కవిత్వం దాచనక్కర్లేని నిజం
ప్రభుత్వం అక్కర్లేని ప్రజ
అమృతం అక్కర్లేని జీవితం
జేబులు వెతికినా
టేబిల్ మీద పుస్తకాలు కాగితాలు పొర్లించి తెర్లు చేసినా
బీరువా సొరుగులు
బిరపువ్వులాంటి హృదయకుహరం తెరిచి చూసినా పరచి చూసినా
కవిత్వం తప్ప రహస్యం లేదు
నీ కర్ణంకాని నా ప్రమాదకర వ్యక్తిత్వం ప్రభావమంతా కవిత్వ
రహస్యమే
జాగ్రత్తగా చూడు
దీర్ఘ చతురస్రంలో వెన్నెల చిక్కుకున్నట్లే వుంటుంది
చేతులు జేబులో పెట్టుకొని నువ్వు
నన్ను అవమానించాలని తల ఎత్తి చూస్తే
నా కవిత్వం చంద్రబింబమై
ఆకాశంలో కళకళలాడుతూ వుంటుంది
విచిత్రమేమంటే
ఈగదిలోని వెన్నెల తన కన్నులతో చూసుకోలేని చంద్రుణ్ణి
నువ్వక్కడ చూసి విస్తుపోతావు
నా వొళ్లంతా నువ్వు తడుముతుంటే
మొదట్లో జిబ్రీపురుగులు పారినట్లు అసహ్యమేసేది
ఇప్పుడు
ఒంటరితనంలో తోడుకోసం నా పాతరక్తమంతా తోడేసి
కవిత్వాన్ని ట్రాన్స్ఫ్యూజ్ చేసుకున్నాక
నువ్వు పోగొట్టుకున్న మానవత్వం బిడ్డను
గుడ్డి ప్రేమతో నా ఒళ్లో వెతుక్కుంటున్నావేమోనని జాలేస్తుంది.
కంఠం చుట్టూ కాలర్ కింద పుణికినా
గుండెలమీద లోహయంత్రం వణికినా
నా కవితా స్వరం కోసం స్పర్శలోని ఆకర్షణకోసం
నా తొడుగుల్ని వొలుచుకొని
నా చర్మాన్ని తొలుచుకొని
నేనే రహస్య లోకాల అన్వేషణలోకి వెళ్తున్నట్లు
నీకు నన్ను నేను అప్పగించుకొని నిలబడుతాను
సంకెల వేసిన చేతిలోకి కవిత్వం
బరువైన శబ్దంలా వస్తుంది
గొలుసు కూడా వేస్తావా కదిలే చాలు
స్వేచ్ఛా పక్షులు ఎగసిపోయిన కలకలారావం
కోర్టు పగల్లో ప్రాసిక్యూషన్ కుట్రలు బహిరంగమవుతాయి
నిఘా వేస్తూనే వుండు
కవిత్వం నిప్పయి మండుతూనే వుంటుంది
ప్రభుత్వం చేస్తూనే వుండు
కవిత్వం ప్రజల్ని కలవరిస్తూనే వుంటుంది
మృత్యుగాలం విసిరి కాచుకో
కవిత్వం నీ కళ్లముందే చైతన్యంలో ఈదుతూనే వుంటుంది
కవిత్వం రాజ్యాన్ని రద్దు చేసే బహిరంగ రహస్యం
అది నా గుండెలో సలుపుతుండగానే
ఎవరికి చేరాలో వారికి చేరిపోతుంది
అసంకల్పితంగా అవసరమైన వాళ్లకర్థమైపోతుంది.
నా ఊహల్లో ఉదయిస్తుండగానే
ఉద్యమాల్ని ఉత్తేజపరుస్తుంది
రహస్యం ఏమిటంటే
నా కవిత్వం ఉద్యమం ఉగ్గుపాలతోనే ఊపిరిపోసుకున్నది.
నువు మూసిన నీ చేతుల చాటునుంచి
నా కవిత్వం
ఒక బాధాతంత్రీ ఒక క్రోధతంత్రీ తెగినట్లు
కన్నీటినీ వెలిగించేవి చూపులే అయినట్లు
ప్రవహిస్తూనే వుంటుంది
రుధిరాక్షర నదిగా
(30.12.1987
‘ముక్తకంఠం’ సంకలనం నుండి)
గొప్ప కవిత..