ఆయుధాలు మొలుస్తున్నాయి (2000), నా రక్తం కారు చౌక (2002), కొలిమి ఇస్లాంవాద సాహిత్య వ్యాసాలు (2009) లాంటి రచనలతో కవి కరీముల్లా ఇప్పటికే చాలా ప్రసిద్ధుడు. ముస్లింవాదం పట్ల అతని స్పష్టమైన అభిప్రాయాలు మనల్ని ఆలోచనలోకి నెడతాయి. మతం మానవజీవితంలోని ఎన్నో పార్శ్వాలనీ అల్లకల్లోలం చేస్తున్న సందర్భంలో ఒక సాహిత్యకారునిగా కవి కరీముల్లా మాటలు ఏం చెబుతున్నాయో విందాం. కరీముల్లా గారు గుంటూరు జిల్లా, వినుకొండలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ముస్లిం రచయతల సంఘం వ్యవస్థాపకులుగా ఉన్నారు.
ముస్లింవాదాన్ని మునాఫిక్ (కపట ముస్లిం) వాదమని మీరు ఎందుకు అంటున్నారు? సాహిత్య కోణంలోనే జవాబు చెప్పండి.
జ) ముస్లింవాదాన్ని మునాఫిక్ (కపట) వాదమనే నేనంటాను. ఏ వాదమైనా తన సమాజ మనోభావాలకు ప్రతిబింబంగా ఉండాలి. దానికి భిన్నంగా రాస్తూ ఆ సమాజ వాదం ఇదే అంటే సరికాదు. ముస్లిం అంటేనే దైవ విధేయుడు అని అర్ధం. ఇది ఆస్తికత్వంతో ముడిపడి ఉన్న పదం. కాఫిర్ (అవిశ్వాసి) అనే కవిత ముస్లింవాదం నుండి వచ్చింది. కాఫిర్ అనే పదం తిట్టు కాదని గమనించ మనవి. ముస్లిం అనే పదానికి పూర్తిగా విరుద్ధమైన పదం. ముస్లిం అనే భావనకు పూర్తి విరుద్ధంగా రాస్తూ దాన్ని ముస్లిం వాదమని ఎలా అంటారు? మా ఇష్టం మేమేమైనా రాసుకుంటామంటే నేనేమీ తప్పు పట్టను. ఏ విషయంలోనైనా క్లారిటీ ఉండాలంటాను. ముస్లిం పురుషులు గడ్డం పెంచుకోవటం ఒక సంప్రదాయం. ఇది కంపల్సరీ కాదు ఐఛ్ఛికం. గడ్డం పెంచుకోని ఎంతోమంది ముస్లింలకు గడ్డం పెంచుకునే వారిపై వ్యతిరేకత ఉండదు. పైగా గౌరవం ఉంటుంది. ముస్లింల గడ్డాల గురించి ఎకసెక్కెంగా రాసే తమ రాతలు ముస్లిం సమాజ భావాలకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తాయో వారే చెప్పాలి. తాము ముస్లింలపై జరిగే దాడుల్ని వ్యతిరేకిస్తున్నాం కనుక తమకు వారి విశ్వాసాలను కించపరిచే హక్కు ఉందని అనుకుంటున్నారేమో తెలీదు. ఇస్లాం వాదం, ముస్లిం వాదాలలో ఏది ప్రగతిశీలమో చర్చించటానికి నేను సిద్ధం. వేయి పూలు వికసించనీ, వేయి భావాలు ఘర్షించనీ అని నమ్మే తెలుగు సాహితీ క్షేత్రంలో మనమున్నాం. నేను నాస్తికులకు వ్యతిరేకం కాదు. సమాజానికి ఎంతో సేవ చేసిన నాస్తికులు ఎందరో ఉన్నారు. బాలగోపాల్ వంటి వారు ముస్లింల సమస్యలపై బలంగా గొంతెత్తారు. కుల,మతాలకు అతీతంగా స్పందించే వారున్నారు. వారంతా వారి వారి సిద్ధాంతాలపై క్లారిటీ గానే ఉన్నారు. ముస్లింవాదానికున్న క్లారిటీ ఏమిటంటాను? అదేమంటే మాది ముస్లిం సామాజిక కవిత్వం అంటారు. ఏ కవిత్వం అయినా సమాజంలోంచే వస్తుంది. ఆకాశంలోంచి ఊడిపడదు. ముస్లింల జీవన విధానం, సంస్కృతి, విశ్వాసాలు అన్నీ సమాజంలో భాగమే. వీటిని నమ్మనప్పుడు అది ముస్లిం కవిత్వం కాబోదు. ప్రతి ముస్లిం ప్రాక్టీసింగ్ ముస్లిం కాకపోవచ్చు. కాని ఇస్లాంను విశ్వసిస్తాడు. ఆచరణ లేక పోవచ్చు కానీ తనను తాను ముస్లిం గా భావిస్తాడు. తమను తాము ముస్లింలుగా భావించకుండా రాస్తూ తమది ముస్లింవాదం అని చెప్పుకోవటం మునాఫిక్ వాదమే. తాము సంస్కరణవాదులమని చెప్పుకున్నప్పుడు ఏది నిజమైన సంస్కరణ, ఏది నిజమైన ఉద్యమమో చర్చించడానికి నేను సిద్ధం. ఏ సమాజమైతే సాంస్కృతికంగా పరాధీనమౌతుందో అది సామాజికంగా పరాధీనమౌతుందని మావో చెప్పాడు. ముస్లింలు తమ మూలాల్ని కాపాడుకుంటూనే దేశం కోసం అన్య మతాల వారితో కల్సి స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన చరిత్ర ఉంది. అలాగని సంస్కృతి ముసుగులో మత ఛాందసవాదాన్ని ఇస్లాంవాదం తలకెత్తుకోదు.
ముస్లిం, మైనారిటీవాదానికీ, మీరు ప్రతిపాదించే ఇస్లాం వాదానికీ గల ప్రధాన సైద్ధాంతిక తేడాలు ఏమిటి? వర్తమాన తెలుగు సాహిత్యంలో వీటికున్న కొలమానాల పట్ల మీ వ్యాఖ్య?
జ) మైనారిటీ వాదమంటే అది ముస్లింలకు మాత్రమే పరిమితం కాదు. మైనారిటీలకు అందరికీ వర్తిస్తుంది. ఇక ముస్లిం లేదా ఇస్లాం అనే పదాలు ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్న పదాలు. విప్లవ, అభ్యుదయ, జనసాహితి వంటి అనేక ప్రగతిశీల సంఘాలకు మార్క్సిజం, బహుజనవాదానికి అంబేడ్కరిజం సైద్ధాంతిక, తాత్త్విక దృక్పధం ఉంది. అలాగే ఇస్లాం వాదానికీ ఇస్లాం సైద్ధాంతిక, తాత్త్విక భూమికగా ఉంది. సిద్ధాంతం లేని ఏ వాదమైన కాలక్రమంలో కనుమరుగవుతుంది. ఇస్లాం వాదం స్వతంత్ర వాదం. మాదైన కోణం నుండి మేం కుల, మతాలకు అతీతంగా అన్ని పీడిత ప్రజా ఉద్యమాలతోనూ మమేకం కాగలం. విప్లవ, అభ్యుదయ, దళిత, బహుజన సంఘాలన్నీ మా మిత్రులే. అంటే ముస్లింలకు మిత్రులని అర్ధం. సమాజంలో ఉన్న సామాజిక, ఆర్థిక అసమానతల్ని, పీడనల్ని ఇస్లాంవాదం వ్యతిరేకిస్తుంది. మేమేం మతరాజ్యం కోరుకోవటం లేదు. అందరి హక్కులు కాపాడే బలమైన లౌకిక రాజ్యం కోరుకుంటున్నాం. ఇస్లాం తాత్త్విక వెలుగులో మా మూలాల్ని కాపాడుకుంటూనే అన్ని వర్గాలతోనూ సామరస్యంగా జీవించే స్ఫూర్తి ముస్లిం లకు ఉంది. ఇస్లాంవాదం ఈ స్ఫూర్తిని కొనసాగించగలదు. మానవులంతా పరస్పరం సోదరులేనన్న పవిత్ర ఖురానే మా తాత్త్వికత. ఇస్లాంను మేం ఒక మతంగా భావించం. ఫలప్రదమైన జీవన విధానంగా భావిస్తాం. ముస్లిం వాదానికి సిద్ధాంతం లేదు కనుకే అది పరస్పర విరుద్ధంగా తయారైంది. ఇస్లాంవాదానికి ఈ గందరగోళం లేదు. మేం పుట్టిన కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా ఎవ్వర్నీ ద్వేషించం. దోపిడీని దోపిడిగా, పీడనను పీడనగా వ్యతిరేకిస్తాం. తప్పు ముస్లింల వైపున్నా ఖండిస్తాం. అంతర్జాతీయ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమమే తప్ప ఉగ్రవాదం ప్రత్యమ్నాయం కాదని మేం నమ్ముతున్నాం. అన్ని కుల, మత ఉగ్రవాదాలను మేం ఖండిస్తాం. ఈ క్రమంలోనే ఇస్లాంవాదం వైపునుండి 45 మంది కవుల కవితలతో “కవాతు”కవితా సంకలనం వచ్చింది. ఇస్లాంవాదం కేవలం పర్దాల చుట్టూ తిరిగే వాదం కాదు. అన్ని సమాజాలకున్నట్టే ముస్లింలకూ స్త్రీలకు తలపై హిజాబ్, పురుషులకు టోపీ, గడ్డం సంప్రదాయాలుగా ఉన్నాయి. వీటిని ఇస్లాంవాదం వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయంగా భావిస్తుంది. ఒకవేళ ఎక్కడైనా హిజాబ్ ధరించని కారణంగా దాడులు జరిగితే దాన్ని ఖండించడానికి ఇస్లాంవాదం ముందు వరుసలో ఉంటుంది. ముస్లిం సమాజ అభివృద్ధికి ఆటంకం కలిగించే అన్ని ప్రగతినిరోధక భావాలను వ్యతిరేకిస్తాం. స్త్రీలు తాము ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై పోరాటం చేసే శక్తి, స్ఫూర్తి కలిగి అన్ని ఉత్పత్తి రంగాలలో ప్రాతినిధ్యం వహించాలని ఇస్లాంవాదం కోరుకుంటుంది. ముస్లింలలో తెలుగు, ఉర్దూ ముస్లింలలో ఉన్న అంతరాలను , వివక్షతలను రూపుమాపాలని కోరుకుంటున్నాం. ముస్లింల విశ్వాసాలను దూషిస్తూ ముస్లింలను చైతన్యవంతం చేయగలమనే భ్రమల్లో మేం లేం. ఇస్లాంవాదం సామ్రాజ్యవాదాన్నీ, ప్రపంచీకరణ ముసుగులో సాగే దోపిడీని వ్యతిరేకిస్తుంది. సర్వ శ్రేయోరాజ్యమే ఇస్లాంవాద లక్ష్యం.
తెలుగు సాహిత్యంలో చాలా విచిత్ర పరిస్థితులున్నాయి. చాలా గ్రూపులున్నాయి. మంచి చెడు విచక్షణ లేదు. మన కులం, మన మతం, మన ప్రాంతం, మన వర్గం వాడైతే చాలు. వెనకేసుకొస్తామనే ధోరణులున్నాయి. ఇది ఒక్కోసారి చిన్న పిల్లల తొండాటను తలపిస్తుంది. ఇస్లాం అనగానే అది మతం అంటారు. ముస్లిం అంటే కాదంటారు. వారన్నట్టు మతానికి అతీతంగా ముస్లిం సమాజం ఉందా? ఆధునిక కాలంలో జాతి లేదా సమాజం అనేదానికి నిర్వచనాలు మారిపోయాయి. ఏ అస్తిత్వ వాదమైనా అదే అంతిమం కాదు. సమస్త పీడిత ప్రజా చైతన్యం లో భాగమేనని గుర్తెరగాలి. లేకుంటే అవి అంతిమంగా పీడితవర్గాల అనైక్యతకు కారణమౌతాయి. వ్యక్తిగత స్నేహ సంబంధాలు వేరు. సామాజిక, సాహిత్య చైతన్యం వేరు. సాహిత్యంలోని కొలమానాలపై నాకు నమ్మకం లేదు. ఆ కొలమానాలన్నీ ఇప్పుడు కళ్లకు గంతలు కట్టుకున్నాయి. ఏది చైతన్యవంతమైన సాహిత్యమో కాలం నిర్ణయిస్తుంది. ఓ ఇస్లాంవాద కవిగా నేను ఇన్ సైడర్గా ముస్లింల సమస్యలపై రాస్తూ అవుట్సైడర్గా మార్క్స్, అంబేడ్కర్, పూలే లను నా కోణం నుండి ప్రేమిస్తా. సమాజ పరివర్తనలో వారి పాత్రను గుడ్డిగా తృణీకరించను. ఇస్లాం ప్రభావం కూడా వీరందరిపై ఉందని నేను బలంగా నమ్ముతాను. సామాజిక అసమానతలు నిరాకరిస్తూ వచ్చిన అన్ని భక్తి ఉద్యమాలపై, మత సంస్కరణ ఉద్యమాలపై ఇస్లాం ప్రభావాన్ని ఎవరూ నిరాకరించలేరు. సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్ చెప్పిన సంస్కరణ ఉద్యమంపై కూడా సరియైన ఇస్లామియా దృక్పథం ఉంది. ప్రఖ్యాత చరిత్రకారుడు ఎమ్. ఎన్. రాయ్ ఇస్లాం భారతదేశంలో అడుగిడకపోతే శూద్రులు శాశ్వతంగా బానిసలుగా ఉండేవారని చెప్పటాన్ని తెలుగు సాహిత్యంలో చాలామంది ఎందుకు పరిగణనలోకి తీసుకోరో అర్ధం కాదు. మాకియవెల్లీ రాజకీయ సిద్ధాంతం ఇక్కడ అమలౌతుంది. వీళ్లంతా అమెరికాను వ్యతిరేకిస్తారు. ఇస్లాంవాదంపై బురద చల్లటంలో అమెరికానే అనుసరిస్తారు.
మీరు తీసుకొచ్చిన ‘అబాబీ’ అనే నూతన వచన కవితా ప్రక్రియకున్న విశిష్టత ఏమిటి?
జ) తెలుగు సాహిత్యం విస్తృతమైనది. అనేకానేక అస్థిత్వ ఉద్యమాలకు నిలయమిది. ఈ క్రమంలోనే భాషలోని సంక్లిష్టతను దూరం చేస్తూ జనసామాన్యానికి దగ్గరగా సంక్షిప్త రూపంలో ఓ నూతన వచన కవితా ప్రక్రియ ముస్లింల వైపునుండి అవసరం అన్పించింది. ఈ ఆలోచనలో భాగంగానే “అబాబీలు”ఆవిష్కరించాను. అబాబీలు అని పేరు పెట్టడం వెనుక చారిత్రక స్పూర్తి ఉంది. ఇస్లామియా విశ్వాసంలో మక్కాలోని కాబా మస్జిద్ ను ముట్టడించిన అబ్రహా అనే రాజుకు చెందిన 60 వేల కాల్బలగాన్ని, గజబలాన్ని అబాబీలు అనే చిన్న పరిమాణంలో ఉండే పక్షికి చెందిన గుంపు మట్టి కరిపించినట్టు ఉంది. ఈ అబాబిల్ పక్షుల చైతన్యం, సాహసం, సామూహిక తత్వం, ఐకమత్యం ముస్లింలకు, ఇతర పీడితవర్గాలకూ అవసరం.
అబాబీలు అనే ఈ ప్రక్రియకు అయిదు పంక్తుల్ని ఎంచుకున్నాను. ముస్లింల నడవడికకు అయిదు పంచసూత్రాలున్నట్లే ప్రతి అబాబిల్ అయిదు పంక్తులతో ముగుస్తుంది. వరుస క్రమంలో సమస్య ప్రస్థావన, విషయం, విశ్లేషణ, నామ మకుటం, సందేశం లేదా వ్యంగాత్మక చమత్కారంతో అబాబిల్ ముగుస్తుంది. ఈ ప్రక్రియలో “బదర్” వచ్చాక చాలా మంది రాసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొంతమంది రాయటం మొదలు పెట్టారు. భవిష్యత్తులో బలమైన ప్రక్రియగా తెలుగు సాహిత్యంలో నిలుస్తుందని నా నమ్మకం.
సామాజిక ఆధిపత్య ధోరణుల్నుంచి ముస్లింలను చైతన్యపరిచేందుకు కొత్త తరం ముస్లిం సృజనకారులకెలాంటి పరికరాల అవసరం ఉంది?
జ) ముస్లింలు రెండు రకాలుగా చైతన్య వంతం కావాలి. అంతర్జాతీయ పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాదాల వల్ల జరిగే నష్టం, దేశీయంగా ఫాసిజం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు మొదటివి. వీటితో తలపడే అన్ని ప్రజాస్వామిక శక్తులతో మమేకమయ్యే చైతన్యం ముస్లింలకుండాలి. ఒంటరితనం, ఒంటరి వాళ్లమయ్యామనే భావనతో కాక సానుకూల దృక్పథంతో ఆలోచించాలి. విశ్వాసం వ్యక్తిగత మైనది. కానీ చైతన్యం సామూహికమైనదై, లౌకికమైనదై ఉండాలి. పీడిత శక్తులు తమ మధ్య ఉన్న భావ వైరుధ్యాలను పక్కన పెట్టి మానవ నాగరికతకు పెనుముప్పుగా ఉన్న అన్ని సామాజిక ఆధిపత్య ధోరణుల్ని, కుల, మతోన్మాదాలను వ్యతిరేకించే నిస్పాక్షిక దృష్టి అలవర్చుకోవాలి. దీనికి సైద్ధాంతిక, తాత్విక దృష్టి అవసరం. ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలో కీలకమైన శ్రమ శక్తితోనే ప్రపంచం నడుస్తుంది. దీన్ని ప్రతి ముస్లిం సృజనకారుడు గుర్తెరిగి శ్రమదోపిడీని వ్యతిరేకించాలి. దేశీయ మనువాద చట్రంలో నలిగిపోతున్న ఉత్పత్తి కులాల, నిమ్న కులాల పక్షం వహించాలి. ఇదంతా ఒక కోణమైతే మరో కోణం అంతర్గత సంస్కరణలకు సంబంధించింది. ఇది కూడా చాలా ముఖ్యమైనది. విద్య, విజ్ఞానాలకు నిలయంగా సమాజాన్ని మార్చుకోవాలి. ముస్లింలను సాంస్కృతికంగా బలహీనపర్చి సామాజికంగా బలహీనపర్చాలన్న జియోనిస్టుల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పరలోకం తప్ప ఇహలోకం పట్టని ఛాందసవాదాన్ని తిరస్కరించాలి. ఏది సదాచారమో, ఏది దురాచారమో మనకో స్పష్టత ఉండాలి. లేకుంటే మన చేతే మన కళ్లు పొడిపించగల అపర చాణుక్యులు చాలామందే ఉన్నారు. వ్యక్తిగత ద్వేషాలతో ప్రమేయం లేకుండా సాహిత్యాన్ని సాహిత్యంగా, సిద్ధాంతాన్ని సిద్ధాంతంగా చెప్పగలిగే స్థైర్యం ఉండాలి.
ఒక ముస్లిం వ్యక్తిగతంగా ఏ భావజాలాన్నయినా కలిగిఉండొచ్చు. కానీ మొత్తం ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని అనుకుంటున్నప్పుడు అప్రమత్తత, నిబద్ధత చాలా అవసరం. కవి ఆలోచన కోల్పోయిన తొట్రుపాటులో ఏదైనా రాసినా ఆత్మవిమర్శతో సరిచేసుకోవాలి. నేను ముస్లిం వాదంపై చేసిన విమర్శలు సాహిత్య పరమైనవి, సైద్ధాంతికమైనవి. ఇది ద్వేషం కాదు. వారూ మారి సరియైన దృక్పధం అలవర్చుకోవాలన్న ఆకాంక్ష మాత్రమే. ప్రతి ముస్లిం సాహిత్యకారుడు ముస్లిం సమాజంపై నెలకొన్న అపోహలు, ఇస్లామోఫోబియా దూరం చేయటం కూడా తమ కర్తవ్యం లో భాగమేనని గుర్తించాలి. దీనికి కావాల్సిన పరికరాలు ముస్లింల జీవన విధానం నుండే లభిస్తాయి.
ఇప్పటిదాక వచ్చిన ముస్లింవాద సాహిత్య ప్రక్రియల పట్ల మీ అభిప్రాయం చెప్పండి. వాటికన్నా మీ ఇస్లాంవాద రచనలెంత భిన్నమైనవి?
జ) ముస్లింవాదం వైపు నుండి ఏ సాహిత్య ప్రక్రియలు వచ్చినా మనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏముంది! వారు ఎంచుకున్న వస్తువు విషయంలోనే విమర్శ ఉంది. ఇస్లాంవాదానిది ముస్లిం వాదం కన్నా భిన్నమైన వాదం. మతోన్మాదాన్ని వాళ్లు జనరలైజ్ చేస్తారు. మేం చేయం. వాళ్లు హిందూ సెక్సిజం అనే పదం వాడారు. మేం వాడం. మేం మతోన్మాదాన్ని, ఫాసిజాన్ని ఏ రూపంలో ఉన్నా ఖండిస్తాం. వాళ్లు మతాన్ని నమ్మం అంటూనే తాయెత్తులు, పీరీలు, అంత్రాలు, మంత్రాలు వంటి అహేతుక విషయాలను సమర్ధిస్తారు. ఇస్లాంవాదం వీటిని వ్యతిరేకిస్తుంది. హిందూ మతోన్మాదాన్ని విమర్శించటం వల్ల వచ్చే వ్యతిరేకతను ఇస్లాంను విమర్శించటం ద్వారా సమతూకం చేయాలనుకుంటారు. ముస్లింల హిజాబ్, గడ్డాలను, సున్తీలను వారు హేళన చేసి ఇస్లాం వ్యతిరేకుల మన్నన పొందాలనుకుంటారు. మేం వాటిని వ్యతిరేకించం. అవన్నీ వ్యక్తిగత ఐచ్ఛికాలుగా భావిస్తాం. వాళ్లకు ఇస్లామియా చరిత్ర పట్ల సరియైన అవగాహన లేదు. వాళ్లు దైవ భావన నిరాకరిస్తారు. ఆ దైవభావనలోనే పుణ్యపురుషుల సమాధులు (దర్గాలు)ను ఆరాధిస్తారు. ఇదంతా పరస్పర విరుద్ధ భావనలు కావా? నేను చేసే ఏ విమర్శ ఐనా అందరు ముస్లింవాదులపై కాదు. ముస్లింవాదానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని భావిస్తున్న వారికి సంబంధించింది. ముస్లింవాదం వైపునుండి వీరి భావాలను వ్యతిరేకించే వారూ ఉండవచ్చు. కానీ పరస్పర విరుద్ధ భావాలు ఒక వాదంలో ఎలా ఉంటాయి? ఒకవేళ ఉంటే ఆ వాదం మనుగడ సాగిస్తుందా? వ్యక్తులపై ఆధారపడే వాదాలు దీర్ఘకాలం మనుగడ సాగించలేవు. సిద్ధాంత నిబద్ధత ఉంటేనే అది సాధ్యమౌతుంది. అది ఇస్లాంవాదానికి ఉంది. ఒక్కోసారి తమది బహుజనవాదం అంటారు. నాకు తెల్సినంతవరకు ముస్లిం బహుజనవాదం, క్రైస్తవ బహుజనవాదం, ఉండవు. మా వరకు మేం మా సైద్ధాంతిక నిబద్ధతను కాపాడుకుంటూనే బహుజనవాదానికి మిత్రులం. ఇతర ప్రగతిశీల వాదాలకూ మిత్రులమే. మరీ ముఖ్యంగా సామ్రాజ్యవాదం పట్ల ముస్లింవాదానికి సీరియస్ నెస్ లేదు. ఇస్లాంవాదం అనేక సమస్యల మూలాలు సామ్రాజ్యవాదంలో ఉన్నాయని భావిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
సాహిత్యానికీ మతానికీ మధ్య ఎలాంటి సంబంధముండాలని మీరు భావిస్తున్నారు ?
జ) సాహిత్యానికి ఏదీ అంటరాని వస్తువు కాదు. కాలంతో పాటు మనిషి మారాలి. మానవ నాగరికతాభివృద్ధికి తోడ్పడే సహేతుక అంశాలను కాపాడుకుంటూ అభివృద్ధిని అడ్డుకునే అహేతుక అంశాలను విసర్జించాలి. యూరప్ సామ్రాజ్యవాదం మనకెక్కించిన బానిస భావజాలం కారణంగానే మనకు తెలీకుండానే ప్రతి అంశాన్ని మనం వారి దృక్కోణం నుండే ఆలోచించే స్థాయికి నెట్టబడ్డాం. ఆది నుండీ బలవంతుడు బలహీనులు ఉన్నారు. దోపిడీ చేసేవాడు దోపిడీకి గురైన వారూ ఉన్నారు. బలహీనులు, పేదల పక్షం వహించి రాజ్యాలను, సామ్రాజ్యాలను వ్యతిరేకించి పీడిత ప్రజా ఉద్యమాలను నడిపి సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలను ప్రభావితం చేసిన వారే ప్రవక్తలు. సృష్టికర్త మతాన్ని సృష్టించలేదు. మనిషే మతాన్ని, కులాన్ని ప్రాంతాన్ని సృష్టించుకున్నాడు. ఈ క్లారిటీ సాహిత్యానికుంటే మతం చుట్టూ తిరగదు. పీడిత ప్రజల చైతన్యమే నిజమైన సాహిత్య లక్ష్యం కావాలి. పరలోకం గురించి చెప్పే ప్రవచనకర్తలకు కొదువ లేదు. ఇప్పుడు సాహిత్యంలో మనిషినే జెండాగా, ఎజెండాగా మార్చుకోవాలి. మానవత్వాన్ని, ప్రగతిశీలతను అక్కున చేర్చుకోవాలి. మేం నమ్మిన ఇస్లాంవాదమిదే.
(తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఇంటర్వ్యూకి సమాధానాలిచ్చిన కరీముల్లా గారికి ధన్యవాదాలు. మరో ములాఖాత్ కోసం కొలిమిలో ఎదురుచూడండి) — శ్రీరామ్ పుప్పాల
ముస్లిం వాదమా… ఇస్లాం వాదమా అనేది కాదు ముఖ్యం. ముస్లిం సాహిత్యకారులు వ్యక్తిగత ప్రతిష్టల గురించి ఆలోచించకుండా మొత్తం సమాజం గురించి సీరియస్ గా ఆలోచన చేయాలి. తొలి నుంచి ముస్లింలు అనేక రకాలుగా వివక్షలకు గురవుతున్నారు. ఇప్పుడు ఫాసిస్ట్ శక్తులు మరింత బలం పుంజుకున్న తరుణంలో, గద్దెనెక్కి తమ దుర్మార్గ విధానాలతో ముస్లింలతో పాటు ఇతర అన్నీ పీడిత వర్గాలను రాచి రంపాన పెడుతున్న క్లిష్టమైన సందర్భంలో మాటల కంటే కూడా ఆచరణకు దిగడం ప్రతి ముస్లిం సాహిత్యకారుడి తక్షణ బాధ్యత.
ఈయనకు మంచి క్లారిటీ వుంది. అందువల్లే మాటలతో జనాల్ని బాగా కంఫ్యూజ్ చేయగలుగుతున్నాడు. ముస్లిం వాదంలో వున్న ప్రాసింగకత ఇస్లాం వాదంలో వున్న బలహీనత బాగా తెలుసుగాబట్టే అభ్యుదయ శిబిరాన్ని మెప్పించే పరిబాషను బాగా రూపొందించుకున్నాడు. మొత్తం ముఖాముఖి చూడండి యెక్కడా ప్రగతిశీల శిబిరాన్ని బాగా మెప్పించే మాటలే చెప్పాడు. అదంతా ముస్లిం వాదులు కూడా మాట్లాడేదే. నఖాబ్ వద్దని ముస్లిం వాదమంటే యీయన దాన్ని ఇస్లాం ఆచారంగా మన్నించాలంటాడు. అన్నం వుడికిందా లేదా చూడ్డానికి ఒక్క మెతుకు చూస్తే చాలుగదా… ఈయన గౌరవనీయ కవినే దాన్ని అంగీకరించాల్సిందే, అయితే యీయన తనను తాను మతానికి ఆలింగనం చేసుకొని ప్రగతిశీల పలుకులు పలకడం యెందుకు? నిజమైన ఇస్లాం వాదానికి మార్క్సిస్టు సిధ్ధాంతమో యింకొకటో వాటితో యేం పనీ… తన చుట్టూ వున్న సమూహాలను మత పరికరాల తోనే డీల్ చేసుకోమనండి. మతాన్ని అంతిమంగా నెగేట్ చేయకుండా దాన్ని కీర్తిస్తూ దాంతో పబ్బం గడుపుకుంటూ యీ తరహా ముసుగు వేషాలు సాహిత్యం పేరుతో నడపడమూ కొనసాగడమూ తెలుగు సాహిత్యంలో మాత్రమే కనిపిస్తుంది… సీరియస్ సాహిత్య సామాజిక విమర్శకులు దీనిపై దృష్టి సారించక యిట్లా వుంది.
శ్రీరామ్, సెటిల్ అయిపోయిన యీ రాధ్ధాంతాన్ని మళ్ళీ జీవం పోసాడు… ఇప్పుడున్న హిందూత్వ శక్తుల విచ్చలవిడి పరిస్థితుల్లో, కరీముల్లా మన మిత్రుడే… వదులుకోలేమూ విమర్శించకుండానూ వుండలేము…