినిమాకు ఎలా వెళ్లారు? ఎప్పుడు వెళ్లారు?
నాకు సినిమాలలో నటించాలన్న కోరిక కాకరపర్రు స్కూల్ చదువుల కాలంలోనే ఉంది. నాకు స్నేహితుడు ఒకడు చెరుకు గానుగాడే వారి అబ్బాయి ఉండేవాడు. వాడిని రెచ్చగొట్టి మద్రాసుకు వెళ్ళటానికి రైలెక్కేసాం. నిడదవోలు దాటేసరికి వాడికి ధైర్యం చాలల. వెనక్కి వెళ్ళిపోదాం అని గొడవ. వాడు లేకుండా నేనెలా వెళ్ళేది. సొమ్ము పెట్టేవాడు వాడేనాయ! చేసేది లేక వెనక్కి వెళ్లిపోయాం. ఇది తెలిసి మా స్కూల్ క్రాఫ్ట్ టీచర్ నా నుదిటి మీద ఎర్రపెన్నుతో ఇంత వెడల్పున ‘స్టూడియో మాన్’ అని రాసి స్కూలంతా తిప్పాడు. దానితో బుద్ధివచ్చి సినిమాల ప్రసక్తి మానేస్తాననుకొన్నాడు ఆయన. కానీ నాకు మరింత పట్టుదల పెరిగింది, స్టూడియో మాన్ అయితీరాలని.

సినిమాలు బాగా చూసేవాళ్ళా?
బాగా చూసేవాడిని. హావభావ ప్రదర్శన, డైలాగ్ డెలివరీ మొదలైనవాటిని ఆసక్తిగా పరిశీలించేవాడిని. మనోహర అనే సినిమా పది సార్లు చూసాను. అది డబ్బింగ్ సినిమా. శివాజీ గణేశన్ ప్రధాన పాత్ర. ఆయనకు తెలుగులో స్వరం ఇచ్చింది జగ్గయ్య. ప్రతి సీన్ పెద్దపెద్ద డైలాగులతో ఉండేది. వాటిని కంఠతా వచ్చే వరకు ప్రాక్టీస్ చేసి బేస్ వాయిస్ సాధించా. బేస్ వాయిస్ అంటే నాభి మూలం నుండి కంఠం మీదుగా డైలాగ్ చెప్పటం. గరికపాటి రాజారావు గారి శిక్షణ కూడా అలాగే ఉండేది. బేస్… బేస్… అంటూ అది డైలాగ్ లో ధ్వనించేవరకు ఊరుకొనేవాడు కాదు. రాజీ పడడు. ప్రాక్టీస్ లో చావగొట్టేస్తాడు. ఆయన పరిచయం నన్ను సినిమారంగానికి తీసుకువెళ్ళింది. నేనే కాదు, కృష్ణ వంటి ప్రముఖ నటులు ఎందరో ఆయన శిక్షణలో మెరుగెక్కిన వాళ్ళే.

రాజారావు గారితో మీకు పరిచయం ఎలా అయింది?
నేను మున్సిపల్ రాజమండ్రి స్కూల్ కి వచ్చేటప్పటికే ఆయన రాజమండ్రిలో వైద్యుడుగా పని చేస్తూ ‘రాఘవ కళాసమితి’ ని ఏర్పరచి నాటకాలు వేయిస్తున్నాడు. వేస్తున్నాడు. డాక్టర్ రాజారావు- డాక్టర్ గంగాధర రావు చదువుల కాలం నుండి మంచి మిత్రులు. బళ్లారి రాఘవ అభిమానులు. ఆరాధకులు. ఆయనతో పాటు మెడిసన్ చదివిన మరొక మిత్రుడు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి. పుచ్చలపల్లి సుందరయ్యకు తమ్ముడు. అలా కమ్యూనిస్టు ప్రభావాలలోకి వెళ్లి అటు ప్రజావైద్యుడుగా, ఇటు ప్రజా నాట్యమండలి వ్యవస్థాపక కార్యదర్శిగా గొప్ప అనుభవం గడించిన మనిషి ఆయన. మద్రాసు వెళ్లి పుట్టిల్లు సినిమా తీసి తిరిగి వచ్చి గంగాధరరావుతో కలిసి రాఘవకళాసమితి ఏర్పరచాడు. ఆ సంస్థ నుండి సాంఘిక నాటకాలు మాత్రమే వేసేవాళ్ళు. దానికి కార్యదర్శి వ్యాసంరెడ్డి వెంకటరావు. హితకారిణీ సమాజం మనిషి.

రాఘవకళా సమితిలో మేడూరి వీరవెంకన్నఅనే నటుడు రాజారావుతో యేవో అభిప్రాయభేదాలు వచ్చి బయటకు వచ్చేసాడు. వెల్లంకి వెంకటేశ్వర్లు అనే పెద్ద నటుడి పేరుమీద ఆయన కొడుకు పెట్టిన ఒక నాటక సమాజానికి పనిచేయటానికి కుదురుకొన్నాడు. దానితో రాఘవ కళాసమితి ప్రదర్శనకు సిద్ధం చేస్తున్న ఆత్రేయ గారి ‘భయం’ నాటకంలో గుమాస్తా పాత్రకు మరో మనిషి కావలసి వచ్చాడు. పి. ఎస్. భాస్కరం అని అతను నాకు మిత్రుడు. రాఘవ కళాసమితి నాటకాల్లో వేస్తుండేవాడు. ఆ నాటకంలో తాను వేస్తున్న మరో పాత్రను నాకు ఇప్పించి తాను ఆ గుమస్తా పాత్ర వెయ్యాలనుకొని నన్ను తీసుకెళ్లి పరిచయం చేసాడు. ఆ రకంగా రాజారావు గారితో నాకు పరిచయం అయింది. అయితే వాళ్ళు అయన పాత్ర నాకియ్యకుండా, ఆ పాత్రకు ఆయననే ఉండమని నాకు గుమస్తా వేషం ఇచ్చారు.

రాఘవ కళాసమితి ప్రధానంగా ఆత్రేయ నాటకాలు వేయించేది. దాదాపు అన్ని నాటకాల లోనూ నాకు ఏదో ఒక పాత్ర ఉండేది. రాజారావు గారితో పాటు రాఘవకళాసమితి నిర్మాణంలో భాగం అయిన డా. గంగాధరరావు స్వయంగా నాటక రచయిత. ఆయన రాసిన నాటకాలు కూడా విరివిగా వేయించారు. వీటితో పాటు రాజారావు పృథ్వి రాజకపూర్ నాటకాలు అనువాదం చేయించి వేయిస్తుండేవాడు. పృథ్వి రాజుగారి పైసా నాటకం తెలుగులో ధనం అనే పేరుతో అనువాదం అయింది. అందులో కూడా నాకొక పాత్ర ఇచ్చారు.

ఏమి పాత్ర అది?
పృథ్విరాజు నాటకంలో ప్రధానపాత్రకు ఒక మంచి స్నేహితుడు, ఒక చెడ్డ స్నేహితుడు ఉంటారు. ఒక స్నేహితుడు చెడువైపు లాక్కెళుతుంటే మరొక స్నేహితుడు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ మంచికి మళ్లించటానికి ప్రయత్నిస్తుంటాడు. నాకు మంచి స్నేహితుడి పాత్ర ఇచ్చారు. నిజానికి పౌరాణిక నాటకాలలో వేషాలు వేసేవాళ్లను రాఘవకళాసమితి తీసుకొనేది కాదు. కానీ నాకు మాత్రం పౌరాణిక నాటకాలలో వేస్తూ ఈ నాటకంలో వేయటానికి అనుమతిచ్చాడు రాజారావు. అక్కడినుండి నేను ఆయనను వదిలిపెట్టలేదు. ఒక నాటకం, దాని మంచీ చెడ్డా, ఎలా రిహార్సల్స్ చేయించాలి ఇవన్నీ ఆయన నుండే నేర్చుకున్నాను.

నాటకం మంచీ చెడ్డా నిర్ణయించటానికి సూత్రాలు ఏమైనా ఉన్నాయా?
సూత్రాలు అని చెప్పలేను కానీ ప్రోగ్రెసివ్ , నాన్ ప్రోగ్రెసివ్ అనేవి కొలబద్దలు అని స్థూలంగా చెప్పగలను.

ఇవన్నీ రాజమండ్రిలో ఉండగా వేసిన నాటకాలేనా?
అవును.

మీ తొలి సాంఘిక నాటకం ఏది?
వేదాంతకవి రాసిన ‘తెలుగు తల్లి’ అది ఒక్కటే కాకరపర్రులో మేం వేసిన సాంఘిక నాటకం. కాకరపర్రులో ఓలేటి కవి అనే ఆయన ఉండేవాడు. ఆయన కొడుకు సత్యమూర్తి. తెలుగుతల్లి మొదలైన నాటకాలు వేసేవాడు. అందులో చిలకమర్తి మనుమడు పురాణపండ లక్ష్మీ నరసింహం తాతగారి వేషం వేసేవాడు. కాకరపర్రు టీచర్లు అందరూ ఈ నాటకంలో వేషాలు వేస్తుండేవాళ్లు. పురాణపండ లక్ష్మీ నరసింహం అంటే మాకు ఆరాధనగా ఉండేది. ఆయన మాకంటే పెద్దవాడు. కానీ నాకు క్లాస్ మేట్. చిలకమర్తి వారు పిల్లలు లేకపోతే ఒక ఆడపిల్లను పెంచుకొని తన మేనల్లుడికి ఇచ్చి పెళ్ళిచేసాడు. వాళ్ళ కొడుకే ఈ పురాణపండ లక్ష్మీ నరసింహం. చిలకమర్తి చివరి రోజులలో మేనల్లుడి దగ్గర కాకరపర్రులోనే వున్నాడు. నేను ఆయనను అక్కడ చాలాసార్లే చూసాను.

మీరు మద్రాస్ ఎప్పుడు వెళ్లారు?
1958 లోనో 1959 లోనో రాజారావు గారు మద్రాసుకు మకాం మారుస్తూ ఉత్తరం రాస్తాను, అప్పుడు వద్దువుగానీ అని చెప్పివెళ్ళారు. ఆ ఉత్తరం ఎప్పుడు రావాలి? నేనెప్పుడు వెళ్ళాలి అని తహతహ లాడుతున్నాను. అప్పుడు రాజమండ్రిలో ‘నవ్వులు- పువ్వులు’ అని పత్రిక వస్తుండేది. రామచంద్రారెడ్డి నడుపుతున్నాడు. ఆ పత్రికకు సినిమా వార్తలు రాసే పని మీద పంపుతున్నట్లు ఆయన ఒక లెటర్ ఇస్తే , నీకు సినిమా రంగంలోకి ప్రవేశం లభిస్తుంది అని ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. రామచంద్రారెడ్డి ఇచ్చిన ఉత్తరం తీసుకొని మద్రాస్ చేరుకొని రాజారావు గారింటికి వెళ్ళాను. ఇలాగని చెప్పగానే ఆలాగే కానీయ్ అన్నాడు. వాళ్ళింట్లో ఉంటూ నెలకు టిక్కెట్లు కొనుక్కొని హోటల్ లో భోజనం చేస్తూ సినిమావార్తలు సేకరించి వార్త రాసి పంపుతుండే వాడిని.హోటల్ ఖర్చులు చూసుకొని ఆవిడను పిలిపించుకొంటాను అని చెప్తే రాజారావు గారు సరేనోయ్ అన్నారు. అలా ఆవిడ కూడా మద్రాస్ వచ్చేసింది. రాజారావు గారింట్లోనే మా సంసారం. లేదు అన్న మాట లేదు ఆయన దగ్గర.

మీరు తొలిదశలో ఉపాధ్యాయుడు. ఇప్పుడు పత్రికారచయిత కూడా అయినారన్నమాట! దానివల్ల మీకేమైనా ఆదాయం ఉండేదా?
పత్రికా రచయితనే. కానీ వేతనం ఏమీ లేదు. పత్రికకు సినిమావార్తలు రాయమని ఆయన ఇచ్చిన ఉత్తరమే అన్నీను. అయితే ఈ పని ఎక్కువకాలం చేయలేము అనిపించింది. అదే సమయంలో సుబ్బారావు అని నాతో పాటు నాటకాల్లో వేసే మిత్రుడు ఉడ్ ల్యాండ్ హోటల్ లో టి.ఆర్.సుందరం ఉన్నాడని వెళ్లి కలిస్తే మంచిదని సలహా చెప్పాడు. టి. ఆర్. సుందరం అంటే సేలంలో మోడరన్ థియేటర్ అనే సినిమా నిర్మాణ సంస్థను ఏర్పరచిన విద్యావం తుడు, పారిశ్రామిక వేత్త. సినిమా అవకాశలకోసం ఆయనను కలవాలనుకొంటున్నాను అని చెప్తే రాజారావు సరే అన్నాడు. కలిసాను. సినిమా వాళ్ళు నీకెవరు తెలుసు? అని అడిగాడు ఆయన. ఆత్రేయ, జమున అని చెప్పాను. ఉత్తరం రాస్తాం అప్పుడు రా అన్నాడు. సేలం రావలసి ఉంటుంది. నిన్నక్కడ పరీక్షించి పనికొస్తావనుకొంటే అవకాశం దొరుకుతుంది. లేదంటే నీ ఖర్చులతో నీవు తిరిగి వెళ్లాల్సి ఉంటుందని ఉత్తరం వచ్చింది. అది పట్టుకొని నేనూ సుబ్బారావు సేలం వెళ్లాం. అక్కడ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయటానికి కూర్చున్న వాళ్ళు డైరెక్టర్ ఎస్. డి. లాల్, అసోసియేట్ డైరెక్టర్ రామశర్మ, అసిస్టెంట్ డైరెక్టర్ త్యాగరాజు… అందరూ తెలిసినవాళ్ళే. రాజమండ్రలో కలిసి నాటకాలు ఆడినవాళ్ళే. నిన్నుమేం పరీక్షించేదేమిటి టిఫన్ చేసి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అన్నారు. స్టూడియో లో పర్మినెంట్ ఆర్టిస్టుగా నెలకు వందరూపాయలు ఇచ్చి, పని పూర్తయ్యేవరకు వసతి భోజనం ఏర్పాటు చేసేట్లు ఒప్పందం కుదిరింది. నాతోపాటు సుబ్బారావు కు కూడా. ఎ. సుబ్బారావు అతను.

పర్మినెంట్ ఆర్టిస్ట్ అంటే?
ఏముంది ఎప్పుడు ఏ సినిమాలో ఏ పాత్ర అవసరమైతే ఆ పాత్ర వెయ్యటం. సహస్ర శిరస్చేద అపూర్వ చింతామణి సినిమా మొదటిది. (1960) అలా సినిమాలలో చిన్నవీ చితకవీ రకరకాల పాత్రలు వేస్తుంటే రాజనాల నన్ను ‘దశావతారం’ అంటూండేవాడు. విఠలాచార్య సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలు వేసా. నాకు వచ్చే 100 రూపాయలలో 20 చేతి ఖర్చులకు ఉంచుకొని 80 రూపాయలు మద్రాసులో రాజారావు గారింట్లో ఉంటున్న మా ఆవిడకు పంపేవాడిని. కొన్ని నెలలు సేలంలో ఉండి సినిమాలకోసం అలా పని చేశా. ఆ తరువాత ఎస్. డి లాల్ అదే వందరూపాయాలు, అవే భోజన వసతులు ఏర్పాటుచేస్తాను తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చెయ్యమంటే నాలుగైదు మాసాలు ఆ పని కూడా చేసాను.

సేలం నుండి మద్రాస్ ఎప్పుడు వచ్చారు? ఎందుకువచ్చారు?
ఎందుకేమిటి? సినిమాలలో అవకాశాలు వెతుక్కొంటూ వెళ్ళాను. దాదాపు ఏడాది కాలం ఉన్నాను. అనుకొన్నది అయింది. ఇక మద్రాస్ వచ్చేసాను. మా ఆవిడను రాజారావుగారింట్లో వదిలి వచ్చాను కదా! మళ్ళీ వాళ్ళింటికే వెళ్లాను. నేను ఎక్కడికి పోయినా ఎక్కడ వున్నా కేంద్రం రాజారావు గారే. 1943 నుండి “ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్” (IPTA) తో ఉన్న అనుబంధంతో ఆయన దాని పేరు మీదనే నాటకాలు వేయించేవాడు. సి. సుబ్రహ్మణ్యం – పద్మా సుబ్రహ్మణ్యం అని డాన్సర్ ఉంది కదా ఆమె తండ్రి – పెద్ద డైరెక్టర్. ఆయన మార్గ దర్శకత్వంలో రాజారావు కీలక పాత్ర వహించి ఈ పని చేసేవాడు. నన్ను, మా ఆవిడను కూడా అందులో సభ్యులుగా చేర్చారు. రాజారావు గారు ఎక్కడ ఉంటే అక్కడే ఒక థియేటర్. అలా మద్రాసులో కూడా ఆయన దర్శకత్వంలో నాటకాలు వేసాను. అల్లూరి సీతారామరాజు నాటకంలో సింగన్న వేషం వేసాను. అందులో ఆయన రూధర్ ఫర్డ్. రాజబాబు, అల్లు రామలింగయ్య కూడా ఆ నాటకంలో వేశారు. జై భవానీ అనే మరో నాటకంలో నాకు శివాజీకి కమాండర్ ఇన్ చీఫ్ బాజీరావు దేశపాండే వేషం ఇచ్చారు. బక్కపలచటి శరీరంతో బాజీరావు పాత్ర వేయటం యెట్లా అంటే రోజుకు రెండు గుడ్లు, గ్లాసుడు పాలు నాకు శాంక్షన్ చేశారు. ప్రత్యేకంగా కుట్టిన దుస్తులతో నాది భారీ విగ్రహం అనిపించేలా మేకప్ చేయించారు. ఈ రెండు నాటకాలు అనేక సార్లు ప్రదర్శించాం. “ఫూలే ఫలే నచేతయదపి వర్షేమ్ సుధాజలం / మూర్ఖ హృదయేన చేతదో గురు మి(లేం)ళం విరంచసం” ఆ నాటకం లో శ్లోకం ఇది.

తెలుగునాటకాలలో సంస్కృత శ్లోకమా?
అవును. అలా ఉండేవి అప్పుడు.

రాజారావు గారు మీకు రోజుకి రెండు గుడ్లు శాంక్షన్ చేసారు అన్నారు. మీరెమో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చారు. గుడ్డు ఎలా తినగలిగారు? దానిపై ఇంటి నుండి అభ్యంతరాలు రాలేదా?
రాజారావుగారి పరిచయం నాకు డి క్లాసిఫై కావలసిన అవసరాన్ని చెప్తూ వచ్చింది. రాజమండ్రి లో ఉండగానే కులాన్ని గుర్తుచేసే జంధ్యం వేసుకొనటం ఇబ్బందిగా అనిపించింది. తీసేస్తే మా నాన్న అగ్గిరాముడవుతాడు. అప్పటికే ఆయన మీద అనేక రకాల యుద్ధాలు చేస్తున్నాను. అందుకని ఇంట్లో ఉన్నప్పుడు భుజాన వుండే జంధ్యం బయటకు వెళ్ళేటప్పుడు మొలతాడు అయ్యేది. ఇక మద్రాస్ వచ్చి రాజారావు గారితో వాళ్లింట్లోనే ఉండటం, వాళ్ళింటికి వచ్చిపోయే అనేకమందిని చూస్తుండటం, వింటుండటం, మాట్లాడుతుండటం తో విలువలకోసం జీవించటం అంటే డీ క్లాసిఫై కావటం అని బాగా అర్ధం అయింది. డి క్లాసిఫై కావటం అంటే బ్రాహ్మణత్త్వపు సంప్రదాయం ఆమోదించిన కుల మత నియమాల నుండి, ఆచారాలనుండి, విశ్వాసాలనుండి బయట పడటం. మా అమ్మమ్మ, మా మామగారు కూడా విలువల కోసం నిలబడ్డవాళ్లే. డి క్లాసిఫై కావటం గురించిన అవగాహన వాళ్ళ కాలానికి లేదు. కానీ నా కాలం, రాజారావు గారి సాహచర్యం నాకు ఆ ఆలోచన ఇచ్చింది. మార్క్సిస్టు సాహిత్యం దగ్గరయ్యే కొద్దీ స్పష్టత వచ్చింది. ఆహారపు అలవాట్లు మార్చుకొనటం నాకందు వల్ల సమస్య కాలేదు. సినిమాలలో నా తోటి నటీనటులతో కలిసి మాంసాహారం తీసుకొనే వరకు ప్రయాణించాను.

మరి సూర్య కాంతి గారి పరిస్థితి ఏమిటి?
ఆమె మొదట్లో కాస్త ఇబ్బంది పడింది. రాజారావు గారు వాళ్ళు బలిజ కులస్థులు కదా!? వాళ్ళింట్లో ఉండటం ఏమిటి? తినటం ఏమిటి అని గొడవ పడేది. మనల్ని చేరదీసి పిల్లలుగా చూసుకొనే మనుషులను కులం ఎంచి మనం అధికులం అనుకొనటం తప్పుకాదా అని నేను నచ్చచెప్పే ప్రయత్నం చేసేవాణ్ణి. నేను నేర్చుకొంటూ మారుతూ ఆమెకు చెప్తూ మార్పుకు సహాయపడేవాణ్ణి. ఆ క్రమంలోనే మేము రాబడికి లోబడి జీవించాలని, చెప్పింది చెయ్యటం చేసింది చెప్పటం అనే సూత్రం మీద జీవితం గడపాలని ఒక అవగాహనకు వచ్చాం. శ్రీశ్రీ మార్గంలో నడవాలని నిర్ణయానికి వచ్చాను. ఆమె కూడా ఇష్టపడింది.

మీ అమ్మా నాన్న తమ్ముళ్లు… వాళ్ళ సంగతి ఏమిటి?
ఏముంది? వాళ్ళు ఈ దారికి రాలేదు. ఒక సంగతి చెప్తా వినండి. మా చిన్నతమ్ముడు రాంబాబు కు గుజరాతి అమ్మాయితో పెళ్లి కుదిరింది. గుజరాత్ లో రిజిస్టర్ పెళ్లి చేస్తామని వాళ్ళు అన్నారు. తాళి లేకుండా పెళ్లి ఏమిటి ..!? అని మా వాళ్ళ వ్యతిరేకత. మా చెల్లెలు అమ్మ ఇలా అంటున్నది, వీళ్ళిలా అంటున్నారు అని అక్కడ జరుగుతున్నవి చెప్పేది. పెళ్లి ఏ రకంగా జరిగితే ఏమిటి? పిల్లలు ఇద్దరూ అంగీకరించాక మనం అభ్యంతర పెట్టకూడదు. అంటూ మా అమ్మకు నచ్చచెప్తూ ఉత్తరాలు రాసేవాణ్ణి. ఇలా చెప్పగా చెప్పగా పెళ్ళికి రావటానికి ఒప్పుకున్నది. మా అమ్మ, చెల్లెలు, నేను, ఆవిడ మాత్రమే పెళ్ళికి వెళ్ళాం. పెళ్లి జరిగి తిరిగి వస్తుండగా మా అమ్మ అంది ‘తాళి లేకపోయినా పెళ్లి బాగా చేశారురా’ అని. ఆవిడ ముందు కాస్తా మొరాయించినా నచ్చచెప్తే ఎక్కడో లాజిక్ కు లోబడేది. అలా మారగలగటం వల్లనే ఆమె నాతో చివరివరకు ఉండగలిగింది. ఇంటికి వచ్చే గద్దర్ మొదలైన వాళ్ల తో ఆదరంగా మాట్లేడేది.

సేలం నుండి మద్రాస్ వచ్చాక రాజారావు గారి దర్శకత్వంలో నాటకాలు వేయటంతో పాటు ఇంకేమేమి చేశారు?
రాజారావు గారి ఇంటి నుండి గాలి బాలసుందరరావు గారింట్లో ఒక భాగంలో అద్దెకు చేరాం. రాజారావు గారి మనిషిగానే అది దొరికింది. అక్కడ చుట్టుపక్కల ఉండే యువకులం కొందరం కలిసి నాటకాలు వేస్తుండేవాళ్ళం. కామెడీ వేషాలు వేసే సీరియస్ కళాకారుడు తారా కృష్ణ, నేను దర్శకత్వం వహిస్తుండేవాళ్ళం. నటించేవాళ్ళం కూడా. మాతోపాటు లింగమూర్తి గారి కొడుకు ప్రభాకర్ కూడా.

ఏమేమి నాటకాలు వేశారు?
గణేష్ పాత్రో పావలా నాటకం వేసాం. రావిశాస్త్రి నాటకాలు విషాదం, తిరస్కృతి వేసేవాళ్ళం. విషాదం నాటాకానికి తారాకృష్ణ దర్శకుడు. ఇన్స్పెక్టర్ పాత్ర నేను, స్త్రీ పాత్ర తారకృష్ణగారి భార్య – పేరు గుర్తుకు రావటం లేదు- వేసేది. కె. జానకి అనే ఆవిడ కూడా మాతో చాలా నాటకాలలో వేసింది. క్రిస్టియన్. ఆవిడ భర్త జాన్ బాబు. నాటకాలలో మ్యూజిక్ డైరెక్టర్. తిరస్కృతిలో మోహన్ బాబు పాత్ర వేసిన మంచు భక్తవత్సల నాయుడు ఆ పాత్ర పేరుతోనే సినిమాలలో కొనసాగి ప్రసిద్ధుడయినాడు. వాణీ మహల్ లో, కాకపోతే కృష్ణ గాన సభలో ప్రదర్శించేవాళ్ళం. పానగల్ పార్కుకు ఇటు వైపొకటి అటువైపొకటి ఉంటాయి. వాణీ మహల్ చిత్తూరు నాగయ్య కట్టించాడు. ఆ క్రమంలో ‘క్రెమ్లిన్ గంటలు’ అనే రష్యన్ అనువాద నాటకాన్నికూడా ప్రదర్శించాం. ఈ నాటకానికి అన్నీ తానై నాకెంతో దోహదం చేసింది సూర్యకాంతి. చివరివరకు నాటకాలు ఆడుతూనే వున్నాను. ప్రదర్శనల కోసం మద్రాస్ నుండి ఆంధ్రదేశంలో బహుప్రాంతాలకు వస్తూపోతూ ఉండేవాడిని. రావు గోపాల రావు తో కలిసి భమిడిపాటి రాధాకృష్ణమూర్తి ‘కీర్తిశేషులు’ నాటకంలో ఆయన అన్న వేషం వేస్తే నేను తమ్ముడి వేషం వేసేవాడిని.

క్రెమ్లిన్ గంటలు నాటకం వేయాలని మీకు ఎందుకు అనిపించింది? అప్పటికి మార్క్సిజం మీద గురి కుదరటం వల్లనా? రాజారావు గారి ప్రభావం వల్లనా?
మార్క్స్ ను ఏంగెల్స్ ను చదువుతున్న మాట నిజమే.రాజారావుగారి ప్రభావమూ కాదన లేనిదే. ఆయన ఆవరణలోకి వెళ్ళటం వల్ల ఆయన స్ట్రగుల్ లో భాగమయ్యాను. పుచ్చల పల్లి సుందరయ్యగారు, రామచంద్రారెడ్డిగారు, వాళ్ళ పిల్లలు అలా అందరూ నాకు ఆయన ద్వారానే సన్నిహితులు అయ్యారు. 1955 నాటికి వామపక్ష రాజకీయాలకు దగ్గరయ్యాను. రాజారావు ఆ రకంగా నాకు ఇప్పటికీ గురువే. అది మాత్రమే కాదు. సోవియట్ ఎంబసీలో ఉన్న మనవాళ్ళు ఈ నాటకం ఎలాగైనా ప్రదర్శించాలి అనుకొని నన్ను అడిగారు. సరేనన్నాను.

ఎవరా మనవాళ్లు?
సుబ్బయ్య … మన విరసం చెంచయ్యకు అన్నగారే. ఆయన ద్వారానే చెంచయ్య నాకు పరిచయం అయ్యాడు.

సుబ్బయ్య గారు మీకెలా తెలుసు.
క్రెమ్లిన్ గంటలు నాటక ప్రదర్శన విషయంలోనే మా పరిచయం. కొండేపూడి లక్ష్మీ నారాయణ అనువాదాన్ని పెట్టుకొని ప్రదర్శనకు వీలుగా సంక్షిప్త ప్రతి తయారుచేయటానికి తరచు ఇద్దరం కలిసేవాళ్ళం. ప్రదర్శన బాధ్యత నాదే. దర్శకుడిని నేనే. పాత్రల ఎంపిక చెయ్యాలి. లెనిన్ ఎత్తుకు సరిపోతాడని వల్లం నరసింహారావుని ఆ పాత్ర వెయ్యమని అడిగాను. నువ్వే వెయ్యి… నేను వేరే పాత్ర వేస్తానని అతను అనటంతో నేనే లెనిన్ వేషం వెయ్యాల్సి వచ్చింది. శ్రీశ్రీ ఈ ప్రదర్శన చూసి బాగుంది కానీ పొడుగు లెనిన్ అని మెచ్చుకున్నాడు.

రావిశాస్త్రి నాటకాలు విషాదం, తిరస్కృతి వేశారు కదా, నిజం వెయ్యలేదా?
లేదు. అది చాల కష్టమైన నాటకం. వేసినవాళ్లు ఉన్నారనుకోండి. సార్వభౌమారావు పాత్ర ఏ. ఆర్ కృష్ణ వంటివాళ్ళు చాలామంది వేశారు. అందరూ బాగానే చేశారు. కానీ దానిని బాగా చేయగల పర్సనాలిటీ ప్రకాశరాజ్ కు, ముమ్మట్టికీ ఉందంతే.

పర్సనాలిటీ అంటే రూపంతో పాటు ప్రదర్శన కళ కూడా కదా!?
అవును. పాత్రకు ఉన్న డైమన్షన్స్ అన్నిటినీ పట్టుకొని ప్రతిఫలించగల పర్సనాలిటీ ని గుర్తించి ఎంచుకోవటం రాజారావు గారి సాహచర్యం వల్లనే తెలిసింది. ఒక నాటకం మంచీ చెడ్డ, రిహార్సల్స్ చేయించే పద్ధతి అన్నీ ఆయన నుండి నేర్చు కున్నవే. ఆలా నేర్చుకొన్నవే నేను ఇతరులకు నేర్పించాను. అలాంటి రాజారావు చనిపోయాక ఇండియన్ పీపుల్స్ థియే టర్స్ అసోసియేషన్ పేరు తీసేసి వి కె ఆర్ జయంతి తనపేరు మీద ఒక సంస్థ ఏర్పరచి దానిపక్షాన ఆ నాటకాలు వేయిస్తుంటే నాకది నచ్చలేదు. విలువలు గల ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ సంస్థకు నాటకాలు వేసిన నేను వ్యక్తి కేంద్రమైన సంస్థకు నటించలేనని చెప్పేసాను.

కన్యాశుల్కము దూరదర్శన్ వారి సీరియల్ లో మీరు నటించారు కాదా! ఆ నాటకం రంగస్థల ప్రదర్శనలో ఎప్పుడైనా వేషం వేసారా?
వెయ్యకేం? వేసాను. సోమయాజులు, రమణమూర్తి సోదరుల ట్రూప్ కన్యాశుల్కము నాటకం అనేక ప్రదర్శనలు ఇచ్చారు. స్క్రిప్ట్, దర్శకత్వం వాళ్లదే. వాళ్ళ నాటకంలో కొన్ని సార్లు అగ్నిహోత్రావధాన్లు పాత్రను, కొన్ని సార్లు సౌజన్యారావు పంతులు పాత్రను వేసాను. దూరదర్శన్ లో అగ్నిహోత్రావధాన్లు పాత్ర వేసాను. అయితే వాళ్ళతో నాకు ఒక పేచీ ఉంది. నాటకంలో నాయకుడు గిరీశం అన్న భావం వాళ్ళది. గిరీశం నాయకుడు కాదు, అవకాశవాది. గురజాడ అంతర్యం, నాటకం అంతరార్ధం పూర్తిగా పట్టించుకోని వ్యవహారం అది. అందువల్లనే బుచ్చెమ్మకు గిరీశంతో పెళ్లి జరిపించటంతో ఆగక దూరదర్శన్ సీరియల్ మీనాక్షికి రామప్ప పంతులుకీ కూడా పెళ్లి చేసి సంస్కరణ చేసినట్లు సంతోష పడిపోయింది. అది పెద్ద విషాదం. కెవి రమణారెడ్డిగారి మార్గదర్శకత్వంలో కన్యాశుల్కము నాటకం ఆడితే బాగుండు అనిపించింది.

నాటక ప్రయోక్తగా కన్యాశుల్కము ప్రదర్శనయోగ్యమైన నాటకమేనని అంటారా మీరు?
ప్రదర్శనయోగ్యం కాదని కొందరి వాదన. నేను దానితో ఏకీభవించలేకపోయాను. అదేమిటో తెలుసుకోవాలనే తపనతో ఆ నాటకాన్ని, దానిమీద వస్తున్న విమర్శనా సాహిత్యాన్ని చదువుతూ వచ్చాను. ప్రదర్శనయోగ్యమే అన్న భావం నాకు బలపడుతూ వచ్చింది. నాటక రచన అభివృద్ధి అయినంతగా ప్రదర్శన అభివృద్ధికాలేదు అన్న త్రిపురనేని మధుసూదన రావు గారి అభిప్రాయం ఆలోచించవలసిందే.

1991-92 కన్యాశుల్కము నాటక ప్రదర్శన శతజయంతి సందర్భంలో తిరుపతిలో గురజాడ అధ్యయన కేంద్రం ఏర్పడి నిర్వహించిన సదస్సుకు మీరు కూడా వచ్చారని నాకు గుర్తు, నాటకాన్ని కేవలం సాహిత్యంగా మాత్రమే కాక రచనాప్రయోగాల దృష్ట్యా వ్యాఖ్యానించటం ఎంత అవసరమో మీరు చెప్పారప్పుడు.
అవును. నాటకాన్ని అలా అర్ధం చేసుకోనటమే నాకు తెలుసు.

విజయనగరంలో వెలుగు రామినాయుడు గారు వాళ్ళు కన్యాశుల్కము తొలికూర్పు ప్రదర్శన శతజయంతి సందర్భంగా ప్రతినెలా కన్యాశుల్కము మీద ఒక ప్రసంగంతో సభలు జరిపారు కదా!? ఆ సభలకు వెళ్ళారా మీరు?
వెళ్లాను. ఒక నెల నన్ను పిలిచారు. ‘కన్యా శుల్కం కథ పట్టుకి సామాన్య పాత్రల సహాయం’ అనే విషయం మీద మాట్లాడాను.

వేటపాలెం లైబ్రరీలో “మాహాకవి గురజాడ ఈ శతాబ్ది చిట్ట చివరి సంస్మరణ ” అని 1999 నవంబర్ 30 న ఒక సదస్సు పెడితే మీరు మద్రాస్ నుండి వెళ్లి మంచి ప్రసంగం చేశారని సజ్జా వెంకటేశ్వర్లు చెప్తుంటారు. ఆ విశేషాలు ఏమైనా చెప్తారా?
ఏమో! నాకు గుర్తు లేదు. సజ్జా వెంకటేశ్వర్లు చెబితే అది నిజమయ్యే ఉంటుంది.

కన్యా శుల్కము లో ప్రధాన పాత్ర ఎవరంటారు?
ఇంకెవరు? మధురవాణి. నాటకం ఆ పాత్రను కేంద్రంగా చేసి ప్రదర్శించాలి. అప్పుడు ఆ నాటక ప్రయోజనం పూర్తిగా వ్యక్తం అవుతుంది.

కన్యాశుల్కము మీద వచ్చిన విమర్శ వ్యాసాలను అంత విస్తృతంగా చదివారు కాదా? మీరేమైనా వ్యాసాలు రాశారా?
మీ పుస్తకానికి (కన్యాశుల్కం – సామాజిక సంబంధాలు 2005, జిజ్ఞాస ప్రచురణ) ముందుమాట రాయటమే మొదలు… కన్యాశుల్కము పైనే అని కాదుకానీ అప్పుడప్పుడు అరుణతారకు, సృజనకు, ప్రజాసాహితికి రాసాను. అన్నీ అవసరం కొద్దీ రాసినవే.

మీరు నటులు. ప్రయోక్త కూడా! నాటకాలు ఏమైనా రాశారా?
‘కన్యక’ అని ఒక నాటకం రాయవలసి వచ్చింది. గురజాడవారి కన్యక ను ఆధారంగా చేసుకొని డైలాగులు రాశా. పద్యభాగం టి. త్యాగరాజు రాసాడు. ఛందస్సు ఆ గోల నాకు తెలియదు మరి. నాటకం ప్రొడ్యూస్ చేసాను.

నాటకాలలో మీతో పాటు స్త్రీలు నటించేవాళ్ళా?
నటించేవాళ్ళు. అంటే కుటుంబ స్త్రీలు వచ్చారని చెప్పలేను. వేశ్యజాతి నుండి వచ్చి నటువంటి మణికుమారి లాంటి వాళ్ళు వేసేవారు. హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర వెంకటగిరి అనే ఆవిడ వేసేది. జై భవానీ లో ఒక స్త్రీ పాత్రకు ఒక సారి జయంతి నటించింది. మరొకసారి వాణిశ్రీ నటించింది. నటిగా చాల తెలివైంది వాణిశ్రీ. ఎలా నటించాలో ఇలా చెప్తుంటే అలా పట్టేసేది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జైభవానీ నాటకం ప్రదర్శించినప్పుడు నటించింది ఆమే. కన్యాశుల్కములో మధురవాణి పాత్రను విజయ నగరం నుండి వచ్చిన రాజకుమారి అనే ఆవిడ పోషించింది. బడిపంతులు నాటకంలో వేయటానికి విజయశ్రీ అనే ఆవిడ వచ్చింది. లక్ష్మి అనే ఆమె కూడా మాతో నాటకాలు వేసింది. పొట్టి లక్ష్మి అనేవాళ్ళు ఆమెను. ఆమెకు నటనలో శిక్షణ ఇచ్చింది రాజారావు గారే. సినిమాల్లో కూడా నటించింది. మంచి నటి.

మగవాళ్లే స్త్రీల వేషాలు వేసేవాళ్లేమో కదా!
అవును. వేయటం ఉండేది. కాకరపర్రు వేదాంతం సూరి మాస్టారు స్త్రీ వేషం వేసేవాడు. మగవాడు అని అనిపించనంత సహజంగా ఉండేది ఆ వేషం.

మద్రాస్ లో మీ సినిమా ప్రస్థానం ఎలా సాగింది?
తాపీ చాణక్య దర్శకుడుగా వచ్చిన రాముడు – భీముడు సినిమాలో ఒక చిన్న పాత్రతో ప్రారంభం అయింది. గాలి బాల సుందర రావు ద్వారా బి. యెన్. రెడ్డి కి దగ్గరయ్యాను నన్నూ చంద్రమోహన్ ను పిలిచి రంగుల రాట్నం సినిమా(1966) లో వేషాలు ఇచ్చాడు. నా సినిమా జీవితంలో అది ఒక మలుపు. అలా వాహిని సంస్థలో చాలా సినిమాలు చేసాను. టెక్నీషియన్స్ కోసం నటుడు నటించరాదు. నటుడు స్వతంత్రుడు అని ఆయన అభిప్రాయం. dont disturb my artists అని టెక్నీషియన్స్ ను హెచ్చరిస్తూ ఉండేవాడు. బాపుగారి అన్ని సినిమాల్లో నటించాను. ఆడుతూ పాడుతూ హాయిగా నవ్వుతూ పని చేయించేవాడు. ‘రండి, పాత్రలో ప్రవేశించండి’ అని పిలిచేవాడు. కోపం, చిరాకు ఆయనలో ఎప్పుడూ చూడలేదు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి , వి. మధుసూదనరావు రాజారావు శిష్యులు. రాజారావు మనిషిగా వి. మధుసూదనరావు దగ్గర చాలా సినిమాలు చేసాను. కోవెలమూడి సూర్య ప్రకాశరావు మరొక పెద్ద దర్శకుడు. మనిషిని ప్రేమించటం తెలిసినవాడు. ఆయనతో సాన్నిహిత్యం ఉంది. ‘రావయ్యా మహానుభావా’ అని ఆప్యాయంగా పిలిచేవాడు. ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలలో నాకు అవకాశం ఇచ్చాడు. అలా మూడువందలకు పైగా సినిమాలలో నటించాను.

మీకు నాటక జీవితం నచ్చిందా? సినిమా జీవితం నచ్చిందా?
నాటకం ఇచ్చిన తృప్తి సినిమా ఇయ్యదు. సినిమా ఇచ్చే సంపద నాటకం ఇయ్యదు.

ఇంత నాటక అనుభవం, సినిమా అనుభవం నుండి నటన అంటే మీరేమనుకుంటున్నారు?
నటుడి ప్రతిభ అంతా కృత్రిమ వాతావరణం లో సహజంగా జీవిస్తున్నట్లు నటించటంలోనే ఉంది. నటుడు పాత్రలో జీవించాలి. పాత్రకు లోబడి ఉండాలి.

సినిమారంగంలో మీరు సన్నిహితంగా పనిచేసింది ఎవరితో ?
జగ్గయ్య గారితో. వాళ్ళింటికి తీసుకువెళ్లి ఆయనను నాకు పరిచయం చేసిన వ్యక్తి ఎం. డి శ్రీనివాసన్. ఆయన రచయితలు, కళాకారులకు సంబంధించిన ఆల్ ఇండియా కాన్ఫెడ రేషన్ కు జాయింట్ సెక్రటరీ. మద్రాస్ ఫెడరేషన్ సెక్రటరీ. సినిమారంగానికి సంబంధించిన వివిధ యూనిట్స్ కు ఏర్పరచే సంఘాలు కలిసి ఫెడరెషన్. అవన్నీ కలిసి జాతీయ స్థాయిలో కాన్ఫెడరేషన్. ఆర్టిస్ట్స్ & డబ్బింగ్ ఆర్టిస్ట్స్ సంఘం ఏర్పరచటానికి నన్ను జగ్గయ్య గారింటికి తీసుకువెళ్లి ఆయన అధ్యక్షుడుగా, నేను కార్యదర్శిగా వుండి పని చేసేట్లు ఒప్పించాడు. సినిమారంగంలో వాళ్ళను సమీకరించటం వాళ్ళ సమస్యలను గుర్తించటం, రావలసిన వాటి గురించి పనిచేయటం ఇది మా యూనియన్ పని. అది ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ లో భాగంగా ఉండేది. దక్షిణాదిన నాలుగు భాషలకు సంబంధించినవాళ్లు మద్రాస్ లో ఉండేవాళ్ళు. వాళ్లంతా అందులో సభ్యులు.

రాజారావు గారి వల్ల సినిమాలలో రాజబాబు నాకు బాగా సన్నిహితుడు అయ్యాడు. ఏమండీ అని మొదలై, ఏరా అని చనువుగా పిలుచుకునే వరకూ వెళ్ళింది మా స్నేహం. నా కన్నా అతడు ఏడాది పెద్ద. నన్ను అన్నయ్య అని పిలిచేవాడు. మా పిల్లలంటే బాగా అభిమానం.

మీరు పనిచేసిన ఆ ఆర్టిస్ట్స్& డబ్బింగ్ ఆర్టిస్ట్స్ సంఘం సభ్యులలో స్త్రీలు ఉన్నారా? వాళ్ళ ప్రత్యేక సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా?
స్త్రీలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కానీ వాళ్ళ సమస్యలు ప్రత్యేకంగా చూడలేదు. వృత్తి సంబంధ సమస్యలు అందరివీ కలిపే చూసాం. వామపక్ష ఉద్యమం స్త్రీపురుష భేదం లేకుండా అందరినీ సమంగా చూసింది.

సినిమా కార్మిక రంగ సమస్యలు ప్రత్యేకం మీ దృష్టికి ఏమైనా వచ్చాయా?
నాయకత్వం గుర్తించి ఏ సమస్య మీద ఎలా పనిచేయాలో నిర్దేశిస్తే చేసినవాడినే కానీ నాకు ప్రత్యేకమైన పరిశీలనలు లేవు. ఏ విషయంలో నైనా నన్ను నడిపించినవాళ్లు రాజారావు కెవి రమణారెడ్డి కొకు. చివరి రోజులలో రమణారెడ్డి మాకు మార్గదర్శకుడు. AILRC లో (ఆల్ ఇండియా లీగ్ ఫర్ రివల్యూషనరీ కల్చర్) నన్ను ఆవిడను ఇండివిడ్యుయల్ మెంబర్స్ గా చేర్చాడు. ఢిల్లీ లో మీటింగ్ కు, కేరళ బోర్డర్ లో జరిగిన మీటింగ్ కు ఆయన ద్వారానే వెళ్లాను. అరుంధతీ రాయ్ వచ్చినప్పుడు కలవటం, మీటింగ్ లకు వెళ్ళటం… ఇలా…

సాహిత్యంతో మీకు పరిచయం ఎప్పటినుండి?
నాటకాల్లో వేషాలు వేయటం మొదలు పెట్టినప్పటి నుండే సాహిత్యంతో పరిచయం. వేయాల్సిన నాటకాలు చదవటంతో మొదలు పెట్టి చేతికి వచ్చిన నాటకమల్లా చదువుతూ పోయాను. నిజమైన సాహిత్యాభిరుచి ఏర్పడింది మద్రాస్ వచ్చాకనే. బండి సిద్ధాంతి గారు అని ఒకాయన ఉండేవాడు. లైబ్రరీ నుండి ఏదో ఒక పుస్తకం తెచ్చుకొని ఆయన, నేను, ఆవిడ ఒకరితరువాత ఒకళ్ళం చదివేవాళ్ళం. మార్క్స్ ఏంగెల్స్ లెనిన్ రచనలు అనువాదాలు, రాహుల్ సాంకృత్యాయన్ రచనలు, అనువాద నవలలు, కుటుంబరావు మొదలైన సమకాలికుల కథలు చదువుతూ ఉండేవాళ్ళం మేమిద్దరం. ఆలూరి భుజంగరావు తో పరిచయం కూడా అప్పుడే.

నిజానికి కాకరపర్రు స్కూల్ లో మా వేదుల సూరి మాస్టారుగారే శ్రీశ్రీ గురించి చెప్పాడు. అయితే శ్రీశ్రీ ని మద్రాస్ వచ్చాకే తెలుసుకున్నాను. కలుసుకున్నాను. చదువుకున్నాను. సన్నిహితమయ్యాను. చివరివరకు ఆ స్నేహం కొనసాగింది. శ్రీశ్రీ మార్గంలో నడవాలి అనుకున్నా. ఆవిడ కూడా ఇష్టపడింది. కొడవటిగంటి కుటుంబరావు కూడా మద్రాస్ లో నాకు సన్నిహితుడయ్యాడు. ఆయనే కాదు వరూధిని గారు కూడా. మాది కుటుంబ స్నేహం. కొకు సినిమారంగాన్ని కాచి వడబోశాడు. బొంబాయి సినిమా నుండి మన సినిమా వరకు అన్నీ ఆయనకు అవగాహనే. చక్రపాణికి విధేయంగా ఉంటూనే లోపలి నుండి పరిశీలించి చెప్పాడు. చలాన్ని మనం అర్ధం చేసుకొనటానికి కూడా కొకు సహాయపడతాడు. ఎలా గొప్పవాడు? ఎందుకు అనేది అర్ధమైపోతుంది మనకు. అలా నిర్మించుకున్న అధ్యయన ప్రపంచంలోకి తరువాత మా అమ్మాయిలు వచ్చి చేరారు. వాళ్ళు ఇంగ్లీష్ సాహిత్యాన్ని కూడా తీసుకొచ్చారు మా ప్రపంచంలోకి.

మీకు ఇద్దరు అమ్మాయిలు కదా! వాళ్ళ గురించి చెబుతారా?
మాకు చాలాకాలం సంతానం కలగలేదు. డాక్టర్ రాజారావు గారు చూసి సూర్యకాంతికి టాన్సిల్స్ ఉన్నాయని ఆపరేషన్ చేస్తే సమస్య పరిష్కారం కావచ్చు అన్నారు. ఆయనే ఆపరేషన్ చేశారు. ఆ తరువాతే మా పెద్దది పుట్టింది. ఆవిడ వాళ్ళ చిన్న మేనత్త దగ్గర మార్టేరులో పురుడు పోసుకున్నది.

రాజారావు గారు ఉండగానే పుట్టిందా?
లేదు. రాజారావు పోయాక ఆరు నెలలకు పుట్టింది. 1963 సెప్టెంబర్ 8 న ఆయన చనిపోయారు. 1964 లో అమ్మాయి పుట్టింది. అందుకే దానికి గురుస్మృతి అని పేరు పెట్టుకొన్నాను. అయితే ఆవిడ ఈ పిల్లను కడుపుతో ఉన్నప్పుడు ఒకరోజు జి. వరలక్షి గారు మా ఇంటికి వచ్చింది. ఆవిడను పరామర్శించి మాటలలోమాటగా నీ బిడ్డకు నా పేరు పెట్టుకుంటావా అని అడిగింది. ఆవిడ ఏమంటుంది? అలాగే పెట్టుకొంటా అన్నది. అది కూడా కలిపి మా అమ్మాయికి పెట్టిన పేరు గురు వరలక్ష్మీ స్మృతి అని. గురుస్మృతి అని పిలిచేవాళ్ళం. బికాం చదివింది.

రెండవ అమ్మాయి?
దానికన్నా మూడు నాలుగేళ్లు చిన్నది రెండో అమ్మాయి సమత. రాజమండ్రిలో మా ఇంట్లో పుట్టింది.చాలా తెలివైంది. దానికి చర్చ్ పార్క్ స్కూల్ లో సీటు వచ్చింది. అది సామాన్యమైన విషయం కాదు. అయితే దానికి కోపం జాస్తి. కావాలనుకొన్నది దొరికేవరకు పంతం వదలదు. కానీ పెద్దదానికి సహనం, శాంతం ఎక్కువ. ఏమి చేసిందో ఏమో కానీ అలాంటి చెల్లెలిని తన పరిధిలోకి తెచ్చుకొని తనవెంట తిరిగేలా చేసుకొన్నది. పదవ తరగతి చదువుతూ మానేసింది.

ఎందుకలా?
వాళ్ళకు వేరే మార్గం లో గురి కుదిరింది. అంతే.

విప్లవ మార్గమేగా? వాళ్ళా మార్గంలోకి ఎప్పుడు వెళ్లారు?
పదిహేను పదహారేళ్ళ వయసు నుండే ఆ దిశగా అడుగులు పడ్డాయి. మహిళా సంఘాలతో సంబంధాలు ఉండేవి. ప్రకాష్ అని ఒక మిత్రుడు ఉన్నాడు. బాలగోపాల్ కు బాగా సన్నిహితుడు. మద్రాస్ వచ్చి కంప్యూటర్ సెంటర్ పెట్టుకొన్నాడు. అద్దెకు ఇల్లు నేనే ఏర్పాటు చేసాను. అతని ద్వారా సభలకు వెళ్ళటం మొదలైంది.

వెళ్ళటానికి కారణాలు, ప్రేరణలు ఏమిటి?
వాళ్ళే తెలుసుకొన్నారు. ఉత్సాహంగా వెళ్లారు. పటేల్ సుధాకర్ రెడ్డి ప్రభావం ఉంది. అతనితో కలిసి మద్రాస్ నుండి కేరళ వైపు వెళ్లివస్తుండేవాళ్లు. చలం ప్రభావం కూడా…

ఎలా తెలుసుకొన్నారు? తెలుసుకొనటానికి ఇంట్లో వాతావరణమైనా, బయటి స్నేహాలు, ప్రభావాలైనా దోహదం చేసి ఉంటాయి కదా!
వాళ్ళు పుట్టి పెరుగుతుండేసరికి అలాంటి వాతావరణం ఒకటి మా ఇంట్లోనూ, మా చుట్టుపక్కల వ్యాపించి ఉండటం నిజమే. శ్రీకాకుళంలో గిరిజన సాయుధ పోరాటం లో భాగస్వాములైన ఆదిభట్ల కైలాసం, సత్యం చైన్నై వచ్చి మా ఇంట్లో షెల్టర్ తీసుకొని కొన్నాళ్ళు వుండి వెళ్లారు. నాగభూషణ్ పట్నాయక్, తేజేశ్వరరావు వంటివాళ్ళు మా ఇళ్లకు వచ్చి షెల్టర్ తీసుకున్నారు. రాజారావు గారి ప్రాణ స్నేహితుడు డా. రాందాస్ గారింట్లో కొంతమంది, జయంతి గారింట్లో కొంతమంది ఇలా… వస్తూనే వుండేవాళ్ళు. బి జి తిలక్ తమ్ముడు కొల్లిపర రామ నరసింహారావు శ్రీకాకుళ పోరాటంలో ముందుండి పనిచేశాడు. అతనిని కాల్చేశారు. ఇవన్నీ కనబడుతున్నవి, వినబడుతున్నవి.

అయితే నక్సల్బరీ గాలులు మద్రాసులో మీ వరకు వచ్చాయన్నమాట.
అదేమో నాకు తెలియదు. ఉన్నచోటనుండి ఏమి చెయ్యాల్సిన అవసరం వచ్చినా చెయ్యటమే నా పని. గద్దర్ ప్రదర్శనలను మద్రాస్ లో ఏర్పాటు చేశాను. ఆయన భార్యతో కూడా ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చాడు. చెరబండరాజు వైద్యానికి మద్రాస్ వచ్చినప్పుడు తీసుకురావటానికి నేను రైల్వే స్టేషనుకు వెళ్తే నాతో పాటు పిల్లలు వచ్చారు. జనరల్ హాస్పిటల్ లో ఆయనను చూడటానికి వెళ్ళేవాళ్ళు. బాలగోపాల్ వస్తూ పోతుండేవాడు. ఆలూరి భుజంగరావు కూడా వస్తుండేవాడు.

అలా చెప్పండి… మార్క్సిజం అధ్యయనం, శ్రీశ్రీ మార్గంలో నడవాలన్న సంసిద్ధత మిమ్మల్ని ఇలా మార్క్సిస్టు ఆచరణ చరిత్ర సరిహద్దులలో సంచారిగా చేసిందన్న మాట. ఇక మీ పిల్లలు ప్రత్యక్ష విప్లవాచరణలోకి వెళ్లటంలో ఆశ్చర్యపడవలసినది ఏముంది? వాళ్ళలా వెళ్లటాన్ని మీరెలా స్వీకరించారు?
పని చేసే వాళ్ళ వెంబడి ఉండటమే అనుకొన్నాను. పిల్లలు వేగంగా పరుగెడుతుంటే వాళ్ళ వెంబడి మేము… ఆలకూరపాడు సభలకు పిల్లలతో కలిసే వెళ్లాము. ఆ తర్వాతే పూర్తికాలం ఉద్యమంలోకి వెళ్లే నిర్ణయం తీసుకొన్నారు. నిర్ణయాలు వాళ్ళవి. వాళ్ళను అలా స్వీకరించటమే మనం చేయవలసినది అని ఆవిడకు కూడా నచ్చ చెప్పా. ఇద్దరూ ఒక బాటనే వెళుతున్నారు. ఒకళ్ళ సంగతి మరొకరికి తెలుస్తుంటుంది. అదే మాకు సంతృప్తి. ఇద్దరూ మంచి రచయితలు కూడా.

ఆలకూరపాడు సభలు ఎప్పుడు జరిగాయి? ఏ విషయం మీద?
1984 లోనో 1985 లోనో… ప్రజాకళారూపాల మీద అధ్యయన తరగతులు… విరసం నిర్వహించింది. (ఈ అధ్యయన తరగతులు 1984 అక్టోబర్ 1 నుండి 6 వతేదీవరకు జరిగాయి. దీని నివేదిక 1984 నవంబర్ అరుణతారలో ప్రచురించబడింది. అప్పటికే కాకరాల అఖిలభారత విప్లవ సాంస్కృతిక సమితి సభ్యుడు. ఆరు రోజులూ ఆయన అక్కడే ఉన్నాడు. అధ్యయన తరగతులను ఆయనే ప్రారంభించాడు. బుర్రకథ శిక్షణకు పర్యవేక్షకుడు. సినిమారంగం గురించి ప్రసంగించాడు. చివరలో అధ్యయన తరగతుల నిర్వహణ తీరును సమీక్షించాడు. ఈ సెషన్ లోనే స్ట్రీట్ ప్లే నిర్వహించబడిన తీరును సమీక్షించిన గురుస్మృతి కాకరాల పెద్దకూతురే. కాకరాల అధ్యయన తరగతుల ముగింపు లో బహిరంగ సభలోనూ ప్రసంగించాడు.)

నేనూ నాన్నా 1986 లో మద్రాసు వచ్చాం. ఆరుద్ర ఇంటి నుండి రోడ్డు మీదికి వచ్చేసరికి అనూహ్యంగా మీరూ వరవరరావు కనబడ్డారు. అప్పుడు మీతో పాటు గురుస్మృతి కూడా ఉంది. మనం అందరం కలిసి కొడవటిగంటి వరూధిని గారిని కలవటానికి వెళ్లాం. గుర్తుందా?
గుర్తుంది.

విప్లవోద్యమాలలో మహిళల స్థానం గురించి మీ అభిప్రాయం ఏమిటి?
కమ్యూనిస్టు నీతిలో స్త్రీ పురుష సమానత్వానికి ప్రాధాన్యత. లెనిన్, మావో వంటివాళ్ళు ఆ విలువను వాస్తవీకరించటానికి ప్రయత్నించారు. ఆడపిల్లల ఎదుగుదలకు ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఏ దేశంలోనైనా ఆడవాళ్లు ఉద్యమంలోకి అలా నడచి రాగలుగుతున్నారు. ఈ నాడు మహిళలు తెగించి పోరాడుతున్నారు అని చెప్పగలను.

కమ్యూనిస్టులలో స్త్రీల సమస్యల పట్ల, వాళ్ళ ఆకాంక్షలను పార్టీ ఎజెండాలో భాగం చేయటం పట్ల నిర్లక్ష్యం కనబడుతుందని స్త్రీవాదుల ఆరోపణ. ‘మనకు తెలియని మనచరిత్ర’ వంటి పుస్తకాలు వచ్చాయి కదా? మీరేమంటారు?
పార్టీ, దాని నాయకత్వం మౌలికమైన స్పిరిట్ నుండి దూరం అయ్యేకొద్దీ ఇలాగే జరుగుతుంది. విలువలకు కాకుండా, ఆర్ధిక ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్న దాని ఫలితం ఇది. అయితే నిరుత్సాహపడవలసింది ఏమీ లేదు. అసలు సారాన్ని బయటకు తెచ్చేవాళ్ళు వస్తారు. మూడడుగులు వెనక్కి అయినా ఒక అడుగు ముందుకే… విలువల దగ్గరనుండి విలువలకే ప్రస్థానం. ఈ రెనెగ్రేడ్ ల వెధవాయిత్వం ఎందుకూ పనికి రాదు. పార్టీ ఆశయాలకు ఆదర్శాలకు స్త్రీల ఆకాంక్షలకు ఎక్కడో లింక్ లేకుండా అప్పుడైనా ఇప్పుడైనా విప్లవోద్యమాలలో మహిళలు ఇలా జీవన్మరణ పోరాటంలో భాగస్వాములు అయ్యే వాళ్లేనా? పాల్గొనటమే కాదు, గణనీయమైన ప్రభావాన్నీ వేస్తున్నారు.

విరసం తో మీ అనుబంధం?
విరసం సభ్యత్వం లేదు. కానీ సభలకు తరచు వెళ్తుంటాను. విప్లవ సాహిత్యం గురించిన చర్చలలో పాల్గొంటుంటాను. అది చాలామందితో సన్నిహిత సంబంధాలు పెంచింది. నల్లూరి రుక్మిణి, ఆమె చెల్లెలు అలా దగ్గరైనవాళ్ళే.

సాహిత్య స్నేహాలు మరెవరితోనైనా…?
శివలక్ష్మి తో ఉన్నాయి. నందగోపాల్ రాసిన సినిమా చరిత్రకు సంబంధించిన గ్రంథం (సినిమాగా సినిమా 2013) ఆధారంగా ఇద్దరం సినిమాచరిత్రను అవగాహన చేసుకొనే ప్రయత్నం చేసాం. అంతకుముందు నుండి ఆ దారిలోనే రామ్మోహన్ గారూ, మోహన్ గారూ చేస్తున్నారని నాకు తెలిసింది. ముందో, వెనుకో అందరం ఆ కొమ్మ మీది పక్షులమేనని అర్ధమైంది. ఏ విధంగా చూసినా నందగోపాల్ గారి గ్రంధం చాలామందికి ప్రేరణయింది. ఏది ఏమైనా చారూమజుందార్ నక్సల్బరీ ఉద్యమావగాహనకైనా ఈ దిక్ సూచీ అవసరమే అన్నది గ్రహిస్తే చాలు. మనం నరసాపురంలో జరిగిన సభల దగ్గరికొచ్చేస్తాం. ఆ సభలే మిగిలిన కథనంతా చెబుతాయి. ‘జాజిపూల పరిమళం’ మొదలైన కథలు ఆ కథల వెనకనున్న కథలు ఆ కథల వెనకనున్న సింహం కథలు. వాళ్ళ రచనల లిస్ట్ నా దగ్గర ఉంది. వాళ్ళు లోపల ఉన్నారు.

పోలీసుల నుండి ఇబ్బందులు ఏమీ లేవా మీకు?
పెద్దగా లేవు. ఒకసారి ఒక నాటకం వెయ్యటానికి పిఠాపురం వెళ్ళాను. పోలీసులు అక్కడికి వచ్చి ఇంటరెగేషన్ కి రావాలి అని తీసుకువెళ్లారు. నెల్లూరు వరకు పోలీసు వాన్ లో తీసుకువెళ్లారు. చెన్నై వరకు తిప్పారు. ఎవరెవరికి షెల్టర్ ఇచ్చారు అంటూ ప్రశ్నలమీద ప్రశ్నలు వేశారు. ఎలాగైనా వాళ్లకు తెలుసు… ఇయ్యలేదని చెప్పినా నమ్మరు అని నిజాలే చెప్పాను. అంతకన్నా నాకు ఏమీ తెలియదు అని చెప్పాను. అంత ప్రమాదకరమైన వాడిని కాదనుకొన్నారో ఏమో వదిలేశారు. విజయరామారావు డీజిఓ గా వున్నాడప్పుడు. 1994- 1995 ప్రాంతం అనుకొంటా.

విప్లవోద్యమాల పై ప్రభుత్వాల అణచివేత ఇప్పుడు ఆదివాసీలపై ప్రత్యక్ష యుద్ధరూపం తీసుకున్నది కదా? దీని మీద మీరేమంటారు?
నిజమే .. కానీ ఆదివాసీ సమస్య తీరిపోయినట్లే. అది ఫలదీకరణ చెంది బద్దలు కావటానికి సిద్ధంగా ఉంది.

మత ఆధ్యాత్మిక ప్రచారాలు ఇటీవలి కాలంలో మరీ మరీ పెరిగిపోతున్నాయి కదా! విప్లవోద్యమం పై వీటి ప్రభావం ఎలా ఉంటుంది?
మతం, ఆధ్యాత్మికత విప్లవానికి దోహదకారులు కావు. పైగా అవరోధాలు కూడా. నడవవలసిన దారినుండి పక్కకు తప్పించి ఎటు లాక్కుపోతాయోనని భయం. ఇదివరకటి కన్నా ఇప్పుడు ఆ ప్రమాదం మరీ పెరిగింది. లౌకిక సాంస్కృతిక విలువల నిర్మాణ ప్రచారాలే దానికి విరుగుడు.

దేవుడిని నమ్ముతారా?
నమ్మను. అసలు నమ్మను.

విప్లవోద్యమ భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు?
విప్లవం జయిస్తుంది.

ఇప్పటికి చివరి ప్రశ్న. ఈ పరిస్థితులలో రచయితల కర్తవ్యం ఏమిటి?
పని చేసే వాళ్ళ వెనక ఉండటమే. ఇక్కడ నుండి చేయగలిగినది చేయటమే. ఉన్న పరిస్థితి అర్ధమయ్యేట్లు అరటి పండు వొలిచి పెట్టినట్లు రచనలు చెయ్యటమే.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

One thought on “ “విప్లవం జయిస్తుంది”: కాకరాల తో సంభాషణ

Leave a Reply