ఊహల స్వప్నాన్ని ఊహించుకొని
రాతిరి పడక మీద నిద్రలోకి జారుకున్న
నా ఆలోచనల ఆశల స్వప్నాన్ని
అందుకోవడానికి అడుగులేస్తున్న చోట
కాలంతో ఎదురీదుతున్నాను.
ఈరాతిరి ఏదో నా యదలో
బరువెక్కి పోతున్న ఆలోచనలు
చల్లగాలికి నిద్రలో ఉలిక్కి పడి లేచాను
కలత నిదురలో కన్న కలల
సాకారం కోసం పరితపిస్తున్నాను.
చీకట్లను చీల్చుకుంటూ ప్రసరిస్తున్న
వెన్నెల కాంతుల వెలుగుల్లో
మసక బారిన నా కండ్లకు
చష్మాలే (అద్దాల) తోడుగా చూస్తే
గడియారం గంటల ముల్లు
అర్ధరాత్రి రెండు కొడుతుంది
నా ఆశలు, ఆలోచనల ధాటిని
ఏ దుమారపు సుడిగాలి
క్షణకాలాన చెరిపేసిన దృశ్యమానమో గానీ
రెక్కలు తెగిన పక్షినైనాను.
కలత నిదురల కలతల్ని
పొద్దు పొడుపుతో తుడిచేస్తూ
కొత్త పుంతలతో అడుగులు వేస్తూ
ఈ ఆశల స్వప్నాన్ని సాకారం చేస్తాను.