కొందరు మనుషులు
ఈ దేశం నుండి వెళ్లాలనుకుంటున్నారు
వెళ్తూ వెళ్తూ
నెత్తురూ చెమటా కలిసిన
వాళ్ళ మట్టిని
తమతో తీసుకువెళ్తామనుకుంటున్నారు
ఏళ్ల కింద ఇద్దరు రాజుల ఒప్పందానికి
తాము బానిసలం కాదని
తెగేసి చెబుతున్నారు
అది విప్లవమో కాదో వాళ్లకు తెలియదు
తెలిసిందల్లా తిరగబడడమే
నోటి కాడ కూడు లాక్కుంటున్నపుడు
కాలికింద నేల తవ్వుతున్నప్పుడు
కుదరదని చెప్పడమే వాళ్లకు తెలుసు
కాదంటే కలబడడమే వాళ్లకు తెలుసు
మనుషుల్నీ వాళ్ల మనసుల్నీ గెలవకుండా
మరో అడుగు ముందుకేస్తే
కుందేళ్లకు కొమ్ములు మొలుస్తాయి
పావురాల రెక్కలు కూడా కత్తులవుతాయి
ట్రిగ్గర్ పై వేళ్లు
టెర్రరిస్ట్ ముద్రలు
వాళ్ల పోరాటాన్ని ఆపలేవు
రేపు తల తగలబడతది
ఆ వెలుగులో
కశ్మీర్ కి దారి వెతకండి