కలయిక

మనుషుల్ని కలవడం
ఎంత బాగుంటుంది
నీళ్లు, మట్టిని కలసినట్టు
ఉట్టి మీద చద్ది దించి
బంతిలో కూర్చుని
నోరారా తిన్నట్టు
మనుషుల్ని కలవడం
అద్భుతంగా ఉంటుంది

కలవడం అంటే
చేతులు కలపడం కాదు
మునుపటి జ్ఞాపకాలను
గాలి లోకి విసిరి
పరిసరాలను తేలికపరచడం
బాధో దుఃఖమో
ఆనందమో
స్థబ్దతను పగల గొట్టి
జీవితాన్ని చైతన్యవంతం చేయడం

కలవడం
ఎంత బాగుంటుంది
మాటలు మాటలు కలిపితే
ఉసిరి తిన్నాక
నీళ్లు తాగినట్టు ఉంటుంది
కలవడం లోని
తీయదనం తెలియాలి గానీ
మన నెత్తి మీద
కొబ్బరాకు చలువ పందిరి
వేసినట్టు ఉంటుంది

నీ పునాదుల్లోకి
నువ్వు వెళ్ళాక
పొలిమేరను క్షేమమడగాలి
చెరువుతో మాట్లాడాలి
ఒక్కసారి
పొలాల్లోకి వెళ్లి
పాదాల తో
నేలను పలకరించి రావాలి
పూడిన బావికి
నాలుగు ఓదార్పు వాక్యాలు
ఇచ్చి రావాలి

కలవడం క్రియ కాదు
అనివార్యం

పుట్టింది నెల్లూరు జిల్లా, ఓజిలి, రాచపాలెం. కాకినాడలోని పిఠాపురం రాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధిపతి. 'నీటిపూలవాన', 'గోరువంకల గానం' అనే రెండు పిల్లల కవితా సంకలనాలు వేశారు. ఎక్సరే, తానా, రంజని, కుందుర్తి వంటి పురస్కారాలు పొంది ఉన్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాహకులలో ఒకరు.

9 thoughts on “కలయిక

  1. కవిత ప్రచురించినందుకు కొలిమికి ధన్యవాదాలు

  2. బాగుంది..
    కలవాలి… అంటే ఫోన్ సిగ్నల్ కలవడం అనే నేటి తరానికి..
    కలవడం అంటే ఆత్మీయత అని..
    కలవడం అని చెట్టు పాది లోకి నీరు చేరే లా ఉండాలి
    అని నీ భావన గొప్ప ది.. ఆదర్శం సజీవం..

  3. మీ ‘కలయిక’ పప్పన్నం తిన్న తర్వాత చివరన గుజ్జును చేతి మునివేళ్లతో నోటికి అందుకుని జుర్రినట్లు చాలా కమ్మగా ఉంది…

  4. గురువుగారు. ముందుగా మీ పాదాభిజముల కు మీ ప్రియ శిష్యుడు నమస్కారాలు ..🙏

    గోధులి వేళలో ,చెరువు కట్టమీద కూర్చుని ,కూని రాగం తీస్తూ, “కలయిక “అనే పేరు కి కావ్యం కట్టినట్టుంది గురువుగారు
    చాలా అద్భుతంగా ఉంది గురువుగారు..

    . మీరు మీ ఆరోగ్యం కుశలంగా ఉండాలని మీ చమత్కార జాతుర్యం అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం గురువుగారు🙏💐💐

    ధన్యవాదాలు!

  5. నీ పునాదుల్లోకి నీవు వెళ్ళాక
    పొలిమేరలకు క్షేమమడగాలి – బాగుంది సర్

  6. కవిత లో పదాలు తేలికగా ఉన్న గుండెల్లో చేరి బరువెక్కుతాయి గోపాలం గారి కవితలు
    వృత్తి రీత్యా ఆయనతో కలిసి పనిచేసినందుకు నేను అదృష్టవంతుణ్ణి 🙏🙏

Leave a Reply